Sri Bhagavatha kamudi    Chapters   

శ్రీభాగవతౌముది

మున్నుడి

శ్రీ గాయత్రీ పీఠాధిపతులు, బ్రహ్మీభూత శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు, తాము అఖిలాంధ్రదేశమున సల్పిన ప్రచార పర్యటనలలో, అశేష జనాధరణమును పొంది, అల్పకాలములో - అనగా రెండు దశాబ్ధములలోనే, శ్రీ శంకరాద్వైతహిందూమత ప్రచారకులలోను, పీఠాధిపతులలోను, విశిష్ఠస్థానము నాక్రమించి, సనాతన ధర్మోద్ధరణము చేసినా రనుట సర్వవిదితనమైన విషయము. ఆ ప్రచారము చేయు చున్నప్పుడు, ఆర్షవిజ్ఞాన ప్రబోధకములగు గ్రంథముల ననేకము వ్రాసినారు. జగద్గురువులకు గురువగు శ్రీకృష్ణభగవానుని భగవద్గీతకు వివరణ రూపమగు ''గీతాకౌముది'' వారి రచనలలో ప్రముఖస్థానమును, విశేష ప్రచారమును పొందినది. అందులో శ్రీమద్భగవద్గీతను వారు విశ్లేషించి వ్యాఖ్యానించిన తీరు సరి క్రొత్తయైనది. విషయ వివరణము పండితరంజక మగుటయేగాక సామరసుబోధముగకూడా నున్నది. అందు వలన గీతాకౌముది - ''కౌముదియై'' చల్లని, ఆహ్లాదకరమైన విజ్ఞాన స్రవంతిని ఆంధ్రదేశమున నలుమూలలకు ప్రసరింపజేసినది.

ఈ ''శ్రీ భాగవతకౌముది'' గీత నుపదేశించిన శ్రీకృష్ణ భగవానుని జీవితవిశేష ప్రతిపాదకము. శ్రీమద్భాగవత విషయసార వివరణరూపము. ఇది శ్రీ విద్యాశంకరభారతీ స్వాముల చరమ రచనము. 30-4-73 న ఈ పం డ్రెండుస్కంధములు గల ఈ గ్రంథమును శ్రీవారు పూర్తి చేసినారు. 3-6-73న శ్రీవారు ఖమ్మములో సిద్ధి పొందిన తరువా, పీఠ వ్వవహారములను నేను చూచుకొనున్నపుడు, ఈ భాగవత కౌముది వ్రాతప్రతి అచ్చున కెదురుచూచుచున్నది. దీనిని అచ్చువేయించుటకై శ్రీస్వామివారి భక్తులు ఆస్తికవరేణ్యులు శ్రీ జక్కా మాణిక్యం శ్రేష్టిగారు రు. 1000/-లు సమర్పించినారు. అయినను కాగితము ధరలు ఆకాశము నంటుటచే ఈ గ్రంథము నచ్చువేయించుట ఎట్లా అని ఆలోచన చేయుచుండగా, నాసోదరుడు ఈపీఠ సంయుక్తకార్యదర్శి ఆస్తికశిఖామణి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వాముల అనుగ్రహమునకు పాత్రులు అయిన శ్రీ పురాణము వెంకటరామ కృష్ణశాస్త్రిగారు ''అహమస్మి'' అనినారు. శ్రీ శ్రేష్టిగారిచ్చిన ద్రవ్యము పోను, మిగిలినద్రవ్యమును నేనిత్తుననినారు. ఆమోద ప్రదమైన విషయము. ఈ దవ్యదాతలిరువురకు నాకృతజ్ఞతలు తెలుపుచున్నాను. గ్రంథము యొక్క చిత్తు వ్రాత ప్రతిని అచ్చువేయుటకు అనువుగ శుద్ధప్రతిని తయారుచేయు అవకాశము నాకు లభించినందుకు ధన్యోస్మి అనుకొనుచున్నాను.

తమ జీవితమును అర్షవిజ్ఞాన ప్రచారమునకై అంకితము చేసిన శ్రీ విద్యాశంకర భారతీస్వాములవారి యీరచనకు ''హేమ్నః పరమామోధః'' అనునట్లోక అసాధారణమైన అదృష్టము పట్టినది. నేటి భారతదేశమున మనకు ప్రత్యక్షముగ కనపడు, బ్రాహ్మీస్థితి సంపన్నులు, జీవన్ముక్తులు, ప్రాచ్య పాశ్చాత్య సాధకుల ననుగ్రహించి యాదరించిన మహా నీయులు శ్రీ కంచికామకోటి జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ సంయమీంద్రుల సహప్రచంద్రదర్శన మహోత్సవము (శ్రీవారికి 80 సంవత్సరములు నిండినపుడు భక్తకోటి చేసుకొనిన మహోత్సవము) 25-5-75 న యావద్భారతదేశమున అతి వైభవముగా జరిగినది. ఆ అపూర్వ మహోత్సవ సందర్భమున శ్రీచరణులవారి సన్నిధిన ఈ గ్రంథమును సమర్పించినాము. భక్తలోకమును, ఈ గ్రంథ పాఠలోకమునుగూడ వారు అనుగ్రహించి ఆశీర్వదించినారు. మనకింతకంటే కోరదగినది ఏమున్నది?

ఇట్టి ఈ గ్రంథమును చదివి జిజ్ఞాససాధకలోకము శ్రీచరణుల యనుగ్రహము నొంది, స్వయముగ తరించి, పరులను తరింపచేసి, లోకశాంతికి చేయూతనిత్తురని నేను సప్రశ్రయముగ ప్రార్థించుచున్నాను.

ఇట్లు,

R.D.L. నరసింహమూర్తి,

కార్యదర్శి

శ్రీ గాయత్రీపీఠం - మచిలీపట్నం.

Sri Bhagavatha kamudi    Chapters