Bhakthi Rasaayanamu Chapters Last Page
అనుబంధము 1
భారతీయం చ శాస్త్రార్థం తథా భినవభారతీమ్,
సాకల్యేన సమాలోచ్య రసవ్యాఖ్యం సమారభే.
యత్త్రెవ నాట్యే సుఖ మాలభేయుః
యతశ్చ నిర్వాణ మశేషలోకైః
తం నాట్యవేదం స్వధియా విచార్య
రసస్వరూపం తు బ్రవీమి దుష్ట్యా.
కావ్యమున, నాటకమున రసము ప్రతీయమాన మగును. అనుభూతి లేనిదే రస మవగతముకాడు. కావ్యమున గల అనుభూతిని రసప్రతీతి యందురు. ఈ రసప్రతీతి యెట్టిదో తెలిసికొనిన రసస్వభావము తెలిసినట్లే యగును. రసప్రతీతి హేతుకమగు విషమయు, తదుద్దీపనము, సంచారిభావము మేల్కొనుటకు తగిన కారణము, సంచారిభావము, అనుభావములు, భావన, నిష్పన్నమగు అర్థము మొదలగున వన్నియు రసప్రతీతిలో గలవు. వీనిద్వారా చిత్తద్రవీకరణ, నిష్కామ భావన, లోకోత్తరానందము కలుగుటచే నివి రసప్రతీతియొక్క ముఖ్యస్వభావములుగా కన్పించుచున్నవి. పురుషార్థములలో ముఖ్యమైనదగు సౌందర్యమును ప్రత్యక్షముగా నవగతము చేయజాలిన దగుటచే రసప్రతీతి అర్థవంతము, ప్రయోజనవంతము నగుచున్నది.
ఈవిధమగు రసానుభూతియొక్క స్వభావమేమి? ఇది అన్యార్థసాధకము గాదు. సాధ్యరూపమగు నీ అనుభూతి స్వతఃసిద్ధశక్తి గలిగియున్నది. ఈస్వతఃసిద్ధశక్తిని గ్రహించుటయే రసానుభూతి ప్రయోజనము. యశస్సు, అర్థము, శీవేత రక్షతి,వ్యవహారవేత్తృత్వము మొదలగునవి కావ్యముద్వారా లభించినను, ఇవి రసానుభూతియందుగల ప్రయోజనములు కాజాలవు. భావనానుప్రాణితమై చిత్తమును సంతృప్తి పరచుటయందే రసానుభూతికి పరమ ప్రయోజనము గలదు. యశస్సు మొదలుగా గలవి కావ్యమొసగు ఉపయోగములే కాని, కావ్యప్రయోజనములు కావు. కావ్యసమీక్ష చేయగోరినచో కావ్యానుభూతిని వదలిన లాభములేదు. ఈ యనుభూతి లౌకికజగత్తులోని భాగముకాదు; లౌకికజగత్తునకు అనుకృతికూడ గాదు. ఇది స్వయంసిద్ధము, స్వయంపోషకము, స్వతంత్రము, సమగ్రము నగు వేరొక జగత్తు. ఈ జగత్తు నవగతము చేసికొనగోరినచో నీప్రపంచమున ప్రవేశించి, అందలి నియమములకు కట్టుబడి. లౌకిక జగన్నియమాదికమగు దేశకాలాదులను పరిత్యజింపవలెను. ఐనను కావ్య లౌకిక జగత్తులకు అంతర్లీన సంబంధము కలదు. కాని కావ్యనిష్ఠమగు రసానుభూతిలో వివిధాంశములకనన్యత్వముగలదు. మహత్తర మగు భావాన్వితమై, సౌష్ఠవాన్వితమైన ఈ యనుభూతి సుందరముగా ప్రతీయమాన మగుచున్నది. ఈవిధముగా 'బ్రాడ్లే' యను సాహిత్యసమీక్షకుడు నిర్వచించినాడు.
రసప్రతీతిలో విశిష్ట విషయముల సన్నవేశము గలదు. విభావానుభావ వ్యభిచార్యాది విశిష్ట విషయములు విశిష్టార్థమును రసముగా నభివ్యక్తిము చుయుచున్నవి. ఈ విషయము లన్యోన్య సంబంధము గలిగి, పరస్పరోపకారకములై, భిన్న విషయముల నేకసూత్రమున గ్రధింప జాలి రసమనబడు అనుభూతి నిచ్చుచున్నవి. భిన్నవిషయముల కేకత్రానుసంధాన మేరీతిగా వచ్చుచున్నది ? తజ్జనిత సమగ్రానుభూతిస్వభావ మేది ? అను ప్రశ్నలను రసప్రతీతివిచారమున వివేచింపవలెను. సౌందర్యముగా నభివ్యక్తమగు నీ స్వభావము విషయగత గుణము కాదు ; వ్యక్తిగతగుణము కూడ కాదు. ప్రమాతృ ప్రమేయముల కనన్యత్వమును నిరూపించు రసానుభూతియే సౌందర్యము.
2. రసానుభూతిని విమర్శించుటకు ముందొక చిన్న విషయమును గమనింపవలెను. కావ్యసృష్టియుందు కవికిగలయనుభూతికూడ రసానుభూతిశబ్దముచే చెప్పబడుచుననది. కావ్యమును వ్రాయుటకుముందు కవికిగల అనుభూతి కావ్య రచన చేయునపుడు గల అనుభూతికంటె విలక్షనమైనది. ఈ వైలక్షణ్యమును గుర్తుంచుకొని కవియొక్క అనుభూతికి, పాఠకుని అనుభూతికిగల సంబంధమును విచారంపవలెను.
ఈ రెండు అనుభూతులు విలక్షణములైన వన 'అలెగ్జాండర్' యొక్క వాదము. భావనానుప్రాణితమై సంపూర్ణమైన అనుభూతినుండిగాక, విషయముద్వారా ఉత్పన్నమైన సంచారిభావో ద్దీపనమునుండి కవి, కావ్యరచన కుపక్రమించుచున్నాడు. ఉచ్చరితములైన శబ్దములే భావనావశమగు అనుభూతిని లక్షించుచున్నవో, దానికి మించిన అనుభూతి కవికిలేదు. ఏమి చెప్పవలయునో, ఎట్లు చెప్పవలయునో గూడ కావ్యము పూర్తియగువరకు కవికిగూడ తెలియకపోవుటచే కావ్యము కవియొక్క భావనను ప్రదర్శించుచున్న దనరాదు. భావనాలక్షితమైన అనుభూతి, కావ్యారంభమున కవికిలేదు. ఉచ్చరిత శబ్దములలో ఆ శబ్దములద్వారా నవ్యముగా ఆవిదర్భవించునది రసానుభూతియని ఈవాదసారంశము.
కవికిగల బావోద్దీపన అతని నాకర్షించిన విషయమునకు చెందినది. ఈవిషయము కావ్యముకన్న విలక్షణమైనది. భావోద్దీపనగల కవియొక్క అనుభూతియే రసానుభూతి యని అలెగ్జాండర్ చెప్పకతప్పదు. కావున కావ్యరచనావశమున కవికిగల అనుభూతికి తుల్యమగు అనుభూతిని ప్రేక్షక సామాజకులుగూడ పొందగలదు. కవియొక్క అనుభూతినే ప్రధానముగా మనుముస్వీకరించి, అదే రసానుభూతియని యంటిమేని, కావ్యము నిరర్ధక మగును. కావ్యము నిరర్ధకమైన రసానుభూతియే ఉండదు. అందుచే కావ్యరచనకు పూర్వముగల కవిమనస్థితులతో సాహిత్యసమీక్షకు ప్రసక్తి ఏమియులేదు. ఆమనస్థితులను విమర్శించునది మనస్తత్త్వశాస్త్రము. మనస్తత్త్వశాస్త్రము. విమర్శించువిషయమే సౌందర్యమీమాంసలో గల విషయమని భ్రమించుటచే నిట్లు అలెగ్జాండర్ పొరబడినాడు. ఇంతేగాక అలెగ్జాండర్ వాదములో కావ్యమునగల భావ రూపములు అత్యంతభిన్నములు. కాని, భావరూప సంయోజనగలిగి, భావరూపముల నభిన్నముగా జూపజాలిన కావ్యముననే కావ్యత్వము గలదని విస్మరింపరాదు.
కావ్యరచనలో కవికిగల అనుభూతి, కావ్యానుశీలమున పాఠక సామాజికులకుగల అనుభూతి, భిన్నములు కావని చెప్పుటకు తమతమ యనుభూతులను వివరించి చెప్పిన కవుల వాక్యములే ప్రబలాధారములు. రసమయస్థితి కావ్యమున ఉపహితమై యున్నది. ఇట్టి కావ్యముద్వారా కవికి గలిగిన అనుభూతిని తనదిగా చేసికొని అనుభవించుటకు సామాజకుడు యత్నించును. అనగా కవిగత సాధారణీభూత సంవిన్మూలమైనది కావ్యపురస్సరమగు నటవ్యాపారము. ఈ సంవిత్ వాస్తవమైన రసము. దేశ కాలా ద్యుపహితమగు వ్యక్తిత్వము మాటుపడి సన్వస్వరూప స్వభావావిర్భావము ననుభవింప జాలిననే కవి కావ్యరచన చేయుగల్గును. దేశకాల ప్రమాతృ భేదముచే ననియంత్రితమైన కవియనుభూతి, స్వార్థరహితమై బాహ్యజగదంతర్లీన మగును. ఇతరుల అనుభూతులను కవి యనుభవింపగలుగుచున్నాడు. ఇతరులతో తాదాత్మ్యము నుండగా సంభవించు అనుభూతులు కావ్యమున నుచ్చరింపబడుచున్నవి. ఈవిధముగా అనుపహితమై పురుషవ్యాపార నిష్ఠముగానిది, అపౌరుషేయము నగు స్థితిని నిర్దేశించునది రసానుభూతి. ఈవిధమగు అనుభూతి, కవికి, సామాజికులకు గూడ కలదు. కవియొక్క అనుభూతియే సామాజికునకు కలుగనిచో కవి చెప్పుమాటలలోని భావ మవగతము కాజాలదు. కవి ఉచ్చరించిన భావాదు లనుభూయమానములు కాలువు. కావున కవి సామాజికతుల్యుడని అభినవగుప్తుడనగలిగినాడు. సామాజికులతో తాదాత్మ్యము నందుట చేతనే కవి, కవియని పిలువబడుచున్నాడు.
కవి ప్రదర్శించు అనుభూతి మనలో నంతర్లీనమై యున్నది. మనలో లేని అనుభూతులను మన మనుభవింపలేము. ప్రమాతృ ప్రమేయముల కనన్యత్వము సిద్ధించగా, దేశకాలాద్యనుపహితముగా ప్రయాతయందు కన్నించు పరిణామమే అనుభూతియొక్క సామాన్యలక్షణము. ఈ పరిణామ మితః పూర్వ మంతర్లీనముగా కారణరూపమున ప్రతివ్యక్తిలోను గలదు. అందుచే నవ్యముగా కన్పించుప్రతి అనుభూతియు ఆత్మలో సంస్కారముగా నుండుటచే రసానుభూతిలో మన నిజస్వభావము మనలో నభివక్తమగుచున్నది. జ్ఞానము సంచార్యాదులతో మేళవించగా, మనోహృదయము లనన్యములుగా కన్పించునట్లు చేయునదే యనుభూతి యగుటచే ఉత్తమమైనదిగా మనము భావించుచున్నాము. ఈవిధమైన అనుభూతి మానవస్వభావమునకు విరుద్ధమైన కవులచే మనపై నారోపితము గావింపబడిన దైనచో మనము దీనిని అనుభవింపజాలము. మన భావములను, మనోవృత్తులను భావలావణ్య యోజన ద్వారా కవి ప్రదర్శించుచున్నాడేగాని, వేరుగాదు.
దీనినిబట్టి కవి, సామాజికు లత్యంత విలక్షణ వ్యక్తులని భావించరాదని తేలుచున్నది. వారికి కేవలము తరతమభేదమే కలదు. కవికి, నాయకునకు, సామాజికునకు సమానానుభవము కలదని తాతభట్టు చెప్పినాడు. దేశాకాలా ద్యనుపహిత తత్త్వమున కవి యనుభవించు భావాదికము కావ్యగత శబ్దమున స్పందించుటచే నా సమానానుభవము రాగల్గుచున్నది. కావ్యానుశీలనమైన వెంటనే, మనల నేవిధమగు భావనానుప్రాణితమైన అనుభూతి ఆవేశించుచున్నదో, అట్టిదే. కావ్యారంభము కాగానే కవినిగూడ ఆవేశించి యుండును. సంశ్లిష్టభావాదికముతో గూడిన అనుభూతి పూర్తిగా సమగ్రముగా కవి మానసమున నవతరించగనే తదుపాధిభూతమైన కావ్యముగూడ నవతరించుచున్నది. కావ్యానుశీలనానంతరము కూడ మనలో నీ యనుభూతి యున్నట్లు శబ్దోపహితము కాకముందు సహితము కావ్యావచ్ఛిన్నమైన అనుభూతి కవిలో గలదని భావము. భానానుప్రాణితమైన రసానుభూతి శబ్దములచే నభివ్యక్త మగుచున్నది. రసానుభూతికి రూపనిష్పాదన చేయు శబ్దములకు పూర్వమే సమగ్రముగా, స్వయంసిద్ధముగా నీ యనుభూతి కలదు.
పైవిచారణలో కావ్యరచనకు తోడ్పడునది ఆవేశమని చెప్పబడినది. దేశకాలాద్యుపాధులను భగ్నము చేయునది ఆవేశము. ఇందు భావనాసమున్మిషితములైన స్థాయి సంచారి భావము లుద్దీపితము లగును. ఈ ఉద్దీపనావస్థ శబ్దరూపమున నుండదు; కాని శబ్దములద్వారా బహిర్గతమగును.
