Brahma Suthra Vivruthi    Chapters    Last Page

పీఠిక

ప్రపంచ గ్రంథములలో కెల్ల ఉతృష్టగ్రంథము

బ్రహ్మసూత్ర శంకరభాష్యమే.

ప్రపంచములోని విజ్ఞానములలోకెల్ల ఉత్కృష్టమైన ఉపనిషద్విజ్ఞానము ప్రపంచ భాషలలోకెల్ల గొప్పదైన సంస్కృత భాషలో వ్యక్తము చేయబడగా, ఆ విజ్ఞానసారము వ్యాస రచిత బ్రహ్మ సూత్రములలో సూత్ర రూపముగ సమకూర్చబడినది. అట్టి బ్రహ్మ సూత్రముల మీద పరమేశ్వరావతారులగు శ్రీ శంకర భగవత్పాదులవారు ఆ దేవభాషలో రచించిన శారీరక మీమాంస అను బ్రహ్మసూత్ర భాష్యము ప్రసన్న గంభీరమైన శైలిలో వ్యాకరణ శాస్త్రాలంకార భూషితమైన భాషలో శ్రుతిసమ్మత తర్కయుక్తుల చేతను, మీమాంసాన్యాయముల చేతను సాధింపబడిన అద్వైత సిద్ధాంతములతో పునరావృత్తి రహిత మోక్షస్వరూపమును-తత్సాధనములను విశదీకరించుచూ, సర్వజ్ఞత్వమును ప్రకటించుటయే కాక, సూత్రకర్తలైన వ్యాసులవారి మెప్పునుకూడ పొంది అజ్ఞానాంధకారమును పోగొట్టుచు తీక్షణమైన సూర్యబింబమువలె ప్రకాశించుచూ ప్రపంచములోని గ్రంథములలో కెల్లను, సంస్కృత వాఙ్మయమంతటిలోను ఉత్తమోత్తమ గ్రంథరాజమై మూర్ధన్యస్థాన మలంకరించుచూ, అసదృశ##మై, ప్రపంచ మేధావులందరి ప్రశంసలను పొంది దేదీప్యమానముగ విరాజిల్లుచున్నది.

నేను పూర్వాశ్రమములో న్యాయవాది వృత్తిలో నుండగా నాచే పలువురి సహాయముతో బందరులో స్థాపింపబడిన సాంగవేద పాఠశాలలో తర్కవేదాంత సార్వభౌములై ఆంధ్రదేశ పండితోత్తములలో పండితరాజులుగ గౌరవింప బడుచున్న శ్రీ మండలీక వేంకట శాస్త్రిగారిని ప్రధానాధ్యాపకులుగ నేర్పాటుచేసి వారియొద్ద ప్రస్థానత్రయ భాష్యములను అధ్యయనము చేసితిని. తదుపరి తురీయాశ్రమానంతరము నేను శ్రీ శృంగేరీ జగద్గురువులును బ్రహ్మవేత్తలును జీవన్ముక్తులును అగు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ పూజ్యపాదుల యొద్దను, తత్కర కమల సంజాతులగు శ్రీ మదభినవ విద్యాతీర్థ పూజ్యపాదుల యొద్దను ప్రస్థానత్రయ భాష్యశాంతిని చేయు భాగ్యము కలిగినది. తరువాత వారల ఆశీస్సులతో నేను భాష్య ప్రవచము చేయునపుడు, బ్రహ్మసూత్ర శంకర భాష్యము యొక్క అమూల్యత్వము బాగుగ గోచరించినది. ఇంకను నేను అధ్యాస భాష్యమును, మిగతా సూత్రముల మీద భాష్యమును ఉపన్యాస రూపముగ చెప్పుచుండగా ఆంధ్రదేశ పండితులలో గొప్ప ప్రఖ్యాతిని పొంది బహు శాస్త్రకోవిదులయిన శ్రీ కంభంపాటి రామమూర్తి శాస్త్రిగారున్ను, శ్రీ కుప్పా శ్రీఆంజనేయ శాస్త్రిగారున్ను నా ఉపన్యాసములను విని, సంస్క్రృత భాషాజ్ఞానము లేని జిజ్ఞాసువులకు అత్యంత క్లిష్టములగు అద్వైత వేదాంత విషయములను సులభముగ తెలియులాగున నేను బోధించు చున్నానని ఆ విధానమునకు తమ సంతోషమును వెలిబుచ్చి, ఆ పద్ధతిలో గ్రంథములను వ్రాయవలసినదిగ నన్ను ప్రోత్సహించిరి. అంతట నేను బ్రహ్మసూత్ర భాష్య సారమును విషయ భేదము ననుసరించి తదనుగుణముగ విభాగము చేసి బ్రహ్మసూత్ర కౌముది అను పేరుతో మూడు భాగములుగ ఆంధ్ర భాషలో సులభ శైలిలో రచించితిని. తరువాత తర్క వ్యాకరణాది శాస్త్రజ్ఞానములేనట్టిన్ని సంస్కృత భాషాజ్ఞానము మాత్రము కలిగినట్టిన్ని జిజ్ఞాసువులగు ముముక్షువులకు సులభముగ తెలియులాగున సులభ సంస్కృత భాషలో ప్రతి సూత్రమునకు ప్రతిపదార్థముతో శంకరభాష్యసారమును బ్రహ్మసూత్ర వివృతి అను పేరుతో నీ గ్రంథమును రచిచితిని. ఇంకను సంస్కృత భాషాజ్ఞానము లేని జిజ్ఞాసువులకు సులభముగ తెలియుటకుగాను ఆంధ్రభాషలో బ్రహ్మసూత్రార్థ వివరణము అను దానిని రచించి వివృతితో చేర్చితిని.

