Sri Naradapuranam-3    Chapters    Last Page

వింశ్యోధ్యాయః = ఇరువదియవ అధ్యాయము

ధర్మాంగద దిగ్విజయః

వసిష్ఠ ఉవాచ: -


ఏవం సురత మూఢస్య రాజ్ఞో రుక్మాంగదస్య చ | త్రీణి పంచ చ వర్షాణి వ్యతీతాని సుఖేన వై || 1 ||
సంప్రాప్తే నవమే వర్షే పుత్రో ధర్మాంగదో బలీ | జిత్వా విద్యధరా న్పంచ మలయే పర్వతోత్తమే || 2 ||
ఆజహార మణీన్పంచ సర్వకామ ప్రదాన్శుభాన్‌ | ఏకం కాంచన దాతారం కోటి కోటి గుణం శుభమ్‌ || 3 ||
ద్వితీయం వస్త్ర భూషాది లక్షకోటి ప్రదం తధా | తృతీయ మమృతస్రావి పునర్యౌవన కారకమ్‌ || 4 ||
సభా గృహ ప్రకర్తారం చతుర్ధం చాన్న సాధకమ్‌ | పంచమం వ్యోమ గతిదం త్రైలోక్య పరిసర్పణమ్‌ || 5 ||
తాన్మణీ న్గృహ్య మనసా విద్యాధర సమన్వితః | స్త్రీ భి ర్విద్యాధ రాణాంచ సాశ్రునేత్రా భి రా వృతః || 6 ||
వవందే చరణౌ మాతుః పితూరుక్మాంగదస్య చ | మణీన్పంచ సమర్ప్యాథ్య పాదయోః ప్రాహ సంనతః || 7 ||
ఇమేజి తా మయ తాత పంచవిద్యాధరా రణ | మలయే భూధర శ్రేష్ఠే వైష్ణవా-స్త్రేణ భూపతే || 8 ||
ఇమే తే భృత్యతాం ప్రాప్తా సస్త్రీకా నృపసత్తమ | మణీ న్ప్రయ చ్ఛ మోహిన్యై భుజ భుషణ హేతవే || 9 ||
సర్వకామ ప్రదాహ్యతే పునర్యౌవన కారిణః | జీర్ణదంతాః పునర్భాలా భవంతి మణిధారణాత్‌ || 10 ||
వస్త్ర హర్మ్య సువర్ణానాం స్వర్గతే రమృతస్య చ | దాతారో సమా యుద్దేన సాధితా స్తవ తేజసా || 11 ||
సాధితాని మయా కృచ్ఛ్రా త్సప్త ద్వీపాని భూపతే | కరదాని సమస్తాని కృతాని తవతే జసా || 12 ||
సముద్రేచ ప్రవిష్టస్య గత స్సవంత్సరో మమ | జితా భోగవతీ తాత! మయా నగసమావృతా || 13 ||
ఆహృతా నాగకన్యాశ్చ మయా చాయుత సంఖ్యకాః | తత్రాపి హార రత్నాని సుబహూన్యా హృతాని చ || 14 ||
పునశ్చాహం గతస్తాత దానవానాం పురం మహత్‌ | తాన్నిర్జిత్య చ కన్యానాం సురూపాణాం సువర్చసామ్‌ || 15 ||
ఆహృతాని మయా త్రీణి సహస్రాణి చ పంచ చ | దశకోట్యస్తు రత్నానా ందీప కర్మిశాగమే || 16 ||

కుర్వతాం తే మహాపాల అనీతా స్తవ మందిరే | తతో
హం వారుణం లోకం రసాతల తలస్థితమ్‌ || 17 ||
గతో వీర్య బలోత్సిక్తస్త్వదంఘ్రియుగసేవకః | తత్రోక్తో వారుణో దేవః స్థీయతాం మత్పితుర్వశే || 18 ||
రుక్మాంగదస్య నృపతే ర్యది జీవితు మిచ్ఛసి | కుపితో మమ వాక్యేన వరుణో యోద్దు మాగతః || 19 ||
తేన సంవత్సరం యుద్దం ఘోరం జాతం రసాతలే| జితో నారాయణాస్త్రేణ మయా స జలనాయకః || 20 ||
న హతః ప్రమదావాక్యై స్తస్య జీవిత రక్షణ | నిర్జితే నా యుతం దత్తం వాజినాం వార రంహసామ్‌ || 21 ||
ఏకతశ్శ్యామ కర్ణానాం శుభ్రాణాం చన్ద్ర వర్చసామ్‌ | తృణతోయ విహీనా యే జీవంతి బహుశస్సమాః || 22 ||
ఏకాం కన్యాం సురూపాం మే పురస్కృత్య స్వలం కృతామ్‌ | భార్యర్థే వరుణః ప్రాదాత్‌ సాప్యానీతా మయా శుభా || 23 ||
కుమారీతు సమానీ తా బహు విత్త సమన్వితా | తన్నాస్తి త్రిషు లోకేషు స్థానం తాత సుదర్గమం || 24 ||
యన్మయా నజితం వ్యాస్తి తవాంఘ్రి పరిసేవనాత్‌ | తదుత్తిష్ఠ పరీక్షస్వ త్వత్ప్ర సాదార్జితాం శ్రియమ్‌ || 25 ||
అహంచ సంపద స్సర్వా స్త్వదధీనా విశాంపతే| యుః పుత్రస్తాత వదతి మయా లక్ష్మీ స్సమర్జితా || 26 ||

