Neetikathamala-1    Chapters    Last Page

24

దైవస్తుతి

కౌమారీ భువనేశ్వరీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ

పంచక్రోశ పరీత పూత విజయ శ్రీ వాటికాధీశ్వరీ,

రంగన్మంగళ కృష్ణవేణి తటినీ తీరే సదా సంస్థితా

దుర్గాంబా నవకోటి మూర్తిసహితా మాం పాతు మాహేశ్వరీ.

''కళ్యాణ కనకదుర్గ'' నుండి,

- - -

భర్తృహరి

మానవతీ కటాక్షశిత మార్గణముల్‌ విదలింపcజాల వె

వ్యాని మనంబు; కోపమయవహ్ని దహింపదు; లోభపాశ సం

తానము మాల్యచందన వితానములన్‌ వెతసేయనోప కె

వ్యాని వశంబునన్‌ మెలగు; వాcడు జయించు జగంబుcలన్నియున్‌.

ఎవ్వని మనస్సు స్త్రీల చూపు లను బాణములచే గాయము కాదో, ఎవని హృదయమును కోపాగ్ని దహింపదో, ఎవని మనస్సు అత్యాశ అను పాశములచే లాగబడదో అట్టి ధీరుcడు ముల్లోకముల జయించును.

- - -

నలుడు

నల మహారాజు షట్చక్రవర్తులలో ఒకడు. ఆయన సదాచార సంపన్నుడు. నిషధ దేశాధిపతి. తన నిర్మలమైన చరితతో జగత్కాలుష్యమును క్షాళన మొనర్చిన ధర్మశీలుడు. మహాదాత; వివిధ శాస్త్ర పారంగతప్రజ్ఞుడు. ఆయన కీర్తి ప్రతాపములను విని కుండిన పురేశ్వరుని కుమార్తె దమయంతి అనురక్త అయింది. దమయంతి రూప సౌందర్యములు ఆకర్షించి నలుcడు అనురాగ చిత్తుడైనాడు. ఇట్లు వారిరువురు పరస్పరానురాగ హృదయులైనారు.

దమయంతి తండ్రియైన భీమరాజు కుమారై చిత్తము నెరింగి స్వయంవరమును చాటించినాడు. ఆ సమయమున ఇంద్రుడు తనసభకు విచ్చేసిన నారదుని పూర్వమువలె రాజకుమారులు తన పురమునకు రాకుండుటకు హేతువు అడిగినాడు. నారదుడు ఇంద్రునకు దమయంతీ స్వయంవర వృత్తాంతమును ఎరిగించి భూలోకమునందలి రాజకుమారులెల్లరు అచ్చటికి వెళ్ళినారని తెల్పాడు. అది విని ఇంద్రుడు, అగ్ని, యముడు కుడా దమయంతీ స్వయంవరానికి బయలుదేరారు. వారు మార్గమధ్యంలో నలుని కాంచి ఆతని సౌందర్యరూప సంపదలకు ఈర్ష్యపడి దమయంతియందు నిరాశలయిన ఆశయములతో ఆమె దగ్గరకు తమ దూతగా వెళ్ళమని కోరారు. ఇంద్రుడంతటి వాడు కోరగా కాదనలేక, తాను ప్రేమించిన దమయంతికడకు తానే దేవదూతగా వెళ్ళటానికి అంగీకరించినాడు నలుడు. ఇది నలుని ఆత్మ శుద్ధికి అగ్ని పరీక్ష వంటిది.

తిరస్కరిణీ విద్యా ప్రభావమువల్ల నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించి, మదన సామ్రాజ్యలక్ష్మిలాగా ఉన్న దమయంతిని సందర్శించాడు. నిశ్చలాంగుడు, పరమాద్భతాస్త నిమేషముద్రుడు, నిర్వికారుడునైన వానిని చూడగానే అంతఃపురకాంతలు భయవినయములతో లేచి చాటుకు వెళ్ళినారు. ధీరోదాత్త అయిన దమయంతి ఉపేంద్రుడో, జయంతుడో, కంతుడో కాక నలచక్రవర్తియో అడుగుదా మనుకన్నది. అయినా అంతఃపుర ప్రవేశము దుర్లభమని భావించి వానికి అతిథి సత్కారములు చేయించి కనన రత్న సింహాసనం చూపించింది.

''అనఘా! ఎక్కడనుంచి ఎక్కడికి వెళ్ళుచున్నారు? మీ నామమేమిటి? పెక్కుమంది రక్షకులు ఉన్న ఈ అంతఃపురానికి ఎలా వచ్చారు? ఇంతటి సాహసానికి కారణం మేము తెలుసు కోవచ్చునా? ఇంతకు మీరు మానవులా కాక వేల్పులా? మీ సందర్శనంవల్ల మేము కృతార్థులమైనాము'' అని దమయంతి పలికింది.

