Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

జ్ఞానమార్గము

గీత మూడవ అధ్యాయంలో భగవానుడు కర్మయోగంలోగల గొప్పదనం వెల్లడించారు. జ్ఞానోదయమై కర్మావసరం లేకున్నా స్వకర్మను వదలి పెట్టరాదని అర్జునునకు భగవద్‌ బోధ అసంగకర్మాచరణం లోకసంగ్రహానికి అవసరమన్నారు. వేదోక్తములైన కర్మలను అనుష్ఠిస్తూ తమతమ ఆశ్రమ విధులను పాటిస్తూ వచ్చినామంటే అది మనోమాలిన్యం పోగొట్టి చిత్తశుద్ధికి కారణమవుతుంది. చిత్తశుద్ధి ప్రాప్తించేసరికి మనకు మన స్వరూపమేమిటో బోధపడుతుంది. మనమూ ఆ చిదానందాంబుధిలోని కణలేశ##మే అని గుర్తెరుగుతాము. ఈ జ్ఞానముదయిస్తే ఈశ్వర సాయుజ్యము, పరమానందానుభూతీకల్గుతవి. భగవానులు ఆధ్యాత్మికపథంలో సాధకునికి రెండు అడ్డంకులు ఉన్నవన్నారు. అవి కామక్రోధాలు. కామక్రోధాలు లేశ##మైనా లేకుండా నీధర్మాన్ని నీవుఅమితశ్రద్ధతో పాటించవలెనని అర్జునునకు బోధించినారు.

నాలుగవ అధ్యాయంలో ఆయన చేసిన బోధన మనము ఈ మూడవ అధ్యాయపు భూమిక నుండి గ్రహించాలి. ఎన్నో ఏండ్లముందు ఈ యోగాన్ని వివస్వంతునకు బోధించానన్నారు. ఇప్పుడు నీవు భక్తుడవై నాశరణుజొచ్చినావు గనుక నీవు నాకు సఖుడవై యున్నావు గనుక, నీకు బోధిస్తున్నానని అర్జునునకు చెప్పినారు. అర్జునునకు కృష్ణపరమాత్మ పలుకులు అర్థమవడం కష్టమనిపించింది. వివస్వానుడెమో ఎన్నోయుగాల నాటి వాడాయె. కృష్ణుడేమో తనకు సమకావికుడాయె. ఈ జ్ఞానబోధ ఏవిధంగా పొసగుతుందన్న సందేహం అర్జునుడికి వదలలేదు. భగవానుడు తన స్వరూప మర్మాన్ని ఎరిగించి అర్జునుని సందేహం తీరుస్తారు. అంతేకాక తమ అవతార తత్త్వాన్ని బోధిస్తారు.

'యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత,

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌'.

ధర్మగ్లాని ఏర్పడినప్పుడల్లా మానవానీకాన్ని రక్షించడానికోసం తాను అవతరిస్తూ ఉంటానని సెలవిచ్చినారు. ఇక్కడ అవతరణ అనేమాటకు సరియైన అర్థం మనం తెలుసుకోవాలి. భగవంతుడే తనకు ఆద్యంతాలూ, చావుపుట్టుకలూ లేవని అంటున్నారు. పైగా తాను ఈశ్వరుడనని చెప్పుకుంటున్నారు. అందుచేత ఆయన పుటుతున్నాడంటే దానిని మనం లోక సాధారణమైన అర్థంలో తీసుకోరాదే. ఆయన ఆత్మమాయల నుండి పుట్టుకొస్తూన్నారు. ఒక నటుడున్నాడు. అతనిది ఈరోజు ఒక వేషం, రేపు మరొక వేషం. రంగస్థలంలో రాజువేషమూ వేస్తుంటాడు. మంత్రి వేషమూ వేస్తుంటాడు. అతని వ్యక్తిత్వం మాత్రం అతని కుంటుంది. తన వ్యక్తిత్వాన్ని తనపాత్ర మరుగులో దాచుకుంటూ ఉంటాడు. కాని రంగభూమిలో అతనిది ఒక్కొక్కరోజు ఒక్కొక్క వేషం. వివిధాలంకారాలతో వివిధ వేషభాషలతో తన నిజవ్యక్తిత్వాన్ని మరుగుపరుస్తూ ఒక్కొక్క పాత్రగా అతడు అభినయిస్తూ ఉంటాడు.

అదేవిధంగా భగవంతుడుకూడా తనమాయను అధిష్ఠించి ఏన్నో వేషాలు వేస్తుంటాడు. ఆ వేసేవేషం ఆయన సత్యస్వరూపాన్ని మరుగుచేస్తూ ఉంటుంది. యాయ లేక ప్రకృతి సంబంధంచేత ఈశ్వరుడు లేక పురుషుడు ఈ ప్రపంచంలో వివిధ మార్గాలలో వర్తిస్తున్నాడు. ఆ అనంతశక్తి నుండి, ఆ మూలశక్తి నుండి ప్రకృతిసైతమూ శక్తిని పొందుతున్నది. అందుచేత తాను ఎన్ని అకతారాలెత్తినాడో తనకు తెలుసు. ఒకప్పుడు ఉండీ, ఒకప్పుడు లేకపోతేకదా విస్మృతి కలగడానికి? కాని అర్జునుడు అందరతో పాటు తాను ఎన్ని జన్మలెత్తాడో ఎరుగడాయె. అతని ఎరుక ఆజన్మలోనే గతించి పోతుందాయె. అగ్నిలోని కణలేశ##మే విస్ఫులింగము - మిడుగురు. పరమాత్మలోని కణలేశ##మే మన ఆత్మ. రాగద్వేషాలతోనూ, భయక్రోధాదులతోనూ, మన మనస్సు లిప్తమైపోయి మన ఆత్మ తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేకున్నది. మనుష్యుడుఇచ్ఛాద్వేషాలు అనే ద్వంద్వాలకుచిక్కి పరిమితుడైయున్నాడు. అదే భగవానుడు సర్వేంద్రియాలకున్నూ, ఏలికయై నిశ్చలంగా ఉన్నాడు కనుక పుట్టినట్లు మనకు కనబడుతున్నా నిజంగా అజుడే.