నదేయా భూమిదేవేభ్య స్సో
పి వై నరకం వ్రజేత్‌ | ఆత్మ సంభావనం తాత ! న కర్తవ్యం సుతేన హి || 27 ||
కుఠార దాత్ర సదృశః పుత్ర స్సంవత్స ముచ్చయే | పితు శ్శౌర్యేణ పుత్రస్య వర్దతే ధన సంచయః || 28 ||
తైజసం దాత్ర మాదాయ లునాతి తృణ సంచయాన్‌ | వాయునా పూరితం వస్త్రం తారయే న్నౌగతం జలే || 29 ||
యధా దారుమయీ యోషా చేష్టతే కుహకేచ్ఛయా | తధాహి పితృవీర్యేణ పుత్రాస్తే జో బలాన్వితాః || 30 ||
తస్మాదియం మధవ దేవ వల్లభా విలోక యస్వాద్య మయో పనీతా |
ఆతేచ్ఛయా యచ్ఛతు రక్షతాద్వా స్వ సంపదో మాతృ సమూహ వర్యాః || 31 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే ధర్మాంగద దిగ్విజయో నామ వింశో
ధ్యాయః
వసిష్ఠ మహర్షి పలికెను:-
ఇట్లు సురతము నందు మోహితుడగు రుక్మాంగద మహారాజునకు ఎనిమిది సంవత్సరాలు సుఖముగా గడిచినవి. తొమ్మిదవ సంవత్సరమున బలవంతుడగు ధర్మాంగదుడు అయిదుగురు విద్యాధరులను మలయ పర్వతమున గెలిచి సర్వకామ ప్రదములు, శుభకరములు అగున యిదు మణులను తెచ్చెను. ఆ అయిదింటిలో ఒక మణి కోటి గుణమగు బంగారమును ఇచ్చునది. రెండవది లక్షకోట్ల వస్త్రములను ఇచ్చునది. మూడవది మరల ¸°వనమును ప్రసాదించు అమృతమును స్రవించునది. నాలుగవది అన్నసాధకము, సభా గృహప్రకర్త. అయిదవది మూడు లోకములను సంచరించు ఆకాశగమనమనుమును ప్రాదించునది. ధర్మాంగద మహారాజు ఆ మణులను విద్యాధరులను తీసుకొని కన్నీటితో విలపించుచున్న విద్యాధర స్త్రీలచే వెంబడించబడుచు వచ్చి, తండ్రియగు రుక్మాంగదునకు తల్లియగు మోహినకి ప్రణమిల్లి, అయిదు మణులను సమర్పించి, పాదాభివందనము నాచరించి ఇట్లు పలికెను. ఓ తండ్రీ నేను యుద్దమును మలయ పర్వతము నందు వైష్ణవాస్త్రముచే ఈ అయిదుగరు విద్యాధరులను గెలిచితిని. స్త్రీ జన పరివృతులగు ఈ విద్యాధరులు నీకు సేవకులైరి. ఈ అయిదు మణులను మోహనీ దేవికి భుజాలంకారములుగా సమర్పించుము. ఈ మణులు సర్వాభీష్ట ప్రదములు. పునర్యౌవనకారకములు. జీర్ణదంతులు మరల బాలులగుదురు. ఈ మణులు వస్త్ర హర్మ్య సువర్ణ స్వర్గ అమృత ప్రదములు. ఒక మాసము యుద్దము గావించి నీ పరాక్రమముచే నేను సంపాదించితిని. నీ యనుగ్రహము వలన నేను చాలా కష్టించి ఏడు ద్వీపములను సాధించితిని. అన్ని ద్వీపములు నీకు పన్ను చెల్లించునట్లు చేసితిని. నేను సముద్రమున ప్రవేశించి ఒక సంవత్సర కాలము యుద్దము చేసి నాగ సమావృతయగు భోగవతీ పురిని గెలిచితిని. పదివేల మంది నాగకన్యలను హరించితిని. అచట నుండి చాలా హారములను రత్నములను కొని తెచ్చితిని. అట నుండి దానవ పురములకు వెళ్ళితిని. అచట దానవులను జయించి రూపవతులు కాంతిమతులు అగు ఎనిమిది వేల మంది దానవ కన్యలను కొని తెచ్చితిని. రాత్రి పూట దీపములుగా పనిచేయు పదికోట్ల రత్నములను కొని వచ్చితిని. అట నుండి నేను రసాతలమున నున్న వారుణలోకమునకు వెళ్ళితిని. అచట వరుణదేవునితో నీవు జీవించదలచితివేని నా తండ్రియగు రుక్మాంగద మహారాజు అధీనములో నుండము. అని యంటిని. ఆ మాటలో వరుణుడు కోపించి యుద్దమునకు వచ్చెను. రసాతలమున వరుణునితో సంవత్సరకాలము ఘోర యుద్దము జరిగెను. చివరికి నేను నారయణాస్త్రముచే జల నాయకుని జయించితిని. స్త్రీల ప్రార్థనచే చంపకుంటిని. అంతట వరుణదేవుడు వాయువేగము గల పదివేల గుర్ఱములను శ్యామ కర్ణములు గల, శుభ్రములు, చంద్రకాంతి గల వాటిని గడ్డినీరు లేకనే చాల సంవత్సరములు బ్రతుక గల వాటిని కానుకగా ఇచ్చెను. ఒక చక్కని కన్యను చక్కగా అలంకరించి నాకు భార్యగా నుండుటకు బహూకరించెను. ఆమెను కూడా తీసుకొని వచ్చితిని. బహు విత్త సమన్వితముగా కన్యను తీసుకొని వచ్చితిని. బహు విత్త సమన్వితముగా కన్యను తీసుకొని వచ్చితని. ఓ తండ్రీ ! నాకు ఈ మూడు లోకములలో వెళ్ళజాలని స్థానము గెలవ శక్యము కాని ప్రదేశము నీ యను గ్రహము వలన ఒక్కటి కూడా లేదు. కావున నీ యనుగ్రహము వలన సంపాదించిన సంపదను ఒకసారి లేచి పరీక్షించుము. ఓ రాజా? నేను ఈ సంపదలు నీ వశములు. ఈ సంపదనంతా నేను సంపాదించితిని అని కాని, బ్రహ్మణులకు దానము చేయరాదు. అని కాని అను పుత్రుడు నరకమునకు వెళ్ళును. పుత్రుడు తనను తాను గౌరవించుకొనరాదు. సంపదను పెంచుటలో పుత్రుడు కుఠారము, దాత్రము వంటి సాధనము వంటివాడే. తండ్రి పరాక్రమముచేతనే పుత్రులు ధనరాశులు పెరుగును. కొడవలిని తీసుకొని గడ్డిని కోయుదురు. గాలి నిండిన వస్త్రము జలమున పడవను దాటించును. నడిపించు వాని ఇష్టము ననుసరించి చెక్కబొమ్మ ఆడును. అట్లే తండ్రి పరాక్రమముచే పుత్రులు తేజో బల సమన్వితులగుదురు. కావున నాచే కొనితేబడని ఈ సంపదలను ఒకసారి చూడుము. మీ ఇష్టానుసారముగా దానము చేయుడు. లేదా దాచుకొనుడు. అది యంతయూ మీ చిత్తము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున ధర్మాంగద దిగ్విజయ మను ఇరువదియవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page