Brahma Suthra Vivruthi
Chapters
Last Page పరిచయము శ్రీ వేదవ్యాస భగవానునిచే నుపనిబద్ధములు బ్రహ్మసూత్రములు. ఇందు ప్రతిపాద్యము బ్రహ్మతత్త్వము. కాననే వీనికి బ్రహ్మ సూత్రములని ప్రసిద్ధి యేర్పడినది. వీనికి శ్రీ శంకరభగవత్పూజ్యపాదులు భాష్యమును రచించిరి. ఈ గ్రంథము అద్వైత వేదాంత సిద్ధాంతమునకు పట్టుకొమ్మ. ఇందు జీవాత్మ పరమాత్మలకు అభేదము నిరూపింప బడినది. దృశ్యమగు నీగిరి నదీ సముద్రాది సమస్త ప్రపంచమునకు మిథ్యా త్వమును స్థాపింపబడినది. ఈ యంశమున శ్రుతి స్మృతి పురాణములును, యుక్తులును ప్రమాణముగ నిందు ప్రదర్శింప బడినవి. కాగా నీ యంశము (జగన్మిథ్యాత్వము - జీవబ్రహ్మైక్యము) శ్రుతిస్మృత్యాది సర్వ ప్రమాణ సమ్మతమనియు, కాననే ఈవిజ్ఞానము సర్వానర్థమూలమగు అజ్ఞానమునకు నివర్తకమై పరమ పురుషార్థ (ముక్తి) హేతువు కాగలదనియు, ధ్రువపరుపబడినది. కాన నీ గంథము ముముక్షువులగు వారి కవశ్యపఠనీయము, ఏతదర్థావగాహన మత్యంతావశ్యకమును నగుచున్నది. ఇందలి ప్రతిపాద్యాంశములు నిశిత బుద్ధిగ్రాహ్యములు గాని సామాన్య జనగ్రాహ్యములు కావు. సాంఖ్య న్యాయ పూర్వమీమాంసాది శాస్త్ర కర్తలు శ్రీ కపిల కణాద జైమిన్యాదుల కేతత్ర్పతిపాద్యార్థములగు జగన్మిథ్యాత్వ జీవబ్రహ్మైక్యముల పట్ల సంప్రతిపత్తి లేదు. బౌద్ధ జైనాదులును ఈకక్ష్యకు చెందినవారే. వారి వారి యాశయములు, వారి వారి శాస్త్రీయ ప్రక్రియలు, అందు వారు ఉదహరించిన యుక్త్యాదులు నిందు ప్రదర్శింపబడి యవి శ్రుతి యుక్త్యాది ప్రమాణ విధురములని, అసారములని స్ఫుటముగ ప్రతిపాదింపబడినది. కాన నేతచ్ఛాస్త్ర (బ్రహస్మూత్ర - తద్భాష్య) ప్రమేయములను సాంఖ్యన్యాయ పూర్వ మీమాంసా బౌద్ధజైనాది శాస్త్ర ప్రక్రియలను, తన్మర్యాదలను గుర్తించినవారు మాత్రమే అవగాహనము చేసికొనగల్గుదురు. తదన్యులకవి దురవగాహములు. బ్రహ్మాత్మైక్యావగతి లేకున్న ముక్తి (పరమ పురుషార్థము) సంభవించదు. విచారించి చూడ ముక్తిహేతువగు బ్మహ్మాత్మైక్యావగతి సర్వశాస్త్ర ప్రమేయావగతి పూర్వకము గాన నిది (బ్రహ్మాత్మైక్యావగమము) శాస్త్ర పాండితిని గడించుకొననేరని యీ కాలపు ముముక్షుప్రజానీకమునకు దుస్సాధమగు కార్యము అను భావము తోచుటయు, తదర్థ ప్రయత్నము పట్ల అత్యంత నైరాశ్యము కలుగుటయు సంభవించు చున్నది. ఇట్టి స్థితిని గుర్తించి ఆధ్యాత్మిక పరమార్థ తత్త్వములను లోకమున నలుగడలను ప్రచారముచేయ దీక్షబూనిన శ్రీ గాయత్రీ పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ విద్యా శంకర భారతీ స్వామివారు సాంఖ్యాది దర్శనముల యందు