Sri Padma Mahapuranam-I    Chapters   

ద్వాదశోధ్యాయః

సోమ (చంద్ర) వంశ వర్ణనమ్‌

భీష్మ ఉవాచ :

సోమవంశః కథం జాతః కథయాత్ర విశారద | తద్వంశే కేతు రాజానో బభూవుః కీర్తివర్ధనాః || 1

పులస్త్య ఉవాచ !

అదిష్టో బ్రహ్మణా పూర్వ మత్రి సర్గ విధౌపురా | అనంతరం నామ తపః సృష్ట్యర్థః తప్తవాన్విభుః || 2

యదానందకరం బ్రహ్మ భగవన్‌ క్లేశనాశనమ్‌ | బ్రహ్మరుద్రేంద్ర సూర్యాణా మభ్యంతర మతీన్ద్రియమ్‌ || 3

శాన్తిం కృత్వాత్మ మనసా తదత్రిః సంయమే స్థితః | మాహాత్మ్యం తపసోవాపి పరమానందకారకమ్‌ || 4

యస్మాద్వంశపతిః సార్థం సమయే తదధిష్టితః | తం దృష్ట్వాచ సోమేన తస్మాత్సోమోభవద్విభుః || 5

సోమ (చంద్ర) వంశ వర్ణనము :

సోమ (చంద్ర) వంశ మెట్లేర్పడినది? దానికి పేరుదెచ్చిన రాజులెవ్వరని భీష్ము డడుగ పులస్త్యు డనియె మున్ను మున్ముందుగ బ్రహ్మచే నత్రిమహర్షి సృష్టిసేయమని యాజ్ఞాపింపబడి సృష్టికొరకు అనంతరమును తపస్సు సేసెను. (అనంతరమనగా నెడదెరపిలేనిదన్నమాట) ఆ తపస్సునకు లక్ష్యము బ్రహ్మమే. బ్రహ్మరుద్రేంద్రాదు లందఱిలో నున్నది. యింద్రియములకు గోచరించనిది కేవలానందము సర్వక్లేశనాశనమునైనదా బ్రహ్మము. సోముడు నియమమూని మనశ్శాంతి సమకూర్చుకొని పరమానందకరమను తపస్సుయొక్క ప్రభావము గుర్తించి అనుకూల సమయ మరసి తపో నిష్ఠుడయ్యెను.

అథ సుస్రావ నేత్రాభ్యాం జలం తత్రాతి సంభవమ్‌ | ద్యోత యద్విశ్వ మఖిలం జ్యోత్స్నయాసచరాచరమ్‌ || 6

తద్దశో జగృహుస్తత్ర స్త్రీరూపేణా సహృచ్ఛయాః | గర్భో భూత్వోదరే తాసాం స్థితః సోప్యత్రి సంభవః || 7

అశాశ్చ ముముచుగర్భ మశక్తా ధారణ తతః | సమాదాయాథ తం గర్భేమేకీకృత్య చతుర్ముఖః || 8

యువాన మకారోద్‌ బ్రహ్మా సర్వాయుధధరం నరమ్‌ | స్యందనే థ సమస్తేన వేదశక్తిమయే ప్రభుః || 9

ఆరోప్యలోక మనయదాత్మీయం స పితామహః | తతో బ్రహ్మర్షిభిః ప్రోక్తం హ్యస్మత్స్వామీభవ త్వయమ్‌ || 10

ఋషిభి ద్దేవ గంధర్వై రప్సరోభి స్తధైవచ | స్తూయమానస్య తస్యా భూ దధికం మహ దంతరమ్‌ || 11

తేజో వితానా దభవ ద్భువి దివ్యౌషధీగణః | తద్దీప్తి రధికా తస్మా ద్రాత్రౌ భవతి సర్వదా || 12

తే నౌషధీశః సోమోభూద్‌ ద్విజేష్వపి హి గణ్యతే | వేదధామా రసశ్చాయం యదిదం మండలం శుభమ్‌ || 13

అటుపై నాతని కండ్లనుండి నీరుగారెను. ఆ నీరు వెన్నెలయై తన కాంతిచే చరాచరప్రపంచము నుద్దీపింప జేసెను. దిశలు స్త్రీరూపముగొని కామవశ##లై యా తేజస్సును స్వీకరించిరి. ఆ తేజస్సు వారి గర్భములందు శిశురూప మందెను. దిక్కాంతలది బరువైతోప మోయలేక దిగిచికొనినంత చతుర్ముఖ బ్రహ్మ యా తేజస్సునంత నేకముసేసి సర్వాయుధధరుడైన యొక యువకుని గావించి తన చేయూతనిచ్చి వేదశ క్తిమయమగు రథముపై యోక్కించి తన లోకము జేర్చెను. అంతట మహర్షులా పిల్లవాడు మాకు రాజేనాపుతమనికొనిరి. ఋషులు దేవగంధర్వాప్సరోగణము స్తుతింప నా తేజస్సినుమదించి సర్వాంతరవ్యాప్తమయ్యెను. దానినుండి భూమిపై నోషధీగణ ముదయించినది. అందుచేతనే మూలికలు రాత్రివేళ మిగుల తేజోవంతములగును. అదిమొదలు సోము డోషధీశుడని ద్విజరాజనియు గణింపబడుచున్నాడు.

క్షీయతే వర్థతేచైవ కృష్ణే శుక్లేచ సర్వదా | వింశతించ తథాసప్త దక్షః ప్రాచేతసో దదౌ || 14

రూపలావణ్యసంయుక్తా స్తసై#్మ కన్యాః సువర్చసః | తతః శక్తి సహస్రాణాం సహస్రాణి దశైవతు || 15

తపశ్చకార శీతాంశు ర్విష్ణు ధ్యానైక తత్పరః | తతస్తుష్టశ్చ భగవాం స్తసై#్మ నారాయణో హరిః || 16

పరం వృణీష్వ చోవాచ పరమాత్మా జనార్దనః | తతో వవ్రే వరం సోమః శక్రలోకే యజా మ్యహమ్‌ || 17

ప్రత్యక్షమేవ భోక్తారో భవన్తు మమ మన్దిరే | రాజసూయే సురగణా బ్రహ్మాద్యాయే చతుర్విధాః || 18

రక్షపాలః సురైరోస్మాకమాస్తాం శూలధరో హరః | తథేత్యుక్తః సమాజహ్రేరాసూయంతు విష్ణునా || 19

అంతేకాదితడు వేదధాముడు. అతని తేజస్సుగాగల వేదమే. వేదములకు ధామము (నివాసము) నై రసస్వరూపుడు నైనాడు. ఈ చాంద్రామండలము కృష్ణపక్షమును క్షీణించును శుక్లపక్షమందు వృద్ధిచెందును. దక్షు డీతనికి రూప లావణ్యసంపన్నలు వర్చస్వినులునైన యిరువదియేడుగురు కన్యల నిచ్చెను. అటుపైని పదివేలశక్తులను గూడ యితని కిచ్చెను. ఆ శీతాంశువు (చలివెలుగు) విష్ణుధ్యానతత్పరుడై తపస్సు చేయ నతనియెడ ప్రసన్నుడై నారాయణుడు భగవంతుడు హరి వరము కోరుమన నింద్రలోకమున రాజసూయ యజ్ఞము సేసెదను అందు బ్రహ్మాదిదేవతలు నాల్గు విధాలవారు నా యింట ప్రత్యక్షముగా నేనిచ్చు హవిర్భాగము లారగింపవలయును. దేవతలు నా యజ్ఞరక్షకులుగ గావలెను. శూలధరుడు (హరుడు) వారికి పాలకుడుగనుండవలెనని కోరిన హరి సరియనెను. అవ్వల చంద్రుడు రాజసూయ మొనరించెను.

