Sri Padma Mahapuranam-I    Chapters   

సప్తత్రింశోధ్యాయః

పులస్త్య ఉవాచ :- తదద్భుతతమం వాక్యం శ్రుత్వా చ రఘునందనః |

గౌరవాద్విస్మయాచ్చాపి భూయః ప్రష్టుం ప్రచక్రమే || 1

రామ ఉవాచ : భగవంస్తద్వనం ఘోరం యత్రాసౌ తప్తవాంస్తపః |

శ్మేతో పైదర్భికో రాజా తదద్భుతమభూత్కథమ్‌ || 2

విషమం తద్వనం రాజా శూన్యం మృగవిర్జితమ్‌ | ప్రవిష్టస్తప ఆస్థాతుం కథం వద మహామతే || 3

సమంతాద్యోజనశతం నిర్మనుష్యమాభూత్కథమ్‌ | భవాన్మథం ప్రవిష్టస్తద్యేన కార్యేణ తద్వద || 4

అగస్త్య ఉవాచ : పురా కృతయుగే రాజా మనుర్దండధరః ప్రభుః |

తస్య పుత్రోథ నామ్నాసీదిక్ష్వాకురమితద్యుతిః || 5

తం పుత్రం పూర్వజం రాజ్యే నిక్షప్య భువి సంమతమ్‌ | పృధివ్యాం రాజవంశానాం భవ రాజేత్యువాచ హ || 6

తథేతి చ ప్రతిజ్ఞాతం పితుః పుత్రేణ రాఘవ | తతః పరసంమహృష్టః పునస్తం ప్రత్యభాషత || 7

ప్రీతోస్మి పరమోదారకర్మణా తే న సంశయః | దండేన చ ప్రజా రక్ష న చ దండ మకారణమ్‌ || 8

అపరాధిషు యో దండః పాత్యతే మానవైరిహ | స దండో విధివన్ముక్తః స్వర్గం నయతి పార్థివమ్‌ || 9

తస్మాద్దండే మహాబాహో యత్నవాన్భవ పుత్రక | ధర్మస్తే పరమో లోకే కృత ఏవం భవిష్యతి || 10

ముప్పదియేడవ అధ్యాయము

పులస్త్యుడు చెప్పెను. ఆ అద్భుతమగు మాటవిని రాముడు గౌరవముతో విస్మయముతో మరల ప్రశ్నించదొడగెను, ''భగవాన్‌ ! వైదర్భకుడగు శ్వేతుడను రాజు ఘోరమైన తపస్సు చేసిన ఆ వనమెట్లేర్పడినది ? మృగములు లేనిది, శూన్యమైనది యగు ఆ వనమును ప్రవేశించి తపమెట్లు చేయగోరెను? వందయోజనముల వెడల్పైన ఆ వనము నిర్మానుష్యమెట్లాయెను? మీరందు ఎట్లు ప్రవేశించిరి? తెలుపుమని రాముడడుగగా అగస్త్యుడు ఇట్లు చెప్పెను. పూర్వము కృతయుగమున మనువను రాజు పాలకుడు, శాసకుడై వుండెను. ఆతని పుత్రుడే అమితకాంతిగల ఇక్ష్వాకువు. ఆ పుత్రుని రాజ్యమున నిలిపి పృధివియందు రాజవంశీయులకు రాజువుగమ్మనెను, రామా ! ఆ పుత్రుడు అట్లే యని తండ్రితో బలుకగా, సంతోషముతో ఇట్లనెను. ''నీ పరమోదార కర్మచే నేను ప్రీతినొందితిని. ఇందు సంశయము లేదు. దండమును ప్రయోగించి ప్రజలను రక్షించుము. ఆకారణముగా దండమును ప్రయోగించరాదు, అపరాధము చేసినవారికి దండన విధించిన పాలకుడు స్వర్గమును పొందును. కనుక కుమారా! దండన విధించుటకు యత్నించుము. నీవిట్లు చేయగా పరమ ధర్మము కలుగగలదు. 10

ఇతి తం బహు సందిశ్య మనుః పుత్రం సమాధినా | జగామ త్రిదివం హృష్టో బృహ్మలోకమనుత్తమమ్‌ | 11

జనయిష్యే కథం పుత్రానితి చింతాపరోభవత్‌ | కర్మభిర్బహుభిసై#్తస్స సుతైః సంయుతో భవత్‌ || 12

తోషయామాస పుత్రైః స పితౄన్‌ దేవసుతోపమైః | సర్వేషాముత్తమస్తేషాం కనీయాన్‌ రఘునందన || 13

శూరశ్చ కృతవిద్యశ్చ గురుశ్చ జనపూజయా | నామ తస్యాథ దండేతి పితా చక్రే స బుద్ధిమాన్‌ || 14

భవిష్యద్దండపతనం శరీరే తస్య వీక్ష్య చ | సంపశ్యమానస్తం దోషం ఘోరం పుత్రస్య రాఘవ || 15

స వింధ్యనీలయోర్మధ్యే రాజ్యమస్య దదౌ ప్రభుః | స దండస్తత్ర రాజాభూద్రమ్యే పర్వతమూర్ధని || 16

పురం చాప్రతిమం తేన నివేశాయ తథాకృతమ్‌ | నామ తస్య పురస్యాథ మధుమత్తామితి స్వయమ్‌ || 17

తథా దేశేన సంపన్నః శూరో వాసమథాకరోత్‌ | ఏవం రాజా స తద్రాజ్యం చకార సపురోహితః || 18

పృహృష్టసుప్రజాకీర్ణం దేవరాజో యథాదివి | తతః స దండః కాకుత్థ్స బహువర్షగణాయుతమ్‌ || 19

అకారయత్తు ధర్మాత్మా రాజ్యం నిహతకంటకమ్‌ | అథ కాలే తు కస్మింశ్చిద్రాజా భార్గవమాశ్రమమ్‌ || 20

అని మనువు పుత్రునికి పెక్కురీతుల సందేశమునిచ్చి సంతోషముతో ఉత్తమమగు బ్రహ్మలోకమును చేరెను. నేనెట్లు పుత్రుల దరింపజేసెదనని ఇక్ష్వాకువు చింతలో మునిగి, ఆయా కర్మల పెక్కు ఆచరించి సుతుల నొందెను. దేవ సుతులవంటి తన పుత్రులచే పితృదేవతల నతడు సంతోషపరిచెను, వారందరిలో ఉత్తముడు చిన్నవాడు. శూరుడు, చదివిన వాడు, గురువగు ఆతని పేరు ''దండుడ''ని ఇక్ష్వాకువు పెట్టెను. ఆతని శరీరముపై భవిష్యత్తులో పడబోవు దండమును, ఘోరదోషమును ముందే గ్రహించిన తండ్రి, ఆతనిని వింధ్య, నీల పర్వతముల మధ్య భాగమునకు రాజును చేసెను. ఆ అందమైన పర్వత పైభాగమునకు దండుడు రాజయ్యెను. అతను నివసించుటకు అందమైన పురం నిర్మించబడెను. దానిపేరు ''మధుమత్‌'' శూరుడగు దండుడు ఆ దేశమునట్లు, పురోహితులతో కలిసి పాలించ సాగెను. ఆనందముతోనున్న ప్రజలు గల ఆ దేశమును దండుడు, ఇంద్రుని స్వర్గము వలె పెక్కు వర్షములు పాలించెను. ఎట్టి కష్టములు లేకుండెను. 19 1/2

రమణీయముపాక్రామాచ్చైత్రమాసే మనోరమే | తత్ర భార్గవకన్యాం తు రూపేణాప్రతిమాం భువి || 21

విచరంతీం వనోద్దేశే దండోపశ్యదనుత్తమామ్‌ ఉత్తుంగపీవరీC శ్యామాం చంద్రాభవదనాం శుషామ్‌ || 22

సునాసాం చారుసర్వాంగీం పీనోన్న తపయోధరామ్‌ | మధ్యే క్షామాం చ విస్తీర్ణాం దృష్ట్వా తాం కురుతే ముదమ్‌ || 23