పాండిత్యముల గడించని వారికిని బ్రహ్మసూత్ర శంకరభాష్య ప్రతిపాద్యార్థము లనాయాసముగ బోధపడుటకై యీ బ్రహ్మ సూత్ర వివృతి యను గ్రంథమును రచించి సంస్కృత భాషాజ్ఞానము గూడ లేని వారి నుద్దేశించి తెనుగు భాషలో బ్రహ్మ సూత్రార్థ వివరణము అను గ్రంథమును గూడ సమకూర్చి యీ రెండిటిని చేర్చి ముద్రింపించి లోకమున కందజేసిరి. శాస్త్ర గ్రంథముల ననువదించుట యనునది సామాన్య కార్యము కాదు. అది గురుతర కార్యము, ఆధిగతతత్త్వులగు పండితులు చేబూనదగిన కార్యమయ్యది. శిష్యాను జిఘృక్షతో చేయబడిన శ్రీ స్వామివారి యీ కృషి మిక్కిలి ప్రశంసాపాత్రముగ నున్నది. ఇందు శ్రీ స్వామివారిచే గురుముఖైక వేద్యములు, పండిత మాత్రగ్రాహ్యములు నైన బ్రహ్మ సూత్రముల యొక్క అర్థములు శ్రీ శాంకర భాష్యానుసారముగ సులభముగ బోధపడుటకు ఉభయ భాషలయందును ప్రతిపదార్థ ప్రదర్శన పూర్వకముగ బ్రహ్మ సూత్రములు వివరింప బడినవి. నాతి సంగ్రహముగ శాంకరభాష్య భావ విశేషములును విశదీకరింప బడినవి. ద్వితీయాధ్యాయ ద్వితీయ పాదమునందు అద్వైత వాద ప్రతిపక్ష భూతములగు సాంఖ్య - వైశేషిక. బౌద్ధ - జైనాది వాదములను ప్రతిక్షేపించుపట్టులలో ఆయా దర్శనముల స్వరూపము తత్తచ్ఛాస్త్రీయ ప్రక్రియలను ప్రదర్శింపచుచు చక్కగ వివరింప బడినది. దీన తత్తద్దర్శన పరిచితియు నీ గ్రంథ పాఠకులకు సంభవించ గలదు. ఏతద్గ్రంథాధ్యయనము ముముక్షువులకు మోక్షోపయోగి విజ్ఞానమునకు ఉపకారకమును, బ్రహ్మసూత్ర శాంకర భాష్యాధ్యయనేచ్ఛువులకు తదర్హతను సమకూర్చునదియును కాగలదు. సర్వసంశయవిచ్ఛేదకము, హృదయంగమము, సత్సంప్రదాయాను బద్ధమునునగు నేతద్గంథ రచనా పద్ధతిని పరికించి చూడ శ్రీ స్వామివారి అద్వైతవేదాన్త శాస్త్ర వైదుష్యమసామాన్యమనియు, స్వాత్మతత్త్వానుభూతి సముల్లసితమును ననియు స్పష్టపడగలదు. సంస్కృతాంధ్ర భాషలలో బ్రహ్మ సూత్రార్థముల వివరించుగ్రంథముల నెందరో మహాత్ములింతకు పూర్వము రచించి యుండిరి. ఐనను శ్రీ స్వామివారి యీ రచన నాతివిస్తృతమై - స్పష్టప్రతీతి సంపాదకమై విశదముగ నున్నది యనుట అతిశయోక్తి కానేరదు. శ్రీ స్వామివారింకెన్నియో అద్వైత వేదాంత శాస్త్రానుబంధి సంద్గ్రంథములను రచించి వెలువరించి యుండిరి. అందిది తలమానికముగ నెన్నదగిన గ్రంథరాజము. ఈ గ్రంథము తెనుగునాడు నందలి సంస్కృతాంధ్ర సాహితీయోషకొక నూత్నరత్నభూషయై వెలుగును సమకూర్చ గలదు. మరియు తత్త్వజిజ్ఞాసువులు, ముముక్షువులు, నగు సాధు పుంగవులకీ సద్గ్రంథము సర్వధా ఉపకారకమై తత్ కృతజ్ఞతల నందుకొనుచు చిరకాలము మనగలదు. సాంగవేద పాఠశాల బందరు ఇట్లు కుప్పాలక్ష్మావధాని