Dharmakruthi  Chapters   Last Page

33. విద్యాశిక్షణలు

9; 1907 నుండి 1909 వరకు మహాస్వామివారు ముఖ్యముగా మఠ విషయాలను ఆకళింపు చేసుకోవడంలో, పూజాపద్దతులు, మంత్రానుష్ఠానములలో నిర్దుష్ఠత సంపాదించుకోవడంలో తమ ప్రవర్తనను మహాపీఠ ఆచార్య పదవికి తగిన విధంగా మలచుకోవడంలో తమ సమయమును వెచ్చించారు. ముఖ్యంగా ఋగ్వేదంలోనూ, యజుర్వేదంలోనూ, పూజకు అవసరమైన భాగాలను కంఠోపాఠం చేసుకోవడం, మంత్రశాస్త్రంలో నిష్ణాతులవడం, శ్రీచక్రార్చన విధిలో వివిధ సంప్రదాయములు తెలుసుకోవడం వంటి విషయాలలో శిక్షితులయ్యారు. శ్రీమఠంలోని పండితులు ఈ విషయాలలో స్వామివారికి మార్గదర్శకులుగా ఉన్నారు.

వైయక్తికమైన శీలమును పెంపొందించుకోవడంలో మహాస్వామివారికి సహాయపడిన శ్రీపశుపతి అయ్యర్‌ గురించి స్వామివారే 'జీవితం నేర్పిన పాఠం' అనే వ్యాసంలో ప్రస్తావించారు.

''నేను సన్యాసం పుచ్చుకొన్నప్పుడు కలవైలో తుమ్మలూరు రామకృష్ణయ్య, అడయార్‌పాళెం పశుపతి అయ్యర్‌, మా పరమగురువుల శిష్యులు, ఇద్దరు ఉండటం తటస్థించింది. దక్షిణ ఆర్కాటు జిల్లా కోర్టులో వారి ఉద్యోగం. జీవితాన్ని తీర్చిదిద్దు కోవడంలో వారు నాకు సహాయాన్ని అందజేయాలని తీర్మానించుకొన్నారని తరువాత స్పష్టపడింది. రామకృష్ణయ్య నిర్లిప్తుడు. అయినా కుటుంబ భారమెక్కువ. అందువల్ల నా భారాన్ని పశుపతియే వహించాల్సి వచ్చింది. ఆయన తన ఖాళీ సమయాన్ని ఎక్కువ భగవత్పాదుల ప్రకరణ గ్రంధాలను చదవడంలోనూ, ఏకాంత ధ్యానం చేయడంలోనూ గడిపేవారు. అలాంటి ఆయన నేను పీఠానికి రాంగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసి నాతోనే ఉంటూ నా ప్రతిచర్యను, ప్రతి మాటను చివరికి కంటి కదలికను కూడా నిశితంగా పరిశీలించేవారు. మఠ నిర్వాహణ కోసం తన ధ్యానకాలాన్ని కూడా తగ్గించుకొన్నారు. ఏకాంతంలో అప్పుడప్పుడు నన్ను కలసి ఆ మధ్యకాలంలో ఆయన గమనించిన దోషాలను చెప్పి సంస్కరణకై పాటు పడవలెనని హెచ్చరించేవారు. ఒక్కొక్కప్పుడు కఠినంగా మందలించాల్సి వచ్చినప్పుడు తాను చేస్తున్న ఈ అపరాధానికి నేను జ్ఞానిగా పరివర్తన చెందిన తరువాత క్షమాపణ చెప్పుకుంటానని అంటూ ఉండేవారు. 1926 వరకు 18 సంవత్సరముల పాటు నాతోనే ఉంటూ శంకర భాష్య పాఠంలో పాల్గొంటూ ఉండేవారు. నా కోసమే బోదకాలు, పైలేరియా, మలేరియా కలిగించే దోమలకు ప్రసిద్ధి చెందిన కుంభకోణంలో ఉండిపోయారు. ఏమయినా సరే నన్ను వదిలి ఉండేవారు కారు. చివరి కాలంలో తమ స్వగ్రామమైన కడలూరులో అస్వస్తులుగా కొంతకాలం ఉన్నారు. అప్పుడు మేము అక్కడికి వెళ్ళడం తటస్తించింది. పట్టణప్రవేశం మహాజోరుగా జరిగింది. ఊరేగింపులో ఏనుగు తొండాన్ని ఆదర పూర్వకంగా నిమురుతూ పరామర్శించారట. ఆ రాత్రియే వారు తుది శ్వాస వదిలారని తెలిసింది. నిర్భీతిగా, ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం ఇతరుల యెడ పరమ ప్రేమభావంతో గడిపిన జీవితం ఆయనది''.

శ్రీచరణులు చెప్పిన విధంగా శ్రీపశుపతి అయ్యర్‌ మహాత్ముడే అయినప్పటికీ శ్రీవారు అంతటి పదవిలో ఉండి కఠినంగా మందలిస్తున్నప్పటికీ నీ లెక్కేమిటి అని పంపివేయకుండా తన శీలమును దిద్దుకోవడం సామాన్య విషయం కాదు. తీవ్రంగా విమర్శించే వారి నుంచి కూడా మంచి గ్రహించే అలవాటు వారికి తుది వరకూ ఉంది. మఠ పరిచారకులు, మఠ పండితులు అప్పుడప్పుడు శ్రీవారు చేసిన పనులు ఉచితంగా లేవని భావించి వారి దృష్టికి తెచ్చిన సందర్భాలలో ఎందుకు ఆ రకంగా చేశారో చెప్పి వారిని స్వామి వారు తమ విశాల దృష్టికి ఆశ్చర్యపడేలా చేసేవారు. లేకుంటే తప్పు ఒప్పుకొని సరిదిద్దుకొనేవారు. పసి బాలుడైనా తాము చేసిన తప్పు తమ దృష్టికి తెస్తే ఒప్పుకొనే ధైర్యం వారికే చెల్లు. శ్రీవారికి ధర్మాచరణ యందు ఉన్న ఆసక్తి అటలమయింది.

పీఠానికి వచ్చిన క్రొత్తలలోనే మఠంలో ఉండే పెద్దలొకాయన స్వామివారితో బ్రహ్మచారికి, గృహస్తుకు యజ్ఞోపవీతం ఎలాంటిదో సన్యాసికి దండం అలాంటిదని, ఒక్క నిముషం కూడా దండాన్ని పరిత్యజించి ఉండకూడదని చెప్పారట. ఆ రోజు రాత్రి స్వామివారు విశ్రాంతి తీసుకొంటుంటే ఆ గదిలో దీపం చిన్నది చేయడానికి వెళ్ళారు ఆ పెద్దలు. స్వామి దండాన్ని తన శాఠీతో నడుముకు బిగించి కట్టుకొని పడుకొని ఉన్నారు స్వామివారు. అసలే మఠ నిర్వహణలో రోజుకు రెండు మూడు గంటల కంటే విశ్రాంతికి అవకాశం ఉండదు. దండం కట్టుకొని ఎలా నిద్రించడం? మరుసటి రోజు స్వామివారిని దండం అలా కట్టుకొని పడుకొన్నారేమిటని అడిగారు ఆ పెద్దలు, 'తాము దండాన్ని జందెం వలె నిరంతరం ధరించవలెనని చెప్పారు కదా! నిద్రించేటప్పుడు చేతిలో పట్టుకొని ఎలా ఉండటం! నాకు పాలు పోలేదు. అందుకే అలా కట్టుకొన్నానన్నారు' 13 ఏళ్ళ బాలసన్యాసి. వారి ధర్మనిష్ట అలాంటిది.

Dharmakruthi  Chapters   Last Page