Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏకాదశోsధ్యాయః

హిమవంతునితో శివుని సమాగమము

బ్రహ్మోవాచl

వర్ధమానా గిరేః పుత్రి సా శక్తిర్లోకపూజితా l అష్ట వర్షా యదా జాతా హిమాలయగృహే సతీ ll 1

తజ్జన్మ గిరిశో జ్ఞాత్వా సతీ విరహకాతరః l కృత్వా తామద్భుతామంతర్ముమోదాతీవ నారదll 2

తస్మిన్నేవాంతరే శంభుర్లౌకికీం గతిమాశ్రితః l సమాధాతుం మనస్సమ్యక్తపః కర్తుం సమైచ్ఛతll 3

కాంశ్చిద్గణ వరాన్‌ శాంతాన్నంద్యాదీనవగృహ్యచ l గంగావతారమగమత్‌ హిమవత్ప్రస్థముత్తమమ్‌ ll 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

లోకములచే పూజింపబడే ఆ శక్తి హిమవంతుని పుత్రికయై ఆయన గృహములో పెరిగి ఎనిమిది సంవత్సరములు వయస్సు గలది అయెను (1). ఓ నారదా! సతీ వియోగ దుఃఖితుడైన శివుడు ఆమె జన్మించిన వృత్తాంతము నెరింగి అంద్భుతమగు ఆమె మూర్తిని తన హృదయుములో ధ్యానించి మిక్కిలి ఆనందించెను (2). అదే సమయములో లోకాచారము ననుసరించి శంభుడు మనస్సును నియంత్రించి గొప్ప తపస్సును చేయగోరెను (3). ఆయన నంది మొదలగు శాంతస్వభావము గల కొందరు గణములు వెంటరాగా ఉత్తమమగు హిమవత్పర్వత శిఖరమునందున్న గంగావతార క్షేత్రమును చేరుకొనెను (4).

యత్ర గంగా నిపతితా పురా బ్రహ్మ పురాత్ర్సుతాl సర్వాఫ°ఘవినాశాయ పావనీ పరమా మునే ll 5

తపః ప్రారంభమకరోత్‌ స్థిత్వా తత్ర వశీ హరఃl ఏకాగం చితయామాస స్వమాత్మానమతంద్రితః ll 6

చేతో జ్ఞానభవం నిత్యం జ్యోతీరూపం నిరామయమ్‌ l జగన్మయం చిదానందం ద్వైతాహీనం నిరాశ్రయమ్‌ ll 7

హరే ధ్యానపరే తస్మిన్‌ ప్రమథా ధ్యానతత్పరాః l అభవన్‌ కేచిదపరే నంది భృంగాదయో గణాః ll 8

ఓ మహర్షీ! పరమ పావనియగు గంగ సర్వుల పాపసమూహములను నశింప చేయుట కొరకై పూర్వము బ్రహ్మ పురమునుండి జారి ఇచట పడినది (5). జితేంద్రియుడగు శివుడు అచట నుండి తపమునారంభించెను. ఆయన అలసట ఎరుంగని వాడై ఆత్మస్వరూపమును ఏకాగ్రతతో ధ్యానించెను (6). నిత్యము, జ్యోతిస్స్వరూపము, నిర్దోషము, చిదానందఘనము, అద్వయము, సర్వాశ్రయము అగు అత్మ మనస్సులో అఖండ ధీరూపముగా గోచరించును. ఆత్మయే జగద్రూపముగా పరిణమించినది(7). శివుడు ధ్యానములో నిమగ్నుడై యుండగా, నంది, భృంగి మొదలగు కొందరు ప్రమథ గణములు కూడా ధ్యానమను చేయ మొదలిడిరి (8).

