Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ద్వాత్రింశో%ధ్యాయః

పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట

సనత్కుమార ఉవాచ|

అథేశానో మహారుద్రో దుష్టకాలాస్సతాం గతిః | శంఖచూడవధం చిత్తే నిశ్చికాయ సురేచ్ఛయా || 1

దూతం కృత్వా చిత్రరథం గంధర్వేశ్వరమీప్సితమ్‌ | శీఘ్రం ప్రస్థాపయామాస శంఖచూడాంతికే ముదా || 2

సర్వేశ్వరాజ్ఞయా దూతో య¸° తన్నగరం చ సః | మహేంద్రనగరోత్కృష్టం కుబేరభవనాధికమ్‌ || 3

గత్వా దదర్శ తన్మధ్యే శంఖచూడాలయం వరమ్‌ | రాజితం ద్వాదశైర్ద్వారైర్ద్వారపాల సమన్వితమ్‌ || 4

స దృష్ట్వా పుష్పదంతస్తు వరం ద్వారం దదర్శ సః | కథయామాస వృత్తాంతం ద్వారపాలయ నిర్భయః ||5

అతిక్రమ్య చ తద్ద్వారం జగామాభ్యంతరే ముదా | అతీవ సుందరం రమ్యం విస్తీర్ణం సమలంకృతమ్‌ || 6

స గత్వా శంఖచూడం తం దదర్శ దనుజాధిపమ్‌ | వీరమండలం మధ్యస్థం రత్నసింహాసనస్థితమ్‌ || 7

దానవేంద్రైః పరివృతం సేవితం చ త్రికోటిభిః | శతకోటిభిరన్యైశ్చ భ్రమద్భిశ్చస్త్ర పాణిభిః || 8

ఏవం భూతం చ తం దృష్ట్వా పుష్పదంతస్సవిస్మయః | ఉవాచ రణవృత్తాంతం యదుక్తం శంకరేణ చ || 9

సనత్కుమారుడిట్లు పలికెను -

తరువాత మహాభయంకరస్వరూపుడు, దుష్టులకు మృత్యువు, సత్పురుషులకు శరణు అగు ఈశ్వరుడు దేవతల కోర్కెపై శంఖచూడుని వధించవలెనని నిశ్చయించెను (1). తనకు ఇష్టుడగు చిత్రరథుడనే గంధర్వరాజును దూతను చేసి వెంటనే శంఖచూడుని వద్దకు ఆనందముతో పంపెను (2). ఆ దూత సర్వేశ్వరుని ఆజ్ఞచే, మహేంద్రనగరము వలె గొప్పదైన శంఖచూడుని నగరమునకు వెళ్లి, ఆ నగరమధ్యములో కుబేర భవనము కంటే గొప్పది, పన్నెండు ద్వారములతో ప్రకాశించునది, ద్వార పాలకులతో కూడినది అగు శంఖచూడుని శ్రేష్ఠమగు నివాసమును గాంచెను (3, 4). ఆ పుష్పదంతుడు (చిత్రరథుడు) శ్రేష్టమగు ద్వారమును గాంచి తాను వచ్చిన పనిని నిర్భయముగా ద్వారపాలకునకు చెప్పెను (5). ఆతడు మిక్కిలి సుందరముగా అలంకరింపబడి యున్న ఆ విశాలద్వారము దాటి ఆనందముతో లోపలకు వెళ్లెను (6). ఆతడు లోపలకు వెళ్లి వీరుల సముదాయము మధ్యలో రత్నసింహాసనము పైనున్న రాక్షసేశ్వరుడగు ఆ శంఖచూడుని గాంచెను (7). మూడు కోట్లమంది వీరులగు రాక్షసులచే చుట్టువారబడి యున్నవాడు, శస్త్రములను ధరించి తిరుగుతున్న వందకోటి ఇతరసైనికులచే సేవింపబడుచున్నవాడు (8) అగు ఆ శంఖచూడుని గాంచి పుష్పదంతుడు ఆశ్చర్యచకితుడై శంకరుడు చెప్పిన యుద్ధవృత్తాంతమునాతనికి చెప్పెను (9)

పుష్పదంత ఉవాచ |

రాజేంద్ర శివదూతో%హం పుష్పదంతాభిధః ప్రభో | యదుక్తం శంకరేణౖవ తచ్ఛృణు త్వం బ్రవీమీ తే || 10

ఓ మహారాజా! నేను శివుని దూతను. పుష్పదంతుడు నాపేరు. ఓ ప్రభూ! శంకరుని సందేహమును నీకు చెప్పెదను. దానిని వినుము (10).

