Sanathana Dharmamu    Chapters    Last Page

VI. సంస్కృతి

సంస్కృతంలో కళ అని ఒక పదమున్నది. తమిళంలో దానిని 'కల్వి' అని అంటారు. ఆంగ్ల బాషలోని కల్చర్‌ అనే పదానికీ, ఫ్రెంచి భాషలో 'కొలే' అన్న పదానికి మూలము 'కళ' అన్న ఈ పదమే. పెరిగే వస్తువు కళ. చంద్రకళ, పాడ్యమి నుంచి పౌర్ణిమ వఱకు ప్రవర్థ మానమయ్యేది. చంద్రకళ ఎట్లా అనుదిన ప్రవర్ధమానమవుతున్నదో అట్లే కళలు మనోవికాసాన్ని దినదిన ప్రవర్ధమానం చేస్తాయి. ఏ ప్రదేశంలో కళలు విస్తారంగా వ్యాపించినవో, ఆచోట కల్చర్‌ ఉందని అర్థము.

మహూన్నత భావ వైవిధ్యమే కళలు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా ఉన్నత భావములు వుంటాయి. శిల్పము, చిత్రకళ, నాట్యము, సంగీతము, కవిత్వము, త్యాగము, సేవాభావము - ఇట్లు సంస్కృతి ఎన్నో రూపములను ధరిస్తుంది. వీనినన్నిటినీ కలియగట్టి ఒక ప్రోవు చేస్తే అది ప్రేమౌతుంది, సర్వ ప్రపంచమునూ, ఆ ప్రేమ పరిధిలోనికి మనము తేగలిగితే అదే సర్వోత్కృష్టమైన సంస్కృతి.

ఒక దేశము యొక్క సంస్కృతిని కొలవడానికి ఏదైన మానదండమున్నదా? (కొలతబద్ద) దేశంలో వున్న ప్రజలకందరికి ఒకే సంస్కృతి వుండటానికి వీలుకాదు. ప్రతి దేశంలోనూ మోసగాళ్ళు, కల్లలాడేవారు, దొంగలు, కూటసాక్ష్యం చెప్పేవాళ్ళు వున్నారు. వ్యాధిగ్రస్తుణ్ణి వైద్యుడు పరిశీలించి ఇతనికి ఎన్నో వ్యాధులున్నా హృదయం మాత్రం చక్కగా వుంది భయంలేదు అని చెప్పటం పరిపాటి. ఒక దేశంలో సంస్కృతి వున్నదా లేదా అనడానికి ఏదైనా ఒక హృదయస్థానమున్నదా?

ఉత్తమ భావములున్న ప్రతి దేశంలోనూ, మహాకవులు పుడుతుంటారు. అట్టి మహాకవులు ఏం చెప్పారు? ఏ మహాకావ్యములు వారు వ్రాశారు? ఆ కావ్యములలో ఎట్టి ఉన్నత భావములను గ్రంధస్థం చేసారు? నికషోపలమువంటి ఏ ఆచారములను వారు అనుష్ఠించవలెనని బోధించారు? ఇటువంటి విషయాలే ఒక దేశంలోని సంస్కృతికి హృదయస్థానం లాంటివి. అట్టి మహాకవుల వాక్కులే సంస్కృతికి ప్రమాణాలుగా వుండగలవు.

మత స్థాపకులు చెప్పే బోధలకూ ప్రాధాన్యత ఉండటం వాస్తవమే. కానీ మతం అన్న పేరు వచ్చే సరికి, ఒక్కొక్క మతమూ, తమ సిద్ధాంతములే శ్రేష్ఠములనీ, అని అందరూ ఇష్టం వున్నా లేకపోయినా పాటించవలెననీ, చెపుతూ వుంటుంది. దీనిలో అసహనము వుంటుంది. అపుడు దృష్టి లోపించడానికి అవకాశముంటుంది. కానీ కవి విషయం వేరు. తన మనస్సాక్షిగా దేనిని నమ్ముతాడో దానిని నిర్భయంగా, జంకు గొంకూ లేక అతడు చాటి చెప్పగలడు, అట్టి మహాకవులు పుట్టిన దేశాలలో, అతని వాక్కులు ప్రమాణ వంతములుగా వుంటవి.