సేవాం చక్రుస్తదా కేచిద్గణాశ్శంభోః పరాత్మనఃl నైవాకూజంస్తు మౌనా హి ద్వారపాః కేచనాభవన్‌ ll 9

ఏతస్మిన్నంతరే తత్ర జగామ హిమభూధరఃl శంకరస్యౌషధిప్రస్థే శ్రుత్వాగమనమాదరాత్‌ ll 10

ప్రణనామ ప్రభుం రుద్రం సగణో భూధరేశ్వరః l సమానర్చ చ సుప్రీతస్తుష్టావ స కృతాంజలిః ll 11

అపుడు కొందరు గణములు శంభు పరమాత్ముని సేవను చేసిరి. మరి కొందరు శబ్దమును చేయకుండగా మౌనముగా ద్వార పాలురై నిలబడిరి(9). ఇంతలో ఔషధిప్రస్థములో శివుని రాకను గురించి విని హిమవంతుడు ఆదరముతో అచటకు విచ్చేసెను(10). గణములతో కూడియున్న ఆ పర్వతరాజు రుద్ర ప్రభువునకు చేతులొగ్గి నమస్కరించి ప్రేమతో పూజించి స్తుతించెను(11).

హిమాలయ ఉవాచl

దేవ దేవ మహాదేవ కపర్దిన్‌ శంకర ప్రభో l త్వయైవ లోకనాథేన పాలితం భువన త్రయమ్‌ ll 12

నమస్తే దేవదేవేశ యోగిరూపధరాయ చ l నిర్గుణాయ నమస్తుభ్యం సగుణాయ విహారిణ ll 13

కైలాసవాసినే శంభో సర్వలోకాటనాయ చ l నమస్తే పరమేశాయ లీలాకారాయ శూలినే ll 14

పరిపూర్ణ గుణాధాన వికారరహితాయ తే l నమోనీహాయ వీహాయ ధీరాయ పరమాత్మనే ll 15

హిమాలయుడిట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! జటాజూట ధారీ! శంకరా! ప్రభో! లోకనాథుడవగు నీవీ ముల్లోకములను పాలించుచున్నావు(12). హే దేవదేవా! ఈశ్వరా! యోగి రూపమును ధరించిన నీకు నమస్కారము. నిర్గుణుడవయ్యు సగుణుడవై విహరించు నీకు నమస్కారము (13). హే శంభో! కైలాసవాసి అయ్యు సర్వలోకములను సంచరించునట్టియు, లీలచే ఆకారమును స్వీకరించి శూలధారివగు నీకు నమస్కారము. నీవు పరమేశ్వరుడు (14). నీవు సకలగుణ నిధానమవు. వికారములు లేనట్టియు, కామనలు లేనట్టియు, విశిష్టమగు సంకల్ప శక్తి కలిగినట్టియు, జ్ఞానఘనుడైనట్టియు, పరమాత్మవగు నీకు నమస్కారము (15).

అబహిర్భోగకారాయ జనవత్సల తే నమః | త్రిగుణాధీశ మాయేశ బ్రహ్మణ పరమాత్మనే|| 16

విష్ణు బ్రహ్మాది సేవ్యాయ విష్ణు బ్రహ్మ స్వరూపిణ | విష్ణు బ్రహ్మ కదాత్రే త్రే భక్తిప్రియ నమో%స్తుతే || 17

తపోరత తపస్థ్సాన సుతపః ఫలదాయినే | తపః ప్రియాయ శాంతాయ నమస్తే బ్రహ్మరూపిణ || 18

వ్యవహార కరాయైవ లోకాచారకరాయ తే | సగుణాయ పరేశాయ నమో%స్తు పరమాత్మనే || 19

లీలా తవ మహేశానావేద్యా సాధుసుఖప్రదా | భక్తాధీన స్వరూపో%సి భక్తవశ్యో%సి కర్మకృత్‌|| 20

