Sri Jayendravani    Chapters    Last Page

14. కుంభాభిషేకం యొక్క ప్రాముఖ్యత

చాలామంది దేవతల్ని, దేవుళ్ల, అమ్మవార్ల విగ్రహాల్ని దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తాం. దేవాలయ ప్రతిష్ఠ సమయంలో మహాకుంభాభిషేకం జరుపబడుతుంది. తర్వాత పన్నెండు సంవత్సరాల కొకసారి ఆలయంలో దైవత్వాన్ని స్థిరీకరించటానికి జీర్ణోద్ధరణకు కుంభాభిషేకం నిర్వహింప బడుతుంది.

రామాయణ మహాభారతాది మతగ్రంథాల్లో ప్రవచింపబడ్డ ధర్మాల్ని రక్షించాల్సిన ఆవశ్యకతను, స్వధర్మాన్ని గురించిన ఆలోచనలను మనకీ కుంభాభీషేకం సందర్భాలు గుర్తుచేస్తాయి. కుంభాభిషేకం రోజున మనం ఎక్కువ సంఖ్యలో ఆలయం వద్ద ఆ మహోత్సవాన్ని తిలకించడానికి సమావేశమౌతాం.

కుంభాభిషేక సమయానికి దేశంలోని పుణ్య నదుల నుండి, తీర్థాలనుండి పవిత్ర జలాల్ని తెచ్చి కుంభాలను నింపి వాటిని యాగశాలలో వుంచి పూజావిధులు నిర్వర్తిస్తారు. అప్పుడే పవిత్ర కుంభాల్లోని జలాన్ని గర్భగుడిలోని కలశాల్లోను, గోపురాలమీది కలశాల్లోను ఉంచుతారు. ఆ జలమే వెండి తీగెద్వారా మూల విరాట్‌పై స్రవిస్తుంది. ఆ విధంగా అభిషేకించబడిన దేవత మంత్రపూరితంగా ప్రతిష్ఠింపబడి, దైవత్వాన్ని సమకూర్చు కుంటుంది.

పవిత్ర జలాల్తో అభిషేకింపబడిన ఈశ్వరుడు చల్లబడుట ద్వారా భక్తుల హృదయాలు కూడ ప్రశాంతతను పొందుతాయి. చల్లబడిన మనస్సుగలవాడైన ఈశ్వరుడు మన మనస్సులను కూడ శాంతపరచి మనకు ధర్మపథాన్ని నిర్దేశిస్తాడు.

ప్రధానమైన కుంభాభిషేకం 45 రోజులు జరిపిన తర్వాత మండలాభిషేకాన్ని నిర్వర్తించాలి. కుంభాభిషేకం పూర్తి అయిన తర్వాత మళ్లీ 45 రోజులు జరిపే మండలాభిషేకం ఫలితంగా ప్రధాన దేవతయొక్క దైవత్వం ఇనుమడింప చేయబడుతుంది. అలా దైవ శక్తికూడ ఇతోధికమై భక్తులపై ప్రసరింపబడి ఆయన కరుణాకటాక్షంతో వారి కోర్కెలన్నీ సఫలీకృత మౌతాయి.

ప్రజలందరు మండలాభిషేక క్రతువుల్లో పాల్గొని ఈశ్వరుని శాంతపరచి ఆయన దయకు పాత్రులై ఈడేరిన కోర్కెలతో శాంత మనస్కులై వర్థిల్లుదురు గాక!

Sri Jayendravani    Chapters    Last Page