Sanathana Dharmamu    Chapters    Last Page

V. సమూహ విషయములు

1. స్వరాజ్యం అంటే ఏమిటి?

ఈ రోజుల్లో స్వదేశం, స్వరాజ్యం అని అందరూ చెప్పుకొంటారు, కానీ నడతలోనూ, భావంలోనూ, వస్త్రధారణలోనూ విదేశీయులవలె వుంటారు. ఇట్లా ఉన్నంతవఱకు మనం పరాధీనులమే. మన దేశం పరాధీనంలో వున్న రాజ్యమే. వాస్తవమైన స్వరాజ్యం అంటే మనదేశంలో పూర్వం ఎలాంటి ఆచార అనుష్ఠానాలు ఉండెడివో గమనించి ప్రస్తుత వేషభాషలు, వర్తనం తదనుసారంగా వుండటానికి వలసిన ప్రణాళికలను ప్రవేశ##పెట్టడమే. మన ప్రాచీన ధర్మములు, వాడుకలు, ఆత్మసంపత్తీ మారకుండా వుండునట్లు మనం చూడవలె. పరదేశస్థులు చెప్పకుండానే వారి అలవాట్లను పాటించే మనకు రాచరికంలో మాత్రం స్వాతంత్ర్యం వుంటే ఏమి? పోతే ఏమి?

స్వదేశీయమైన సంస్కృతి అనేదొకటి మనకున్నది. ఈ ప్రాచీన సంస్కృతిని మనం వైదేశిక వ్యామోహంలో మఱచిపోరాదు. మన సంస్కృతిని పాటించని వారు ప్రజాపాలన చేస్తున్నారు. వారికి ఓట్లు వేయడం వల్ల మనకు స్వాతంత్ర్యం వచ్చినదనుకోవటం పొరబాటే. లౌకిక విషయములలో కూడ ఆత్మసంబంధములుగనూ, దైవ సంబంధములుగనూ వున్న పద్ధతే మన ప్రాచీన సంస్కృతి. అందుచేత మనమందరమూ మన రాజ్యాంగమూ, దేశ వ్యవహారమూ మన ప్రాచీన సంస్కృతిననుసరించి వుండేటట్లు గమనించాలి. ఆచార అనుష్ఠానములున్నవారినీ, ధర్మ నిష్ఠగలవారినే మనం రాజకీయాలలో ఎన్నుకోవాలి. అట్టివారే సరియైన ప్రభుత్వం మనకు ఇవ్వగలరు. ఇతరులకూ మార్గదర్శకంగా వుండగలరు.

2. రాచరికం దేనికి?

దేశంలో శాంతిభద్రతలు వుండవలెనంటే రాజ్యాంగముండాలి. ఒక బలిష్ఠుడు, బలంలేని వానిని హింసిస్తున్నాడు. నేరం చేస్తే శిక్ష ఉందని తెలిస్తే ఇట్టి హింసాకార్యములు జనం చేయడానికి భయపడతారు. అందులకు ధర్మనిష్ఠకల పోలీసువారూ, న్యాయస్థానాలూ కావాలి. వీనిలో ఉద్యోగం చేసేవారికి ఉద్యోగ దక్షతతో బాటు శీలనైర్మల్యం, న్యాయానురక్తి వుండాలి. నేరస్థునికి తగిన దండన ఇవ్వడం వలన ఒక విధంగా బలహీనునికి న్యాయం లభించినా, నేరస్థుడు, మరల అట్టి నేరం చేయకుండా వుండటానికి తగిన సంస్కార ప్రణాళికలను కూడా రాజ్యాంగం ప్రవేశ##పెట్టగలిగితేనే రాణిస్తుంది.

నేరస్థునికి తగిన శిక్ష అర్ధశాస్త్ర ప్రకారం రాచరికం విధించినా, అతడు అట్టి నేరాలను భావికాలంలో చేయకుండా వుండేటట్లు సంస్కరణావకాశములు కల్పించవలెననుటయే ధర్మశాస్త్రముల ఉద్దేశం. అట్టి వాతావరణంలో ప్రజలకు ఒక నేరం చేయవలెనన్న సంకల్పమే కలుగకుండా పోతుంది. దేశం శాంతంగానూ సుభిక్షంగానూ వుంటే దొంగతనాలూ, దోపిళ్ళు, పరస్పర కలహములూ తాముగా సమసిపోతాయి.