శివ ఉవాచ |

రాజ్యం దేహి చ దేవానా మధికారం హి సాంప్రతమ్‌ | నో చేత్కురు రణం సార్ధం పరేణ చ మయా సతామ్‌ || 11

దేవా మాం శరణాపన్నా దేవేశం శంకరం సతామ్‌ | అహం క్రుద్ధో మహారుద్రస్త్వాం వధిష్యామ్యసంశయమ్‌ || 12

హరో%స్మి సర్వదేవేభ్యో హ్యభయం దత్త వానహమ్‌ | ఖలదండధరో%హం వై శరణాగతవత్సలః || 13

రాజ్యం దాస్యసి కిం వా త్వం కరిష్యసి రణం చ కిమ్‌ | తత్త్వం బ్రూహి ద్వయోరేకం దానవేంద్ర విచార్య వై || 14

శివుడిట్లు పలికెను-

వెంటనే దేవతలకు రాజ్యమును, అధికారమును అప్పజెప్పుము. లేనిచో సత్పురుషులకు పరమగమ్యమగు నాతో యుద్ధమును చేయుము (11). సత్పురుషులకు మంగళమును ఇచ్చు దేవదేవుడనగు నన్ను శరణు పొందినారు. మహారుద్రుడనగు నేను కోపించియున్నాను. నిన్ను నిస్సంశయముగా వధించగలను (12). సంహారకరుడను, దుష్టులను శిక్షించువాడను, శరణాగతవత్సలుడను అగు నేను దేవతలందరికీ అభయమునిచ్చి యున్నాను (13). రాజ్యమునప్ప జెప్పెదవా? లేక, యుద్ధమును చేసెదవా! ఓ రాక్షసేంద్రా! నీవు ఆలోచించి ఈ రెండింటిలో ఒక మార్గము నెన్నుకొని యథార్థమగు ప్రతివచనము నిమ్ము (14).

పుష్పదంత ఉవాచ |

ఇత్యుక్తం యన్మహేశేన తుభ్యం తన్మే నివేదితమ్‌ | వితథం శంభువాక్యం న కదాపి దను జాధిప || 15

అహం స్వస్వామినం గంతుమిచ్ఛామి త్వరితం హరమ్‌ | గత్వా వక్ష్యామి కిం శంభోస్తథా త్వం వద మామిహ || 16

పుష్పదంతుడిట్లు పలికెను-

మహేశుడు చెప్పిన సందేశమును నేను నీకు విన్నవించితిని. ఓ రాక్షసరాజా! శంభుని వాక్యము ఎన్నటికీ పొల్లు పోదు (15). నేను నా ప్రభువగు హరుని వద్దకు శీఘ్రముగా చేరవలెనని ఆకాంక్షించుచున్నాను. నేను అచటకు వెళ్లి శంభునకు ఏమని చెప్పవలెను? నీ సమాధానమును ఇప్పుడు చెప్పుము (16).

సనత్కుమార ఉవాచ |

ఇత్థంచ పుష్పదంతస్య శివదూతస్య సత్పతేః | ఆకర్ణ్య వచనం రాజా హసిత్వా తమువాచ సః || 17

సనత్కుమారుడిట్లు పలికెను -

సత్పురుషులకు ప్రభువగు శివుని దాతయైన పుష్పదంతుని ఈ వచనములను విని ఆ రాజు నవ్వి ఆతనితో నిట్లనెను (17).

