Neetikathamala-1    Chapters    Last Page

7

దైవస్తుతి

నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం

జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్‌

జమ్భారి ముఖ్యైరభిన్దితాభ్యాం

నమో నమ శ్శంకర పార్వతీభ్యామ్‌

(ఉమామహేశ్వరస్తోత్రం)

భర్తృహరి

విద్యనిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్‌

విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుcడున్‌

విద్య విశిష్టదై వతము విద్యకు సాటిధనంబు లేదిలన్‌

విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాcడు మర్త్యుcడే.

పురుషునకు విద్యయే రూపము. విద్యయే రహస్యముగ దాచి పెట్టబడిన ధనము. విద్యయే సకలభోగములను, కీర్తిని, సుఖమును కలుగజేయిను. విద్య గురువువలె అన్నింటిని బోధించును. పరదేశములందు చుట్టమువలె సహాయమొనర్చును. విద్యయేపరమాత్మ. విద్యరాజపూజితము. ఇట్టి విద్యలేనివాడు పశుతుల్యుడు.

చ్యవనుడు

ఇక్ష్వాకుని సోదరులలో శర్యాతి ఒకడు. అతడు ఆనర్త దేశమును పరిపాలించుచుండెను. ఒకనాడు శర్యాతి తన భార్యలను కుమార్తెలను వెంటపెట్టుకొని సపరివారంగా వేటకై అడవికి వెళ్లెను. శర్యాతి వేటకు వెళ్లగా అతని కుమారై సుకన్య చెలికతైలతో వనవిహారార్థమై బయిలుదేరింది. ఒకచోట అమెకు ఒక విచిత్రమైన వల్మీకము కనుపించింది. సూర్యోదయ, సూర్యాస్తమయములందు అందుండి ధూమము వెడలుచుండును. ఆ పుట్టకుగల కన్నులలో రెండు మిణుగురు పురుగులులాగా ఉన్న కాంతిని చూచెను. అందేమి గలదో ఆమె ఎరుగదు. బాల్య చాపల్యము వలన ఒక పుల్ల తీసుకొని ఆమెరిసే కన్నులను పొడిచినది. అందుండి బాధతోకూడిన ఆక్రోశ శబ్దమురాగా భయముతో వారందరు పరుగున తమ నివాసమునకు వెళ్లిపోయారు.

ఆ వల్మీకగర్భంలో చ్యవనుడను మహర్షి బహువత్సరములనుండి కఠోర తపము చేయుచుండగా అతని శరీరముపై పుట్టపెరిగెను. బాల్యచాపల్యముచే సుకన్య అతని రెండు కళ్లను పొడిచింది. ఆ మహర్షి బాధతో రెండు నయనములనుండి నెత్తురు కారుచుండగా పుట్టను బ్రద్దలు చేసుకొని బయటకు వచ్చాడు. అచట ఎవరును లేరు. నిష్కారణముగా ఇట్టి అకృత్యముచేసి పారిపోవుటను సహించలేకపోయాడు. తీవ్ర క్రోధముతో ఆప్రాంతములోని వారందరకు మలమూత్రబంధనం జరుగునట్లు శపించాడు. అంతే! శర్యాతి చక్రవర్తితోసహా వారందరు మలమూత్రములు బందింపబడి పొట్ట లుబ్బి బాధపడుచుండిరి. హఠాత్తుగా ఇట్టి దురవస్థకుగల కారణము ఏ మహాపురుషుని శాపమోతప్ప వేరుగాదని శర్యాతి గ్రహించాడు. ఆ పరిసరములో నున్న వారందరిని విచారించాడు. సుకన్య తాను చేసిన పనిని తండ్రికి నివేదించింది. వెంటనే శర్యాతి తన భార్యా పుత్రికలతో ఆ పుట్టవద్దకు వెళ్లాడు. అచటనే తేజస్సంపన్నుడు, దీర్ఝ తపస్సువలన శుష్కించిన అస్థిపంజరమువంటి దేహముకలవాడు, ప్రాప్తించిన అంధత్వమువలన బాధపడుచున్న జటాధారియైన చ్యవన మహర్షిని చూచాడు. వెంటనే భార్యాపుత్రికలతో ఆ మహర్షికి నమస్కరించాడు. మహర్షి దురవస్థనుచూచి తన కుమారై చేసిన అకృత్యమును చెప్పి క్షమాభిక్ష నర్థించాడు. ''రాజా! ప్రజలను కన్నబిడ్డలవలె పాలించుచు ఋష్యాశ్రమములను రక్షింపవలసిన రాజులవలననే మాకు ఇక్కట్లు సంభవించాయి. నిన్ను ఎట్లు క్షమింపవలెను?'' అని ఋషి పలుకగా శర్యాతి మహారాజు భయముతో గడగడ వణకెను. చ్యవనుడు మహాతపశ్శక్తి సంపన్నుడు. ఇంద్రాది దేవతలు ఆయన ఎడ భయభక్తులతో మెలగుదురని ఆత డెరుగును. అందుచే దోసిలి యొగ్గి ''మునీశ్వరా! అజ్ఞానముతో చేసిన ఈ దొసగును తమరు క్షమించనిచో మాకు ఎవరు దిక్కు'' అని దీనంగా ప్రార్థించెను. అంత చ్యవన మహర్షి -''రాజా! అపకృతికి నిష్కృతిగా నీ కుమార్తె సుకన్యను మాకిచ్చి వివాహము చేయుము. ఆమె సాయముతో నేను నా నిత్యకృత్యమును నెరవేర్చుకొందును'' అని చెప్పెను. శర్యాతికి మరో మార్గం లేదు. సుకన్యా శర్యాతులు అందులకు అంగీకరింపగా ఆ మహర్షి తన శాపమును ఉపసంహరించెను. సుకన్యను చ్యవనునకిచ్చి వివాహము కావించిన అనంతరము శర్యాతి రాజధానికి వెడలెను.