అట్టి స్థితి, ప్రభుత్వానికి పూనుకొన్నవారు ధర్మశీలురై వాచావర్తనములలో ఏకరూపత కలిగిన వారైతేనే సాధ్యమవుతుంది. అట్టి ప్రభుత్వానికి ప్రజల సహకారమూ వుంటుంది. స్వార్ధరహితంగా ధర్మబోధచేసేవారికి తగిన ఉత్సాహమూ రాజ్యాంగము కల్పించవలసిన వుంటుంది.

న్యాయస్థానాలు ఎక్కువయ్యే కొద్దీ, నేరాలూ ఎక్కవ అవుతున్నవనే అర్ధం. పూర్వకాలంలోని రాజులు కోర్టులకు బదులు కోవెలలు నిర్మించారు ఈ ఆలయాలు ధర్మ ప్రచారానికి ఎంతో ఉపయోగకరంగా వుండేవి. అన్ని విధములైన కళలూ ఆలయం చుట్టూ పరివేష్ఠించి వుండేవి. ప్రజలకు సన్మార్గావకాశములనొచ్చే విధంగా ప్రభుత్వం నెఱపాలి. ప్రభుత్వం అంటే ఒక దండోపాయాన్ని మాత్రం అనుష్టించే సంస్థగా వుండరాదు. అట్టి రాచరికం వున్నపుడే మనం స్వతంత్రులము, మనకు స్వాతంత్ర్యం వచ్చిందనీ మనం చెప్పుకోగలం.

3. మిత వ్యయం

మన కాలమంతా ద్రవ్యార్జలోనే గడచిపోతున్నది. ఈ ద్రవ్యాన్ని మనం సరిగా ఖర్చు పెట్టుతున్నామా అని యోచించాలి. మనం ఏ వస్తువునూ అవసరానికి అధికరించి కోరకూడదు. ఒక వస్తువు కొనేటపుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చునో అంత తక్కువ ధరలో కొంటాము. కానీ ఆ వస్తువు మనకు అవసరమా అన్న విషయం ఆలోచిస్తున్నామా? వస్తు సముదాయాన్ని వృధా చేసుకొంటూ పోవడం వలన మనకు సుఖం అధికమౌతుందని అనుకోవటం ఒక భ్రమ. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. దానికి కావలసిన ధనం మాత్రం ఆర్జిస్తే చాలు. ఈ విషయం మనం గుర్తించగలిగితే, మన ఆచారాలు, అనుష్ఠానాలు వదలుకొని దేశాంతరాలకు పోయి విస్తార ధనార్జన చేయవలసిన అవసరం ఏర్పడదు. ఆత్మ విచారానికీ, ఈశ్వరధ్యానమునకూ, పరోపకారమునకూ మనకు వలసినంత కాలము కావాలంటే అవసరాలకు మించి వస్తువులను సముపార్జన చేసే లౌల్యమును వదలిపెట్టాలి.

మనం రెండు విధాలుగ కాలాన్ని వ్యయం చేస్తున్నాము. ఒకటి ధనానికోసం వెచ్చించే సమయం, రెండవది ధనార్జనతో సంపాదించిన వస్తువుల రక్షణలో వెచ్చించే సమయం. ఈ రెండూ మనకు మిగిలితే ఆ మిగిలిన కాలంలో ఆత్మ తుష్టికరములైన సాధనలను చేసి జీవితం శాంతంగానూ, సుఖంగానూ, ఆనందంగానూ తృప్తిగానూ గడపవచ్చును.

ఈ పొదుపు, వస్తువుల విషయంలోనే కాదు. సంభాషణలలోనూ పొదుపు ఉండేటట్లు చూడాలి. పదిమాటలలో చెప్పవలసిన విషయం ఒక్కమాటలో చెప్పగల సామర్ధ్యాన్ని మనం సంపాదించాలి. ఎప్పుడు మనకు ఈ విధమైనా వాచాసంయమన మేర్పడుతున్నదో, బుద్ధిలో ఒక తీక్షణమూ, వాక్కులో ఒక ప్రకాశమూ మనం స్ఫుటంగా చూడగలము. మన వాక్కులు వ్యర్ధంకారాదు. 'మౌనేన కలహం నాస్తి'. మితభాషణ వలన మనశ్శాంతీ ఆత్మ శ్రేయస్సూ వృద్ధి ఔతాయి.

కానీ ఈ కాలంలో మనం చూస్తున్నదేమంటే వృధావాగాడంబరం. దినపత్రికలు తెరచామంటే, మనం చూచేదంతా వివిధ కక్షలకు చెందిన నాయకుల ప్రసంగాలే. కార్య దక్షత లేకున్నా మాటలు మాత్రం కోటలు దాటుతాయి. తాము చేయలేని కార్యక్రమముల లోపాన్ని ఈ వాగ్విజృంభణలో వీళ్ళు కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తారు. పొదుపు అనే విషయం ఒక్క చేతలోనే కాక మాటలలోనూ వుండవలె.

అబ్బ కోరికలూ, సంకల్పం వల్లనే ఉద్భవిస్తున్నాయి. క్రొత్తక్రొత్త సంకల్పములు ఉదయించకుండా చూసుకొంటే, కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమాలూ, ధనార్జనా, వస్తు సంపాదనా తగ్గుతూ వస్తాయి. సంకల్పములు క్షీణించవలెనంటే సద్వస్తు ధ్యానముండాలి. అపుడు చిత్తవృత్తులు సమసిపోయి ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం.

మనం సంపాదించే ధనమంతా స్వార్ధంకోసమే కాక దానధర్మాలకు కూడా వెచ్చించాలి. మన సమాజంలో సత్కార్యాలకోసం దానధర్మాలు చేసే సుకృతులు ఎంతోమంది వున్నారు. లోకంలో ఎంతో మంది దుఃఖితులూ దరిద్రులూ వున్నారు. వారు కష్టపడుతుంటే మనకున్నదికదా అని మనం వృధాగా ధనమును ఖర్చు పెట్టడం పాపం. మనధనంతో దీనుల దుఃఖాశ్రువులను తొలగించగలిగితే అంతకంటే పుణ్యకార్యం వేరే వుండదు. ధనం వుంటే మాత్రం చాలదు. దానిని సద్వినియోగం చేస్తున్నామా, పరోపకారానికి అది ప్రయోజనపడుతున్నదా, దీన జనోద్ధరణ దీని వలన జరుగుతున్నదా అని మనం జాగ్రత్తగా గమనించవలె. ధనం సద్వినియోగం అయ్యేకొద్దీ, మనకు లక్మీకటాక్షం కూడా సమృద్ధిగా వుంటుంది.

4. మతానుష్ఠానాలలో శ్రద్ధ

నా యాత్రలలో నేను వివిధములైన చోట్లలో మకాం చేయవలసివస్తున్నది. కొన్నిచోట్ల వచన గృహంకోసం నిర్దేశించిన ప్రదేశం చిన్నగా ఇక్కట్టుగా వుంటుంది. అక్కడ వంట మనుష్యులు వంట చేస్తుంటే, వంట ఇంటి పొగ నేను పూజ చేస్తున్న మండపం వఱకు వచ్చి క్రమ్ముకొంటుంది. ఎక్కడ చూచినా పొగ. ఈ పొగ ఎక్కడ తక్కువగా వుంటుందని వెదకుతూ పోతే వంటింటి సమీపంలో తక్కువగా వున్నట్లు తెలుసుకొంటాం. పుట్టినచోట్లో తక్కువగా వుంటూ ఇతర ప్రదేశములంతా పొగ ఆక్రమించుకొని వుంటుంది.

నేను ఆ రోజులలో ఎక్కువగా గ్రామాల్లోనే సంచరించేవాడిని. పట్టణములకు అంత ఎక్కవగా వచ్చేవాడిని కాను. గ్రామంలో ఆచారానుష్ఠనాలు వుంటాయనీ, నవనాగరికత కల పట్టణాలలో అనాచారము ఎక్కువగా వుంటుందనీ భావించేవాడిని.

పట్టణాల ప్రజలు కూడ నన్ను రమ్మని మిక్కిలి బలవంతం చేయడంచేత పట్టణాలకూ రావడం ప్రారంభించాను. అక్కడ వచ్చి చూచేసరికి ఇక్కడ పరిస్థితి నేను అనుకొన్న దానికి భిన్నంగా కనబడింది. దీని వలన నాకు కొంత తృప్తి కలిగినదీ వాస్తవమే. వైదికశ్రద్ధ, ఆచారం, పూజా పునస్కారాదులు గ్రామములకంటే పట్టణములలో అధికంగా వున్నట్లు కనిపించింది. వంట ఇంటి పొగ వేరు చోటులలో ఆక్రమించినట్లు గ్రామంలో వుండవలసిన ఆచార అనుష్ఠానాలు అక్కడ తగ్గి పట్టణాలకు వ్యాపించినవని తెలుసుకొన్నాను.

గ్రామస్థులకు పట్టణవాసులవలెకాక విరామం అధికంగా వుంటుంది. వాళ్ళు అనుఎn్ఠానాలను లోపం లేకుండా చేసుకోడానికి వలసిన వ్యవధి వున్నది. కాని వాస్తవంలో ఆచారానుష్ఠానాలు చేయకుండా, శాస్త్రపరిశీలనకు స్వస్తి చెప్పి తమ కాలాన్ని వారు వ్యర్ధపరుస్తున్నారు. నగర వాసులకన్ననో! తలకుమించిన పనులున్నవి. ఆఫీసు పనులు, సామాజిక కర్మలు, వ్యాయామములు, క్లబ్బుకు పోవడం ఇత్యాది కార్యక్రమాలు వాళ్ళకు ఎన్నో వున్నవి. ఇట్లున్నప్పటికీ, వారికి తాము సక్రమంగా ఆచారానుష్ఠానాలు చేయడం లేదేయని పశ్చాత్తాపమున్నది. అందుచేత వారు భారీగా కాకున్నా ఏదో చిన్నపూజ, అనుష్ఠానం, భజన, పురాణప్రవచనం, ఆలయ దర్శనం ఇలాంటి కార్యక్రమాలను, వున్న వ్యవధిలో చేయకలుగుతున్నారు. ఇది సంతోషకరమైన విషయం.

మనకున్న కాలమంతా ధనార్జనకే వినియోగపఱచకుండా కొంతసమయమైనా శీలనైర్మల్యానికీ, కల్యాణగుణములు పెంపొందించు కొనుటకూ కేటాయించి, ప్రశాంతమయిన జీవితం గడపడానికి వలసిన సదుపాయాలను గూర్చి జాగ్రత్తపడాలి. ఆధ్యాత్మిక జీవనం స్వాత్మలాభానికే కానీ ఆడంబరం కోసం కాదు. ఒక్క ద్రవ్యవిషయంలోనే కాక, మాటలలో చేతలలో పొదుపుగా వుంటూ, ఇతరులకు హింస కలిగించే కార్యాలు చేయకుండా, ఆనందంగా సుఖశాంతులతో జీవనం చేయడానికి పూనుకోవాలి. ద్రవ్యార్జనే పరమార్ధమని భావించకుండా, గుణగ్రహణానికి అందరూ పాటుపడి అధీతి బోధా చరణలయందు జాగ్రత్తపడితే ఈశ్వరానుగ్రహానికి పాత్రులము కాగలము.

5. వర దక్షిణ

మీరంతా నా ఉపన్యాసాలు వినడానికి వస్తూవుంటారు. ఈ రావటం పట్టి కాలక్షేపానికే అయితే దాని వలన ఎట్టి ప్రయోజనమూ లేదు. నేను ఎన్నో విషయాలు చెబుతుంటాను. అందులో కొన్నిటితో మీరు ఏకీభవించకపోవచ్చును. కానీ మీ ఆత్మ లాభంకోసం, సమాజ ప్రయోజనం ఉద్దేశించి నేను చెప్పవలసిన నాలుగు మాటలూ చెప్పకపోతే, నేను 'జగద్గురువు' అని పేరు పెట్టుకోవడంలో ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పవలసిన విధి నాకు ఉన్నది. మీరు నా మాటలు వింటే సంతోషం. వినకసోతే నా కర్తవ్వాన్ని నేను పాలించిన వాడిని ఔతాను.

చెన్నపురి వచ్చి ఇక్కడ విషయాలు చూచిన తర్వాత ఒక విషయం నాకు చాల మనఃక్లేశం కల్గించిందని చెప్పటానికే ఈ ఉపోద్ఘాతం. ఎంతోమంది వయస్సు ముదిరిన పిల్లలు నా వద్దకు వచ్చి తమకు పెళ్ళికాలేదని కన్నీళ్ళతో చెప్పుకొంటున్నారు. వారికెంత మనస్తాపమున్నదో నాకు తెలుస్తూనే ఉంది. వీరిని చూచి నా మనస్సూ ఎంతో వేదన పడుతూవున్నది.

వయస్సుపైకెగబ్రాకినా ఈ బిడ్డలకు పెళ్ళికాకుండా వుండటానికి కారణమేమి?

ఈ రోజులలో ఆడంబరంగా చేస్తే కానీ పెళ్ళికాదు అనే దురభిప్రాయం చాలమందికి నాటుకొని పోయింది. వచ్చే జీతాలు, ఆదాయం, దినసరి ఖర్చులకే చాలకపోతే పటాటోపంగా వివాహాలు చేయడానికి ఎట్లావీలు ఔతుంది? సకాలంలో వివాహవయస్కలైన కన్యలకు పెళ్ళి కాకపోవటం ముఖ్యంగా ఆర్ధికకారణం చేతనే. పిల్లవాని పక్షం వారు మితి మీరిన వరదక్షిణలు, పెళ్ళికానుకలూ అడుగుతున్నారు. ఈ విధంగా పెళ్ళి ఖర్చులు వేలకు పరిమితం కాకుండా లక్షసంఖ్యపైగా దాటిపోతున్నవి.

అంతేకాదు ఈ కాలంలో పిల్లవాని పక్షం వారు వరదక్షిణ తీసుకోకపోతే ఒక న్యూనత క్రింద భావిస్తున్నారు. పిల్లవానికి ఏదో లోపమున్నందు వలన వరదక్షిణ అడగటం లేదని ఇతరులు అనుకొంటారేమో అని వీరి భీతి. నిజానికి ఇట్టి భీతికి కారణమే లేదు. మనమంతా పెళ్ళిళ్ళు పొదుపుగా చేయడానికి అలవాటు పడాలి. ''వరదక్షిణ తీసుకోము'' అన్న నియమపాలనం చేయాలి. ఇతర విషయములు తృప్తికరంగా వుంటే వరదక్షిణ కారణంగా వివాహాలను నిలిపి వేయరాదు.

మన ఆచారాలన్నీ ఈ మాత్రం మనం పాటిస్తూ వస్తున్నామంటే దానికి స్త్రీలే కారణం. స్వాభావికంగా వారు ఆనూచానంగా వస్తున్న ఆచారాలను పాటించటంలో శ్రద్ధ వహిస్తారు. వారికి సకాలంలో వివాహమైతే గార్హస్త్యధర్మంలో పురుషులకు తోడ్పడి ధర్మరక్షణకు సాహాయ్యకంగా వుంటారు. స్త్రీ అంటే గృహలక్ష్మీ. స్త్రీ ధర్మజ్యోతికి ప్రతీక. అందుచేత వారికి మనఃక్లేశకరమైన అలవాట్లు మానుకోవాలి. అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారనీ, అందుచేత వర్ణసాంకర్యం ఏర్పడుతుందనీ గీతలో కృష్ణ పరమాత్మ చెప్పి స్త్రీలకు సమాజంలో ఎంత విశిష్ఠ స్థానమున్నదో సూచిస్తున్నాడు. ఈ ప్రమాదం రాకుండా వుండవలెనంటే స్త్రీలకు సకాలంలో వివాహంచేసి వారు సంతోషంగా వుండేటట్లు చూడవలసిన విధి మనకెంతైనా వున్నది. దీనికి అడ్డుపడే దుబారాఖర్చులు, వరదక్షిణ లాంటి అశాస్త్రీయమైన అలవాట్లు మనం మానుకోవాలి.

ఐతే ఈ విధంగా మీకు చెప్పడానికి నాకే విధమైన అధికారమూ లేదు. అందుచేత మీరు నా మాట వినడానికి ఒక ఆయుధ ప్రయోగంచేస్తాను. సాధారణంగా మీరు పెళ్ళిపత్రికలు అచ్చు వేసేటపుడు శ్రీ జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఈ వివాహం నిశ్చయమైనదని ఒక వాక్యం వ్రాస్తారు. ఇకమీదట మీరు వరదక్షిణ తీసుకొనే పక్షంలో, ఇచ్చే పక్షంలో, ఆ వాక్యాన్ని రద్దు చేయండి. ఈ ఆయుధ ప్రయోగంతోనైనా మీరు దారికి వస్తారేమో అని ఒక ఆశ.

6. క్షత్ర ధర్మము

మన పెద్దలు పరోపకారార్ధమిదం శరీరం అని అన్నారు. మన దేహములో జవసత్త్వములున్నపుడే మనం ఇతరులకు శారీరకంగా సహాయం చేయగలుగుతాము. శరీర బలము ఒక్కటే కాదు, జీవితంలో ఆచారాలను క్రమంగా పాటించే ధర్మనిష్ఠ, అభయం బాటలలో ఋజుత్వం వుంటేనే మనం ఇతరులకు చేసే సేవ ఫలవంతం ఔతుంది. ఇటువంటి సేవా భావమునకు మనకు ఆదర్శంగా వుండేది ఎవరంటే, ఆంజనేయస్వామియే. వారు ఎప్పుడూ శాంతంగా వుండేవారు, ఆగ్రహం వచ్చిందంటే ఎవరినీ లెక్కచేయక, శతృవులను హతమార్చేవారు. వారికి బుద్ధిబలము ఎక్కువ. వారి స్వరూపమే వినయము. వారి హృదయం అనుక్షణమూ రామనామ స్మరణ చేస్తూ నామామృత రసానందంలో తేలిపోతూ వుండేది.

తాముగ ఎవరినీ హింసించేవారు కాదు. ఎవరయినా హింస చేయడానికి పూనుకొంటే ప్రతీకారం చేసేవారు. అంతే. స్వార్ధం కోసం తమ బలాన్ని ఎన్నడూ వారు వాడుకోలేదు. కానీ ఆ బలాన్ని దుర్బలులకు అండగా వుంచటానికి ఎన్నడూ వారు వెనుదీయలేదు. కానీ ఆ బలాన్ని కూడ ఇట్టి ఉదారపురుషుడే. ఆంజనేయస్వామి అవతారమని పరిగణింపబడే శ్రీ సమర్ధరామదాసు యొక్క అత్యంత ప్రియమైన శిష్యుడు శివాజీ. అందుకే వారికి అట్టి అమూల్య గుణసంపత్తి ఏర్పడింది.

మనకు దేశభక్తి వుండాలి. దేహంలో జవసత్వములుండాలి. వానితోబాటు సార్వకాలిక అభయస్థితి మనం భజించాలి. నిర్భయంతోపాటు స్వార్ధరాహిత్యం, పరోపకార పారీణత, అలవఱచుకోవాలి. ఈ గుణ సంపత్తినే క్షాత్రధర్మమని అంటారు. 'క్షతాత్‌ కిల త్రాయతే ఇతి క్షత్రం' ఇతరులను అపాయం నుంచి కాపాడుటే క్షాత్రం. మన యువకులకు ఈ క్షాత్ర ధర్మం ఎంతో అవసరం. బలిష్ఠులను చూసి మనం భయపడరాదు. ఎవరయినా మృగప్రాయంగా ప్రవర్తిస్తూ హింసకు పూనుకొన్నాడంటే ఎదిరించి సర్వత్యాగానికి సిద్ధంగా వుండాలి.

ఈ కాలపు తీరు చూస్తే మనలో క్షాత్రం పూర్తిగా లోపించిందనే అనాలి. ఎక్కడ చూచినా సమ్మెలు, నిరశన వ్రతములు, ఇండ్లను, ఆస్తులను, బస్సులను, బండ్లనూ తగల పెట్టడం ఇవీ ఈ రోజులలో మనకు కనబడే దృశ్యాలు. ఇదంతా బలవంతుల చిహ్నంకాదు. బలహీనుల చిహ్నమే. ఇతరులను హింసించడమే వీరి ఉద్దేశం. ఇట్టి వాతావరణంలో ప్రజల బలహీనత, ప్రభుత్వంలోనూ ప్రతిఫలిస్తుంది. ఈ దేశంలో భయం లేకుండా తలెత్తుకొని తిరగవలెననికోరుకొంటే, మరల మనమందరమూ క్షత్ర ధర్మాన్ని అభివృద్ధి చేయాలి. పరోపకార పారీణులు, శీలవంతులు, సత్యసంధులు, ఋజుప్రవర్తకులు అందరూ కలియకూడి దౌర్జన్యాన్ని ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. లోక క్షేమానికి ఈ క్షత్రధర్మమెంతో అవసరం. అపుడే దేశంలో సుఖశాంతులు. మన రాజ్యాంగం చక్కబడవలెనంటే దారి ఇదే.

7. లోకాస్సమస్తా స్సుఖినోభవంతు

గడచిన అర్ధశతాబ్దములో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాచరికం, సామూహిక విధానం, విజ్ఞానం, గృహజీవనం - వీటన్నిటిలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చినవి. ఐదువేల ఏండ్లుగా నడుస్తున్న జీవనవిధానం, ఒక్కపెట్టున ఈ అర్ధశతాబ్దంలో తలక్రిందులుగా మారిపోయింది. ఈ అనుభవాన్ని తఱచిచూస్తే, చాలగొప్ప మార్పులు ఏర్పడినవని మనం సులభంగా గ్రహిస్తాం. ఈ అనుభవాల మధ్య ఒక్క విషయం మనకు స్ఫుటంగా గోచరిస్తుంది. మానవానీకం శాస్త్రనిష్ఠనుంచీ, భగవద్ధర్మము నుండి ఎంతెంత వైదొలగుతున్నదో అంతంత చిక్కులపాలవుతున్నది అని మనం సులభంగా తెలుసుకొంటాము. సైన్సు అభివృద్ధి అయిన కొద్దీ అన్ని దేశాలలోనూ ఒక అశాంతి తలెత్తి ప్రజలలో నెమ్మది లేకపోయింది. మున్ను ప్రజలలో వున్న నిశ్చింత, నెమ్మదీ, సౌజన్యం పూర్తిగా లోపించినదనే అనాలి. మనిషి కుశాగ్ర బుద్ధియై శక్తులను వశపఱచుకొన్నందువలన వచ్చిన ఆపదే ఇది.

సరే వ్యాధిని తెలుసుకొన్నాం. దీనికి మందేమి? భగవదావేశితమైన మనస్సులో అశాంతీ, భీతీ ఎన్నడూ వుండదు. ఈ కాలంలో పోలీసుస్టేషన్లూ, న్యాయస్థానాలు కొల్లలుకొల్లలుగా వున్నాయి. ప్రభుత్వం వీని విషయంలో జాగ్రత్తగానే వున్నది. కానీ ప్రజలలో ఆస్తిక్యం ప్రబలమయ్యే పనులు మాత్రం ప్రభుత్వం చేయటం లేదు. ప్రభుత్వం మతబోధనలు గూర్చీ, నైతిక బోధనలు గూర్చీ అస్తమానమూ మాట్లడుతున్నా కార్యరూపంలో మాత్రం ఏవీ కనబడటంలేదు. మన పెద్దలు అనుదినమూ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు' అని ప్రార్ధించేవారు. ఈ ప్రార్ధన సర్వమత సమత్వ చిహ్నం. అందుచేత ప్రజా శాంతి కొఱకు మనమందరమూ, ఆస్తిక్యం పెంచుకొని, పరస్పర వైషమ్యులులేక, ఒద్దిక కలగి మెలగటం అలవాటు చేసుకోవాలి.

Sanathana Dharmamu    Chapters    Last Page