బాహ్యజగత్తులోని ఒకానొక విశిష్టవిషయము ననుభవించుట, కవిగతమైన ఉద్దీపితావస్థలోగలదు. ఈయనుభూతిలో భినవిషయములకు సమన్వయము కన్పించుటచే నిది ప్రయోజసంవలిత మగుచున్నది. కాని కావ్యోత్పత్తి లేక కావ్యరచన యనబడు ప్రవృత్తికి సమన్వయావస్థ సహకారి గాదు. సమన్వయావస్థనుండి కావ్యరచనాప్రవృత్తి కలుగుచో నీ యవస్థలో సమన్వయము నాటంకపరచు అంశ ముండక తప్పదు. అన్యవిషయములతో సంఘర్షణ కలిగి, బహిర్నర్గమున మునకు ప్రయత్నించు అంశమిది. దీనిద్వారా కావ్యము వచ్చుచున్నది. ఉద్దీపితమైన మనోవృత్తి త్వరత్వరగా మారిపోవుటచే నీయంశ వచ్చుచున్నది. ఈమార్పులవన గతించిన అనుభూతికి కవి చేతులుసాచుచు, గతమును స్మరింపసాగును. ఈస్మరణమున గతించినది స్పష్టతను క్రమక్రమముగా కోల్పోవుటచే గతించిన అవస్థను కవి చిత్రించుచు, కాలవేగమున వచ్చిన మనోదుఃఖమును పోగొట్టుకొన దలచును. గతించిన అనుభూతి పూర్తిగా పునరుజ్జీవిత మగుట దుర్లభము. కాని స్వాభీష్టమగు నీ యనుభూతిని తన మనోవృత్తులద్వారా ప్రదర్శింప జాలుటచే కావ్య మీ ఆశా స్మరణములను మాత్రమే స్పష్టముగా చెప్పగలుగుచున్నది. కావున కావ్యమున కవికి గలిగిన పూర్వానుభూతి యథామాతృకముగ నుండదు. ఇందుచే కావ్యరచనకు పూర్వము కవికిగల యనుభూతి కావ్యచరనలో గల అనుభూతికంటె కొంతవరకు విలక్షణమే యని చెప్పవలెను.
కావ్యరచనలో కవికిగల అనుభూతి కావ్యనుశీలనమున పాఠకునకుగలుగు అనుభూతికంటె భిన్నమైనది కాదు. విభావములచే నాహృతమైన అర్థము వాచి కాంగిక సాత్త్వికాభినయములద్వారా అభివ్యక్తమగుచున్నది. త్రివిధాభినయముల ద్వారా కవియొక్క భావమును భావనావ్యాపారవశమున మనము అనుభవించుటచే దీనిని భావ మనుచున్నాము. బాహ్యజగత్తు కొన్నభావములను మనలో రగుల్కొలుపుచున్నది. ఇవి అభినయములద్వారి తెలియబడుచున్నవి. భావనావశమున వీటిని అనుభవించి కవి మన కర్పించుచున్నాడు. వీటిని శబ్దరూపమున నుచ్చరింపకముందు వీటినిగురించిన స్పష్టమగు జ్ఞానము కవికి లేకపోవచ్చును. కాని ఈ అనుభూతికి కావ్యరూపము నీయగా భావనద్వారా మనకిది అవగతమగుచున్నది.
కావ్యరచన సాగుకొలది కవియొక్క భావము క్రమక్రమముగా పరిపుష్ట మగును. ప్రతినవ్యశబ్దముతో భావము పరిణత మగుచున్నది. భావనారూపమున అస్పష్టముగా నున్న భావము అభివ్యక్తిని, పరిషోషమును గోరుచు కవిలో ఉండును. తాను చెప్పదలచిన దంతము కవిమానసమున మొట్టమొదటనే యున్నచో కావ్యరచనకు పూనుకొనవలసిన అవసరము లేదు. కాని తానేమి చెప్పదలచినాడో అది కావ్యము పరిసమాప్తియైనపుడే కవికి స్పష్టముగా తెలియగలదు. కావ్యరచన కుపక్రమించినపుడు, కావ్యరచనలో నున్నపుడు, కావ్యమందలి భావము కవియొక్క అధీనమున లేదు. భావాధీనుడై యున్నవాడు కవి. నిష్పన్నమైన కావ్యాత్మ శరీరము నర్థించుటలేదు. అస్పష్టములైన కొద్దిభావములతో, కొద్దిశబ్దములతో ప్రతీయమానమై యున్నది. ఈభావములు పరిపుష్టములై, సమగ్రములైన రసము క్రమక్రమముగా అభివ్యక్తమై స్వయంసిద్ధముగా కన్పించును. ఇట్లు సిద్ధించు కావ్యములు అనిర్వచనీయమైన శక్తినిగలిగి సృష్టింపబడినట్లు కన్పించుచున్నవి. కావుననే 'ఈవిధమగు కావ్యమందలి భావమేమి?' యని ప్రశ్నించుటకూడ అసందర్భప్రలాప మగును. కావ్యమందలి భావము రసనిష్ఠము. రసము అనుభూయమాన మగునది. కాగా 'కావ్యగత భావ మేమి;' అను ప్రశ్నకు 'అనుభూతి యననేమి ?' అను నర్థము వచ్చుచున్నది.
తన కతీతమై లోకోత్తరమైన శక్తి కవి నావేశించి కవియొక్క చిచ్ఛక్తిని దేశకాలతీతముగా అపౌరుషేయము గావించినపుడు ఉత్తమకావ్యము సృష్టింపబడుచున్నది. భట్ట నాయకుడు ''యావత్ పూర్ణో నచైతేన తవ న్నైవ వమత్యముం'' అనినాడు. రసము విషయోపహితమై ప్రతీయమాన మగుచున్నది. దేశకాలాద్యన వచ్ఛిన్నమైన నిజస్వరూపమును కవి అనుభవించి, ఇతరులకుగూడ నీ యనుభూతి కలుగునట్లు దీనిని కావ్యరూపమున ఉపహితము చేయుచున్నాడు. ఇట్లు చేయునపుడు స్వాత్మావేశమగు నిజస్వరూపమును వమనము చేయుచున్నట్లు కన్పింప గలదని భట్ట నాయక వాక్యములోని అభిప్రాయము.
రసానుభూతి యనగా కవియొక్క మనస్సును పరిశీలింపగల్గుట కాదని ఇంతవరకు తేలినది. కావ్యము పూర్తియగుటతో సంపూర్ణమయైన అనుభూతియే రసానుభూతి. అందుచే '' ప్రతీయమాన మగునది రసము; ప్రతీతి యనగా విశిష్టమైన రసనావ్యాపారము '' అని లోచనలో అభినవ గుప్తుడు పల్కినాడు. గుణాలంకారౌచిత్యాదికము ద్వారా వ్యంజనావ్యాపారముతో కావ్యమున రసమును భావింప గల్గుచున్నాము. గుణాలంకారాదియుత మైనను కావ్యము రసానుభూతిని సమగ్రముగా ప్రదర్శింప జాలక కేవలము ధ్వనింపగలుగు చున్నదని భావము. ఈ రసానుభూతిని సూచింప గలుగుటతోనే కవి ధన్యుడగుచున్నాడు. ఉపహితచైతన్యము గల వ్యక్తులందరిలోను స్వభావసిద్ధముగా అనుపహిత చైతన్యము వ్యంజిత మగుటచే అట్టివ్యక్తుల కావ్యము లీ వ్యంజనావ్యాపారము నతిక్రమింపజాలవు. కావున చిద్గతమగు ఆవరణశక్తిని భంగము చేయుటయే రసచర్వణ యని జగన్నాథు డనినాడు. ఒకభావమును మనస్సులో నుంచుకొని వ్రాయ నారంభించినపుడు, ప్రవృత్తమైన మనస్సు మండుచున్న నిప్పుకణమువలె నుండును. నిప్పుకణము మండుచు క్రమముగా బూడిద యగునట్లు, ప్రవృత్తమగు మనస్సు పూర్వభావమును తనముందదేరీతిగా ఎక్కువకాలము నిలుపుకొనలేదు. అందుచే అనుభూతికి కేవలము ప్రతీక యగు కావ్యమున భావము నుపహితముచేయు శబ్దము ఉపాధి యనబడు ఆవరణమును వ్యంజనా వ్యాపారవశమున భంగము చేయగల్గుచున్నది. తద్ద్వారా కావ్యరచనలో కవికి గల రసానుభూతి కావ్యానుశీలమున మనకుగూడ గల్గుచున్నది.
3. ఈ విధమగు రసానుభూతియొక్క స్వరూపమును తెలిసికొనవలసి యున్నది. రసానుభూతి యను రసచర్వణలో ఇంద్రియ ప్రత్యక్ష ముండక తప్పదు. కవి చెప్పువిషయమును భావనద్వారా మనము గ్రహించునపుడు మానసప్రత్యక్షముగా నీ విషయమును చిత్రించుకొనుట గలదు. చూచుట, భావించుట అను రెండు ప్రక్రియలు ఇచట గలవు. కావున కావ్యమును భావములతో కాక శబ్దములతో వ్రాయుదుమని యొక ఫ్రెంచి సాహిత్య సమీక్షకు డనినాడు. అర్థప్రత్యాయకమగు శబ్దము శ్రవణంద్రియ సన్నికర్ష గలిగి సౌందర్యపరిపోషక మగుచున్నది. చెవిటివానికి శబ్దసౌందర్యము తెలియదు. అనగా శ్రవణంద్రియము వ్యాపృతము కానిదే కావ్యోపహితమైన రసానుభూతి కలుగనేరదు.
''వర్షేషు య ద్భారత మార్య ధుర్యా ః
స్తునంతి గార్హస్థ్య మివా శ్రమేషు,
తత్రాస్మి పత్యు ర్వరివస్యయా೭హం
శర్మోర్మి కిమ్మీరిత ధర్మలివ్సుః''
అతను శ్లోకమును పైకి చదువునపుడు కలుగు వివిధ బాహ్య సంచలనములద్వారా మన మిందలి భావమును ముందు గ్రహించుచున్నాము.
''యత్పథావధి రణుః పరమ స్సా యోగధీ రపి నపశ్యతి యస్మాత్
బాలయా నిజమనఃపరమాణౌ హ్రీదరీశయాహరేకృత మేనమ్''
అను శ్లోకమునగూడ ఇంద్రియసంచలనముల ద్వారా భావ మవగతమగుచున్న దనిన నతిశయోక్తిగాదు.
సామాన్య ప్రత్యక్షమున నొకవస్తు వన్యార్థోపయోగి యుగచున్నది. కాని రసప్రత్యక్షమున నీవస్తువున కన్యార్థాపేక్ష లేదు. ఈవస్తువు తాత్వికమా ? కాదా ? అను ప్రశ్నల నిట వివేచింపము. అన్యార్థ నిరపేక్షకములుగా, స్వయంపోషకములుగా వస్తువులు స్వీకరింప బడుచున్నవి. ఏదియో ఒకవురు షార్థము నిట నవగాహనము చేసికొని దానితో తృప్తిపడుటచే నిట్లు ప్రవర్తించుచున్నాము. వస్తువుల''ను చూచుటకు గాక, వస్తువుల ''లోనికి'' చూచుటకు కన్నులను వినియోగించుచున్నాము. కావుననే విమలప్రతిభానశాలి యగు హృదయము కలవాడే రసప్రత్యక్షమున కధికారియని అభినవగుప్తుడనినాడు. కావ్యానుశీలనాభ్యాస వశమున మనస్సు అను దర్పణము విశదీభూతము కాగా, వర్ణనీయ తన్మయీభవన యోగ్యత గలిగి న్వహృదయసంవాదము ననుభవింప గలిగిన ఈ యధికారిని సహృదయ డందురని సహృదయ శబ్దమును లోచనకారుడు నిర్వచించినాడు. హృదయసంవాదమును చేకూర్చు భావము రసోదయకారకమై, ఎండుకట్టెను అగ్ని ఆవేశించు నట్లు, శరీరము నంతయు ఆవేశింప గల్గుటయే రసానుభూతిలో సహృదయమునకు గోచరించునని భరతుడు సహితము నిర్వచించినాడు.
శ్రవ్యప్రాధాన్యమైనది కావ్యము. దృశ్య శ్రవ్యాత్మకమైనది. రూపకావలోకమున కలుగు అవగతి సామాన్యానుభూతులకంటె విలక్షన మైనది. ఈయవగతిలో మనస్సు విశదీభూత మగును. అర్థవంతము, ప్రయోజనవంతమునగు భావము నుపహితము గావించి, ధ్వనింపగలిగినది రూపమగుటచే నీవైశద్యము చాల అవసరము. ప్రత్యక్షముగా భవనావ్యాపారవశమున మన మవగతము చేసికొను ఈ భావము మనల నుద్దీపింపజేయుచున్నది. కాని, అవగతము చేసికొనిన భావము ప్రత్యక్షవిషయమందలి భాగము కాదు. ప్రత్యక్షవిషయ మీ భావముచే ననుప్రాణితమై సార్థక మగు చున్నది. ప్రత్యక్ష విషయమున ఇంద్రియ గ్రాహ్యముగా భాసించురూపము భావాభివ్యంజకముగా పర్యవసిత మగుచున్నది.
రసప్రతీతిలో ఇంద్రియములేగాక, నరములు, కండరములు మొదలగున వన్నియు వ్యాపృతము లగుచున్నవి. వస్తుస్వరూము మన మనోవృత్తుల నొకప్పుడు దిద్దగల్గుచున్నది. నలీరంగుకన్న ఎరువు త్వరగా మనల నుద్దీప్తము చేయగలదు. ఇట్లే ఉచ్చైస్స్వరముకూడ చేయగలదు. ఈవిధమగు ఉద్దీపన, శబ్దముల స్వరూము నాశ్రయించుకొని కావ్యమున గలదు గనుక కావ్యప్రతీతిని కేవలము మానసికస్థితిగా చెప్పరాదు. మనస్సు బాహ్యజగత్తుతో ననన్యత్వము నందగా కలుగు పరిణామమే కావ్యరూపమున భాసించుచున్న దని మరువరాదు. మానసికమగు కావ్యము వస్తుతంత్రముగా నావిర్భవించుచున్నదని భావము. బాహ్యవిషయముల ననుసంధింప జేయబోవు కవి తద్విషయాధీను డగుచున్నాడు. ఏతత్సంబంధముద్వారా అంతర్లీనముగా, గుప్తముగా నున్న భావమభివ్యక్త మగుటచే మహత్తరమైన హృదయసంవాదము కలుగుచున్నది. వస్తుగతమగు బాహ్యరూపము కేవల ముపాధిగా గోచరించుటచే ఈరూపము అంతర్లీనమై, అంతర్యామిగా నున్న తత్త్వమునకు తీసికొనిపోవుచున్నది. ఇట్లు రసావస్థను మేల్కొల్ప జాలిన వస్తుస్వరూపము తదనంతరోత్పన్నమగు కావ్యశక్తిసంవలితమై యున్నదని ఎంచవలెను.
