Neetikathamala-1    Chapters    Last Page

13

దైవస్తుతి

ప్రాతర్భజామి లలితా భుజ కల్పవల్లీం

రత్నాంగులీయ లసదంగులి పల్లవాఢ్యామ్‌,

మాణిక్య హేమ వలయాంగద శోభమానాం

పుండ్రేక్షుచాప కుసుమేషు సృణీన్‌ దధానామ్‌.

... ... ...

దాశరథి

విన్నప మాలకించు రఘువీర! నహి ప్రతి లోకమందు నా

కన్న దురాత్ముcడుం బరమ కారుణికోత్తమ! వేల్పులందు నీ

కన్న మహాత్ముcడుం బతిత కల్మషదూరుcడు లేcడు; నాకు వి

ద్వన్నుత నేవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ!

దయాసముద్రుడవగు ఓ రామా! నామనవి వినుము. ఏ లోకమందును నాకన్న దురాత్ముడు, దేవతలందు నీకన్న కారుణ్య శ్రేష్ఠుడగు మహాత్ముడు, పాపుల పాపములను దూరముచేయు వాడు మరొకడు లేడు. పండితులచే పొగడబడు శ్రీరామా! నీవే నాకు దిక్కు.

* * *

నహుషుడు

నహుషుడు పురువంశోద్భవ నరపాలుడైన ఆయువు యొక్క కుమారుడు. మహా శక్తిమంతుడు. పాండవులకు ఎన్నో తరముల ముందువాడు. అకుంఠిత దీక్షాయుతుడై అనేక యజ్ఞములు చేసిన తర్వాత తపస్సచేసి రాజర్షిగా పేరుపొందాడు. అతడు యజ్ఞములు చేసిన తర్వాత తపస్సుచేసి రాజర్షిగా పేరుపొందాడు. అతడు చేసిన సహస్రయజ్ఞ పుణ్య ఫలానికి అతనికి ఇంద్రపదవి లభించింది. ఇంద్రలోకంలోని సమస్త సుఖాల అనుభవించసాగాడు. మహర్షిసత్తముల ఆశీర్వచన బలంవలన దృక్ప్రసార మాత్రంచేత ఏ ప్రాణియొక్క శక్తినైనా హరించే శక్తి అతనికి సిద్ధించిది. ఆశక్తితో అతనిముందు ఎవరూ నిలువలేక పోయినారు. అతనిని కాదనేశక్తి అసలే లేదు. ఈ దివ్య బలగర్వంతో అతనిలో అహంకారం, గర్వాంధత ఏర్పడింది. దివ్య విమానారూఢుడై విహరిస్తూ దురహంకారంతో సర్వమూ మరచి ఎవరినీ లక్ష్యంచేయకుండా భోగలాలసుడై సంచరించేవాడు. అతనికి దేవ, గంధర్వ, యక్ష, రాక్షస, నాగజాతులతోపాటు బ్రహ్మర్షులూ, త్రిలోకవాసులూ సుంకం చెల్లిస్తూండేవారు. సాలెగూటిలో చిక్కిన కీటకంవలె విలాసభోగోన్మత్తుడైనవాడు నశిస్తాడు. విలాసమయ జీవితంలో ఇంద్రుని భార్యయైన శచీదేవియందు నహుషుడికి కామభావన కల్గింది. ఆమె మహా పతివ్రత. నహుషుని చెడు తలంపునకు ఆమె దుఃఖించింది. అతని పతనవేగాన్ని తీవ్రతరంచేసేందుకై ఆమె, బ్రహ్మర్షులు తమ భుజస్కంధాలపై మోసే పల్లకిమీద ఎక్కి రమ్మని నహుషుని కోరింది. ఐశ్వర్యమదోన్మత్తాహంకారాలు అతనిని అజ్ఞానుణ్ణి చేసి అధఃపతితుని చేశాయి. సంతోషంతో ఆ ఆహ్వానాన్ని అంగీకరించి బ్రహ్మర్షి సంఘానికి వార్త పంపాడు. ఇంద్రాజ్ఞానుసారం వారు శిబికను మోయుటకు సిద్ధపడ్డారు. ఆ వచ్చినవారిలో అగస్త్యమహర్షి ఒకరు. ఆయన దివ్య తపస్సంపన్నుడు, బ్రహ్మతేజోమయుడు, ప్రాతఃస్మరణీయుడు. 'కామాతురాణాం న భయం నలజ్జా' అన్నట్లు నహుషుడు నిర్భయంగా నిస్సంకోచంగా పల్లకీ అధిరోహించాడు. పల్లకీ కదులుతోంది. నహుషుని ఆతురత ఎక్కువెంది. అసహనంతో కన్ను మిన్ను గానక 'సర్ప సర్ప' (నడు-నడు) అని మహర్షులను ఆదేశించాడు. వెంటనే దివ్య తపస్సంపన్నుడైన అగస్తునికి ఆగ్రహం కల్గింది. కోపంతో 'సర్పో భవ' (నీవు పామువు కమ్ము) అని శపించాడు. మరుక్షణంలో స్వర్గాధిపత్య చిహ్నాలన్నీ జారిపోయాయి. నహుషుడు సర్పరూపంతో పడిపోతూ దీనంగా ''మహర్షీ ! నా అపరాధాన్ని మన్నించి కరుణతో శాప విమోచనం అనుగ్రహించండి'' అని ప్రార్థించాడు. అరనిముసంలో అపార జలరాశిని నిశ్శేషం చేసిన ఆకరుణా సముద్రుడు పాండవాగ్రజుడైన ధర్మరాజువల్ల శాపవిమోచనం అనుగ్రహించాడు.

ఐశ్వర్య మదోన్మత్తాహంకారాలు మానవుని అజ్ఞానుని చేసి అధఃపతితుని చేస్తాయి. అందువల్లనే మానవులు సంతతము దేవదేవుని శరణువేడాలి.

ప్రశ్నలు

1. నహుషునికి ఎవరిపై కామభావన కలిగెను?

2. అగస్త్యుడు నహుషుని ఏమని శపించెను?

3. మానవుని పతనమునకు హేతువు లేవి?

Neetikathamala-1    Chapters    Last Page