Neetikathamala-1    Chapters    Last Page

28

దైవస్తుతి

శ్రీ విద్యాం శివవామ భాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్జ్వలాం

శ్రీ చక్రాంకిత బిందుమధ్య వసతిం శ్రీమత్సభా నాయకీమ్‌,

శ్రీ మత్‌షణ్ముఖ విఘ్నరాజ జననీంశ్రీ మజ్జగన్మోహినీం

మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్‌.

- మీనాక్షీ పంచరత్నం

---

భర్తృహరి

ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోష వాం

ఛాశూన్యత్వము, సత్యమున్‌, బుధనుతాచారంబు, సత్సేవయున్‌,

వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతయుం, బ్రశ్రయ

శ్రీ శాలిత్వము, దీనులందుc గృపయున్‌ శిష్టాళికన్‌ ధర్మముల్‌.

అత్యాశను త్యజించుట, ఓర్పుగలిగియుండుట, మదమును విడుచుట, దుష్కార్యములందు మనసు బోనీయకుండుట, సత్యమునే పలుకుట, పెద్దలు పోయిన మార్గమున నడచుట, విద్వాంసుల సేవించుట, పూజ్యుల మన్నించుట, శత్రువునైనను చక్కగా చూచుట, పెద్దలయందు అడకువ కలిగి కీర్తికి భంగము రాని విథమున చరించుట, దుఃఖితుల యందు దయను గనపరచుట- ఇవి సత్పురుషుల లక్షణములు.

---

పరీక్షిత్తు

పరీక్షిత్తు అభిమన్యువీరుని కుమారుడు. ఇతడు శరణాగత వత్సలుడు, సత్యప్రతిజ్ఞుడు అయిన సమ్రాట్టు. మహాభారత సంగ్రామానంతరము ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ అపాండవమ్ము చేయుమని ప్రయోగించిన బ్రహ్మ శిరోనామ కాస్త్రజ్వాలల నుండి కేశవుని గదాభ్రమణ పరిరక్షితుడై జన్మించిన విష్ణురాతుడు, జన్మించిన పిదప తల్లి గర్భమందు మును తన్ను రక్షించిన విభుడు విశ్వము నందెల్లగలడని పరీక్షింపగా ప్రజ లతనిని పరీక్షిత్తని పిలిచిరి.

పరీక్షిత్తు సింహాసన మధిరోహించి జైత్ర యాత్ర సల్పెను. పిదప అతడు ఐరావతీ దేవిని వివాహమాడెను. ఒకనాడు ఆ రాజు వేటకై వెడలి వేట తమకమున మృగముల వెంటాడి అలసి ఆకలి అతిశయించగా, దప్పిగొని జలాశయము కానక సమీపమందలి ఒక తపోవనమును చూచాడు. అది శమీక మహర్షి యాశ్రమ పదము. దాహనివృత్తికై ఆశ్రమంలోనికి వెళ్ళాడు. శమీక మహర్షి పద్మాసన స్థితుడై ప్రశాంత గంభీరవదనంతో, అర్ధ నిమీలిత నేత్రములతో అవస్థాత్రయమున కతీతమైన తురీయ పదమగు నాబ్రహ్మ పదమం దుండెను. అంత పరీక్షిత్తు- ''మునిశేఖరా! నేను ఈదేశపు రాజును. నన్ను పరీక్షిత్తు అందురు. దాహ పీడితుడనై జలమును కోరుచున్నాను'' అని పలికెను. బాహ్య స్మృతి లేక అంతర్ముఖుడైన ఆ మౌని ఎట్టి సమాధానమును ఇవ్వలేదు. ''బుభుక్షితః కిం న కరోతి పాపం'' అన్నట్లుగానే రాజునకు కర్తవ్యాకర్తవ్య జ్ఞానము నశించి క్రోధముతో మౌనముద్రతోనున్న ముని త న్నవమానించినట్లు భావించాడు. అతిథి పూజమాట అటుంచి నో రార అడిగినను ఈ మౌని జల మివ్వడేమని తలచి ఆమునిని గర్విష్ఠి అనుకున్నాడు. దాహ జనిత దురంతరోషమున వింటి కోపున ఒక మృత సర్పమును ఆ ఋషి భుజముపై వేసి తన నగరమునకు వెళ్ళెను. ఆ క్షణమందు ప్రారబ్ధవశమున అతని బుద్ధి బుగ్గి యయ్యెను. ఇతర ముని కుమారుల వలన ఈ విషయమెరిగిన శమీక మహర్షి కుమారుడైన శృంగి క్రోధ ఘూర్ణిత నేత్రుడై - ''మదాంధుడై నా తండ్రి భుజముపై సర్పకళేబరము నుంచినరాజు తక్షకుని విషాగ్నిచే నేటికి ఏడవ దినమున మరణించుగాక'' అని శపించాడు.

