Neetikathamala-1    Chapters    Last Page

37

దైవస్తుతి

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ

పినాకహస్తాయ సనాతనాయ,

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తసై#్మ యకారాయ నమశ్శివాయ.

***

దాశరథీ

పరధనముల్‌ హరించి, పరభామలనంటి, పరాన్నమబ్బినన్‌

మురిపమ కాని, మీcదనగు మోస మెఱుంగదు మానసంబు; దు

స్తర మిది, కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నే

తఱి దరిcజేర్చి కాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!

దయాసముద్రుడవైన ఓ రామా! పరుల ధనమును దొంగిలించి, పరస్త్రీలను పొంది, పరుల తిండి తినిన ఆనందముగ ఉండును. కాని ఆ తర్వాత జరుగు అపకారము మనస్సు తెలుసుకొనదు. ఇందువలన కలుగు యమకింకరుల గదాఘాతముల బాధనుండి నన్ను ఏ విధంగా కాపాడెదవో శ్రీరామా!

- - -

తిన్నడు

''ఓ బాలకా! ఇచటికి సమీపంలోనే కొండ దగ్గర మొగలేరు ప్రక్కనే పార్వతీపతి అయిన పరమశివుడు వేంచేసి ఉన్నాడు.... ఆ స్వామి భక్తులపాలిటి పెన్నిధి. ఆయనను భక్తితో సేవించు.''

కంటిముందు కనిపిస్తూ, ఆకస్మికంగా శివుడు అంతర్ధానమైపోగా కళ్ళు నులుముకుంటూ బాలుడు చెట్టుక్రింద పూల పాన్పుమీది నుంచి లేచాడు. అడవిలో నలు దిక్కులా వెదికాడు. ఎవరూ కనిపించలేదు. అక్కడ ఒక అడవి పంది మాత్రం కనిపించింది. దానిని వెంటాడుతూ వెళ్ళగా అది పోయి పోయి తాను కలలో చూచిన శివలింగమున్న చోటికి తీసికొని వెళ్ళి అదృశ్య మయింది. వాని శరీరము పులకించి పోయింది.

స్వప్నమునందు స్వామిని సందర్శించిన ఆ బాలుడు తిన్నడు. తిన్నడు నాథనాథుడనే బోయఱని కుమారుడు. తల్లి తందె; ఉడుమూరు స్వగ్రామము. చిన్నానాటినుండియు ఆతని గుణములు తిన్నగా శివ భక్తి లక్షణోపమానములై ఉండుటచేత తల్లిదండ్రులు ఆతనికి తిన్నడని నామకరణం చేశారు.

దివ్య లింగమును కాంచి తిన్నడు సాష్టాంగ నమస్కార మొనర్చి - ''ఓ స్వామీ! ఈ కొండ కోనలో, పులులు, సింహములు తిరిగే ఈ భయంకర కాననములో నివసించుట నీ కెందులకు? నీకు ఆకలి అయితే కూడెవరు పెడతారు? మా ఉడుమూరు రావయ్యా! పందిమాంసం, లేడి మాంసం, దుప్పిమాంసం - ఇంకా రకరకాలైన పిట్టలను వండిపెడతాం. నివ్వరిప్రాలు, పుట్టతేనె, నేరేడుపండ్లు, కొండమామిడి పండ్లు, వెలగ పండ్లు - ఒకటేమిటి, ఎన్నో చెంచెతలు తెచ్చి నీకు పెడతారు. ఇక్కడ నీ కేమైనా ఇల్లా? ముంగిలియా? స్నేహితులా! చుట్టములా? భార్యా! పిల్లలా? ఎవ రున్నారు? నన్ను మన్నించి నా వెంటరా. నీవు రాకుంటే నిన్ను వీడి నేను వెళ్ళను. నీతోడిదే ఈ లోకమంతా. నన్ను కరుణించి నా వెంటరా స్వామీ!'' అని ప్రార్థించాడు తిన్నడు.