హోతా త్రిర్భృగు రధర్యురుద్గాతాచ చతుర్ముఖః | బ్రహ్మత్వ మగమత్తస్య ఉపద్రష్టా హరిః స్వయమ్‌ || 20

సదస్యాః సర్వ దేవాస్తు రాజసూయ విధిస్మృతః | వసవోధ్వర్యవస్తద్వ ద్విశ్వేదేవా స్తథైవచ || 21

త్రైలోక్యం దక్షిణాతేన ఋత్విగ్భ్యః ప్రతిపాదితా |

సోమః ప్రాప్యథ దుష్ప్రాప్య మైశ్వర్యం సృష్టి సత్కృతమ్‌ || 22

సప్తలోకై క నాథత్వం ప్రాప్తస్స్వ తపసా తదా || 23

ఇం దత్రి హోత. భృగు వధ్వర్యుడు. చతుర్ముఖుడుద్గాత. విష్ణువు స్వయముగ ఉపద్రష్ట యయ్యెను. సర్వదేవతలు సదస్యులు. వసువులు విశ్వేదేవులు నధ్వర్యులయిరి. యజ్ఞదక్షిణగా సతడు ముల్లోకములిచ్చెను. దాన సోముడు అశేషసృష్టియు మెచ్చుకొను నైశ్వర్యమును బొంది, సప్తలోకాధినాధుడు నయ్యెను.

కదాచిదుద్యాన గతామపశ్య దనేక పుష్పాభరణోప శోభామ్‌ |

బృహన్నితంబస్తనభార భేదాం పుష్పావభంగేప్యతి దుర్పలాంగీమ్‌ |

భార్యాంచ తాందేవగురో రనంగ బాణాభిరామాయత చారునేత్రామ్‌ || 24

తారాం సతారాధిపతిః స్మరార్తః కేశేషు జగ్రాహ వివి క్తభూమౌ |

సాపి స్మరార్తా సహతే నరేమే తద్రూప కాంత్యా హృతమానసైవ || 25

చంద్రుడు తారను జూచి మోహించుట :

ఒకతఱి నుద్యానమందు పూలుముడిచికొని తొడపులు దొడిగికొని అద్భుత విలాసముతో పూలుగోయుచు బృహన్నితంబ స్తనభారమున నలసి సొలసి యోపిక సెడి యెల్లబోయిన దేవగురు నిల్లాలిం దారను దారాధిపతి జూచి కామార్తుడై యెవ్వరు లేకుండజూచి జడవట్టుకొన అవిడయు నాతని యందమునుకోరి గాంతికిని మురిసి మోహపడి యతనితో గ్రీడించెను.

చిరం విహృత్యాథ జగామతారాం విధుర్గృహీత్వా స్వగృహం తతోపి |

న తృప్తిరాసీ త్స్వగృహేపి తస్య తారానురక్తస్య సుభాగమేషు || 26

బృహస్పతి స్తద్విహాగ్ని దగ్ధస్తద్ధ్యాసనిష్ఠైకమనా బభూవ |

శశాక శాపంనచ దాతుమసై#్మన మంత్ర శస్త్రాగ్ని విషైరనేకైః || 27

తస్యాపకర్తుం వివిధైరుపాయైర్నైవాభిచారైరపివాగధీశః |

స యాచమాయాస తతస్తు దేవం సోమం స్వభార్యార్థ మనంగ తప్తః || 28

సయాచ్యమానోపి దదౌన భార్యాం బృహస్పతేః కామవశేనమోహితః |

మహేశ్వరేణాథ చతుర్ముఖేన సాధ్వైర్మరుద్భిః సహలోకపాలైః ||29

దదౌ యదా తాం న కథంచి దిందు స్తదా శివః క్రోధవరో బభూవ |

యో వామదేవః ప్రథితః పృధివ్యామనేక రుద్రార్చిత పాదపద్మః|| 30

తతః సశిష్యో గిరిశః పినాకీ బృహస్పతేః స్నేహవశానుబద్ధః |

ధనుర్గృహీత్వాజగవంపు రారిర్జగామ భూతేశ్వర సిద్ధ జుష్టః || 31

యుద్ధాయ సోమేన విశేషదీప్త తృతీయ నేత్రానల భీమ వక్త్రః |

నహైవ జగ్ముశ్చ గణశ్వరాణాం వింశాధికా షష్టిరథోగ్రమూర్తిః || 32

యక్షేశ్వరాణాం సగణౖ రనేకైర్యుతోన్వగా త్స్యందన సంస్థితానామ్‌ |

వేతాల యక్షో రగకిన్న రాణాం పద్మేన చైకేన తథార్బుదానామ్‌ || 33

లక్ష్మైస్త్రిభి ద్ద్వాదశభీ రథానాం సోమోప్యగా త్తత్ర వివృద్ధమన్యుః |

శ##నైశ్చరాంగారకవృద్ధ తేజా నక్షత్రదైత్యాసురసైన్యయుక్తః || 34

ఆమెను నిజగృహమ్మునకుం దీసికొనిపోయి యెంతోకాలము విహరించియుం దాన గలుగు సుఖానుభవములం దృప్తిసెందడయ్యె. బృహస్పతియు దద్విరహాగ్నికిం బొగల తదేక ధ్యాననిష్ఠుడయ్యెను. అయినను జంద్రుని శపింప లేడయ్యె. మంత్ర శాస్త్రములచే విషముచే నగ్నిచే వివిధాభిచారిక ప్రక్రియలచే నే యుపాయములచే వాని కే యపాయము సేయనేరక వాక్పతి మన్మథతాపమొంది యా దేవుని సొమునిం దన భార్య నిమ్మని యడిగికొనెను. అతడుం గామవశుడై యాతని యిల్లాలి నాతని కీయడయ్యె. మహేశ్వరుడు ఆమీద చతుర్ముఖుడు లోకపాలురతోగూడ సాధ్యులు మరుత్తులు వచ్చి యాచించినను నీయకున్నంత శివుడుగ్రుడయ్యెను. అతడు వామదేవుడను పేరుగన్నవాడు. అనేక రుద్ర లాతని పాదపద్మములం గొలుచుచుందురు. ఆ స్వామి గిరీశుడు బృహస్పతితోడి స్నేహమునకు బద్ధుడై శిష్యులతో పినాకమును శూలమును అజగవమ్మమను విల్లుం గొని భూతేశ్వరసిద్ధసంఘముతో గూడ మిగుల నుద్దీపించు మూడవ కంటి మంటలం జడువుకొలుపు మొగముతో నుగ్రమూర్తియై యెనుబదిమంది ప్రమథగణాధిపతులతో రధారూఢులైన యక్షేశ్వరగణములతో పద్మప్రమాణు అర్బుదప్రమాణులునగు బేతాళ యక్ష నాగ కిన్నెరులతో నా చంద్రునిపై కి నడచెను. సోముండును ముప్పది యారు లక్షల రథములతో కోపోద్రిక్తుడై శనియుం గుజుడునుం తోడై తన తేజముం బెంపొందింప నక్షత్ర దైత్యాసుర సైన్వములతోడ రుద్రునిపైకి దండెత్తెను.