దీనినిబట్టి రసప్రతీతిలో భావరహితమైన వేదన లేక అనుభూతి కలదని చెప్పుట ప్రామాదికము. భావోపహితమగు కావ్యము నాశ్రయించుకొని వచ్చు రసచర్వణను శాబ్దీ ప్రతీతి గాను అపరోక్షాత్మికాప్రతీతిగాను జగన్నాథుడు గ్రహించెను. ప్రత్యక్షగోచరుడుగు రూపమును అనుభూయ మాన మగు భావముతో ననన్యముగా చూపునది కావ్యము. ఇట్టి సంబంధమును భావాన్వితరూపముగా 'క్లైవ్ బెల్' ప్రతిపాదించినాడు. ఈరూపము భావాన్వితమైనను రూపనిష్పాదనకు హేతుభూతమగు భావమును ప్రధానముగా 'క్లైవ్ బెల్' గ్రహించుటలేదు. భావమును వదలి రూపమునే స్వీకరించుచో రసచర్వణ లభింపనేరదు.
భావరూపముల కవినాభావ సంబంధము కలదు. భావము ఇంద్రియ ప్రత్యక్షయోగ్యమగు రూపమున భాసించు చున్నదని ''హేగెల్'' వచించినాడు. రసచర్వణలో భౌతికాధ్యాత్మికము లనన్యములుగా ప్రతీయమానములై భావనా వ్యాపారముల ద్వారా అనుభూయమానము లగుచున్నదవి. అన్యార్థసాధకముగా గాక నిరపేక్షముగా అనుభూయామాన మగు రసచర్వణావిషయము అర్థమును లేకభావమును ఉపహితము చేయుచున్నట్లు భాసించును. ఇట్టి భావలావణ్యయోజన అనన్యత్వలక్షణలక్షితమని చూపించుచు పార్వతీ పరమేశ్వరుల సంబంధమును మహాకవి కాలిదాసు వాగర్ఖముల సంబంధమునకు పోల్చినాడు.
రసచర్వణలో నింద్రియగ్రాహ్య మగు రూపమెట్లు వర్తించుచున్నది ? సాహిత్యమున నింద్రియజన్యమగు సుఖమేమియు లేదని 'రోజర్ ఫ్త్రె' చెప్పుచున్నాడు. ''కేవలముగా నున్న రంగున కర్థ మేమియులేదు. స్వరములుకూడ తమంత తాము మనలను మేల్కొలుప లేవు. వర్ణతూలికతో రంగులను వేయు చిత్రకారులు 'రంగు లభివ్యక్తము చేయు గుణములే ప్రధానమైనవి' అని చెప్పుచున్నారు. రంగులరూపములు, ఈ రూపముల కలుయికలు అనువాని ద్వారా చిత్రకారుని వైదగ్ధ్యమును మనము గ్రహింప గలుగుచున్నాము. రూపముగా పరిణమించినపుడే రంగు అర్థవంత మగుచున్నది. అని 'క్లైవ్ బెల్' యొక్క వారము. క్రమవిన్యాసానుసారియగు రేఖవర్ణ సంయోగమే రూపము. స్థాయిభావప్రవృత్తిలోని భావముల సంసర్కము లేనిదై చిత్రలేఖకుని దృష్టి యుండుటచే ఈ రూపమును నిరపేక్షబుద్ధితో నవగాహనము చేసికొనగల్గుచున్నామని 'రోజర్ ఫ్త్రె' చెప్పుచున్నాడు. కావున భావరూపములలో రూపమే రసచర్వణయందు ప్రధానమైనదని వీరి వాదసారాంశము. ఈసూత్రమును కావ్యమునగూడ వర్తింపజేయవచ్చును. శబ్దములు కేవలము శబ్దములుగా అర్దవంతములుకావు. అందుచే శ్రుతిదుష్టాది దోషములుకల వర్ణములు సందర్భవశమున దోషరహితము లగుచున్నవి. శబ్దములరూపములు, ఈరూపముల సంయోగములుమాత్రమే రసచర్వణలో అర్ధవంతములు కాగలవు. కావున రసభావాదికములవలన కావ్యమర్థవంత మగుటలేదు. కేవలము శబ్దస్వరూపవిశ్వాసవశమున కావ్యము ప్రయోజనవంత మగుచున్నది.
కాని, రసచర్వణను భావచర్వణగాను, రూపచర్వణగాను, విభజించుట అనుభవవిరుద్ధము. రూపనిష్ఠములైన గుణములుమాత్రమే రసచర్వణలో గలవనుట యుక్తియుక్తము కాదు. కావ్యసృష్టిలో రూపమును భావాసంబద్ధముగా గ్రహించి కవి నిష్పన్నము చేయుటలేదు. ఉపాధిగా భాసించు రూపమే, అనగా ఉపహితమైన భావముగల రూపమే, కవి సామాజికు లపేక్షించునది. రూపముయొక్క స్వభావము భావము నాశ్రయించుకొని యున్నది.
శబ్దములకు గల అన్యోన్య సంబంధములద్వారా శబ్దములు సౌందర్యమున పర్యవసితము లగుచున్నవని రూపవాదునులచున్నారు. కాని సంబంధమును పొందు వ్యక్తులగు శబ్దములను వదలి సంబంధములనే ప్రధానముగా స్వీకరించునపుడీ సంబంధములు మృగతృష్ణికవంటివని మరువరాదు. శబ్దముల నాశ్రయించుకొనిన సంబంధములు శబ్దములు లేకుండా వచ్చునవిగావు. శబ్దనిష్ఠమైన శ్రవణంద్రియ వ్యాపారమును రసచర్వణనుండి తీసివేయలేము. పైగా శబ్దములను గ్రహించునపుడు, శబ్దములయం దుపహితమైయున్న భావమును పరిత్యజించలేము. కావుననే వివిధరీతులను నిర్వచించునపుడు ప్రాచీనాలంకారికులు శ్రేవణంద్రియప్రవృత్తిని, మనఃప్రవృత్తిని గూడ గ్రహించి యున్నారు. శ్రుతిదుష్టాది దోషములుగల వర్ణములు కొన్ని సందర్భములలో రసపోషకము లగుచున్నవి. శృంగారమున యోగ్యముకాని వర్ణములు రౌద్రమున సామంజస్యము నందుచున్నవి. శ్రుతిదుష్టత్వ మున్నంతమాత్రమున నొక వర్ణమును రసభంగహేతువుగా గ్రహించరాదు. ఈ న్యాయము ననుసరించి దోషము లనబడునవి సందర్భవశమున గుణములుగా పరిణమించగలవని మహిమభట్టు, భోజుడు మొదలుగాగల సమీక్షకులు పలికినారు. కావున ఇంద్రియ గ్రాహ్యమగు రూపము సందర్భవశమున అనుస్యూతముగా వచ్చు భావమున పర్యవసితమగుచున్నదని తేలుచున్నది.
రూపవివేకమున నుపయుక్తము లగుటచే రసప్రతీతి యందు ఉత్తమేంద్రియములగు చక్షుః శ్రవణములు పూర్తిగా ప్రవృత్తములగుచున్నవి. రసచర్వణలో నీ రెండు ఇంద్రియములు కన్పించుటచే క్రీడనీయకమగు రూపకమును ''దృశ్యం శ్రవ్యం'' అని భరతుడు పలికినాడు. దృశ్యమగుటచే ప్రీతి ప్రదము, శ్రవ్యమగుటచే వ్యుత్పత్తిప్రదము నగుచున్నది. ప్రీతి వ్యుత్పత్తులు రెండును వసరమైనవే. వ్యుత్పత్తిప్రదమైననే ప్రీతి ముఖ్యముగా కన్పించుటచే కావ్యము ప్రధానముగా బుద్ధిగ్రాహ్య మగుచున్నది. కేవలము బుద్ధిచేతనే గ్రహించబడదగిన అర్థము నుపహితముగా ప్రదర్శించునది రూపమగుటచే రూపము భావాభివ్యక్తికి అతిముఖ్యమైనదగు చున్నది. రూపమున నంతర్యామిగా నున్న భావము రూప సద్భావమునకు హేతువగును. అనుభావములను మేల్కొలుపు రూపము జ్ఞానానుస్యూతమని భావము.
ఒక స్వరము మరియొక స్వరముతో గాని, ఒక రంగు మరియొక రంగుతో గాని సమన్వయము నుందుచో నీ స్వరమున ఆరంగులోను స్వతః సిద్ధ మగు వ్యంజనావ్యాపారము కలదని చెప్పవలెను. ఒక లయ మరియొక లయకు సమగ్రత్వము నాపాదించినను, ఒక స్వరము మిగిలిన స్వరములతో గలిసి శ్రవఃపేయ మైనను, వర్ణవిన్యాసవశమున మరియొక వర్ణము నియంత్రిత మైనను, ఇంద్రియ గ్రాహ్యములగు నీరూపములతో జ్ఞాన మంతర్లీనమై ప్రవృత్త ముగచున్నదని గ్రహించక తప్పదు. అంతర్లీనమైన జ్ఞాన మీ రూపముల నన్యార్థపర్యవసితములుగా చేయుచున్నది. అన్యార్థ మిచట రస మని యనవలెను.
భావరూప సంయోజన గల కావ్యమున భావమును గాని, రూపమునుగాని, త్రోసివేయలేము. ఒక్కొక్కచో రూపజనితములగు అనుభావములు రసచర్వణలో వైశిష్ట్యమును చూప గల్గుచున్నవి. భావభేదము ననుసరించి కవులు ఛందస్సును మార్చుట గలదు. రతీవిలాపమున, అజవిలాపమున మహాకవి వియోగినీవృత్తమును గ్రహించినాడు. యక్షవిలాపమున మందాక్రాంత వచ్చినది. ఛందో లయతాలాది కము ద్వారా అభిహితమగు భావమురూపహితము కాజాలదు. కావున ఛందస్సును, లయను, శబ్దములను తీసివేసినచో కావ్యము నిరధిష్ఠానమై అభావరూపమున నుండగలదు. కాని భావముతో సంబంధములేని రూపమునకు రసచర్వణలో ప్రసక్తి లేనేలేదు. భావానావ్యాపారమును చక్కగా ఉద్దీపింపచేయజాలిన భావముయొక్క రూపమే కావ్యమున కన్పించును.
మనస్సునకుమాత్రమే సంబంధించి యుండునది సౌందర్యమని 'క్రోచే' యను ఇటలీదేశ సమీక్షకుడు పల్కుచున్నాడు. మనోవృత్తి సౌందర్యప్రతీతిలో ముఖ్యముగా నున్నను, సౌందర్యము కేవలము మానసికస్థితి గాదు. మానసికస్థితిగా సౌందర్యమును గ్రహించుచో కావ్యమునగల రూపమునకు రసచర్వణలో స్థానమే యుండదు. రసములు మనస్సుచే నాస్వాదింపబడుచున్నవని భరతుడు చెప్పుచున్నను, ఇంద్రియగ్రాహ్యమగు రూపమును నిరసించుటలేదు. ''క్రోచే'' వాదమున కనుగుణముగా నవ్యులు కొందరు'రత్యాదులకు లౌకిక సాక్షాత్కారము లేకపోవుటచే విషయసద్భావ మనపేక్షిత మగు చున్నది.' అని పల్కుచున్నారని జగన్నాథుడు చెప్పుచున్నాడు. కావ్యమిట్లు నిరధిష్ఠానభ్రమాత్మక మైనచో ప్రయోజనవంతము, అర్థవంతము అని చెప్పుట స్వవాదవ్యాఘాత మగును. కావ్యమునకు విషయసద్భావము నంగీకరించవలెను. తద్ద్వారా కావ్యము బుద్ధేంద్రియములను మేల్కొల్పి రసచర్వణకు దోషద మొసగుచున్నది.
సౌందర్యమును రూపానువృత్తము చేయుటకు సంవిత్సంవేదన యవసరము. కాని సంవేదన అర్థవంత మగుటకు రూపముకూడ అవసరమే. విషయము లశరీరములుగా మనః ప్రత్యక్షయోగ్యములు కావచ్చునని యెంచుటచే, సంవేదన బాహ్యవిషయముల నపేక్షించదని చెప్ప సాహసించు సమీక్షకులను మనము పరిత్యజించక తప్పదు. నిర్విషయకముగా సంవేదన ఉండలేదు. బాహ్యజగత్తునుండి భావములను గ్రహించి, అర్థవంతమై ఆవిర్భవించునది సంవేదన ప్రత్యక్షవిషయమును పరిత్యజించుటచే సమీక్షకులు అపమార్గమును త్రొక్కినారు. చిత్రకారుని భావనావాహినిలోగల చిత్రములు బాహ్యవిషయముల ననుశీలించుటవలన బయలుదేరుచున్న వని యెంచకపోవుటచే ''క్రోచే '' అపమార్గమున పడినాడు. ప్రత్యక్షముగా నొక విషయము ననుశీలించిన తర్వాతనే దానిని భావింపగల్గుచున్నామని విస్మరించరాదు. బాహ్యజగత్తులో వ్యక్తికి కలుగు అనన్యత్వసంబంధము తదుపహితభావాభివ్యక్తికి హేతువగుచున్నది. ఈ భావాభివ్యక్తిని తెలుపు వానితో సాహిత్య మొకటి. కేవల మాత్మానుశీలనమే చేసికొనువాని కీతత్త్వ మవగతము కాజాలాదు.
కొన్ని స్థలములలో ''క్రోచే '' తనవాదమునే తాను ఖండించుచున్నట్లు కన్పించును. సంవేదనము భావరూపసంవేదనమని, రూపము సంవేద్యమని చెప్పుచున్నాడు. స్వరము శభ్దములయందే సమభివ్యక్తమై అస్తిత్వమును పొందు ననినాడు. నోటిలోని వివిధభాగములను కదల్చుచు, చెవులలోపల మ్రోగుచు, శబ్దములు మనల నావరించు నని పలికినాడు. గానము పరిపుష్ట మైనచో స్వరపేటికయందు, వ్రేళ్ళయందు సమభివ్యాహృత మగు నని కూడ పలికినాడు. కవియొక్క భావన ఎల్లప్పుడు సశీరరముగానే యుండును. అవభాసమానత్వము అవభాస్యనిష్ఠ మగుటచే రసచర్వణయందు విషయధర్మత్వము లేక అర్థధర్మత్వము కలదని ఆలంకారసర్వస్వ వాఖ్యానమున జయరథుడు వచించినాడు. కావున రసచర్వణలో ప్రమాతృ ప్రమేయములు రెండును అత్యవసరములే. ఈరెంటికిగల అనన్యత్వ మతిసన్నిహితమై కొన్ని వేళలపూర్తిగా అభిన్నముగా భాసించును. ఇట్టి అభేద సాక్షాత్కారము గానమున కన్పించుటచే లలితకళ లన్నియు గానావస్థలో పర్యవసించ యత్నించుచున్నవని ''పేటర్ '' ప్రవంచించినాడు.
