Sri Jayendravani    Chapters    Last Page

3. మన (భారతీయ) సృష్టిక్రమం

సృష్టిక్రమం-భారతీయ దృక్పథం

వింధ్య పర్వత శ్రేణులకు ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఉత్తర భారతమని, దక్షిణాన ఉన్న దానిని దక్షిణ భారతమని అంటాము.

మనం ఒక పూజగాని, శుభకార్యంగాని నిర్వహించేటప్పుడు

''శుభేశోభ##నే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భారతఖండే మేరోః దక్షిణ పార్శ్వే''అని సంకల్పం చేస్తాం.

ఈ సంకల్పం యొక్క అర్థం తెలిసినవారికి భారతదేశ చరిత్ర, ఈ అనంత విశ్వంలో భారతదేశ ఉనికి, సంపూర్ణంగా అవగాహన అవుతుంది. అంతేగాక దీనివల్ల పూర్వం భారతదేశం ఎంత సువిశాలమైందో, అప్పుడు లభ్యమైన వస్తుసంపద ఏమిటో, ఏ మహానదులు ప్రవహించాయో, ఏఏ పర్వతరాజాలు వుండేవో, హిందూమతం ఏ కాలంనుండి ప్రవర్తిల్లిందో మొదలగు అన్ని విషయాలు సమగ్రంగా తెలిసే అవకాశముంది.

ఈ సంకల్పంలో ప్రధానంగా కనబడే పదసముచ్చయ మేమంటే : 'మేరోః దక్షిణ పార్శ్వే'.

అంటే మనమందరం మేరుపర్వత శ్రేణికి దక్షిణాన నివసిస్తున్నామని నిర్ధారించబడినట్లు. ఢిల్లీ, కాశీ పట్టణాల్లో నివసించే వారేగాక తమిళ, మహారాష్ట్ర ప్రజలుకూడ ఇదే సంకల్పాన్ని చెప్పుకుంటారు. ఎవరూ దీనిని మార్పుచేయరు. ఉత్తర భారతంలో ఉండేవారు ఈ క్రింది విధంగా చెప్తారనుకోండి.

'హిమవద్వింధ్యయోర్మధ్యే'

మనమందరం పూర్వమున్న విశాల భారతదేశంలో వారిమే. భారతదేశం నలుదిక్కులా ప్రపంచమంతా విస్తరించి ఉంది. మేరు పర్వతాలకి దక్షిణ ప్రాంతమంతా భారతవర్షం. మేరువును కేంద్రంగా తీసుకుంటే గ్రహాలన్ని దాని చుట్టూ తిరుగుతుండేవి. భూమి, సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ దాని చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. చరిత్రకారుడు కూడ మేరువును ఆధారం చేసికొని ఈ విషయాన్నే ధృవపరుస్తాడు.

మనపట్టణాల్లో తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర వీథులున్నట్లే ఉత్తర ఆర్కాట్‌, దక్షిణ ఆర్కాట్‌, తూర్పు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ మొదలైనవి ఉన్నాయి. అట్లే ఉత్తరభారతం దక్షిణ భారతం మొదలుగాగల ప్రాంతాలున్నాయి. కాని దేశప్రజలందరం మేరువునకు దక్షిణాన నివసిస్తున్నాం. మనం అందరం ప్రాచీన మతమైన హిందూమతాన్ని ఒక్కదాన్నే అవలంబిస్తున్నాం.

మనం ఏదైన మంచి పని ఆరంభించినపుడు ఈ సంకల్పాన్ని ముందుగా విధిగా పఠిస్తాం. ఆ తర్వాతే పని ఆరంభిస్తాం. అలాగే మనం నమస్కారాలు ఎవరికైనా చేసేటప్పుడు మన గోత్రనామాల్ని ఉదహరిస్తాం. తమిళనాడు, కేరళరాష్ట్రాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరు బ్రాహ్మణులపట్ల, గోవుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. వారు ఇలా అంటారు.

'ఆరంభతః చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణభ్యో నమః'

కనుక ఒకకాలంలో బ్రాహ్మణులు, గోవులు నాల్గు మహా సముద్రాల పర్యంతం వ్యాపించి ఉండేవారు. గడచిన కాలంలో మన ప్రజలు, మన మతం, మన సంస్కృతి సుదూర ప్రాంతాలకు విస్తరించి ఉండేవి.