జగ్ముర్భయం సప్త తథైవలోకా ధరా వనద్వీప సముద్రగర్భాః |

స సోమమేవాభ్యగమ త్పినాకినీ గృహీత దీప్తాస్త్ర విశాల వహ్నిః || 35

అథాభవద్భీషణ భీమ సోమసైన్యద్వయస్యాథ మహాహవోసౌ |

అశేష సత్వక్షయకృత్ప్రవృద్ధ స్త్రీక్షప్రధానోజ్వలనైక రూపః ||

శ##సై#్త్ర రథాన్యోన్య మశేష సైన్యం ద్వయోర్జగామక్షయ ముగ్ర తీక్ష్నైః |

వతన్తి శస్త్రాణి తథోజ్వలాని స్వర్భూమి పాతాలమలం దహంతి || 37

రుద్రః క్రోధాద్‌ బ్రహ్మశిరో ముమోచ సోమోపి సౌమాస్త్ర మమోఘవీర్యమ్‌ |

తయోర్నిపాతేన సముద్ర భూభ్యోరథాంతరిక్షస్య భీతిరాసేత్‌ || 38

తదాను యుద్ధం జగతాం క్షయాయ ప్రవృద్ధమాలోక్యపితామహోపి |

తతః ప్రవిశ్యాథ కథంచిదేవ నివార యామాస సురైః సహైవ || 39

అకారణం కింక్షయ కృజ్జనానాం సోమ త్వయాపీదమ కార్యకార్యమ్‌ |

యస్మా త్పరస్త్రీ హరణాయ సోమ త్వయా క్పతం యుద్ధమతీవ భీమమ్‌ || 40

పాపగ్రహస్త్వం భవితా జనేషు పాపోస్యలం వహ్ని ముఖాశినాం త్వమ్‌ |

భార్యామిమామర్పయ వాక్పతేస్త్వం ప్రమాణయన్నేవ మదీయ వాచమ్‌ || 41

తధేతిచోవాచ హిమాంశుమాలీ యుద్ధాదపాక్రామదతః ప్రశాంతః |

బృహస్పతిస్తామథ గృహ్యతారాం హృష్టో జగామ స్వగృహంచ రుద్రః || 42

సప్తలోకములు హడలిపోయినవి. భూమి వనములు ద్వీపసముద్రములతో గంపించినది. పరమశివు డగ్ని జ్వాలలం చిమ్ము నస్త్రములం గొని సోమునిపైకేగెను. భీమేశ్వరునకు సోమునకు తీవ్రయుద్ధము జరిగెను. భయంకరాస్త్రములు కుభయ సైన్యములు క్షయించెను. అపుడు ప్రజ్వలించుచు నస్త్రములు పాతాళము నుండి స్వర్గముదాక గల లోకము లం దహించెను. రుద్రుడు బ్రహ్మశిరోనామకమును సోముడు సోమాస్త్రమును వదలిరి. అది పైబడినంత సముద్రములు భూమి అంతరిక్షమును భయభ్రాంతములయ్యెను. జగత్‌క్షయము సేయ విజృంభించిన యమ్మహోగ్ర సమరముంగని బ్రహ్మ దేవతలతో నట జొచ్చి దానిని వారించెను. అకారణముగ నీ జనక్షయమేల చంద్రా ! నీవేని యీ కూడనిపని యేల సేసెదవు. నీవు పరస్త్రీని హరించుటయేకాక యందుల కింత పోరొనరింతువా ! అగ్నిముఖమున నీవు లోకులం దీవు పాపగ్రహమౌదువు. వహ్నిముఖులలో (దేవతలలో) నీవు పాపాత్ముడవౌదువు. నా మాటను ప్రమాణముగ గైకొని బృహస్పతి భార్య నతనికి సమర్పింపుము. అన సరియని చలివెలుగు చల్లబడి పోరునుంది తొలగెను. సురగురువు తారను గొని సంతోషముతో నింటికిని రుద్రుడు కైలాసమునకునుం జనిరి.

పులస్త్య ఉవాచ :

తతః సంత్సరస్యాంతే ద్వాదశాదిత్య సన్నిభః | దివ్య పీతాంబరధరో దివ్యాభరణభూషితః || 43

తారోదర వినిష్కాంతః కుమారః సూర్య సన్నిభః | సర్వార్థశాస్త్రవిద్విద్వాన్హస్తి శాస్త్రప్రవర్తకః || 44

నామ యద్రాజపుత్రోర్థ విశ్రుతో రావైద్యకః | రాజ్ఞః సోమస్య పుత్రత్వా ద్రాపుత్రో బుధః స్మృతః || 45

జనానాంతు సతేజాంసి సర్వాణ్యవాక్షిపద్‌ బలీ | బ్రహ్మాద్యాస్తత్రచాజగ్ము ర్దేవా దేవర్షిభిః సహ || 46

బృహస్పతి గ్బహే సర్వే జాతకర్మోత్సవే తదా | ప్రపచ్ఛస్తే సురాస్తారాం కేన జాతతః కుమారకః || 47

తతః సా లజ్జితా తేషాంన కించిదవదత్తదా | పునః పునస్తదా పృష్టా లజ్జయన్తీ పరాంగనా || 48

సోమస్యేతి చిరాదాహతతో గృహ్ణద్విధుః సుతమ్‌ | బుధ ఇత్యకరో న్నామప్రాదాజ్యం చ భూతలే || 49

అభిషేకం తతః కృత్వా ప్రదాన మకరోద్విభుః | గ్రహమధ్యం ప్రదాయాథ బ్రహ్మాబ్రహ్మర్షిభిర్యుతః || 50

వశ్యతాం సర్వభూతానాం తత్రైవాంతరధీయత | ఇలోదరేచ ధర్మిష్ఠం బుదః పుత్రమజీజనత్‌ || 51

ఒక సంవత్సరమునకు ద్వాదశాదిత్యులకు సమానుడు దివ్య పీతాంబరధారి దివ్యాభరణభూషితుడు సూర్యువంటివాడు సర్వశాస్త్రస్జుడు విద్వాంసుడు గజశాస్త్రకర్త రాజైన సోముని పుత్రుడుగావున రాజపుత్రుడను సార్థక నామముంగొని రాజవైద్యుడునైన తారా గర్భమునుండి వెలువడెను సర్వజనుల తేజస్సుల నతడు పుణికిపుచ్చుకొనెను. బ్రహ్మాదిదేవతలు బ్రహ్మర్షులు బృహస్పతి గృహమందు జన్మోత్సవమునకు (బారసాలకు) వచ్చిరి. ఆ వచ్చినవారెవరికి వీడు పుట్టినాడని తార నడిగిరి. ఆ రమణీమణి సిగ్గువడి వారికేమియుం బలుకదయ్యె. వారు మరల మరల నడుగ బిడియపడుచు చాలసేపటికి వీడు సోముని వాడనెను. అటుపైని సోముడా కొడుకుం జేకొనెను. బుధుడని పేర్వెట్టెను. అవనిపై రాజ్యభిషేకముం జేసి లోకమునం బ్రధానునిగ నొనరించెను. ఆపై బ్రహ్మ బ్రహ్మర్షుల నడుమ గ్రహమధ్యస్థానము నొసంగి భూతములెల్ల గనుచుండ జాటయ్యెను. ఆ బుధు డిల యను నామెయందు ధర్మనిష్ఠుడయిన కొడుకుం గనెను.