ఏకవస్త్రాం వనే చైకాం ప్రథమే ¸°వనే స్థితామ్‌ | స తాం దృష్ట్వా త్వధర్మేణ అనంగశరపీడితః || 24

అభిగమ్య సువిశ్రాంతాం కన్యాం వచనమబ్రవీత్‌ | కుతస్త్వమసి సుశ్రోణి కస్య చాసి సుశోభ##నే || 25

పీడితోహమనంగేన పృచ్ఛామి త్వాం సుశోభ##నే | త్వయా మేపహృతం చిత్తం దర్శనాదేవ సుందరి || 26

ఇదం తే వదనం రమ్యం మునీనాం చిత్తహారకమ్‌ || యద్యహం న లభే భోక్తుం మృతం మామవధారయ || 27

త్వయా హృతా మమ ప్రాణా మాం జీవయ సులోచనే | దాసోస్మి తే వరారోహే భక్తం మాం భజ శోభ##నే || 28

తసై#్యవం తు బ్రువాణస్య మదోన్మత్తస్య కామినః | భార్గవీ ప్రత్యువాచేదం వచః సవినయం నృపమ్‌ || 29

భార్గవస్య సుతాం విద్ది శుక్రస్యాక్లిష్టకర్మణః | అరజాం నామ రాజేంద్ర జ్యేష్ఠామాశ్రమనాసినః || 30

ఒకనాడు ఆ రాజు అందమైన భార్గవుని ఆశ్రమమును చైత్రమాసమున ప్రవేశించి రూపవతియగు భార్గవ పుత్రిని జూచెను. ఆమె యపుడు వన ప్రదేశమున చరించుచునుండెను. ఎత్తైనది, చక్కనిది, చంద్రముఖి, చక్కని శరీరావయవాలు గలది, బలిసిన ఎత్తయిన స్తనములు గలది, సన్నని నడుము గలది, ఏకవస్త్రయగు ఆ యువతి వనమున నొంటరిగా నుండుట జూచి దండుడు అధర్మముగా మన్మథబాధనొందెను. వెంటనే ఆ కన్యను చేరి ఇట్లనెను. ''ఓ సుందరీ ! నీవరిదానవు? ఎక్కడినుండి వచ్చితివి? మన్మథబాధను పొంది నేను నిన్నడుగుచుంటిని. నిన్ను చూచిన వెంటనే నా చిత్త మపహరింపబడినది. ఈ నీ ముఖము మునుల చిత్తమును గూడ హరింపజేయునంత అందముగనున్నది. నిన్ను పొందని యెడల నేను మరణించెదనని తెలియుము. నా ప్రాణములు నీచే నపహరింపబడినవి. నన్ను బ్రదికింపుము. సుందరీ ! నేనే నీ భక్తుడను. దాసుడను. నన్ను సేవించుము' అని దండుడు కామముతో మదోన్మత్తుడై పలుకుచుండగా భార్గవుని పుత్రి వినయముగా రాజుతో నిట్లనెను :- 'రాజేంద్రా! నేను ఉత్తముడగు భార్గవుని పుత్రికను. అరజ యనుదానను. ఆశ్రమవాసులలో జ్యేష్ఠురాలను. 30

శుక్రః పితా మే రాజేంద్ర త్వం చ శిష్యో మహాత్మనః | ధర్మతో భగినీ చాహం భవామి నృపనందన || 31

ఏవం విధం వచో వక్తుం న త్వమర్హసి పార్థివ | అన్యేభ్యోపి సుదుష్టేభ్యో రక్ష్యా చాహం సదా త్వయా || 32

క్రోధనో మే పితా రౌద్రో భస్మత్వం త్వాం సమానయేత్‌ | అధవా రాజధర్మేణాసంబంధం కురుషే బలాత్‌ || 33

పితరం యాచయస్వ త్వం ధర్మదృష్టేన కర్మణా | వరయస్వ నృపశ్రేష్ఠ పితరం మే మహాద్యుతిమ్‌ || 34

అన్యథా విపులం దుఃఖం తవ ఘోరం భ##వేద్ధృవమ్‌ | క్రుద్ధో హి మే పితా సర్వం త్రైలోక్యమభినిర్దహేత్‌ || 35

తతోశుభం మహాఘోరం శ్రుత్వా దండః సుదారుణమ్‌ | ప్రత్యువాచ మదోన్మత్తః శిరసాభినతః పునః || 36

ప్రసాదం కురు సుశ్రోణి కామాన్మత్తస్య కామిని| త్వయా రుద్ధా మమ ప్రాణా విశీర్యంతి శుభాననే || 37

త్వాం ప్రాప్య వైరం మేత్రాస్తు వధో మవాపి మహత్తరః |

భక్తం భజస్వ మాం భీరు త్వయి భక్తిర్హి మే పరా || 38

ఏవముక్త్వా తు తాం కన్యాం బలాత్‌ సంగృహ్య బాహూనా | అన్యేన రాజ్ఞా హస్తేన వివస్త్రా సా తథా కృతా || 39

అంగమంగే సమాశ్లేష్య ముఖే చైవ ముఖం కృతమ్‌ | విస్ఫురంతీం యథాకామం మైథునాయోపచక్రమే || 40

రాజా! శుక్రుడు నా తండ్రి. నీవతని శిష్యుడవు గదా! ధర్మముగానైతే నేను నీకు సోదరినయ్యెదను. ఈ విధమైన మాటలను నీవు పలుకరాదు. నీవే నన్ను ఇతర దుష్టులనుండి రక్షించవలెను. నా తండ్రి క్రోధము గలవాడు, రౌద్రముతో నిన్ను భస్మముగా చేయును. లేదా, రాజధర్మముచే బలమునుపయోగించి అసంబంధమును కూర్చదలచిన, ధర్మదృష్టితో నీవు నా తండ్రిని వేడి నన్ను పొందుము. లేనిచో, నీకు ఘోరమగు దుఃఖము కలుగగలదు. నా తండ్రి కోపించినచో ముల్లోకములనూ దహింపజేయగలడు' అని ఆ కన్యయనగా దండుడు విని మదోన్మత్తుడై తలవంచి ఇట్లనెను:- 'సుందరీ! కామోన్మత్తుడైన నాపై ప్రసన్నతను చూపించుము. నీచే నడ్డగింపబడిన నా ప్రాణములు పోవుచున్నవి. నిన్ను పొందిన వెనుక, నాకు వైరమేగానిమ్ము, వధనేగానిమ్ము. భీరూ! నేను నీ భక్తుడిని. నన్ను పొందుము. నీయందు నా కమిత భక్తి' అని ఆ కన్యను బలముగా బాహువులలో బంధించెను. ఒక చేతిలో గట్టిగా పట్టి, వేరొక చేతితో ఆ కన్యను వివస్త్రను చేసి అంగమునంగముతో, ముఖమును ముఖముతో కలిపి, బెదిరిపోయిన ఆ కన్యను రమించుట కారంభించెను. 40

తమనర్ధం మహాఘోరం దండః కృత్వా సుదారుణమ్‌ | నగరం స్వం జగామాశు మదోన్మత్త ఇవ ద్విపః || 41

భార్గవీ రుదతీ దీనా ఆశ్రమస్యావిదూరతః | ప్రత్యపాలయదుద్విగ్నా పితరం దేవసమ్మితమ్‌ || 42

స ముహూర్తాదుపస్పృశ్య దేవర్షిరమితద్యుతిః | స్వమాశ్రమం శిష్యవృతం క్షుధార్తః సన్యవర్తత || 43

సోపశ్యదరజాం దీనాం రజసా సమభిప్లుతామ్‌ | చంద్రస్య ఘనసంయుక్తాం జ్యోత్స్నామివ పరాజితమ్‌ || 44

తస్య రోషః సమభవత్‌ క్షుధార్తస్య మహాత్మనః | నిర్దహన్నిన లోకాంస్త్రీన్‌ తాన్‌ శిష్యాన్‌ సమువాచ హ || 45

పశ్యధ్వం విపరీతస్య దండస్యాదీర్ఘ దర్శినః | విపత్తం ఘోరసంకాశాం దీప్తామగ్నిశిఖామివ || 46

