Neetikathamala-1    Chapters    Last Page

నీతికథామాల-1

(మన వారసత్వం)

శ్రీ జి.ఎస్‌.రామశాస్త్రి

ప్రచురణః

హిందూ ధర్మ రక్షణ సంస్థ

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

1985

శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు

జగద్గురు శంకరాచార్య

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి

ముందుమాట

'నీతి లేనివాడు కోతికంటె బీడు.'

నీతి మార్గంలో నడచినప్పుడే మానవత్వం సార్థక మవుతుంది. అందుకే మన

ప్రాచీన గ్రంథాలలో కథాముఖంగా ఎన్నో చక్కని నీతులు బోధించ బడ్టాయి. భర్తృహరి మొదలైన మహాకవు లెందరో శతకరూపంలో నీతులను అందించారు. తెలుగులో 'సుమతి శతకం' వంటి రచనలు నీతిదాయకాలై బహుళ ప్రచారంలో ఉన్నాయి.

విద్యలలో అధ్యాత్మ విద్య తన స్వరూపమని పరమాత్మ పేర్కొన్నాడు. అధ్యాత్మ తత్త్వంలో ఆరితేరిన మహర్షులకు భారతావని పుట్టినిల్లు. మన దేశగౌరవం ఆధ్యాత్మిక సంపత్తి మీదనే అధారపడి ఉంది. మానవులు ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే బాల్యంలోనే నైతిక విధానం అనుసరించాలి. నీతిమాలి చరించేవాడు సుఖశాంతులను ఎన్నటికీ పొందలేడు. అందువల్లనే మహనీయులు నీతిదాయకమైన విద్యకు ప్రాధాన్యమిచ్చారు.

'నీతికధామాల' (మన వారసత్వం) అనే ఈగ్రంథం నీతి బోధకాలైన చిన్నచిన్న కథలతో ఒప్పారు తున్నది. రెండు భాగాలుగా ఉన్న ఈపుస్తకంలో సంపుటికి నలభై వంతున మొత్తం ఎనభై కథ లున్నాయి.

శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులు, జగద్గురు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీస్వామి వారి

ఆదేశము ననుసరించి శ్రీ జి. ఎస్‌. రామశాస్త్రి గారు ఈ పొత్తములు రచించారు. ఇందు

రామాయణ భారత భాగవతాది గ్రంథాలలోని కథలు సులభ శైలిలో వివరించ బడినాయి. ప్రతి కథలోను పిల్లల హృదయాలకు హత్తుకొనేటట్లు నీతులు బోధించడం జరిగింది.

ఈ నీతికథామాలను 1975 లో ఆర్గనైజేషన్‌ ఫర్‌ మోరల్‌ ట్రైనింగ్‌, హైదరాబాదు వారు ప్రచురించారు. హిందూ ధర్మ రక్షణ సంస్థలో ప్రచారకులుగా ఉన్నవారి ప్రచార కార్యక్రమానికి ధార్మిక సాహిత్యం అవసరం. ప్రస్తుత గ్రంథం ఈ విషయంలో ఎంతైనా ఉపకరిస్తుందన్న సత్సంకల్పంతో శ్రీస్వామివారు దీని పునర్ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానంవారి హిందూ ధర్మ రక్షణ సంస్థను పురికొల్పారు. శ్రీవారి ఆదేశం ఔదల ధరించి ధర్మరక్షణ సంస్థ ఈ సురుచిర కథామాలను పాఠకలోకానికి సంతోషంతో సమర్పిస్తున్నది.

ధర్మ రక్షణ సంస్థ ధర్మప్రచారానికై ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. భజనలు, హరికథలు, ఉపన్యాసాలు, గీతాపారాయణలు, పురాణ ప్రవచనాలు, శ్రీ వేంకటేశ్వర వైభవాది చలనచిత్ర ప్రదర్శనలు-ఈ విధంగా కార్యక్రమాలు వివిధ శాఖలద్వారా నిర్వహించ బడుతున్నాయి.

ముఖ్యంగా బాలబాలికల హృదయాలలో ధర్మబీజాలు నాటవలెనన్న తలంపుతో పురాణ ప్రబోధ పరీక్షా ప్రణాళిక ఆంధ్రరాష్ట్రం అన్ని జిల్లాలలో ప్రవేశ పెట్టడం జరిగింది. వేలకొలది విద్యార్థులు ఏటేట ఈ పరీక్షల్లో సమధికోత్సాహంతో పాల్గొంటున్నారు. మున్ముందు ఈపరీక్షా ప్రణాళికను విస్తరింప జేయాలని ఆశిస్తున్నాము. ఆ విస్తరణలో ఈ నీతి కథామాల ఉపయోగపడుతుం దనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

గ్రంథముద్రణలో తోడ్పడిన విద్వత్కవి శ్రీ ముదివర్తి కొండమా చార్యులు, శ్రీ ములుకుట్ల రామకృష్ట శాస్త్రి, ఎం, ఏ., గారలకు కృతజ్ఞతలు.

తిరుపతి సముద్రాల లక్ష్మణయ్య,

మకర సంక్రాంతి కార్యదర్శి,

14-1-85 హిందూ ధర్మ రక్షణ సంస్థ.

Neetikathamala-1    Chapters    Last Page