ఈ రోజుల్లో నేడు వున్నది రేపు వుండటంలేదు. కానీ కొన్ని కావ్యములు మాత్రం చిరకాలంనుంచి, ప్రజలలో వ్యాప్తిలో వున్నాయి. వానిలోని ఉన్నత భావాలు ప్రజలను ఎంతో జాగరితం చేశాయనుటకు, ఆ కావ్యముల ప్రసిద్ధి ఒక్కటే దృష్టాంతము. కుమారిలభట్టు, వేదాంత దేశికులు వ్రాసిన మతసంబంధములైన రచనల కంటే, మహాకవి కాళిదాసు వాక్కులకు అధిక ప్రమాణమున్నట్లు మనం సులభంగా గ్రహించగలం.

1. నాదోపాసన

కళా స్వరూపిణియైన సరస్వతిని వీణా పుస్తకధారిణిగా మనం ధ్యానిస్తాం. పరమేశ్వరుని పత్నియైన పరాశక్తియు వీణాపాణియే. కాళిదాసు నవరత్న మాలాస్తోత్రంలో ఆ విధంగా అంబికను వర్ణించి యున్నారు. ఆమె తన వ్రేళ్ళ కొనలతో 'సరిగమపదని' అని స్వరకల్పనం చేస్తూ ఆనందంగా వుందని.

''సరిగమపదని రతాం తాం - వీణా సంక్రాంత హస్తాంతాం'' అని కాళిదాసు వర్ణించినాడు. అంతేకాదు. ఆ శివకాంత మృదుల స్వాంతగా వుందనీ ఆయన వ్రాస్తున్నాడు.

''శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం'' ఆ సంగీతానుభవంలో, పుష్పసదృశ##మైన కోమలమైన మనస్సుతో, కరుణామూర్తియై, ఆమె విలసిల్లుతున్నదని కవి శివకాంతాకీర్తనం చేస్తున్నాడు. ఆ విధంగా కాళిదాసు ధ్యానించిన మూర్తి శ్యామల. దైవికమైన సంగీతానుభవంలో సాధకునికి, ఈ శాంతానందముల అనుభూతి కలుగుతుందని దీని తాత్పర్యం.

యోగ ధ్యాన వేదాధ్యయన విధులతో మనకు కలిగే ఈశ్వరానుభవం సులభంగా సంగీతం మూలకంగా, రాగతాళ జ్ఞానంతో కలుగుతుందని, ధర్మశాస్త్ర కర్తయైన యాజ్ఞవల్క్యమహర్షి కూడా ఈ క్రింది శ్లోకంలో చెబుతున్నాడు.

వీణావాదన తత్త్వజ్ఞ శ్రతి జాతి విశారదః

తాళ జ్ఞాచ్చ ప్రయత్నేన మోక్షమార్గః సగచ్చతి ||

మోక్షమార్గంలో అప్రయత్నంగా పోవచ్చని ఉద్ఘాటిస్తున్నారు. సంగీతలహరిలో మునిగిన మనస్సులో శాంతి అప్రయత్నంగా కలుగుతున్నది. సంగీతం తెలిసినవారు ఈ ఆనందానుభూతినీ, శాంతినీ తాము అనుభవించుటమేకాక ఇతరులకూ పంచి పెడుతున్నారు.

అంబికబ్రహ్మశక్తి. నాదస్వరూపుడే ఈశ్వరుడు. శ్యామల సరిగమ పదనిరతయై, ఆనందమయియై వున్నదంటే, బ్రహ్మము, శక్తియు అభిన్నంగా అద్వైతానందములో వున్నారనీ, ఉపాసకులకూ ఆ ఆనందానుభూతిని అనుగ్రహిస్తారనీ అర్ధం.

2. వాక్ప్రయోజనం

ప్రపంచంలో ఎన్నో విధములైన జీవరాశులున్నా ఒక్క మనవర్గమునకే పరమేశ్వరుడు మాట్లాడేశక్తిని ఇచ్చివున్నాడు. ఈ మాటలనుండి భాషలు ఏర్పడినవి. ఒక్కొక్కభాషకు నియమితమైన లిపి ఉన్నది. వాక్కులనే మూలధనంగా పెట్టుకొని లెక్కలేని బడులు, కళాశాలలు, పుస్తకభాండాగారములు, దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు, పుస్తకములు ప్రబలియున్నవి.

