Neetikathamala-1    Chapters    Last Page

35

దైవస్తుతి

శివాయ గౌరీ వదనారవింద

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ,

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ

తస్త్మె శికారాయ నమశ్శివాయ.

- - -

దాశరథీ

చరణము సోకినట్టి శిల జవ్వని రూపమగు టొక్క వింత, సు

స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింత, గాని మీ

స్మరణcదనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత యీ

ధరను ధరాత్మజారమణ!దాశరథీ!కరుణాపయోనిధీ!

దయా సముద్రుడవైన ఓరామా! నీ పాదములు తాకి రాయి స్త్రీగా మారటం ఒక వింత. పర్వతములు నీటిపై తేలుట ఒక వింత. నీ స్మరణతో అలరారు మానవులు పుణ్యగతులు పొందుట ఎంత ఆశ్చర్యకరమైన విషయము ఓ రామా!

- - -

మాలదాసరి

విష్ణుభక్తి సంకీర్తనలతో తాను తరించుటయే గాక; సంకీర్తన శ్రవణ మాత్రమున ఇతరులనుగూడ తరింప జేసిన భక్తాగ్రగణ్యుడు మాలదాసరి. ఆతడు చెప్పరాని కులమునకు చెందినవాడు. విష్ణుమూర్తి వామనావతారం ధరించిన పుణ్యభూమికి మూడుయోజనాల దూరంలో ఉన్న కుగ్రామంలో నివసించేవాడు. వాడు ప్రతి రోజు తెల్లవారకముందే బయలుదేరి గుడికివచ్చి మంగళ కైశికీ రాగంతో స్వామిని భక్తి భరిత హృదయంతో కీర్తించేవాడు. వాడి శరీరము దుర్గంధభూయిష్ఠమే అయినా వాని హృదయం నిత్య నిర్మలమైనది. మసిపాత కట్టిన శరీరంతో, ఇత్తడి శంఖ చక్రములు పెట్టుకొని చేతిలో చిటి తాళాలు పట్టుకొని వచ్చి సంకీర్తన చేసేవాడు. కనులవెంట ఆనందబాష్పాలు వెడలుచుండగా ఆతడు మైమరచిపోయి తాండవం చేసేవాడు. ప్రతి రోజూ ఈ విధంగా పాడి ఆడి చివరకు స్వామికి సాష్టాంగ ప్రణామముచేసి, స్వామికి అభిషేకము చేసిన జలాన్ని తన చేతిలో పోయించుకొని త్రాగేవాడు. శూద్రులు దయతో పెట్టిన స్వామి ప్రసాదాన్ని కిన్నెర దండెమీద అందుకొని పుచ్చుకునేవాడు. ప్రొద్దెక్కుసరికి తన వూరు చేరుకునేవాడు.

ఒకనాడు వాని ఇంటి ప్రక్కనున్న కోళ్ళగుడిసెలో పిల్లి దూరింది. ఆ అర్ధరాత్రి కోళ్ళు భయపడిపోయి కూశాయి. మాలదాసరి తెల్లవారిన దనుకొని వెంటనే స్వామిసేవకు బయలుదేరాడు. త్రోవలో మరులు మాతంగితీగ త్రొక్కిన కారణంగా దారితప్పి తిరిగి తిరిగి ఒక నిర్జనమైన అడవి చేరుకొన్నాడు. అల్లంత దూరంలో అర్ధయోజన విశాలమైన శాఖలతో కూడుకొని వున్న ఒక వటవృక్షం చూచాడు. ఆ మఱ్ఱిచెట్టు ప్రక్కనే ఉన్న మార్గంవెంట వెళ్లుచుండగా పుఱ్ఱలతో, బొమికలతో, ఈగలు ముసురుకొనిన మానవ శరీరావయవములతో మార్గమంతా బీభత్సముగా కనిపించింది.

ఇంతలో మనుష్య కళేబరమే మొలత్రాడుగా కలిగిన వాడు, ఎఱ్ఱ దుప్పటికప్పుకొన్నవాడు, పాయలుగా తీసిన గడ్డముకలవాడు, భయంకరమైన కోరలు కలవాడు అయిన ఒకానొక బ్రహ్మరాక్షసుడు ''ఏయ్‌! దొరికావు. కాలు ముందుకు వేశావో ....'' అని గర్జిస్తూ మాలదాసరి మీదికి'' దూకాడు. మాలదాసరి సమర నైపుణ్యము కలవాడు కావడం వల్ల కొంతకాలము తన వద్ద ఉన్న బాణంతో రాక్షసుణ్ణి కొట్టాడు. ఆ రాక్షసుడు దానిని ఏమాత్రమును లెక్కచేయక, వానిపైబడి కొట్టి అనేక విధమల పింసించాడు. మాలదాసరి ఆ బ్రహ్మరాక్షసునితో ''రాత్రించరా! నా మాట వినుము. నిన్ను ఇక దేవతలైన జయింపలేరు. ఇప్పుడు నీకు వడ్డించిన అన్నము వంటివాణ్ణి నేను. నాకు ఈ శరీరముపై వాంఛలేదు. అయినను ఒక ప్రాణిని సంతోషపెట్టడానికి మరణించుట కంటె ముక్తిపొందుటకు మరేమి కావలెను? ఇందుకు శిబి చక్రవర్తియే చక్కని ఉదాహరణము'' అని పలికెను.