యన్నాశం దుర్గతిం ప్రాప్తః సానుగశ్చ న సంశయః | యస్తు దీప్తహుతాశస్య అర్చిః సంస్పృష్టవానిహ || 47

యస్మాత్‌ స కృతవాన్పాపమీదృశం ఘోరసంమితమ్‌ | తస్మాత్‌ ప్రాప్స్యతి దుర్మేధాః పాంసువర్షమనుత్తమమ్‌ || 48

కురాజా దేశసంయుక్తః సభృత్యబలవాహనః | పాపకర్మసమాచారో వధం ప్రాప్స్యతి దుర్మతిః || 49

సమంతాద్యోజనశతం విషయం చాస్య దుర్మతేః | ధునోతు పాంసువర్షేణ మహతా పాకశాసనః || 50

మహాఘోరమైన ఆ అనర్థాన్ని దారుణంగా చేసిన దండుడు మదపుటేనుగు వలె త్వరగా తన నగరమునకు వెళ్లెను. దీనురాలైన అరజ తండ్రి రాకకై ఎదురుచూస్తూ ఆశ్రమమునకు కొద్దిదూరంలో ఏడ్చుచూ నుండెను. ఒక ముహూర్తములోనే దేవర్షి నీటిని దాకి, శిష్యులు కూడి వున్న తన ఆశ్రమమునకు ఆకలిగొని మరలివచ్చెను. ఆశ్రమమునకు దాపున ధూళిధూసరితమై, మేఘముల మాటున దెబ్బతినియున్న వెన్నెలవలె నున్న అరజను చూచెను. ఆకలిగొన్న ఆ ముని కోపించి ముల్లోకముల దహింపజేయునట్లు శిష్యులతో నిట్లనెను :- 'మూర్ఖుడగు ఈ దండుని విపరీతమును ప్రతీకారముగా జ్వలించు అగ్నిశిఖవలె ఘోరమగు విపత్తిని చూడుడు. అనుచరులతో కలిసి దండుడు నాశనమును పొందును. దండుడు ఇపుడు జ్వలించుచున్న అగ్నియొక్క జ్వాలను తాకినాడు. ఇట్టి ఘోరమైన పాపము నాచరించిన దండుడు ధూళివర్షమును పొందును. సభ్యుల బలముతో పాపకర్మల నాచరించు చెడు రాజు దేశముతో సహా నాశము పొందును. ఈ దుర్బుద్ధిగల రాజు పాలించుచున్న ప్రదేశమును పూర్తిగా వంద యోజనములు అంతటా ఇంద్రుడు ధూళివర్షమును గురిపించి కంపించుజేయుగాక ! 50

సర్వసత్వాని యానీహ జంగమస్థావరాణి వై | సర్వేషాం పాంసువర్షేణ క్షయః క్షిప్రం భవిష్యతి || 51

దండస్య విషయో యావత్తావత్స వనమాశ్రమమ్‌ | పాంసువర్షమివాకస్మాత్సప్తరాత్రం భవిష్యతి || 52

ఇత్యుక్త్వా క్రోధసంతప్తస్తమాశ్రమనివాసినమ్‌ | జనం జనపదస్యాంతే స్థీయతామిత్యువాచ హ || 53

ఉక్తమాత్రే ఉశనసా ఆశ్రమావాసథో జనః | క్షిప్రం తు విషయాత్తస్మాత్‌ స్థానం చక్రే చ బాహ్యతః || 54

తం తథోక్త్వా మునిజనమరజామిదమబ్రవీత్‌ | ఆశ్రమే త్వం సుదుర్మేధే వస చేహ సమాహితా || 55

ఇదం యోజనపర్యంతమాశ్రమం రుచిరప్రభమ్‌ | అరజే విర జాస్తిష్ఠ కాలమత్ర సమాశ్శతమ్‌ || 56

శ్రుత్వా నియోగం విప్రర్షేరరజా భార్గవీ తధా | తథేతి పితరం ప్రాహ భార్గవం భ్రుశదుఃఖితా || 57

ఇత్యుక్త్వా భార్గవో వాసం తస్మాదన్యముపాక్రమత్‌ | సప్తాహే బస్మసాద్భూతం యథోక్తం బ్రహ్మవాదినా || 58

తస్మాద్దండస్య విషయో వింధ్యశైలస్య మానుష | శప్తో హ్యుశనసా రామ తదాభూద్ధర్షణ కృతే || 59

తతః ప్రభృతి కాకుత్థ్స దండకారణ్యముచ్యతే | ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం పృచ్ఛసి రాఘవ || 60

స్థావరజంగమ ప్రాణులేవి గలవో, వాటన్నింటి నాశమీ ధూళివర్షముచే సంభవించును. ఏడు దినములలో దండుని పాలనలో గల ప్రదేశమంతయూ, వనమూ ఆశ్రమముతో గూడ అకస్మాత్తుగా ధూళివర్షములో బడును' అని కోపముతో బలికి ఆశ్రమములో నివసించువారిని జనపదము వద్ద నివసించుమని చెప్పెను. శుక్రుడట్లు చెప్పగా ఆశ్రమవాసులు ఆ ప్రదేశమునకు బయట నివసించసాగిరి. వారికట్లు చెప్పి శుక్రుడు అరజతో నిట్లనెను :- 'దుర్బుద్ధిగల అరజా! నీవు ఈ ఆశ్రమముననే నివసించుము. ఇది యోజన పర్యంతమున్న అందమైన ఆశ్రమ ప్రదేశము. ఇక్కడ నీవు దోషములేనిదానవై నూరు సంవత్సరములు వసించుము.' అనగా ఆ ఆదేశమును గ్రహించి ఆరజ దుఃఖముతో అక్కడే నుండెను. శుక్రుడు ఆదేశమును వదిలి వేరొకచోటిని చేరెను. ఆ బ్రహ్మవాది చెప్పినట్లు ఏడు దినములలో ఆ ప్రదేశమంతా భస్మమువలె నాయెను. వింధ్యశైల ప్రదేశము ఆ విధంగా దండునివలన శుక్రునిచే శపింపబడి అరణ్యమై, అప్పటినుండి దండకారణ్యమని పిలువబడుచున్నది. రామా! నీవడిగిన దానినంతా నీకు తెలియజేసితిని. 60

సంధ్యాముపాసితుం వీర సమయో హ్యతివర్తతే | ఏతే మహర్షయో రామ పూర్ణకుంభాః సమంతతః || 61

కృతోదకా నరవ్యాఘ్ర పూజయంతి పదివాకరమ్‌ | సర్వైరృషిభిరభ్యసై#్తః స్తోత్రైర్బ్రహ్మదిభిః కృతైః || 62

రవిరస్తంగతో రామ గత్వోదకముపస్పృశ | ఋషేర్వచనమాదాయ రామః సంధ్యాముపాసితుమ్‌ || 63

ఉపచక్రామ తత్పుణ్యం స సరో రఘునందనః | అథ తస్మిన్యనోద్దేశే రమ్యే పాదపశోభితే || 64

నదీపుణ్య గిరివరే కోకిలాశతమండితే | నానాపక్షిరవోద్యానే నానామృగసమాకులే || 65

సింహవ్యాఘ్ర సమాకీర్ణే నానాద్విజసమావృతే | గృధ్రోలూకౌ ప్రవసితౌ బహూన్వర్షగణానపి || 66

అధోలూకస్య భవనం గృధ్రః పాపవినిశ్చయః | మమేదమితి కృత్వాసౌ కలహం తేన చాకరోత్‌ || 67

రాజా సర్వస్య లోకస్య రామో రాజీవలోచనః | తం ప్రపద్యావహై శీఘ్రం కసై#్యతద్భవనం భ##వేత్‌ || 68

గృధ్రోలూకౌ ప్రపద్యేతాం జాతకోపావమర్షణౌ | రామం ప్రపద్యతౌ శీఘ్రం కలివ్యాకులచేతసౌ || 69

తౌ పరస్పరవిద్వేషౌ స్పృశతశ్చరణౌ తథా | అథ దృష్ట్వా రాఘవేంద్రం గృధ్రో వచనమబ్రవీత్‌ || 70