మన సంకల్పంలో భారతీయ దృక్పథంలో సృష్టిక్రమం అతి మనోహరంగా వర్ణింపబడివుంది. యధార్థానికి మనం ఉపాకర్మరోజున పఠించు మహాసంకల్పంలో సృష్టిపరమైన సిద్ధాంతాలను గురించిన చాల విషయాలు ఇమిడివున్నాయి. ప్రప్రథమంగా సృష్టికర్తయైన బ్రహ్మను గురించి చెప్పబడింది.

అందులో : 'అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే'

ప్రస్తుతం సృష్టికర్తయైన బ్రహ్మ యొక్క కాలంలో మనం ఉన్నాం. బ్రహ్మ శతవర్షాలు (బ్రహ్మ సంవత్సరాలు) జీవిస్తాడు. ఆయన మొదటి 50 సంవత్సరాలు పూర్తిచేసి 51వ సంవత్సరం (బ్రహ్మ సంవత్సరం)లో ప్రవేశించాడు. సంవత్సరాల్ని గణించటం విషయంలో బ్రహ్మగారి పద్ధతికి మన విధానానికి వ్యత్యాసం ఉంది.

మానవుల గణనలో పదిహేను రోజులు ఒక పక్షం. మన ఒక పక్షం పితృదేవతలకు ఒక పగలు. మానవుల ఒక మాసం వార్కి ఒక దినం. మానవుల ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక దినం అవుతుంది. అలా 360 మానవ సంవత్సరాలు దేవతల కొక సంవత్సరకాలం ఔతుంది. దేవతలు వారికాలమానంలో 100 సంవత్సరాలు జీవిస్తారు. సాధారణంగా మానవుడు నూరు సంవత్సరాలు జీవిస్తాడని భావింపబడుతోంది. కొంతమంది అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కూడ జీవించవచ్చు. ఇంద్రుని విషయంలో తరువాతి ఇంద్రుడు సిద్ధమై రాగానే పూర్వపు ఇంద్రుడు తన పదవిని విడనాడవలసిందే. ఇలా పదవీచ్యుతుడైన ఇంద్రుడు భూలోకానికి రావల్సిందే. ఇంద్రుని జీవితం నూరు దేవ సంవత్సరాలు అంటే 36,000 మానవ సంవత్సరాలకు సమానం.

మన మతం అతి ప్రాచీనమైందని కోట్ల సంవత్సరాల ముందు నుండి మనకు సంక్రమించిందని వివరించటానికే ఇదంతా చెప్తున్నాను. కృత, త్రేత, ద్వాపర, కలి యను పేర్లతో మనకు 4 యుగాలున్నాయి. ఒక చాతుర్యుగం అంటే ఈ నాల్గు యుగాల కూడిక, కలయిక. 1000 చాతుర్యుగాలు బ్రహ్మకొక పగలు; 2000 చాతుర్యుగాలు బ్రహ్మకొక దినం. కనుక ఎంతమంది రాముళ్లు, కృష్ణుల్లు జనన మందారో అలాగే ఇప్పటికి మనం ఎన్ని జన్మల్ని ఎత్తామో ఆలోచించు కోవచ్చు. కనుక మన మతం చాల ప్రాచీనమైందని ఇతర మతాలు పరిమితకాలం అనగా సుమారు 2000 సంవత్సరాల నుండి మాత్రమే జీవించి ఉన్నాయని ఋజువౌతోంది.

ప్రస్తుతం మనం కలి యుగంలో ఉన్నాం. కలియుగ ప్రమాణం, 4,32,000 మానవ వత్సరాలు. ద్వాపర యుగం దీనికి రెట్టింపు ప్రమాణం కలది. త్రేతాయుగం దీనికి 3 రెట్లు, కృతయుగం దీనికి 4 రెట్లు కాలప్రమాణం కల్గి ఉంటాయి. 1000 చతుర్యుగాలు 4,32,00,000 మానవ వత్సరాలకు సమానమై ఇవి బ్రహ్మకు ఒక పగలుగ లెక్కకు వస్తాయి. వీటి ఆధారంగా గణిస్తే బ్రహ్మ యొక్క జీవితకాలం 100 సంవత్సరాలు. బ్రహ్మకు ఇప్పటికి 50 సంవత్సరాలు గడిచాయి. 51వ సంవత్సరం నడుస్తోంది. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు ఒక 'పర' యని, 'పరార్థ' మనగా బ్రహ్మజీవిత కాలంలో 50వత్సరాలని వాడుక. మనం ప్రస్తుతం బ్రహ్మ యొక్క రెండవ పరార్ధంలో ఉన్నాం.

