Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

3. సుమాంజలి

''శ్రీ శేషాద్రిస్వామి'' - ఇది ఒక గ్రంథము. తమిళ దేశములోపుట్టి తమిళ దేశములోనే సిద్ధిపొందిన ''శ్రీ శేషాద్రి స్వామి'' అనే ఒక సన్యాసి జీవితం ఇందులో ఉంది. ఎందుకీ జీవిత చరిత్ర మనకు? ఇది రాజకీయనాయకుని చరిత్ర కాదే! సినీతార చరిత్ర అయినాకాదు. లోకానికి దీనివలన ప్రయోజన మేమిటి? అనుకున్నాను. ఆమూలాగ్రం చదివాను. వివేకవంతులు, ఆనాత్మవంచకులు, దేశహితైషులు అయిన వారికి ఈ గ్రంధపఠనం వలన ప్రయోజనం ఉంటుంది అనుకున్నాను. మన శాస్త్రములలో చెప్పిన స్థితిప్రజ్ఞలక్షణాలు - బాహ్మీస్థితి - తపస్సంపన్నుల నిగ్రహానుగ్రహశక్తి, దూరదర్శన దూరశ్రవణ శక్తులు ఉన్మత్తప్రలాపాలు కావు. లోకాన్ని వంచించటానికి వ్రాసిన నిరాధారమైన వ్రాతలు కావు అనుకున్నాను. ఎందుకంటే, శ్రీ శేషాద్రిస్వామి కల్పిత వ్యక్తి కాదు. చరిత్రకందని కాలమునాటివారు కారు. 1870 సంవత్సరములో పుట్టారు. 20వ శతాబ్దములో సిద్ధిపొందారు. వారి అనుగ్రహాన్ని పొందినవారుకూడ ఈ కాలపు వ్యక్తులే. జరిగిన సంఘటనలు కథలు కావు. ఈ జీవిత చరిత్రలో విషయాలు శాస్త్రవాక్యాలకు సరిపోతున్నై. అందువలన నిజమైన ఆధ్యాత్మిక చింతనగల ముముక్షువులకు ఈ గ్రంథము అమూల్య మైనది అనటములో అతిశ##యెక్తి లేదు అనిపించింది.

శ్రీ శేషాద్రిస్వామి బాల్యములోనే వేదమును, శాస్త్రములను సాధించారు. 'ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యాః' అన్న వాక్యము ఋజువైనది. జ్ఞానసిద్ధి కలిగేవఱకు, జపాద్యనుష్ఠానము చేశారు. చనిపోయిన తల్లికి కర్మచేశారు. జ్ఞానియైనారు. తరువాత ''రమతే బాలోన్మత్తవదేవ'' అనే సూక్తి శ్రీ శేషాద్రి స్వామి విషయమున అక్షరాలా నిజమైనది. శ్రీ శుకమహర్షిని చూచిన స్త్రీలు సిగ్గుపడకుండుట భాగవతకథా విషయము. శ్రీ శేషాద్రిస్వామి స్పృశించినా స్త్రీలు మనో వికారాన్ని పొందక పోవటం 19-20 శతాబ్దములలోని విషయము. శక్తిపాత దీక్ష అనేది ఉంటుందని సూతసంహితాదులలో చదివాము. శ్రీ స్వామి చరిత్రలో ప్రత్యక్ష తార్కాణము కనుపడినది ఈనాడు కూడా సామాన్య సిద్ధులు కలవారే దూరశ్రవణ దూరదర్శన శక్తులను ప్రదర్శిస్తున్నారు. శ్రీ స్వామి విషయములో సందేహముండటానికి వీలు లేదు.

అయినా ఇంకొక సందేహము నన్ను బాధించింది. శ్రీ శేషాద్రిస్వామి తపస్సంపన్నులు కావచ్చు. అందువలన లోకానికేమి జరిగింది, ఆయనవలన సమాజానికి ఏమి మేలు కలిగింది? వారికి వారు జ్ఞానసిద్ధిని పొందితే, మనకేమి కలిగింది నిజమే. శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులై, అభివృద్ధి లోనికి వచ్చినవారు అనేకులున్నారు. ఆత్మశాంతిని పొందిన వారెందఱో ఉన్నారు. ఇంగ్లీషు చదువుకొని ఉద్యోగాలు చేసిన వారు కూడా అందులో ఉన్నారండీ! మహిమలలో మొదట విశ్వాసము లేని వారు కూడ ఉన్నారు. అన్నిటికి శిరోమకుటమైన విషయం ఇంకొకటి. వర్షములు లేక మలమల మాడిపోయే రోజులలో ఒక భక్తుడు ప్రార్థిస్తే, శ్రీస్వామి అనుగ్రహిస్తే వర్షం వచ్చింది. ఏ సైన్సుకు క్షణకాలంలో ఒక పైసా ఖర్చు లేకుండా వర్షాన్ని తెచ్చే శక్తి ఉన్నది? ఇది దేశానికి క్షేమము కాదా? ఇంతకుముందున్న శ్రీ శృంగేరీ శంకరాచార్యులవారి చరిత్రలో ఇటువంటి సన్నివేశాలు కనుపడినై. వారు శృంగేరీ లో వరదలను నిలుపుచేశారు. శ్రీరాజేంద్రప్రసాదు శృంగేరిని సందర్శించినపుడు విపరీతంగా కురిసే వర్షాలను ఆపి వేశారు. అందుకనే మన శాస్త్రాలు చెప్పినై - దేశ క్షేమానికి కేవలం భౌతికశక్తి చాలదు. ఆధ్యాత్మిక శక్తి కూడా కావాలి అని.