4. రసచర్వణయందు దేహము, మనస్సు అను రెండును వ్యావృతము లగుచున్నవి. శూన్యమునుండిగాని, తననుండియే గాని, మనస్సు సౌందర్యమును సృష్టించుటలేదు. సౌందర్యాస్తిత్వావగతులను మనస్సు అవసరము. మనస్సుద్వారా సౌందర్యావగాహన కల్గుచున్నది. సౌందర్యావగాహనకు విషయము లుండితీరవలెను. సౌందర్యము బుద్ధీంద్రియముల యుగపత్ర్పవృత్తి ద్వారా ప్రతీయమాన మగుటచే రసప్రతీతి యందు ఆత్మ, మనో, దేహములు ఏకముఖముగా వ్యాపృత్తములగుచున్నవి. మనో, దేహముల, విషయములు మొదలగునవి అత్మానుభూతియందు సమన్వయము నందగల్గుచున్నవి. ఈసమన్వయమున ప్రతిభాగము స్వస్వప్రవృత్తిని నెరవేర్చుచుచు అన్యార్థమునకంగమై ఏకార్థీభావయోగ్య ముగచున్నది. సంగీతమున లయాన్వితములగు నాలాపముల వినుచున్నాము. ప్రతి ఆలాపము తత్తన్నిష్ఠ యోగ్యానుభూతి నిచ్చుచున్నది. ఈయను భూతులు రసచర్వణలోనికి పరిణమించుచున్నవి. ఆలాపములకు గల అన్యోన్య సంబంధమును పరిశీలించి తద్ద్వారా వీటికి సౌందర్యమనుగుణము నారోపించుచున్నామని 'అలెగ్జాండర్' చెప్పుచున్నాడు. కాని అనుభూయమానములగు విషయములకు సంబంధించనది సౌందర్యమను గుణమని యెంచుట పొరబాటు. సౌందర్యము కేవలము మనోనిష్ఠమైనచో భ్రమాత్మకమేయగును. వినబడు శబ్దములలో సామ్యాసామ్యములు మనస్సుచే గుర్తింపబడుచున్నవనుట వాస్తవమే. కాని శబ్దములే ఈ సామ్యాసామ్యముల నభివ్యక్తము చేయనిచో మనస్సు గుర్తింపజాలదు. పైగా సౌందర్యమును ఇంద్రియ గ్రాహ్యమగు గుణముగా గ్రహించరాదు. ముఖము, తీగ, గృహము, గానము అనునవి సౌందర్యవిషయములుగా మనకు కన్పించునపుడు బాహ్యవిషయముచే నభివ్యక్తము గావింపబడునది సౌందర్యమని నిశ్చితమగుచున్నది. ఈసౌందర్యమును బాహ్య విషయమున అవగాహనము చేసికొను మనస్సు తద్ద్వారా సౌందర్యానుస్యూత మగుచున్నది. ఈ సౌందర్యాను స్యూతమగు స్థితిని మాత్రమే గ్రహించి, పూర్వావస్థను త్రోసివేసి, సౌందర్యము బాహ్యవిషయములయం దారోపింపబడునది యని కొందరు సమీక్షకులనినారు.
రసచర్వణయందుగల సంవేదనము ఇంద్రియ గ్రాహ్యములకు గుణములచే మేల్కొలుపబడుటలేదు. ఈగుణములతో నవినాభావ సంబంధముకూడ కలిగియుండుటలేదు; కావున గుణములలో నంతర్లీనముగా నున్నదని చెప్పవచ్చును. కావ్యమున మాధుర్యము ననుభవించుచున్నాము. గానమును నుదాత్తానుదాత్తములు ప్రతీయమానము లగుచున్నవి. మాధుర్యాదులు తత్తద్విషయ నిష్ఠములా ? లేక మనస్సుచే విషయములపై ఆరోపింబడుచున్నవా . రసచర్వణలో విషయములకు మనస్సుకు సాక్షాత్సంబంధము కలదు. ఈసంబంధమతిసన్నిహిత మగుటచే ఎంతవరకు విషయము లున్నవో, ఎంతవరకు మనస్సుగలదో, నిర్ణయింపలేము. విషయములలో మనస్సు, మనస్సులో విషయములు సంవలితములై భాసించుచున్నవి. ప్రమేయరహితుడైన ప్రమాత, ప్రమాతృరహితమగు ప్రమేయము, ఉండజాలవని భావము. కావున విషయము సంవలనముచే ఈ రసభోగము బ్రహ్మాస్వాద సవిధవర్తియని చెప్పబడుచున్నదని జగన్నాథు డనినాడు.
ఆరోపవాదు లీసిద్ధాంతము నంగీకరించలేరు. లలితకళయందు విషయముతో మన మనస్సును మనము కలుపుచున్నాము. వాస్తవిక జగత్తునుండి కవి యోగ్యవిషయముల నేరికొని, అనుపయుక్తము లగువాటిని వదలి, ఈ విషయములలో నొకదానితో నొకదానిని సంయోజించును. కవి మనోగత భావానుగుణముగా, తద్భావప్రదర్శకముగా, నీ సంయోజన జరుగుచున్నది. మనోవృత్తులు స్వభావలక్షణముల యందు కావ్యగతములైన పాత్రలు లీనమగుచున్నవి. విశిష్టవిషయమును కవి సృష్టించగా, ఈవిషయముపై మనోగత భావము లారోపితము లగుచున్నవి. కావున కావ్యముతో మనస్సును సంయోజించగా రసచర్వణావిషయము సంప్రాప్తమగుచున్నది. ప్రకృతిలోని సౌందర్యము ననుభవించునపుడు గూడ నీ ఆరోప ప్రక్రియ గలదని 'అలెగ్జాండర్' అను చున్నాడు. అందుచే మనోనిష్ఠమైన సౌందర్యము విషయము లోనికి చొప్పింపబడి ఆరోపితముకాగా, విషయము సుందరముగా భాసించునదని వీరి వాదము.
రసచర్వణయందు మనోవృత్తులు, బాహ్మానుభాములు విషయములోనికి ప్రవేశించునట్లు కన్పించునని ఆరోపవాదమున ముఖ్యసిద్ధాంతము. ఇచట ప్రయేయమును లౌకిక వ్యవమార యోగ్యముగా అవ్యార్థసాధకముగా గ్రహించుము. ప్రమేయమును నిరపేక్షబుద్ధితోనే చూచుచున్నాము. ఈ నిరపేక్షభావనలో మనోవృత్తులను గూడ అత్మస్థలములుగా గ్రహించక వస్తునిష్ఠములుగా అనుభవింప గలిగినపుడే రసచర్వణ కల్గుచున్నదని ఏవం విధమగు నిరపేక్షభావన రపస్రతీతియందు ముఖ్యమైనదని 'ఎడ్వర్డ్ బుల్లే ' చెప్పుచున్నాడు. నిరపేక్షభావనగల యనుభూతు లన్నిటిలోను రసప్రతీతిలేదు. కాని రసప్రతీతిలో నిరపేక్షభావన ఉండితీరవలెను. నిరపేక్షభావనతో బాటు వివిధ విషయముల సమన్వయముకూడ రసప్రతీతి కవసరమని ఇతని వాదము.
పూర్వానుభూతులలో మనకండరములకు, నరములకు గల సన్ని వేశములను స్మరించుటచేత, మన మిప్పుడొక రాతిని చూడగానే, రాయి బరువుగా కన్పించగలదు. ఈబరువుగా కన్పించుట రాతిలోగల గుణమా ? లేక కేవలము మన మనోగత గుణమా ? 'కార్లగ్రూస్' అను సమీక్షకుడీ రాతినిచూడగానే మనోవృత్తులలో పూర్వానుభూతులను మనమనుకరించుట గూడ కలదని చెప్పుచున్నాడు. కాని మనోవృత్తులను, బాహ్యానుభావములను రాతిలోనికి చొప్పించుచుంటి మనుజ్ఞానము మనకున్నచో రాతిని బరువుగా నున్నట్లు భావించలేము. సాదృశ్యాది సంబంధవశమున, మన యనుభూతులను మనకు తెలియకుండానే రాతికిఆరోపించున్మామని 'ఏఫ్. టి. ఫిషర్' చెప్పుచున్నాడు. పూర్వవృత్తులను, అవయక స్పందములను ప్రతిరూపము మనలను స్మరింపజేయుచున్నదని ఇతని భావము. కాని ఈస్మరణలో స్మృతియను జ్ఞానము లేనిదే పూర్వప్రవృత్తులు స్ఫురించజాలవు. పైగా ప్రతి యనుభూతియందు విషయమును గమనించగనే సాక్షాదపరోక్షము గలదు. ఏవంవిధమగు అపరోక్షప్రతీతిలో పూర్వవృత్తులు ప్రకృతవస్తువుతో ననన్యత్వము నందుచో లౌకికస్మరణ విలక్షణమైన దీ స్మృతి యనవలెను. ఇట్టి అలౌకికస్మృతియందు తెలసిగాని, తెలియకగాని, మనోవృత్తు లారోపింపబడు చున్న వనుట అసంబద్ధ ప్రలాపమే యగును.
రసచర్వణలోగల విషయము (వస్తువు లేక ప్రమేయము) అనుబడునది భావరూపములను గల్గియున్నది. విషయాకారమగు రూపమున భావమున్నట్లు భావింపబడుచున్నది. ఈ భావమును రూపమునుండి వేరుజేయలేము. భావమును వేరుజేసినచో రూపముండదు, భావముకూడ ఉండలేదు. రెంటికి అవినాభావ సంబంధము కలదు. కాని 'రీడ్ ' మొదలగు సమీక్షకులు భావము రూపముతో సంవలితము అగుచున్నడని పల్కుచు, భావరూపములను రెండు ప్రత్యేక విషయములుగా గ్రహించుచున్నారు. ఉపాధి యగు రూపముతో భావనా వశమున సంవలిత మగుచున్న భావమును ప్రయోజనము (పురుషార్థము) గా గ్రహించుచున్నారు. ఈ పురుషార్థము మనస్సునకు మాత్రమే సంబంధించి యున్నది. ఏవంవిధ పురుషార్థానుభూతియే రసచర్వణలో గలదనినచో వురుషార్థములు వురుషవ్యాపార నిష్ఠములై సర్వజనాదరణీయములు కాకపోవలెను. కాని 'రీడ్' పురుషార్థములను వస్తుతంత్రములు గానే స్వీకరించి యుండుటచే, వురుషార్థములు విషయమందారోపితము లగుచున్నవని పలుకరాదు.
ఇచ్ఛా జ్ఞానానందములు ప్రతి పురుషార్థమున గలవు. ఒక ప్రవృత్తి నెరవేరినచో కలుగు సద్భావాత్మకమగు భౌతికాధ్యాత్మిక విశ్రాంతియే వురుషార్థమని 'రీడ్' నిర్వచించి నాడు. కాని వురుషార్థము వ్యక్తి యొక్క మానసోద్భూత మైనదికాదు. సర్వత్ర గోచరించుచు, సమస్త జగత్తులోను అనుస్యూతముగా భాసించు తత్త్వము ఏయే విధములుగా నభివ్యక్తమగుచున్నచో, ఆ ఆభివ్యక్తిని వురుషార్థమనవలెను. ఈ వురుషార్థ ప్రతీతిలో విషయమంతయు నామూలాగ్రముగ ప్రతీయమాన మగుచు, మనఃప్రవృత్తులను, భావనను నియంత్రితము చేయుచున్నది. విషయమునకుగల రూపము అన్యవిషయసంవలిత మైనను, భావమున కుపాధిగా ప్రతీయమానమగుటచే స్వయంసిద్ధ మగుచున్నది. రూముచే నుపహితమైన భావము వస్తునిష్ఠమేకని, మన మనోగతమై వస్తువు నావేశించునది మాత్రముకాదు.
భావ సంవలనములను కొన్నిటిని గమనించిన నీవిషయమమింకను సుగమము కాగలదు.కొన్ని భౌతిక సంచలనములతో నైతికాధ్యాత్మిక వ్యాపారములు సంవలితము లగుచున్నవి. భౌతికాధ్యాత్మికాక్రోశము లోకేయొక వ్యాపారముద్వారా వ్యక్తములగుచున్నవి. కంఠ్యాక్షరముల పారుష్యము క్రోధాది మనోవృత్తులను సూచించుట గలదు. భౌతికాకృతులకుగూడ నాధ్యాత్మిక భావములు చెప్పబడుచున్నవి. చతురశ్రము ధర్మును తెల్పునదని 'పైథాగొరస్' పల్కినాడు. కొన్ని విషయములయందు విశిష్ట వర్ణములు, రూపములు, ధ్వనులు కన్పించుచున్నవి. వర్ణ రూప ధ్వనుల సామ్యమున అన్యవిషయముతో నీ వస్తువు సంబద్ధముకాగా రెంటిని అభిన్నముగా గ్రహించు నవకాశము కలుగును. ఇట్లు నలుపును శోకపరముగాను, ఎఱువును అపాయమును తెలుపునట్లుగాను తీసికొనుచున్నాము. ఇచట పూర్వవధీరిత సంబంధములు మనకు తెలియకుండానే వ్యాపృతములగుచు, వివిధవిషయములకు, భావములకు, చక్కని సమస్వయము చేకూరుచున్నది. ఈసమన్వయమున అంగిగా ఉన్న ప్రధానవిషయము అతీంద్రియ ప్రత్యక్షయోగ్య మగుచున్నది. జ్ఞానవశమున నిర్మింపబడి, భావనద్వారా అనుభూయమాన మగునది రసచర్వణయందలి విషయమగుటచే నీ యలౌకిక చమత్కారాత్మకమగు రసాస్వాదము స్మృతి, అనుమానము, లౌకిక స్వసంవేదనము అను వాటికన్న విలక్షణమైన దగుచున్నదని అభినవగుప్తుడు చెప్పుచున్నాడు.