మృగములకు కాలేజీలు లేవు. లైబ్రరీలు లేవు. ముద్రాణాలయాలు అవి నడపటంలేదు. వానికి వాక్సంపత్తి లేదు. అందుచేత అవేమైనా కష్టపడుతున్నవా అంటే అట్లా కనబడటంలేదు. మనకున్న వ్యాధులు వీనికి లేవు. ఆస్తిపాస్తులూ లేవు. తత్సంబంధమైన తపనా లేదు. ఈ రోజును గుర్చి విచారమూ, మరుసటి దినమును గూర్చి దిగులు లేవు. ఏదో ఒక విధంగా అవి ఆహారం సంపాదించుకొంటాయి. ఎక్కడో ఒక చోట పెరిగి బ్రతికి పోతాయి. ఆహారంకోసం ఒక దానిని ఒకటి చంపుకొన్నా జీవరాశులేమో అక్షీణంగానే వున్నాయి.

మనదేశంలోనే ఆటవిక జనాలకు, కాలేజీలు, లైబ్రరీలు, ప్రెస్సులూ లేవు. మనకంటే వారు మంచివారుగనూ, నెమ్మదిగనూ వున్నట్లూ తెలుస్తుంది. ఆఫ్రికా అడవులలోనూ, అమెరికాలోని రెడ్‌ ఇండియన్స్‌ అనే తెగలోనూ, నాగరికతా చిహ్నములు లేవు. కానీ వారిలో మనలో వున్నంత కుట్రలూ, దురాచారములూ, దౌర్జన్యము లేవు. చదువు వల్ల ఇవన్నీ వృద్ధి ఐనట్టే కనిపిస్తుంది. నాగరికతవల్ల అసంతృప్తి అమితంగా పెరిగిపోయింది. మనకున్న ఈ అసంఖ్యాకమైన గ్రంధాలూ, పత్రికలూ, విద్యా విధానమూ, పరిపూర్ణత, మనశ్శాంతీ యివ్వడానికి బదులు దుష్కార్యాలకు పురిగొల్పుతూ అశాంతి కారకంగానే వున్నాయి. భగవంతుడు మనకు ప్రత్యేకంగా ప్రసాదించిన ఈ వాక్కువలన ప్రయోజనమేమి? ఇది శాసనమనాలా, అనుగ్రహమనాలా?

మనం ఏ విధంగా మృగాలకంటే అధికులమని చెప్పుకోగలం? మృగాలు వాని స్వభావం (Instinct) కొద్దీ ప్రవర్తిస్తున్నవి. అందుచేత వానికి బుద్ధిపూర్వకంగా చేసే పాప సంచయంగానీ పాప ఫలంగానీ లేదు. మనిషి అట్లాకాదు. వానికి వివేకమున్నది. కానీ అతడు చేసే దుష్కార్యాలకు లెక్కలేదు. ఎడతెగని పాపకార్యాలుచేస్తూ, చిత్రగుప్తునికి ఒక్క నిముషమైనా వ్యవధిలేని కార్యభారం ఇస్తున్నాడు! అందుచేత మనం మన ఇంద్రియాల్ని భగవత్కైంకర్యంలోనే వినియోగించాలి.

నరజన్మ దుర్లభం. అది శ్రేష్ఠమైనది. ఎందువలన? మృగజాతికి ఒక పెద్ద కొరత వున్నది. మృగములకు పాపం లేకున్నా భయం వున్నది. ఏ మృగం ఏ మూలనుంచీ వచ్చి తనను చంపుతుందో అని అనుక్షణమూ దానికి ప్రాణభీతియే. మనిషికీ ఎన్నోభయములున్నవి కానీ, భయము లేకుండా చేసుకోవడానికి వలసిన సుళువులు అతడు చేసుకొనగలుగుతున్నాడు. నిర్భయంగా మనిషి ఉండాలంటే ఒక్క జ్ఞానమే మందు. అంతా మనమే అన్న అద్వైతజ్ఞానమే మనిషికి ఉదయిస్తే అతనికి 'మనం బ్రతికి వున్నా ఒక్కటే, పోయినా ఒక్కటే, అన్న భయరహిత మనోభావం ఏర్పడుతుంది. ఇట్టి జ్ఞానం కలగడానికి ఒక్క మనిషికే సాధ్యం. మృగాలకాభాగ్యంలేదు. మనిషికి ఈ భాగ్యం ఒక్క 'వాక్కు' వల్లనే కలిగింది. వేద వేదాంత ఇతిహాస పురాణ ధర్మ శాస్త్రములన్నీ ఈ వాక్కు మూలంగానే వచ్చినవి.

