Sri Jayendravani    Chapters    Last Page

పీఠిక

శ్లో|| నమ శ్శివాభ్యాం నమ ¸°వనాభ్యాం

పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం,

నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం

నమోనమః శంకర పార్వతీభ్యాం ||

జగద్గురు కంచికామకోటి పీఠాదిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు, 1973వ సంవత్సరంలో నిర్వహించిన విజయ యాత్రాపరంపరలోని భాగంగా ఢిల్లీలో కొంత కాలం గడిపారు. ఆ సమయంలో వారు ఢిల్లీలోని ఆస్తికుల నుద్దేశించి, తమిళంలోను, తెలుగులోను, హిందీలోను అనుగ్రహించిన ఉపదేశపూర్వక ఉపన్యాసాలను శ్రీ యస్‌. బాలసుబ్రహ్మణ్యంగారు ఇంగ్లీషులో వ్రాసికొన్నారు. తర్వాత వాటిని క్రోడీకరించి గ్రంథరూపంలో, 'Heritage of Bharat Varsha & Sanatana Dharma' అనే పేరుతో 2 భాగాలుగా ప్రచురించారు. ఆ ఆంగ్ల గ్రంథం యొక్క మొదటి భాగానికి ఈ పుస్తకం ఆంధ్రానువాదం. దీనిని శ్రీ సుబ్రహ్మణ్యంగారి సౌజన్యంతో సాధన గ్రంథ మండలి. తెనాలి వారు 'శ్రీ జయేంద్రవాణి' అను పేరుతో ప్రచురించారు.

పీఠాధిపతులు శ్రీ స్వామివారు మానవ జీవన సరళిని సంపూర్ణంగా అవగాహన చేసికొన్న మహామహులు. మతపరమైన, వేదాంత సంబంధిత విషయాలు వారికి కరతలామలకాలు. వారు తమ ఉపదేశాల్లో సామాన్య మానవుని జీవితానికి సంబంధించిన అన్ని అంశాలపై సాకల్యమైన, ప్రస్ఫుటమైన అభిప్రాయాలు వెలువరించారు. మానవ దైనందిన జీవిత విధానాన్ని పరిశీలించి, విశ్లేషించి దాన్ని యే మార్గాలద్వారా సుగమం, సుఖతరం చేసుకోవాలో అందుకొరకై మన ఆర్షవిజ్ఞాన సంపద, సనాతన ధర్మ సముచ్చయము ఎలా ఉపకరిస్తాయో విశదంగా మన ముందుంచారు. మానసిక ప్రశాంతత, నిర్మలత్వము మన సంస్కృతిలో లభించ వలసిందే తప్ప పాశ్చాత్య నాగరికతలో సమకూరవు.

పాశ్చాత్య సంస్కృతీ వ్యామోహంతోనున్న యీ తరం భారతీయులకు, వారి సంస్కృతిలోని తాత్వికతను, ఆచారవ్యవహారాలను వివరిస్తూ, మన ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాల్లోని ఔచిత్యాలను, ఉత్కృష్టతలను ప్రజల మనస్సులకు హత్తుకునే రీతిలో స్వామీజీ తమ సందేశాల్లో వ్యక్తీకరించారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోవు వరకు మన ప్రాచీన సంప్రదాయాల కనుగుణమైన ప్రామాణిక ధర్మసూక్ష్మాల్ని పాటిస్తూ నిర్వర్తించ వలసిన విధులను విమర్శతో, హేతుబద్ధంగా వారు ప్రతిపాదించారు. మన స్నానసంధ్యాదులు, వేషధారణ, ఆహారనియమాలు, తపోజపాదుల వరకు స్వామివారు స్పృశించని అంశంలేదు.