కవియొక్క భావన విషయగతస్వరూపావగతిలో తృప్తి పడక, తత్తద్రూపోపహితమైన భావావగతికై ప్రవృత్తమగుచున్నది. అధ్యవసాయాత్మికమగు బుద్ధి కతీతముగానున్న ఆత్మ సర్వానుగ్రహక మైనపుడే ఈ అవగతి కల్గును. లౌకికవ్యవహారమున మన కచోచరమైనను, జగదాధారభూతమగు నద్భుతతత్త్వమును గ్రహించి, అనుభవించుటయే భావానావ్యాపారము యొక్క ఉద్దిష్టార్థము. ఈ భావన అందరకు గలదుగనుక ప్రతి వ్యక్తియు తనకు తోచినరీతిగా బాహ్యజగత్తును సమన్వయ పరచుకొనుచు జ్ఞానగమ్యముగా చేసికొనుచున్నాడు. మానవ జీవితమున అంతర్యామిగా భావనకలదని తేలుచున్నది. కావున బుద్ధి, ఇచ్ఛ మొదలగువానికి అతీతమై, కేవలము స్వసంవిత్స వేద్యముగా కావ్యము కన్పించుచున్నది.
ఇట్టిదో ఆరోపవాద మనంగీకార్యము కాగలదని వేరుగా చెప్పనక్కరలేదు. ఆరోపవాదమున సౌందర్యము మనోనిష్టమైనదగుటచే విషయమున కన్పించలేదు. విషయగత సౌందర్యము భ్రమాత్మకము కావలసివచ్చును. కావ్యశిల్పము సమగ్రమై, పరివుష్టమైనకొలది తనలోలేని గుణములను కావ్యవిషయ మభివ్యక్తము చేయుగల్గుచున్నదని 'అలెగ్జాండర్' అనుచున్నాడు. కాని శ్రావ్యమైన గీతమును వినునపుడు, గీత మభివ్యక్తము చేయుభావములు మనలోనుండి బయటకు వెడలి గీతము నావహించుచున్న వే యని చెప్ప సాహసించ లేము. గీతములోని వర్ణ లయ తాలాదులలో సౌందర్యము ప్రతీయమాన మగుచున్నది కాని, మన మనస్సులోకాదు. గీతాస్వాదమునగాని, తర్వాతగాని, భ్రమలో పడితిమనుబుద్ధికూడ మనకు లేదు. పైగా భ్రమ జ్ఞానము అసత్యమై ప్రయోజనరహిత మగునది.
సౌందర్యముతోబాటు అసాధు వగు హేయత్తవము (Ugliners) కూడ రసచర్వణకు సంబంధించినదే. మనోనిష్ఠమైన సౌందర్యమును విషయముపై నారోపించి విషయము సుందరముగా నున్నదని యెంచితిమేని, హేయత్వముతో భాసించు వస్తువును చూచుననపు డీ హేయత్వమును కూడ మనోనిష్ఠముగా గ్రహింపవలసి వచ్చును. సౌందర్యము మన మనస్సులలో గలదని ఒప్పుకొనుటకు అందరు నంగీకరించగలరు. కాని హేయత్వమను అవగుణము కలదని చెప్పుకొనుటకు సాహసించరు. అట్టిచో వస్తువుయందు హేయత్వము ఆరోపింపబడుట లేదని చెప్పవలెను. ఆరోపవాదమున కిది ప్రబల వ్యాఘాతము.
ప్రమాతకు ప్రమేయమునకు విశిష్ట సంబంధము కలదు. విషయ మనుభవింపబడుటచే విషయమునకు సత్తా గల దని చెప్పుచున్నాము. సంవిదధీనమైన విషయసత్తాను గుర్తించి నపుడు విషయము లేదనిగాని, విషయముపై మన మనోగత భావము లారోపింపబడుచున్న వనిగాని చెప్పుట అతిసాహస మని తత్త్వదీపనకారుడు పలికినాడు. కావున విషయసౌందర్యము ప్రతీయమాన మగునపుడు ఈ సౌందర్యమును విషయా భిన్నముగనే గ్రహించవలెను. గాని మనోనిష్ఠమని చెప్పరాదు. విషయము సుందరమని, విషయసౌందర్యమును మనము మనస్సు ద్వారా అనుభవించుచున్నామని అందరకు తెలిసినవిషయమే. ఈ సామాన్యానుభవమునకు విరుద్ధముగా వర్తించవలసిన అవసర మేమియులేదు.
ఈసిద్ధాంతము నింకొక విధముగా ప్రదర్శించవచ్చును. క్రమబద్ధమై ప్రవృత్త్యాత్మక మైనది అనుభూతి బాహ్య విషయ సన్ని వేశాదులచే కొంతవరకు నియంత్రితమై సదాచూచుచున్న అనుభూతిలో నప్పుడప్పుడు తద్వేగావరోధము కల్గుచుననది. అవరోధము కల్గినప్పుడు వర్తమానదశలో నున్న అనుభూతి విస్పష్టముగా భాసించును. మనల నాకర్షింపజాలి, మనన నిదిధ్యాసనలను తనపైకి త్రిప్పుకొన గలుగు వస్తువు (విషయము) వలన అనుభూతియను ప్రవాహమున కవరోధము వచ్చుచున్నది. అన్యార్థాపేక్షముగా గాక, నిరపేక్షబుద్ధితో నీ వస్తువును భావించునపుడు సుఖాత్మకమగు సంతృప్తి కల్గుటచే నీ యవరోధమును మనము నిరసింప లేకున్నాము. ఈ వస్తువు పురుషార్థాభివ్యంజకము కానిచో నిరపేక్షభావన కలుగ నేరదు. వురుషార్థ మనబడు ప్రయోజనము వస్తుస్వభావనిష్ఠమైన సమగ్రము, స్వయంపోషకము నగుచున్నది. ఇట్టి భావనయే రసచర్వణలో గలదు. ఈ భావనయందు దేశ కాలాద్యుపాధుల కతీతముగా ప్రమాత వర్తించును. దీనిని హృదయసంవాద మందురు. ఇతరుల చిత్తవృత్తులను ఆత్మీయ చిత్తవృత్తితో నభిన్నముగా గ్రహించి యనుభవించుటయే హృదయసంవాద మని జయరథుడు నిర్వచించినాడు.
వ్యావహారికజీవితములోని సందర్భముల ననుసరించి వ్యావృతములగు ఇంద్రియములు విశిష్ఠ ప్రవృత్తుల నలవరచుకొనుచున్నవి. ఏవస్తువు నెంతవరకు గ్రహించిన మనకృత్యము నెరవేరగలదో అంతవరకు తెలిసికొనుటకే ఇంద్రియములుపయుక్తము లగుచున్నవి. ఇట్లు మనము తెలిసికొను విషయమతిస్వల్పము. ఈ స్వల్పజ్ఞానముతో వస్తువును గుర్తించి, స్మరింపగల్గుచున్నాము. గుర్తింపబడినతర్వాత, వస్తువు విస్మరింప బడుచున్నది. వ్యావహారిక ప్రత్యక్షమున వస్తువుల బాహ్యాకృతులతో తృప్తిపడుచున్నాము. కాని నిరపేక్షభావనలో భావరూపసంవలితమైన వస్తుజ్ఞానము కల్గుచున్నది. ఈ భావము రూపోపహితమైయుండి భావనచే సమున్మీలితమగుచున్నది. తద్ద్వారా కలుగు సమగ్రజ్ఞానము అనుభూతి నిష్ఠము. మనోగతభావమును విషయమందారోపించక విషయములయం దంతర్లీనముగా ఉన్న భావ మభిక్యక్తమై సమున్మిషితమగుటకు విషయముతో మనస్సు సహకరించుచున్నది.
5. ఒక వస్తువు సుందరముగా భాసించునపుడు ఈ సౌందర్యము వస్తుస్వభావము నాశ్రయించు కొనినట్లు గానే ప్రతీయమాన మగుచున్నదని నిశ్చయించితిమి. సహజసౌందర్యము లేని వస్తువుయందు సౌందర్యము నారోపించి, అందలి ఈ సౌందర్యమును భావించుట ఉన్మత్తప్రవృత్తి యనిపించుకొనును. మనోగతసుఖమును పరస్థముచేసి తద్ద్వారా వస్తు సౌందర్యమును మనము భావించుటలేదు. పరస్థ సౌందర్యవశమున మనోగతసుఖము బాహ్యమగుచున్నది. ఒకేవొక వస్తువొకప్పుడు సౌందర్యముగాను, మరొకప్పుడు సౌందర్యరహితము గాను భాసించునపుడుకూడ ఆరోపప్రక్రియ లేదు. సౌందర్య రహితముగా వస్తువు భాసించునపుడు వస్తుగత సౌందర్యము నశించుటలేదు. కాని వస్తునిష్ఠ సౌందర్యము మన ప్రతీతిలోనికి వచ్చుటలేదు. 'బొశాంకేట్' అనినట్లు ఇట్టి సందర్భములలో మనమనస్సు సమ్మె కట్టుచున్నది. విషయముల నొకతీరుగా సమన్వయపరచుచు, వాటి కంగాంగిభావమును చేకూర్చు మనఃప్రవృత్తిద్వారా వస్తుతంత్రమగు సౌందర్య మభివ్యక్త మగుచున్నది.
ఒక విశిష్టమగు అనుభూతిని భాషారూపమున ఉచ్చరించగా కావ్యము వచ్చుచున్నది. జగత్తులో తీసికొని రాబడిన పరిణామము లేక మార్పు పొందు రూపమును కావ్యమన వచ్చును. కాని బాహ్యజగ్తుతులో నేవిధమైన మార్పు రావెలనన్ననును భౌతికశక్తి ప్రవృత్తము కావలెను. కవి ఇట్టిశక్తి నుపయోగించుటలేదు. కవియొక్క మనస్సులో కేవల మొక భావము కలదు. ఈభావముద్వారా బాహ్యవిషయముల నేరికొనుట, ఒకదానితో నొకటి కలుపుట, ఒకదానితో నొకడానికి సంబంధము కుదుర్చుట, మొదలగు పనులను చేయుగల్గుచున్నాడు. ఈ సంబంధము లన్నియు జగత్తులో నంతర్లీనము గానున్నవే. భావముద్వారా ఈ సంబంధముల నభివ్యక్తము చేయగల్గుచున్నాడు. కవియొక్క భావము శూన్యమునుండి ఆవిర్భవించినది కాదని, అసత్తునుండి సద్భావమును కవి సృష్టించుటలేదని తేలుచున్నది. విషయములనేరి, వాటికి అన్యోన్యసంబంధములను కూర్చునపుడు, వస్తుస్వభావపరిశీలనము, వస్తువులతో నంతర్లీనముగా నున్న పరస్పర సంబంధావగాహనము కవికి కావలెను.
జగత్తులో నంతర్లీనముగా నున్న తత్త్వము నావిష్కరింపజేయుటకు బాహ్యప్రమేయములతో కవి సహకరించక తప్పదు. జగత్తులో దాగియున్న శక్తిసామర్థ్యములు భావన ద్వారా కలిగి అవగతము లగుచున్నవి. వీటినే భావము లను చున్నాము. విషయసామర్థ్యములతో బాటు కవియొక్క సామర్థ్యములుగూడ జగ్తుతులో దాగియున్నవే కాని, వేరు కాదు. దీనినిబట్టి కేవలము కవివలనగాని, కేవలము విషయముల వలనగాని, కావ్య ముత్పన్నమగుట లేదనని చెప్పవలెను. కవి అతని యనుభూతిలో గల సన్నివేశములు, అను రెంటికి అనన్యత్వ సంబంధము సిద్ధించును. ప్రమాతృ ప్రమేయ సంవలితమైన జగత్తు కవియొక్క చైతన్యముద్వారా అభివ్యక్తమగుచున్నది. ఈ యభివ్యక్తిలో అర్థము. అర్థవంతమగు రూపము అను వాని నీజగత్తు పొందుచున్నది. ఈ యనన్యత్వమున నీ జగత్తు కవియొక్కచైతన్యముద్వారా చేతనమగు చున్నది. జగత్తులో నంతర్లీనముగా నున్న చైతన్యము అభివ్యక్తికై పైకి ఉబుకుచు కవిద్వారా అర్థవంత మగు చున్నది. కవియొక్క ఇచ్ఛాశక్తి నుద్దీపించు బాహ్య సన్ని వేశములను తీసివేసినచో ఇచ్ఛాశక్తియే ఉద్దీపించక పోవుట వలన కవియొక్కఇచ్ఛాశక్తిజనితమైనది కావ్య మని చెప్పవీలులేదు. తాను నిర్మించు చిత్రము చలువరాతిలో దాగియుండగా గుర్తించినానని శిల్పి చెప్పుచున్నాడు. గాజుపని చేయువాని చేతిలోనికి గాజు సజీవముగా వచ్చుచున్నదను అనుభూతి కలదు. అయోభావన లేనిదే కమ్మిరి ఇనుపపని చేయలేడు. ఈ యనుభూతులవలన లలితకళలలో ప్రమాతృ ప్రమేయముల కనన్యత్వము కలదని, ప్రమేయముతోబాటు ఆయా కళల కుచితమైన ఉపాధి యనబడు రూముకూడ అతిముఖ్యమైనదని, ఈ యనన్యత్వమున దాగియున్న తత్త్వా నిష్కృతియే కావ్యమని' నిశ్చయింపవలె నని 'మారిన్' 'బొశాంకెట్' అను సమీక్షకులు చెప్పియున్నారు.
ఏవంవిధమగు అనన్యత్వము నాధారము జేసికొనినచో రసచర్వణయందలి భావము సుస్పష్టము కాగలదు. జ్ఞానానందపరముగా రసచర్వణను వ్యాఖ్యానించుచు ప్రమేయాది సన్నివేశములు అనుభూతిలో సమన్వయము నందుచు నతి ముఖ్యము లగుచున్న వని అభినవగుప్తుడు చెప్పినాడు. చేతను డగు వ్యక్తితో అనన్యత్వసంబంధము నందజాలని వస్తువులకు సత్తాలేదు. సత్తా యనగా న్ఫురద్రూపత్వము కలిగియుండుట. న్ఫురద్రూపతయే ప్రకాశమానత. విషయములకు ప్రకాశ మానత్వము కలదని యంగీకరించవలెను గనుకను, ప్రకాశ మానత్వము చేతన్యలక్షణ మగుటచేతను, జడపదార్థమనునది లేదని, ప్రకాశమానత యన ప్రకాశాభేదమని ఉత్పలదేవుడు శివదృష్టివ్యాఖ్యానావసరమున పల్కినాడు. కావున రసచర్వణలో సహితము ప్రమేయమునకు జడత్వము లేదని పరమ గురువగు ఉత్పలదేవుని అనుసరించుచు అభినవగుప్తుడు పలుకగలిగినాడు. అంతర్లీనముగా నున్న చైతన్యమును విషయము లచే నభివ్యక్తమగునట్లు చేయుటయే కవియొక్క వ్యాపారము.