మనం ఇప్పుడు బ్రహ్మగారి 51వ సంవత్సరం అనగా 2వ పరార్థంలో మొదటి సంవత్సర, మొదటి మాస ప్రథమ పక్షంలో ప్రథమ దివసం పగటి కాలంలో ద్వితీయ యామంలో తృతీయ ముహూర్తంలో జీవిస్తున్నాం. ఉపాకర్మ రోజున ఈ విషయాన్నే మన మహాసంకల్పంలో చెప్పుకుంటాం.

సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినః బ్రహ్మణః ప్రథమ పరార్థే పంచాశదబ్దాత్మికే అతీతే, పంచాశ దబ్దాదౌ, ప్రథమే దివసే, అహని, ద్వితీయే యామే. తృతీయే ముహూర్తే

శత సంవత్సరాల బ్రహ్మయొక్క జీవితాన్ని 7 కల్పాలుగ విభాగిస్తే అందులో 3 కల్పాలు ఇప్పటికే గడిచాయి. ప్రస్తుతం మనం 4వ కల్పంలో ఉన్నాం. గడచిన కల్పాన్ని లక్ష్మీకల్పం అంటాం. ప్రస్తుతం శ్వేత వరాహకల్పం నడుస్తున్నది.

బ్రహ్మ యొక్క ప్రతి పగటి కాలం (అనగా 4,32,000 మానవ సంవత్సరాలు) 14 మన్వంతరాలుగ విభజింప బడింది. ఒక్కొక్క మన్వంతరం ఒక ప్రత్యేక మనువు పాలనలో ఉంటుంది. ప్రస్తుతం పరిపాలిస్తున్న 7వ మనువు పేర్లు వైవస్వతుడు. ఇప్పటి వరకు పాలించిన 6గురు మనువుల పేర్లు:

స్వాయంభువు, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష.

భవిష్యత్తులో పాలించే మనువుల పేర్లు :

సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మాసావర్ణి, ధర్మసామర్ణి, రుద్రపుత్ర సావర్ణి, రుచిసావర్ణి, భౌమసావర్ణి.

14 మన్వంతరాలు పూర్తి అయితే బ్రహ్మకు ఒక పగలు గడచి నట్లు. లేక 1000 చాతుర్యుగాలు పూర్తియైనట్లు. అప్పుడు అంతే కాలప్రమాణం కల బ్రహ్మ యొక్క రాత్రి దాని ననుసరిస్తుంది. ఒక మన్వంతర కాలం 71 చాతుర్యుగాలకు, 5103 దేవసంవత్సరాలకు సమానం. ఒక మన్వంతరమంటే 8,52,000 దేవ సంవత్సరాలకు గాని 30,67,20,000 మానవ సంవత్సరాలకుగాని సమానం.

ప్రస్తుతం మనం 7వ మనువైన వైవస్వతుని పాలనలో ఉన్నాం. ఆయన పాలనలో 28వ చాతుర్యుగం నడుస్తున్నది. ఈ చాతుర్యుగంలో కలియుగం ప్రవర్తిల్లుతున్నది. కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తున్నదని మనం భావిస్తాం. కాని యధార్థంగా 14 గురు మనువులు ఈ పనికై ఇదివరకే నియోగింప బడ్డారు. మనం పంచాంగం చూస్తే మనల్ని పరిపాలించే రాజెవరు, మంత్రులెవరు, ఏ మంత్రి ఏ విభాగానికి ఏ యే విషయాల పై ఆధిపత్యం వహిస్తున్నాడు, వర్షపాతం ఎంత ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, మొదలైన విషయాలన్ని ప్రతి సంవత్సరం దానిలో ప్రకటించటం గమనిస్తాము. మనకు తెలిసినా, తెలియకపోయినా, దేవతల పరిపాలన నడుస్తుంటుంది. గనుక ప్రతి విషయం, ఆ పంచాంగంలో వ్రాయబడి ఉంటుంది. ఇది సహజమైన శైలిలో నిర్ణీత పద్ధతిలో జరుగుతూనే ఉంటుంది. దానిని మనం చాల తక్కువ మేరకు మాత్రమే మార్చగలం.

