Neetikathamala-1    Chapters    Last Page

34

దైవస్తుతి

మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ,

మందారముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్త్మె మకారాయ నమశ్శివాయ.

- - -

దాశరథీ

పాపము లొందువేళ, రణపన్న గభూత భయజ్వరాదు లం

é దాపద నొందువేళ భరతాగ్రజ, మిమ్ము భజించువారికిన్‌

బ్రాపుగ నీవుc దమ్ముcడిరు పక్కియలం జని తద్విపత్తి సం

తాపము మాన్పి కాతువcట, దాశరథీ ! కరుణాపయోనిధీ!

దయాసముద్రుడవైన ఓరామా! పాపములు అనుభవించు నప్పుడు, రణము సర్పము, భూతము, భయము, జ్వరములయందు కష్టములు పొందు వేళలందు, శ్రీరామా ! నిన్ను స్మరించువారికి తోడుగనీవు, నీ తమ్ముడు లక్ష్మణుడును ఇరు ప్రక్కలకు వెళ్ళి ఆ ఆపద్భయములను పోగొట్టి రక్షించుదురట!

- - -

నామధేవుడు

నామధేవుడు అక్రూరాంశవలన జన్మించాడు. భక్తిభావంతో నిరంతరము పాండురంగని సేవించేవాడు. పాండురంగడు ఆతనికి దర్శనమిచ్చి తన ప్రియమైన భక్తునిగా స్వీకరించాడు. పాండురంగని కృపవలన అతనికి జ్ఞానదేవుడు, ఘెరాకుంభార్‌ వంటి మహాపురుషుల స్నేహ, సంసర్గములు లభించాయి. భక్తితత్పరుడైనను, పండరి నాథుడు అతనికి వశుడైయున్నను అతని హృదయము జ్ఞానతప్తము కాలేదు. ఒకనాడు రంగడు దర్శన మిచ్చి '' వత్సా! నీ హృదయము అచంచలమే, భక్తిబందురమే? కాని ఇంకను పరిపక్వస్థతి నీకు రాలేదు. ఇంతవరకు సదాచార్యుని ఆశ్రయించక పోవుటే దానికి కారణం. వెంటనే ఆచార్యుని ఆశ్రయింపుము'' అని పలికాడు. ఇంతవరకు పండరి పురమందు తన్ను సేవించుచున్న పండరినాథుని వదలి వెళ్ళుటకు నామదేవుడు చింతించాడు.

పాండురంగని ఆజ్ఞ ప్రకారము విశోబాకేశుని వద్దకు శుశ్రూషచేయుటకు బయల్దేరాడు. దారిలో అతనికి విశోభాకేశుడు నాగనాథపురంలోని నాగనాథుని సేవిస్తున్నాడని తెలిసింది. నామదేవుడు నాగనాథపురం చేరాడు. దేవాలయంలో విశోబాకేశుడు లింగరూపంలో నున్న నాగనాథునిపై కాళ్ళుపెట్టి నిద్రపోతున్నాడు. అతనిని చూచి ''అయ్యా! దేవుని విగ్రహముపై పాదము లుంచి నిద్రించుట దైవాపచారము. ప్రాకృతులైన కిరాతులుకూడ ఇట్టి అపచారము చేసినట్లు కట్టుకథలందైననూ వినలేదు. ఇట్టివానిని సేవించుటకా పాండురంగడు నన్ను పంపినది?'' అని నామదేవుడు కటకట పడెను. అతడు మేల్కొనిన తర్వాత ''స్వామీ ! నీ వంటివానికి ఇట్టి ఘోరమైన దైవాపచారము తగునా?'' అని అడిగాడు. విశోబాకేశుడు మందహాసముతో ''దయయుంచి ఎక్కడ నుంచిన దోషముండదో అచట నాపాదములుంచకోరుచున్నాను'' అని చెప్పెను. నామదేవుడు మారుపలుకక క్రిందపెట్టుటకు విశోబాకేశుని పాదము లంటెను. విశోబాకేశుని పాదము లంటిన వెంటనే విద్యుత్తువలె జ్ఞానము అతని హృదయమున వ్యాపించెను. వెంటనే జగత్తంతయు éశివమయముగా కాన్పించెను. శివలింగము లేని స్థలము ఆవగింజంతయైనను అతనికి కనుపించలేదు. ఈ అద్భుతము చూచి నామదేవుడు నిశ్చేష్టుడయ్యెను. ''వత్సా? ఏల ఆశ్చర్యపడెదవు? శివలింగము లేని స్థలమెచ్చట నున్నది? హరి హరుడు ఎచ్చటనుండనో అచ్చటనే యుండును. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పృథక్థ్సితి ఉన్నదా?'' అని విశోబాకేశుడు పలికెను. విశోబా ప్రభావము నెరిగి నామదేవుడు అతనికి సాష్టాంగదండ ప్రణామము లాచరించి ''మహానుభావా! నన్ను మీరే ఉద్ధరింపవలెను'' అని వినయముతో ప్రార్థించెను. విశోబా కేశుడు అతనిని జేరదీసి అభయమిచ్చి జ్ఞానోపదేశము చేసెను.

