Prathyaksha Daivamu    Chapters    Last Page

పరిచయము

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం |

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ||

''శంకరశ్శంకర స్సాక్షాత్‌'' - ఆది శంకరులు సాక్షాత్తు శివావతారము. కావుననే

అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్ర విత్‌ |

షోడశే కృతవాన్‌ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగా త్‌ ||

అన్నట్లుగా 8 సం||ల ప్రాయముననే చతుర్వేదములను, 12 సం||లకు సర్వ శాస్త్రములను క్షుణ్ణముగా నేర్చినవారై 16 వ ఏట ప్రస్థాన త్రయమునకు భాష్యము వ్రాసి దేశాటనం చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి బోధించి, 32 వ ఏట సిద్ధి నందారు. ఒకపరి వారి జీవితము నాలోకించిన - ఆధ్యాత్మిక మార్గానుయాయులకు దర్శకుడుగా, మహామేధాసంపన్న తత్త్వ బోధకుడుగా, ఉపనిషద్విజ్ఞాన భాస్కరుడుగా, సర్వ మానవ సంక్షేమ కార్యకర్తగా, దివ్య జీవన స్రవంతిగా, నేతగా, నాయకుడుగా, గురువులకు గురువుగా, జగద్గురువుగా మన యెదుట నా స్వామి దర్శనమిచ్చును. ఒప్పుడొక సందేహము కలుగవచ్చును. ఇట్టి మహనీయు డీ భూమిపై నడయాడుట సాధ్యమా ? ఈ సందేహము తీరుట కొక మార్గము కలదు.

కంచి కామకోటి పీఠాధిపతులైన పూజ్య పాదులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామిని దర్శించిన తీరును, వా రాదిశంకరమూర్తులే. మానవ రూపమున నడయాడుచున్న ప్రత్యక్ష దైవమే వారు. సర్వ రక్షకమైన వారి తేజోవాహిని ప్రపంచ పరివ్యాప్తము. వారి కృపావీక్షణ మాబాలగోపాల తారకము. కడ వానిపై కనకధార. డెబ్బది సంవత్సరాలు పైగా శ్రీ స్వామివారు ఆదిశంకరుల ఆదేశ సంకల్ప నిర్వహణమున, సర్వమానవ 'శం' కరత్వమున శంకరులుగా పూజనీయులై భక్తకోటి ననుగ్రహించుచున్నారు.

మానవ కల్యాణకరముగా భారతీయ పునరుజ్జీవనశక్తి సుస్థిరమై మహోజ్జృంభణము నందుటకు - నిర్విరామముగా విగతశ్రమముగా యావజ్జీవకృషి. కెవ్వరైన సంకితులై రన్నచో నది యపారమైన శ్రీ శంకర కృపా ఫలమే యనక తప్పదు.

మానుషత్వము, ముముక్షుత్వము, మహా పురుష సంశ్రయము-అను నీ మూడును దుర్లభములగుటయే కాక దైవానుగ్రహ హేతుకములని ఆదిశంకర భగవత్పాదులవారు నుడివి యున్నారు. అట్టిశ్రీ శంకరుల కామ్రేడితమూర్తి యైన శ్రీ స్వామిపాదుల సంశ్రయము లభించుట 'ప్రత్యక్ష దైవము'యొక్క కృపాకటాక్ష వీక్షణ ప్రభావమేకాని మఱి యొండుకానేరదు. ఇట్టిది పురాకృత సుకృతమని పెద్దల తలంపు. ధన్యోస్మి.

Prathyaksha Daivamu    Chapters    Last Page