అశ్వమేధ శతం సాగ్రమ కరోద్య స్స్వతేజసా | పురూరవా ఇతి ఖ్యాతః సర్వలోక నమస్కృతః || 52

హిమవచ్ఛిఖరే రమ్యే సమారధ్యపితామహమ్‌ | లోకైశ్వర్యమగా ద్రాజ న్సప్తద్వీపపతి స్తదా || 53

కేశి ప్రభృతయో దైత్యాస్తద్‌ భృత్యత్వం సమాగతాః ఉర్వశీయస్య పత్నీత్వమగమద్రూపమోహితా || 54

సప్తద్వీపా వసుమతీ నశైలవన కాననా | ధర్మేణ పాలితా తేన సర్వలోక హితైషిణా || 55

చామర గ్రహణా కీర్తిః స్వయం చైవాంగవాహికా | బ్రహ్మప్రసాదా ద్దేవేంద్రో దదావర్థాసనం తదా || 56

ధర్మార్థ కామాన్‌ ధర్మేణ సమవేతోభ్య పాలయత్‌ | ధర్మార్థ కామా స్తం ద్రష్టుమా జగ్ముః కౌతుకాన్వితాః || 57

జిజ్ఞాసవస్తచ్చరితం కథం పశ్యతినః సమమ్‌ | భక్త్యా చక్రే తతస్తేషా మర్ఘ్య పాద్యాదికం తతః || 58

అససత్రయ మానీయ దిప్యం కనక భూషణమ్‌ | నివేశ్యాథా కరో త్పూజా మీషద్ధర్మేధికాం పునః || 59

జగ్మతుస్తౌచ కామార్థా వతి కోపం నృపం ప్రతి | అర్థః శాపమదాత్తసై#్మ లోభాత్త్వన్నాశ##మేష్యసి || 60

అతడే పురూరవుడు, తన తేజముతో వేయి అశ్వమేథముల సమగ్రముగ నాచరించెను. సర్వలోక వంద్యుడయ్యెను. చక్కని హిమాలయ శిఖరమందు బ్రహ్మను సేవించి సప్తద్వీపాధిపతియై లోకేశ్వరత్వమును బొందెను. కేశి మొదలగు దైత్యులతనికి భృత్యులైరి (దాసులైరి). అతని యందమునకు మోహపడి యూర్వశి యతని భార్య యయ్యెను. సర్వలోక హితార్ధియగు నతడు సప్తద్వీప సహితయైన వసుమతిం బాలించెను. కీర్తికాంత స్వయముగ జామరము చేకొని యాతనికి వీచినది. అతనికి వాహనము నయ్యెను (అతని నెత్తికొన్నదన్నమాట). బ్రహ్మ యనుగ్రహముచే నింద్రుడతని కర్ధాననమిచ్చెను. ధర్మముతో నుండి ధర్మార్ధకామములను బురుషార్ధముల జక్కగ బరిపాలించెను. అవి స్వరూపము గొని మమ్ముల నతడెంత సమభావమున జూచుచున్నాడోయని యాతని చరిత్రముం జూడముచ్చటగొని యాతని దరికి వచ్చినవి. అతడు వారికి భక్తితో నర్ఘ్యపాద్యాది సపర్యలిచ్చి మూడాసనములం గూర్చుండబెట్టి దివ్యాభరణము లొసంగి పూజించెను. అందు ధర్మ పురుషార్ధ మెక్కువ పూజ నొందెను. అది చూచి అర్ధ కామపురుషార్ధమూర్తు లిద్దరు ఆ ఱని యెడ మిక్కిలిగ నాగ్రహించిరి. అర్ధపురుషార్ధమూర్తి నీవు లోభమువలన నాశమందెదవని శపించెను.

కామోప్యాహతతోన్మాదో భవితా గంధమాదనే | కుమార వన మాశ్రిత్య విమోగాచోర్వశీభవత్‌ || 61

ధర్మోప్యాహ చిరాయుస్త్వం ధార్మికశ్చ భవిష్యసి | సంతతిస్తవ రాజేంద్ర యావదాచంద్రతారకమ్‌ || 62

శతశో వృద్ధి మాయాతి ననాశంభువియాస్యతి | షష్టిం వర్షాణిచోన్మాద ఊర్వశీ కామసంభవః || 63

అచిరాదేవ భార్యాపి పశ##మేష్యతి చాప్సరాః | ఇత్యుక్త్వా తర్దధుః సర్వే రాజా రాజ్యం తదాన్వభూత్‌ || 64

అహన్యహని దేవేంద్రం ద్రష్టుం యాతి పురూరవాః | కదాచిదారుహ్య రథం దక్షిణాంబరచారిణా || 65

సార్ధం శ##క్రేణసోపశ్వ న్నీయమానామథాంబరే | కేశినా దానవేంద్రేణ చిత్రలేఖా మథోర్వశీమ్‌ || 66

తం వినిర్జిత్య సమరే వివిధాయుధపాతనైః | పురా శక్రోపి సమరే యేన వజ్రీ వినిర్జితః || 67

మిత్రత్వమగమత్తేన ప్రాదాదింద్రాయచోర్వశీమ్‌ | తతః ప్రభృతి మిత్రత్వమగమత్పాక శాసనః || 68

సర్వలోకేతిశయితం పురూరవ సమేవతమ్‌ | ప్రాహ వజ్రీతు సంతుష్టో నియతామియమేవచ || 69

కాముడును నీవు గంధమాదనగిరిపై గల కుమారవనమందు ఊర్వశీ వియోగమంది పిచ్చివాడవయ్యెద వనెను.