మనము కొలిచే వివిధ దైవాల్ని గురించి, వారివారి ప్రత్యేకతలను, ప్రయోజనాల్ని వివరిస్తూ వీరందరూ ఈశ్వరాంశులే, ఈశ్వరుడొక్కడే యని నిర్థారించారు. శైవం, వైష్ణవంలాంటి భిన్నభిన్న మతాలుండవచ్చు. ఆ మతావలంబకులు ఎవరి మార్గంలో వారు సత్యాన్వేషణ, ఈశ్వరోపాసన చేయవచ్చు. కాని అన్ని మతాలకు గమ్యం ఒక్కటే, మతైక్యం అభిలషణీయం. ఏకమతమే వుండనవసరం లేదని స్వామివారి సిద్ధాంతం.

''ఈశ్వరుని ఎవరెవరు ఏయే రూపాలతో భక్తిప్రపత్తులతో సేవిస్తూ వుంటారో వారి కాయా రూపములందే వారి భక్తిని దృఢతరం చేస్తాను.'' అని కృష్ణభగవానుడు గీతలో అంటాడు.

సామాన్యునికి సగుణోపాసన యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, మన దేవాలయాల ప్రయోజనాల్ని, పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని స్వామి ఉద్ఘాటించారు. సగుణోపాసన ఒక్క హిందూమతం మాత్రమే సమర్థిస్తుంది. ఇతర మతాలు యీ భావనను ఆమోదించవు.

వేదము అనాది. అపౌరుషేయం. ఆదిలేనిది గనుక దానికి అంతమూ లేదు. విశ్వసృష్టితోబాటు బ్రహ్మముఖతః వెలువడి శబ్దగ్రహణ ప్రక్రియ ద్వారా తపోనిష్ఠులైన ఋషులకు చేరి వారి వారి ముఖతః అన్ని సంతతుల వారికి ప్రసారమై ప్రచారం అవుతున్న వేదాన్ని గ్రంథస్థం చేయలేము. శ్రుతి ద్వారా ఒకరి నుండి మరియొకరికి అనూచానంగా లభ్యపడవలసినదే. వేదములు అందు వల్లనే శ్రుతులుగా పరిగణింప బడుతున్నాయి. వేదాల్ని గురించిన స్వామీజీ యొక్క విశ్లేషణ సామాన్య పాఠకులకు గూడ సులభగ్రాహ్యం.

మనది భారతదేశం; మనం భారతులం. 'భాయాంరతాః- భారతాః. 'భా' అనగా తేజస్సు. పరమాత్మ యొక్క తేజస్సు నుపాసించుట యందు రతిగలవారని యర్థం.

భారతదేశం యొక్క నైసర్గికతను వర్ణిస్తూ స్వామివారు మన సంకల్పంలోని మంత్రాన్నిబట్టి 'మేరోర్దక్షిణదిగ్భాగే' - అంటే మేరువు లేక హిమాలయ పర్వతాలకు దక్షిణ దిశలో మనం దేశం విస్తరించి యుండుటను మన దృష్టికి తెచ్చారు. దేశానికి మధ్యలో వింధ్యపర్వతశ్రేణి యుంది. దానికి ఉత్తరంగా వున్న ప్రాంతాన్ని ఉత్తర భారతంగాను, దక్షిణంగా వున్న దానిని దక్షిణ భారతమని వ్యవహరిస్తున్నాం.

శివపార్వతుల నిలయంగా ప్రసిద్ధమైన కైలాసగిరి హిమాలయ పర్వత శ్రేణిలోనిదే. ఇంకా వింధ్య పర్వతాలు, సహ్యాద్రి మొదలైన ఇతర పర్వత సముదాయం మనకున్నాయి. గంగా, యమునా, సరస్వతులు, నర్మదా, సింధునదులు, కృష్ణా, గోదావరి, కావేరి మొదలుగా ఇతర నదులు మన దేశాన్ని పునీతం చేస్తున్నాయి. పురాణ ప్రసిద్ధమైన, అనాదియైన కాశీ, గయా, ప్రయాగ, అయోధ్య, మధుర, తిరుపతి, రామేశ్వరం మొదలైన పవిత్ర పుణ్యక్షేత్రాలు మన దేశానికి ఒక విశిష్టతను సమకూరుస్తున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు మనదేశంలోనే విలసిల్లాయి. మరొక విశేషమేమంటే, భగవానుడు లోక సంరక్షణార్థం కృష్ణుడు, రాముడు మొదలైన అవతారాలు స్వీకరించి మానవులతో సహజీవనం చేసి వారిని ఉద్ధరించింది మన దేశంలో మాత్రమే.

స్వామివారు ఆంధ్రదేశాన్ని ఘనంగా శ్లాఘించారు. ఆంధ్రదేశం త్రిలింగ దేశమని పూర్వం పిలవబడేది. దానికి కారణం లేకపోలేదు. 'త్రిలింగ' అంటే మూడు లింగాలు. ఆంధ్రదేశంలో దక్షిణాన కాళహస్తి, పశ్చిమంలో శ్రీశైలం, ఉత్తరదిశలో ద్రాక్షారామం ప్రసిద్ధి చెందిన శివక్షేత్రాలు. ఈ క్షేత్రాల్లో వెలసిన మూడు లింగాలు త్రిలింగాలుగా వాసికెక్కినాయి. అందువలన యీ దేశానికి త్రిలింగ దేశమనే పేరు సార్థకమైంది. త్రిలింగ శబ్దమే కాలానుగతంగా తెలుగుగా విరూపం చెందింది.

అంతేగాక పంచారామములుగా చరిత్రకెక్కిన ఐదు పుణ్యక్షేత్రాలు ఆంధ్రదేశంలో వున్నాయి. గోదావరి తీరంలోని ద్రాక్షారామం, కృష్ణాతీరంలో నెలకొన్న అమరారామం (అమరావతి), భీమవరంలోని సోమరామం సామర్లకోటలోని కుమారారామం, పాలకొల్లులోని క్షీరారామం వీనిలోనివే. ఈ శివక్షేత్రాలు గాక తిరుపతిలోని వేంకటేశ్వరస్వామి క్షేత్రం, సింహాచలంలోని నృసింహస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి క్షేత్రం మొదలైన యితర క్షేత్రాలు కూడా ఆంధ్రదేశాన్ని పునీతం చేస్తున్నాయి.

తమిళ##దేశంలో జన్మించిన శివభక్తుడైన అప్పయ్య దీక్షితులువారు. ఆంధ్రదేశం యొక్క పవిత్రతని, ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ తాను ఆంధ్రునిగా జన్మించలేక పోయానని వాపోతారు.

మన మతం హిందూ మతం. అపౌరుషేయం, అనాదియైన వేదాల్లో ప్రవచింపబడిన ప్రామాణిక సూత్రాలతో ఆవిర్భవించిన హిందూమతం కూడ అనాదియే నని ప్రాజ్ఞుల నిరూపణ.

సర్వమానవ సౌభ్రాతృత్వమే యీ మతానికి ప్రాతిపదిక. మానవుడు ఏ ప్రదేశంలో, ఏ కులంలో జన్మించినా పరమాత్ముని సృష్టియే. మానవుల్లో అంతరాలు లేవు. ఆత్మ నిత్యస్వరూపం అది పరమాత్మ అంశ##యే అనే విశ్వాసంతో మానవుడు అధర్మాన్ని త్యజించి, సత్యాహింసలను పాటిస్తూ, పరోపకారపరాయణలతో, స్వధర్మాన్ని వీడకుండా, కర్మిష్ఠియై జీవనం సాగిస్తే తరిస్తాడని స్వామివారి ప్రతిపాదన. అతనిలోని భగవద్భక్తికి అంతకంటే మించిన తార్కాణం వుండదు. వ్యసనపరుడై, అధర్మ వర్తనుడై ఎన్ని పూజలు చేసినా, ఎంత భక్తి ప్రదర్శించినా నిష్ర్పయోజనమే.

క్రైస్తవ ఇస్లాం మతాలు, జైన బౌద్ధమతాల ప్రవక్తల కాలంలో ఉద్భవించినవే గనుక వీటికి చారిత్రకంగా కాల నిరూపణ నిర్ధారితమైంది. కాని హిందూ మతం యొక్క కాలాన్ని నిరూపించటానికి ఆధారాలు ఏమీ లేవు. అందువలన అది అనాది మతం.

స్వామివారి ఉపదేశాలు ఉపన్యాసరూపంలో కొనసాగినాయి. గనుక చాలా ధర్మసూత్రాలు పునరుక్తికి లోనవుతాయి. ఇది దోషం గాదు. ఒక మంచి విషయాన్ని పలుమార్లు చెప్పి శ్రోతల, పాఠకుల హృదయాల్లో పటిష్ఠంగా పదిలపరచే యత్నం అభిలషణీయమే.

సాధన గ్రంథ మండలిని గురించి రెండు మాటలు విన్న విస్తాను. ఈ సంస్థ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు సర్వస్వము శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రిగారే. వీరే సంస్థను 1945 సం||రం||లో స్థాపించి వారికున్న పరిమిత వనరులతో కష్టనష్టాలను భరించి సంస్థను ఒక్క చేతిమీదుగా ప్రస్తుత స్థాయికి తెచ్చారు. ఇది సామాన్యులకు సాధ్యం కాదు. వారిది భగీరథ యత్నం. సంస్థ కేవలం సారస్వత సేవకు అంకితమై ప్రజోపయోగకరమైన, ఆస్తిక జనామోదములైన మత గ్రంథాల్ని వెలువరించే ప్రణాళికతో కృషి చేస్తున్నది.

ఒక విశేషం-శ్రీ ఆదిశంకరాచార్యుల వారి వాఙ్మయం ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు, లఘు భాష్యాలు, ప్రస్థానత్రయం ఆంధ్రానువాదముతో ఇంతవరకు సమగ్రంగా యెవరూ ప్రచురించలేదు.

ఆ గ్రంథరాశిని ఆంధ్రానువాదముతో ''శంకర గ్రంథ రత్నావళి'' అను పేర ఇప్పటికి 20 సంపుటములు ప్రచురించారు. ఉపనిషత్తులు, సూత్రభాష్యం ప్రచురించు ప్రయత్నములో ఉన్నారు. ఇది మహత్తర కృషి. గ్రంథాల్ని ప్రచురిస్తూ ఒక ఆదర్శ గ్రంథమండలిగా కీర్తిని ఆర్జించింది. దీనికి కారకులైన శాస్త్రిగారికి తెలుగు పాఠక లోకం ఎంతయో ఋణపడి ఉంటుంది. శాస్త్రిగారు 92 వసంతాలు పైబడిన వయోవృద్ధులైనా, ఇప్పటికిని సంస్థ సేవలోనే నిమగ్నలై యుంటారు.

ఈ అనువాద గ్రంథరచనకు నాకు అవకాశమిచ్చిన శాస్త్రి గార్కి నా కృతజ్ఞతలు. గ్రంథరచనా వ్యాసాంగంలో నాకున్న అనుభవం స్వల్పం. జగద్గురువులు కంచికామ కోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు ఆశీస్సులు, శాస్త్రిగారి ప్రోత్సాహం, ప్రోద్బలం నాకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చి యీ బృహత్కార్యాన్ని పూర్తి చేయటానికి దోహదపడ్డాయి. చదువరులు, విజ్ఞులు లోపములను మంచి మనస్సుతో మన్నింతురుగాక.

- కాశీనాథుని శివరావు

(అనువాదకుడు

Sri Jayendravani    Chapters    Last Page