వస్తుస్వభావానుగుణము లగు భావములనే మనము అనుభవించగలుగుచున్నాము. మన మనుభవించు భావములు వస్తుస్వభావముతో సంవలితములై యున్నవని భావము. రసచర్వణలో గల సౌందర్యావగతి నాశ్రయించుకొనివచ్చు ఈ సంవలనము కావ్యమున అర్థవంతముగా ఉపహిత మగుచున్నది. కావున రసచర్వణలోగల అర్థమును అనుభావముగా గాని, భావరహితమగు సంవేదనముగా గాని స్వీకరింపలేము. ప్రత్యక్షగోచరములగు సన్ని వేశములతో జ్ఞానాకారమగు భావము సంవలితమైనచో, రసచర్వణావిషయము వచ్చుచున్నదని చెప్పితిమి. ఈ సంవలనమున ఒకదానినుండి మరొకదానిని వేరుచేయలేము. ఇచట గల జ్ఞానాకారమగు భావము అతీంద్రియ ప్రత్యక్షయోగ్యమై, ఉత్తమపురుషార్థము లన్నిటియందును అనుస్యూతముగా కన్పించుచున్నది.
ఇట్లు నిష్పన్నమగు రసచర్వణ నిర్వికల్పక ప్రత్యక్షమున అనుభూత మగుచున్నది. సంసర్గాసంగియగు జ్ఞానమైన నిర్వికల్పమున విభిన్న సన్ని వేశములు ఏకరూపముగా, సమగ్రముగా భాసించుచున్నవి. విన్యాస వైదగ్ధ్యవశమున నీవిధమగు ప్రతీతి కావ్యమున కల్గుచున్నది. యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి, తాత్పర్యబోధ, ఛందస్సు, లయ మొదలుగాగల రచనాపరికరములన్నియు విన్యాసశబ్దముచే సంగృహీతము లగుచున్నవి. స్వేచ్ఛామయమైన ఆత్మాభివ్యక్తి ఈ విన్యాసవశమున నియంత్రితమై కావ్యమున ప్రతీయమాన మగుటయే కావ్యవైశిష్ట్యము. తద్ద్వారా స్థాయి భావజనితప్రవృత్తులు జ్ఞానాకారము లోనికి పరిణమించుట కన్పించగలదని 'బాల్డ్వి೯ బ్రౌ ೯' చెప్పుచున్నాడు. ఈపరిణామము కావ్యమున ఛందోలయాన్వితమగు భాషారూపమున గ్రథితమగుచు, రసచర్వణలో నపరిత్యాజ్య మగుచున్నది. జీవితమునగల ఒడుదుడుకులు మచ్చిక చేయబడగా వచ్చు ప్రశాంతరూప పరిణామమే ఈ గ్రథిత వస్తువు. దీనిని నిరపేక్షబుద్ధితోనే భావింపగల్గుచున్నాము. ఈ భావనలో ప్రశాంతరూపమగు చిత్తవిస్తారమును కవి సామాజికు లనుభవింతురు. కవి సామాజికులకు ఈయనుభూతి రాక ముందున్న స్వరూప స్వభావములు, ప్రమేయముల స్వరూప స్వభావములు, ఈచిత్తవిస్తారమున నంతర్గతములై భాసించును. ఉత్తమ అనుభూతులలోను, ఈయనుభూతులు పొందు కావ్యా దులయుందును, అనుపహిత తత్త్వావగతి కలదు. ఇట్టి సంవిత్సం వేదనమున మహాత్తరభావము, అలౌకికభావన, హృదయ స్పందము, అశేషవస్తుసంవాదము ప్రతీయమానము లుగ చున్నవి.
విభావాదులచే సముద్దీపితములైన స్థాయి సంచారి భావములద్వారా రసచర్వణ కల్గుచున్నది. భావములనగా చిత్తవృత్తి విశేషములు. వ్యక్తిభేద మున్నను ఒకవ్యక్తి యొక్క చిత్తవృత్తికి మరియొక వ్యక్తియొక్క చిత్తవృత్తికి అత్యంత వైలక్షణ్యములేదు. ప్రతిచిత్తవృత్తియందు ఇతర ఉపహిత విషయములు సంవలితములై కన్పించుచున్నవి. కావుననే రసము కవిగతమైనదని, కవి సామాజికతుల్యుడని అభినవగుప్తుడు పలికినాడు. రసచర్వణయందు దేశకాలోపహిత లక్షితుడైన కవి ప్రవర్తించుటలేదు. బాహ్యవిషయము లతో తాదాత్మ్యము లేక అనన్యత్వము సంభవించినపుడే కవి ప్రవర్తింప గలుగుచున్నాడు. దీనిని సాధారణీకరణ మని యందురు. కవిగతసాధారణీభూత సంవిన్మూలమై కావ్యపురస్సర మైనది నటవ్యాపారము. ఈసంవిత్తునకు రసమునకు భేదములేదు. కావ్యరచనావసరమున కవికి, తదవలోకనావసరమున సామాజకునకు కలుగు అనుభూతియే రసప్రతీతి.
రసమును సంవిదభిన్నముగా చెప్పితిమి. రసమని మనము వ్యవహరించి సంవిద్రూపము ఉద్దీపింపబడినపుడు రసప్రతీతి కల్గుచున్నది. పూర్వానుభూతులద్వారా సమావిష్టమగు వాసనాసంస్కారవశమున నీ సంవిద్రూపము విశిష్టముగా భాసించును. ప్రాక్తన సంస్కారములు భావస్థిరములై ప్రతియనుభూతిలోను ఉద్దీపింపబడుచున్నవి. ఇట్టి ప్రాక్తనసంస్కారరహితులగు వారికి రసాస్వాదనము కలుగనేరడని ధర్మదత్తుడు చెప్పియున్నాడు. సంస్కారశూన్యులగు సామాజికుల మనస్సులు మనస్సులేకావుగనుక భావాదిక మనుభూయమానము కాజాలదు. వాసనారూపముననుండు సంస్కారములు స్మృతి రూపమున మనచే అనుభూయమానము లగుచున్నవని, స్మృతి సంస్కారముల కేకరూపమే గలదని యోగసూత్రము చెప్పుచున్నది. పూర్వానుభూతమగు అర్థము లేనిదే స్మృతి కలుగదు. కాని ఇచ్చట అబోధపూర్వముగా నావిర్భవించు స్మృతికి ప్రతిభానాపరపర్యాయమగు సాక్షాత్కార స్వభావమునే చెప్పవలెనని అభినవగుప్తుడు సిద్ధాంతించినాడు.
విభావాదులతో భావింపబడు సాధారణీకరణ వ్యాపారము రసచర్వణలో నతిముఖ్యమైనది. దీనినే భావానావ్యాపారమని యందురు. భావానావ్యాపారవశమున ప్రమేయాభిన్నముగా ప్రమాత వ్యవహరించగల్గుచున్నా డని విశ్వనాథుడు విశదీకరించినాడు. ప్రమేయములు పరిదృశ్యమానములు కాగానే మనస్సు ఉద్దీపింపబడి హృదయసంవాదము కల్గుచున్నది. భావానాసమున్మిషితమైన హృదయసంవాదమున చిత్తవిస్తృతి కలదు. తద్ద్వారా కవి సామాజికులు ప్రయమేయాంతర్వర్తు లగుచున్నారు. ఈ వ్యాపారమున ప్రమేయనిష్ఠమైన భావము (అర్థము) మనస్సు నావేశించి తత్సంవలిత మగుచున్నది. ప్రమేయనిష్ఠమగు భావము చిత్తము నావహించుటచే చిత్తము ద్రవావస్థ నందగా రసచర్వణ నిష్పన్న మగుచున్నది.
6. ప్రమేయున అనుస్యూతముగా కన్పించు తత్త్వము ప్రమాతృ సంబంధి యగుటచే కవి సామాజికులు ప్రమేయమును రసబుద్ధితో గ్రహింపగలుగుచున్నారు. ప్రతి వ్యక్తి యొక్క స్వభావమున బాహ్యజగత్తుతో అనన్యత్వసంబంధము ననుభవించు అవకాశము లేక లక్షణము కలదు. ఆత్మాభిన్న ముగా బాహ్యజగత్తు గ్రహింపబడునపుడే ఈ అనన్యత్వము సిద్ధించుటచే సౌందర్య దర్శనావసరమున చిత్తసంవాదరూప మగు అనుభూతి కల్గుచున్నది. భావనానుప్రాణిత మగు చిత్తసంవాదము రసప్రపంచమును విశదముగా స్ఫుటముగా భాసింపజేయుచు, ఆత్మాభిన్నముగా ప్రమేయజాలమును కన్నింపజేయుచున్నది.
వ్యుత్పత్తి, అభ్యాసము అనువానిద్వారా నిష్ప్నమగు చిత్తసంవాదము సహృదయమున కుండు ముఖ్యలక్షణము. ఈ సహృదయుడు రసచర్వణయందు సౌందర్యమును దర్శించును. తత్త్వాభివ్యంజకములలో నిట్టి సౌందర్యము ప్రముఖమైనది. తన నిజస్వరూపము నాత్మ యనుభవించ గల విషయములలో సౌందర్య మొకటి యని ''లార్డ్ హాల్దేన్ '' పలికినాడు. పారమార్ధికాత్మావలోకనము సౌందర్యానుభూతిలో గలదని భావము. సౌందర్యప్రతీతిలో నిరుపహిత మనుఆత్మయొక్క స్వరూపస్వభావములు చిత్తసంవాద వశమున అవగతము లగుచున్నవి. కవి, నట పాఠక సామాజికుల కీ చిత్తసంవాదము లేనిదే రసప్రతీతి కలుగునేరదు. వాసన లనబడు సంస్కారములవలన ప్రమేయులయందు ఆత్మానుప్రవేశము కలుగుటయే చిత్తసంవాదముయొక్క లక్ష్యము.
గుణాలంకారాదియుతమై మనోహరశబ్దార్థమును కలిగిన కావ్యములో సౌందర్యమనబడు రస మనుస్యూతముగా కలదు. ఇట్టి కావ్యమును సమీపించగా చిత్తము ద్రవావస్థ నందుచున్నది. అప్పుడు తద్వ్యక్తితో క్రమక్రమముగా సంభవించు పరిణామవశమున చిత్తవిస్తారము, చిత్తవికాసము రాగలవు. హృదయసంవాదవశమున నిమగ్నాకారక మగు చిత్తవృత్తి కలుగును. ప్రమేయమున చిత్తవృత్తి మగ్నము కాగా ప్రమాతృప్రమేయములకు గల వ్యావహారిక వైలక్షణ్యము సమసిపోయి అనన్యత్వము వచ్చుచున్నది. ప్రమాతృ ప్రమేయములను సమన్వయింప జాలి, విశ్రాంతిలక్షణ అక్షితమైన అనుభూతి ప్రమాతకు కల్గుచున్నది. ఇట్టి అనుభూతికి గల ఆక్రోశ##మే కావ్యరచనకు, కావ్యానుశీలనమునకు హేతువు. స్వాత్మావేశవశమున సిద్ధించు రసచర్వణతో నీ యాక్రోశము సఫలమగును. ఆక్రోశ మున్నంతవరకు అనుభూతిలో గల వివిధవిషయములకు సమన్వయము కుదరదు. సమన్వయము సిద్ధించగా విశ్రాంతిలక్షణోపేతమైన అనుభూతి వచ్చుచున్నది. ఈవిశాంత్రిచే లక్షితమగు అనుభూతిలో ప్రవృత్తి నశించుట లేదు.
ఈ యనుభూతి కేవల మానందమయమని, సర్వరసములకు నానందరూపత్వము కలదని అభినవగుప్తుడు చెప్పినాడు. తర్వాతి ఆలంకారికు లనేకు లీ వాదమును విమర్శించకుండా స్వీకరించి యున్నారు. ఐనను రసప్రతీతిలో కేవల మానందమే కలదా? అనుప్రశ్నను వివేచించవలసి యున్నది. దుఃఖాదిభావములచే నస్పృష్టమైన దీయనుభూతియని చెప్పుట సాహసమాత్రము.
రసప్రతీతిలో వివిధ విషయములు సమన్వితములై యున్నవి. ఈవిషయముల కన్యోన్యసంబంధము కలదు. రసమున కంగములుగా వర్తించు నీవిషయములకు తత్తదుచిత స్వభావములు కలవు. ఇందు కొన్ని విషయములు సుఖహేతుకములు గాకున్నను, సుఖపరిపోషకములు గావచ్చును. అంగియగు రసమునగల అంగములలో నొకటిగా దుఃఖమున్నప్పుడు రసప్రతీతిలో దుఃఖప్రతీతి యున్నదా ? లేదా ? భిన్నా కారము లతో రసప్రతీతి కన్పించుటలేదు. అంగములయొక్క అన్యోన్యసంబంధబలమున అంగి సిద్ధించినను, అంగములసముదాయము కన్న విశిష్టమైన శక్తి స్వభావములు అంగియందు కలవనుట నిర్వివాదాంశము. దుఃఖమొక అంగముగా నున్నను తద్భిన్న మగు అంగియం దీ దుఃఖము దుఃఖముగా ప్రతీయమానము కాదని చెప్పవలెను. కాని అంగియొక్క స్వభావము అంగములలో ననువృత్తముగా లేనిచో అవి అంగములు కాజాలవు. ప్రతిఅంగము అంగియందు పర్యవసితము కావలెను. భావనా నమున్మిషితమైన రసప్రతీతి అర్థవంత మైనది. అర్థవంతమగు రూపముతో నన్వితమైనది యని చెప్పినాము. ఇచట ప్రమాతృ ప్రమేయముల కభేదము కలదనికూడ వివరించి నాము. నిరపేక్షభావనతోనున్న ఈ రసప్రతీతిలో సర్వసామాన్యముగా అనుభూతమగు దుఃఖము కన్పించదనుట సాహస వాక్యము.
విషాదాన్వితమగు గర్భసంధి నవలోకించునపుడు పాత్రలనుభవించు దుఃఖము మనప్రతీతిలో గలదు. కరుణరస పూర్ణములగు రూపకములలో సుఖము ప్రతీయమాన మగుట వాస్తవమే. దుఃఖప్రతీతియే యున్నచో కరుణరసప్రతీతి కెవడును ఉన్ముఖుడు కాజాలడు. ఇచట సుఖదుఃఖములు రెండును ప్రతీయమానము లగుచున్నవని చెప్పవలెను. ఇట్టిచో నీ రెంటికి గల సంబంధము వివేచనార్హము.
