Sri Bhagavatha kamudi    Chapters   

శ్రీభాగవకౌముది

1. వకిరణము

పరీక్షిన్నరేంద్రుని సన్నిధికి శుకయోగీంద్రుల

అగమనము. శౌనకాదులకు సూతునిబోధ.

పూర్వము ఒకప్పుడు పరమపవిత్రమైన నైమిశారణ్యమున శౌనకాది మహామునులు దీర్ఘ సత్త్రయాగమును ప్రారంభించి, వ్యాసానుగ్రహముచచే సర్వ పురాణసారమును, వాని తత్త్వమును తెలిసికొనిన సూతుని అధర్మ భూయిష్టం బైన యీ కలికాలములో మానవుడు తరించుటకు ఉత్తమ సాధనంబగు ధర్మమేది? అని యడుగగా సూతుడు శుకమహర్షిని ధ్యానించి ఇట్లు బోధించెను. ''మానవునికి మోక్షము నిచ్చు ఉత్తమధర్మము ఏది యనగా, దేనివలన భగవద్భక్తి కలుగునో అదియే పరమధర్మము. కేవల ధర్మము ఎంత బాగుగా అనుష్టింపబడినను. భగవద్భక్తిని కలుగ చేయని యెడల అది ధర్మమనబడదు. భగవద్భక్తిని కలిగించు ధర్మము వలన వైరాగ్యము, ఆత్మజ్ఞానము కలిగి మోక్షము లభించును. మానవుడు జన్మమెత్తి జీవించుటకు ముఖ్యఫలము ఆత్మజ్ఞానము కలిగి మోక్షమును పొందుటే. అట్టి మోక్షమును పొందుటకు సోపాన పరంపరగా నీక్రింది సాధనములను అనుష్టించవలెను భగవంతుని యెడ భక్తి లేకపోవుటకు కారణము పూర్వజన్మమున చేసిన పాపముల ఫలమే. అట్టి పాపములు పోగోట్టు కొనుటకై పుణ్యతీర్ధములలో స్నానము చేసి, ఆయా దేవతలను దర్శించుటకు క్షేత్ర యాత్రలను చేయవలయును. అట్టి క్షేత్రయాత్రల వలన పాప ఫలము నశించి, సత్పురుషుల సహవాసమునకు తోడ్పడును. అట్టి సహవాసము వలన ధర్మశ్రద్ధ కలిగి భగవతకథలయందు శ్రవణచ్ఛ కలుగును. దాని వలన భగవత్కధలయందు అభిరుచి కలిగి, నిత్యము వినుచుండుటచే భగవదనుగ్రహము కలిగి, కామక్రోధాదులు, రాగ ద్వేషాదులు నశించి నిశ్చలమైన భగవద్భక్తి కలుగును. అంతట చిత్తము సత్త్వగుణ ప్రధానము కాగా భగవత్తత్త్వవిజ్ఞానము కలుగును. దాని వలన ఆత్మసాక్షాత్కారమై మోక్షము లభించును. ఈ విధమున యీ సాధనములను అనుసరించిన యెడల మానవుడు మోక్షమును పొందును.''

ఆ తరువాత సచ్చిదానంద రూపమగు బ్రహ్మ వస్తువు ప్రకృతిలో కలిసి ఎట్లు వివిధ అవతారముల నెత్తి నది సూతుడు వివరించి ఆ భగవంతునికి అసంఖ్యాకములగు అవతారములున్నవనియు, వానిలో అంశావతారములు, అంశాంశావతారములు, ఆవేశావతారములు, పూర్ణావతారములు, పరిపూర్ణావతారములు యిట్లనేక విధము లున్నవని వివరించి, అన్ని అవతారములలోను కృష్ణావతారము ఉత్తమమైన, పరిపూర్ణతమమైన అవతారమనియు, కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేననియు వర్ణించెను.

అంతట శౌనకాదులు--''అట్టి పరిపూర్ణత మావతారమైన కృష్ణుని యొక్కయు, సాక్షాత్తు భగవంతుని యొక్కయు కధలను, భాగవతమును పురాణమందు వ్యాస మహామునీంద్రుడు వర్ణించి ఆత్మజ్ఞానియైన శుకుడను తన కుమారునికిబోధించెననియు మేమువినుచున్నాము. ఆ భాగవత కథా సారమును మాకు వినిపింపు''డని శ్రద్ధతో సూతుని ప్రార్ధించిరి. ఇంకను ¸°వనములోనుండి సర్వసంగముల సన్న్యసించి తిరుగుచున్న శుకుని చూచి దిగంబరలుగా స్నాన మాడుచున్న అస్పరసలు సిగ్గుపడలేదనియు, ముదుసలియై వస్త్రధారియై వచ్చుచున్న వ్యాసుని చూచి వారు సిగ్గపడి వస్త్రములను ధరించిరనియు, అంతట ఆ స్త్రీలను వ్యాసుడు ప్రశ్నింప, నీ కుమారుడైన శుకుడు స్త్రీ పురుష భేదజ్ఞానము లేని ఆత్మజ్ఞాని యనియు, అందు చేత మేము వస్త్రము ధరించ లేదనియు, నీ కట్టి భేదజ్ఞానము కలదు కనుక మేము వస్త్రములను ధరించితి మనియు ఆ స్త్రీలు జవాబు చెప్పిరని వినుచున్నాము. అట్టి సర్వాత్మ భావము గల శుకుడు, యెచటను గోదోహానకాల మాత్రం బేని నిలువని బ్రహ్మనిష్ఠుడు వారము దినములు పరీక్షిత్తుకు ఎట్లు ఒక్కచోట నిలచి బోధచేసెను? మహాచక్రవర్తియైన పరీక్షిత్తు చిన్న వయస్సులోనే ఆ మహారాజ్యలక్ష్మిని విడచి విరక్తుడైప్రాయోవేశము చేసెను? ఈ వైనములన్నియు మాకు తేట తెల్లముగా వివరింపుమని శౌనకాదులు సూతుని ప్రార్థించిరి. అంతట సూతుడు ''శౌనకాది మునీశ్వరులారా శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు బోధించి నపుడు నేను అచటనుండి భాగవతపురాణ సారమును గ్రహించితిని. నాకు తెలిసినంతవరకు మీకు విశదపరచెదను.'' అని పలికి తత్కధాకథనమున కుపక్రమించెను.

భాగవత రచనా నిమిత్తము

ద్వాపరయుగ చరమ భాగమున పరాశరునకు ఉపరి చరవసు వీర్యసంభూతయగు సత్యవతియందు విష్ణుదేవుని యంశమున కృష్ణద్వైపాయనుడు అను వ్యాసుడు జన్మించెను. అప్పటికి వేదములన్నియు ఒకే రాశిగా నుండుటచే, వానిని ఋగ్యజుస్సామాధర్వ నామములతో చతుర్విధములుగా విభజించి, వేదార్ధమును విశదీకరించు ఇతిహాస పురాణములను పంచమ వేదముగా రచించి, నాలుగు వేదములను తన శిష్యులైన పైల, జెమిని, వైశంపాయన, సుమంతులను నలుగురికి బోధించిన పంచమ వేదంబై, ఇతిహాస పురాణములను నా తండ్రియగు రోమహర్షునికి ప్రసాదించెను. నా తండ్రిగారి వలన నేను నేర్చికొంటిని. వేదాధ్యయనమునందు అధికారము లేని స్త్రీ, శూద్రులకు మహాభారతమును ఇతిహాసమును, పురాణములను వ్యాసుడు రచించెను. లోకక్షేమము కొఱకై యిట్టి గొప్పకృషిని చేసి వేదధర్మములను ప్రతిపాదించు గ్రంథములను రచించినను వ్యాసుని మనస్సునకు శాంతి కలుగకుండెను. అంతట నొక నాడు వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరమున కేగి తాను చేసిన కృత్యముల నన్నింటిని స్మరించి, ఇట్లు ఇన్ని మహా కార్యములు చేసినను నా మనస్సుకు ఏ కారణము చేతనో శాంతి కలుగకున్నది, అని తనలో తాను విచారించుచుండె, ఇట్లు విచారించుచున్న, వ్యాసుని కడకు దేవర్షియగు నారదుడేతెంచి, వ్యాసుడు చేసిన మహాకార్యముల నన్నిటిని ప్రశంసించి ''నీ వేల యిట్లు దుఃఖముతో నున్నావు?'' అని యడుగగా, వ్యాసుడు తాను ఇన్ని మహా కార్యములను చేసినను మనస్సునకు శాంతి కలుగక పోగా దుఃఖము కలుగుచున్నదనియు, దానికి కారణము తెలియుట లేదనియు. ఆ కారణమును తెలియచెప్పుమనియు దేవర్షియును, పరమభాగవతోత్తముడును అయిన నారదుని ప్రార్థించెను అంతట నారదుడు, ''ఓ వ్యాసా! నీవు యెన్ని గ్రంథములను రచించినను అవి యన్నియు ధర్మబోధకములే గాని, భగవద్భక్తి బోధకమైన గ్రంథ మొక్కటియును లేదు. భగవంతుని కథలను, లీలలను వర్ణించి, ప్రజలకు భగవద్భక్తిని కలిగించినగానీ నీకీ దుఃఖముపోదు. కావున నీవు భగవత్కథలను భగవంతుని యశమును ప్రధానముగా వర్ణించి, భగవద్భక్తిని ప్రజలలో కలిగించు దివ్వమైన భాగవతమను గ్రంథమును రచింపుము ఇంకను మహానుభావుడగు శ్రీకృష్ణుని లీలలను విస్తరించి చెప్పుము. అట్టి భాగవతమను గ్రంథమును రచించిన యెడల నీకు తప్పక మనశ్శాంతి కలుగును. ఈ దుఃఖము తొలగును. భగవద్గుణాను కీర్తనమే మనశ్శాంతికి ముఖ్య సాధనము.'' అని బోధించెను.

నారదుని పూర్వజన్మ వృత్తాంతము - భాగవత రచన

నారదుని బోధ వినిన తరువాత, వ్యాసుడు నారదుని పూర్వజన్మ వృత్తాంతమును తెలియకోరగా, నారదుడు తన వృత్తాంతము నిట్లు చెప్పెను. ''నేను పూర్వకల్పమునందు పూర్వజన్మలో వేదపండితుల ఇంటిలో పరిచర్య చేయు ఒక దాసీకుమారుడనుగా జన్మించితిని వర్షకాలమున చాతుర్మాన దీక్షలోనున్న యతీశ్వరులకు సేవచేయుచు, వారి భుక్తశేషమును భుజించుచు వారికి అన్ని విధముల పరి చర్యలు చేయుచుండగ, వారికి నాయందు అనుగ్రహము కలిగినది. వారు ఎల్లప్పుడు భగవత్కథలను, కృష్ణలీలలను చెప్పుకొనుచుండగా విను భాగ్యము కలిగినది. ఇట్లు వారిని సేవించుటచే నా పాపము లన్నియు నశించి, చిత్తశుద్ధి కలిగి భగవద్భజనమున ఆసక్తి కలిగి క్రమముగ భగవద్భక్తి కలిగెను. అంతట వారు నాకు పరమేశ్వర తత్త్వజ్ఞానము ఉపదేశించిరి. దాని వలన నేను భగవంతుని ప్రభావము తెలిసికొని, నేను చేయు సకల కర్మములను భగవంతునికి అర్పించి, అనన్యభక్తితో భగవంతుని సేవించుచుండగా భగవంతుడు నాకు ప్రసన్నుడై జ్ఞానైశ్వర్య భక్తియోగముల ననుగ్రహించెను. దాని వలన నాకు పరమశాంతి కలిగినది. నీవు అట్లే భగవద్భక్తి ప్రధానమగు గ్రంధమును రచించితివేని తప్పక మనశ్శాంతి కలుగు''నని చెప్పగా, వ్యాసుడు నారదుని తరువాతి చరిత్ర వినగోరేను.

అంతట నారదుడు- ''మునీంద్రా ! ఆ యతీశ్వరులు వెడలిపోయిన తరువాత నేను పరమవైరాగ్యముతో జ్ఞానమార్గమున జీవిత శేషమును గడపదలచినను, నా తల్లికి నేనొక్కడనే పుత్రుడనగుటచే, ఆమె మూఢురాలై నాయందు అమిత మమకారముకలది యగుటచేతను, నేను విడచివెళ్ళజాలక, ఐదు సంవత్సరములవయస్సు గల ఆమెను ఆమెను విడచివెళ్ళుట ధర్మముకాదని తలంచి, ఆమె సేవచేయుచు ఆ బ్రాహ్మణుని ఇంటియందే సేవచేయుచున్న మాతల్లి యొద్దనేయుంటిని. ఇట్లుండ నొకనాడు రాత్రి నాతల్లి ఆవుపాలను పిదుకుటకు పోగా అచటనొక పాము నేను కరచినది. అంతట ఆమెప్రాణము విడచినది. ఇట్లు ఆమె మరణము భగవంతుని అనుగ్రహమేనని సంతోషించి, ఉత్తర దిక్కుగా సంచరించుచు భగవంతుని ధ్యానించుచు, భగవంతుని సాక్షాత్కారము కొరకు నేను తపించుచునుండగా నా శోకమునకు శాంతి గావించు విధమున ఆ పరమేశ్వరుని వాక్కు నాకిట్లు వినబడియెను. ''వత్సా ! ఈ జన్మమున నీవు నన్ను చూడజాలవు. నీవు చాలాకాలము సాధు సేవ చేయుటచే నాయందు నీకు ధృఢమైన భక్తి కలిగినది. దీని ఫలితంబుగా నింద్యంబైన నీ దాసీపుత్ర శరీరంబును విడచి, మదీయ పార్షదత్వంబు నొందుదువు. నాయందు నీకు కలిగిన భక్తి తగ్గిపోక అధికమగును.'' అంతట నేను ఆ భగవన్నామమును కీర్తించుచు, వీతరాగుడనై కాలుము ప్రతీక్షించుచుండగా ఒకనాడు యీదాసీపుత్ర శరీరముమృతమయ్యెను. అంతట నేను మహావిష్ణుని అనుగ్రహమున దేవదత్తంబైన యీ వీణను చేబూని, దానిని మ్రోయించుచు, హరికథలంబాడుచు, ముల్లోకముల తిరుగుచున్న వాడను.'' నారదు డిట్లు తనచరిత్రను చెప్పి, అంతర్ధానమయ్యెను, అంతట వ్యాసుడు ఆ సరస్వతీ నదీతీరమున నొక ఆశ్రమమును నిర్మించుకొని ఆ నదిలో స్నాన సంధ్యాద్యనుష్టానముల నిర్వర్తించుచు నారదుడుపదేశించిన రీతిని భక్తి యోగమున పర మాత్ముని ధ్యానింప, భగవదనుగ్రహము కలుగగా భాగవతమును రచించె. తరువాత ఆ భాగవత సంహితను తన పుత్రుడగు శుక యోగీంద్రునికి ఉపదేశించి, చదివించెను. శుకు డాత్మారాముడైనను, భగవంతునియెడ ఫల నిరపేక్ష మగు భక్తిని చేయుచుండెను. భగవద్గుణ మహిమలట్టివి. అని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పెను.

పరీక్షిత్తు చరిత్ర

కురుక్షేత్ర యుద్ధమున దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోగానే అతనికి సంతోషము కలుగచేయు నుద్దేశ్యముతో అశ్వత్థామ, రాత్రివేళనిదురించుచున్న ద్రౌపదీసుతుల నందరినీ వధించెను. అంతట ద్రౌపదికి కలిగిన దుఃఖమున కామె నోదార్చుటకై, అశ్వత్థామను చంపెదనని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి, అతనిని వెంటపడి రథమునకు కట్టి పట్టుకొని రాగా, ద్రౌపదీదేవి, తన సహఔద్యారముతో తాను పుత్రుల మరణమునకు విలపించురీతిగ, అతని తల్లియైన కృపికి పుత్ర శోకము కలగునేయని విచారించి, అట్లు ఆమెకు పుత్ర శోకము కలుగకూడదను భావముతో అశ్వత్థామను చంపక విడువుమని అర్జునునితో చెప్పెను. కాని ఆశ్వత్థామనుచంపుదునని అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ వ్యర్ధము కాకుండనుండుటకై కృష్ణుని సంప్రదింపుతో అశ్వత్థామ శిరస్సునఉన్న దివ్యరత్నమును తీసి అతనిని విడచిపెట్టెను...అట్లు అతని ప్రాణతుల్యమగు శిరోమణిని తీయుట అతనిని చంపినట్లేయని భావించి, అతనిని చంపక విడచిపెట్టెను. శాస్త్రము ప్రకారము ఉత్తమ బ్రాహ్మణుడు తప్పుచేసినయెడల అతనికి వపనము, నర్వస్వహరణము, దేశనిర్వాననము అనునవియే దండనములు. అంతేకాని వధించ తగదు

ఇట్లశ్వత్థామ విడిపింపబడినను తనకింతటి ఘోరపరా భవము జరిగినదని రోషముతో అపాండవము గావించు నుద్దేశ్యముతో గర్భవతియైన ఉత్తర గర్భములోనున్న శిశు వును వధింప నెంచి బ్రహ్మ శిరోస్త్రంబు ప్రయోగింపగా ఆ అస్త్రము ఉత్తరగర్భములో ప్రవేశించి ఘోరమైన బాధను కలిగింపగా ఉత్తర కృష్ణుని రక్షింపుమని మొరబెట్టెను. అంతట కృష్ణుడు తన చక్రమును ఉత్తరగర్భములోనికి పంపి బ్రహ్మశిరోస్త్రమును పనిచేయకుండ గమింపచేసి, ఉత్తర గర్భములోనున్న శిశువును రక్షించెను. ఆ శిశువు గర్భములో నుండగానే కృష్ణుని దివ్యదర్శనము నొంది ఆశ్చర్యపడుచుండగా ప్రసవకాల మాసన్నమై ఆ శిశువు జనించెను. ఆ శివువే మనపరీక్షిత్తు. ఆ శిశువు తల్లిగర్భములో నుండగానే దర్శించిన ఆ కృష్ణ పరమాత్మను జనన మొందినది మొదలు ఎప్పుడు ఎక్కడ దర్శనమగునాయని పరీక్షిచుటచేత అతనికి పరీక్షిత్తు అని నామకరణము చేయబడెను. ఇంకను విష్ణువుచే నీయబడినవాడు కనుక విష్ణురాతుడు అనియును అతనికి పేరుపెట్టిరి. ధర్మరాజు తన పాండవ వంశాంకురముగా యీ పరీక్షిత్తు పుట్టినాడను అత్యంత సంతోషముతో గో, భూ, హిరణ్యాది దానములు గావించి బ్రాహ్మణుల మృష్టాన్నంబులచే సంతృప్తిపరచి యీ బాలుని భవిష్యమును గూర్చి చెప్పుడని కోరగా, ఆ బ్రాహ్మణులు, యీ పరీక్షిత్తు ఇక్ష్యాకువలెను, శ్రీరామచంద్రునివలెను, శిబిచక్ర వర్తివలెను - అద్భతమైన పరాక్రమశాలియు, ధర్మమూర్తియు, సర్వసద్గుణమూర్తియునై అఖండఖ్యాతినిగాంచి మహా ప్రభువుగా పరిపాలించి చివరకు ఒక మహర్షి కుమారుని శాపంబుచే సర్పము కరవగా మృతిని పొందునని తెలిసికొని, శుకమహర్షిచేత భాగవతమును విని ముక్తుడగునని, ఆ బ్రాహ్మణులు చెప్పి వెళ్ళిపోయిరి. ఆ పరీక్షిత్తు క్రమముగా శుక్ల పక్ష చంద్రునివలె పెరిగి సర్వవిద్యలు నేర్చి ఆదర్శప్రాయమైన పరిపాలనము చేయుచుండెను. ఇట్లుపరీక్షిన్న రేంద్రుడు ధర్మపరిపాలనము చేయుచుండగా ఒక గోమిధునంబును కాలితో తన్నుచుండిన రాజవేషధరుడైన వానిని చూచి, ''ఓ వృషభరాజా ! శోకింపవలదు. నిన్ను తన్ను చుండిన ఆ శూద్రాకారుండైన వానివలన నీకు భయము వలదు. ఇట్టి అధర్మమును అణచుటయే మాక్షత్రియరాజుల పరమధర్మము. వృషభరాజా ! నీవు ఒంటికాలితో నున్నా వేమి?''యని యడుగగా అవృషభము ఇట్లనియె. ''రాజేంద్రా! నీవు పాండువంశములో జన్మించినందుకు దీనస్థితిలోనున్న నాకు అభయమొసంగి నీ వంశమర్యాదను నిలుపుకొంటివి. మీరట్టి యోగ్యులు కనుకనే కృష్ణపరమాత్మ అనేక విధములు రక్షించినాడు. కృతయుగమున తపస్సు, శౌచము, దయ, సత్యము అను నాలుగు పాదములతో ధర్మము పరిపాలింపబడియె. ఇప్పుడు ఆ నాలుగు పాదములలో మొదటి మూడు పాదములు లోపించి సత్యమను నొక్క పాదముతో ధర్మదేవతనైన నేను నీకు ప్రత్యక్షమైనాను. రాజవేషధారియైన యీ శూద్రుడు కలిపురుషుడు ఈ ఒక్క కాలినికూడా నరక చూచుచున్నాడు. నా ప్రక్కన కన్నీరు కార్చుచున్న యీ గోవు భూదేవి, యీ కలిపురుషుడు ఆ గోవును తన్ను చుండుట చేత కన్నీరు కార్చుచున్నది. ఈ పురుషుని బాధ నుంచి నుంచి మమ్ములను రక్షింపుము.'' అని ఆ గోమిధునము పరీక్షిత్తును ప్రార్థింపగా, పరీక్షితు ధర్మాగ్రహముతో విల్లెక్కుపెట్టి ఆ కలిపురుషుని, ''ఓరీ దురాత్మా ! నీ వెవడవు ? నీవు బలిష్ఠుడుగా నుండి ఈ దుర్బలులను పీడించుచున్నావు? వేషమున రాజువలె కనబడుచున్నావు, నీకీ కార్యంబు తగదు. నేను ధర్మపాలనము చేయుచుండగా నీవిట్టి అధర్మమును చేయుచున్నావు? భూదేవి నీబోటి దౌర్భాగ్యులు తనను పరిపాలించు దుస్థితి రానున్నదని కన్నీరు కార్చు చున్నది. ధర్మదేవత తనకు మిగిలిన ఆ ఒక్క కాలును కూడా నీవు నఱికి వేయుదువని భయపడుచున్నది. నీవిట్టి అధర్మము చేయుచున్నావు కనుక నీవు అవశ్యము చంపదగినవాడవే.'' అని నిశ్చయించి వాడిగల బాణములను తీసి ఆ కలిపురుషుని సహరించబోయెను. అంతట నా కలిపురుషుడు భయపడి తనను రక్షింపమని పరీక్షిత్తును శరణువేడెను. ''నీవు శరణుజొచ్చితివి కనుక నిన్ను చంపను. కాని నీవు ధర్మపాలనము చేయుచున్న నా రాజ్యములో నీవుండదగవు.'' అని పరీక్షిత్తు శాసించిగా, ఆ కలిపురుషుడు, ''ఓ సార్వభౌమా! నిన్ను శరణుజొచ్చిన నాకును నీ రాజ్యములో ఏదో నొక్కచోట నుండుటకు ఆనతి యిమ్ము'' అని ప్రార్థింపగా ''జూదము, త్రాగుడు, వ్యభిచారము, హింస యీ నాలుగును నీవు వుండుటకు స్థానములు'' అని చెప్పగా, యీ నాలుగున్ను ధనములేని వానివద్ద నుండ నేరవు గనుక వీటికి కారణమైన ధనముకూడా ఐదవస్థానముగ నిమ్మని ప్రార్థింపగా, అంతట పరీక్షిత్తు అందుకు అంగీకరించెను. అందుచేతనే యీ కలియుగములో ధనముకల వారే జూదము, త్రాగుట, వ్యభిచారము, హింస మొదలగు అధర్మ కార్యములు చేయుచు కలిపురుషునకు నివాసస్థానములుగా నుండుట మనము చూచుచున్నాము. అట్లయిన ఐశ్వర్యము యెక్కడున్నను అది కలి నివాసస్థానమేనా యన్నచో భగవద్భక్తియు, భగవన్నామ సంకీర్తనమును ఉండుచోటు ఐశ్వర్యము కలి నివాసస్థానము కాదనియు, ఎట్టి పారమార్థిక చింతాలేని కేవల లౌకికుల ఐశ్యర్యము మాత్రమే కలినివాస్థానమైన జూధము, పానము, హింస మున్నగువానికి దోహదము చేయునని తెలిసికొనవలెను.

పరీక్షిన్నరేంద్రు డీవిధముగా కలిని నిగ్రహించి వృషభరూపముననున్న ధర్మదేవతకు పోయిన మూడు కాళ్ళనుగూడ సమకూర్చి, భూదేవినికూడా శాంతపరచి హస్తినాపురమున రాజ్యాసనం నధిష్ఠించి, చక్రవర్తియై, ధర్మమును నాలుగుపాదముల నడింపించుచు కలియుగంబును తొల్లింటి కృతయుగంబుగ మార్చి అద్భుత ప్రభావముతో పరిపాలనము చేయుచుండెను అంతట కలియేమియు చేయ జాలక పరీక్షిత్పరిపాలనలో అణిగియుండెను ఇంకను ఈ కలికాలమున పుణ్యములుచేయకుండినను, శ్రద్ధతో చేయుదునని సంకల్పించినంత మాత్రమున తత్ఫలంబు కలుగును. పాపంబులన్నచో చేసినగాని ఫలించవు. కావున నితర యుగముల కంటెకలియుగ మీ విధమున శ్రేయస్కరము, ఇంకను భగవన్నామసంకీర్తనము చేయువానికి దుష్కులత్వ దోషంబును లేదు. భగవన్నామము ఆ దోషమును తీసివేయును. ఇట్లు ప్రజలను భగవద్భక్తి పరులను చేసి పరీక్షిత్తు కలికి అవకాశము లేకుండా అద్భుతముగ ధర్మపరిపాలనము చేయుచుండెను.

ఒకనాడు పరీక్షిన్న రేంద్రుడు వేటకై అడవుల కరిగి కొంతసేపు వేటాడగా దాహమై చుట్టు ప్రక్కల నెచ్చటను త్రాగుటకు నీరు కానక తిరిగి తిరిగి చివరకు శమీకమహర్షి ఆశ్రమమును చేరెను. కాని అప్పుడు శమీక మహర్షి దేహభావమేమియు లేక సమాధ్యవస్థలో నుండుట చేత పరీక్షిత్తు దాహమిమ్మని అడిగినను ప్రత్యుత్తరము చెప్పకుండెను. అంతట పరీక్షిత్తు పిపాసా బాధను భరింప లేక రాజయిన తాను ఆశ్రమమునకు రాగా ఈ మహర్షి అర్ఘ్యపాద్యాద్యుపచారములు చేయక కనులు మూసికొని, తనను చూడనట్లు నటించుచు తనకు అవమానము గావించి నాడని క్రోధ మాత్సర్యములకు లోనయి ఆ ప్రదేశములో పడియున్న ఒక చచ్చిన పామును తన ధనుస్సుతో తీసి ఆ మహర్షి భుజమునవేసి వెడిలిపోయెను. ఆ మహర్షి సమాధిస్థితిలో నుండుటచే రాజు చేసిన పనిని గ్రహింపలేదు. ఇట్లుండగా ఆ శమీక మహర్షి యొక్క కుమారుడుశృంగియనుబాలుడువయసునచిన్న వాడయినను అత్యంత తేజస్సుతో వెలుగుచూ, తనతండ్రికి పరీక్షిత్తుచేసినఅపచారముసహించలేక, ఈరాజునుయిప్పుడేశపిం చెదనని తోటి బాలురతో చెప్పి, ఆచమనము చేసి శుచియై ''మా తండ్రికి అచారము చేసిన ఈ పరీక్షిత్తు నేటికి యేడవనాడు తక్షకుని కాటుచే చచ్చుగాక, యని శపించెను. తరువాత తండ్రిసమీపమునకు బోయి మెడలో నున్న చచ్చిన పామును జూచి గొప్ప దుఃఖముతో నేడ్వసాగెను. ఆ ఏడ్పునకు తండ్రి సమాధినుంచి లేని మెడలోనున్న సర్పశవమును అవతల పారవైచి, కుమారుని దుఃఖమునకు కారణ మడుగగా జరిగినదంతయు కుమారుడు తండ్రికి యెఱింగించెను. అంతట తండ్రి పరీక్షీత్తునా శపించుట ఘోరమైన పాపకార్యమని కుమారుని నిందించి, రాజు లేనిదే ప్రజలు నిర్భయముగా నుండలేరనియు, అనేక నష్టములు కలుగుననియు, దేశము అరాజకమై ధర్మము నశించుననియు చెప్పి, పరీక్షీన్నరేండ్రు పరమ ధర్మమూర్తి యగుటచే అట్టివానిని శపించుట ఘోరమైన తప్పనియు కుమారుని మందలించెను. రాజు తన మెడలో సర్పశవమును వేయుట దోషమని శమీకుడు భావించలేదు. ఇదే కదా మహాపురుషుల లక్షణము.

ఇది ఇట్లుండ పరీక్షిన్న రేంద్రుడు కొంత దూరము వెడలిని తరువాత తాను నిరపరాధియైన ఆ మహర్షి భుజమున సర్పశవమును వేయుట చాలా నీచకర్మగా గ్రహించి పశ్చాత్తాపమును పొంది, ఇట్టి అకార్యమును చేసిన పాపాత్తునకు ఎట్టి కీడు వాటిల్లునో గదా యని అనుకొనుచుండగా శమీకమహర్షి శిష్యుడొకడు ఆ రాజును సమీపించి ఆ ముని కుమారుడైన శృంగి రాజునకిచ్చిన శాపమును తెలిపి, దాని వలన ఏడురోజులలో పాము కఱచి నీవు చనిపోదువని చెప్పగా, ఆ రాజు అందుకు రవ్వంతయేని కోపము తెచ్చుకొనక ఆ శాపము తనకు మంచికే వచ్చినదని విరక్తుడై కృష్ణపాద పరిచర్యయే తనకు కర్తవ్యమని నిశ్చయించి, రాజ్యమును కుమారుడైన జనమేజయునకు నప్పగించి, గంగానదియొడ్డున ప్రాయోపవిష్ఠుండయ్యె. పరీక్షిన్న రేంద్రుడు సర్వసంగముల వర్జించి, అనన్యచిత్తుడై భగవద్ధ్యానము చేయుచున్నాడని అత్రి, వషిష్ఠ మహర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు అచటికి విచ్చేసిరి. అట్లరుదెంచిన ఆ ఋషి పుంగవులను ఉత్తమ విధానంబుగ పూజించి, వారికి నమస్కరించి, ''మహాత్ములారా! నేను నీచకర్మనుచేసి శాపమును పొంది యిట్టి కష్టస్థితిలోనున్నను నా పూర్వపుణ్య పుంజముచే తమ బోటీ మహాత్ములు నాకు దర్శనమిచ్చి నన్ననుగ్రహించుటకు అరుదెంచినారు. విప్రశాపవశమున తక్షకుడు నన్ను కఱచిన కఱచుగాక, మీరు నాకు భగవత్కలను కీర్తించి, నాకు మోక్షము వచ్చునట్లు అనుగ్రహింపుడు'' అని వారలను ప్రార్ధించి తాను ఇకముందు జన్మంబెత్తవలసి వచ్చినను, భగవద్భక్తియు, భాగవతానుర క్తియు బ్రాహ్మణమైత్రియు కలుగునట్లు అనుగ్రహించమని వేడుకొని, గంగానది దక్షిణ తీరమున ప్రాచీనాగ్రములగు కుశలములపై ఉత్తరాభిముఖుడై కూర్చుండె. అంతట రాజు చేసిన ఇట్టి మహాకార్యమునకు దేవతలు రాజుపైని పుష్పవర్షమును కురిపించిరి. అంతట మహర్షులు రాజుచేసిన త్యాగమునకు, భగవద్భక్తికి రాజును ప్రశంసించగా, రాజు ఆసన్నమరణుడగు తనకు ఏది కర్తవ్యమో బోధింపుడని అత్యంత వినయముతో వారిని ప్రార్ధించెను.

ఇట్టి పరిస్థితిలో వ్యాసపుత్రుడైన శుక యోగీంద్రులు అవధూత వేషముతో అచటికి విచ్చేసెను. పదునాఱండ్లు వయసుగల సౌందర్యమూర్తియై, బ్రహ్మవర్చస్సుతో విరాజిల్లుచున్న ఆశుకమహర్షిని అచటి మహర్షులందరు గౌరవముతో పూజించి, పరీక్షిత్తునితో అతనిని గురించి చెప్పగా పరీక్షిత్తు వారిని యధావిధిగా పూజించెను. అంతట శుకయోగీంద్రుడు వారి సపర్యల నంగీకరించి, ఆ మహర్షుల మధ్య ఉత్తమాననంబున నాసీనుడయ్యెను. అంతట పరీక్షిత్తు, ''బ్రహ్మర్షివర్యా ! తమరు కరుణించి నాకు దర్శన మిచ్చు టచే నా పాపములన్నియు తొలిపోయినవి. కృష్ణ పర మాత్ముని అనుగ్రహముచే యదృచ్ఛాగతిని యెల్లెడల తిరుగు తమ దర్శనము నాకు సంప్రాప్తమైనది. ఆసన్న మరణుడనైన నేను ఇప్పుడేమి చేయవలయును? నాకు తరించు మార్గమేది? నాకు బోధించి, అనుగ్రహింపుడు. గోదోహన మాత్రకాలము కూడా గృహస్థుల ఇండ్లలో నిలువని మీరు నన్ననుగ్రహించుటకై ఇట్లు దయచేసినారు. కావున నా ప్రార్థన నంగీకరించి నాకు మోక్షమార్గము బోధింపుడు.'' అని అత్యంత భక్తితోను, వినయముతోను శుకయోగీంద్రులవారిని ప్రార్థించెను. అంతటశుకయోగీంద్రులు ఇట్లు చెప్పదొడంగె, అని నైమికవాసులగు మునులతో సూతు డిట్లనియె.

ప్రథమ కిరణము సమాప్తము.

(భాగవతములో ప్రథమస్కంథము సమాప్తము)

దీనివలన తెలిసికొన దగిన దేమగా -

1. భగవద్భక్తి దేనివల్ల కలుగునో అదియే పరమ ధర్మము. అట్టి భక్తిని కలుగ చేయనిది ధర్మమనిపించుకొనదు. అట్టి భక్తివలన విరక్తి, ఆత్మజ్ఞానము కలిగి మానవుడు తరించును.

2. మనుజుడు జన్మమెత్తి జీవించుటకు ఆత్మతత్త్వ విచారము చేయుటయే ఫలము.

3. పుణ్యతీర్ధ యాత్రలవలన పాప పరిహారమగును.

4. భగవంతుని అవతారములన్నింటిలోను కృష్ణావతారము పరిపూర్ణతమావతారము. కృష్ణుడుసాక్షాత్తు భగవానుడే. కనుక కృష్ణ భక్తి వలన మోక్షము కలుగును.

5. వ్యాసమహర్షి ఎన్ని గ్రంథములు రచించినను, భగవద్భక్తి ప్రధానమైన గ్రంథము వ్రాయనందున దుఃఖము పోలేదు కనుక భగవద్భక్తి ప్రధామనైన భాగవతమును రచించి దుఃఖశమనమును పొందినాడు. కనుక భగవద్భక్తి వలననే మానవుడు దుఃఖమును దాటి మోక్షమును పొందును.

6. మహాత్ముల సంగమువలన (ముఖ్యముగా చాతుర్మాస్య కాలములో) భగవద్భక్తి కలిగి మానవుడు తరించును

7. ద్రౌపదీదేవి తన కుమారులను వధించిన అశ్వత్థామయందు పగబూనినచో అశ్వత్థామ తల్లికి పుత్రశోకము కలుగుననియు, అట్లు కలిగించుట ధర్మము కాదనియు తలచి అశ్వత్థామను విడిపించెను. ఆ విధముగా అపకారికి కూడా ఉపకారమే చేయు ప్రయత్నము చేయుట పరమధర్మము.

8. పరీక్షిన్మహారాజు కలికాలములో కూడా కలిని నిగ్రహించి, ధర్మమును నాలుగు పాదముల నడుపుటను బట్టి రాజు దర్మనిష్ఠుడయ్యెనేని కలికాలములో కూడా ప్రజలు సుఖింతురని తేలుచున్నది.

9. తల్లి గర్భములో నుండగానే భగవద్దర్శనము చేసిన పరీక్షీత్తు, కలినికూడా నిగ్రహించి ధర్మపాలనముచే ఆదర్శప్రాయమైన ప్రభువుగా పేరొందిన మహాపురుషుడు శమీకమహర్షి మెడలోసర్పశవమును వేయుట బుద్ధికృతము గాదు. భాగవతమను మోక్షగ్రంథమును యీ లోకములో నవతరింప చేయుటకు గాను భగవానుడు అంతర్యామి రూపమున పరీక్షీత్తుకు తాత్కాలికముగా అట్టి బుద్ధిని పుట్టించి శాపగ్రస్తుని చేసెను. అందుచే శుకునిద్వారా భాగవతము లోకములో అవతరించినదని తెలిసికొనవచ్చును. కావుననే పరీక్షిత్తు సర్పశవమును వేసిన తరువాత వెంటను తాను చేసినది అపచారమని పశ్చాత్తాపము నొందుటయు, తన కీయబడిన శాపము సంగతి వినగానే కోపము తెచ్చుకొనక, శాపము తనకు మహోపకారమని భావించుటయు సంభవించినది గదా!

10. పరీక్షిత్తు సర్వసంగ పరిత్యాగ మొనర్చి నదీ తీరమున ప్రాయోపవిష్ఠుడై మనస్సు భగవంతునిపై మోక్షార్ధియైనిలపగా శుకయోగీంద్రునివంటి ఉత్తమగురువు ఇట్టి ఉత్తమ ముముక్షులైన పరీక్షిత్తును వెదకుకొనుచు తనంతట తానే వచ్చి భాగవతమును ఉపదేశించి, తరింపచేసెను. దీనిని బట్టి శిష్యుడు ఉత్తముడైన పక్షమున గురువు శిష్యుని వెదకుకొనుచు వచ్చి తరింపచేయును అని తెలిసికొన వలయును. కాని సామాన్య శిష్యుడు గురువునే వెదకు కొనుచు వెళ్ళవలయును.

11. ఆత్మ సాక్షాత్కారము బొందిన జీవన్ముక్తునికి శుకునికి స్త్రీ పుం భేదము గోచరింపక సృష్టి అంతయు భగవన్మయముగానే కాన్పించును.

Sri Bhagavatha kamudi    Chapters