Brahma Suthra Vivruthi    Chapters    Last Page

శ్రీ సద్గురు పాదుకాభ్యాం నమోనమః

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గాయత్రీ పీఠాధీశ్వర శ్రీ విద్యాశంకర భారతీ యతివర విరచితము

బ్రహ్మసూత్రార్థవివరణము

శ్లో|| సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం

చంద్రశేఖర పర్యన్తాం వందే గురు పరంపరాం ||

బ్రహ్మసూత్రార్థ వివరణము: :- భగవత్స్వ రూపులగు శ్రీ వేదవ్యాసులవారిచే కూర్చబడిన సమస్త వేద తాత్పర్య ప్రతిపాదకములును అల్పాక్షరములును పరమ గంభీర భావగర్భితములును నగు బ్రహ్మ సూత్రములు తర్క వ్యాకరణ పూర్వ మీమాంసాది శాస్త్ర ములయందు గాని, సంస్కృత భాషయందు గాని విశేష పరిచయము లేకున్నను సంస్కృత భాషయందు సామాన్య పరిచయము కలిగియుండి బ్రహ్మ సూత్రార్థ జిజ్ఞాసువులు, ముముక్షువులు నగువారికి బ్రహ్మ సూత్రములయందు ప్రతిపాదింపబడిన మహార్థములు సులభముగ భోధపడుటకై సులభ##శైలితో వాక్య రూపమున ''బ్రహ్మ సూత్ర వివృతిః'' అను గ్రంథమున నా సూత్రముల యందలి భావమును విశదీకరించి యుంటిమి.

ఇపుడు సంస్కృత భాషయందు పరిచయము లేకయు ముముక్షువులై బ్రహ్మ సూత్రార్థ జిజ్ఞాసువులైన వారికి తేటతెల్లముగ నా బ్రహ్మ సూత్రముల తాత్పర్యము బోధపడుటకునై యీ ''బ్రహ్మ సూత్రార్థ వివరణము'' అను గ్రంథము మాచే రచింపబడు చున్నది.

బ్రహ్మ సూత్రములలో ఉపనిషత్తులన్నియు ముఖ్యముగా నిర్విశేషము నిర్గుణము, ప్రత్యగభిన్నము నగు బ్రహ్మమునందే తాత్పర్యము కలిగియున్నవనియు, అట్టి బ్రహ్మమే సత్యము, ఈకాన్పించుచున్న (దృశ్యమగు) జగత్తు మిథ్యయనియు, జీవాత్మ బ్రహ్మకంటె భిన్నము కాదనియ, పరమపురుషార్థ రూపమగు మోక్షము జ్ఞానముచేతనే లభించును గాని మరియే యితర సాధనములచేతను లభించునది కాదనియు నిట్లు అద్వైత సిద్ధాంతము స్పష్టముగా నిరూపించ బడియెను.

బ్రహ్మ సూత్రములని పిలవబడు నీ గ్రంథమున నాలుగధ్యాయములు గలవు. అందు నొక్కొక్క అధ్యాయమున నాల్గు నాల్గు పాదములుండును. మొత్త మీగ్రంథమున నైదు వందల యేబది యైదు సూత్రములు గలవు. అవి నూట తొంబదిరెం డధికరణములుగ నుండును. వానిలో ప్రత్యధి కరణమునను ఈ అద్వైత శాస్త్రమునకు సంబంధించిన బ్రహ్మ జ్ఞానోప కారకమగు నొక్కొక్క విషయముపూర్వోత్తర పక్షములనుప్రదర్శించుచు విచారింపబడి నిస్సందిగ్ధముగ నిది యిట్లని స్పష్టముగ నిర్ణయింపబడి యుండును.

ఈ గ్రంథమున ప్రతిపాదింప బడిన అద్వైత సిద్ధాంతము ననుసరించి సంసార మనబడు నీయనర్థసముదాయ మంతయు నధ్యాన మూలకమేయని నిర్ణయము. అధ్యాస యనగా అనాత్మ రూపములగు దేహేంద్రియాదుల యందు ఆత్మయను భ్రాంతియే. అట్టి సర్వానర్థములకు మూలమగు అధ్యాసను సంపూర్ణముగ నశింప జేయుటకును, అద్వితీయాత్మ తత్త్వ విజ్ఞానము కలుగ జేయుటకును, శ్రీ భగవ త్స్వరూపులగు వేద వ్యాసులచే బ్రహ్మ సూత్రములు రచింప బడినవి. ఆ సూత్రములకు శ్రీ శంకర భగవత్పూజ్య పాదులవారిచే నమూల్యమగు భాష్యము రచింపబడి సర్వోత్కృష్టముగ విరాజిల్లు చున్నది. దాని ననుసరించియే యిప్పుడు మాచే బ్రహ్మ సూత్ర తాత్పర్యమును విశదపరచు ఈ వివరణము గావింప బడుచున్నది.

ఈబ్రహ్మ సూత్ర గ్రంథమునకు సంబంధించి నాల్గ ధ్యాయములకు వరుసగ సమన్వయాధ్యాయమని, అవిరోధాధ్యాయమని, సాధనాధ్యాయమని, ఫలాధ్యాయమని వాడుక కలదు.

Brahma Suthra Vivruthi    Chapters    Last Page