రసప్రతీతిలో విభిన్నాంగములు కలవని, రసము అంగియని, విభిన్నాంగములకుగల అన్యోన్యసంబంధమువలన రసము ప్రతీయమాన మగుచున్నదని, విభిన్నాంగముల ప్రతీతి లేకుండా రసప్రతీతి లేదని, ఈ అంగములు అంగి యను రసమున పర్యవసితములై రసమున నంతర్యామిగా గలిగియున్నవని చెప్పియున్నాము. భావనావశమున నీ యంగములు రసమున పర్యవసితము లగుచున్నవి. భావనావ్యాపారము నిరపేక్ష మగుటచే లౌకికవ్యవహారముకంటె విలక్షణమైనది విభావాదులు అలౌకిక విభావనా వ్యాపారవశమున లౌకికవిలక్షణములుగా కావ్య నాట్యములలో ప్రతీయమానము లగుచున్నవి. కావున సకలమైన విభావాది వస్తుజాతము కావ్యమున సుఖసమర్పక మగు చున్నదని విశ్వనాథుని వాదము. ప్రయోగించుటకు అరమణీ యములగు పదార్థములు సహితము అలౌకికాహ్లాదము నిచ్చుటయే లోకోత్తరమగు కావ్యవ్యాపార మహిమయని నవ్యులు చెప్పుచున్నారని జగన్నాథుడు పలికినాడు. కాని మానవజీవితములో నతిముఖ్యమైనదగు దుఃఖము ఈయలౌకి కానుభూతిలో లేనిచో ని ది మానవజీవితమును చిత్రించునది కాని, మానవుల అనుభూతిని చూపునదికాని, కాజాలదు. దుఃఖప్రతీతి వలననే మానవజీవిత మర్థవంత మగుచున్నది. పైగా దుఃఖాసంభిన్నమగు సుఖము మరుమరీచిక వంటిది.
మనవజీవితము సుఖ దుఃఖ సమ్మితమని మొదటి అధ్యాయమున భరతుడు చెప్పియున్నాడు. సుఖదుఃఖములు ఏకరూపమున ఒకే యనుభూతిలో భాసింపగలవు. సుఖములో దుఃఖము, దుఃఖములో సుఖము కలవు. ప్రమేయముల నవలోకించుటవలన మనోవృత్తులు బయలుదేరుచున్నవి. ఇందు ప్రమేయములను తనలోనికి సంవలితములుగా చేసికొనుచు మనస్సు తన స్వరూపమగు సత్త్వమును విషయముల కాపాదించుచున్నది. ఈ సత్త్వమున రజస్తమస్సులు అంగములుగా కలవు. రజస్తమోగుణములలో దుఃఖ మంతర్లీనముగా నున్నది. ద్రవీభూతమైన చిత్తము, సత్త్వమయ మగుటచేతను, సత్త్వరూపమైనది సత్త్వగుణ మగుటచేతను, సమస్తభావములు రజస్తమాంశ మిశ్రణతో సుఖమయము లగుటచేతను, సమస్తరసములయందు తుల్యసుఖానుభూతి కలదని చెప్ప రాదని భగవద్భక్తిరసాయనకారుడు ప్రవంచించినాడు. రసములలో గల సుఖానుభూతులయందు తరతమభేదము నంగీకరించవలెను. విప్రలంభశృంగార ప్రతీతిలో సుఖానుభూతి అతిస్వల్పమని రసకలికాకారుడు చెప్పుచున్నాడు. సుఖదుఃఖావస్థారూపములు రసములని శృంగారప్రకాశకారుడు. రసము సుఖదుఃఖాత్మక మని నాట్యదర్పణకారుడు గూడ చెప్పుచున్నారు. విషాద నాటకములలో కన్పించు ఆధ్యాత్మికప్రభ్రంశము కూడ ఈ సిద్ధాంతమునే స్థిరపరచ గలదని 'బ్రాడ్లే' యొక్క సమీక్షయందు గాననగును. ఈ సిద్ధాంతము నంగీకరించిననే శోక, క్రోధ, భయాదులకు రసత్వము సిద్ధించగలదని మధుసూదన సరత్వతి చెప్పుచున్నాడు.
కాని రసప్రతీతిలోగల దుఃఖనుభూతి మనలను విషాదమున ముంచలేదు. సుఖము ఆత్మ స్వరూపమని, ఆత్మస్వరూపమనగా రసమని, సామాజికుడు సుఖవ్యంజికయగు వృత్తి ద్వారా తదనుభూతిని పొందుచున్నాడని, సుఖస్వరూపమగు ఆత్మ దుఃఖమున కాధారము కాజాలదని, మధుసూదన సరస్వతి పలుకుచున్నాడు. సత్త్వముచే మనస్సు పూర్తిగా విష్టమైనచో కేవలము సత్త్వవృత్తియే రసావస్థ నభివ్యక్తము చేయు గలుగును. సాత్త్వికమైన మనస్సు ఉత్తమసుఖమును ఆవశ్య మభివ్యక్తపరచును. ఇట్టి అభివ్యక్తియే రసమనెదరు. కాని సమగ్రమగు సత్త్వావస్థ రానంతవరకు రజస్తమోగుణములుండక తప్పవు. కాని సుఖదుఃఖాదిహేతువులు బోధ్యనిష్ఠము లైనను బోద్ధృనిష్ఠము లైనపుడు సుఖామాత్రైక హేతువులే యగుచున్నవి. రసప్రతీతిలో దుఃఖాసంభిన్నమగు సుఖమే అనుభూయమాన మగుచున్నదని చెప్పునపు డీ సుఖమునకు జ్ఞానమని అర్థము చెప్పికొనవలెను.
7. ఆహార్యాభినయ ప్రకరణమున అభినవగుప్తు డిట్లని నాడు ''యథా పరమాత్మా స్వచైతన్య ప్రకాశ మత్యజన్నపి దేహకంచుకోచిత చిత్తవృత్తి రూషిత మివ స్వరూప మాదర్శయాతి, తథా నటో7పి ఆత్మావష్టంభ మత్యజ న్నేవ లయతా లాద్యనుసరణయోగా ద్దేహస్థానీయే నర్తనాదివేషపరివర్తనే తదుచిత స్వభావాలింగిత మివ స్వాత్మానం సామాజికా೯ ప్రతి దర్శయతి .'' స్వచైతన్యప్రకాశమును వదలివేయకుండా పరమాత్మ జీవుడుగా భాసించుట గలదు. కాని జీవత్వము నందగా ఆయా దేహకంచుకోచితములగు చిత్తవృత్తులచే నుపహితుడగుచున్నాడు. ఐనను నిజచైతన్యప్రకాశము తిరోగమించుటలేదు. ఇట్లే నటుడు గూడ నిజస్వభావాదికమును రంగస్థలమున కోల్పోవుటలేదు. లయ తాలాద్యనుసరణ యోగమున నర్తనాది వేష పరివర్తనములతో, ఆయా వేషములకు తగిన స్వభావములతో సామాజికులకు కన్పించుచున్నాడు. అనగా నటుడొక పాత్రతో నభేదము ననుభవించుచున్నా డనునపుడు విశేష మొకటి గలదు. నటునకు కలుగు హృదయసంవాద మాత్మవిస్తృతిని, ఆత్మవికాసమును చేకూర్చ జాలినది. ఈ ఆత్మవిస్తృతిలో ప్రమేయములతో నభేదప్రతిపత్తి కలదనగా ప్రమేయములం దంతర్లీనములు, అంతర్భూతములు నగుచున్న వని తాత్పర్యము. ఇట్లు తనలో ప్రమేయ మంతర్లీనమై, చైతన్యాకారమున భాసించుచున్నదను జ్ఞానము కలుగుటయే నటునకుగల సాధారణీకరణము. నటునకు ఆయాపాత్రలకు ఎట్టి సంబంధమును చెప్పితిమో అట్టి సంబంధమే సామాజికునకు నటునకు గలదు. కాగా దుష్యంతాది పాత్రలు, నటులు, సామాజికులు అనువారలయం దొకరిలో నితరు లంతర్లీనులై భాసించుటయే ఇచట కన్చించు అభేదప్రతిపత్తి. దీనినే సాధారణీకరణమని వ్యవహరించితిమి. ఈరీతిగా సిద్ధమగు రసప్రతీతిని సమ్యగ్ జ్ఞానమని యెంచక తప్పదు.
8. రసచర్వణ, భక్తిభావనలోగల తన్మయీభవనము, బ్రహ్మాస్వాదము అను మూడింటిలోను కొంత సామ్యము కన్పించుటచే వీటికిగల అన్యోన్యసంబంధమును విచారించవలసి యున్నది.
''నత్త్వోద్రేకము వలన అఖండ స్వప్రాకాశానంద చిన్మయము, వేద్యాంతర స్పర్శశూన్యము, బ్రహ్మాస్వాదసహూదరము, లోకోత్తర చమత్కార ప్రాణమునగు రసము స్వాకారాభిన్నముగా నాస్వాదింప బడుచున్నది. '' అని విశ్వనాథుడు చెప్పియున్నాడు. రజస్తమోగుణములచే నస్పృష్టమగు మనస్సును సత్త్వమని యందురు. సత్త్వమయమగు మనస్సునకు ఆత్మకు భేదములేదు. ఈఆత్మను సంవిత్ అని, చైతన్యమని వ్యవహరించినాము.
రసప్రతీతియందు ప్రమేయావభాసకన్న సంవిత్స్వభావాభివ్యక్తియే ప్రధానమైనది. దేశకాలాద్యుపాధిరహితముగా భాసించు ఆత్మ రసచర్వణలో సర్వానుగ్రాహక మగుచు విస్తరవికాసముల నందుచున్నది. ఆత్మవికాసమున అనుభూతి విశదమగుచున్నది. ఈ విశదీకరణయందు ఇద మనిదం రూప చైతన్య మనుభూత మగుటచే ప్రమాతృప్రమేయముల కభేద ప్రతిపత్తి కలదని చెప్పవలెను. ఈ యనుభూతి బ్రహ్మానుభూతి వంటిదని సిద్ధమగుచున్నది. ఇందు సంవిన్నిజరూపము సౌందర్యముగా భాసించుచున్నది.
సంవేదనమున విభిన్నవిషయముల కేక త్రానుసంధానము కల్గుటచేతను, సంవేదనరహితమగు అనుభూతి లేకపోవుట చేతను, ప్రతి యనుభూతియందును సంవిత్ ఆధారభూతముగా కలదని చెప్పవలెను. విభిన్నవిషయముల సంవిదధీనము లగుటచే సంవిత్సంవలితములై భాసించుచున్నవి. ఈవిధముగా సంవిత్సూత్రమున సిద్ధమగుసమన్వయము ప్రతి యనుభూతి లోను లక్ష్యముగా కన్పించుచున్నది. ప్రకాశానందచిన్మయమగు సంవిత్ స్వతఃసిద్ధమైనది. కావున ''అద్వితీయమగు ప్రకాశము స్వతంత్రము, స్వతఃసిద్ధము. స్వాతంత్ర్యవశమున నీప్రకాశము దేశకాలాకారము లనబడు అవచ్ఛేదములతో నుండదు. సర్వవ్యాపకమై నిత్యమై, సర్వాకార నిరాకార స్వభావమైన దీప్రకాశము'' అని తంత్రసారమున అభినవగుప్తుడు పలికినాడు. ఈవిధమగు సంవిదనుభూతియే ఉత్తమమైనది. దీనికి మించిన అనుభూతి లేదు. దేశకాలాకారావచ్ఛన్నమగు వ్యక్తికి, తదనవచ్ఛన్నమగు నీ ప్రకాశమునకు నుపాధిభేదమే కన్పించునుగాని పారమార్థికభేదము లేదు. ఈ యభేదము భావశూన్యమగు అభేదము కాదుగనకనే ఇచ్ఛా క్రియా జ్ఞాన సంవలితముగా నీసంవిత్ భాసించునని చెప్పబడినది. ''ప్రకాశమనబడు సంవిత్ అభివ్యక్తముచేయు స్వాతంత్ర్య మానందశక్తి, తచ్చమత్కార మిచ్ఛాశక్తి, ప్రకాశరూపత చిచ్ఛక్తి,ఆమర్శాత్మకత జ్ఞానశక్తి, సర్వాకారయోగిత్వము క్రియాశక్తి '' అని తంత్రసారమున నభినవగుప్తుడు వివరించినాడు. స్వాతంత్ర్యము, అధ్యక్షత్వము, అంతర్యామిత్వము, స్వసంవిత్సంవేదనత్వము, సర్వానుగ్రాహకత్వము అనువాటిచే తెలియబడు పారమార్థికతత్త్వము క్రమముగా ఆనందము, ఇచ్ఛా, చిత్, జ్ఞానము, క్రియా అను ఐదు శక్తులద్వారా భాసించుచున్నది. శివాద్వాయదర్శనక ర్తయగు సోమానందనాథుడు ఇచ్ఛా, జ్ఞాన క్రియాశక్తులనే గ్రహించినాడు.
అభినవగుప్తు డీ శివాద్వయదర్శనము ననుసరించి రసప్రతీతిని వ్యాఖ్యానించినాడు. ఈదర్శనమున రసప్రతీతికి బ్రహ్మానుభూతికి అభేదము చెప్పబడజాలదు. కానిరెంటికి విశేషసాదృశ్యము కలదని మాత్ర మీదర్శన మంగీకరించగలదు. బ్రహ్మశబ్దదమిచిట శివపరముగా గ్రహించబడుచున్నది.
బ్రహ్మానుభూతియందు ఆనందము, ఇచ్ఛా, చిత్, జ్ఞానము, క్రియా అను శక్తులను సమన్వయము కుదురుచున్నది. ఇచ్ఛా క్రియా శక్తులు తిరోహితము లైనగాని రసప్రతీతి కలుగజాలదని అభినవగుప్తుని వ్యాఖ్యలో కన్పించుటచే రసాస్వాదమసమగ్రమైనదని చెప్పవలెను. అందుచే రసాస్వాదమును బ్రహ్మాస్వాద సహూదరమని అభినవగుప్తుడు పలికినాడు. పైకారణములను వివేచించక ఈ సిద్ధాంతమును తర్వాతిసాహిత్య సమీక్షకు లంగీకరించినారు. భట్టనాయ కాభినవగుప్తుల వాదములను చక్కగా వవలోకించి, శివాద్వయదర్శనములోని గుణదోషములను విచారించి, సంప్రదాయసిద్ధమగు శాంకర వేదాంతమున కనుగుణముగా రసచర్వణను వివేచించిన జగన్నాథు డొక్కడే బ్రహ్మాస్వాద సహూదరత్వమును రసప్రతీతికి అంగీకరించలేదు.