ఒక గడియ తర్వాత శమీకుడు సమాధినుండి లేచి శృంగి వలన జరిగిన వృత్తాంతమును విన్నాడు. దివ్యదృష్టి వలన శాపోపహతుడు ధర్మజ్ఞడైన పరీక్షిన్నరేంద్రుడని తెలిసికొని పరితపించాడు. కాని శృంగికి శాపము నుపసంహరింప శక్తిలేదు. అప్పుడు శమీక మునీంద్రుడు తన శిష్యుని పిలిచి ఆ శాప వృత్తాంతమును పరీక్షిత్తున కెరిగింపుమని పంపెను. శమీక మహర్షి ఆశ్రమమును వదలి నగరమునకు వచ్చిన పరీక్షిత్తుకు తాను చేసిన ఆకృత్యము తెలిసివచ్చెను. అట్లుమునిని అవమానించి నందుకు చాలా దుఃఖించెను. ముని కుమారుడు శాపవృత్తాంతము తెల్పిన పిదప అతడు విరక్తుడయ్యెను. మనస్సు నందు శ్రీకృష్ణపాద పద్మములను నిల్పి సాంసారిక బంధములన్నింటిని వీడెను. వెంటనే తన కుమారుడైన జనమేజయునికి రాజ్యమిచ్చి విరాగియై పవిత్రగంగా తీరమునకు వెళ్ళి అచట ఉత్తరాభిముఖుడై కూర్చుండెను. ధర్మజ్ఞుడు, వీతరాగుడు, వాసుదేవపద భక్తితత్పరుడు అయిన పరీక్షిత్తు యొక్క శాప వృత్తాంతము విని మహర్షులు అచటకు వచ్చిరి. అంతలో వ్యాసమహర్షి తనయుడు, బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడు, అవధూతయగు శ్రీశుకమహర్షి గూడ అచటకు వచ్చెను. పరీక్షిత్తు అతనిని పూజించెను.

''మహర్షీ ! తమరు సర్వజ్ఞులు, త్రికాల దర్శులు. తమ దర్శన మాత్రముచే నే ననుగృహీతుడను. మరణ మా సన్నమైన నేను పునర్జన్మ రహితుడ నగుటకు ఏమి చేయ వలయునో చెప్పండి'' అనిప్రార్థించాడు. ''రాజా! ప్రాణులకు సర్వకాలములందు సర్వోత్కృష్టమైనది గోవింద గుణగానము నందు రమించుటయే. అందువలన ఆ దేవ దేవుని గుణమహిమలను కీర్తించు భాగవత కథను వినిపించెదను. భక్తితో విని తరింపుము'' అని పలికెను. పరీక్షిన్నరేంద్రుడు వాసుదేవుని తన హృత్కమలమందు నిలిపి, జిజ్ఞాసువై నిరాహారియై అనన్యమైన భక్తితో భాగవత కథా శ్రవణ మొనర్చెను. ఏడవదినమున మాయా రూపమున వచ్చిన తక్షకుని విషకీలల వలన అతడు మరణించెను.

భౌతిక వస్తుజాలము, సంపద నశ్వరమని ఎరిగి, విరక్తిభావముతో సంసారమును, రాజ్యమును త్యజించి భక్తితో శ్రీకృష్ణుని గుణమహిమను వింటూ పరీక్షిత్తు ఏడురోజులలో కైవల్యమును పొందెను. విధివిధానము అనతి క్రమణియమని ఎరిగి సమర్పణ భావంతో హరిని సేవించిన మోక్షము కరతలామలకము అనుటకు పరీక్షిత్తు చరిత్ర ఒక ప్రబలతార్కాణం.

ప్రశ్నలు

1. ''పరీక్షిత్తు'' అను పేరు వానికి ఎట్లు వచ్చెను?

2. పరీక్షిత్తు చేసిన అకృత్యమేమి? తత్ఫలితమేమి?

3. పరీక్షిత్తు ఎట్లు కైవల్యమును పొందెను?

Neetikathamala-1    Chapters    Last Page