అతనితోపాటు వేటకై వచ్చిన బోయ కుమారు లంతా పందివెంట వెళ్ళిన తిన్నడు తిరిగి రాలేదే అని వెదకుతూ వచ్చి శివలింగం ముందు భక్తిపరవశుడై ఉన్న తిన్నని చూశారు. ''అన్నా! నిన్ను ఇక్కడకు తీసుకొచ్చిన వరాహ మేది? మమ్మల్ని కనులెత్తి ఎందుకు చూడవు? ఉలక్కుండా, పలక్కుండా కన్నీరు కార్చడానికి కారణ మేమిటి? వేటకై వచ్చి ఇక్కడ ఇట్లా నిలిచిపోతే తల్లిదండ్రు లెంత దుఃఖిస్తారు? నిన్ను వదలి మేము ఇళ్ళకు వెళ్ళము. ''మీ రందరూ వచ్చారు; మా తిన్నడేడీ?'' అని మీ తోబుట్టువులు, తల్లిదండ్రులు అడిగితే మే మేమి చెప్పము? పల్లెలో మమ్మల్ని తిట్టింపకుండా ఇక రా. ఎంత బతిమాలినా మాట్లాడవు. ఇక మేము ఎఱుకరేని కడ కరిగి విషయము చెపుతాం'' అని పాదాలు పట్టుకున్నారు.

తిన్నడు చిఱునవ్వు నవ్వుతూ ''అన్నలారా! ఈ లింగమే నాకు ప్రాణము. మీరు పల్లెకు వెళ్ళండి. నా వెంట ఇతడు వచ్చినదాకా నేను రాను. లేదా అతడున్న చోటనే నేనును ఉంటాను. నాకు చుట్టములు, తల్లిదండ్రులు, చెలులు అంతా ఈ దైవమే'' అని పలికి స్వామిని మనసునం దుంచుకొని, ఒళ్ళు మరచి ఉన్నాడు. కొంచెం సేపటికి లేచి ఎన్నాళ్ళనుంచియో ఈ అడవిలో శివుడు పస్తున్నాడని తలచి, ఆ దేవదేవునకు తృప్తి కావించడానికై అడవిలో తిరిగి ఒక వనవరాహాన్ని పడగొట్టి తెచ్చాడు నిప్పులో కాల్చి, దొప్పలలో మాంస ఖండాలు ఉంచి, దగ్గరే ఉన్న సువర్ణముఖీజలాన్ని పుక్కిళ్ళతో బట్టితెచ్చి స్వామి ముందు ఉంచి ఆరగించమన్నాడు. పరమేశ్వరుడు మాట్లాడలేదు. అతని కెంతో దుఃఖం కలిగింది, ''స్వామీ! మాంసం ముక్కలు బాగా కాలలేదా? లేకపోతే మాడిపోయినవా? రుచిగా లేవా? నీకు చాలవా? నీ వెందులకు తినడం లేదు. పార్వతీశ్వరా! చెప్పు. ఆకలిగా లేదా? నా భక్తిలో ఏమైన దోష మున్నదా? నీవు ఆరగించకపోతే ఇంక నా జీవ మెందుకు? శివా! నీ పాదములపై బడి నా ప్రాణములను విడతును'' అని వ్రాలి ఏడ్వ దొడగినాడు. తిన్నని భక్తికి సంతసించి పరమ శివుడు ప్రసన్నుడై వానిని ఆరగించాడు. ఈ విధముగా తిన్నడు స్వామిని సేవించుచుండగా రోజులు గడచిపోతున్నాయి.

