Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రింశో%ధ్యాయః

దేవదేవస్తుతి

సనత్కుమార ఉవాచ |

గత్వా తదైవ సవిధిస్తదా వ్యాస రమేశ్వరః | శివలోకం మహాదివ్యం నిరాధారమభౌతికమ్‌ || 1

సాహ్లాదో%భ్యంతరం విష్ణుర్జగామ ముదితాననః | నానారత్న పరిక్షిప్తం విలసంతం మహోజ్జ్వలమ్‌ || 2

సంప్రాప్య ప్రథమం ద్వారం విచిత్రం గణసేవితమ్‌ | శోభితం పరయా లక్ష్మ్యా మహోచ్చమతి సుందరమ్‌ || 3

దదర్శ ద్వారపాలాంశ్చ రత్నసింహాసన స్థితాన్‌ | శోభితాన్‌ శ్వేతవసై#్త్రశ్చ రత్నభూషణ భూషితాన్‌ || 4

పంచవక్త్రత్రినయనాన్‌ గౌర సుందరవిగ్రహాన్‌ | త్రిశూలాది ధరాన్‌ వీరాన్‌ భస్మరుద్రాక్షశోభితాన్‌ || 5

సబ్రహ్మాపి రమేశశ్చ తాన్‌ ప్రణమ్య వినమ్రకః | కథయామాస వృత్తాంతం ప్రభుసందర్శనార్థకమ్‌ || 6

తదాజ్ఞాం చ దదుస్తసై#్మ ప్రవివేశ తదాజ్ఞయా | పరం ద్వారం మహారమ్యం విచిత్రం పరమప్రభమ్‌ || 7

సనత్కుమారుడిట్లు పలికెను-

ఓ వ్యాసా! లక్ష్మీ పతి అదే సమయములో బ్రహ్మతో కలిసి మహాదివ్యమైనది, ఆధారము లేనిది, భూత నిర్మితము కానిది యగు శివలోకమునకు వెళ్లి (1), ఆనందముతో గూడిన ముఖము గలవాడై లోపలికి వెళ్లెను. విష్ణువు అనేక రత్నములు పొదుగుటచే మిరిమిట్లు గొల్పుతూ మెరియుచున్నది (2), రంగురంగులది, గణములచే సేవింపబడుచున్నది, గొప్ప కాంతితో శోభిల్లునది, చాల పెద్దది, మిక్కిలి సుందరమైనది అగు మొదటి ద్వారమును గాంచెను (3). రత్నసింహాసనములయందు కూర్చున్నవారు, తెల్లని వస్త్రములతో ప్రకాశించుచున్నవారు, రత్నభూషణములతో అలంకరింపబడిన వారు, అయిదు ముఖములు మూడు కన్నులు గలవారు, పచ్చని అందమగు దేహములు గలవారు, త్రిశూలమును మొదలగు ఆయుధములను దాల్చిన వీరులు, మరియు భస్మతో రుద్రాక్షలతో ప్రకాశించువారు అగు ద్వారపాలకులను కూడ గాంచెను (4, 5). లక్ష్మీపతి బ్రహ్మతో సహా వినమ్రతతో వారికి ప్రణమిల్లి ప్రభుడగు శివుని దర్శించదగిన పని గలదని చెప్పెను (6). అపుడు వారు ఆతనికి అనుజ్ఞనీయగా, ఆతడు మిక్కిలి సుందరమైనది, రంగురంగులది, గొప్ప కాంతులను వెదజల్లునది అగు ఆ గొప్ప ద్వారము లోపలకు ప్రవేశించెను (7).

