Neetikathamala-1    Chapters    Last Page

22

దైవస్తుతి

సమస్త లోక శంకరం నిరస్తదైత్య కుంజరం

దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరమ్‌,

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్‌.

--- ---

దాశరథీ

భండనభీముcడా ర్తజన బాంధవుc డుజ్జ్వల బాణతూణ కో

దండ కళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూ ర్తికిన్‌

రెండవ సాటిదైవమిcక లేcడనుచున్‌ గడగట్టి భేరికా

డాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే

దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

కరుణా సముద్రుడవైన ఓ రామా! యుద్ధమునందు భీముడవు. ఆపదలందున్న వారికి బంధుడవు. గొప్పదైన ధనుర్విద్యా కళయందు ప్రవీణుడైన శ్రీరామచంద్రునికి సాటిరాగల మరొక దైవము లేడని విజయ స్తంభము నాటి, మద గజము నెక్కి దిక్కులు పిక్కటిల్లు నట్లుగా భేరి మ్రోగించి చాటెదను.

* * *

పరుశురాముడు

పరశురాముడు విష్ణుమూర్తి అంశతో జన్మించి, తల్లి దుఃఖమును బాపుటకై ధర్మ పరశువును చేబూని ఇరువదియొక్క మారులు మదోన్మత్తులైన రాజులను సంహరించిన ధర్మ ప్రతిష్ఠాపకుడు. ''ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం'' అన్నట్లు బ్రహ్మక్షత్రియ తేజో విరాజితుడు పరశురాముడు.

అది జమదగ్ని మహర్షి అశ్రమం. భార్యా పుత్త్రులతో జమదగ్ని మునీంద్రుడు కాననములో నివిసించుచున్నాడు. ఒకనాడు హైహయవంశములో ప్రసిద్ధుడైన అర్జునుడనే రాజు దైవ యోగంవల్ల ఆ అడవికి వేటకై వచ్చాడు. అర్జున మహారాజు దత్తాత్రేయుని ఆరాధించి, ఆయన వలన వరములను బొంది శత్రుజన భీకరుడై సకల లోకముల యందును ఎదురులేకుండా సూర్యునివలె ప్రకాశిస్తున్నాడు. దిగ్విజయార్థమై వచ్చిన రావణుని బంధించి అవమానించిన ఉదగ్రతేజుడు అర్జునుడు. ఆతని రాజధాని మాహిష్మతీ పురం .

వేటకై వచ్చిన అర్జునునికి జమదగ్ని మహర్షి ప్రేమతో స్వాగతము పలికినాడు. హోమధేనువును రప్పించి, మహారాజును తదనుచరులను ఇష్ట మృష్టాన్నముల నిడి సంతృప్తులను చేసినాడు. వినాశ కాలములో విపరీత బుద్ధపుట్టు నన్నట్లుగా హైహయరాజు ''ఈ సంపదలూ యివన్నియు ఈ ముని కెందులకు? ఈ ఆవును పట్టి తెండని '' భటులను పంపినాడు. దర్పాహంకారులైన భటులు ఒక్కసారిగా విజృంభించి ఆశ్రమముపై విచురుకుపడి హోమధేనువును గైకొని పోయారు.

పరుశురాముడు ఆశ్రమమునకు తిరిగివచ్చి జరిగిన వృత్తాంతం విన్నాడు. తండ్రి వద్దన్నను, అక్రమముగా ఆశ్రమాన్ని ఆక్రమించుకొని హోమధేనువును అపహరించుకొని పోయిన అర్జునుని దురహంకారానికి ఆయన ఒడలు మండిపోయినది. ప్రళయాగ్ని జ్వాల అయిపోయినాడు. కరమున గండ్రగొడ్డలి ధరించి, పృథ్వీతలమెల్ల సంక్షోభం చెందుతుండగా పరుశురాముడు మాహిష్మతీ పురానికి వెళ్ళాడు. మహా రోష సంరంభంతో వచ్చిన పరశురాముని చూచి ''ఈతడు వెఱ్ఱి బ్రాహ్మణుడు. బ్రాహ్మణునికి తగిన వేద శాస్త్రాధ్యయనమును, తపస్సును వీడి భూపాలురతో కయ్యానికి వచ్చాడు. తానే యుద్ధానికి వచ్చాడు. కాబట్టి మనదోషమేమీ ఉండదు. వీనిని సహింపక సంహరింపుడు'' అని కార్తవీర్యార్జునుడు దండనాయకుల్ని పురికొల్పాడు. పదిహేడు అక్షౌహిణులతో వచ్చిన సైన్యసముద్రాన్ని కుఠారంతో ఖండ ఖండములు కావించాడు పరశురాముడు. ధరణీ తలమంతా రక్తసముద్రమై పోయింది. ఈ బ్రాహ్మణు డొక్కడే సర్వసైన్యాన్ని హత మార్చాడు. వీని పరాక్రమమేమో నా దోర్బలమువలన గాని తేలదు'' అని పలికి కార్తవీర్యార్జనుడు పరశురామునిపై దూకాడు. వాని బాహువులను గొడ్డలితో నరికి, ముక్కలు కావించి, ఒక్క శిరము మిగులగా దానిని ఖండించాడు పరశురాముడు. తండ్రి మరణింపగా, ఆతని కుమారులు పదివేలమంది వాని నెదుర్కొనలేక పారిపోయారు. హోమధేనువును దెచ్చి తండ్రికి సమర్పించి, పరశురాముడు పితృఋణమును దీర్చుకున్నాడు.

పరశురాముని ధాటి కోర్వజాలక పలాయనం చిత్తగించిన అర్జున కుమారులు పితృమరణ శోకముతో మిక్కిలి దుఃఖించుచు, ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయాన జమదగ్ని ఆశ్రమానికి వచ్చారు. జమదగ్నిమహర్షి ధాన్య నిష్ఠలో ఉన్నాడు. నిరుపమ ధ్యానవృత్తిలో ఉన్న జమదగ్ని శిరస్సును వారు ఖండించి తీసుకువెళ్ళారు.

పరశురాముని తల్లి రేణుక దుఃఖానికి అంతు లేదు. ''రామా! రామా! జనకుని చంపిన వైరంతో రాజకుమారులు నీ తండ్రినే చంపారు. శత్రువులను సంహరించి ప్రతీకారం తీర్చుకో!'' అని ఇరువది యొక్క సార్లు ఆ మునిపై వ్రాలి గుండెలు బాదుకొన్నది. తల్లి మొఱవిని జమదగ్ని పుత్రు లందరు విలపించారు. పరశురాముడు విలపిస్తున్న అన్నలను చూచి ''సోదరులారా! ఇదుగో! ఈపరశురాముడు భీమపరాక్రమంతో దుర్జనులైన అర్జున పుత్త్రులను సంహరించి తీరుతాడు'' అని పలికి అర్జున పుత్త్రులున్న పురాలకు బయలుదేరాడు. ఆయన పరశుధారతో ఖండములైన రిపుల శిరాలు కొండల ఆకారం దాల్చాయి. రక్తనదులే ప్రవహించాయి. పరశురాముని ఆగ్రహం తీరలేదు. ఇరువది ఒక్కసార్లు భూమిపై రాజ శబ్దం వినపడకుండా సకల క్షత్రియ సంహారం చేశాడు.

''శత్రు నిరాసంచేసి ప్రతీకారం తీర్చుకున్న సుతుడంటే మనకు వెంటనే పరశురాముడే గుర్తుకు వస్తాడు. ''ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం'' అనే ఆర్యోక్తికి పరశురాముని వృత్తాంతం ఉజ్జ్వలమైన ఉదాహరణం.

ప్రశ్నలు

1. కార్తవీర్యార్జునుని పరాక్రమ మెట్టిది?

2. రాజకుమారులు కావించిన దుష్కృత్యమేమి?

3. పరశురాముడు దుర్మార్గులైన క్షత్రియుల నెట్లు నాశమొనర్చెను?

Neetikathamala-1    Chapters    Last Page