నిత్యము పరమశివునకు క్షీరముతో అభిషేకమొనర్చు భక్తాగ్రగణ్యుడైన బ్రాహ్మణుడు ఆ మాంసపు ముక్కలను, ఎంగిలి పుల్లెలను చూచి మిక్కిలి దుఃఖించి ''స్వామీ! ఇదేమి అపరాధము? నేను నిత్యము కులదైవమని అలికి మ్రుగ్గులుపెట్టి వెళ్ళుచుండగా ఈ దొప్పలు రావడానికి హేతు వేమిటి? ఇప్పటికి ఏడురోజులనుండి ఈ ఎంగిలి మంగలము చూచుచున్నాను. దుర్మార్గుడు ఎవడైనా ఇట్లా చేస్తున్నాడా? కాక నీ సతీ సుతులు కానీ ఎవరైనా ఇలా చేస్తున్నారా? నీ కిది ఇష్టమా స్వామీ! చెప్పు? నీవు చెప్పకపోయినచో నా ప్రాణములు ఇక్కడే విడతును'' అని ప్రార్థించాడు. భక్తుని ఆర్తిని విని పరమశివుడు కరుణించి ''నన్ను చెంచు ఒకడు మహాభక్తితో పూజిస్తున్నాడు. ఆ కిరాతుని పూజ నంగీకరించాను. వాని భక్తి తాత్పర్య మెట్టిదో నీకు చూపింతును. నా వెనుక దాగి ఉండుము'' అని ఆజ్ఞ ఇచ్చాడు.

పరమానందంతో బ్రాహ్మణుడు శివలింగం వెనుక భాగంలో దాగి ఉన్నాడు. ఇంతలో తిన్నడు యథావిధి తినుబండారాలు తెచ్చి స్వామికి సమర్పించి తిన మన్నాడు. స్వామి ముట్టుకోలేదు. అంతేకాక ఆయన కంటివెంట కన్నీరు కారడం ప్రారంభించింది. కంటి నొప్పిచేత స్వామి కఱుకుట్లు తినడం లేదని భావించి ముక్కంటి కంటికిరక రకాలైన వైద్యం చేశాడు. ఎన్నిమందులు వేసినా లాభం లేకపోయింది. ఇకా కంటికి కన్నేమందు అనుకుని తిన్నడు, బాణంతో ఒక కనుగ్రుడ్డు పెకలించి రక్తం కారుతున్న స్వామి కంటికి అమర్చాడు. మరుక్షణంలో స్వామి రెండవ కంటినుండి రక్తస్రావం ప్రారంభ##మైంది. ''స్వామీ! ఇక భయపడేది లేదు. ఈ కంటితో కనుక, నీ బాధ తీరకపోతే ఇక నా ప్రాణాలే నీకు సమర్పిస్తాను'' అని చెప్పుకాలితో నెత్తురు కారుతున్న స్వామి కంటిని అదిమిపట్టి తన రెండవ కన్ను పెకలించబోయాడు.

వెంటనే త్రిశూలధారియై పార్వతీ సమేతముగా పరమ శివుడు సాక్షాత్కరించి ''నిలువు నిలువు'' మంటూ, వెనుకభాగమున దాగిఉన్న బ్రాహ్మణోత్తమునితో ''శివగోచరా! తిన్నని భక్తి మహిమను ఆద్యంతము చూచితివికదా! ఇతడు నా సద్భక్తుడు సుమా! నీ మనసునకు నచ్చినాడా!'' అని పలుకుచు వారిని వరము కోరుకొను డనెను. వా రిరువురు ఏక కంఠముతో మమ్ములను నీలో కలుపు కొనుమని ప్రార్థించారు. స్వామి వా రిరువురిని తనలో లీనము కావించుకొన్నాడు. నిష్కళంకమూ, నిర్మలమూ అయిన దృఢభక్తి మోక్షదాయక మైనది. భక్తికి కుల మత విచక్షణ లుండవు.

ప్రశ్నలు

1. శివుడు కలలో కనిపించి తిన్నని కేమి చెప్పెను?

2. శివుడు తిన్నని భక్తిని ఎట్లు పరీక్షించెను?

3. తిన్నడు శివుని ఎట్లు సేవించెను?

Neetikathamala-1    Chapters    Last Page