ధర్మాపురుషార్ధమూర్తి నీవు చిరాయుష్రుడవు ధార్మికుడవు నయ్యెదవు. ఓ రాజేంద్రా ! నీ సంతానము వందలు పందలుగ మాచంద్రతారార్కము సర్వాభివృద్ధుల నుందురు. ఊర్వశీ కామనిమిత్తమున నరువదేండ్లు పిచ్చివాడవై తపింతువు. తుదకా యప్సరస త్వరలోనే నీ పత్ని యగును. అని యా పురుషార్ధమూర్తులు నలుగురు నంతర్థానమైరి. అపుడు పురూరవ చక్రవర్తి రాజ్యము బడసెను. అతడు ప్రతిదినమింద్రదర్శనముసేయ నేగి తిరిగివచ్చుచుండెను. ఒక నాడు రథమెక్కి దక్షిణమువైపాకాశమందు దిరుగుచున్న యింద్రునితోగూడ కేశియను రాక్షసునిచే లాగికొనిపోబడుచున్న చిత్రలేఖను నూర్వశిం జూచెను. ఆ రాక్షసుల నెన్నో యాయుధములచే జయించియుం దుదకు వారిచేతిలో నింద్రుడే యోడిపోయెను. అప్పుడింద్రుడు పురూరపునితో స్నేహముసేసికొని యా కేశి నోదించి యూర్వసి నింద్రునకప్పగించెను. అదిమొదలు పురూరవునికి మిత్రు డూర్వశిని బురూరవునకిచ్చెను.

సా పురూరవ నఃప్రీత్యై చాగాయచ్చరితం మహత్‌ | లక్ష్మీ స్వయంవరం నామ భరతేన ప్రవర్తితమ్‌ || 70

మేనకాంచోర్వశీం రంభాం నృత్యధ్వమితిచా దిశత్‌ | ననర్తసలయం తత్ర రూపేణచోర్వశీ || 71

సా పురూరవ దృష్ట్వా నృత్యంతీ కామపీడితా | విస్తృతాభినయం సర్వం యత్పురాతన చోదితమ్‌ || 72

శశాప భరతః క్రోధాద్వియోగా త్తస్య భూతలే | పంచ పంచాశదబ్దాని లతాభూతా భవిష్యసి || 73

తతస్తముర్వశీగత్వా భర్తారమకరోచ్చిరమ్‌ | శాపానుభవనాంతే చ ఊర్వశీ బుధసూనునా || 74

అజీజన త్సుతానష్టౌనామ తస్తాన్నిబోధమే | ఆయుర్దృఢా యుర్వశ్యాయుర్బలాయు ర్ధృతిమాన్‌ వసుః || 75

దివ్యజాయుః శతాయుశ్చ సర్వే దివ్యబలౌజసః | అయుషో నహుషః పుత్రో వృద్ధశర్మా తథైవచ || 76

రిజిర్దండో విశాఖశ్చ వారాః పంచ మహారథాః | రజే పుత్రశతం జజ్ఞే రాజేయా ఇతి విశ్రుతమ్‌ || 77

రజి రారాధయామాస నారాయణ మకల్మషమ్‌ | తపసాతోషితో విష్ణుర్వరం ప్రాదాన్మహీపతేః || 78

దేవాసుర మనుష్యాణా మభూత్సవిజయీ తదా | అథ దేవాసురం యుద్ధ మభూర్ద్వర్ష శతత్రయమ్‌ || 79

ఆమె పురూరవసు నానందపెట్టుటకు లక్ష్మీ స్వయంవర కథను గానము సేసెను. ఆ కథ నాట్యాచార్యుడు భరతుడు రచించినది. అతడు మేనకను ఊర్వశిని రంభను నా కథ నభినయించుచు నృత్యము సేయుడని యాదేశించెను. అప్పుడూర్వశి లక్ష్మీపాత్ర ధరించి నృత్యము సేసెను. చేయుచు పురూరపుని జూచి కామవివశ##యై గురువులు నేర్పిన యభినయపద్ధతి యెల్ల మరిచిపోయెను. దానం గోపించి భరతుడు భూమికింబోయి యేబదియేదేండ్లు తీగవైయుండుమని శపించెను. అందుచే నామె భూతలమునకుం దిగివచ్చి చిరకాలము పురూరవుని భర్తగా గైకొనెను. ఆమె యాతని వలన నెనమండుగురు పుత్రులం గనెను. వారు ఆయువు దృడాయువు వశ్యాయువు బలాయువు ధృతిమంతుడు వసువు దివ్యాజాయువు శతాయువు ననువారు మంచి బలశాలురు ధైర్యవంతులును దివ్యతేజస్సులు. ఆయువు కొడుకులైదుగురు సహుషుడు మొదలగువారు. రజికి నూరుగురు కొడుకులు రాజేయులను ప్రసిద్ధులు. రిజి విష్ణువు నారాధింవ నాయన దేవాసుర మనుష్యలనెల్ల జయింతునని వరమిచ్చెను. అవ్వల మూడువందలేండ్లు జరిగిన దేవాసుర సంగ్రామ మయ్యెను.

ప్రహ్లాద శక్రయోర్భీమం న కశ్చిద్విజయీ తయోః | తతో దేవాసురైః పృష్టః పృథగ్దేవశ్చతుర్ముఖః || 80

అనయోర్విజయీకఃస్యాద్రజిర్వత్రేతి సోబ్రవీత్‌ | జయాయ ప్రార్ధితో రాజసహాయస్త్వం భవస్వనః || 81

దైత్యైః ప్రాహయది స్వామీవో భవామి తతస్త్వలమ్‌ | నాసురైః ప్రతిపన్నం తత్ప్రతిపన్నం సురైస్తదా || 82

స్వామీ భషత్వ మస్మాకం బలనాశాయ విద్విషః | తతో వినాశితాః సర్వే యేవ ధ్యా వజ్రపాణినః || 83

పుత్రత్వ మగమత్తుష్టస్తస్యేంద్రః కర్మణా తతః | దత్త్వేంద్రాయ పురా రాజ్యం జగామ తపసే రజిః || 84

ఆ యుద్ధ మింద్రునికి బ్రహ్లాదునికి జరిగినది. అందాయిద్దరిలో నొక్కడు గెలుపొందడయ్యెను. అటుపైని దేవాసురులు చతుర్ముఖు నీయిద్దరిలో నెవ్వడు గెల్చునన నాయన రజి జయింపగలడనియె. అప్పుడు దైత్యులాతనిం దమ పక్షమున బోరుమని కోరిరి. అతడు నన్ను మీకు బ్రభువుగా నంగీకరింతురేని యట్లేసేయుదు ననియె. దాని కసురులంగీకరింవరైరి. దేవతలంగీకరింప నతడు వారి పక్షమునం జేరి యింద్రుని కజయ్యులైన యా దైత్యులం దాను గెలిచెను. అందుల కానందించి యింద్రు డతనికి పుత్రు డయినంత రజి యాతనికి రాజ్యమిచ్చి తపస్సునకుం జనెను.

రజిపుత్రైస్తదాఛిన్నం బలాదింద్రస్యవైయదా | యజ్ఞభాగశ్చ రాజ్యంచ తపోబల గుణాన్నితైః || 85

రాజ్యభ్రష్టస్తతః శక్రో రజిపుత్రని పీడితః | ప్రాహ వాచస్పతిం దీనః పీడితోస్మి రజేః | సుతైః || 86

న యజ్ఞభాగో రాజ్యం మే పీడితస్య బృహస్పతే | రాజ్యలాభాయమే యత్నం విధత్స్వధిషణాధిప || 87

రజి కుమారులు తపోబల సంపన్నులై శక్రు నోడించి స్వర్గ సామ్రాజ్యమును యజ్ఞభాగమునుగూడ గైకొనిరి. అంతట సురపతి రాజ్యభ్రష్టుడై దిగులుపడి గురునితో నేను రజి కొడుకుల వలని పీడకు గురియైతిని. రాజ్యమా లేదు. యజ్ఞభాగమును లేదు, నీవు దిషణాధిపతియు (బుద్ధి కధినాధుడవు) కావున నాకు రాజ్యము లభింప యత్నము సేయుమని కోరెను.