వైవస్వతుని హయాంలో 28వ చాతుర్యుగం నడుస్తోంది. దానిలో మనం ఇప్పుడు కలియుగ ప్రథమ పాదంలో ఉన్నాం. కనుక ఈ కలియుగం అంతం కావటానికి కొన్ని లక్షల సంవత్సరాలు కావాలి.

ప్రపంచంలో ధర్మానికి బట్టిన దుస్థితిని గురించి ప్రజల దీన స్థితిని గురించి ఆందోళనను వెలిబుచ్చుచున్నవారిని, తరుచుగ నేను కలిశాను. ఆ విషయంలో ఆందోళన ప్రదర్శించ నవసరం లేదని వారికి నచ్చచెప్పేవాణ్ణి. మనం ఇంకా కలియుగం ప్రథమ చరణంలోనే ఉన్నాం. రెండవ పాదం బాగా ఉంటుంది. మూడవ పాదం అంతకంటే శుభప్రదంగా ఉంటుంది. 4వ పాదంలో మాత్రమే మనకు ప్రతికూలమైన ఘటనలు జరుగుతాయి. కాని ఆ సమయానికి మనకందరకు మోక్ష ప్రాప్తి జరిగే ఉంటుంది. కనుక మన విశ్వ సృష్టి క్రమాన్ని అనుసరిస్తూ మన మత విశ్వాసాల దృష్ట్యా ఆలోచిస్తే మనం వ్యాకులత చెంద వలసిన పనిలేదు. మనం మన పరిసరాల్ని, వాతావరణాన్ని నిర్మలం గాను, ధర్మపథంలో నడుచుకోటానికి అనుకూలంగాను ఉంచుకోగల్గితే ప్రతిది మనకు అనుకూలంగా పరిణమిస్తుంది. ఇంకా లక్షల సంవత్సరాలు జరగాల్సివున్నాయి.

ఇంతవరకు కాల పరిధిలో విశ్వ సృష్టిక్రమాన్ని గురించిన వివరణను తెలిసికొన్నాం. ఒక స్థల పరిధిలో విశ్వసృష్టి విజ్ఞానానికి సంబంధించిన వివరణను తెలిసికొందాం.

మనం నివసించే ద్వీపాన్ని జంబూద్వీప మంటారు. మన సంకల్పంలో ఈ విధంగా చెప్తాం.

జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ పార్శ్వే ఇలా గూడ చెప్తాం: సప్త ద్వీపా వసుంధరా

పైన చెప్పిన సప్త ద్వీపాలు :

జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శీక, పుష్కర ద్వీపాలు.

ఆ విధంగా ఏడు భూభాగాలున్నాయి. వాటిని వేరు చేయుచూ సప్త సముద్రాలు కూడ ఉన్నాయి.

లవణ, ఇక్షు, దధి, క్షీర, సుర, సర్పి, శుద్ధోదక సముద్రాలు.

ప్రకృతి సిద్ధమైన పరిణామం వల్ల చాలసముద్రాలు, భూభాగాలు కూడ మునిగిపోయి వుండవచ్చు. అమెరికా వంటి దేశం కూడ ఈ మధ్యనే కనిపెట్టబడింది. ఇంకా కనిపెట్టబడని ఇతర భూభాగాలు వుండవచ్చు. వీటిలో కొన్ని ప్రదేశాలు కనిపెట్టబడక పోవచ్చు, లేక సహజంగా సంభవించే మార్పులవల్ల మునిగిపోయి వుండవచ్చు. ఈ మహాసముద్రాలు కాక ఉపసముద్రాలు లేక చిన్న సముద్రాలు కూడ వున్నాయి. సముద్రాల్లో ఉప్పు సముద్రం ఒక్కటే మనకు తెలుసు. మన సముద్రం మొత్తం క్షీర సముద్ర మయితే మనకు పాలకొరత సమస్య సులభంగా తీర్మానమై వుండేదని మనం కొన్ని సమయాల్లో అనుకుంటాం. కాని అలాంటి సముద్రాలు వెనుకటి రోజుల్లో వుండేవి.

జంబూ ద్వీపంలో చాల ఖండాలున్నాయి. ఆ ఖండాల్లో ఒకటైన భరతఖండంలో మనం నివసిస్తున్నాం. ప్రతి రాష్ట్రంలోను జిల్లాలున్నట్లు భారతవర్షంలో చాల ఖండాలున్నాయి. భరతఖండం అలాంటిదే ఒకటి. వేదాల్లో వివరించినట్లు దీని విస్తీర్ణం కూడ ఆ రోజుల్లో చాల ఎక్కువగా వుండేది.