వీరా! సంధ్య నుపాసించుటకు కాలము దాటుచున్నది. ఈ మహర్షులు పూర్ణకుంభములతో నుండిరి. నరశ్రేష్ఠా! వారు సూర్యుని పూజించుచుండిరి. బ్రహ్మాదులచే చేయబడిన స్తుతులతో ఋషులు పూజించగా రవి ఆస్తమించెను. రామా! నీటిని గ్రహించుము.' అని ఋషి పలుకగా రాముడు సంధ్య నుపాసించుటకు ఆ పుణ్యమైన సరస్సును సమీపించెను. ఆ వనప్రదేశము రమ్యముగా చెట్లతో శోఖించుచుండెను. పుణ్యనది, పర్వతము గల అక్కడ వందలకొలది కోకిలలు, పక్షులు వుండి వాని రవములు వినిపించుచుండెను. అనేక మృగములు, సింహ, వ్యాఘ్రములునూ వున్న ఆ వనమున గద్ద, గుడ్లగూబ అనేక సంవత్సరాలు వసించుచుండెను. ఒకనాడు, పాపనిశ్చయుడగు గద్ద, గుడ్లగూబకు చెందిన భవనాన్ని స్వంతం చేసుకోదలిచి కలహమును కల్పించెను. రాజీవలోచనుడైన రాముడే లోకమంతటికీ రాజు. అతనినే చేరి భవన మెవరిదో తెలిసికొందమని ఆ గద్ద, గుడ్లగూబ కోపముతో అసహనముతో రాముని వద్దకు వచ్చినవి - పరస్పర ద్వేషము గల అవి రెండూ రాముని పాదముల తాకిన తరువాత, గద్ద రాముని చూచి అతనితో నిట్లనెను. 70

సురాణామసురాణాం చ త్వం ప్రధానో మతో మమ | బృహస్పతేశ్చ శుక్రాచ్చ త్వం విశిష్టో మహామతిః || 71

పరావరజ్ఞో భూతానాం మర్త్యే శక్ర ఇవాపరః | దుర్నిరీక్ష్యో యథా సూర్యో హిమవానిన గౌరవే || 72

సాగరశ్చాపి గాంభీర్యే లోకపాలో యమో హ్యపి | క్షాంత్యా ధరణ్యా తుల్యోసి శీఘ్రత్వే హ్యనిలోపమః || 73

గురుస్త్వం సర్వసంపన్నో విష్ణురూపోసి రాఘివ | అమర్షీ దుర్జయో జేతా సర్వాస్త్రవిధిపారగః || 74

శ్రుణు త్వం మమ దేవేశ విజ్ఞాప్యం నరపుంగవ | మమాలయం పూర్వకృతం బాహువీర్యేణ వై ప్రభో || 75

ఉలూకో హరతే రాజం స్త్వత్సమీపే విశేషతః | ఈదృశోయం దురాచార స్త్వదాజ్ఞాలంఘకో నృప || 76

ప్రాణాంతి కేన దండేన రామా శాసితుమర్హసి | ఏవముక్తే తు గృధ్రేణ ఉలూకో వాక్యమబ్రవీత్‌ || 77

శ్రుణు దేవ మమ జ్ఞాప్యమేకచిత్తో నరాధిప | సోమాచ్ఛక్రాచ్చ సూర్యాచ్చ ధనదాచ్చ యమాత్తథా || 78

జాయతే వై నృపో రామ కించిద్భవతి మానుషః త్వం తు సర్వమయో దేవో నారాయణపరాయణః || 79

ప్రోచ్యతే సోమతా రాజన్‌ సమ్యక్కార్యే విచారితే | సమ్యగ్రక్షసి తాపేభ్యస్తమోఘ్నో హి యతో భవాన్‌ || 80

దేవ దానవులకు నీవే ప్రధానమని మా అభిప్రాయము. బ్రహస్పతి కంటె, శుక్రుడి కంటే గోప్పవాడివి. భూతలములలో తత్త్వవేత్తవు - మానవ రూపున ఇంద్రుడవు - సూర్యుని వలె తేరిపారజూడ వీలులేనివాడవు - హిమవంతుని వలె ఎత్తైన వాడవు - సముద్రము వలె లోతైన వాడవు - యమునివలె లోక పాలుడవు - ఓర్పున భూమితో సమానుడవు - వేగమున వాయువుతో సమానము - అన్ని గుణాలు గల నీవు గురువువు - విష్ణు రూపము గలవాడవు - జయింప వీలులేనివాడవు, జయించు వాడవు, అన్ని అస్త్రముల విధిని తెలిసినవాడవు. దేవేశా! నా విజ్ఞప్తిని వినుము - నా రెక్కల బలముతో పూర్వము నివాసము నేర్పరుచుకొంటిని - ఈ గుడ్లగూబ నీ సమీపముననే దానిని దొంగిలించకోరుచున్నది. ఇట్టిది దీని దురాచారము. ఇది నీ ఆజ్ఞను మీరుచున్నది. రామా! ప్రాణాంతకమగు దండమును విధించుము.' అని గద్ద అనగా గుడ్లగూబ యిట్లనెను. 'రామా! నా వినతిని శ్రద్ధగా వినుము. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు వీని నుండి రాజు జన్మించును. కొంత మాత్రమే మానుషము. నీవు నారాయణ పరాయణుడవు - అంతా నీవే - బాగుగా ఆలోచించన సోమత్వము చెప్పబడును. నీవు తమస్సును నివారించుటచేత తాపముల నుండి రక్షించుచున్నావు.

దోషే దండాత్ప్రజానాం త్వం యుతః పాపభయాపహః |

దాతా ప్రహర్తా గోప్తా చ తేనేంద్ర ఇవ నో భవాన్‌ || 81

అధృష్యః సర్వభూతేషు తేజసా చ నలోపమః | అభీక్‌ష్ణం తపసే పాపాంస్తేన త్వం రామ భాస్కరః || 82

సాక్షాద్విత్తేశతుల్యస్త్వమథవా ధనదాధికః | చిత్తాయుత్తాతు పత్నీ శ్రీర్నిత్యం తే రాజసత్తమ || 83

ధనదస్య తు కోశేన దనదస్తేన వై భవాన్‌ | సమః సర్వేషు భూతేషు స్థావరేషు చరేషు చ || 84

శత్రౌ మిత్రౌ చ తే దృష్టిః సమంతాద్యాతి రాఘవ | ధర్మేణ శాసనం నిత్యం వ్యవహారవిధిక్రమైః || 85

యస్య రుష్యసి వై రామ మృత్యుస్తస్యాభిధీయతే | గీయసే తేన వై రాజన్యమ ఇత్యభివిశ్రుతః || 86

యశ్చాసౌ మానుషో భావో భవతో నృపసత్తమ | ఆనృశంస్యపరో రాజా సర్వేషు కృపయాన్వితః || 87

దుర్భలస్య త్వనాథస్య రాజా భవతి వై బలమ్‌ | అచక్షుషో భ##వేచ్చక్షురమతేషు మతిర్భవేత్‌ || 88

అస్మాకమపి నాథస్త్వ శూలయతాం మమ ధార్మిక | భవితా తత్ర మంతవ్యం యథైతే కిల పక్షిణః || 89

యోస్మన్నాథః స పక్షీంద్రో భవతో వినియోజ్యకః | అస్వామ్యం దేవ నాస్మాకం సన్నిధౌ భవతః ప్రభో || 90

