Dharmakruthi  Chapters   Last Page

 

4. శంకరుల ధర్మప్రతిష్ఠాపనము

శ్రీకృష్ణ నిర్యాణానంతరము రెండు వేల సంవత్సరములలో భారతదేశం అంతా 72 దుర్మతములు వ్యాపించి ఉన్నాయి. ధర్మగ్లాని ఏర్పడింది. అసలయిన తత్త్వం మరుగునపడింది. శ్రుతి మార్గాన్ని స్పష్టతమం చేయడానికి సాక్షాత్తు శంకరుడే శంకరులుగా అవతరించారు. ఎనిమిదో ఏటనే నాలుగు వేదములు అధ్యయనం పూర్తిచేశారు. పన్నెండు ఏళ్ళ వయస్సులోనే సకల శాస్త్రములు అధ్యయనం చేశారు. పదహారేళ్ళ ప్రాయంలో భాష్యరచన చేశారు. శంకరులు, తమ 32 ఏళ్ళ జీవితకాలంలో వ్రాసిన గ్రంథాలను అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి మహామేధావికే ముపై#్ఫరెండేళ్ళు సరిపోదు. ఆచార్యులవారు మొదటి జైత్ర యాత్రలో సకల దుర్మతాలను ఖండించి అద్వైతమతాన్ని పునఃప్రతిష్టింపచేశారు. వారి బోధనా విధానం ఎంత గొప్పదంటే అనేక దుర్మతాల నామరూపాదులే మాసిపోయి ఆ మతానుయాయులు అద్వైత మార్గంలో చేరిపోయారు. రెండవ యావద్బారత జైత్రయాత్రలో అనేక వేల సన్యాసులు, బ్రహ్మచారులు వెంటరాగా అనేక పుణ్యక్షేత్రాలలో దర్శించి ఆరాధన, ఉపాసనా పద్ధతులను సుష్ఠు పరిచారు. జంబుకేశ్వరంలో, కంచిలో, తిరువట్రియూరులో ఇంకా అనేక పుణ్య క్షేత్రాలలో శ్రీచ్రక స్థాపన చేశారు. శంకరులు శ్రీరంగంలో జనాకర్షణ యంత్రాన్ని తిరుమలలో ధనాకర్షణ యంత్రాన్ని ప్రతిష్టించారని జనశ్రుతి. యావధ్బారతంలో ఆదిశంకరులు దర్శించని ముఖ్యక్షేత్రం లేదు. ప్రతి ఒక్క క్షేత్రంలోనూ ఒక ఆచారాన్నో సంప్రదాయాన్నో నెలకొల్పారని ఆయా క్షేత్రాలవారు చెప్పడం మనం వింటూనే ఉన్నాం.

అద్వైత వేదాంత ప్రచారానికి పూరీ, బదరీ, ద్వారక, శృంగేరీ మొదలైన ముఖ్యక్షేత్రాలలో అనేక మఠాలను స్థాపించారు. మోక్షపురి అయిన కంచికి వచ్చి అక్కడి మహారాజుల, పండితుల ప్రార్దనలననుసరించి సర్వజ్ఞ పీఠాధిరోహణము చేశారు. తాము కైలాసం నుండి తెచ్చిన అయిదు లింగాలలో ఒకటైన యోగలింగాన్ని మేరువును అర్చించుకొంటూ, శారదామఠమును స్థాపించి తామే మొదట ఆచార్యులుగా ఉండి, తరువాతి శిష్యుని నియమించి, కంచిలో కామాక్షి దేవాలయ రెండవ ప్రాకారంలో సిద్ధిపొందారు. ఆ ప్రదేశంలో ఆచార్యులవారి పురుషాకృతికి సమమైన శిలాప్రతిమ ప్రతిష్టింపబడినది. ఈనాటికి కూడా ఆ సన్నిధి నిత్య పూజలందుకుంటోంది.

Dharmakruthi  Chapters   Last Page