సుమేరు పర్వతం అన్ని ఖండాలకు ఉత్తరభాగంలో వున్నట్లు చెప్పబడుతోంది. అంటే అన్ని ఖండాలు మేరువునకు దక్షిణాన వుండేవి. మూలంలో ఇలా వుంది.

సర్వేషాం వర్షాణాం మేరురుత్తరతః స్థితః |

అన్ని పెద్ద భూభాగాలు (వర్షాలు) మేరువునకు దక్షిణ భాగంలో వుండేవి. వాటిలో భారతవర్షం ఒకటి. కనుక మన మందరం భారతీయుల మనే భావించాలి. మాది ఉత్తరప్రదేశ్‌ అని కొందరు, మధ్యప్రదేశ్‌, తమిళనాడు అని కొందరూ ఆలోచించవలసిన పనిలేదు. మనమందరం భారతీయులం.

ఆ విధంగా మన సంకల్పంలో మనదేశ చరిత్రను గురించి భౌగోళిక విషయాలను గూర్చి విశ్వసృష్టిక్రమాన్ని (Cosmology) గురించి ఎన్నో విషయాలున్నాయి.

ప్రస్తుతం మనం చరిత్ర చదువుతున్నప్పుడు మనకు వేదకాలం, ఉపనిషత్కాలం, పురాణకాలం మొదలైనవి ఉన్నట్లు తెలిసికొంటాం. ఆధునిక పరిశోధకులు మన వేదాల వయస్సు 5000 లేక 6000 సంవత్సరాలుగా పరిగణిస్తారు. అంతకుముందు నాగరిక ప్రజాజీవితం లేనట్లు వారు భావిస్తారు. ఆధునిక చరిత్రకారులు రాతియుగం, ఖనిజయుగం మొదలగు వాటిని గూర్చి కూడ ప్రస్తావిస్తారు. వాటికి ముందు నాగరికత లేదని వారి అంచనా కావచ్చు. ఆ యుగాలకు ముందున్న భారతీయులు దుస్తులు లేకుండా సంచరించే వారని, వారే క్రమంగా నాగరికులై దుస్తులు ధరిస్తూ టెరిలిన్‌ బట్టలు ధరించే స్థితికి వచ్చారని వీరి భావన. ఇలా కల్పింప బడిన తలంపు సరియైనది కానేకాదు.

5000, 6000 సంవత్సరాలకు పూర్వంకూడ మనకు నాగరికత వున్నది. రాముడు కృష్ణుడు మొదలైన అవతారాలున్నాయి. వారి లీలలను పురాణాల్లో వర్ణించినదాన్ని బట్టి అప్పటి ప్రజలు మంచి వస్త్రధారణ చేసేవారని తెలుస్తుంది.

నేను మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర అరణ్యాల్లో సంచరించి నప్పుడు చూచినట్లుగానే అప్పటి ఆరణ్యకులు వస్త్రధారణ ఏమీ చేసివుండక పోవచ్చు. ఆరణ్యాల్లో నివసించే ప్రజలు చాల చిన్న వస్త్రం ధరించేవారు. అధునాతన నాగరికతలోని చాల విషయాలు వారికి తెలియవు. వారిని మనం చూసినప్పుడు మనమే సిగ్గుతో తలవంచుకుంటాం. కాని వారు మాత్రం వారి దిగంబరత్వాన్ని గురించిన ఎరుక వారికుండదు గనుక చాల సహజమైన ధోరణిలో సంచరిస్తారు. ఈ ఆటవికుల అలవాట్లను ఆధారంగా తీసికొని చరిత్రకారులు మనదేశ ప్రజలందరు అనాగరికులని నిర్ణయిస్తే యధార్థ విషయం కానేరదు.