బ్రహ్మరాక్షసుడు వాని మాటలువిని ''ఓరీ ! వ్యర్థమైన మాటలు నా కేల ? నీవు చదివిన కూరవు. నీ శరీరము మరింత రుచిగానుండును. తే'' అన్నాడు. మాలదాసరి ''నీవు సర్వజ్ఞుడవు. నేను నరుడను; హీనకులుడను. శాస్త్రములు చదువలేదు. నీకు నేను సమాధానము చెప్పగలవాడనుగాను. ఏడు మాటలు మాటాడిన మిత్రు లగుదురు. నాకొకవ్రత మున్నది. ఈ సమీపమునందే వైకుంఠవాసుని గుడి ఉన్నది. స్వామికి సేవ చేసి వచ్చి నీకాహార మౌతాను'' అని పలికాడు. బ్రహ్మరాక్షసుడు చిరునవ్వు నవ్వి, వాని చెక్కిలిపై కొట్టి ''ఓయి దాసరీ! లెస్సగా మాట్లాడితివి. నీ బోధ ఆలకించే పిచ్చి వా డెవ డున్నాడు?'' అన్నాడు. మాలదాసరి చెవులు మూసికొని ''రాక్షసరాజా! నన్ను నమ్ము'' అని అనేక విధాలైన శపథాలు చేశాడు. చిట్ట చివరకు ఎవని కరుణచేత ఈ సర్వజగము జనియించు చున్నదో, ఎవనియందు ఈ జగము వసించియున్నదో, ఎవనియందు ఈ జగము లయము చెందునో అట్టి విష్ణుమూర్తి పై ఒట్టు పెట్టుకొన్నాడు. బ్రహ్మరాక్షసుడు అప్పుడు వానిని వదలిపెట్టినాడు.

మాలదాసరి వెళ్లి పుండరీకాక్షునకు సాగిలి మ్రెక్కి స్తుతి ప్రబంధములను పాడి అసత్య భీతిచే వెనువెంటనే బ్రహ్మరాక్షసుని కడకు తిరిగి వచ్చి ''ఓనిశాచరా ! నీ దయచే స్వామిని సేవించి వచ్చితిని. ఇదిగో! ఇది నా శరీరము, ఇది నా ఉదరము -ఇది శిరము-ఇవి చరణములు. ఇక వీనిని నిరభ్యంతరముగా ఆహారముగా గైకొనవచ్చును'' అని పలికెను.

మాలదాసరి సత్యపాలనమునకు బ్రహ్మరాక్షసుని హృదయము పులకించిపోయింది. నేత్రములు చెమ్మగిల్లాయి. ఈ మట్ట మధ్యాహ్నము వేళ మత్త వేదండము వలె నున్న ఆ రాక్షసుడు మాలదాసరికి ''మహానుభావా! దేవదానవ మానవ లోకములలో నీ వంటివాడు లేడు. నీ సత్యవాక్పాలనము అనుపమానమైనది. నీ ధైర్య స్థైర్యములు, నీ విష్ణుభక్తి అసదృశ##మైనవి'' అని పలికెను. మాలదాసరి వానిని ప్రేమతో కౌగిలించుకొని ''ఓరజనీచరేంద్ర! నీ కృపా కటాక్షమున వ్రతపాలన మొనర్చి ధన్యుడనైతిని. మహాక్షుద్బాధతో నకనకలాడుచున్నావు. నాపట్ల నీకు నిజముగా మైత్రియేయున్న నాశరీరమును ఆహారముగా పుచ్చుకో '' అన్నాడు.

బ్రహ్మరాక్షసుడు ''ఎంతమాట మట్లాడితివి? ఇన్నాళ్ళ నుండి ఎంతమందినో పొట్టను బెట్టుకొంటిని. నా ఆకలి తీరినదా? నీ వంటి మహానుభావుడెవడైన వచ్చునేమో! వచ్చి నాకు ముక్తి కల్గించునేమోయని ఎదురు చూచుచున్నాను. మీవంటి భక్తాగ్రగణ్యులు రక్షించకపోయినచో మా కిక గతి యేమిటి?'' అని ఆర్తితో పలికాడు. వాని మాటల కేమియు సమాధాన మీయక నీ అభిప్రాయ మేమి? అన్నాడు మాలదాసరి.