జ్ఞానజ్యోతి విశోబాకేశుడు వెలిగింప నామదేవుని హృదయమునావరించిన మాయావరణము తొలగెను. అతనికి జగత్తంతయు శ్రీహరిమయముగా దోచెను. ''నామదేవునికి అలవడిన జ్ఞానము స్థిరమైనదా? కాదా?'' యని పండరినాథుడు పరీక్షింపదలచెను. ఒకనాడు భాగవతా గ్రేసరు లందరు గుమికూడి భుజించుసమయమున పండరినాథుడు శునకరూపముతో అచటకు వచ్చెను. కొందరు ఛీ!ఛీ యని దానిని తరిమివేసిరి. మరికొందరు ఆ కుక్క రాకవలన తాము భుజించుచున్న పదార్థము అపవిత్రమైనదని వదలివేసిరి. మరికొందరు దానిని చూడనట్లు నటించి భుజించుచుండిరి; మరికొందరు దానిని దుడ్డు కర్రలతో తరిమిరి. ఆ శునకం పారిపోయి తిరిగి వచ్చి తటాలున నామదేవుని చేతిలోని రొట్టెను నోట గరచుకుని పారిపోసాగెను. నామదేవుడు చీదరించుకొనుట, కోపగించుకొనుట చేయక శ్రీహరికంటె అన్యమైన దేదియులేదని తలచి- ''మాహాత్మా! ఏల భయపడి పరుగెత్తెదవు?'' అంటూ దాని వెనుక పరుగిడి దానిని పట్టుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని ''వట్టి రొట్టె తినవలసినగతి మీకేమి?'' అంటూ నేయి, పంచదార అద్దిన రొట్టెముక్కలను దాని నోటికి అందించసాగెను. ఆ శునకము ప్రీతితో ఆ రొట్టెముక్కలు తినసాగెను. అచటనున్న వారు కొందరు నామదేవునకు పిచ్చిపట్టినదనిరి. మరి కొందరు అట్టి దుర్గతి నామదేవునికి కల్గినందులకు చింతించిరి. మరికొందరు నవ్విరి. మరికొందరు ఆ కుక్కయిందు నామదేవుడు వైకుంఠవాసుని దర్శించినా డనిరి.

ఈవాద ప్రతివాదములు జరుగుచుండగా నామదేవుని ఒడిలోని కుక్క దివ్యమంగళ విగ్రహమై నామదేవుని అనుగ్రహించి అంతర్ధానమయ్యెను.

జ్ఞానులగువారు విశ్వమంతటిని పరమేశ్వరమయముగా గుర్తింతురు. అట్టి మానసిక పరిపక్వస్థితి నొందినట్టి వారే సదుపదేశము చేయగల సమర్థులైన ఆచార్యులు.

ప్రశ్నలు

1. నామదేవుడు గురువు నెందుల కాశ్రయించెను?

2. నామదేవుడు దర్శించునప్పుడు విశోబాకేశుని స్థితి ఏమి?

3. పాండురంగడు నామదేవుని ఎట్లు పరీక్షించెను?

Neetikathamala-1    Chapters    Last Page