భగవంతుడు మనకు ఇచ్చిన ఈ శక్తిని మనం దురుపయోగం చేసుకోరాదు. ఇతరులకు హింస కలుగచేయక, దుఃఖనివృత్తికి, పాపమోచనకూ ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అప్పుడే మనజీవితం సార్ధకమౌతుంది. వాక్కును, దైవసంబంధమైన కార్యాల్లోనూ, పరహితార్థ ప్రయోజనకరములైన విషయములలోనూ వినియోగించాలి. అందుకే మన పెద్దలు శిశువుకు అక్షరాభ్యాసకాలంలోనే, 'నమఃశివాయ'అనే పంచాక్షరీ మంత్రం ప్రప్రధమంగా పలకపై వ్రాసి దిద్దమంటారు. బాలుని జీవితం లిఖితజపంతోనే ప్రారంభమౌతున్నది. అట్లు ప్రారంభ##మైన జీవితం క్రమంగా ఆత్మక్షేమానికి, లోక క్షేమానికీ ప్రయోజనపడుతుంది. లేకుంటే మనిషికీ మృగానికీ ఏ విధమైన వ్యత్యాసమూ లేదు.

3. మహాభారతము

ప్రాచీన కాలంలో 'బ్రాహ్మీ' అనే ఒక లిపి వుండేది. ఆ లిపియే ఇపుడున్న అన్ని భాషలకూ మూలమైన లిపి. ప్రాచీన శాసనములన్నీ ఈ బ్రాహ్మీ లిపిలోనే చెక్కబడినవి. ఈ లిపిలో చెక్కబడిన అక్షరములు బహుసుందరముగానూ, శాసనములోని భాష కావ్య ధోరణిని తలపించునట్లు గానూ వున్నది. తరువాత కాలపు శాసనములు - అనగా పల్లవ రాజుల కాలమునకు చెందిన శాసనములలోని విషయములూ వ్యాకరణ శుద్ధమైన భాషలో వ్రాయబడియున్నవి.

చోళ##దేశపు శాసనములూ చాలవఱకు చక్కగానే వున్నవనే చెప్పాలి. కానీ ప్రాచీన శాసనములతో వీనిని పోల్చి చూస్తే ఇవి కొంచెం తక్కువ రకం క్రిందికి వస్తాయి. ఇటీవల అనగా ఇన్నూరు మున్నూరు వర్షములక్రితం తయారు చేసిన శాసనము తప్పులతడికగా, వ్యాకరణ శుద్ధిగానీ, భాషా సౌష్ఠవము గానీ, అక్షరముల సొంపు గానీ లేక నాసి రకముగా నున్నవి.

ఇదే విధంగా పురాతన శిల్పమును, సమీపకాలపు శిల్పముతో పోల్చి చూస్తే హస్తిమశకాంతరభేదం కనిపిస్తుంది. ప్రాచీన పల్లవుల కాలపు శిల్పములు బహుసుందరములు, చోళుల శిల్పములు పల్లవుల శిల్పములంత అందముగా లేకున్ననూ చక్కగా వున్నాయనే చెప్పాలి. నవీన కాలపు శిల్పము మాట చెప్పతరముకాదు. ఒక అందమో, చందమో, సాన్నిధ్యమో ఏదీ ఆ శిల్పములలో మనం చూడలేము. ఆనాటి ప్రజల గుణములను ఆ నాటి శిల్పములు ప్రతిభాసింపగా ఈ కాలపు శిల్పములు ఈ నాటి వ్యవస్థను సూచించునట్లున్నవి. రెండువేల ఏండ్ల క్రితం మనదేశానికి వచ్చిన మెగస్తనీసు హిందువుల గుణ సంపత్తిని ఎంతో శ్లాఘ్యంగా వర్ణించాడు. ఆ కాలపు జనులలో అసత్య భాషణా, వంచనా లేదట. ఒకరిని చేయి జాచి ఎవరూ అడగరట. దొంగతనమనేది కలలో కూడా వారు ఎరుగరని ఆయన విస్తుపోయాడు.

ఇపుడు అదంతా మారిపోయింది. సత్య సంధత, క్రమవర్తన, సమాజములో ఒద్దిక - అనేవి విస్మృతి ప్రాయములై పోయాయి.

ఆ రోజుల్లో ఆలయాలలో భారత ప్రవచనం చేసేవారు. భారతం చదివేవారికోసం మాన్యాలు ఏర్పాటుచేసేవారు. ఈ కాలంలో భారత ప్రవచనము లెక్కడ చేస్తున్నారు? గ్రామాలలో ప్రవచనము చేస్తే ఈ కాలంలోనూ ప్రజలు వెళ్ళి ఆసక్తితో వింటారు. ఆ ప్రవచనాలు ప్రజల శీలమును ఎంతో ప్రభావితం చేస్తాయి. యుధిష్ఠరుని సత్యసందత, కర్ణుని దానశీలత, అర్జునుని గణ్యత, ప్రజలకు మార్గదర్శకంగా వుండేవి. అట్లే రామాయణం ఎత్తుకొంటే, మూర్తీభవించిన ధర్మ స్వరూపమైన రాముని శీలము, సీత పాతివ్రత్యం, రాముని విరోధియైన రావణుని భార్య మండోదరి పాతివ్రత్యం - ఇవన్నీ శ్రోతలకు గుణపాఠంగా వుండేవి. సనాతన ధర్మాన్ని పాటించడానికి ఆ కాలపు వారెంతో శ్రమ పడేవారు. అందుచేతనే వారు ధర్మశీలురుగను, సుజన పద్ధతిలో నిష్ఠ కలిగిన వారు గానూ వుండేవారు.

అయితే ప్రాచీన పద్ధతులను పూర్తిగా ఈ కాలంలో పాటించడం కష్టమే. అది ఈ కాల మహిమ. కాని చిత్తశుద్ధితో కొంతవఱకైనా మనకు ధర్మనిష్ఠ కలుగవలెనని సంకల్పిస్తే ఈశ్వరుని అనుగ్రహంచేత ఆ శుభేచ్ఛ తప్పక ఫలవంతమౌతుంది.

ఈ కాలంలో ఎన్నో పక్షాలు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క మార్గం. ప్రజలు కింకర్తవ్యతా మూఢులై వున్నట్లు కనబడుతూనేవున్నది. ప్రాచీనశాస్త్రములు బోధించే ఆత్మసంస్కార గుణములను బాహాటంగా చాటే ఏర్పాట్లు చేయడానికి మనం పూనుకోవాలి. ఎన్నడో ద్వాపరాంతంలో జరిగిన మహాభారతకథ నేటికి ఎట్లా అనువర్తిస్తుందని మనం అనుకోడానికి వీలులేదు. ఏ యుగంలోని వారైనాసరే, ఉత్తమ పురుషుల చర్య మనకిప్పుడూ మార్గ దర్శకంగానే వుంటుంది.

4. ప్రాచీన విజ్ఞానం

"'వేదాంతం, ప్రపంచమే మాయ అని అంటుంది. అందుచేత జీవనానికి వలసిన లోక విషయాలలో హిందువులకు శ్రద్ధలేదు. సైన్స్‌, టెక్నాలజీ, వైద్యం, ఇంజనీరింగ్‌ మొదలగునవన్నీ విదేశీయులు హిందువులకు ఇచ్చిన భిక్షయే'' - అని కొందరు తెల్లదొరలు చెప్పటంకద్దు. దీనిని నిజమని నమ్మేవారు - హిందూశాస్త్రములు ఏదో కంటికి తెలియని భగవంతుని గూర్చి, తెలుపుతున్నవే కాని ఐహిక జీవితానికి ఉపయోగకరములైన విషయాలను ఏవీ చెప్పటంలేదు అని ఖండనం చేయడమూ కద్దు.

వాస్తవంలో మన శాస్త్రములలో లేని సైన్సు ఏదీలేదు. పురాతన శాస్త్రమును మనం పరిశోధించామంటే ఈ విషయం అవగతమౌతుంది. చరకుడు, సుశ్రుతుడు, వ్రాసిన ఆయుర్వేద గ్రంధములను అవలోకనం చేశామంటే, ఈ కాలపు డాక్టర్లు నివ్వెరపడేలాంటి వైద్యవిధానాలనూ వారు ఆ కాలంలో అవలంబించే వారని తెలుస్తుంది. మిక్కిలి పురాతనమైన అధర్వణ వేదంలో, యుద్ధంలో తగిలే పలు విధములైన గాయములకు చేసే చికిత్సకు వలసిన మూలికల గూర్చి విరివిగా వ్రాసి వున్నదని ఇటీవల కాలంలో కాశీలోని ఒకరు పరిశోధించి కనుక్కొన్నారు. అదే విధంగా ఇంజనీరింగ్‌ టెక్నాలజీలాంటి విషయాలలోనూ మనవాళ్ళు అపారమైన కౌశలం చూపివున్నారు. భోజరాజు వ్రాసిన సమరాంగణ సూత్రములలో విమాన యానం గూర్చిన విషయాలూ వ్రాయబడి యున్నవి.

ఢిల్లీలో కుతుబ్‌ మీనారుకు సమీపంలో ఒక ఇనుప స్తంభమున్నది. ఈనాటికీ అది తుప్పు పట్టక వున్నది. ఈ కాలంలో పెద్దపెద్ద ఇనుప ఖార్కానాలున్నాయి కానీ, ఆ రోజుల్లో అంత పెద్ద స్తంభాన్ని ఎలా నిర్మించగలిగారనేది నేటికీ ఆశ్చర్యకరంగానే వుంది. తమిళ##దేశంలో ఇలాంటి ఇంజనీరింగ్‌ అద్భుతాలు ఎన్నో వున్నాయి. పెద్ద బరువుగల రాతి బండలను ఆలయనిర్మాణసమయంలో వారు ఎలా లేవనెత్తారనేది ఇప్పటికి తెలియకుండానే వుంది. తమిళ##దేశంలో వ్రాయబడిన 'సిద్దర్‌ గళ్‌ వాడర్‌' అనే పుస్తకంలో ఎన్నో వైద్యరహస్యములున్నది. ఈరోజు అమావాస్య, ఆరోజు గ్రహణమని, పంచాంగ గణనంలో మనవారి ఖగోళశాస్త్ర విజ్ఞానం ఎంతో మెచ్చుకోదగినది.

అన్ని విధములైన కళలూ, శాస్త్రములూ, సైన్సులూ భారతదేశంలో చక్కగానే వర్ధిల్లుతూ వచ్చినవి. ఈ కాలపు సైన్టిస్టులు విజ్ఞాన సహాయంతో ఆటంబాంబులు లాంటివి చేసి అనర్థం కలిగించేది చూస్తున్నాము. ఇట్టి అనర్థాలు ఏర్పడుతవనే మనదేశంలో విజ్ఞానం పక్వమున్న వారికే బోధించేవారు. ఈ శాస్త్రాలు సాధారణ జనులకు అర్థంకాని పరిభాషలో వ్రాయబడినవి. తమిళ భాషలో సిద్ధుల పాటలలోనూ ఇలాంటి పరిభాషయు వాడబడినది. ఇవి మనకు అర్థంకాలేదని వానిని త్రోసివేయరాదు. వానిని బహుశా మన తరువాతి తరం అర్థంచేసుకోవచ్చును. అందుచేత ప్రాచీన శాస్త్ర రక్షణ మనకు అర్థమైనా, అర్థంకపోయినా అనివార్యమౌతుంది.

ఇతర దేశాలలో విజ్ఞానం ఎక్కువైనదేకానీ, ఆత్మశాంతి మాత్రం వారికి సమూలంగా లోపించినది. ఇది వారికి ప్రస్తుతం చక్కగా అర్థమౌతున్నది. విజ్ఞానం మూలంగా నాగరికత పెరిగి ఇప్పుడు వారు అత్యున్నతమైన స్థితిలో వున్నా, ఆత్మతృప్తి లేకుండా వుండటంవల్ల, భారతదేశంలోని ఆధ్యాత్మిక వాఙ్మయం అన్వేషిస్తూ మనదేశం వస్తున్నారు. మనమో! లౌకిక విద్మలూ, ఆధ్యాత్మిక సంపత్తి అన్నిటినీ వదలుకొని, రెంటికీ చెడ్డ రేవడల మౌతున్నాం. ఈ విషయం గుర్తించి తగు శ్రద్ధ తీసుకొంటేనే మన ఆధ్యాత్మిక శాస్త్రములు మనకూ మన తరువాతి తరాల వారికీ మిగులుతాయి.

పుర్వకాలంలో శాస్త్ర రక్షణ విషయంలో రాజులు జాగ్రత్త పడేవారు. ఈ కాలంలో రాజులు లేరు. కేంద్ర ప్రభుత్వ మున్నది. ఆ ప్రభుత్వమునకు ఎన్నో తొందరలు. ఒకవంక భాషావివాదం. మరొకవంక ఎల్లల రక్షణ. ఇవికాక రాజకీయాలలో స్పర్థలు. అందుచేత ప్రభుత్వం నుండి ఈ విషయంలో సహాయం ఎదురుచూస్తే ప్రయోజనం లేదు. మనకు ఎన్ని చిక్కులున్నా అందరూ ఏకాభిప్రాయంతో శాస్త్రరక్షణకు పూనుకోవడం మనకర్తవ్యం.

Sanathana Dharmamu    Chapters    Last Page