శంఖచూడ ఉవాచ |

రాజ్యం దాస్యే న దేవేభ్యో వీరభోగ్యా వసుంధరా | రణం దాస్యామి తే రుద్ర దేవానాం పక్ష పాతినే || 18

యస్యోపరి ప్రయాయీ స్యాత్స వీరో భువనే% ధమః | అతః పూర్వమహం రుద్ర త్వాం గమిష్యామ్యసంశయమ్‌ || 19

ప్రభాత ఆగమిష్యామి వీరయాత్రా విచారతః | త్వం గచ్ఛాచక్ష్వ రుద్రాయ హీదృశం వచనం మమ ||20

ఇతి శ్రుత్వా శంఖచూడ వచనం సుప్రహస్య సః | ఉవాచ దానవేంద్రం స శంభుదూతస్తు గర్వితమ్‌|| 21

అన్యేషామపి రాజేంద్ర గణానాం శంకరస్య చ | న స్థాతుం సమ్ముఖే యోగ్యః కిం పునస్తస్య సమ్ముఖమ్‌|| 22

స త్వం దేహి చ దేవానా మధికారాణి సర్వశః | త్వమరే గచ్ఛ పాతాలం యది జీవితుమిచ్ఛసి || 23

సామాన్యమమరం తం నో విద్ధి దానవసత్తమ | శంకరః పరమాత్మా హి సర్వేషామీశ్వరేశ్వరః || 24

శంఖచూడుడిట్లు పలికెను-

దేవతలకు రాజ్యము నీయను. రాజ్యము (భూమి) వీరులు అనుభవింప దగినది. ఓ రుద్రా! దేవపక్షపాతివగు నీకు యుద్ధమును ఇచ్చెదను. (18) శత్రువునకు తనపై దండెత్తే అవకాశము నిచ్చు వీరుడు ఈ లోకములో అధముడు. ఓరుద్రా! కావున నేను ముందుగా నీపై దండెత్తెదను. దీనిలో సందేహము లేదు (19). నా జైత్రయాత్రను పరిశీలించినచో, నేను రేపు తెల్లవారు సరికి అచటకు చేరగలను. నీవు వెళ్లి నా ఈ వచనమును రుద్రునకు చెప్పుము (20). శంభుని దూతయగు పుష్పదంతుడు గర్వితుడగు శంఖచూడుని ఈ వచనములను విని నవ్వి ఆ రాక్షసరాజుతో నిట్లనెను (21). ఓ రాజశేఖరా! శంకరుని గణముల యెదుట నైననూ నిలువగలిగే యోగ్యత నీకు లేదు. ఇక శంకరుని ఎదుట నిలబడుట గురించి చెప్పునదేమున్నది? (22). కావున నీవు అధికారములనన్నిటినీ దేవతలకు అప్పజెప్పుము. ఓరీ! నీకు జీవించు కోరిక ఉన్నచో, పాతాళమునకు పొమ్ము (23). ఓ రాక్షసశ్రేష్ఠా! శంకరుడు సామాన్య దేవతయని తలంచుకుము. ఆయన సర్వులకు, మరియు ఈశ్వరులకు కూడ ఆధీశ్వరుడగు పరమాత్మ (24).

ఇంద్రాద్యాస్సకలా దేవా యస్యాజ్ఞానవర్తినస్సదా | సప్రజావతయస్సిద్ధా మునయశ్చాప్యహీశ్యరాః || 25

హరేర్విధేశ్చ స స్వామీ నిర్గుణస్సగుణస్స హి | యస్య భ్రూ భంగమాత్రేణ సర్వేషాం ప్రలయో భ##వేత్‌ || 26

శివస్య పూర్ణరూపశ్చ లోక సంహారకారకః | సతాం గతిం ర్దుష్టహంతా నిర్వికారః పరాత్పరః || 27

బ్రహ్మణో%ధిపతిస్సో%పి హరేరపి మహేశ్వరః | అవమాన్యా న వై తస్య శాసనా దానవర్షభ || 28

కిం బహుక్తేన రాజేంద్ర మనసా సంవిచార్య చ | రుద్రం విద్ధి మహేశానం పరం బ్రహ్మ చిదాత్మకమ్‌|| 29

దేహి రాజ్యం హి దేవానామధికారాంశ్చ సర్వశః | ఏవం తే కుశలం తాత భవిష్యత్యన్యథా భయమ్‌ || 30

ఇంద్రాది సమస్త దేవతలు, ప్రజాపతులు, సిద్ధులు, మునులు, మరియు నాగశ్రేష్ఠులు ఆయన ఆజ్ఞకు నిత్యము వశవర్తులై ఉందురు (25). బ్రహ్మ విష్ణువులకు ప్రభువగు ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా అగుచున్నాడు. ఆయన కనుబొమను విరిచినంతమాత్రాన సర్వలోకములకు ప్రళయము వాటిల్లును (26). లోకములను సంహరించే రుద్రుడు శివుని పూర్ణస్వరూపుడు. వికారములు లేని ఆ పరాత్పరుడు దుష్టులను సంహరించి సత్పురుషులకు శరణు నొసంగును (27). ఆ మహేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు కూడ అధీశ్వరుడు. ఓ దానవశ్రేష్ఠా! ఆయన శాసనమును తిరస్కరించుట తగదు (28). ఓ రాజశ్రేష్ఠా! ఇన్ని మాటలేల? మనస్సులో చక్కగా ఆలోచించుము. రుద్రుడే మహేశ్వరుడు, పరబ్రహ్మ, చైతన్యస్వరూపుడు అని తెలుసుకొనుము (29). దేవతలకు రాజ్యమును, సర్వాధికారములను అప్పజెప్పుము. కుమారా! ఈ తీరున చేసినచో నీకు క్షేమము కలుగ గలదు. అట్లు గానిచో, నీకుభయము తప్పదు (30).

సనత్కుమార ఉవాచ |

ఇతి శ్రుత్వా దానవేంద్రశ్శంఖచూడః ప్రతాపవాన్‌ | ఉవాచ శివదూతం తం భవితవ్య విమోహితః || 31

సనత్కుమారుడిట్లు పలికెను-

ప్రతాపశాలి, దావనశ్రేష్టుడు అగు శంఖచూడుడు ఈ పలుకులను విని విధిచే సమ్మోహితుడై ఆ శివుని దూతతో ఇట్లనెను (31).

శంఖచూడ ఉవాచ |

స్వతో రాజ్యం న దాస్యామి నాధికారాన్‌ వినిశ్చియాత్‌ | వినా యుద్ధం మహేశాన సత్యమేతద్బ్రవీమ్యహమ్‌ || 32

కాలాధీనం జగత్సర్వంవిజ్ఞేయం సచరాచరమ్‌ | కాలాద్భవతి సర్వం హి వినశ్యతి చ కాలతః || 33

త్వం గచ్ఛం శంకరం రుద్రం మయోక్తం వద తత్త్వతః | స చ యుక్తం కరోత్వేవం బహువార్తాం కురుష్వనో || 34

శంఖచూడుడిట్లు పలికెను-

మహేశ్వరునితో యుద్ధము చేయకుండగా నా అంతట నేను నిశ్చయించుకొని రాజ్యమును, అధికారములను అప్పజెప్పుట కల్ల. నేను సత్యమును పలుకు చున్నాను (32). ఈ స్థావరజంగమాత్మకమగు జగత్తు అంతయూ కాలమునకు వశ##మై యున్నది. సర్వము కాలమునందు పుట్టి, కాలమునందు గిట్టును (33). నీవు మంగళకరుడగు రుద్రుని వద్దకు వెళ్లి నా సందేశమును యథాతథగా చెప్పుము. ఆయన ఏది యోగ్యమో దానిని చేయగలడు. నీవు అధికప్రసంగమును చేయకుము (34).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా శివదూతో%సౌ జగామ స్వామినం నిజమ్‌ | యథార్థం కథయామాస పుష్పదంతశ్చ సన్మునే || 35

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే దూతగమనం నామ ద్వాత్రింశోధ్యాయః (32).

సనత్కుమారుడిట్లు పలికెను-

ఆతడిట్లు పలుకగా శివుని దూతయగు పుష్పదంతుడు తన ప్రభువు వద్దకు వెళ్లెను. ఓ మహర్షీ! ఆతడు యథాతథముగా జరిగిన సంభాషణను రుద్రునకు చెప్పెను (35).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి యుద్ధఖండలో శివదూత శంఖచూడ సంవాదమనే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).

Sri Sivamahapuranamu-II    Chapters