Neetikathamala-1    Chapters    Last Page

1

దైవస్తుతి

శ్రీ మత్పయోనిధి నికేతన! చక్రపాణ!

భోగీన్థ్రభోగమణి రాజిత! పుణ్యమూర్తే!

యోగీశ!శాశ్వత! శరణ్య ! భావాబ్థి పోత!

లక్ష్మి నృసింహ! మమ దేహి! కరావలంబమ్‌.

లక్ష్మినృసింహస్తోత్రం .

-----------

ధాశరథీ!

జనవర మీ కథాళి విన సైపక కర్ణములందు ఘంటికా

నినద వినోదముల్‌ సలుపు నీచునకున్‌ వరమిచ్చినావు ని

న్ననయము నమ్మి కొల్చిన మహాత్ముల కేమి యొసంగెదో సనం

దననుత! మా కొసంగు మయ దాశరథీ ! కరుణాపయోనిధీ!

దయాసముద్రుడవైన ఓరామా ! మీ కథలు వినజాలక గంటల శబ్థముతో చెవులకు ప్రమోదము చేసిన నీచునకు వరమిచ్చినావు. నిత్యము నిన్ను సేవించు మాహానుభావుల కేమి ఇచ్చెదవో మాకును అదే అనుగ్రహించుమా! సనక సనందనాది ఋషులచే

సేవింపబడు శ్రీరామా!

- - -

యయాతి

యయాతి నహుషరాజ నందనుడు. మహేంద్రునివలె ధర్మ మార్గంలో అనేక వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అనేక దానధర్మాలు, యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యశీలి యయాతి. తన కుమారుడు పూరునికి రాజ్యం అప్పగించి వేయి సంవత్సరాలు ఘోర తపస్సు చేసి సర్వలోకాలలో తన కీర్తిని ప్రతిష్ఠించి స్వర్గం చేరాడు. అతనికి అక్కడ దేవ, వసు, సాధ్య, మరుద్గణాలు స్వాగతం చెప్పాయి. యయాతి సంపాదించిన పుణ్యం అంత విశేషమైనది! అతడు దేవ బ్రహ్మలోకాలలో యథేచ్ఛగా విహరిస్తుండేవాడు. అప్సరో భామినులతో నందన వనంలో లక్షల సంవత్సరాలు ఆనందాన్ని అనుభవించాడు. దుర్లభ##మైన బ్రహ్మలోకంలో అతనికి అడ్టే లేదు. అతనిలో క్రమక్రమంగా తనంతటి పుణ్యశీలి, తపస్సంపన్నుడూ మరొకడు ఎక్కడా లేడనే అహంభావం అంకురించి విస్తరించింది. అంతటి తపస్సంపన్నులైన ఋషిపుంగవుల మధ్య ఆసీనుడై దేవతా ప్రముఖులను, మానవోత్తములను, మహర్షులను ఆవహేళన చేయడం అతనికి పరిపాటైంది. అతనితో వుండే రాజర్షులకు అతనియెడ నిరాదర భావ మేర్పడింది.

ఒకనాడు యయాతి దేవేంద్ర భవనానికి విచ్చేశాడు. దేవగణం అతనికి స్వాగతం పల్కింది. దేవేంద్రుడు అతనిని ఆదరించి గౌరవించాడు. దేవేంద్రుడు "రాజా! రాజ్య సర్వస్వం విడిచి నీవు సాగించిన తపోదీక్ష ఎవరి తపస్సుతో ఉపమింపతగ్గదో చెప్పవలసిన" దని అడిగాడు. వెంటనే యయాతి అహంకారభావంతో దేవ, గంధర్వ, మానవ, మహర్షు లెవ్వరి తపస్తూ తన తపస్సూతో సరితూగదని సమాధాన మిచ్చాడు. వెంటనే ఇంద్రుడు నీ అహంకారం పెచ్చు పెరిగి సర్వులయెడ తిరస్కార దృష్టి ప్రబలిన కారణంగా నీకు పుణ్యక్షయమైనది. స్వర్గం నుండి పతితుడ వగుమని శపించాడు. తన తప్పిదాన్ని గుర్తించిన యయాతి, తాను భూలోకంలో సాధుజనుల మధ్య పడాలని కోరుకున్నాడు. తిరస్కార దృష్టి కూడదని చెప్పి ఇంద్రుడు అతని కోరికను మన్నించాడు.