బ్రహ్మరాక్షసుడు ''నాపేరు కుంభజానుడు. ఉగ్రకర్ముడనై బాటసారులను చంపి తినుచుందును. పూర్వము నాపేరు సోమశర్మ. ఒకానొక దుష్కృత్యము వలన ఇట్టి బ్రహ్మరాక్షస రూపము ధరించినాడను. నీవు స్వామికి పాడిన పాలఫలమును ఇచ్చినచో నా కీ భీభత్సరూపము నశిస్తుంది. నీకు ఆర్త రక్షణ పుణ్యము దక్కుతుంది'' అని ప్రార్థించాడు. మలదాసరి కలకల నవ్వి ''ఓయీ! ఇటువంటి ఎగుడు దిగుడు పనులెటనైన ఉండునా ? నా శరీరమును కాపాడుకొనుటకై, స్వామిపాట ఫలమును ఈయ మందువా? ఈ దేహము కొరకై గీత ఫలము నిచ్చుట కప్పురము నిచ్చి ఉప్పును కొనుట వంటిది'' అని సమాధాన మిచ్చాడు. రాక్షసుడు ''పోని సంగీత ఫలములో సగము నిచ్చి నన్ను రక్షింపుము. మహాసముద్రమునందు గ్రుక్కెడు నీరు మ్రింగిన ఏమి పోవును?'' అని మాలదాసరిని కోరెను. మాలదాసరి ''నీవు ముందు నాదేహము నడిగి ఇప్పుడిట్లు మాట మార్చుట ఎందులకు? నేను నీకు కీర్తన ఫలమిత్తునని చెప్పలేదు. రాక్షస కాంక్షలు మాని నా శరీరమును పరిగ్రహించ'' మన్నాడు.

రాక్షసుడు మాలదాసరి పాదములపై బడి కన్నీరు కార్చుచు దయాహృదయులైన విష్ణుభక్తులను ప్రశంసంచి, వారివలెనే కరుణ వహించి పాట ఫలములో సగము పాలిచ్చి కృతార్థుని జేయుమని ప్రార్థించాడు. మాలదాసరి అంగీకరించ లేదు. పోనీ నాలుగవ భాగమైనా ఇచ్చి తన విరూపమును తొలగింపు మని అడిగాడు. మాలదాసరి అతని కోరికను తిరస్కరించాడు. చిట్టి చివరకు ఈ ఉదయము పాడిన చివరి పాట నిచ్చియైన ప్రసన్నుడవు కమ్మని విన్నవించాడు. అప్పుడు మాలదాసరి పరమదయార్ద్ర హృదయుడై ''కానిమ్ము, లెమ్మని'' లేవనెత్తి ఆతని పూర్వవృత్తాంతము నడిగెను. బ్రహ్మ రాక్షసుడు తన కథను చెప్పెను. మాలదాసరిని తన మంగళ కైశికీ గాన ఫలమిచ్చి రక్షింపు మని కోరగా ''దాని ఫలమును నేనే ఎరుగను. దానిని నే నెట్లు నీ కీయగలను? నిన్ను భగవంతుడే కరుణించును'' అనుచుండగనే ఆ బ్రహ్మరాక్షసుడు ముఖమున ఊర్ద్వ త్రిపుండ్రాంకముతో, హిమ ధవళ యజ్ఞోపవీతములతో కంఠమున తులసిమాలతో, చేతులయందు జలపూర్ణ కమండలువుతో దివ్య ప్రబంధ సంపుటితో, బ్రహ్మవర్చస్సుతో ''సోమశర్మ'' అను భాగవతోత్తముడుగా మాలదాసరి ముందు సాక్షాత్కరించాడు. తరువాత సోమశర్మ మాతదాసరిని ''జయ జయ గాయక సార్వభౌమ, జయజయ దేశిక చరణ శరణ, జయ జయ సమచిత్త'' అని పూజించి పునర్జన్మ భయముతో శారీరక సుఖములయందు విరక్తుడై బదరీవనాది పుణ్య భూములయందు తీర్థయాత్రలు చేసి మోక్షమును పొందెను.

భగవదనుగ్రహము పొందుటకు కులగోత్రములతో పనిలేదు. నిర్మలాంతఃకరణము నిశ్చల భక్తి పరమాత్ముని అనుగ్రహము పొందుటకు సాధనములు.

ప్రశ్నలు

1. మాలదాసరి దిన చర్య ఎట్టిది?

2. బ్రహ్మరాక్షసుడు మాలదాసరిని ఏమి కోరెను?

3. మాలదాసరి బ్రహ్మరాక్షసుని ఎట్లు అనుగ్రహించెను?

Neetikathamala-1    Chapters    Last Page