Neetikathamala-1    Chapters    Last Page

26

దైవస్తుతి

కల్యాణౖక పరంపరా సుమధురా కాళీ భవానీ పరా

పశ్యంతీ ప్రయవైఖరీ శశికళా శ్రీ మంజులా మధ్యమా,

కామాక్షీ కరుణా కటాక్షలహరీ కాత్యాయనీ భారతీ

దుర్గాంబా నవకోటిమూర్తి సహితా మాం పాతు మాహేశ్వరీ.

కల్యాణ కనకదుర్గనుండి

---

భర్తృహరి

కరమును నిత్యదానమ, ముఖంబున సూనృతవాణి, ¸°cదలం

గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్‌

వరహృదయంబునన్‌ విశదవర్తన, మంచితవిద్య వీనులన్‌

సురుచిరభూషణంబు లివి శూరులకున్‌ సిరిలేని యప్పుడున్‌.

మహాత్ములకు సంపదలు లేనప్పుడు - హస్తములకు సత్పాత్రదానము, శిరమునకు గురుపాద నమస్కృతి, ముఖమునకు సత్యవచనము, భుజములకు పరాక్రమము, హృదయమునకు కళంకములేని ప్రవర్తన, చెవులకు శాస్త్ర శ్రవణము సహజమగు అలంకారములు.

---

శంకరాచార్యులు

శంకర భగవత్పాదులు అపర శంకరులు. జ్ఞానైక వేద్యమైన అద్వైత మతమును ప్రతిపాదించి భారతము నంతనూ పాదయాత్ర చేసిరి. ఆజైత్రయాత్రలో అన్యమతముల ఖండించి పరాజితులైన ఆమత ప్రముఖులను తన శిష్యులుగా స్వీకరించిరి. శంకరుల పాండిత్య గరిమకు, వాక్ర్పౌఢికి, బౌద్ధ, జైన, చార్వాక, కాపాలాకాది మతములు భారతదేశమున నామమాత్రావశిష్టములైనవి. వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సౌర, శైవమతములను సమన్వయించి శ్రీశంకరులు షణ్మతోద్ధారకులైరి. ధర్మ ప్రచారమునకు, అద్వైత బోధకు భారతదేశంలో నలుమూలలందు వారు పీఠములు స్థాపించిరి. బ్రహ్మసూత్రములకు భాష్యము వ్రాసి, తన శిష్యులచే ఉపనిషత్తులకు వార్తికములు వ్రాయించి, లోకమునకు మహోపకారము చేసిన పుణ్యమూర్తులు శంకరులు. తన పరమ గురువై న గౌడపాదుని, వ్యాస జై మిని మొదలగు మహర్షులను తమ రచనలచే ఆనందింపజేసి తుదకు సర్వజ్ఞ పీఠము నధిరోహించిరి. ఈ మహత్కార్యము లన్నియు శంకర దేశికులు ముప్పది రెండు సంవత్సరముల తమ జీవిత కాలమునందే పూర్తి చేసిరి.

తమ జైత్రయాత్రా సమయమున శంకరులు శిష్యసమేతులై శ్రీశైలమహాక్షేత్రమును దర్శించి శ్రీమల్లికార్జున స్వామిని అర్చించిరి. ఆసమయములో ఒక రోజున శంకరులు ఒంటరిగా ధ్యానమునకు కూర్చుండిరి. అప్పుడు ఒక కాపాలికుడు శంకరులను సమీపించెను. అతడు విభూతి రేఖలతో, జడలు కట్టిన శిరోజములతో, చేతిలో త్రిశూలముతో భయంకరముగా ఉండెను. అతడు శంకరుల సమీపించి ''స్వామీ! నే నొక కాపాలికుడను. భైరవారాధన యందు ఉద్ధతుడను. ఒక పర్యాయము స్వామి నాకలలో దర్శనవిచ్చి నాయానా! సర్వసద్గుణసంపన్నుడైన మహారాజు శిరమునుగానీ, సర్వజ్ఞుడైన యతీశ్వరుని శిరమునుగాని తెచ్చి హోమము చేయుము. అప్పుడు నీ వాంఛితము సిద్ధింప గలదు అని చెప్పినాడు. మహానుభావా! సర్వసద్గుణసంపన్నుడైన మహారాజు శిరము దొరకుట దుర్లభము. మీరు వహామనీషులు. సర్వజ్ఞులైన యతీశ్వరులు. కాన మీ శిరము నాకొసగి నన్ను ధన్యుని చేయుడు'' అని కోరెను.

