Sri Sivamahapuranamu-II    Chapters   

అథ దశమోsధ్యాయః

కుజ గ్రహోత్పత్తి

నారద ఉవాచl

విష్ణు శిష్య మహాభాగ విధే శైవవర ప్రభో l శివలీలామిమాం వ్యాసా త్ర్పీత్యామే వక్తుమర్హసి ll 1

సతీవిరహయుక్‌ శంభుః కిం చక్రే చరిత్రం తథా l తపః కుర్తుం కదాయతో హిమవత్ప్రస్థముత్తమమ్‌ ll 2

శివా శివవివాదోభూత్కథం కామక్షయశ్చ మే l తపః కృత్వా కథం ప్రాప శివం శంభుం చ పార్వతీ ll 3

తత్సర్వమపరం చాపి శివసచ్చరితం పరమ్‌ l వక్తుమర్హసి మే బ్రహ్మన్‌ మహానందకరం శుభమ్‌ll 4

నారదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! ప్రభూ! నీవు శివ భక్తులలో శ్రేష్ఠుడవు. ఈ శివలీలను నాకు సంగ్రహముగా ప్రీతితో నీవు చెప్పదగుదువు(1). సతీ విరహముతో కూడి యున్న శివుడు ఏమి చేసెను? శివుడు తపస్సును చేయుటకై హిమవత్పర్వతాగ్ర భాగమునకు ఎప్పుడు వచ్చెను? ఆ చరితమును చెప్పుము (2). శివశివులకు మధ్య జరిగిన సంభాషణ ఎట్టిది? మన్మథుడు నశించిన తీరు ఏది? పార్వతి తపస్సును చేసి మంగళ స్వరూపుడగు శివుని పొందిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా! ఈ వృత్తాంతమునంపతనూ చెప్పి, ఇతరమగు శివచరితమును కూడ నీవు చెప్పదగుదువు. ఈ శుభ చరితము నాకు మహానందమును కలిగించుచున్నది. (4).

సూత ఉవాచl

ఇతి శ్రుత్వా నారదస్య ప్రశ్నం లోకాధిపోత్తమఃl విధిః ప్రోవాచ సుప్రీత్యాస్మృత్వా శివపదాంబుజమ్‌ll 5

సూతుడిట్లు పలికెను-

నారదుని ఈప్రశ్నను విని, లోకపాలురందరిలో శ్రేష్ఠుడగు బ్రహ్మశివుని పాదపద్మమునలు స్మరించి మిక్కిలి ప్రీతితో ఇట్లనెను (5)

బ్రహ్మోవాచl

దేవర్షే శైవవర్యాద్య తద్యశశ్శృణు చాదరాత్‌ l పావనం మంగలకరం భక్తి వర్థనముత్తమమ్‌ ll 6

అగత్య స్వగిరిం శంభుః ప్రియా విరహకాతరః l సస్మార స్వప్రియాం దేవీం సతీం ప్రాణాధికాం హృదాll 7

గణానాభాష్య శోచంస్తాం తద్గుణాన్‌ ప్రేమవర్థనాన్‌ l వర్ణయామాస సుప్రీత్యా దర్శయన్‌ లౌకికీం గతిమ్‌ ll 8

దిగంబరో బభూవాథ త్వక్త్వా గార్హస్థ్య సద్గతిమ్‌ l పునర్భభ్రామ లోకాన్‌ వై సర్వాన్‌ లీలా విశారదః ll 9

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు శివభక్తులలో శ్రేష్ఠుడవు. పవిత్రము చేయునది, మంగళములనిచ్చునది, భక్తిని పెంచునది అగు శివుని ఉత్తమకీర్తిని ఇపుడు శ్రధ్ధగా వినుము (6). ప్రియురాలి వియోగముచే దుఃఖితుడై యున్న శంభుడు తన నివాసమగు కైలాసమునకు తిరిగి వచ్చి, ప్రాణముల కంటె అధికముగా తనకు ప్రియురాలైన సతీదేవిని మనస్సులోస్మరించెను(7). ఆయన లోకపు పోకడను అనుకరించువాడై గణములను పిలిచి వారి యెదట ప్రేమను పెంపొందిచు ఆమె గుణములను మిక్కిలి ప్రీతితో వర్ణించెను(8). లీలా పండితుడగు ఆ శివుడు సద్గతినిచ్చు గృహస్థాశ్రమమును విడిచి పెట్టి దిగంబరుడై లోకములనన్నిటినీ తిరుగాడెను(9).