దోషులను దండించుచూ, పాపులకు భయమును కలిగించుచూ, దాతవు, ప్రహర్తవు, గోప్తవగు నీవు మాకు ఇంద్రుడవు - ప్రాణులన్నింటిలో చేర వీలులేని నీవు తేజస్సులో నలుని వంటి వానివి - పాపముల నన్నింటిని కాల్చుటచే నీవు సూర్యుడవు - నీవు కుబేరునితో సరి - లేదా అంతకంటే అధికము, మనస్సు నునుసరించు నీ పత్ని లక్ష్మీదేవి - కుబేరుని కోశముచే నీవు కుబేరునివి - చరా చరములగు భూతములందు సముడవు - రామా! శత్రు మిత్రులయందు నీ దృష్టి సమముగా ప్రసరించును - వ్యవహార విధి క్రమముతో, ధర్మముతో శాసనమును నిత్యము చేయుచున్న నీకు ఎవరిపై కోపమొచ్చిన వారికి మృత్యువని చెప్పబడును. అందుచేత నీవు యముడని కీర్తి నొందితివి. ఈ మానుష భావము నీవు దయ, కృపగల వాడివని చూపుటకు - అనాథుడు, దుర్బలుడు అయిన వానికి రాజే బలము. చూడలేనివానికి రాజే చూపు, అజ్ఞానికి రాజే జ్ఞానము. రాజా! నీవే మా ప్రభువు - వినుము. మేము పక్షులము కదా! మా ప్రభువగు పక్షీంద్రుడు మీచే వినియోగించబడువాడు - మీ సన్నిధిలో మేము అనాథులము కాము. 90

భవతైవ కృతం పూర్వం భూతగ్రామం చతుర్విధమ్‌ | మమాలయప్రవిష్టస్తు గృధ్రో మాం బాధతే నృప || 91

భవాన్దేవ మనుష్యేషు శాస్తా వై నరపుంగవ | ఏతచ్ఛృత్వా తు వై రామః సచివానాహ్వయత్‌ స్వయమ్‌ || 92

విష్టిర్జయంతో విజయః సిద్ధార్థో రాష్ట్ర వర్ధనః | అశోకో ధర్మపాలశ్చ సుమంత్రశ్చ మహాబలః || 93

ఏతే రామస్య సచివా రాజ్ఞో దశరథస్య చ | నీతియుక్తా మహాత్మానః సర్వశాస్త్రవిశారదాః || 94

సుశాంతాశ్చ కులీనాశ్చ నయే మంత్రే చ కోవిదాః | తానాహూయ స ధర్మాత్మా పుష్పకాదవరుహ్య చ || 95

గృధ్రోలూకౌ వివదంతౌ పృచ్ఛతి స్మ రఘాత్తమః | కతి వర్షాణి తే గృధ్ర తవేదం నిలయం కృతమ్‌ || 96

ఏతన్మే కౌతుకం బ్రూహి యది జానాసి తత్త్వతః | ఏతచ్ఛృత్వా వచో గృధ్రో బభాషే రాఘవం స్థితమ్‌ || 97

ఇయం సుమతీ రామ మానుషైర్బహుబాహుభిః | ఉచ్ఛ్రితైరాచితా సర్వా తదా ప్రభృతి మద్గృహమ్‌ || 98

ఉలూక స్త్వబ్రవీద్రామం పాదపైరుపశోభితా | యదైవ పృథివీ రాజంస్తదా ప్రభృతి మే గృహమ్‌ || 99

ఏతచ్ఛృత్వా తు రామో వై సభాసద ఉవాచ హ | న సా సభా యత్ర న సంతి వృద్దా వృద్దా న తే యే న వదంతి ధర్మమ్‌ || 100

నాసౌ ధర్మో యత్ర న చాస్తి సత్యం | న తత్సత్యం యచ్ఛలమభ్యువైతి ||

ప్రభూ! పూర్వము నీవే నాలుగు విధాల ప్రాణులను సృజించితివి. నా ఇంట ప్రవేశించిన గద్ద నన్ను బాధించుచున్నది. నీవు మానవుల శాసకుడవు గదా!' అనగా రాముడు స్వయముగా తన మంత్రులను పిలిపించెను. విష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్ధుడు, రాష్ట్ర వర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, మహాబలుడను వీరు రామునికి, దశరథునికి కూడా మంత్రులు. వారంతా నీతి కలవారు, అన్ని శాస్త్రములు తెలిసినవారు, శాంతి గలవారు, మంచి వంశమున జన్మించినవారు, నయమును, మంత్రమును తెలిసినవారు. వారిని పిలిచి, రాముడు పుష్పకము నుండి దిగి గద్ద, గుడ్లగూబలతో ఇట్లనెను - 'నీవా ఇంట ఎన్ని సంవత్సరాలుగా వున్నావు? తెలుసుకొనగోరుచున్నాను. నిజమును చెప్పు'మనగా గద్ద రామునితో 'ఈ సుమతి, అనేక బాహువులుగల మనుషులచే పెంపు చేయబడిన నాటినుండి నా నివాసమ'ని అనెను. గుడ్లగూబ రామునితో 'భూమి చెట్లతో శోభించిన నాటి నుండి నా గృహమని' అనగా రాముడు సభ్యులతో ఇట్లనెను - 'పండితులు, అనుభవజ్ఞులు లేని సభ, సభ కాదు, ధర్మమును చెప్పని వృద్ధులు వృద్ధులు గారు, సత్యము లేని ధర్మము ధర్మము గాదు. మోసము నాశ్రయించిన సత్యము సత్యము గాదు. 100

యే తు సభ్యాః సభాం గత్వా తూష్ణీం ధ్యాయంత ఆసతే || 101

యథా ప్రాప్తం న బ్రువతే సర్వే తేనృతవాదినః |

న వక్తి చ శ్రుతం యశ్చ కామాత్‌, క్రోధాత్‌, తథా భయాత్‌ || 102

సహస్రం వారుణాః పాశాః ప్రతిముంచంతి తం నరమ్‌ | తేషాం సంవత్సరే పూర్ణో పాశ ఏకః ప్రముచ్యతే || 103

తస్మాత్యత్సం తు వక్తవ్యం జానతా సత్యమంజసా | ఏతచ్ఛృత్వా తు సచివా రామమేవాబ్రువంస్తదా || 104

ఉలూకః శోభ##తే రాజన్నతు గృధ్రో మహామతే | త్వం ప్రమాణం మహారాజ రాజా హి పరమాగతిః || 105

రాజమూలాః ప్రజాః సర్వాః రాజా ధర్మః సనాతనః |

శాస్తా రాజా నృణాం యేషాం నతే గచ్ఛంతి దుర్గతిమ్‌ || 106

వైవస్వతేన ముక్తాశ్చ భవంతి పురుషోత్తమాః | సచివానాం వచః శ్రుత్వా రామో వచనమబ్రవీత్‌ || 107

ఏ సభ్యులు సభకు వెళ్ళి మాటలాడక కూర్చుందురో, అవసరాన్నిబట్టి మాటలాడరో వారందరూ అసత్యమను మాటలాడువారే. కామముచే గానీ, క్రోధముచే గానీ, భయముచే గానీ విన్నది చెప్పనివానిపై వేయి వరుణ పాశములు పడును. సంవత్సరమున కొక్క పాశము మాత్రము వీడును. కనుక సత్యము తెలిసినవాడు త్వరగా సత్యమునే చెప్పవలెను.' అని రాముడనగా మంత్రులు రామునితో నిట్లన్నిరి. 'గుడ్లగూబలు చెప్పునది సత్యముగ తోచుచున్నది, గద్ద చెప్పినది గాదు - ఈ విషయములో నీవే ప్రమాణము - రాజే పరమగతి కదా ! రాజే ప్రజలందరికీ మూలము - రాజే సనాతన ధర్మము - ఎవరిని రాజు శాసించునో వారు దుర్గతిని పొందరు. వారు యమునిచే విడువబడుదురు.' అని మంత్రులనగా విని రాముడిట్లు పలికెను. 107

శ్రూయాతామభిధాస్యామి పురాణం యదుదాహృతమ్‌ | ద్యౌః సచంద్రార్క నక్షత్రా సపర్వతమహీద్రుమమ్‌ || 108

సలిలార్ణవసంమగ్నం త్రైలోక్యం సచరాచరమ్‌ | ఏకమేవ తదా హ్యాసీత్సర్వమేకమివాంబరమ్‌ || 109

పునర్భూః సహ లక్ష్మ్యాచ విష్ణోర్టఠరమావిశత్‌ | తాం నిగృహ్య మహాతేజాః ప్రవిశ్య సలిలావర్ణవమ్‌ || 110

సుష్వాప హి కృతాత్మా స బహువర్షశతాన్యపి | విష్ణౌ సుప్తే తతో బ్రహ్మా వివేశ జఠరం తతః || 111

బహుస్రోతం చ తం జ్ఞాత్వా మహాయోగీ సమావిశత్‌ |

నాభ్యాం విష్ణోః నముద్భూతం పద్మం హేమవిభూషితమ్‌ || 112

స తు నిర్గమ్య వై బ్రహ్మా యోగి భూత్వా మహాప్రభుః |

సిసృక్షుః పృథివీం వాయుం పర్వతాంశ్చ మహీరుహాన్‌ || 113

తదంతరాః ప్రజాః సర్వా మానుషాంశ్చ సరీసృపాన్‌ | జరాయుజాండజాన్‌ సర్వాన్‌ ససర్జ స మహాతపాః || 114

తస్య గాత్రసముత్పన్నః కైటభో మధునా సహ | దానవౌ తౌ మహావీర్యౌ ఘోరౌ లబ్ధవరౌ తదా || 115

దృష్ట్వా ప్రజాపతిం తత్ర క్రోధావిష్టావుభౌ నృప | వేగేన మహతా భోక్తుం స్వయంభువమధావతామ్‌ || 116

దృష్ట్వా సత్త్వాది సర్వాణి నిస్సరన్తి పృథక్‌ పృథక్‌ | బ్రహ్మణా సంస్తుతో విష్ణుర్హత్వా తౌ మధుకైటభౌ || 117

పృథివీం వర్ధయామాస స్థిత్యర్ధం మేదసా తయోః | మేదోగంధా తు ధరిణీ మేదినీత్యభిధాం గతా || 118

'పురాణమైనది, మునుపు చెప్పబడిన దానిని మీకు చెప్పెదను. సూర్య, చంద్ర, నక్షత్రములతో దివి, పర్వతములతో, వృక్షములతో భూమి, చరాచరములతో ముల్లోకములు జలమున మునిగియుండెను. మొత్తం ఒకటిగా నుండెను. ఆకాశ మొకటే నుండినది. భూమి, లక్ష్మితో విష్ణువు జఠరమును ప్రవేశించెను. గొప్ప తేజస్వి యగు విష్ణువు లక్ష్మినట్లు నిగ్రహించి నీటి మధ్య ప్రవేశించి, ఎన్నో వేల సంవత్సరములు నిద్రించెను. నిద్రించిన విష్ణువు యొక్క జఠరమును బ్రహ్మ ప్రవేశించెను. పెక్కు స్రోతస్సులు గల దానిగా దానిని తెలిసి, మహా యోగియగు బ్రహ్మా దానిని ప్రవేశించగా, విష్ణువు నాభి నుండి బంగారు వన్నె లీను పద్మము బయల్వెడలెను. బ్రహ్మ యోగియై బయటకు వచ్చి, సృష్టి చేయదలచి, పృథ్వి, వాయు, పర్వత, వృక్షములను, ప్రజలను, సరీసృపములను, జరాయుజాండజాలను అన్నంటిని సృజించెను. అతని శరీరము నుండే మధుకైటభు లుద్భవించిరి. వరమును పొంది మహా బల సంపన్నులైరి. అక్కడ బ్రహ్మను జూచి క్రోధముతో బ్రహ్మను తినివేయుదమని వెంటబడిరి. విడివిడిగా బయల్వెడలుచున్న సత్త్వముల జూచి బ్రహ్మచే స్తుతింపబడిన విష్ణువు వారిని సంహరించెను. అటుపై వారి మేదస్సుతో, భూమి స్థిరముగా నుండుటకై వర్ధిల్లజేసెను. మేదోగంధము వలన భూమి కప్పటి నుండి 'మేదినీ' అని పేరు వచ్చెను. 118

తస్మాద్గృధ్రస్త్వసత్యో వై పాపకర్మా పరాలయమ్‌ | స్వీయం కరోతి పాపాత్మా దండనీయో న సంశయః || 119

తతో శరీరిణి వాణి అంతరిక్షాత్ప్రభాషతే | మా వధీ రామ గృధ్రం త్వం పూర్వం దగ్ధం తపోబలాత్‌ || 120

పురా గౌతమదగ్ధోయం ప్రజానాథో జనేశ్వర | బ్రహ్మదత్తస్తు నామైష శూరః సత్యవత్రః శుచిః || 121

గృహమాగత్య విప్రర్షేర్భోజనం ప్రత్యయాచత | సాగ్రం వర్షశతం చైవ భుక్తవాన్నృపసత్తమ || 122

బ్రహ్మాదత్తస్య వై తస్య పాద్యమర్ఘ్యం స్వయం తతః | ఆత్మనైవాకరోత్సమ్యగ్భోజనార్థం మహాద్యుతే || 123

సమావిశ్య గృహం తస్య ఆహారే తు మహాత్మనః || నారీం పూర్ణస్తనీం దృష్ట్వా హస్తేనాథ పరామృశత్‌ || 124

అథ క్రుద్ధేన మునినా శాపో దత్తః సుదారుణః | గృధ్రత్వం గచ్చ వై మూఢ రాజా మునిమథాబ్రవీత్‌ || 125

కృపాం కురు మహాభాగ శాపోద్ధారో భవిష్యతి | దయాలుస్తద్వచః శ్రుత్వా పునరాహ నరాధిప || 126

ఉత్పత్స్యతే రఘకులే రామో నామ మహాయశాః | ఇక్ష్వాకూణాం మహాభాగో రామో రాజీవలోచనః || 127

తేన దృష్టో విపాపస్త్వం భవితా నరపుంగవ | దృష్టో రామేణ తచ్ఛృత్వా బభూవ పృథివీపతిః || 128

కనుక గద్ద చెప్పిన సత్యము - పాప కర్ముడై ఈ గద్ద ఇతరుల నివాసమును స్వంతము చేయదలచినందున దండనకు అర్హుడు.' అనగా ఆకాశవాణి నింగినుండి ఇట్లనెను. 'రామా! తపోబలముతో ముందే దహింపబడిన ఈ గద్దను వధించకు. పూర్వము గౌతమ ఋషిచే దహించబడిన రాజు బ్రహ్మదత్తుడనువాడు గద్దగా అవతరించెను. శూరుడు, సత్యవ్రతుడు, శుచియైన రాజు గౌతముని గృహమునకువచ్చి భోజనము పెట్టుమని కోరెను. నూరు సంవత్సరములపైన భుజించెను. ఆ బ్రహ్మదత్తునికి గౌతముడు స్వయముగా ఆర్ఘ్యము, పాద్యమును ఇచ్చెను. తానే భోజనమునకు కొనివచ్చెను. అతని గృహమును ప్రవేశించి, ఆహారము గ్రహించునపుడు, పూర్ణస్తని యగు స్త్రీని జూచి చేతితో స్పృశించెను. అపుడు కోపించిన ముని దారుణమైన శాపము నిచ్చెను. 'మూర్ఖుడవైన రాజా! నీవు గద్దవు కమ్ము' అని. అది విని రాజు మునితో 'మహానుభావా! శాపము తొలగునట్లు దయచూపుము.'అని వేడుకొనెను. దయగలవాడైన ముని అది విని 'రాజా! ఇక్ష్వాకుకులమున రాముడను కీర్తిగల మహానుభావుడు జన్మించగలడు. అతను చూచినపుడు నీవు పాపము తొలగి రాజువవగలవు' అనగానే రాముడు గద్ద వంక జూచెను. అది రాజుగా మారిపోయెను. 128

గృధ్రత్వం త్యజ్య వై శీఘ్రం దివ్యగంధానులేపనః | పురుషో దివ్వరూపోసౌ బభాషే తం నరాధిపం || 129

సాధు రాఘవ ధర్మజ్ఞ త్వత్ర్పసాదాదహం విభో | విముక్తో నరకాద్ఘోరాదపాపస్తు త్వయా కృతః || 130

విసర్జితం మయా గార్ధ్యం నరరూపే మహీపతిః | ఉలూకం ప్రాహ ధర్మజ్ఞ స్వగృహం విశ కౌశిక || 131

అహం సంధ్యాముపాసిత్వా గమిష్యే యత్ర వై మునిః | అథోదకముపస్పృశ్య సంధ్యామన్వాస్య పశ్చిమామ్‌ || 132

ఆశ్రయం ప్రావిశద్రామః కుంభయోనేర్మహాత్మనః || తస్యాగస్త్యో బహుగుణం ఫలమూలం చ సాదరమ్‌ || 133

రసవంతి చ శాకాని భోజనార్థముపాహరత్‌ | స భుక్తవాన్నరవ్యాఘ్రస్తదన్నమమృతోమమ్‌ || 134

ప్రీతశ్చ పరితుష్టశ్చ తాం రాత్రిం సముపావసత్‌ | ప్రభాతే కల్యముత్థాయ కృత్వాహ్నికమరిందమ || 135

ఋషిం సమభిచక్రామ గమనాయ రఘాత్తమః | అభివాద్యాబ్రవీద్రామో మహర్షిం కుంభసంభవమ్‌ || 136

అపృచ్ఛే సాధయే బ్రహ్మన్ననుజ్ఞాతుం త్వమర్హసి | ధన్యోస్మ్యనుగృహీతోస్మి దర్శనేన మహామునే || 137

దిష్ట్యా చాహం భవిష్యామి పావనాత్మా మహాత్మనః | ఏవం బ్రువతి కాకుత్థ్సే వాక్యమద్భుతదర్శనమ్‌ || 138

గద్దగా వుండుటను వదిలి దివ్యగంధములు అలుముకొని దివ్య రూపము గల రాజు వలె వెంటనే మారెను. రాముని జూచి 'రామా! ధర్మజ్ఞా! నీ అనుగ్రహముచే నేను ఘోర నరకము నుండి ముక్తుడనైతిని. నీవు పుణ్యము చేసితివి. నేనీ గద్ధరూపును విడచితిని' అని ఆ గద్ద పలికిన రాముడు గుడ్లగూబతో 'కౌశికా! ధర్మజ్ఞా ! నీ ఇంట నీవు ప్రవేశింపుము. నేను సంధ్య నుపాసించిముని వున్నచోటికి వెళ్ళెదను.' అని, నీటిని ఆచషునంచేసి సంధ్య నుపాసించి అగస్త్యముని ఆశ్రమమునకు వెళ్ళెను. అక్కడ అగస్త్యుడు భోజనమునకై మంచి ఫల మూలములు, రసవంతములైన శాకములు తెచ్చెను. అమృతమువలె నున్న అన్నమును రాముడారగించి, ప్రీతితో రాత్రిని అక్కడ గడిపెను. ప్రొద్ధుననే లేచి, నిత్యకృత్యముల గావించి వెళ్ళివచ్చెదనని అగస్త్యునికి చెప్పుటకు వెళ్ళెను. అగస్త్యునికి నమస్కరించి రాముడు 'బ్రహ్మవేత్తా! నేను వెళ్ళివచ్చెదను. అనుజ్ఞ నిమ్ము. నేను ధన్యుడను, అనుగృహీతుడ నైనాను. నా భాగ్యముచే మీ దర్శనము గలిగి, పవిత్రుడ నైనాను' అని రాముడు పలుకగా ప్రీతి నొందిన అగస్త్యుడు నీరు నిండిన కళ్ళతో రాముని చూచి ఇట్లనెను. 138

ఉవాచ పరమప్రీతో బాష్పనేత్రస్తపోధనః |

ఆత్యధ్భుతమిదం వాక్యం తవ రామ శుభాక్షరమ్‌ || 139

పావనం సర్వభూతానాం త్వయోక్తం రఘునందన | ముహూర్తమపి రామ త్వాం మైత్రేణక్షంతి యే నరాః || 140

పావితాస్వర్వసూక్తైస్తే కథ్యంతే త్రిదివౌకసః | యే చ త్వాం ఘోరచక్షుర్భిర్ని రీక్షంతే ప్రాణినో భువి || 141

తే హతా బ్రహ్మదండేన సద్యో నరకగామినః | ఈదృశస్త్వం రఘశ్రేష్ఠ పావనః సర్వదేహినామ్‌ || 142

కథయన్తశ్చ లోకాస్త్వాం సిద్దిమేష్యంతి రాఘవ | గచ్ఛ స్వానాతురోవిఘ్నం పంథానమకుతోభయః || 143

ప్రశాధి రాజ్యం ధర్మేణ గతిస్తు జగతావ భవాన్‌ | ఏవముక్తస్తు మునినా ప్రాంజలిప్రగ్రహో నృపః || 144

అభివాదయితుం చక్రే సోగస్త్యమృషిసత్తమమ్‌ | అభివాద్య మునిశ్రేష్ఠం తాంశ్చ సర్వాంస్తపోధికాన్‌ || 145

అథారోహత్తదావ్యగ్రః పుష్పకం హేమభూషితమ్‌ | తం ప్రయాతం మునిగణా ఆశీర్వాదైస్సమంతతః || 146

అపూపుజన్నరేంద్రం తం సహస్రాక్షమివామరాః | తతోర్దదివసే ప్రాప్తే రామః సర్వార్థకోవిదః || 147

అయోధ్యాం ప్రాప్య కాకుత్థ్సః పర్మాం కక్షామవాతరత్‌ | తతో విసృజ్య రుచిరం పుష్పకం కామవాహితమ్‌ || 148

కక్షాంతరాద్వినిష్క్రమ్య ద్వాస్థాన్‌ రాజాబ్రవీదిదమ్‌ | లక్ష్మణం భరతం చైవ గచ్ఛద్వం లఘువిక్రమాః|| 149

మమాగమనమాఖ్యాయ సమానయత మా చిరమ్‌ |

'రామా! శుభాక్షరములు గల నీ వాక్యమధ్భుతముగానున్నది. నీవు పలికినది అన్ని ప్రాణులను పావనమొనర్చునది. రామా! ఒకక్షణమైననూ నిన్ను మైత్రితో చూచువారు పవిత్రులగుదురు. స్వర్గవాసులు వారిని అన్ని సూక్తములతో స్మరింతురు. నిన్ను ఘోర చక్షువులతో చూచినవారు బ్రహ్మ దండముచే మరణించి వెంటనే నరకమునకు వెళ్ళుదురు. రామా! నీ వీవిధంగా అన్ని ప్రాణులకు పావనుడవు. నీ గూర్చి చెప్పు ఈ లోకములు సిద్దిని పొందును. నీవారిని చేర వెళ్ళుము. నీకు ప్రయాణము నిర్విఘ్న మగుగాక ! భయము లేనివాడవై వెళ్ళుము. నీ రాజ్యమును ధర్మముతో పాలించుము. నీవు జగత్తులను గతివి' అని ఆ ముని యనగా చేతులు జోడించి రాముడు ఋషి శ్రేష్ఠడగు అగస్త్యునికి అభివాదనము చేసి, తపస్సుచే నధికులయిన మునులకు నమస్కరించి, శాంతాత్ముడగు రాముడు పుష్కకము నధిరోహించెను. అతను వెళ్ళుచుండగా మునిగణములు ఇంద్రుని దేవతలు పూజించునట్లు ఆశీర్వాదముచే పూజించిరి. దినము సగము గడువగా రాముడు అయోధ్యను చేరి పుష్కకమును పద్మ కక్షయందు దింపి, దానిని వదిలి వేరొక గది గుండూ వెళ్ళుచూ ద్వారపాలకులను ఇట్లు ఆజ్ఞాపించెను. 'త్వరగా వెళ్ళి భరత లక్ష్మణులకు నా రాక తెలిపి వారినిక్కడికి కొనిరండు. 1491/2

శ్రుత్వాథ భాషితం ద్వాస్థా రామస్యాక్లిష్టకర్మణః || 150

గత్వా కుమారావాహూయ రాఘవాయ న్యవేదయన్‌ | ద్వాఃస్థైః కుమారావానీతౌ రాఘవస్య నిదేశతః || 151

దృష్ట్వా తు రాఘవః ప్రాప్తౌ ప్రి¸° భరతలక్ష్మణౌ | సమాలింగ్య తు రామస్తౌ వాక్యం చేదమువాచ హ || 152

కృతం మయా యాథాతథ్యం ద్విజకార్యమనుత్తమమ్‌ | ధర్మ హేతుమతోభూయః కర్తుమిచ్ఛామి రాఘవౌ || 153

భవద్య్భామాత్మభూతాభ్యాం రాజసూయం క్రతూత్తమమ్‌ |

సహితో యష్టుమిచ్ఛామి యత్ర ధర్మశ్చ శాశ్వతః || 154

పుష్కరస్థేన వై పూర్వం బ్రహ్మణా లోకకారిణా | శతత్రయేణ యజ్ఞానామిష్టం షష్ట్యధికేన చ || 155

ఇష్ట్వా హి రాజసూయేన సోమో ధర్మేణ ధర్మవిత్‌ | ప్రాప్తః సర్వేషు లోకేషు కీర్తస్థానమనుత్తమమ్‌ || 156

ఇష్ట్వా హి రాజసూయేన మిత్రః శత్రునిబర్హణః | ముహూర్తేన సుశుద్ధేన వరుణత్వముపాగతః || 157

తస్మాద్భవంతౌ సంచింత్య కార్యేస్మిన్‌ వదతం హి తత్‌ |

పుణ్యాత్ముడగు రాముని పలుకులు విని ద్వార పాలకులు భరత లక్ష్మణుల వద్దకు వెళ్ళి వారిని గొనిపచ్చి రామునికి తెలియజేసిరి. రాముని ఆదేశముపై వారిని లోన ప్రవేశ##పెట్టరి. ప్రియ సోదరులను జూచి రాముడు, కౌగలించుకొని వారితో నిట్లనెను - 'గొప్పదగు బ్రాహ్మణ కార్యమును నేను యథాతథముగా నాచరించితిని. ధర్మమే హేతువుగా గల దానిని మరల చేయదలచితిని. మీ ఇద్దరితోగూడి ఉత్తమ క్రతువగు రాజసూయమును యజించదలిచితిని. దానియందు ధర్మము శాశ్వతముగ నుండును. పూర్వము పుష్కరమున నుండి సృష్టికర్తయగు బ్రహ్మ మూడు వందల ఆరువది యజ్ఞముల చేసెను. ధర్మవేత్త యగు సోముడు ధర్మముగా యజించి, రాజసూయముతో లోకము లన్నింటిలో గొప్ప కీర్తిని పొందెను. శత్రువుల దునుమాడు మిత్రుడు రాజసూయమునుచేసి ముహూర్త కాలములో శుద్ధుడై వరుణత్వము నొందెను. కనుక, మీరు బాగుగా ఆలోచించి, ఈ వని యందు మీ ఆలోచనను తెలియజేయుడు. 1571/2

భరత ఉవాచ : - త్వం ధర్మః పరమః సాధో త్వయి సర్వా వసుంధరా || 158

ప్రతిష్ఠితా మహాబాహో యశశ్చామితవిక్రమ | మహీపాలాశ్చ సర్వే త్వాం ప్రజాపతిమివామరాః || 159

నిరీక్షంతే మహాత్మానో లోకనాథ తథా వయమ్‌ | ప్రజాశ్చ పితృవద్రాజన్‌ పశ్యంతి త్వాం మహామతే || 160

పృథీవ్యాం గతిభూతోసి ప్రాణినామిహ రాఘవ | స త్వమేవంవిధం యజ్ఞం నాహర్తాసి పరంతప || 161

పృథివ్యాం సర్వభూతానాం వినాశో దృశ్యతే యతః | శ్రూయతే రాజశార్దూల సోమస్య మనుజేశ్వర || 162

జ్యోతిషాం సుమహద్యుద్ధం సంగ్రామే తారకామయే | తారా బృహస్పతేర్భార్యా హృతా సోమేన కామతః || 163

తత్ర యుద్ధం మహద్‌వృత్రం దేవదానవనాశనమ్‌ | వరుణస్య క్రతౌ ఘోరే సంగ్రామే మత్స్యకచ్ఛపాః || 164

నివృత్తే రాజశార్ధూల సర్వే నష్టా జలేచరాః | హరిశ్చంద్రస్య యజ్ఞాంతే రాజసూయస్య రాఘవ || 165

ఆడీబకం మహద్యుద్ధం సర్వలోకవినాశనమ్‌ | పృథివ్యాం యాని సత్వాని తిర్యగ్యోనిగతాని వై || 166

దివ్యానాం పార్ధివానాం చ రాజసూయేక్షయః శ్రుతః | సత్వం పురుషశార్దూల బుద్ధ్యా నంచింత్య పార్థివ || 167

ప్రాణినాం చ హితం సౌమ్యం పూర్ణధర్మం సమాచర |

భరతస్య వచః శ్రుత్వా రాఘవః ప్రాహ సాదరమ్‌ || 168

ప్రీతోస్మి తవ ధర్మజ్ఞ వాక్యేనానేన శత్రుహన్‌ | నివ రిత్తా రాజసూయాన్మతిర్మే ధర్మవత్సల || 169

పూర్ణ ధర్మం కరిష్యామి కాన్యకుబ్ణే చ వామనమ్‌ | స్థాపయిష్యామ్యహం వీర సా మే ఖ్యాతిర్దివం గతా || 170

భవిష్యతి న సందేహో యథా గంగా భగీరథాత్‌ ||

ఇతి శ్రీపాద్మే మహాపురాణ ప్రథమే సృష్టిఖండే

యజ్ఞనివారణం నామ సప్తత్రింశోధ్యాయః

అనగా భరతుడు ఇట్లనెను: 'మాహాబాహూ! నీవే వరమధర్మము. నీయందే వసుంధరయంతా ప్రతిష్ఠితమైయున్నది. కీర్తికూడా. రాజులందరూ నిన్ను దేవతలు ప్రజాపతిని చూచునట్లు చూతురు. మేమునూ నిన్నట్లే భావింతుము. రాజా! ప్రజలు నిన్ను తండ్రివలె జూతురు. ప్రాణులకు భూమిపై నీవే గతివి. అట్టి నీవు ఇట్టి యజ్ఞమును చేయరాదు. దానిచే ప్రాణులన్నింటి నాశ##మేర్పడును. రాజశ్రేష్ఠా! పూర్వము సోముడు, నక్షత్రాలకు తారకమయమైన యుద్ధము జరిగెనట. అందు సోముడు కామముతో బృహస్పతి భార్యయగు తారను హరించెనట. దేవదానవుల నశింపజేయు గొప్ప యుద్ధము జరుగగా, వరుణ క్రతువున ఘోర సంగ్రామమై, మత్స్యములు, కచ్ఛపములు మొదలైన జలచరములన్నీ నశించెను. హరిశ్చంద్రుని రాజసూయ క్రతువు చివర గొప్ప యుద్ధము అన్ని లోకముల నశింపజేసెనట. భూమిపైన ప్రాణులు పశుపక్ష్యాదులు, దివ్యులగు రాజులు రాజసూయమున నాశము నొందిరట. నీవా నాశనము గూర్చి ఆలోచించి, ప్రాణుల హితమును మనసులో తలిచి సౌమ్యమగు పూర్ణధర్మమునాచరింపుము. అని భరతుడనగా రాముడు భరతునితో 'ధర్మవత్సలా ! నీవు పలికిన ఈ ధర్మపూరితమైన మాటలలో నేను ప్రీతినొందితిని. నా బుద్ధి రాజసూయమునుండి మరలినది. సంపూర్ణ ధర్మమునే నేనాచరించెదను. కన్యాకుబ్జమున వామనుని స్థాపించెదను. భగీరథుని నుండి గంగ స్వర్గమును చేరినట్లు నా కీర్తి స్వర్గమును చేరగలదు' అని ఆదరముతో ననెను.171

ఇది శ్రీ పాద్మపురాణమున మొదటి సృష్టికండమున

యజ్ఞనివారణము అను ముప్పదియేడవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters