Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

18. సంస్కృతభాషలో నున్న కీర్తనలకు, శ్లోకములకు సామాన్య భావానువాదము

పుట 8 కీర్తన - చిత్సభానాయకమ్‌

ఓచిత్తమా చిత్సభానాయకుడగు (చిదంబరేశ్వరుడగు)

సాంబశివుని సేవింపుము.

అతడు హృదయమునందలి అజ్ఞానమును పోగొట్టును. (పోగొట్టినాడు) తనపవిత్రమైన నటనచే, (నాట్యము నందు) దుర్గను జయించినాడు. ప్రపంచమును పాలించును. అట్టి శివునిసేవింపుము.

అతడు దివ్యరత్నహారములను ధరించును - దీనుల తాపమును హరించును - భోగమోక్షముల నిచ్చును. అతని సంచారము పవిత్రము. అతడు పాపములను పోగొట్టును. కవులు ఆ శివుని భక్తితో స్మరింతురు. కామకోటి శాస్త్రి చే స్తుతింపబడిన చరణములుగల ఆశివుడు కరుణామయుడు. మునిజనుల హృదయమునందు విహరించును. అచిత్సభానాయకుని సేవింపుము.

పుట 8 కీర్తన - రమాపతే

ఓ లక్ష్మీపతీ! నిరంతరము నీ దాసుడ నగు (నీకు నమస్కరించు) నాయందు దయను చూపుము.

మంచిమనసు కలవారికి సంతోషమును కలుగజేయు వాడా! దయామయహృదయా! లక్ష్మీపతి! నన్ను రక్షింపుము. ఆనందముతో కూడినవాడా! హృషి కేశా! (సర్వేన్ద్రియప్రవర్తకా) చిదానందా! మురారీ! నా హృదయమున భూమోదయమును (పరమాత్మ యొక్క ఉదయమును - అనుభవమును) దామోదరా! భీమునిచే పూజింపబడినవాడా! గజేంద్రునకు వరము నిచ్చినవాడా! నిర్మలమైన గుణములు కలవాడా! చంద్రుని వంటి ముఖముగలవాడా! కోరిన కోర్కెలను తీర్చువాడా! (పుష్పములవంటి పండ్లు (దంతములు) కలవాడా! నీలమేఘచ్ఛాయ గలవాడా (కాంతిచే నల్లని మేఘమును జయించినవాడా!)

దిక్పాలుర మదాతిశయమును అణచివేసిన రావణుని జయించి, అతని హృదయమును శిరసును ఛేదించిన పరాక్రమశాలీ! విభూ! భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము, చంద్రుడు, సూర్యమండల మనెడు ప్రకాశవంతమైన ఆభరణములు కలవాడా! ఆశ్రయించిన వారికి రక్షించిన వాడా, కామకోటిశాస్త్రిచే స్తుతింపబడినవాడా! లక్ష్మీరమణా! కరుణాలయా! అమృతమును పోలిన మృదువాక్కులు గలవాడా! ఈశ్వరాదులచే స్తుతింపబడినవాడా! అపారమైన దయ గలవాడా! అచ్చుతా! సుగుణా!

పద్మములవంటి నేత్రములు కలవాడా! సుజనులకు ఆశ్రయమైన వాడా! రాక్షసులను సంహరించినవాడా! సాటిలేని సుచరిత్ర కలవాడా! అడ్డులేని గరుడవాహనము గలవాడా! (గరుడగమనా!) నీచుడనగు (అల్పుడనగు) నన్ను రక్షింపుము.

పుట 9 కీర్తన - అంబశివే

మన్మథుని నాశనము చేసిన శివుని అంకమున నివసించు, ఓ అంబా, పార్వతీ! నిన్ను ఉపాసించుచున్నాను. బ్రహ్మవిష్ణువులచే పూజింపబడితివి - దిగంబరుడైన శివునిగూడ వస్త్రధారునిగనే (సాంబరునిగనే) చూతువు. తుంబురుడు మొదలగువారి గానమునందు ఆసక్తికలదానవు. బాలకుబాంబా! శంకరీ! కాదంబరి అను మద్యమును సేవించుదానా! సిద్ధులయొక్క మనసులనెడు పద్మములయందు బంధింపబడిన భర్త గలదానా! సురతే! వరదే! అమృతమయమైన సంభాషణకల దానా! (అమృతమువలె మధురముగ మాటలాడుదానా!) సందేహము వచ్చినప్పుడు యథార్థమైన విషయమును (సత్యమును) నాబుద్ధికి వెంటనే భాసింపచేయుము.

పామరులైన మనుష్యుల సహవాసమును నానుండి దూరముగ నుంచుము. (నాకు కలుగకుండ చూడుము) నీ చరణసేవకుడ నగు నన్ను బాగుగ చూడుము. పద్మదళములవంటి నేత్రములు కలదానా! కామేశ్వరి! కామకోటిశాస్త్రి యొక్క వాక్కుల సమూహమే ఇల్లు గాగలదానా! అంబా! నిన్ను నేను పాసించుచున్నాను.

పుట 21 శ్లోకము - సత్సంగత్వే

సత్పురుషులతో స్నేహము చేయుటవలన నిస్సంగ త్వము - (దేనియందు సంగము లేకుండుట) కలుగును - నిస్సంగత్వమువలన మోహము పోవును. మోహము నశించుటవలన, చలనములేని (స్థిరమైన) తత్త్వజ్ఞానము కలుగును. దాని వలన జీవన్ముక్తి కలుగును.

'' దర్శనాదభ్రసదసి - చిదంచవ క్షేత్రమున చిదంబరేశ్వరుని చూచుటవలనను, కమలాలయము అనగా తిరువారూరు అనే క్షేత్రమున పుట్టుట వలనను, కాశియందు మరణించుట వలనను, అరుణాచలమును స్మరించుటవలనను. మోక్షము కలుగును.

పుట 33 - లలాటేత్రైపుండ్రమ్‌

నుదుటియందు త్రిపుండమును (మూడు విభూతిరేఖలు) కస్తూరి తిలకమును (బొట్టు) మెడలో రుద్రాక్షమాలను కటియందు కౌపీనమును (మొలకు, గోచి) శిరసునందు భయంకరమైన పామును, చంద్రుని ధరించుచు అందఱకు ప్రదీపము (పెద్ద వెలుగు) అయిన అరుణగిరి యోగి సర్వోత్కృష్ణుడై యున్నాడు.

పుట 34 - వరుణాది

వరుణుడు మొదలైన దేవతలచే పూజింపబడినట్టియు, బాలసూర్యుని కాంతిగలట్టియు, కరుణామూర్తి అయినట్టియు అరుణాచలనాథునకు నమస్కారము.

పుట 43 యేభూతా బలి మిచ్ఛన్తి

ఏభూతములు బలిని కోరుచున్నవై, రాత్రింబవళ్ళు తిరుగుచున్నవో -

పుట 51 వాగర్థావిన

శబ్దార్ధజ్ఞానము కలుగుటకై, శబ్దార్థములవలె పూర్తిగా కలిసియున్న, ప్రపంచమునకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుచున్నాను.

పుట 110 న హిజ్ఞానేన సదృశం

జ్ఞానముతో పోల్చదగిన పవిత్రమైనది ఈ లోకములో మఱియొకటి లేదు.

పుట 113 శుక్లాంబరధరం

తెల్లని వస్త్రమును ధరించి నట్టియు, చంద్రుని కాంతివంటి కాంతిగలట్టియు, నాలుగు చేతులు, గలట్టియు ప్రసన్నమైన ముఖముగల విష్ణువును, (సర్వవ్యాపకుని) అన్ని విఘ్నములను నశింపజేయుట కొఱకు ధ్యానింపవలెను. ఈ శ్లోకము విఘ్నేశ్వర పరమగుచో, సర్వవ్యాపకుడగు విఘ్నేశ్వరుని ధ్యానింపవలెను. అని చెప్పవలెను. విఘ్నేశపదమును ఆధ్యాహారము చేసికొనవలయును.

పుట 114 ఉల్లంఘ్య

సముద్రజలమును, ఒక ఆటగా దాటి

పుట 121 అపదామపహర్తారం

ఆపదలను హరించువాడును, సర్వసంపదల నిచ్చువాడును, లోకమున కంతకును ఆనందము నిచ్చువాడును అగు శ్రీరామునకు మాటిమాటికి నమస్కరింతును.

పుట 123 కావేరీ విరజా

కావేరీనదియే విరజానదీజలముల కాశ్రయము. (కావేరియే విరజానది) శ్రీరంగస్వామి మందిరమే వైకుంఠము. శ్రీరంగేశ్వరుడే శ్రీమహావిష్ణువు. శ్రీరంగమే ప్రత్యక్ష పరమపదము.