హే భక్తజనవత్సలా! నీ ఆనందము బాహ్య విషయ భోగమునందు లేదు. త్రిగుణాత్మకమగు మాయ నీ అధీనమునందుండును. పరబ్రహ్మ పరమాత్మ వగు నీకు నమస్కారము (16). నీవు విష్ణు బ్రహ్మ స్వరూపడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవింతురు. విష్ణు బ్రహ్మలకు ఆనందము నిచ్చునది నీవే. నీకు భక్తి ప్రియమైనది. నీకు నమస్కరామగు గాక! (17). తపస్సుపై నీకు ప్రీతి మెండు. నీవు తపోనిధివి. భక్తుల మంచి తపస్సునకు ఫలమునిచ్చునది నీవే. నీవు శాంతుడవు. పరబ్రహ్మవగు నీకు నమస్కారము (18). నీవు సగుణ రూపములో సర్వేశ్వరుడవై లోకాచారములను ప్రవర్తిల్ల జేయుచూ, వాటిని నీవు స్వయముగా ఆచరించెదవు. పరమాత్మవగు నీకు నమస్కారము (19). ఓ మహేశ్వరా! సాధువులకు సుఖములనిచ్చు నీ లీలను తెలియుట శక్యము కాదు. నీవు భక్తుల వశములో నుండి వారికి అనుకూలమగు కర్మలను చేయుచూ, వారికి ఆత్మరూపుడవై ఉన్నావు (20).

మమ భాగ్యోదయాదత్ర త్వమాగత ఇహ ప్రభో | సనాథం కృతవాన్మాం త్వం వర్ణితో దీనవత్సలః || 21

అద్యమే సఫలం జన్మ సఫలం జీవనం మమ | అద్య మే సఫలం సర్వం యదత్ర త్వం సమాగతః || 22

జ్ఞాత్వామాం దాస మవ్యగ్రమాజ్ఞాం దేహి మహేశ్వర | త్వత్సేవాం చ మహాప్రీత్యా కుర్యామహమనన్యధీః || 23

హే ప్రభో! నీవు ఇచటకు విచ్చేయుట నాకు మహా భాగ్యము. దీనవత్సలుడవని వర్ణింపబడు నీవు నన్ను నీ రాకచే సనాథుని చేసినావు (21). ఈనాడు నా పుట్టుక సఫలమైనది. నా జీవనము సఫలమైనది. నీవిచటకు వచ్చుటచే నాకు చెందిన సర్వము సఫలమైనది (22). ఓ మహేశ్వరా! నేను నీ దాసుడనని యెరుంగుము. నిస్సంకోచముగా నన్ను ఆజ్ఞాపించుము. నేను మరియొక తలంపు లేనివాడనై గొప్ప ప్రీతితో నీ సేవను చేసెదను (23).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య వచస్తస్య గిరీశస్య మహేశ్వరః | కించిదున్మీల్య నేత్రే చదదర్శ సగణం గిరిమ్‌ || 24

సగణం తం తథా దృష్ట్వా గిరిరాజం వృషధ్వజః | ఉవాచ ధ్యానయోగస్థ స్స్మయన్నివ జగత్పతిః || 25

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశ్వరుడు పర్వత రాజు యొక్క ఈ మాటలను విని, కన్నులను కొద్దిగా తెరచి, పరివార సమేతుడగు హిమవంతుని గాంచెను (24). జగత్ప్రభువు, ధ్యానయోగమునందున్నవాడు అగు వృషధ్వజుడు పరివారముతో గూడి అట్లు సవినయముగా నిలబడియున్న పర్వత రాజును గాంచి, ఆశ్చర్యమును చెందిన వాడు వోలె ఇట్లు పలికెను (25).

మహేశ్వర ఉవాచ|

తవ పృష్ఠే తపస్తప్తుం రహస్యమహమాగతః | యథా నకో%పి నికటం సమాయాతు తథా కురు || 26

త్వం మహాత్మా తపోధామా మునీనాం చ సదాశ్రయః | దేవానాం రాక్షసానాం చ పరేషాం చ మహాత్మనామ్‌ || 27

సదావాసో ద్విజాదీనాం గంగా పూతశ్చ నిత్యదా | పరోపకారీ సర్వేషాం గిరీణామధిపః ప్రభుః || 28

అహం తపశ్చ రామ్యత్ర గంగావతరణ స్థలే | ఆశ్రితస్తవ సుప్రీతో గిరిరాజ యతాత్మవాన్‌ || 29

