Neetikathamala-1    Chapters    Last Page

20

దైవస్తుతి

వామాంకస్థిత జానకీ పరిలసత్‌ కోదండదండం కరే

చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం, శరం దక్షిణ,

బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం

కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భ##జే.

--- ---

భర్తృహరి

వనజభవుండు నెన్నొసట వ్రాసినసొమ్ము ఘనంబొ కొంచెమో

విను మరుభూమి కేగిన లభించును మేరువుC జేరCబోయినన్‌

ధన మధికంబు రాదు; కడు దైన్యము మాను ధనాఢ్యులందు;

వ్వననిధి నూతC దుల్యముగ వారి గ్రహించు ఘటంబు సూడుమా!

బ్రహ్మదేవుడు నొసటవ్రాసిన ధనము కొద్దియో గొప్పయో మరుస్థలమం దున్నను తప్పక లభించును. మేరువును సమీపించినను అంత కంటె ఎక్కువ పొందడు; కాన ధనవంతులను జూచి దీనత్వము పొందకుము. కుండను బావి యందు ముంచినను, సముద్రమున ముంచినను అది పరమితమైన జలమునుమాత్రమే గైకొనునుగదా!

* * *

ఆంజనేయుడు

ఆంజనేయుడు వహాబలవంతుడు. ఉదయాద్రిపై ఒక కాలు, అస్తాద్రిపై మరొక కాలు ఉంచిన మహాకాయుడు. సూర్యభగవానుని ప్రియశిష్యుడైన నవవ్యాకరణవేత్త; రామాయణ మహామాలా రత్నము. రావణ సంహారానంతరము తన ప్రభువగు శ్రీరాముని వెంట ఆంజనేయుడు కూడ అయోధ్యకు వచ్చాడు. నిరంతర రామనామ జప పరాయణుడై శ్రీ సీతారాములను తన హృదయమందు ప్రతిష్ఠించుకున్నాడు. లక్ష్మణ, భరత, శతఘ్నులకు కౌసల్యాది రాజమాతలకు, వసిష్ఠవామదేవాది మహర్షులకు, సుగ్రీవ అంగదాది వానర వీరులకు, అయోధ్యాపౌరులకు రామభక్తులకు కనుల పండువుగా శ్రీరాముడు సీతాసమేతుడై పట్టాభిషిక్తుడై నాడు. అది మహాపర్వ దినం అందరకూ ఆనందసమయం. నాడు అయోధ్య వెకుంఠముగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా కౌసల్యాది రాజమాతలు, వసిష్ఠాది మహర్షులు, అయోధ్య పౌరులు కలలు గంటున్న దా రోజుకొరకే. అందరూ శ్రీసీతారామ పట్టాభిషేకం కనుల పండవుగా దర్శించి తమ జన్మధన్యమైన దని భావించారు. ఆ శుభసమయాన మహా సంగ్రామంలో తనకొరకై ప్రాణా లొడ్డి పోరాడిన వీరులందరినీ శ్రీరాముడు సత్కరించా లనుకున్నాడు. వెంటనే ప్రభుచిత్తమును గ్రహించిన సుమంత్రుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, సుధేష్ణుడు మొదలుగాగల కపివీరులందరు తగు రీతి రత్న మాణిక్య మాణిమయాది హారాలతో సంతోషించురీతిగా సత్కరింపబడ్డారు. శ్రీరామచంద్రప్రభవు ఆ సంతోషసమయంలో తమను జ్ఞాపక ముంచుకుని సత్కరించుట తమ పూర్వపుణ్యఫలమని సంతోషించారు. నాటి సభ ముగిసింది. శ్రీ సీతారాములు ఏకాంతమందిరం చేరారు.

సీతాదేవి శ్రీరాముని చేరి ''స్వామీ ! ఎంత పొరపాటు జరిగిందో చూడండి. ఈ నాడు సభలో కపివీరులందరూ సన్మానింపబడ్డారు. రావణసంహారంలో కీలకపాత్ర వహించిన వాడు ఆంజనేయుడు. శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని లఘించినవాడు పవనసుతుడు. సంజీవనీ పర్వతం తెచ్చి లక్ష్మణుని బ్రతికించినది మారుతియే. మహా సంగ్రామంలో రామలక్ష్మణులకు వాహనమైనవాడూ అంజనీసుతుడే. మైరావణుని హతమార్చి నదీ కపివీరుడే గదా! అట్టి ఆంజనేయుని సన్మానించలేదు. అతడు మనపాదాలచెంత నున్నప్పటికీ అతనిని విస్మరించితిమి గదా'' అని చాలనొచ్చుకుంది. అంత శ్రీరాముడు చిరునవ్వుతో ''ప్రేయసీ ! ఆంజనేయుని నేనెట్లు మరువగలను? అతడు నా బహిఃప్రాణము నాప్రియభక్తుడు. అతని నెట్లు సన్మానించాలో నిర్ణయించలేక మౌనం వహించాను. నీ వాతనిని సత్కరిస్తే నేనేఎక్కువగా ఆనందిస్తాను'' అని అన్నాడు. వెంటనే సీతాదేవి ప్రతీ హారిని పిలిచి ఆంజనేయునికి వర్తమానం పంపింది. ఆనందరూపుడైన ఆంజనేయడు నాయువేగంతో వచ్చి నమస్కరించి ఎదుట నిలబడ్డాడు. శ్రీరాముడు జగన్మోహనాకారుడై చిరునవ్వులు చిందిస్తూండగా ఆ జగన్మాత ''హనుమా! నా దుఃఖ నివారణంలో అగ్రతాంబూలం నీకన్నా మరెవ్వరికి గలదయ్యా! ఈశుభసమయంలో నాకు ప్రియమైన ఈ ముత్యాల హారం స్వీకరించి ధరించవయ్యా'' అంటూ ప్రేమతో తన మెడలోని ముత్యాల హారాన్ని ఇచ్చింది. ''మహాప్రసాదం'' అంటూ స్వీకరించి కళ్ళకు అద్దుకుని ఆనందంతో నిష్క్రమించాడు పవననందనుడు. తృప్తిగా నాథునివంక చూచింది సీతామహాసాధ్వి. శ్రీరాముని ముఖంపై చిరునవ్వు తాండవిస్తూనే ఉంది.