పుట 123 మాదృశానాం

ఓ పురుషోత్తమా! నావంటి దిక్కులేని వారికి దిక్కెవరు? ఓ అర్జునా! నేను సన్యాసివేషమున నుండి బోధింతును.

పుట 125 అర్తావిషణ్ణా ః

కష్టములలో నున్నవారు, దుఃఖములలో నున్నవారు, శిధిలమైన వారు, భయపడిన వారు, భయంకరమైన రోగముతో బాధపడువారు నారాయణ అను శబ్దమును బాగుగా కీర్తించినంత మాత్రముననే, దుఃఖములనుండి విముక్తిని పొంది సుఖింతురు.

పుట 126 జ్ఞానానందమయం

జ్ఞానానందమయుడు, స్వచ్ఛమైన, స్ఫటికముయొక్క ఆకారము గలవాడు, అన్ని విద్యలకు ఆధారమైనవాడు అగు హయగ్రీవదేవుని ఉపాసించుచున్నాను.

'' గురవే సర్వలోకానాం

అన్ని లోకములకును గురువు, సంసారమనెడు వ్యాధితో బాధపడువారికి వైద్యుడు, అన్ని విద్యలకు నిధి అయిన దక్షిణామూర్తికి నమస్కారము.

పుట 126 మౌనవ్యాఖ్య

మౌనమనెడు వ్యాఖ్యానముచే పరబ్రహ్మతత్త్వమును ప్రకటించినట్టియు, యువకుడైనట్టియు, వృద్ధులును, బ్రహ్మనిష్ఠులునైన ఋషిసమూహములచే పరివేష్ఠింప బడి నట్టియు, చేతియందు చిన్ముద్రను ధరించినట్టియు, ఆత్మారాయుడు ఆనందముతో ఒప్పియున్న ముఖము గలవాడు. ఆచార్యశ్రేష్ఠుడు నైనట్టియు, శ్రీదక్షిణామూర్తిని స్తుతింతును.

పుట 126 మందస్మితం

చిరునగవు గలవాడు, ప్రకాశించుచున్న అందమైన ముఖముగలవాడు, నూరుకోట్ల మన్మథుల సౌందర్యము దివ్యమైన ఆకారము గలవాడు, రాగిరంగుకలిగి కోమలముగ నున్న జడలలో చంద్రరేఖను ధరించినవాడు, దయాళువు, మఱ్ఱిచెట్టు మొదట కూర్చొనిన వాడునగు ఆదక్షిణామూర్తిని చూచుచున్నాను.

'' 126 అనన్యా

''నేను భగవంతుడైన వాసుదేవుడను'' అని అనన్య భావముతో అద్వైతదృష్టితో నన్ను నిత్యము ఉపాసింతురో, వారియొక్క యోగక్షేమ భారమును నేనే వహింతును.

'' 127 రాఘవత్వేభ వత్‌సీతా

శ్రీమహావిష్ణువు శ్రీరాముడుగ నవతరించినపుడు, శ్రీమహాలక్ష్మి సీతగా అవతరించినది. శ్రీకృష్ణావతారమున రుక్మిణిగ అవతరించినది. ఇతరావతారములయందు కూడ ఆమె ఆయనతోనే యున్నది.

'' 128 పరిత్రాణాయ

సాధువులను రక్షంచుటకు, దుష్టులను నశింపచేయుటకు, ధర్మసంస్థాపన చేయుటకు, నేను యగయుగముల అవతరింతును.

'' 130 ఆత్మా త్వం గిరిజామతిః

నా ఆత్మయే నీవు - నామనస్సు, పార్వతి - నా ప్రాణములు నీకు సేవకులు (పరివారగణములు), నాశరీరము నీ ఇల్లు, నేను ప్రపంచవిషయముల ననుభవించుట నీకు నేను చేయుపూజ. నేను నిద్రించుట సమాధిస్థితి - నేను అటు నిటు తిరుగుట నీకు ప్రదక్షిణము చేయుటయే. నామాట లన్నియు నిన్ను గురించి చేయు స్తోత్రములు. ఓ శంభూ! నేను చేయుపనులన్నియు నీ ఆరాధనమే.

పుట 131 ఏకాకార సమస్తలోకజనకం

ఒక ఆకారముగలవాడు - సమస్త లోకములకు తండ్రి, మేరుపర్వతము (బంగారుకొండయే విల్లుగా గలవాడు) పాములు చుట్టియున్న కిరీటము కుండలములను ధరించు వాడు. పెద్దపాము ల నెడు అలంకారముతో ప్రకాశించు వాడు. పూర్ణిమనాటి చంద్రుని కాంతి వంటి కాంతిగల ముఖము గలవాడు. విష్ణువుచే పూజింపబడినవాడు. దుఃఖమనెడు అడవికి దావాగ్నియైన వాడు. శుభమును చేయువాడు. అగు అరుణాచలనాథుని సేవించు చున్నాను.