ప్రభూపకంఠ గత్యర్థం వృత్తాంతం సంన్యవేదయత్‌ | తద్ద్వారపాయ చాజ్ఞప్తస్తేనాన్యం ప్రవివేశ హ || 8

ఏవం పంచదశద్వారాన్‌ ప్రవిశ్య కమలోద్భవః | మహాద్వారం గతస్తత్ర నందినం ప్రదదర్శ హ || 9

సమ్యఙ్‌ నత్వా చ తం స్తుత్వా పూర్వవత్తేన నందినా | ఆజ్ఞప్తశ్చ శ##నైర్విష్ణు ర్వివేశాభ్యంతరం ముదా || 10

దదర్శ గత్వా తత్రోచ్చైస్సభాం శంభోస్సముత్ర్పభామ్‌ | తాం పార్షదైః పరివృతాం లసద్దేహై స్సుభాషితమ్‌ || 11

మహేశ్వరస్య రూపైశ్చ దిగ్భుజైశ్శుభకాంతిభిః | పంచవక్త్రైస్త్రి నయనైశ్శితికంఠైర్మహోజ్జ్వలేః || 12

సద్రత్నయుక్తరుద్రాక్ష భస్మాభరణ భూషితైః | నవేందు మండలాకారాం చతురస్రాం మనోహరామ్‌ || 13

మణీంద్రహార నిర్మాణహీర సారసుశోభితామ్‌ | అమూల్యరత్నరచితాం పద్మపత్రైశ్చ శోభితామ్‌ || 14

అచట మరియొక ద్వారపాలకునకు కూడ తాను ప్రభువు వద్దకు వెళ్లవలసిన కారణము గలదని విష్ణువు విన్నవించి ఆతని అనుమతిని బడసి ఆ ద్వారము లోపల ప్రవెశించెను (8). బ్రహ్మ ఈ విధముగా పదిహేను ద్వారములను దాటి మహాద్వారమును చేరి అచట నందిని గాంచెను (9). విష్ణువు పూర్వము నందు వలె ఆ నందిని చక్కగా స్తుతించి నమస్కరించి ఆతని అనుమతిని పొంది ఆనందముతో మెల్లగా లోపలకు ప్రవేశించెను (10). అచటకు వెళ్లి అచట గొప్ప శోభ గలది, ఎత్తైనది, ప్రకాశించే దేహములు గల గణములతో చుట్టు వారబడి యున్నది, చక్కగా అలంకరింపబడినది అగు ఆ శంభుని సభను గాంచెను (11). మహేశ్వరుని రూపముగల ఆ గణములు పది భుజములతో, అయిదు ముఖములతో, మూడు కన్నులతో నల్లని కంఠములతో ప్రకాశించిరి. వారు దివ్యకాంతులతో ఒప్పారుచుండిరి (12). వారు మంచి రత్నములు పొదిగిన ఆభరణములను రుద్రాక్షలను అలంకరించుకొని భస్మను ధరించి యుండిరి. చతురస్రాకారముతో మనోహరముగా నున్న ఆ సభ నూతన చంద్రమండలము వలె శోభిల్లెను (13). మణులు, వజ్రములు పొదిగిన హారములతో ఆ సభ శోభిల్లెను. విలువ కట్టలేని రత్నములు పొదిగియున్న ఆ సభ పద్మపత్రములతో శోభిల్లుచుండెను (14).

మాణిక్యజాలమాలాభిర్నానాచిత్ర విచిత్రితామ్‌ | పద్మరాగేంద్రరచితామద్భుతాం శంకరేచ్ఛయా || 15

సోపాన శతకైర్యుక్తాం స్యమంతక వినిర్మితైః | స్వర్ణసూత్రగ్రంథియుక్తైశ్చారు చందన పల్లవైః || 16

ఇంద్రనీలమణిస్తంభైర్వేష్టితాం సుమనోహరామ్‌ | సుసంస్కృతాం చ సర్వత్ర వాసితాం గంధవాయునా || 17

సహస్రయోజనాయామాం సుపూర్ణాం బహుకింకరైః | దదర్శ శంకరం సాంబం తత్ర విష్ణుస్సురేశ్వరః || 18

వసంతం మధ్యదేశే చ యథేందుం తారకావృతమ్‌ | ఆమూల్యరత్ననిర్మాణ చిత్రసింహాసన స్థితమ్‌ || 19