భగవానుడు అర్జునునితో అంటున్నాడు. ''ఎవరయితే, యీనా ఆవతారతత్త్వాన్ని, జన్మతత్త్వాన్ని తెలుసుకుంటారో వారు చావుపుట్టుకలను అతిక్రమించి ఆత్మైక్యం పొందుతారు'' అని. ఈ అనుభూతి మనకు ఎట్లా కలుగుతుంది? దానిని భగవానుడు ఈ అధ్యాయంలోనే వివరిస్తున్నారు. ఇంద్రియ మూలకంగా కలిగే భావోద్వేగాలను మొట్టమొదట మనకు లోబరచుకోవాలి. 'వీతరాగ భయక్రోధాః' ఎప్పుడయితే మనం రాగ భయాలను వదలిపెట్ట గల్గుతున్నామో అప్పడు పరమేశ్వర చింతన అవిచ్ఛిన్నంగా చేయగల్గుతున్నాము. తైలధారవలె ప్రవహించే ఈశ్వరచింతచేత మనం ఈశ్వరాశ్రయులమై పోతున్నాము. ''మన్మయా మాముపాశ్రితాః'' ఇట్లు ఈశ్వరుని శరణుపొందిన పిదప 'మద్భావ మాగతాః' ఆయనలోనే ఐక్యం పొందుతాం.

సాధారణంగా జనులు ఏదో ఒకకర్మ చేస్తుంటారు. పూజాపునస్కారాలు చేస్తుంటారు. ఏదో ఒక దేవుణ్ణి కొలుస్తుంటారు. తమ పూజాఫలితంగా, కర్మఫలితంగా, శ్రమఫలం వాంఛిస్తుంటారు. ఐహిక వాంఛలు పరిపూర్తి కావాలను కోరుకొంటూవుంటారు. కాని ఈశ్వరుడు ఇచ్ఛకూ, అనిచ్ఛకూ అతీతుడు. ఆయన కరుణాస్రవంతి అన్ని దిక్కులలోనూ ప్రవహిస్తూ ఉంటుంది. వారివారి అర్హతకొద్దీ యోగ్యతకొద్దీ ఫలం లభిస్తూ ఉంటుంది. మరొక అధ్యాయంలో భగవానుడు చెప్పినట్లు భగవద్భక్తులు నాలుగు తరగతులుగా ఉన్నారు. ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞానువు అని. ఆర్తుడు కష్టాలలో చిక్కుకొని తపించేవాడు. అర్థార్థి అన్ని కాలాలలోను సౌఖ్యంగానూ సంతోషంగానూ ఉండాలని కోరుకునేవాడు. జిజ్ఞానువు జ్ఞానానికి తపించేవాడు. జ్ఞాని స్వరూపం ఎరిగినవాడు. ఈనలువురిలోనూ జ్ఞాని ఒక్కడే జన్మపరంపర నుంచి విడివడి పరమాత్మైక్యం పొందుతాడు.

ప్రతికార్యానికిన్నీ కారణం ఒకటి ఉంటుంది. అది రెండువిధాలు. సాధారణకారణం, అసాధారణ కారణం. అదేవిధంగా ఈ ప్రపంచమంతా నడవడానికి ఈశ్వరుడు ఒకే అసాధారణ కారణంగా ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కడికిన్నీ ఆయన ఒక్కొక్కమార్గాన్ని నిర్దేశించి ఉన్నాడు. ద్వేషంకూడా భగవచ్చింతన మార్గాలలో ఒకటి అని మనం హిరణ్యకశిపుడు, కంసుడు, ఈ మొదలైనవారి కథలవలన తెలుసుకోవచ్చు. పరిపూర్ణ ద్వేషంతో వారు సదా హరిస్మరణ చేస్తూనే ఉండిపోయారు.

భగవంతుని మూలంగా ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది. ఐనప్పటికిన్నీ ఆయన నిష్క్రియుడు. అకర్త. అసంగుడు. ఆయనచేసే కర్మకాని, కర్మఫలంకాని ఆయనను బంధించడంలేదే. దీనిని తెలుసుకోవడమే ఈశ్వరతత్త్వాన్ని తెలుసుకోవడమన్నమాట. దీనిని చక్కగా తెలుసుకొని మనం నియత కర్మలను చేస్తూవచ్చినామంటే అసంగత్వాన్ని పెంపొందించుకొని ఫలాభిసక్తిని వదలిపెట్టగలిగినామంటే క్రమంగా మనం బ్రాహ్మీభూతులం కావచ్చు. మహాపురుషులు నడచిన మహాపథమూ ఇదే. కృష్ణపరమాత్మ గీతలో అర్జునుడికీ, అవ్యాజంతో మనకూ బోధించిన పరమమార్గమిదే. గతంలో చేసుకున్న దుష్క్రియలఫలాన్ని సత్కర్మలు పోగొట్టుతవి. కర్మను ఈశ్వరార్పణబుద్ధితో ఆచరిస్తూవస్తే మనస్సు నిర్మలమవుతుంది. ఈ అనభిష్వంగతకు భక్తిని జోడుచేసినామంటే జ్ఞానం అనగా పరమాత్మైక్యం సిద్ధిస్తుంది.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page