తతో బృహస్పతిః శక్రమకరోద్‌ బలదర్పితమ్‌ | గ్రహశాంతి విధానేన పౌష్టికేనచ కర్మణా || 88

గత్వాథ మోహయామాస రజిపుత్రాన్‌ బృహస్పతిః | జిన ధర్మం సమాస్థాయ వేదబాహ్యం సధర్మవిత్‌ || 89

వేదత్రయి పరిభ్రష్టాఃశ్చకారధిషణాధిపః | వేదబాహ్యాన్‌ పరిజ్ఞాయ హేతువాద సమన్వితాన్‌ || 90

అంతట సురగురు గ్రహశాంతి పౌష్టికర్మలంగావించి బలారిని (ఇంద్రుని) బలవంతునిం జేసెను. అమీద దేవ గురువు రజి కొడుకుల దరి కేగి వేదబాహ్యమైన జినుని ధర్మము (జైనమతమును) ననుసరించి రజి కొడుకులం పొరబడం జేసి వేదత్రయీ దూరుల గావించెను. అట్లు వేదభ్రష్టులు హేతువాదరతులు (కుతర్కపరులు) నైరని తెలిసి శక్రుడు వజ్రాయుధముచే వారినందరి నడచెను.

జఘాన శక్రో వజ్రేణ సర్వాన్‌ ధర్మ బహిష్కృతాన్‌ | నహుషస్య ప్రవక్ష్యామి పుత్రాన్‌ సపై#్తవ ధార్మికాన్‌ || 91

యతిర్యయాతి శ్శర్యాతిరుత్తరః పరఏవచ | అ(ఆ)యతి ర్వియతి శ్చైవ సపై#్తతే వంశవర్థనాః || 92

యతిః కుమారభావేపి యోగి వైఖానసోభవత్‌ |యయాతిరకరో ద్రాజ్యం ధర్మైక శరణః సదా || 93

శర్మిష్ఠా తస్య భార్యాభూద్‌ దుహితా వృషపర్వణః | భార్గవస్యాత్మజాచైప దేవయానీచ సువ్రతా || 94

యయాతేః పంచదాయాదాయాంస్తాన్‌ ప్రవక్ష్యామి నామతః | దేవయానీ యదుం పుత్రంతుర్వసుంచాపృజీజనత్‌ || 95

తథాద్రుహ్యమణం (నుం) పూరుం శర్మిష్ఠా జనయత్పుతాన్‌ | యదు, పురుశ్చ భరతస్తేవై వంశవివర్థనా || 96

ఇక నహుషుని సంతానము ధార్మికులు. యతి యయాతి శర్యాతి ఉత్తరుడు పరుడు అయతి వియతి యనువారేడుగురు వంశోద్ధారకులు. యతి చిన్నతనమందే యోగియు వెఖానసుడు (వైష్ణవుడు) నయ్యెను, యయాతి ధర్మైకనిష్ఠుడై రాజ్యము సేసెను. ఆతని భార్య శర్మిష్ఠ. ఆమె పృషపర్వుని కూతురు. ఆతని రెండవభార్య దేవయాని. శుక్రాచార్యుల కుమర్తె పతివ్రత. యయాతి సంతానమైదుగురు. దేవయాని గన్నవారు యదువు తుర్వసుడు ననువారు. శర్మిష్ఠ గన్న కొడుకులు ద్రుహ్యుడు అణుడు పూరువు ననువారు. యదువు పూరువు (భరతుడు) ననువారు వంశోద్ధారకులు. వారి పేరనే పూరు వంశము భరత వంశము నను ప్రసిద్ధిగల్గినదన్ననూట.

పురోర్వంశం ప్రవక్ష్యామి యత్రాజాతోసి పార్థివ | యదోస్తు యాదవా జాతా యత్రతౌ బల కేశవౌ || 97

భారావ తారణార్థాయ పాండవానాం హితాయచ | యదోః పుత్రా బభూవశ్చ పంచదేవ సుతోపమాః || 98

సహస్రజిత్తథా జ్యేష్ఠః క్రోష్టా నీలోంజికోరఘుః | సహస్రజితో దాయాదః శతజిన్నామ పార్థివః || 99

శతజితశ్చ దాయాదాస్త్రయః పరమధార్మికాః | హైహయశ్చ హయశ్చైవ తధా తాల హయశ్చయః || 100

హైహయస్యతు దాయాదో ధర్మనేత్ర ప్రతిశ్రుతః | ధర్మనేత్రస్య కుంతిన్తు సంహత స్తస్యచాత్మజః || 101

సంహతస్యతు దాయాదో మహిష్మాన్నామ పార్థివః | ఆసీన్మహిష్మతః పుత్రో భద్రసేనః ప్రతాపవాన్‌ || 102

వారాణస్యామ భూద్రాజా కధితః పూర్వమేవాహి | భద్రసేనస్య పుత్రస్తు దుర్దమోనామ ధార్మికః || 103

దుర్దమస్య సుతో భీమో ధనకోనామ వీర్యవాన్‌ | ధనకస్య సుతాహ్యాసంశ్చత్వారోలోక విశ్రుతాః || 104

కృతాగ్నిః కృతవీర్యశ్చ కృతధర్మా తథైవచ | కృతౌజాశ్చ చతుర్థోభూత్కృతవీర్యాచ్చసోర్జునః || 105

భీష్మ ! నీవుదయించిన పూరు వంశముం జెప్పెద. యదువునకు యాదవులుదయించిరి. ఆ వంశమందే భూభారము హరింపను పాండవులకు హితము సేయను బలరామకృష్ణులుదయించిరి.

యాదవున కైదుగురు దేవతలు లు కుమారులు గల్గిరి. వారిలో సహస్రజిత్తు పెద్ద. క్రోష్ట నీలుడు అంజికుడు రఘువనువారు తక్కిన నల్గురు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు. శతజిత్తు కొడుకులు మహాధార్మికులు ముగ్గురు హైహయుడు హయుడు తాలహయుడు ననువారు. హైహయుని కొడుకు ధర్మనేత్రుడు. అతని కొడుకు కుంతి. వాని వాడు సంహతుడు, వాని కొడుకు మహిష్మంతుడు. వాని కొడుకు భద్రసేనుడు ప్రతాపశాలి. ఇతడు వారణాశికి రాజయ్యె నని యీవరకు దెల్పితిని. అతని కొడుకు ధర్మపరుడు దుర్దముడనువాడు. దుర్దమునికి భాముడు ధనకుడు ననువారు ధనకుని కొడుకులు నల్వురు. జగత్ప్రసిద్ధులు కృతాగ్ని కృతవీరుడు కృతధర్ముడు కృతౌజుడుననువారు. కృతవీర్యుని కొడుకు అర్జునుడు.

జాతో బాహు సహస్రేణ సప్తద్వీపేశ్వరో నృపః | వర్షాయుతం తపస్తేపే దుశ్చరం పృథివీపతిః || 106

దత్తమారాధయామాస కార్తవీర్యోత్రి సంభవమ్‌ | తసై#్మ దత్తో వరా న్ప్రాదా చ్చతురః పురుషోత్తమః || 107

పూర్వం బాహు సహస్రంతు సవవ్రే రాజసత్తమః | అధర్మం ధ్యాయమానస్య భీతిశ్చాపి నివారణమ్‌ || 108

యుద్ధేన వృధివీంజిత్వా ధర్మేణావాప్యవై బలమ్‌ | సంగ్రామే వర్తమానస్య వధశ్చైవాధికాద్భవేత్‌ || 109

ఏతేనేయం వసుమతీ సప్తద్వీపాసపత్తనా | సప్తోదధి పరిక్షిప్తా క్షాత్రేణ విధినాజితా || 110

జజ్ఞే బాహు సహస్రంచ ఇచ్ఛతస్తస్యధీమతః | సర్వేయజ్ఞా మహాబాహో స్తస్యాసన్భూరి దక్షిణాః || 111

సర్వేకాంచనయూపాస్త సర్వే కాంచన వేదికాః | సర్వదేవైశ్చ సంప్రాప్తా విమానస్థైరలంకృతైః || 112

గంధర్వైరప్సరోభిశ్చ నిత్యమేవాపిసేవితాః | యస్య యజ్ఞే జగౌగాథా గంధర్వో నారదస్తథా || 113

కార్తవీర్యస్య రాజర్షేర్మహిమానం నిరీక్ష్యసః | నమానం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః || 114

యజ్ఞైర్దానైస్తపోభిశ్చ విక్రమేణ శ్రుతేనచ | సప్తద్వీపా ననుచరన్వేగేన పవనోపమః || 115

పంచాశీతి సహస్రాణి వర్షాణాంచ నరాధిపః | సప్తద్వీప పృధివ్యాశ్చ చక్రవర్తీ బభూవహ || 116

న ఏవ పశుపాలోభూత్షేత్రపాలః సఏవహి | స ఏవ వృష్ట్యా వర్జన్యో యోగిత్వాదర్జునో భవత్‌ || 117

యోసౌ బాహు సహస్రేణజ్యాఘాత కఠినత్వ చా | భాతిరశ్మి సహస్రేణ శారదేనేవ భాస్కరః || 118

ఏషనామ మనుష్యేషు మాహిష్మత్యం మహాద్యుతిః | ఏష వేగం సముద్రస్వ ప్రావృట్‌ కాలే భ##జేతవై || 119

అతడే కార్తవీర్యార్జునుడు. వేయి చేతులతో బుట్టినాడు. సప్తద్వీపాధిపతి యయ్యెను. పదివేలేండ్లు దుశ్చరమైన తపము సేసెను. అత్రి పుత్రుని దత్తుని (దత్తాత్రేయులను) ఆరాధించినాడు. పురుషోత్తముడగు దత్తస్వామి యతనికి నాల్గువరము లనుగ్రహించెను. మొదటి దతడుకోరిన బహుసహస్రము. తలచినంతట నధర్మము గోచరించుట. సర్వ భయ నివారణము, యుద్ధముచే నవనిం గెల్చి ధర్మముచే బలమువడయుట. యుద్థమునందు సర్వాధికుని చేతిలో మడి యుట యనునవి నాల్గు. ఇతడు సప్తద్వీప సప్తసముద్ర సపత్తనమైన వసుమతినెల్ల గెల్చినాడు. కోరినపు డాతనికి వేయి చేతులు స్ఫురించుచుండెను. భూరిదక్షిణములచెల్ల యజ్ఞములు సేసెను. అవియన్నియు బంగారు యూపములు. బంగారు వేదికలు గలవి. అలంకృతులై దేవతలు విమానముల మీద నతని యజ్ఞములకు హవిర్భాగములందికొనవచ్చిరి. ఆ యజ్ఞ సదస్సునందు నిరంతరము గంధర్వులు సంగీతములు పాడిరి. అప్సరాంగాన లాడిరి. నారదుడు గంధర్వుడై యాతని యజ్ఞములంగని రాజర్షియైన కార్తవీర్యుని ప్రభావముం గని యా గాథలను గానముసేసెను. ఏరాజులుగూడ కార్తవీర్యునికి వచ్చిన సద్గతి నందుకోలేరు.

క్రీడతే స్వసుఖాయైవ ప్రతిస్రోతో మహీపతిః | లలనాః క్రీడితాస్తేన ప్రతిబద్ధోర్మి మాలినీ || 120

ఊర్మి భృకుటి మాలాసా శంకితాభ్యేతి నర్మదా | ఏష ఏవ మనోర్వంశే త్వవగాహే న్మహార్ణవమ్‌ || 121

కరేణో ధృత్య వేగంతు కామినీ ప్రీణనేనతు | తస్య బాహు సహస్రేణ క్షోభ్యమాణ మహోదధౌ || 122

భవంతి లీనా నిశ్చేష్షాః పాతాలస్థా మహాసురాః | తదూరుక్షోభ చకితా అమ్భతోత్పాదశంకితాః || 123

యజ్ఞములు దానములు తపస్సు పరాక్రమముతో వాయువువలె సప్తద్వీపముల ననుచరించెను. ఎనుబదియైదు వేల సంవత్సరము లతడు సప్తద్వీప వసుంధరకు జక్రవర్తి యయ్యెను. యోగి గావున నతడే పశుపాలకుడు నతడే క్షేత్ర పాలకుడు (పొలముకాపు) అతడే. వర్షము కురిపించుటలో వర్జన్యుడు (ఇంద్రుడు) నయ్యెను. వింటినారి దెబ్బలకు గట్టి వడిన ముంజేతులతో సహస్ర కరములతో (వేయికిరణములతో) నతడు శరత్కాలమందు భాస్కరుడట్లు దీపించెను. మాహిష్మతీ నగరమున మనుష్యులలో మహా తేజస్వియన్న నితడే. వర్షఋతువం దీతడు సముద్రవేగముం బొందును. తన యానందమునకే యందెదురీదుచు నాడుకొనును. సారంగ తరంగ వేగముం దన వేయి బాహువుల నడ్డి లలనామణులం జలక్రీడలాడించును. కెరటములను కనుబొమలముడిగొని నర్మదానది సిగ్గుచేతంబోలె శంకించుచు నల్లనల్లన నాతని దరికి వచ్చును. మను వంశమునందు (మానవులందన్నమాట) ఇతడొక్కడే మహాసముద్రము లోతులకు దిగినవాడు. కామినీ మణుల ముచ్చటంగూర్పు వేయిబాహువులచేసముద్రవేగము మరికట్టినంత మహోదధి సంక్షోభమంది పాతాళమందున్న మహాసురు లడలిపోయి నిశ్చేష్టులై దాగిపోవుదురు. ఆతని తొడల తాకిడికి కడలి అమృతము పుట్టుచున్నది కాబోలునని మహాసర్పములు పడగలట్టె కదలకుండ వంగి నిలబడిపోవును. మేటి విల్కా డితడొక్కడే రావణునిపై నెదిరి యమ్ముల విసిరినాడు.

నతా నిశ్చల మూర్థానో భవంతి చ మహోరగాః | ఏషధన్వీచచిక్షేప రావణం ప్రతిసాయకాన్‌ || 124

ఏషధన్వీ ధనుర్గృహ్య ఉత్సిక్తం పంచభిః శ##రైః | లంకేశం మోహయిత్వాతు సబలం రావణం బలాత్‌ || 125

నిర్టిత్య బద్ధాత్వానీయ మాహిష్మత్యాంబబంధతమ్‌ | తతోగతోహం తస్యాగ్రే అర్జునం సంప్రసాదయన్‌ || 126

ముమోచ రాజన్‌ పౌత్రం మేసఖ్యం కృత్వాచ పార్థివ | తస్య బాహు సహస్రస్య బభూవ జ్యాతలస్వనః || 127

యుగాంతాగ్నేః ప్రవృత్తస్య యథాజ్యాతలనిఃస్వన | అహోబలం విధేర్వీర్యం భార్గవః నయదాచ్ఛినత్‌ || 128

మృధే సహస్రం బాహూనాం హేమతాలవనం యథా | యం వసిష్ఠస్తు సంకృద్థోహ్యర్జునం శప్తవాన్విభుః || 129

యస్మాద్వనం ప్రదగ్ధంతే విశ్రుతం మమ హైహయ | తస్మాత్తే దుష్కృతం కర్మకృతమన్యోహనిష్యతి || 130

చ్ఛిత్వా బాహు సహస్రంతే ప్రమధ్యతరసా బలీ | తపస్వీ బ్రాహ్మణస్త్వాంవై వధిష్యతి స భార్గవః || 131

మహాధానుష్కు డతడే. ధనుస్సు నెక్కిడి పంచబాణముల దొడిగి లంకాధిపతిని మోహింపజేసినవాడు. మన్మథ పోలిక యిట ధ్వనింపబడినది. వాని బలగముతో బలిమియై నోడించికొనివచ్చి మహిష్మతీ నగరమందు బంధించెను. ఏ నాతని ముందు నిలిచి కార్తవీర్యార్జునం బ్రతిమాలుకొన్న నా పౌత్రుని (మనుమని) చెలిమి వాటించి వదలిపెట్టినాడు. అతని వేయి బాహువుల వింటినారి చప్పుడు వ్రళయకాలగ్ని జాతలాఘాతమట్లతి భయంకరమయ్యెను. ఆహా ! దైవబల మెంత గొప్పది? ఈలాటి వీనిని భార్గవుడు పరశురాముడు యుద్ధమునందు వీని సహస్ర బాహువులను పొంగారు తాడిచెట్ల వనము నట్లు నరకిపారవేసినాడు. ఇందులకు కారణము మున్ను వసిష్ఠమహర్షి మిక్కిలి కోపముంగొని ఓరీ ! హైహయ ! నా తపోభూమిగల బ్రసిద్ధమైన యీ నా వనమును గాల్చి పాపముసేసినావు కావున దానికి ప్రతిక్రియగా నీ వేయి చేతులు నరకి తపస్వి బ్రాహ్మణుడునైన యతడు భార్గవుడు పరశురామును నిన్ను హతమార్చగలడు పొమ్మనెను. జ్ఞాని అమ్ముని శాపముచే భార్గవరాముడు వాని హంతకుడయ్యెను.

తస్యరామోథ హంతాసీన్ముని శాపేన ధీమతః | తస్య పుత్రశతం త్వాసీత్పంచ తత్ర మహారథాః || 132

కృతాస్త్రా బలినః శూరాధర్మాత్మానో మహాబల | శూరసేనశ్చ శూరశ్చ ధృష్టోవైకృష్ణ ఏవచ || 133

జయద్ధ్వజః సవైకర్తా అవన్తేశ్చరసా పతిః | జయధ్వజస్య పుత్రస్తు తాలజంఘో మహాబలః || 134

తస్యపుత్రా శ్శతానేవ తాలజంఘా ఇతిస్మృతాః | తేషాం పంచకులాన్యాసన్‌ హైహయానాం మహాత్మనామ్‌ || 135

వీతి హోత్రాశ్చ సంజాతా భోజాశ్చావంతయస్తథా | తుండ కోరాశ్చ విక్రాంతా స్తాలజంఘాః ప్రకీర్తితాః || 136

వీతిహోత్ర సుతశ్చాపి అనంతో నామ వీర్యవాన్‌ | దుర్జయస్తస్య పుత్రస్తు బభూవా మిత్ర కర్షణః || 136

సద్భావేన మహారాజః ప్రజాధర్మేణ పాలయన్‌ | కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రధృత్‌ || 138

యేన సాగర పర్యంతా ధనుషానిర్జితా మహీ | యస్తస్య కీర్తయేన్నామ కల్య ముత్థాయ మానవః || 139

స తస్య విత్తనాశఃస్యా నష్టంచ లభ##తే పునః | కార్తవీర్యస్య యో జన్మ కథయేదిహ ధీమతః |

యథా యష్టా యథా దాతా స్వర్గలోకే మహీయతే || 140

ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

యదువంశ కీర్తనం నామ ద్వాదశోధ్యాయః

అయ్యర్జునునికి నూర్గురు పుత్రులు గల్గిరి. అందైదుగురు మహారథులు. అస్త్రకుశలురు. బలవంతులు శూరులు మహానుభావులు. వారు శూరసేనుడు శూరుడు ధ్భషుడు కృష్ణుడు జయధ్వజుడు ననువారు. జయధ్వజుడు అవన్తీ నగర నిర్మాత. రసాపతి (భూపతి) వాని కొడుకులు నూర్గురు. తాళజంఘలనువారు. మహాత్ములైన యా హైహయుల కులములు (కుటుంబములు) ఐదు సుప్రసిద్ధములు_వారి ప్రత్యేక నామములు వీతిహోత్రులు భోజులు అవంతులు తుండకొరులు తాళజంఘులు ననువారు. వీతిహోత్రుని కుమారుడు అనంతుడు బలశాలి. వాని కొడుకు దుర్జయుడు శత్రు సంహర్త. కార్తవీర్యార్జున చక్రవర్తి సహస్రబాహువు సద్భావముతో ధర్మముతో బ్రజలం బాలించుచు సముద్రపర్యంత మైన వసుమతిం నొక్క ధనువునం గెల్చెను. అతని పుణ్యనామము నెవ్వడు వేకువను లేచి కీర్తించునో వానికి ధనహాని యెన్నడు నుండదు పోయిన ధనమునుం దిరిగి పొందును. జ్ఞానియగు కార్తవీర్యుని జన్మచరిత్ర మిది యెవ్వడు వర్ణించునో యతడు యాజికుడట్లు (యజ్ఠము సేసినవానియట్లు) దాతయట్లు స్వర్గలోకమున రాజిల్లును.

ఇది ''యదువంశ వర్ణన'' మను పండ్రెండవ యధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters