SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌

శ్రీగణశాయనమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణనమః

7. ఐతరేయోపనిషత్తు.

ఇది ఋగ్వేదముయొక్క ఐతరేయ ఆరణ్యకమునందలి 4,5,6 అధ్యాయముల ద్వారా బ్రహ్మవిద్యయొక్క ప్రధానత వివరించబడెను.

శాంతి పాఠము:- హే సచ్చిదానంద పరమాత్మా! నా మనస్సు, వాక్కుల యందు స్థితుడవుకమ్ము. సంకల్పము, వచనము, విశుద్ధమగుగాక, నీయోగమాయయొక్క తెరను తొలగించుము. మనోవాక్కులు రెండును వేదవిషయిక జ్ఞాన ప్రాప్తిని కలిగించుగాక. గురుముఖత విన్నది, అనుభవము లోనికి వచ్చిన జ్ఞానము నన్ను వదలక సర్వధానాకు జ్ఞాపక ముండుగాక, నేను దివారాత్రములు నిరంతరము బ్రహ్మ విద్యా పాఠన చింతనల చేయుచు ఒక క్షణ కాలమైనను వృధాచేయక నావాక్కు చే సదా సత్యమునే పలుకు చుండుగాక, హే పరమాత్మా! నన్ను నాకు బ్రహ్మవిద్యనుపదేశించు గురువర్యుని రక్షింపుము. అధ్యయనమున ఎట్టి విఘ్నములు కలుగ కుండుగాక. అదిభౌతిక , అధిదైవిక, ఆధ్యాత్మక త్రివిధ విఘ్నములు దూరమగు గాక. శాంతి స్వరూప భగవానుడు శాంతిని ప్రసాధించుగాక.

ప్రధమ అధ్యాయము - ప్రధమ ఖండము.

సృష్టిరచనకుపూర్వము కారణ అవస్థయందు ఏకమాత్ర పరమాత్మయే యుండెను. సృష్ట్యాదిని పరమాత్మ ప్రాణులకర్మ ఫల భోగార్థము భిన్న భిన్న లోకముల రచింతునని సంకల్పించెను.

2) పరబ్రహ్మ పరమాత్మ స్వర్గ లోకమునకు పైనగల మహ, జన, తప, సత్యలోకములను వానికి ఆధారమగు ద్యులోకమును అంభః నామమున రచించెను. వానిక్రింద సూర్యచంద్ర తారా గణములతో కూడిన అంతరిక్షలోకము (భువర్లోకము) మరీచ నామమున సృజించెను. వాని క్రింద మృత్యులోకమగు పృధ్వీలోకము 'మర' నామముతోరచించెను. పృధ్వీలోకములో గల పాతాళాది లోకముల 'ఆప' అనుపేర రచించెను. ఇట్లు జగత్తుయొక్క త్రిలోక, చతుర్దశ భువన సప్తలోకముల పరమాత్మ రచించెను.

3) ఇట్లు సమస్త లోకములను సృజించి వానిని రక్షించుట కొరకు జలాది సూక్ష్మ మహాభూతములనుండి హిరణ్మయ పురుషుడగు బ్రహ్మనుసృష్టించెను. బ్రహ్మనుండియే లోకపాలక, దేవతలు, ప్రజాపతులు, ఉత్పన్న మాయిరి. బ్రహ్మజల మధ్య మందు గల కమల నాళము నుండి ఉద్భవింనందురు.

4) పరమాత్మయొక్క తపోసంకల్పముచే హిరణ్యగర్భ పురుషుని శరీరమందు అండము పగిలినట్లు ముఖము, దాని నుండి వాగింద్రయము, దాని అధిష్టానదైవము అగ్ని ఉత్పన్నమైరి. తర్వాత నాసికా ఛిద్రముల ద్వారా ప్రాణవాయువు ప్రకటమై దాని అధిష్టానదైవము వాయువు ఉత్పన్నమైనది. ఘ్రాణంద్రియ అధిష్టాన దేవతలు అశ్వినీకుమారులు ఉత్పన్నమైరి. వాగింద్రియము నుండి రసనేంద్రియము. దాని అధిష్టానదైవము ఉత్పన్నమైరి. పిదప నేత్రేదంద్రియము. దాని అధిష్టానదైవము సూర్యుడు ఉత్పన్న మైరి. పిదప శ్రోత్రేంద్రియము దాని దేవతయగు దిశలు, పిదప త్వచ(దర్మము) త్వక్‌ నుండి రోమములు రోమములనుండి ఓషధులు, వనస్పతులు, పుట్టెను. పిదప హృదయము, హృదయము నుండి మనస్సు, దాని అధిష్టాన దేవత చంద్రుడు ఉత్పన్నమైరి. పిదపనాభి , నాభినుండి అపానవాయువు, దానినుండి గుండెద్రియము, దాని అధిష్టానదేవత మృత్యువు ఉత్పన్నమైరి. పిమ్మట లింగము, అందుండి వీర్యము, జలము, లింగమునుండి ఉపస్థేంద్రియము, దాని అధిష్టానదేవత ప్రజాపతి ఉత్పన్నమైరి.

ద్వితీయ ఖండము:- పరమాత్మ ద్వారా రచింపబడిన ఇంద్రియముల అధిష్టాన దేవతలగు అగ్ని మొదలగు వారికి నిర్దిష్ట స్థానము లభించనందున వారు హిరణ్య గర్భ పురుషుని సమిష్టి శరీరమందే ఉండిరి. పరమాత్మ ఆ దేవతాసము దాయమును, ఆకలి దప్పులు కూడినట్లు చేయగా తమ తమ స్థాన నిర్దేశము చేసి మేము మా ఆహార గ్రహణము చేయునట్లు చేయ ప్రార్థించిరి.

2) వారి ప్రార్థన విని పరమేశ్వరుడు వారిని నివాసముకొరకు గో శరీరము నిర్మించి యిచ్చెను. అది చాల దనగా అశ్వశరీరము నిచ్చెను. అదియును తమ కార్యములకు యధేచ్ఛగా సరిపోదనిరి.

3) గో,అశ్వశరీరములు చాలవనగా పరమాత్మ వారికి మానవ శరీరమునిర్మించి యిచ్చెను. అది చూచి వారు ప్రసన్నులై ఇది మాకు వశించుటకు సుందరముగా నున్నది. మేము హాయిగా ఈ శరీర మందుండి మామాకార్యములు, అవసరములు బాగుగా పూర్తి చేసుకొందుమనిరి. మనుష్యశరీరము పరమాత్మయొక్క సుందర శ్రేష్ఠరచన. ఇది దేవరుద్లభము. ఈ శరీరమునుండి యే జీవుడు పరమాత్మ ఆ జ్ఞానుసారము యధాయోగ్యసాధనల ద్వారా ఆయనను పొందును. దేవతలను ఈ మానవ శరీరమమందు యొగ్యస్థానముల ప్రవేశింపుడని ఆజ్ఞాపించెను.

4) సృష్టికర్త పరమేశ్వరుని ఆజ్ఞానుసారము అగ్ని వాగింద్రియమును, వరుణుడు రసనేంద్రియమును, వాయువు నాసికేంద్రియమును, అశ్వినీకుమారులు ఘ్రాణంద్రియమును, సూర్యుడు నేత్రేంద్రియమును, దిశాభిమానులగు దేవతలు శ్రోత్రేంద్రియమును, ఓషధులు వనస్పతులు, దేవతలు రోమములను, చర్మమును, చంద్రుడు మనోరూపమున హృదయమును, మృత్యుదేవత పాయుఇంద్రియరూప నాభియందు, జలాధిష్టానదేవత వీర్య రూపమున లింగమందు, ఇట్లు సమస్త దేవతలు తమ తమ ఉపయుక్త స్థానముల ప్రవేశించి సంస్థితులైరి.

5) అంతట ఆకలి దప్పులు తమ స్థానము నిర్దేశింపమని ప్రార్థింపగా, మీకు వేరే స్థానము అవసరములేదు. మీరు ఆయా అధిష్టాన దేవతల స్థానమే మీ స్థానము దేవతల ఆహారమున మీరు కూడా భాగస్తులు. కావున ఏయే దేవతల విషయ భోగార్థము గ్రహింప బడునో అందు మీకును భాగముండును. ఇంద్రియాభిమానదేవతల తృప్తిచే ఆకలి దప్పులు శాంతించును.