దురదృష్టవశాత్తు దేశంలో ఒక భాగాన్ని మాత్రమే పరిశీలించిన ఆంగ్లేయులు రాసిన ప్రస్తుతపు చరిత్ర మనకు బోధింప బడుతోంది. ఏ భారతీయుడు ఆ చరిత్రను రాయలేదు. ఆంగ్లేయులు మాత్రమే వ్రాశారు. వారు తాము చేసిన అసంపూర్తి పరిశీలనలను ఆధారం చేసికొని వ్రాశారు. ఈనాడు మనం చదివే చరిత్ర యిదే. దీని ఆధారంగానే పరిశోధన కూడ నడుస్తోంది. మనకు గూడ మతం, పురాణాలు అనాదిగ వున్నాయని పరిగణనలోకి తీసికొని ఎవరూ పరిశోధన జరపటం లేదు. ఆంగ్లేయులు వ్రాసిన గ్రంథాలమీద దృష్టి నిలిపి వాటిపై ఆధారపడి పరిశోధనలు జరిపిన ఆధునిక చరిత్ర కారులు రాతియుగాన్ని, లోహయుగాన్ని, వేదకాలాన్ని, ఉపనిషత్కాలాన్ని గురించిన ఆలోచనలు చేస్తున్నారు. ప్రజలు ఆహారం అవసరమైనప్పుడు దేవతల్ని ఆరాధించేవారని, ఆకలి తీరింతర్వాత మెదడుకు కొంత పని కల్పించవలెనని ఆకాంక్షించే వారని, క్రమంగా బలమైన ఆలోచనా కార్యక్రమాలు ప్రారంభ మైనవని ఆ పరిణామంగా వేదకాలం, ఉపనిషత్కాలాలు మొదలైనవి సంభవించినవని ఆ చరిత్రకారులు సూచించారు. వేదవాఙ్మయం, ఉపనిషద్‌ వాఙ్మయం వేటి కవి విభజింప వీలున్నదన్నట్లు చెపుతూ, దానిని ఆధారంగా చేసి వేదాలకు 5000 లేక 6000 సంవత్సరాల వయస్సు కలదని నిర్ధారిస్తున్నారు.

కాని సృష్టి ఆరంభం నుండి మన ప్రాచీన హిందూ మతం ప్రచారంలో ఉందనే ప్రాథమిక సత్యాన్ని వీరందరు విస్మరిస్తున్నారు. మన మతానికి వ్యవస్థాపకులు ఎవరు లేరు. అట్లే మన వేదాలు అపౌరుషేయాలు. వేదాలు ఆనోటా ఆనోటా మనకు సంక్రమించాయి. అందువల్లనే వీటిని వ్రాతలో లేని వాక్కులుగ పరిగణించాలి. వ్రాత రూపంలో లేని వాక్కులు శబ్దాలు గనుక వేదాలు గ్రంథరూపంలో ఉండవు. వాటికి ముద్రణ అనే ప్రక్రియ అసలే వర్తించదు. ఒక తరం నుండి మరియొక తరం వారికి వాక్కు ద్వారా లభించినవే తప్ప వేరు కాదు. అందువలననే వేదాలు 'శ్రుతులు'గా ప్రసిద్ధికెక్కాయి.

వేదాలు ఎవరూ వ్రాయలేదు. మరి అవి ఎలా ప్రచారం లోకి వచ్చాయనే విషయాన్ని పరిశీలిద్దాం. మనం ఒక రేడియో స్టేషను నుండి వెలువడే శబ్ద తరంగాలను మన రేడియోలో ఆ స్టేషనుకు శృతిచేసి ఎలా గ్రహిస్తామో అదే విధంగా మహర్షులు వేదశబ్ద తరంగాల్ని ఆకాశాన్నుంచి గ్రహించారు. తమ తపోబలం ద్వారా ఆ శబ్దాల్ని గ్రహించి వాక్కు ద్వారా మనకు ఒక తరం నుండి మరొక తరానికి అందజేశారు. కనుక మనకు వేదాల్నుండి లభించిన ధ్వనులు ఏ రకమైన వికృతికి గాని, చెదురు బాటుకు గాని లోనుగాక స్వచ్ఛంగా నిలిచాయి. మహర్షులు వారి శ్రోత్రేంద్రియాల ద్వారా విని వాటిని మనకు ఆవిష్కరించారు. మనం కూడ అట్లే వీనుల ద్వారా విని వాటిని పరిరక్షించి తరువాతి తరం వారికి అందజేయాలి.