రాజపుత్రి ఐన సుకన్య వెంటనే మునిపత్ని వేషము ధరించి భర్తను సేవించుచుండెను. శ్రద్ధాభక్తులతో ఆమె తన భర్త అవసరములు గ్రహించి అడుగకుండగనే ఆ యా పనులుచేసి అతనికి ప్రియము చేకూర్చుచుండెను. సుకన్య భక్తితత్పరతల యెడ చ్యవనునకు ఆనందము కల్గెను. ఒకనాడు అశ్వినీ దేవతలు చ్యవనుని ఆశ్రమమునకు వచ్చిరి. అతిథిపూజ జరిగిన తర్వాత చ్యవనుడు తన అంధత్వమును, వార్థక్యమును, భార్య ¸°వనమును తలపోసి తనకు ¸°వనమును ప్రసాదింపుడని దేవవైద్యులైన అశ్వినీ దేవతలను కోరెను. అందుకు ప్రతిఫలంగా నాటివరకు వారు పొందలేని యజ్ఞహవిర్భాగములను వారి కిప్పింతుననెను. అశ్వినీ దేవతలు ఆనందభరితులై అందులకు అంగీకరించిరి. వారు తమ శక్తితో చ్యవనుని ¸°వనునిగాను సుందరాంగునిగాను చేసివెడలిపోయిరి. సుకన్య ఆనందభరితురాలై భర్తతో సుఖముగా నుండెను.

అశ్వినీదేవతలకిచ్చిన వాగ్దానమును చెల్లించుటకుగాను చ్యవనుడు ఒక యజ్ఞము ప్రారంభించెను. ఆహూతుడైన దేవేంద్రుడు చ్యవనుడు సమర్పించిన హవిర్భాగము స్వీకరించలేదు. చ్యవనుని నిర్ణయాన్ని దిక్కరించాడు. చ్యవనుడు కుపితుడై యజ్ఞకుండమునుండి దేవేంద్రుని సంహరించుటకై ఒక రాక్షసుని సృష్టించెను. వజ్రాయుధము ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోయినది. త్రిమూర్తులు ఇంద్రుని సంరక్షింపరైరి. తుదకు ఇంద్రుడు చ్యవనునే ఆశ్రయించెను. చ్యవనుడు ఆ రాక్షసుని ఉపసంహరింపగా దేవేంద్రుడు ఆనందించి ఆశ్వినీ దేవతలకు యజ్ఞ హవిర్భగము లందుటకు అంగీకరించెను. తపశ్శక్తిని మించిన శక్తి ఈ సృష్టిలో లేదు.

ప్రశ్నలు :

1. సుకన్య ఎవరు? ఆమె చేసిన ఆకృత్యమెట్టిది?

2. అశ్వినీదేవతలకు చ్యవను డేమి చెప్పెను?

3. అశ్వినీదేవతలకు హవిర్భాగము లెట్లు వచ్చెను?

Neetikathamala-1    Chapters    Last Page