-----

తృతీయ ఖండము:- లోకములను లోకపాలురను సృజించిన పిదప పరమేశ్వరుడు వారి ఆకలి దప్పుల నివారణార్థము భోగ్య పదార్థమగు అన్నమును రచింప కోరెను.

2) ఇట్లు విచారణ చేసిన పరమాత్మ జలములను అనగా పంచమహాభూతములను తపింప జేసి వాని స్థూల రూప అన్నమును దేవతల భోగ్య వస్తువుగా సృజించెను.

(3)-10) మనుష్య రూపమున ఉత్పన్నమైన జీవాత్మ అన్నమును వాణి, ఘ్రాణి, చక్షురాది ఇంద్రియముల ద్వారా స్వీకరింప గోరెను. కాని అట్లు చేసిన ఆయా అవయవములచే అన్నమును నామము స్మరించిన తృప్తుడు కావలెను. కాని అట్లు కాలేనికారణమున ప్రశ్వాసరూపమున వాయువు ద్వారా అన్నమును లోనికి గ్రహించెను. కావున ప్రాణమే మనుష్యుని జీవనము.

11) పరమాత్మ జీవాత్మ తోకూడి యుండ సంకల్పించెను. పరమాత్మ సహయోగము చేతనే జీవాత్మ వాణ్యాదిఇంద్రియముల ద్వారా కర్మల చేయ సమర్ధుడగును. పరమాత్మ మనుష్య శరీరమున శిరస్సు, పాదములలో ఏ మార్గమున ప్రవేశింపవలెనని విచారించి.

12) పరమాత్మ మనుష్య శరీరమున బ్రహ్మరంధ్రము గుండా ప్రవేశించెను. కావున బ్రహ్మరంధ్రము పరమాత్మ ప్రాప్తి కలిగించుచు ఆనందము చేకూర్చునది, పరమేశ్వరుని హృదయ కాశము, సత్యలోకాది విశుద్ధ ఆకాశరూప పరమధామము స్థూల సూక్ష్మ కారణ పూర్ణ బ్రహ్మాండము ఈ మూడిటి ద్వారా పరమాత్మ ను పొందగలరు.

13) మనుష్యరూపమున ఉత్పన్నమైన పురుషుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీనికర్త ధర్త మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త ధర్తయని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.

14) మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన పురుషుడుపై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. నేను చూచితిని అను నామము చే పిలుతురు. అదియే పరోక్షరూపమున ఇంద్రనామమున వ్యవహరింతురు.

ద్వితీయ అధ్యాయము:- సంసార జీవుడు పురుష (తండ్రి) రూపమున తన సమస్త అంగములనుండి ఉత్పన్నమైన సారరూప వీర్యమును తన శరీరమందు బ్రహ్మ చర్యము ద్వారా వృద్ధి చేసి పిదప దానిని స్త్రీ గర్భాశయమున స్థాపించి జన్మ నొందును.

2) తండ్రిద్వారా స్థాపిత తేజము స్త్రీ ఆత్మ భావమున పొంది శరీరముయొక్క అంగముగానుండును. స్త్రీ తన శరీరమందు ప్రవేశించిన పతియొక్క ఆత్మ రూపమును గర్భమున ధరించి అన్నాదులచే పోషించి నియమ పాలన ద్వారా బాగుగా రక్షించును.

3) ఇట్లు పతియొక్క ఆత్మ స్వరూపమును గర్భమున ధరించిన గర్భిణీ స్త్రీని కుటుంబ సభ్యులు ముఖ్యముగా పతి అన్ని విధముల పోషించి సంరక్షించవలెను. జన్మాది నుండి యోగ్యుడగువరకు పుత్రునికి జాతకర్మాది సంసారములచే అభ్యుదయ శీలునిగా చేసి పెంచియున్న నానావిధ విద్యలను నేర్పించి ఉన్నతుని చేయవలెను. ఇట్లు మనుష్య పరంపర వృద్ధిచెందును. కావున పుత్రునికి తన తల్లి తండ్రుల యెడ భక్తి భావము సేవించుటయై కర్తవ్యము. తండ్రి పుత్రుని వంశోద్ధారకునిగా ప్రేమించవలెను.

4) పై చెప్పిన విధముగ తండ్రి తన ఆత్మ స్వరూపుడైన పుత్రుని యోగ్యునిగా తీర్చిదిద్ది తన ప్రతినిధిగా అగ్ని హోత్ర, దేవపూజ, అతిధి సేవాది వైదిక, లౌకిక శుభకర్మలను అప్పజెప్పి స్వయముగా కృతకృత్యుడై పితృఋణము తీర్చుకొని ఆయువు పూర్ణమైన పిదప ఈ శరీరము విడచి కర్మాను సారము గా మరియొక జన్మనొందుటయే జన్మ జన్మాంతర పరంపర. ఇట్టి జన్మమృత్యు పరంపర కష్టము నుండి విడివడుటకు మనుష్యుడు ప్రయత్నించవలెను.

5) గర్భస్థుడైన వామదేవఋషి ఆయుధార్ధ జ్ఞానముపొంది నేను అంతఃకరణ, ఇంద్రియ రూపదేవతల అనేక జన్మల రహస్యము తెలిసకొంటిని. జన్మాదులు, అంతఃకరణ, ఇంద్రియములకే గాని, ఆత్మకు లేవని విచారించి డేగ పక్షివలె జ్ఞాన రూప బలముచే శరీరరూప పంజరమును భేదించి దేహాభిమానమునుండి ముక్తి పొందెను.

6) జీవాత్మ తన శరీరమును తన స్వరూపముగా ఎంచినంతవరకు జన్మ మృత్యు పరంపర నడచును. జ్ఞానియగు వారు దేవ ఋషి తల్లి. గర్భమునుండి బయటకు రాగానే శరీర త్యాగముచే ఊర్ధ్వగతిని పొంది భగవానుని పరమధామము చేరి ఆప్తకాముడై అమృత త్వమును పొందును.

తృతీయ అధ్యాయము:- పూర్వఅద్యాయమునరెండు ఆత్మలగూర్చి చెప్పబడెను. పరమాత్మ సృష్టి రచన చేయుచు సజీవపురుషుని సృజించి అతని సహయోగమునకు పురుషుని (జీవాత్మ) హృదయ కుహరమున వశించెను. ఏ ఆత్మను ఉపాసించవలెనను ప్రశ్న ఉదయించగా జీవాత్మయగు పురుషుడు సమస్త ఇంద్రియకార్యములను ఎవరి సహయోగమున సంపన్నముచేయ గలుగు చున్నాడో అట్టి ఆత్మనే ఉపాసించవలెను అభిప్రాయమునకు వచ్చెను.

2) హృదయమందలి అంతఃకరణ రూప మనస్సునకు పూర్తి తెలిసి కొను శక్తి , ఇతర ఇంద్రియముపై ఆజ్ఞాపించి శాసనముచేయగలశక్తి వివేచనాశక్తి, అనుభవము పొందుశక్తి, చూచుట, తెలిసికొనుట, నిశ్చయ, మనన, స్మరణ, సంకల్ప, మనోరధ, ప్రాణ, కామన, శ్రీఘ్రచలన, శక్తులు , స్త్రీ సహవాసాభిలాష మొదలగుశక్తులన్నియు, స్వచ్ఛ జ్ఞాన స్వరూప పరమాత్మ నామశక్తులే.

3) సర్వులను సృజించి, శక్తినిచ్చి, రక్షించు జ్ఞాన స్వరూప పరమాత్మయే ఉపాస్య దైవము. ఇంద్రాది దేవతలు, పంచ మహాభూతములు, అండజ స్వేదజ, ఉద్భిజ, జీవులు, పశుపక్ష్యాదులు మొదలగు సర్వ జీవులు పరమాత్మయొక్క శక్తిని పొంది తమ తమ కార్యములు చేయ సమర్ధ వంతములగుచున్నవి. ఇంద్రుడు, ప్రజాపతి అను నామముల పేర్కొన బడినవారు కూడా ఉపాస్య దేవతయగు పరమాత్మయే.

4) ఇట్లు ప్రజ్ఞానీ స్వరూప పరమాత్మను తెలిసికొనినవారు, శరీర త్యాగము చేసి పరమానంద పరమధామమును చేరి పరబ్రహ్మ గూడి సంపూర్ణ దివ్య అలౌకిక ఆనందమును పొంది అమరు లగుదురు.

-----

ఐతరీయోపనిషత్తు సమాప్తము.

ఓం శాంతిః శాంతిః శాంతిః

-------------

SARA SUDHA CHINDRIK    Chapters