నే నీవిధముగ బ్రహ్మసూత్ర కౌముదిని, బ్రహ్మసూత్ర వివృతిని బ్రహ్మసూత్రార్థ వివరణమును రచించుటలో పైన చెప్పినట్లుగ పండితుల ప్రోత్సాహమటుండ, ముఖ్యకారణమేమనగా, సూరేశ్వరాచార్యులవారు నైష్కర్మ్యసిద్ధిలో ''స్వబోధ పరిశుద్ధ్యర్ధం బ్రహ్మవి న్నికషాశ్మసు'' అని నుడివినట్లు నేను శ్రీ శంకర భగవత్పాదుల అనుగ్రహము చేతను. గురువరేణ్యుల ఆశీస్సులచేతను పొందిన తత్త్వజ్ఞానము సంపూర్ణముగను నిర్దుష్టముగను ఉన్నదా, లేదా, అని నాకంటె పెద్దలగు బ్రహ్మవేత్తలు పరీక్షించుటకుగాను ఈ గ్రంథములను రచించితిని. వారు ఈ గ్రంథములను చూచి నిర్దుష్టములని చెప్పినచో నేను కృత కృత్యుడనని సంతసించెదను. లోపములున్నవన్నచో వాని సవరించుకొని కృత కృత్యుడనగుటకు ప్రయత్నించెనదను. ఇదియే ఈ గ్రంథ రచనలలో నాముఖ్యాభిప్రాయము ఈ వివృతి వివరణ గ్రంథములను రచించిన తరువాత వీనిని వేదభాష్యమును ప్రస్థానత్రయ శంకరభాష్యములను యథావిధిగ గురువుల యొద్ద అధ్యయనము చేసి ప్రవచనము చేయుచు, ఆంధ్ర దేశములో మహర్షి కల్పులుగ ఆదరింపబడుచున్నట్టిని, బందరు సాంగవేద పాఠశాలలో ప్రధానాధ్యాపక పదవి నలంకరించినట్టిన్ని శ్రీ కుప్పా లక్ష్మావధానిగారు చదివి సంస్కరించి అచ్చుకు సిద్ధముచేయించి బందరు విజయా ప్రెస్సులో అచ్చు వేయించిరి. ఈ విషయములో శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గారను ప్రఖ్యాత పండితోత్తములును ఎంతయో తోడ్పడిరి.

ఈ గ్రంథమును అచ్చు వేయుటకుగాను గుంటూరులో గొప్ప ఆస్తికోత్తములుగను, దాతలుగను, భక్తిశిఖామణులుగను విరాజిల్లుచున్న శ్రీ పోలిసెట్టి సోమసుందరశ్రేష్ఠి (పుగాకు వ్యాపారస్థులు) గారి పుత్రరత్నమగు శ్రీ సీతారామాంజనేయులుగారితో చెప్పగా వారున్ను వారి సోదరులున్ను తమ సహజమగు ఔదార్యముతో తమ తండ్రిగారి జ్ఞాపకార్థమై సహస్ర రూప్యములను సమర్చించిరి. ఈ గ్రంథముద్రణకు ఇట్టి అమూల్య సహాయమును గావించిన శ్రీ పోలిసెట్టి సీతారమాంజనేయులు గారికిన్ని వారి సోదరులకున్ను వారందరి కుటుంబములకున్ను ఆయురారోగ్య ఐశ్వర్యములునుసకల శ్రేయస్సులును కలుగుగాక అని మానారా యణస్మరణ పూర్వక ఆశీస్సులు.

ఇంకను ఈ గ్రంథమును సంస్కరించి ఎంతో తోడ్పడిన శ్రీ కుప్పాలక్ష్మావధానిగారికిని, వారితో సహకరించిన శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గారికిని, ఈ గ్రంథమును గురించి ప్రశంసలను గావించిన పండితోత్తములగు శ్రీ మండలీక వేంకట శాస్త్రీగారికిని, శ్రీకుప్పా లక్ష్మావధానిగారికిని, శ్రీ భాగవతుల కుటుంబరావు ఎం. ఏ. గారికిని సకల శ్రేయస్సులు కలుగుగాక.

నాకు గురువరేణ్యులును జగద్గురువులును అగు శ్రీ శృంగేరీ పీఠమహాస్వాములవారు ఈ గ్రంథమును గురించి తమ అమోఘ ఆశీస్సులను అనుగ్రహించినందులకు నాకృతజ్ఞతాపూర్వక సాష్టాంగ నమస్కారములు.

శ్రీ గాయత్రీ పీఠము

శంకర మఠము

మచిలీపట్టణము, కృష్ణాజిల్లా

సౌమ్య సంవత్సర

శంకర జయంతి

ది 21-4-1969

ఇట్లు

విద్యాశంకర భారతీ స్వామి

Brahma Suthra Vivruthi    Chapters    Last Page