ఇంధ్ర సమ తేజస్సుతో ఆకాశంలో వెలిగే సూర్యకాంతిని తిరస్కరించే ప్రకాశంతో క్షీణపుణ్యుడై పడిపోతున్న యయాతిని నై మిశారణ్యంలోని ఒక రాజర్షి బృందం చూచింది. వారు అక్కడ వాజపేయ యజ్ఞంలో మహావిష్ణువుని సంతుష్టుని చేస్తున్నారు. క్రింద పడుతూన్న యయాతి నాసికాపుటాలకు ఆ యజ్ఞధూపం మందానిలంవలె ఆనందాన్ని కల్గించింది.

వారిలో అష్టకుడనే రాజర్షి శ్రేష్ఠుడు పడుతూన్న యయాతిని చూచి ''మహాత్మా! అగ్ని సదృశ రూపులైన మీరు ఎందుకు ఇలా పడిపోతున్నారు?'' అని ప్రశ్నించాడు. యయాతి తన కథనంతా చెప్పాడు. అప్పడు అష్టకుడు ఆ మహాపురుషు నడిగి తన సంశయాలు నివృత్తి చేసుకున్నాడు. తపో యజ్ఞములవల్ల తనకు ఏర్పడిన పుణ్యలోకాలను గ్రహించి, తిరిగి స్వర్గం చేరమని యయాతిని కోరాడు. దాన ధర్మాలు చేయడమేగాని ప్రతి గ్రహించడం క్షత్రియ ధర్మం కాదని, అందువల్ల అష్టకుని పుణ్యఫలాన్ని గ్రహించి ధర్మాన్నతిక్రమించలే నన్నాడు యయాతి. అట్లే ప్రతర్దనుడు, వసుమనుడు, శిబి మొదలగు రాజర్షులు తమపుణ్య ఫలాలను యయాతికి సమర్పింపగా అతడు నిరాకరించాడు. ఆ సమయింలోనే మహా తపస్సంపన్నురాలైన మాధవి అచ్చటకు వచ్చింది. ఆమె రాజర్షుల తల్లి-యయాతి కుమారై. విషయాన్నంతా ఆమె విని యయాతితో ''తండ్రి! పుత్రులూ పౌత్రులవలెనే, పుత్రికలు దౌహిత్రుల కర్మఫలాన్ని పొందుట న్యాయము, ధర్మసమ్మతమని చెప్పి ఆ పుణ్యఫలంతో తిరిగి స్వర్గధామం చేరవలసినదిగా ప్రార్థించింది. ఆమె కూడ తన పుణ్యంలో సగ భాగ మిచ్చినది. యయాతి అందుల కంగీకరించి నాటినుండి పితృ కర్మాదులలో దౌహిత్రులకు పూర్ణాధికారం వుంటుందని, దౌహిత్రు లాచరించే పితృకర్మలన్నీ పవిత్రములే అవుతాయని నిర్ణయించాడు. ఆ రాజర్షి బృందం అప్పుడు చేస్తున్న యాగానికి అవభృథ స్నానం చేసి యయాతికి తమ పుణ్యాన్ని సమర్పించారు. అచ్చటకు చేరిన గాలవ మహర్షికూడ తన తపఃఫలాన్ని యయాతి కిచ్చాడు. యయాతి స్వర్గం తిరిగి చేరుకొని శాశ్వతస్థానాన్ని పొందాడు. కాన అహంకారము, గర్వము పతన హేతువులనీ, సాధుజన సాంగత్యము సర్వఫల ప్రదాయకమని గ్రహించాలి.

ప్రశ్నలు

1. యయాతి ఎవరు?

2. యయాతి స్వర్గమునుండి పతితు డగుటకు కారణమేమి?

3. యయాతి స్వర్గమున శాశ్వతస్థానము నెట్లు పొందెను?

Neetikathamala-1    Chapters    Last Page