''138 అపసర్ప

ఓసర్పమా! తొలగిపో, దూరముగా పొమ్ము. నీకు భద్రమగుగాక, గొప్ప కీర్తిగల ఓ సర్పమా! జనమే జయుని యజ్ఞాంతమునందు, ఆస్తీకుడు పలికిన వాక్యము లను స్మరింపుము.

'' 138 జ్ఞానమూలం గురో ర్మూర్తి ః

శ్రీగురుమూర్తియే జ్ఞానమునకు మూలము. గురుచరణమే ప్రథమపూజ్యము. గురువాక్యమే సర్వమంత్రము లకు మూలము. గురుకృపయే మోక్షమునకు మూలము

పుట 140 భోక్తారం యజ్ఞతపసాం

యజ్ఞములకును తపస్సులకును కర్తృరూపములకును దేవతారూపమునను భోక్తయైనట్టియు, సర్వలోక మహేశ్వరుడైనట్టియు - సర్వభూతములకు సుహృదులైనట్టియు (ప్రత్యుపకారమును కోరక ఉపకారము చేయువాడు) నన్ను తెలిసికొని శాన్తిని పొందును.

'' 141 అతత్త్వజగతో

పరమార్థముగ సత్యము కాని ప్రపంచమును మఱచితినే గాని సత్యమైన బ్రహ్మను మఱిచిపోలేదు,

'' 142 కాశీక్షేత్రం శరీరం

శరీరమే కాశీక్షేత్రము - జ్ఞానమే ముల్లోకముల తల్లియై వ్యాపించి యున్న గంగ - భక్తి శ్రద్ధయే గయ. గురుచరణ ధ్యానయోగమే ప్రయాగ. సకలజన మనస్సులకు సాక్షి యైన అంతాత్మయే తురీయుడైన విశ్వేశ్వరుడు. నా దేహమునందే అన్నియు నుండగా వేఱ తీర్థ మెందుకు?

'' 143 ఏమిచేయుదును? ఎక్కడకు వెళ్ళుదును? దేనిని తీసి కొందును? దేనిని వదలుదును? ప్రళయకాలమున జలమయమైనట్లుగా ప్రపంచమంతయు ఆత్మతో నిండియున్నది.

'' 144 దేహం ప్రాణ మపీన్ద్రియాణ్యపి

స్త్రీలు, బాలురు, అంధులు, మందబుద్ధులవలె వివేక జ్ఞానములేని వారు, భ్రాన్తినొందిన వారై, గట్టిగా వితండవాదము చేయుచు, దేహము, ప్రాణములు, ఇంద్రియములు చంచలమైన బుద్ధి, శూన్యము, ''నేను'' అని తెలిసికొనుచున్నాడు. (దేహమే నేను, అని కొందఱు, ప్రాణములే నేనని, ఇంద్రియములు నేనని, బుద్ధి నేను అని, శూన్యము నేను అని, అనుకొనుచున్నారు) మాయాశక్తి యొక్క విలాసము వలన పై విధముగా కల్పితమైన గొప్ప వ్యామోహమును - (దేహాదులే నే నను భ్రమను) నాశనము చేయు, గురుమూర్తియైన శ్రీదక్షిణామూర్తికి నమస్కారము.

పుట 146 నవైరాత్యాత్‌ పరం

వైరాగ్యముకంటె ఎక్కవైన సంపదలేదు. జ్ఞానమును మించిన సుఖము లేదు. విష్ణువు కంటె రక్షకుడెవడును లేడు. సంసారము కంటె శత్రువెవరును లేడు.

'' 152 ఈశానస్సర్వవిద్యానామ్‌

సర్వవిద్యలకు ప్రభువు, సర్వభూతములకు ప్రభువు, వేదములకు ప్రభువు, (లేదా బ్రహ్మయు, అధిపతియు, అనగా సర్వాత్మనా వ్యాపించినవాడు) హిరణ్యగర్భ బ్రహ్మకు ప్రభువు, అగు పరమాత్మ నన్ననుగ్రహించు టకై శాంతుడగుగాక. నేను ఆసదాశివుడనే అగుచున్నాను.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page