దమయంతి మధురమైన మాటలు మన్మథుని తూపులులాగా ఆయన మనసులో నాటుకున్నవి. మేఘగంభీరస్వరంతో అతడు ''ఓ కాంతా! ప్రాణ సమానమైన కార్యభారమును వహించి మేము దిక్పతుల ఆస్థానం నుంచి వచ్చాము. నా దౌత్యాన్ని సఫలం చేయి. అదే మాకు నీ విచ్చే ఆతిథ్యగౌరవం. దేవరహస్యం ఇప్పుడు నీకు చెప్పవచ్చుగదా! ఇంద్రాగ్ని యమవరుణులు నారద మహర్షివల్ల త్రిభువన మోహనములైన నీ రూప లావణ్య విలాస విభ్రమాది గుణాలు విని మన్మథ పీడితులై ధైర్యం కోల్పోయారు. విరహతాపం పెంచే కోకిల కూత లేస్తుందేమో నని ఇంద్రుడు నందనోద్యాన విహారం మానివేశాడు. యజ్ఞకర్తలందరిచేతను పూజింపబడు అగ్నిదేవుడు నిన్ను వరింప వలెనని ఆకాంక్షిస్తున్నాడు. మన్మథుని పుష్టబాణములకు శల్యమైపోయి అర్చకులు సమర్పించే పూలను కూడ స్వీకరించడానికి భయపడుతున్నాడు. సకల ధర్మములకు స్థానమైన యముడు ని న్నాకాంక్షించి విరహ జ్వరంతో పాలిపోయినాడు హృదయము నందున్న బడబాగ్నివల్ల వరుణుడు అణగి పోయి ఉన్నాడు'' అని ఈ రకంగా దేవతల విరహవృత్తాంత మంతా చెప్పాడు. ''దేవతలు తమ దివ్యత్వం నీకు ఇస్తామని చెప్పారు. నీ పాదాంభోజరజః ప్రసాదములు మా ప్రాణములు అన్నారు. ఇంద్రాగ్ని యమ వరుణులలో ఒక్కరిని కోరుకో '' అని వారి సందేశము వినిపించాడు.

నలుడు చెప్పన దేవతల సందేశం విని - ''నేను నీ వంశనామములను అడిగితే, ఇంతవరకూ నీవు ఎవ్వరినో ప్రస్తుతించావు. ప్రశ్న ఒకటి -- సమాధానం మరొకటి. దేవతలు గొప్పవారే అయినా, నాకు నీ వంశకథల పైననే ప్రీతి'' అన్నది దమయంతి.

నలుడు మళ్ళీ ప్రారంభించాడు. ''తామరసాక్షీ! నావంశకథలు అలా వుంచు. అయినా రాజపుత్రివి-- మాననీయవు, కాబట్టి నేను రాజవంశజుడనని మాత్రం తెలుసుకో. పేరు మాత్రం అడుగవద్దు. ఎందువల్లనంటే ఎవరి పేరు వారు చెప్పడం శాస్త్రవిరుద్ధం కదా!'' నలుడు తన పేరు చెపితే రాయబారం విఫల మౌతుందికదా! ఎలాగైనా పేరు చెప్పకుండా తప్పుకోవాలని అతడు చేస్తున్న ప్రయత్నాన్ని వమ్ము చేస్తూ దమయంతి అన్నది. ''ఓహో ! పేరు చెప్పడమే మీకు అనాచారమైతే అసలు మాకు మీతో మటలాడటం న్యాయమా ! కులకన్యలు మగవారితో, అందులో రూపమహనీయులతో -- అందులో అంతఃపుర మందిరంలో ఏకాంతంగా ఇంతసేపు మాట్లాడవచ్చునా?''

దమయంతి వాక్చాతుర్యానికి మనస్సులో అభినందిస్తూ సమాధానం దొరకక ''ఓ వెలదీ! మృదువైన నీ వాక్యాలను ఇతరులపై ఎందుకు ప్రయోగిస్తావు? దేవతల పట్ల భక్తితో కల్యాణం పొందు. నా పట్ల ప్రదర్శించిన చూపు మన్నన చాలు. నాకోసమైనా నాకవిభులను ఉద్ధరించు. నా రాకకోసం ఎదురుచూస్తూ దేవత లందరూ ఇప్పటికే ఎట్టి దురవస్థ పాలైనారో, ఏమో?'' అని చేతులు మోడ్చి అడిగాడు.

విదర్భ రాజకన్య అయిన దమయంతి ''చిరునవ్వు నవ్వడం ప్రగల్భత అవుతుంది. సమాధానం ఇవ్వకపోతే తిరస్కారం అవుతుంది. కాబట్టి సమాధానం ఇస్తున్నాను. దేవత లెక్కడ? నే నెక్కడ? అంతటి వారు ఒక మానవ కన్యను కోరుటయా?'' అని పలికి -- ''నేను త్రికరణ శుద్ధిగా నలమహారాజునే వరించాను. ఒక వేళ ఆ ధరణీనాథుడు నన్ను అంగీకరించకపోతే అగ్ని కాహుతియై గాని, ఉరిపోసికొని కాని, నీటిలో మునిగి కాని - నా ప్రాణాలను పరిత్యజిస్తాను . ఇదే నా ప్రతిజ్ఞ'' అని భయంకర ప్రతిజ్ఞ చేసింది.