దర్శనమ ప్రాప్య కుత్రాపి సతీవిరహదుఃఖితః l పునశ్చ గిరిమాయాత శ్శంకరో భక్త శంకరః ll 10

సమాధాయ మనో యత్నా త్సమాధిం దుఃఖనాశనమ్‌ l చకార చ దదర్శాసౌ స్వరూపం నిజమవ్యయమ్‌ ll 11

ఇత్థం చిరతరం స్థాణుస్తస్థౌ ధ్వస్త గుణత్రయఃl నిర్వికారీ పరం బ్రహ్మ మయాధీశస్సయం ప్రభుః ll 12

తతస్సమాధిం తత్యాజ వ్యతీయ హ్యమితాస్సమాః l యదా తదా బభూవాశు చరితం తద్వదామి వః ll 13

భక్తులకు మంగళమునిచ్చు ఆ శంకరుడు సతీ వియోగముచే దుఃఖితుడై అమెను ఎక్కడను గాన జాలక కైలాస పర్వతమునకు తిరిగి వచ్చెను(10). అయన ప్రయత్నపూర్వకముగా మనస్సును నిగ్రహించి దుఃఖానాశకమగు సమాధిని పొంది నాశరహితమగు ఆత్మ స్వరూపమును దర్శించు చుండెను(11).మూడు గుణములకు అతీతమైన వాడు, వికారములు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు, మాయను వశము చేసుకున్నవాడు అగు ఆశివప్రభుడు ఈ తీరున చిరకాలము సమాధియందుడెను (12). ఆయన అనేక సంవత్సరములు ఇట్లు గడిపి తరువాత సమాధి నుండి బయటకు వచ్చెను. అపుడు జరిగిన వృత్తాంతమును మీకు చెప్పెదను (13).

ప్రభోర్లలాట దేశాత్తు యత్‌ పృషచ్ర్ఛమసంభమ్‌ l పపాత ధరణౌ తత్ర స బభూవ శిశుర్ద్రుతమ్‌ ll 14

చతుర్భుజోరుణాకారో రమణీయాకృతిర్మునే l అలౌకికద్యుతిశ్ర్శీమాన్‌ తేజస్వీ పరదుస్సహః ll 15

రురోద స శిశుస్తస్య పురో హి పరమేశితుః l ప్రాకృతాత్మజవత్తత్ర భవాచార రతస్య హి ll 16

తదా విచార్య సుధియా ధృత్వా సుస్త్రీతనుం క్షితిః l ఆవిర్భ భూవ తత్రైవ భయవానీయ శంకరాత్‌ ll 17

ఆ ప్రభుని లలాట భాగమునుండి శ్రమ వలన చెమట పుట్టి నేలపై బడగా, అది వెంటనే ఒక శిశువాయెను(14). ఓమహార్షీ! ఆ శిశువు నాల్గు భుజములతో, అరుణ వర్ణముతో, సుందరమగు ఆకారముతో, దివ్యకాంతులీనుచూ, శోభాయుక్తమై, ఇతరులు చూడ శక్యము కాని తేజస్సుతో వెలుగొందెను(15). అపుడా శిశువు పరమేశ్వరుని యెదుట ఏడ్చెను. లోకాచార పరాయణుడగు శివుని యెదుట ఆ శిశువు ఇతర శిశువుల వలె ఏడ్చెను(16). అపుడా భూదేవి శంకరునకు భయపడి మంచి బుద్ధితో ఆలోచించి సుందర స్త్రీ రూపమును ధరించి అచట సాక్షాత్కరించెను(17).

తం బాలం ద్రుతముత్థాప్య క్రోడాయాం నిదధే వరమ్‌ l స్తన్యం సాపాయయత్రీత్యా దుగ్ధం స్వోపరి సంభవమ్‌ ll 18

చుచుంబ తన్ముఖం స్నేహాత్‌ మత్వాక్రీడయదాత్మజమ్‌ l సత్యభావాత్స్వయం మాతా పరమేశహితావహా ll 19

తద్దృష్వా చరితం శంభుః కౌతుకీ సూతికృత్కృతీ l అంతర్యామీ విహస్యాథోవాచ జ్ఞాత్వా రసాం హరః ll 20

ధన్యాత్వం ధరణి ప్రీత్యా పాలయైతం సుతం మమ l త్వయ్యుద్బూతం శ్రమ జలాన్మ హాతేజస్వినో వరమ్‌ ll 21

ఆ భూదేవి ఆ శ్రేష్ఠ బాలకుని వెంటనే లేవదేసి ఒడిలో కూర్చుండ బెట్టుకొని, తన ఉపరితముపై లభించు పాలను స్తన్యరూపములో అ బాలునకు ప్రేమతో త్రాగించెను (18). సతీదేవి లేకుండుటచే ఆమె బాలుని తన కుమారునిగా భావించి, అ బాలుని ముఖమును ప్రేమతో ముద్దాడెను. అమె తల్లియగుట పరమేశ్వరునకు అనందమును కలింగించెను (19). కృతార్థుడు, జగత్కర్త, అంతర్యామి, పాపహరుడు అగు శంభుడు భూదేవిని గుర్తు పట్టి, ఆమె యొక్క ఆ ప్రవృత్తిని గాంచి చిరునవ్వుతో నిట్లనెను (20). ఓ భూదేవీ ! నీవు ధన్యురాలవు. మహాతేజశ్శాలియగు నా యొక్క చెమట నీపై పడగా పుట్టిన ఈ నా శ్రేష్ఠుడగు పుత్రుని ప్రేమతో పెంచుము(21).

మమ శ్రమక భూర్బాలో యద్యపి ప్రియకృత్‌ క్షితే l త్వన్నామ్నాస్యా ద్భవేత్‌ ఖ్యాత స్త్రితాపరహితస్సదా ll 22

అసౌ బాలః కుదాతా హి భవిష్యతి గుణీ తవ l మమాపి సుఖదాతా హి గృహాణౖనం యథారుచి ll 23

ఇత్యుక్త్వా విరరామాథ కించి ద్విరహముక్తధీః l లోకాచారకరో రుద్రో నిర్వికారీ సతాం ప్రియః ll 24

అపి క్షితిర్జగామాశు శివాజ్ఞా మధి గమ్య సా l స్వస్థానం ససుతా ప్రాప సుఖమాత్యంతికం చ వై ll 25

ఓ భూదేవీ! ఈ ప్రీతికరుడగు బాలుడు నా శ్రమజలమునుండి పుట్టిన వాడే అయినా, నిత్యము మూడు విధముల (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక) తాపములు లేని ఈబాలుడు నీ పేరుతో ప్రసిద్ధిని గాంచుగలడు(22). ఈ నీ కుమారుడు భూమిని దానము చేయు గుణవంతుడు కాగలడు. నాకు కూడా ఈతడు సుఖమును కలిగంచగలడు. ఈ బాలుని ప్రేమతో స్వీకరించుము (23). విరహ దుఃఖమునుండి కొద్ది ముక్తిని పొందిన మనస్సు గల ఆ రుద్రుడు లోకాచారమును ప్రవర్తిల్ల జేయుచూ ఇట్లు పలికి మిన్నకుండెను. సత్పురుషులకు ప్రీతి పాత్రుడగు శంభుడు వికారములు లేని వాడుగదా! (24). ఆ భూదేవి కూడా వెను వెంటనే శివుని ఆనతిని పొంది కుమారుని దోడ్కొని తన స్థానమునకు వెళ్లి బ్రహ్మానందమును పొందెను (15).

సబాలో భౌమ ఇత్యాఖ్యాం ప్రాప్య భుత్వా యువా ద్రుతమ్‌ l తస్యాం కాశ్యాం చిరం కాలం సిషేవే శంకరం ప్రభుమ్‌ ll 26

విశ్వేశ్వర ప్రసాదేన గ్రహత్వం ప్రాప్య భుమిజఃl దివ్యం లోకం జగామాశు శుక్రలోకాత్పరం వరమ్‌ ll 27

ఇత్యుక్తం శంభు చరితం సతీవిరహసంయుతమ్‌ l తపస్యాచరణం శంభోశ్శృణు చాదరతో మునే ll 28

ఇతి శ్రీ శివ మాహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే భౌవమోత్పత్తి వర్ణనం నామ దశమోsధ్యాయః (10).

ఆ బాలుడు భౌముడు(కుజుడు) అని పేరు గాంచి శీఘ్రముగా పెరిగి యువకుడయ్యెను. ఆతడు కాశీనగరములో చిరకాలము శంకర ప్రభుని సేవించెను (26). ఆ కుజుడు విశ్వేశ్వరుని అనుగ్రహమచే గ్రహత్వమును పొంది, శుక్రలోకము కంటె శ్రేష్ఠమగు దివ్యలోకమును శీఘ్రమే పొందెను (27). సతీ వియోగముతో నున్న శంభుని చరితమును నీకీ తీరున వర్ణించితిని. ఓ మహర్షీ! శంభుని తపశ్చరణమును గూర్చి చెప్పెదను. శ్రధ్ధతో వినుము(28).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో భౌముని పుట్టుక అను పదవ అధ్యాయము ముగిసినది (10).

Sri Sivamahapuranamu-II    Chapters