మనం వినే ఏ ధ్వనియైనా మనకు ఆకాశం నుండి లభిస్తుంది. ఆకాశం అంటే మనకు కనిపించే నీలాకాశం కాదు. మన చుట్టూ వున్న శూన్యాన్నే ఆకాశం అంటాం. శూన్యం ద్వారానే శబ్ద ప్రసరణ సాధ్యమౌతుంది. ఉదాహరణకు మనం మననోరు తెరచినప్పుడు అక్కడ ఖాళీస్థలం ఏర్పడి దాని ద్వారా శబ్దాన్ని ప్రసార చేయగల్గుతాం. నోరు తనంతతాను మాట్లాడేశక్తి గల్గి వుండదు. శబ్దం ఆకాశం అనగా శూన్య స్థలం నుండి మాత్రమే ప్రయాణం చేస్తుంది. ధ్వని ఉత్పన్న మైనపుడు అది విరామ స్థలం ద్వారానే బయటకు వస్తుంది. మహర్షులు తమ ప్రత్యేక శక్తుల ప్రభావంచేత వేద శబ్దాల్ని శూన్యం నుండి గ్రహించి వాక్కు ద్వారా మనకు అందచేయగల్గారు. వేదాలు నిజంగా అనంతాలు.

ద్వాపర యుగాంతానికి వ్యాసుడు వేదాల్ని భిన్నభిన్నమైన భాగాలుగ విభజించాడు. ఇంతకు ముందు యుగాల్లో ప్రజలకు విరామ సమయం అధికంగా ఉండటం చేత వేదాల్ని వల్లెవేసి, అధ్యయనించి సుఖవంతమైన జీవనం గడిపేవారు. కలియుగంలో అంతకు ముందువలె ప్రజలు వేదాలు పఠించలేరని ఎరిగి వేదవ్యాసుడు వేదాల్ని సౌలభ్యం కొరకు సంహితలుగ చేశారు. వేదాల్ని విభిన్నమైన శాఖలుగ విభజించారు. కాని దురదృష్టమేమంటే ఆధునిక చరిత్ర కారులు వేదవ్యాసుడే వేదాల్ని రచించాడని కనుక ద్వాపర యుగాంతమున మాత్రమే వేదాలు ఉద్భవించాయని వాటికాలం అప్పటికి పరిమితమని వాదించారు. వేదాల వయస్సు వేదవ్యాసుని తోనే ఆరంభ##మైందని వీరు తేల్చారు. అలాగే గీత, ఉపనిషత్తులు మొదలైనవి చాల తరువాతి కాలంలో వ్రాయబడినవని, శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యులు, తదితరులు వారి భాష్యాలు లేక వ్యాఖ్యలు వ్రాశారని వీరి వాదన.

ఇంతకు పూర్వయుగాల్లో ప్రజలు వేదాల్లోని విషయాలు నేరుగా సులభంగా గ్రహించగల్గేవారు గనుక వాటికీ భాష్యాలతో అవసరముండేది కాదు. తరువాతి కాలంలోనే వాటి ఆవశ్యకతను గమనించి భాష్యాలు రచించారు. భాష్యాలపై వ్యాఖ్యలు, వృత్తులు, వార్తికాలు మొదలైనవి కూడ ఉత్పన్నమైనాయి. చరిత్రకారులు ఈ వ్యాఖ్యల్ని లేక భాష్యాల్ని నిర్ధారించారు. ఈ విధంగా వారు వేదకాలాన్ని, ఉపనిషత్కాలాన్ని నిర్ణయించారు.

కాని మనం చరిత్రను సవ్యంగ అధ్యయనం చేస్తే వేదాలు, ఉపనిషత్తులు ఒకదానిని మరొకటి అనుసరించి రెండు విడివిడి భాగాలు కావని గుర్తిస్తాం. కాబట్టి వేదకాలమని, ఉప నిషత్కాలమనే ప్రతిపాదన ఉదయించదు. ఆ రెండింటికి ఆరంభం లేదు. అవి ఎవరి చేత రచియింపబడలేదు. అదే విధంగా మన హిందూ మతం కూడ ఎవరి చేత స్థాపింప బడలేదు. ఆది ఎరుగని వేదాలే ప్రమాణంగా ఏర్పడిన ఈ మతం వేద మతంగా ప్రచారం పొందింది.

మన చారిత్రకులు పురాణకాలాన్ని నిర్ణయించటంలో కూడ అలాంటి పొరపాటునే చేశారు. పురాణకాలాన్ని కూడ వేదవ్యాసుని కాలంతో ముడివేశారు.

మన మతం దాని సృష్టి ఎంత ప్రాచీనమైందో వీరు గ్రహిస్తే మన మత గ్రంథాలయొక్క, వేదాలయొక్క కాలాన్ని గణించటంలో పొరబడరు.

Sri Jayendravani    Chapters    Last Page