నలుడు అప్పటికీ ఆమెను వదలలేదు. ''అయ్యో! ముగ్దత్వముతో ఎదురువచ్చిన భాగ్యాన్ని ఎందుకు వదులుకుంటావు? యాగాదులచేత దుర్లభ##మైన దేవత్వము నేడు నీకు అనాయాసంగా ప్రాప్తిస్తున్నది. రసయోగంచేత ఇనుము ఇనుముగా ఉండటం మేలో- కాక బంగారం కావడం మేలో తేల్చుకో. నువ్వు మరణించినా దేవతలకు దక్కక తప్పదు. ఉరివేసుకొని మరణిస్తే అంతరిక్షంలో ఉండే ఇంద్రుడు వరిస్తాడు. అగ్నిలోపడి ఆహుతి అయిపోతే అగ్నిదేవుని అదృష్టం ఫలిస్తుంది. నీటిలో మునిగితే వరుణుడు పుణ్యచేసినవాడవుతాడు. ఏరకంగా మరణించినా యముడికి దక్కుతావు. అందువల్ల నామాట విని ఎవరినో ఒకరిని వరించు'' అన్నాడు నలుడు.

దమయంతి తలవంచుకొని విచారిస్తూ ''తేప తేపకు నీ ములుకుల వంటి మాటలతో నా చెవులు గ్రుచ్చుతున్నావు. నాదే పొరపాటు. నువ్వు యమదూతవుకదా! కల్యాణసమయం దాపురిస్తున్నది. నీ యందు నలుడి రూపరేఖలు గోచరిస్తున్నవి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దేవతల విషయం మాను'' అని ప్రార్థించినది.

నలుడు నిర్మల హృదయుడు. దైవకార్య సాధనమే తన లక్ష్యంగా భావించి ''అయినా నాకు తెలియక అడుగుతాను. కల్పవృక్షాన్ని ప్రార్థించో, కామ్య యజ్ఞం చేసో, వాతాపి దమనుని వరమడిగియో, కామధేనువును కోరియో ఇంద్రాగ్ని యమ వరుణులు దేవలోకానికి తీసుకువెళ్ళితే నువ్వేం చేస్తావు? కాబట్టి భక్తితో దివిజులను వరియించు. వారికి ఆగ్రహం వస్తే అన్ని కార్యాలకూ అంతరాయాలే కలుగుతాయి'' అన్నాడు.

నలుడికి సమాధానం చెప్పలేక మార్గాంతరం లేక ఇంతవరకు గంభీరంగా ఉన్న దమయంతి వెక్కి వెక్కి యేడ్వటం ప్రారంభించింది. ఆమె అశ్రు కణములు జాలువారగా ఏడ్చుచుండుట చూచి, మనస్సు క్షోభించిపోయి ఉచితానుచిత వివేకము కోల్పోయి ''కాంతా! ఎందుకు దుంఖిఃస్తున్నావు! నేను వీరసేన తనయుడైన నలుణ్ణి. ముఖమెత్తిచూడుము'' అని పలికి మన్మథోన్మాదంతో ఎన్నో రకాలుగా పలికాడు. తరువాత కొంతంసేపటికి జరిగన పొరపాటు గ్రహించి నలుడు ''నా వంటి ఉన్మాదులు రాయబారానికి సమర్థులా! అది అంజనేయుని వంటి మహానుభావునకే సరిపోయింది'' అని పరిపరి విధాల చింతించాడు. దమయంతి అతడు నలుడని తెలియగానే కనకపు సింహాసనం దిగి తెరచాటుకు వెళ్ళిపోయింది.

ఇంతలో పూర్వం దౌత్యం నెరపిన రాజహంస సాక్షాత్కరించి దమయంతితో సాంత్వన వాక్యాలు పలికి ''అమ్మా!దమయంతీ! సందేహం వీడు. ఇతడే నీకు మగడు. ఆనాడే బ్రహ్మదేవుడు ఆనతిచ్చాడు. బ్రహ్మ వాక్యమునకు అన్యథాత్వం ఉంటుందా?'' అని చెప్పింది. నలుని దౌత్యమును అంతరిక్షంలో ఉండి గమనిస్తున్న దేవతలు ఆతని మనశ్శుద్ధికి ఎంతో సంతోషించారు. అనంతరం సర్వ దేవతా సమక్షంలో సరస్వతీదేవి అనుగ్రహంతో స్వయంవర సభలో దమయంతి నలుణ్ణి వివాహమాడింది.

తాను ప్రేమించిన కాంతకడకు నలుడు దేవదూతగా వెళ్ళి ధర్మనిర్వహణలో అప్రతిమానుడై నిల్చాడు. మనస్సు నిర్మలంగా ఉంటే మానవులు దైవానుగ్రహం పొంది ఇష్టకార్యాలను సాధిస్తారు.

ప్రశ్నలు

1. నల మహారాజు గొప్పతన మేవి?

2. ఎవరెవరు దమయంతిని ప్రేమించిరి?

3. నలుని మనశ్శుద్ది ఎట్టిది?

Neetikathamala-1    Chapters    Last Page