కిరీటినం కుండలినం రత్నమాలా విభూషితమ్‌ | భస్మోద్ధూళిత సర్వాంగం బిభ్రంతం కేళిపంకజమ్‌ || 20

పురతో గీతనృత్యం చ పశ్యంతం సస్మితం ముదా ||21

మాణిక్యముల తోరణములు కలిగినది, రంగురంగుల కాంతులను విరజిమ్మునది, పద్మరాగ ఇంద్రనీల మణులతో అద్భుతముగా శంకరుని ఇచ్ఛకు అనురూపముగా నిర్మింపబడినది (15), స్యమంతకమణులు పొదిగినవి. బంగరు త్రాళ్లతో కట్టబడినవి, సుందరమగు చందననిర్మితమైన లతాపల్లవాదులతో శోభిల్లునవియగు వందమెట్లు కలిగినది (16), ఇంద్రనీలమణులు స్తంభములతో చుట్టువారబడి మిక్కిలి మనోహరముగా నున్నది, అంతటా చక్కగా అలంకరింపబడినది, పరిమళభరితమగు వాయువుచే నిండియున్నది (17), వేయి యోజనముల వెడల్పు గలది, అనేక మంది కింకరులతో నిండియున్నది అగు సభలో జగన్మాతతో గూడి యున్న శంకరుని దేవదేవుడగు విష్ణువు గాంచెను (18). సభామధ్యములో అమూల్యమగు రత్నములచే నిర్మింపబడిన వివిధవర్ణముల సింహాసనమునందు కూర్చుండి చుక్కలతో చుట్టువారు బడియున్న చందురునివలె శోభిల్లువాడు (19), కిరీట కుండల రత్నమాలలచే అలంకరింపబడినవాడు, భస్మలేపనము గల సర్వావయవములు గలవాడు, విలాసము కొరకై పద్మమును పట్టుకున్న వాడు (20), ఎదుట ప్రదర్శింపబడు చున్న గానసహిత నాట్యమును ఆనందపూర్వకముగా చిరునవ్వుతో తిలకించు చున్నవాడు అగు శివుని గాంచెను (21).

శాంతం ప్రసన్నమనసముమాకాంతం మహోల్లసమ్‌ | దేవ్యా ప్రదత్త తాంబూలం భుక్తవంతం సువాసితమ్‌ || 22

గణౖశ్చ పరయా భక్త్యా సేవితం శ్వేతచామరైః | స్తూయమానం చ సిద్ధైశ్చ భక్తి నమ్రాత్మకంధరైః || 23

గుణాతీతం పరేశానం త్రిదేవజనకం విభుమ్‌ | నిర్వికల్పం నిరాకారం సాకారం స్వేచ్ఛయా శివమ్‌ || 24

అమాయమజమాద్యం చ మాయాధీశం పరాత్పరమ్‌ | ప్రకృతేః పురుషస్యాపి పరమం స్వప్రభుం సదా || 25

ఏవం విశిష్టం తం దృష్ట్వా పరిపూర్ణతమం సమమ్‌ | విష్ణుర్బ్రహ్మా తుష్టువతుః ప్రణమ్య సుకృతాంజలీ || 26

శాంతుడు, ప్రసన్నమగు మనస్సు గలవాడు, పార్వతీపతి, గొప్ప ప్రకాశము గలవాడు, దేవిచే ఈయబడిన సుగంధ తాంబూలమును నములుచున్నవాడు (22), తెల్లని వింజామరలతో గణములచే సేవింపబడుచున్నవాడు, భక్తితో నమ్రమైన శిరస్సులు గల సిద్ధులచే స్తుతింపబడుచున్నవాడు (23), త్రిగుణములకు అతీతుడు, పరమేశ్వరుడు, త్రిమూర్తులకు తండ్రి, సర్వవ్యాపకుడు, భేదరహితుడు, ఆకారము లేని వాడు, యథేచ్ఛగా ఆకారమును స్వీకరించువాడు (24), మాయాసంగము లేనివాడు, పుట్టుక లేనివాడు, సర్వకారణుడు, మాయను వశము చేసుకున్నవాడు, పరాత్పరుడు, ప్రకృతి పురుషులకు అతీతమైనవాడు, నిత్యస్వరాట్‌ (25), పరిపూర్ణ తముడు, సర్వమునందు సమముగా నుండువాడు అగు శివుని గాంచి బ్రహ్మవిష్ణువులు చేతులు జోడించి నమస్కరించి స్తుతించిరి (26).

విష్ణువిధీ ఊచుతుః |

దేవదేవ మహాదేవ పరబ్రహ్మాఖిలేశ్వర | త్రిగుణాతీత నిర్వ్యగ్ర త్రిదేవజనక ప్రభో || 27

వయం తే శరణాపన్నా రక్షాస్మాన్‌ దుఃఖితాన్‌ విభో | శంఖచూడార్దితాన్‌ క్లిష్టాన్‌ సన్నాథాన్‌ పరమేశ్వర || 28

అయం యో%ధిష్ఠితో లోకో గోలోక ఇతి స స్మృతః | అధిష్టాతా తస్య విభుః కృష్ణో %య త్వదధిష్ఠితః || 29

పార్షదప్రవరస్తస్య సుదామా దైవయంత్రితః | రాధాశప్తో బభూవాథ శంఖచూడశ్చ దానవః || 30

తేన నిస్సారితాశ్శంభో పీడ్యమానాస్సమంతతః | హృతాధికారాస్త్రి దశా విచరంతి మహీతలే || 31

త్వం వినా న స వధ్యశ్చ సర్వేషాం త్రిదివౌకసామ్‌ | తం ఘాతయ మహేశాన లోకానాం సుఖమావహ || 32

త్వమేవ నిర్గుణ స్సత్యో%నంతో%నంత పరాక్రమః | సగుణశ్చ సన్నివేశః ప్రకృతేః పురుషాత్పరః || 33

బ్రహ్మవిష్ణువులిట్లు పలికిరి-

ఓ దేవదేవా! మహాదేవా! పరబ్రహ్మా! సర్వేశ్వరా! సత్త్వరజస్తమో గుణములకు అతీతమైనవాడా! ఆనందస్వరూపా! త్రిమూర్తుల తండ్రీ! ప్రభూ! (27). మేము నిన్ను శరణు పొందుచున్నాము. ఓ విభూ! పరమేశ్వరా! శంఖచూడునిచే పీడింపబడి క్లేశములను పొంది దుఃఖితులమై యున్నాము. సత్స్వరూపుడవగు నీవే మాకు నాథుడవు. మమ్ములను రక్షింపుము (28). ఇచటకు సమీపములో నున్న లోకమునకు గోలోకమని పేరు. దానికి శ్రీకృష్ణభగవానుడు అధీశ్వరుడు. ఆయనకు నీవు ప్రభుడవు (29). శ్రీకృష్ణుని అనుంగు సహచరుడగు సుదాముడు దైవవశముచే రాధచే శపింపబడి శంఖచూడుడనే దానవుడైనాడు (30). ఓ శంభూ! ఆతడు దేవతలను పరిపరి విధముల బాధలకు గురిచేసి స్వర్గమునుండి వెళ్లగొట్టినాడు. తమ అధికారములను పోగొట్టుకొనిన దేవతలు భూలోకములో తిరుగాడుచున్నారు (31). ఆతనిని దేవతలందరిలో ఒక్క రైననూ సంహరింపజాలరు. నీవు మాత్రమే ఆతనిని సంహరించగలవు. ఓ మహేశ్వరా! నీవాతనిని వధించి లోకములకు సుఖమును కలుగజేయుము (32). నిర్గుణుడు, సత్యస్వరూపుడు, అనంతుడు, అంతములేని పరాక్రమము గలవాడు, సగుణుడు, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు, ప్రకృతిపురుషులకు అతీతుడు అగు పరమాత్మ నీవే (33).

రజసా సృష్టిసమయే త్వం బ్రహ్మా సృష్టి కృత్ర్పభో | సత్త్వేన పాలనే విష్ణుస్త్రిభువావనకారకః || 34

తమసా ప్రలయే రుద్రో జగత్సంహారకారకః | నిసై#్త్రగుణ్య శివాఖ్యాతస్తుర్యో జ్యోతిస్స్వరూపకః || 35

త్వదీక్షయా చ గోలోకే త్వద్‌గవాం పరిపాలకః | త్వద్గోశాలా మధ్యగశ్చ కృష్ణః క్రీడత్యహర్నిశమ్‌ || 36

త్వం సర్వకారణమ్‌ స్వామీ విధిర్విష్ణ్వీశ్వరః పరమ్‌ | నిర్వికారీ సదా సాక్షీ పరమాత్మా పరేశ్వరః || 37

దీనానాథ సహాయీ చ దీనానాం ప్రతిపాలకః | దీనబంధుస్త్రి లోకేశశ్శరణాగతవత్సలః || 38

అస్మానుద్ధర గౌరీశ ప్రసీద పరమేశ్వర | త్వదధీనా వయం నాథ యదిచ్ఛసి తథా కురు || 39

ఓ ప్రభూ! సృష్టి కాలములో నీవు రజోగుణప్రధానుడవై బ్రహ్మరూపములో సృష్టిని చేసెదవు. విష్ణురూపములో సత్త్వగుణప్రధానుడవై ముల్లోకములను రక్షించెదవు (34). తమో గుణప్రధానుడవై రుద్రరూపములో ప్రళయకాలము నందు జగత్తును నాశము చేసెదవు. త్రిగుణా తీతమగు తురీయ శుద్ధచైతన్య స్వరూపుడవై శివనామముతో ప్రసిద్ధిని గాంచి యున్నావు (35). శ్రీకృష్ణుడు నీ ఆజ్ఞచే నీ గోవులను రక్షిస్తూ గోలోకములో నీ గోశాల మధ్యలో నున్న వాడై రాత్రింబగళ్లు క్రీడించుచున్నాడు (36). సర్వమునకు కారణము మరియు ప్రభువు నీవే. బ్రహ్మ విష్ణురుద్రరూపములలో నున్న నిర్వికార పరబ్రహ్మవు నీవే. నిత్యసాక్షియగు పరమాత్మ నీవే. నీవు ఈశ్వరులకు ఈశ్వరుడవు (37). దీనులకు అనాథులకు సాహాయ్యకారియై వారిని పాలించు దీన బంధువు నీవు. త్రిలోకాధిపతివి అగు నీవు శరణుజొచ్చిన వారియందు వాత్సల్యమును చూపెదవు (38). ఓ గౌరీపతీ! పరమేశ్వరా! మమ్ముల నుద్ధరించుము. ప్రసన్నుడవు కమ్ము. ఓ నాథా! మేము నీ ఆధీనములో నున్నాము. నీకు ఎట్లు ఇష్టమైనచో, అటులనే చేయుము (39).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా తౌ సురౌ వ్యాస హరిర్బ్రహ్మా చ వై తదా | విరేమతుశ్శివం నత్వా కరౌ బద్ధ్వా వినీతకౌ || 40

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే దేవదేవస్తుతిర్నామ త్రింశో%ధ్యాయః (30).

ఓ వ్యాసా! బ్రహ్మ విష్ణువులనే ఆ దేవతలిద్దరు అపుడిట్లు పలికి వినయముతో చేతులు జోడించి శివునకు నమస్కరించి విరమించిరి (40).

శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండలో దేవదేవస్తుతియను ముప్పదియవ ఆధ్యాయము ముగిసినది (30).

Sri Sivamahapuranamu-II    Chapters