Sri Bhagavatha kamudi    Chapters   

2. వకిరణము

పరీక్షిత్తునకు యోగీంద్రుని బోధ

పరీక్షిన్నరేంద్రుడు తనకు మోక్షోపాయము చెప్పుమని శుకయోగీంద్రుని అడగగా ఇట్లు బోధింప ప్రారంభించెను. ''నరేంద్రా! మోక్షము నపేక్షించు మానవుడు భగవంతుని కథల నాకర్ణింప వలయును, భగవంతుని నామములను కీర్తింపవలయును, భగవంతుని మహిమలను స్మరింపవలయును. భగవద్గుణ కీర్తన ప్రధానమైన వ్యాస మహర్షి రచించి పురాణముగా నా తండ్రియగు వ్యాస మహర్షి రచించి నాకు ఉపదేశించగా నైర్గుణ్య నిష్ఠుడనై, ముక్తుడనైనప్పటికి ఆ భాగవతములోని భగవంతుని లీలలు నన్ను కూడా ఆకర్షించినవి. కావున ఆ భాగవతరహస్యము మీకు తెలియపఱచెదను. శ్రద్ధతో వినిన వారికి భగవద్భక్తి వెంటనే కలుగును. భగవన్నామ కీర్తనము సకాములకు కామితార్థ ప్రదంబై విరక్తులైన నిష్కాములకు మోక్షసాధనంబై, యోగులకు నిర్భయఫలంబై ఒప్పారును. కాల మెల్లవ్యర్ధమయ్యెనని పశ్చాత్తాపములో ఒక ముహూర్తమైనను ఉన్న యెడల శ్రేయంబొడ గూర్చును. నరేంద్రా! నీకు ఏడు దినములలో మోక్షమెట్లు వచ్చునని సంశయింప పనిలేదు. పూర్వము ఖట్వాంగుడు అను రాజర్షి తనకు అయుశ్శేషము ఒక మూహూర్త మాత్రమే యని తెలిసికొని సర్వసంగములను వదిలి, హరిని శరణుజొచ్చి ముక్తుడయ్యెను. కావున నీకు ఏడు దినములలో మోక్షము వచ్చును.

అంత్యకాలమాసన్నమైన పురుషుడు సర్వసంసార బంధములను అసంగ శస్త్రముతో త్రెంచివేసి, ఇల్లువెడలి, ఏకాంత ప్రదేశమున కూర్చుండి మనస్సుతో ప్రణవజపము చేయవలెను. లేక భగవద్రూపమునందు మనస్సును ధారణాయోగముచే నిలపవలెను. అట్లు ధారణ చేయుటలో భగవంతుని హస్తపాదాది అవయములందు క్రమముగా మనస్సును నిలపవలెను. ఇంకే విషయములను మనస్సుయందు తలంచరాదు. దీనిని ధారణ యోగమందురు. దీని వలన భగవత్సాక్షాత్కారమగును.

ఇట్లు శుకయోగీంద్రులు పరీక్షిత్తునకు ధారణ యోగము నుపదేశించి తరువాత విరాట్పురుషుని అవయములతో వర్ణించి చెప్పెను. ధన దుర్మదాంధుల ఆశ్రయింపక విషయములయెడ విరక్తికలిగి భగవంతుని సేవించినచో సకల సంసారానర్ధములకు కారణమైన అవిద్య నశించును.

తరువాత శుకుడు పరీక్షిత్తునకు అర్చిరాది మార్గగతిని బోధించి ముముక్షువులకు సర్వకాలమందును హరి కథా శ్రవణము, హరినామ కీర్తనము, హరిస్మరణము ముఖ్యములని ఉపదేశించెను. హరికథా ప్రస్తావనమున గడుచు నిమిష కాలమైనను తప్ప మిగిలిన పురీషాయుష మంతయు వ్యర్థమే అని చెప్పి శుకులవారు భగవంతుడు ఎట్లు ఆత్మమాయా వేషమున అవతరించి ఈ విశ్వమెల్ల ఎట్లు సృజించి పాలించి సహరించుచున్నాడో విశదీకరించెను ఇంకను పూర్వము నారదుడు బ్రహ్మదేవునయొద్ద ఆత్మ తత్త్వమును ఎట్లు గ్రహించెనో ఆ విషయమంతయు బోధించెను. బ్రహ్మ భగవంతుని లీలావతారములన్నియు చక్కగా వర్ణించెను. అటుల వర్ణించుటలో కృష్ణావతార లీలను విశేషముగా నిరూపించియు భగవంతుని లీలలను సంపూర్తిగా వర్ణింప శక్యము గాదనియు, వేయి ముఖములతోడ ఆదిశేషువుకూడా భగవద్గుణములను సంపూర్తిగా వర్ణింపలేడనియు చెప్పి భగవన్మాయను దాటుటకు సాధనము ఒకటే కలదనియు, అది యేమనగా కపటము మాని సర్వవిధముల హరిచరణములను ఆశ్రయించిన వాడు మాత్రమే ఆ భగవాన్మాయను దాట గలుగుననియు నారదునికిబ్రహ్మ బోధించి కార్యకారణాత్మకమైన జగమంతయు హరికంటే వేరుగాదనియు, ఆ మహాపురుషుడు కార్యముకంటే అతిరిక్తుండనియు తెలిపెను. ఇదియే భాగవతసారము. దీనిని నీవు విస్తరించి ప్రచారము చేయుమని బ్రహ్మ నారదునికి బోధించిన విధానమును పరీక్షిత్తునకు చెప్పెను.

అంతట హరితత్త్వమును గుఱించియు, కాల తత్త్వము గుఱించియు, జీవేశ్వర తత్త్వము గుఱించియు, ఆత్మతత్త్వము గుఱించియు పరీక్షిత్తు శుకుని యడుగగా, ఆతత్త్వమంతయు యెఱింగించెను. అటుపైన శుకుడు పరీక్షిత్తునకు భాగవత సంప్రదాయమును భాగవతములోని సర్గవిసర్గాది దశలక్షణములను కర్మగతి యొక్క విచిత్రత్వమును వర్ణించి, భగవంతుడే జగమును సృజంచెననుటలో పారమార్థికముగా భగవంతునిపై కర్తృత్వాది ధర్మములు మాయచే ఆరోపింపబడుచున్నవనియు చెప్పి తన బోధను తాత్కాలికముగా సమాప్తి చేసెను.

ద్వితీయ కిరణము సమాప్తము

(భాగవతములోని ద్వితీయస్కంధము సమాప్తము)

దీనివలన తెలిసికొనదగిన దేమనగా

1. హరికధా శ్రవణము హరినామ కీర్తనము, హరి స్మరణము ముముక్షువునకు ముఖ్యక కర్తవ్యములనియు, వీని ద్వారా మనస్సును భగవద్రూపమునందు నిలిపి ధారణాయోగము నభ్యసించినచో భగవాత్సాక్షాత్కారము కలిగి తరించును. అనియు తెలిసికొనవలెను.

2. వైరాగ్యముచే సన్యసించి ప్రణవజప ధ్యానాదుల చేసినచో నిర్గుణమూర్తి లభంచును.

3. భగవత్సంబంధమై గడపిన కాలమే సార్ధకము మిగతాకాలము వ్యర్ధము.

4. నిరాకార నిర్గుణుడైన పరమాత్మయందు సృష్టికర్తృత్వాదులు ఆరోపించబడినవే కాని వాస్తవములో లేవు.

Sri Bhagavatha kamudi    Chapters