రసపరిపోషముచేయు నటాదిసామగ్రి రససాక్షాత్కారమునకుపకరించును. ఈ సాక్షాత్కారము దేశకాల ప్రమాత్రాది నియంత్రిత మైనదికాదు. హృదయసంవాదవశమున కలుగుసాధారణీభావమున దేశకాల ప్రమాత్ర నియంత్రితమగు రసము ప్రతీయమాన మగుచున్నది. ఈసాధారణీభావమున కలుగు అద్భుత భోగాత్మ స్పందావేశమును చమత్కారమని, లోకోత్తరాహ్లాడ మని యందురు. భయోత్సాహ క్రోధ శోకాదులను సమన్వయింప జాలిన ఈ యద్భుత సంవేదనమున విశ్రాంతిలక్షణలక్షితమగు భోగావేశము కలదు. ఈవిధమగు అనుభూతి స్వయంసిద్ధమగు, స్వయంపోషకము నగుటచే లోకోత్తరమని, నిత్యమని, అబాధ్యమని చెప్పబడుచున్నది. ఇది మిథ్యగాని, భ్రమగాని, అనిర్వచనీయముగాని, ఆరోపాధ్యవసాయాది రూపముగాగాని గ్రహింపబడరాదు.
ఇక భక్తిపూర్వకమగు సగుణశ్వరప్రతీతిని గమనింతము. ఇచట పరిచ్ఛిన్నమగు వ్యక్తికి. తత్ర్పమేయమగు సగుణశ్వరునకు సంబంధము కలదు. ప్రమాతృప్రమేయముల కిచటగూడ నవినాభావసంబంధము కలదు. ప్రమేయముగా భాసించుటచేతను, సగుణశ్వరుడు పరిచ్ఛిన్నవ్యక్తి యగుచున్నాడు. కాని భక్తిసమానిష్టుడగు మానవు డీశ్వరుని అపరిచ్ఛిన్నుడని యెంచుచున్నాడు. భక్తిభావనలో నీ ప్రమాతృ ప్రమేయములకు సమగ్రమగు అనన్యత్వమే ఉద్దిష్టార్థ విషయము. కాని ఈ అనన్యత్వమున సమవాయాది సంబంధములు నిరస్తములు కాగలవు. అట్టిచో భక్తి భావన కతీతమగు ప్రవృత్తి, ప్రతీతి కన్పించగలవు.
ఇదేవిధమగు ప్రవృత్తి కావ్యజగమునకూడ కన్పించుచున్నది. కావ్యానుభూతిలో ప్రమేయములు స్వతఃసిద్ధములుగా భాసించక, అన్యోన్యసంబంధములు కలవిగా ప్రతీయమానము లగుచున్నవి. ప్రమాతలో నంతర్లీనముగా ఉండి, అభివ్యక్త మగుచు సమగ్రత్వమునుంద సంవిత్స్వభావమే బాహ్యప్రమేయములయందు కన్పించుటచే, సంచార్యాదిక మగు సంవేదనము బాహ్యజగన్నిష్ఠముగా అనుభూయ మానమగుచున్నది. కీచకరంధ్ర భాగములు గాలిచే పూరింపబడునపుడు కలుగు ఆక్రోశమును తీసికొందము. సమీరణ మాక్రోశించుచున్నదని కవి పల్కుచున్నాడు. ఈ యాక్రోశము వాస్తవికము కాదని, కవి యొక్క ఊహయని యెంచుటకు వీలులేదు. వాయువు యొక్క నిజస్వభావ మనేకవిధములుగా అనేకులకు భాసించుచున్నది. ఈ యవభావసనము లన్నియు కలసిననే వాయువుయొక్క నిజస్వభావమును పూర్తిగా వ్యక్తము కాగలదు. సామాన్యానుభవమున వాయుస్వభావములలో నొక అంశము మాత్రమే కన్పించుచున్నది. భౌతిక రసాయనాది శాస్త్రములు మరికొన్ని అంశములను గ్రహించుచున్నవి. సామాన్యముగా అవలోకించ బడనటువంటి అంశము కావ్యభావనలో గ్రహించబడుచున్నది. భౌతిక రసాయనాది శాస్త్రములకు వాయుగతమగు నాక్రోశమసత్యముగా కన్పించువచ్చును. కాని ఈ యాక్రోశము సంవేదన మగుటచే కవియొక్క ఊహ కాజాలదు. ప్రతిభాశాలియగు కవి భావానావశమున సమీరణనిష్ఠమగు ఆక్రోశమును గ్రహించ గలుగుచున్నాడు.
సమీరణనిష్ఠముగా ఆక్రోశము కావ్యానుభూతి యందు భాసించుచున్నది. కాని ఈ ఆక్రోశము మన బుద్ధిని తృప్తిపరచ లేకున్నది. వాయువునకు ఏవిధమగు సంబంధమెట్లు కలుగుచున్నదో సమగ్రముగా తెలిసినగాని మన తార్కికబుద్ధికి సంతృప్తికలుగదు. అందుచే బుద్ధిద్వారా ప్రమేయములను విశ్లేషించి చివరకు ప్రతివస్తువునందు ద్రవ్యత్వము, క్రియాత్వము మూలభూతములుగా గలవని చెప్పుచున్నాము. కాని అమూర్తమగు ద్రవ్యముగా గాని, సంచలనరూపముగా గాని మన యనుభూతిలో ఏవస్తువునకు అనుప్రవేశము లేదు. భావరూప సంయోజనముతో, భావాభివ్యక్తి కుపరించునట్లుగా వస్తువు ప్రతీతిలో కన్పించుచున్నది. తార్కికబుద్ధి ననుసరించితిమేని వస్తువునకు వస్తుత్వమే నిలువదు. ఈ సంశయావస్థ అనుభవవిరుద్ధ మైనది. సంవిత్సంవేదన మీ సంశయా వస్థతో తృప్తిపడజాలదు గనుక సర్వదా మనము సంసర్గానవగాహి యగు అనుభూతులయందే పురుషార్థములు గలవని చెప్పగలుగుచున్నాము. ఏవంవిధమగు ప్రతీతి అపరోక్షాను భూతియని, నిర్వికల్పకప్రత్యక్షమని చెప్పబడుచున్నది. దీనినే సౌందర్యమని, సత్యధర్మము లీసౌందర్యరూపములని ''వైట్ హెడ్'' చెప్పినాడు. భక్తిభావనలో ఆత్మవిశ్రాంతి రూపము అభేద ప్రతి పత్తిపూర్వకమునగు అపరోక్షానుభూతి కన్పించక పోవుటచే సౌందర్యభావన కుత్సుకుల మగుచున్నాము.
వస్తురూపములతో సంతృప్తి కావ్యభావనయందుగాని భక్తిభావనయందుగాని కన్పించుటలేదు. ప్రత్యక్షముగా కన్పించు వస్తువుల కింద్రియ గ్రాహ్యత్వమును మాత్రమే స్వీకరించక వీటిని సంవిదధీనములుగా నీ రెండు భావనలయందు గ్రహించుచున్నాము. ఈ ప్రవృత్తిలో సర్వానుగ్రహకు డగు ఈశ్వరునియందు భక్తిభావనలో మనస్సు లగ్నమగుచున్నది. తద్ద్వారా ప్రతివస్తువు పరమేశ్వరుని అభివ్యక్తము చేయుచు న్నట్లు గైకొనబడుచున్నది. కాని కావ్య భావనలో నిట్టి అద్వితీయ మగు పారిమార్ధిక తత్త్వముపై మనస్సు లగ్నము కానక్కరలేదని, బాహ్యరూపమున కతీతమగు భావముద్వారా వస్తుస్వరూపము వ్యాఖ్యానించబడుచున్నదని , ఇందుచే భక్తిభావనయే కావ్యభావనకన్న మిన్నయని ''ఎ. సి. బ్రాడ్లే '' చెప్పుచున్నాడు.
కాని కేవలము వస్తుస్వరూపనిష్ఠమగు భావముద్వారా రూపమును వ్యాఖ్యానించుట మహాకావ్యములలో కన్పించుట లేదు. స్వగత పరతత్వాది నియమ రహితుడై దేశకాలాద్యుపాధులచే నని యంత్రితుడై మహాకవి భావనద్వారా పరామార్ధికతత్త్వమునే దర్శించుచున్నాడు. ఈ పారమార్థిక తత్త్వము వస్తువులలో అంతర్యామిగాగల వని, తద్వశమున సౌందర్యాభిక్యక్తి కలుగుచున్న దని కావ్యభావములో కప్పించుటచే భక్తిభావన దీనికన్న మిన్నయనుట ప్రామాదిక మేమో అని అనిపించగలదు. రసప్రతీతిలో గల సంవిత్సంలేదనమున నీ అంతర్యామియే ప్రతీయమాన మగుచున్న దని విస్మరించరాదు.
భక్తిభావన ఉదాసీనబుద్ధితోపరిత్యజించుకొన్ని విషయముల పైకావ్యభావనకు ఔదాసీన్యము లేదని ''ఏ. సి. బ్రాడ్లే '' చెప్పుచున్నాడు. సంచార్యాది భావముల విన్యాసమున మహాకవులు చూపు అభిరుచి, వైదగ్ధ్యము భక్తిభావనలో కన్పడవని ఈ వాదసారాంశము. కాని మానవజాతికి వైశిష్ట్యము నాపాదించు సంచారి భావోద్దీపన లేని భక్తిభావన మానవ హృదయములను స్పదింపజేయ జాలదు. భక్తిభావనలో కలుగు తన్మయత్వములను వర్ణించు యోగులరచనలను గమనించితిమేని ''ఎ. సి. బ్రాడ్లే '' వాదము నిరస్తము కాగలదు.
కావ్యాస్వాదనమున భావనా వ్యాపార మతిప్రధానమైనది. రసప్రతీతికి భిన్నమైన లక్ష్యము భావనలో కన్పించదు.ఇచట భావనావ్యాపారము కేవల ముపకరణము గాక సాధ్యము కూడ నగుచున్నది. కాని భక్తి భావనలో భావనావ్యాపారమను సాధనముద్వారా సాధ్యమగు పరమేశ్వరుడు, ప్రతీతి యోగ్యు డగుచున్నాడు. భావనా సమున్మిషితుడైన పరమేశ్వరుడచట లక్ష్యమగు ప్రమేయము. రసప్రతీతిలో గల భావన ఇంద్రియగ్రాహ్యమగు శబ్దాదుల ద్వారా అభివ్యక్తమగుచున్నది. ఈ ఇంద్రియ గ్రాహ్యత్వము భక్తిభావన కతివిరుద్ధ మైన ''ఎ.సి. బ్రాడ్లే '' చెప్పుచున్నాడు. కాని యోగిప్రత్యక్షమున ఇంద్రియ గ్రాహ్యత్వము పూర్తిగా పరిత్యక్త మగుచున్నదా ?
భావనాసమున్మిషితము లగు రసభావములు భావనచే నుపజీవ్యము లగునవి ''భావనా పరిపోషమున కీ రసభావము లతిముఖ్యములు. అవిశ్రాంతి లక్షణ మగు ఇచ్ఛాశక్తికి విశ్రాంతి గొలుపు ఆరాధ్యవిషయము నన్వేషించుటగాని, తత్త్వాన్వేషణ సల్పుటగాని కావ్యమున కనవసరము. అందుచే లలితకళ లెంతమహత్తర భావాన్వితము లైనను, పురుషార్థములతో ప్రసక్తి లేకుండా విషయములను సృష్టించుచు, భావనావశమున విషయముల కన్యోన్యబంధములను కూర్చుచున్నవి. ఈ సంగతి నెరిగినకవులు భౌతిక రసాయనాది శాస్త్రములలో కన్పించు వస్తుసత్తాకత్వమునుగాని, దార్శనికు లంగీకరించు వస్తుసత్తాకత్వమును గాని, తమ విషయములకు గలదని చెప్పుటలేదు '' అని ''ఏ. సి, బ్రాడ్లే '' వాదించుచున్నాడు.
అపరిమితస్వేచ్ఛతో భావనవ్యాపారము ప్రవృత్తమగుచున్నదని ఈ వాదమున నంగీకరీంపబడుట శోచనీయము. అనుభూతిలోనున్న సంవిదధీనముగా భావనావ్యాపారము ప్రవర్తించగలదు. కాని అపరిమితస్వాతంత్ర్యముతో మాత్రము కాదని గ్రహించవలెను. కావ్యగత భావములు, యోగి ప్రత్యక్షమున గల భావములకూడ హృదయము, ఇచ్ఛా, భావన అను మూడింటికి సమన్వయము కుదిరినపుడే వచ్చుచున్నవి. ఈ సమన్వయమున ననుభూతములను భావములను లౌకికయోగ్యమగు స్థాయిత్వమును తీసికొనివచ్చుటకే మానవ ప్రయత్నము బయలుదేరుచున్నది. ఈ భావములను తాత్వికము లని గ్రహించి, వీటిపై శ్రద్దాభక్తులను నిలుప గలుగు చున్నాము. ఈ శ్రద్ధాభక్తులను భూతము లగు సమయమున నిది భావనాజనిత మగు స్థితియను జ్ఞానము వచ్చినచో నీ యనుభూతి క్రమక్రముగా తిరోహితమగుచున్నది. రసప్రతీతి యందు భక్తి ప్రతీతయందును గూడ బుద్ధి ఇచ్ఛ అనునవి భావనాంగములుగానే కన్పించుచున్నవని తాత్పర్యము. అతి తీక్ష యోగ సమాధిలోవలె మహత్తర రసప్రతీతిలో గూ సంవేదనమే కలదు. బుద్ధి ఇచ్ఛ అనునవి వాటి వాటి స్వరూప స్వభావములను కోల్పోవుచున్నవి. ఈ సంవేదనమున సంవిద్రూపముగా భావములు గలవు గనుక ఆత్మ, మనస్సు, హృదయ సంవిదాకారమున భాసించుచున్నవి. అందుచే కావ్య మొక ఉపహిత చైతన్య మని ఎచటనుండి కావ్యభావన వచ్చుచున్నదో మనకు తెలియ జాలదని మనము కొరుకొనినపుడీ భావన రాదని ఈ భావనావశమున కల్గు రసప్రతీతి యందు అనుపహితచైతన్య ప్రతీతి కలదని నిశ్చయింపవలెను.
Bhakthi Rasaayanamu Chapters Last Page