ఆ కాపాలికుని కోర్కె మిక్కిలి అనుచితమైన దైనను, అది తన ప్రాణములను హరించున దైననూ శంకరులు ఏమాత్రం చలించక మందహాసంతో -''నాయనా! అనతి కాలంలో నేను సమాధిగతుడనై బాహ్యస్మృతి లేక ఉందును. అప్పుడు నీవు నా శిరమును ఖండించి తీసుకునిపోయి నీ కార్యము నెరవేర్చుకొనుము'' అని పలికిరి. తన ప్రయోజనార్థము ఇతరులను వధింప సమకట్టన ఆ మానవాధముడు సమయము కొరకు వేచియుండెను. శంకరులు ధ్యాననిష్ఠులై సమాధిగతులైరి. ఆ సమయమునకై వేచయుండిన కాపాలికుడు శంకరుల శిరస్సును ఖండించ సన్నద్దుడై ఖడ్గమెత్తెను. శంకరుల శిష్యులు ఎవరూ ఆ సమీపమున లేరు. శిష్య చతుష్టయంలో ఒకడైన పద్మపాదుడు ఆఖండ గురుభక్తియుతుడు. అతడు నరసిహోపాసకుడు. మంత్రసిద్ధి వలన శ్రీ నరసింహస్వామి అతనికి వశుడై యున్నాడు. ఆ క్షణమందు నరసింహస్వామి పద్మపాదునిని ఆవహించెను. దూరముగా కృష్ణానదీ తీరమున స్నానముచేసి నిలబడియన్న పద్మపాదుడు విద్యుల్లతవలె మరుక్షణములో శంకరులున్న స్థానమునకు వచ్చి భూనభోంతరాళములు దద్దరిల్లే సింహ గర్జనలతో, మతహార్భటులతో, ఆకాపాలికుని పడద్రోసెను. సింహ సమ్ముఖమున బడిన గోమాయువు వలె కాపాలికుడు క్రిందబడి చేష్టలు దక్కి నిరుత్తరుడయ్యెను. నరసింహాకృతిలో ఉన్న పద్మపాదుడు తటాలున అతని వక్షమును చీల్చి ప్రేగులు కంఠమున దాల్చి హిరణ్యకశిపుని చీల్చిన నృసింహునివలె ఆగ్రహము వీడి శాంతించక క్రోధఘూర్ణిత నేత్రుడై గర్జంపసాగెను. ఆగర్జనలకు ఇతర శిష్యులందరూ భయ భ్రాంతులై పరుగున వచ్చిరి. కాని సమీపమునకు వెళ్ళుటకు సాహసింప రైరి. ఈ సంరంభమునకు సమాధిభంగము కల్గిన శంకరులు కనులు విప్పి భీషణ నృసింహాకృతితో ప్రేగులు మెడను దాల్చిన పద్మపాదుని చూచిరి. వెంటనే ఆస్వామికి అభిముఖముగ నిల్చి నృసింహస్వామిని స్తుతించిరి. పద్మపాదుని ఆవహించిన నృసింహస్వామి పద్మపాదుని శరీరము నుండి వైదొలగెను.

సత్పురుషులు తమ జ్ఞనమును, తమ శరీర ప్రాణములను పరహిత కాంక్షులై సమర్పించుదురు. అట్టివారి రక్షణకు పరమేశ్వరుడు సర్వదా జాగరూకుడై యుండును.

ప్రశ్నలు

1. శంకర భగవత్పాదుల గొప్పతన మెట్టిది?

2. కాపాలికుడు శంకరులను ఏమి కోరెను?

3. పరమాత్ము డెట్లు వానిని శిక్షించెను?

Neetikathamala-1    Chapters    Last Page