పరాతి సంధానమును మాత్రమే అధ్యయనం చేసి, అభ్యాసంచేసే, రాజకీయ నాయకులొకరే చాలరు. శ్రీశేషాద్రి స్వామి, శ్రీరమణ, శ్రీశృంగేరీ విద్యాశంకరభారతి, శ్రీకంచి చంద్రశేఖరేన్ద్ర సరస్వతి స్వాములను పోలిన మహనీయులు, కూడా దేశానికి కావాలి. రాజకీయనాయకులు కాదు. రాజర్షులు కావాలి. ఈ విషయం శ్రీ శేషాద్రిస్వామి చరిత్ర మనకు బోధిస్తుంది.

జీవన్ముక్తి ఉన్నదా లేదా? స్థితి ప్రజ్ఞస్య కాభాషా? జీవన్ముక్తులు ఎట్లా ఉంటారు? ఈ సందేహము నివారణ అవుతుంది ఈ గ్రంధం చదివితే. ఒకవైపు, శ్రీరమణమహర్షి, ఒక వైపున శ్రీ శేషాద్రిస్వామి. ఇద్దరు జీవన్ముక్తులే. కాని విభిన్నరీతులలో కనుపడినారు. ఆనాటి వారి శిష్యులు భక్తులు ఎంత ధన్యులో!

ఇక శ్రీశేషాద్రిస్వామి బోధలు ఇందులో ఉన్నై. ఉపవాసము - నిరాహారము అంటే ఏమిటి? - ఇంకా ఎన్నో విషయాలున్నై, మనకు అవి అనుసంధేయాలు. మన అందఱి జీవితములలో వచ్చే సమస్యలకు పరిష్కారాలు, సందేహాలకు సమాధానాలు మార్గదర్శక సూత్రాలు ఇందులో ఉన్నై.

''యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జిత మేవ వాతత్తదేవావ గచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్‌''. శ్రీ శేషాద్రి స్వామి భగవదంశగా జన్మించారు. ''జ్ఞానీ త్వాత్మైవ మేమతం'' ''మమాత్మా సర్వభూతాత్మా'' అనే వాక్యాలవలన ఆయన జ్ఞానియై భగవంతుడే అయినారు. శ్రీ శేషాద్రిస్వామివారి చరిత్ర భగవచ్చరిత్ర. శ్రీస్వామివారు తానే, తన భక్తులకు సర్వ దేవతా రూపమున కనపడినారు. అన్యదేవతా భక్తులును నాభక్తులే అని భగంతుడే అనగలడు. శ్రీశేషాద్రిస్వామి గుణకీర్తనము భగవద్గుణ కీర్తనమగును.

శ్రీ శేషాద్రిస్వామి దయాసింధువు. అందువలననే, అదృశ్యముగ భక్తులయందావేశించి నేటికిని హితబోధ చేయకున్నారు. ఇది వీరిలోని విశేషము.

శ్రీ విశాఖగారు శ్రీ సాధన గ్రంథ మండలి ప్రచురణముల వలన ఆంధ్రలోకమునకు చిరపరిచితులు. నిరంతరము, భగవద్భక్తి భావనాభరితులు. భగవద్వరివస్యారసజ్ఞులు. శ్రీ కంచికామకోటి పీఠాధిపానుగ్రహపాత్రులు. కవులు, రచయితలు, సహృదయులు, స్నేహపాత్రులు, శిష్టులు విశేషజ్ఞులు. వీరి యీ అనువాద రచనము ఆంధ్రలోకోపకారము. ఆంధ్ర లోకము వీరికి కృతజ్ఞము.

శ్రీ సాధన గ్రంథమండలివారి విషయము వ్రాయనక్కఱలేదు. ఆధ్యాత్మిక లోకమునకు వారు చేసిన సేవ నిరూపమము. వారి సంకల్పమమోఘము. వారికి భగవంతుడు వలసిన సంపదను సమకూర్చునుగాక అని ప్రార్ధింతము.

''ఎందఱో మహానుభావులు.''

''శాన్తా మహన్తో నివసన్తి సస్తః

వసన్త వల్లోక హితం చరన్తః''

శివమస్తు.

-భగవతుల కుటుంబరావు

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page