ఆంజనేయుడు ఆముత్యాలహారంతో గంతులువేస్తూ రామనామాన్ని ఉచ్చరిస్తూ అయోధ్యా నగరం దాటి వెళ్ళాడు. ఒక రమణీయ ఉద్యానవనం చేరి ఎత్తయిన రాతిపై కూర్చున్నాడు. సీతాదేవి ఇచ్చిన ముత్యాలహారాన్ని త్రెంచాడు. ఒక్కొక్క ముత్యం తీసి పరిశీలనగా చూచేవాడు. తర్వాత దానిని చెవివద్ద పెట్టుకుని వినేవాడు. పిదప దానిని నోటిలో వేసుకుని రుచిచూచేవాడు. అనంతరం దానిని పగులగొట్టి ఆ ముక్కలను పరిశీలించి చూచి అవతల పారేసేవాడు. ఈ విధంగానే అన్ని ముత్యాలను పరిశీలించిచూచాడు. అటు వెళ్ళేవా రందరు హనుమంతుని చేష్టలను గమనించారు. రామప్రభువు దీనిని ఎంత ఆదరించినా దీని జాతి లక్షణం ఎక్కడకు పోతుంది అని నవ్వుకున్నారు.

ఈ వార్త అంతఃపురం చేరింది. సీతాదేవి ఆంజనేయునిది అకృత్యంగా భావించి బాధపడింది. మైథిలి అది తనకు జరిగిన పరాభవంగా భావించింది. అది సహించలేక తక్షణం తన సముఖమునకు రావలసినదిగా ఆంజనేయునికి వర్తమానం పంపింది. జానకీదేవి ఆజ్ఞప్రకారం పవనాత్మజుడు వాయువేగంతో వచ్చాడు. తల్లి ఆగ్రహంతో ఉండుట గమనించి వినమ్రుడై దోసిలియొగ్గి ''అమ్మా! ఏమి ఆజ్ఞ'' అన్నాడు. సీతాదేవి కఠినంగా ''హనుమా! నేను బహూకరించిన హారాన్ని నీవు ధరించకుండా నాశనం చేసి నన్ను అవమానించావు. నీ జాతి లక్షణ మెక్కడికిపోతుంది? ఈ అకృత్యాన్ని నేను సహించను'' అని పలికింది. కపివీరుడైన అంజనీ పుత్రుడు, ''తల్లీ ఆగ్రహించకండి. మీరు ప్రేమతో ఇచ్చినహారం స్వీకరించాను. అందలి ప్రతి ముత్యాన్ని పరిశీలించాను. అందు నా ప్రభువు దర్శనంకాలేదు. చెవి వద్దనుంచుకుని విన్నాను. నాప్రియాతి ప్రియమైన రామనామం వినబడలేదు. నోట వేసికుని రుచి చూచాను. మధురాతిమధురమైన రామనామం రుచి అసలే లేదు. ఏ ముత్యం పగులగొట్టి చూచినా నారాముని రూపమే కనపడలేదు. ఇంక అవి నా కెందుకమ్మా? శబ్ధ రూపరస గంధాదులలో నా రాముని గాని రామనామము గాని ప్రతిబింబించని వస్తువు ఇతరులకు ఎంత విలువైనది అయినా, నాకు తృణప్రాయమే నమ్మా! అందువలననే ఆ ముత్యాలను ధ్వంసం చేశాను. అంతేగాని నా తల్లిని అగౌరవము చేయు తలంపు ఏ మాత్రము లేదు'' అని చేతులెత్తి నమస్కరించాడు. శ్రీరాముని చిరునగవులోని ఆంతర్యము అప్పుడు సీతామాతకు అర్థమైనది. ఆంజనేయుని రామభక్తికి అమె ఆనందపడింది. ప్రేమతో చేయెత్తి ఆంజనేయుని ఆశీర్వదించింది.

భుజబలంతో బుద్ధబలాన్ని, భక్తిని మేళవించిన ఆంజనేయుడే మనకు సదా లక్ష్యం-

ప్రశ్నలు

1. ఆంజనేయుని మహత్వ మెట్టిది?

2. సీతాదేవి ఆంజనేయుని కేమి బహూకరించెను?

3. ఆంజనేయుని రామ భక్తి ఎట్టిది?

Neetikathamala-1    Chapters    Last Page