మహేశ్వరుడిట్లు పకిలెను-

నేను నీ శిఖరముపై ఏకాంతముగా తపస్సును చేయుటకు వచ్చియుంటిని. నా సమీపమునకు ఎవ్వరైననూ రాని విధముగా ఏర్పాటు చేయుము (26). నీవు మహాత్ముడవు. తపస్సును చేయు అనేక మునులకు నీవు చక్కని ఆశ్రయమై ఉన్నావు. మరియు, దేవతలు, రాక్షసులే గాక ఇతరులగు మహాత్ములు (27), బ్రాహ్మణులు మొదలగు వారు సర్వదా నీయందు నివసించియున్నారు. గంగా జలముచే నీవు నిత్య శుద్ధుడవు. పర్వతములన్నింటికీ రాజగు నీవు పరోపకారమును చేయు ప్రభుడవు (28). నేనీ గంగావతరణ క్షేత్రములో తపస్సును చేసెదను. ఓ పర్వతరాజా! నేను జితేంద్రియుడనై మిక్కిలి ప్రీతితో నిన్ను ఆశ్రయించినాను (29).

నిర్విఘ్నం మే తపశ్చాత్ర హేతునా యేన శైలప | సర్వథా హి గిరిశ్రేష్ఠ సుయత్నం కురు సాంప్రతమ్‌ || 30

మమేదమేవ పరమం సేవనం పర్వతోత్తమ | స్వగృహం గచ్ఛ సుప్రీత్యా తత్సంపాదయ యత్నతః || 31

ఓ పర్వత రాజా! నాతపస్సు ఇచట ఇపుడు అన్ని విధములా నిర్విఘ్నముగా కొనసాగునట్లు మంచి యత్నమును చేయుము (30). ఓ పర్వత శ్రేష్ఠమా ! నీవు నాకు చేయగల గొప్ప సేవ ఇదియే. కావున, ఆ కార్యమును ప్రయత్న పూర్వకముగా చేయుము. ఇప్పుడు ఆనందముతో ఇంటికి మరలుము (31).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా జగతాం నాథ స్తూష్ణీమాస స సూతికృత్‌ | గిరిరాజస్తదా శంభుం ప్రణయా దిదమబ్రవీత్‌ || 32

బ్రహ్మ ఇట్లు పలికెను-

గొప్ప లీలలను ప్రకటించు వాడు జగన్నాథుడు అగు ఆ శివుడిట్లు పలికి మిన్నకుండెను. అపుడా పర్వత రాజు శంభునితో స్నేహపూర్వకముగా నిట్లనెను (32).

హిమాలయమ ఉవాచ |

పూజితో%సి జగన్నాథ మయా త్వం పరమేశ్వర | స్వాగతేనాద్య విషయే స్థితం త్వాం ప్రార్థయామి కిమ్‌ || 33

మహతా తపసా త్వం హి దేవైర్యత్న పరాశ్రితైః | న ప్రాప్యసే మహేశాన సత్వం స్వయముపస్థితః || 34

మత్తో%ప్యన్యతమో నాస్తి నమత్తో%న్యో%స్తి పుణ్యవాన్‌ | భవానితి చ మత్పృష్ఠే తపసే ముపస్థితః || 35

దేవేంద్రాదధికం మన్యే స్వాత్మానం పరమేశ్వర | సగణన త్వయాగత్య కృతో%నుగ్రహ భాగహమ్‌ || 36

హిమవంతుడిట్లు పలికెను-

ఓ జగత్ప్రభో! పరమేశ్వరా! నేను ఈనాడు నిన్ను పూజించితిని. ఈ ప్రదేశమునకు నేను నిన్ను ఈనాడు స్వాగతము చెప్పుచున్నాను. నా ప్రదేశమునందున్న నిన్ను నేను ఏమి కోరెదను? (33) ఓ మహేశ్వరా! మహాయత్నముతో గొప్ప తపస్సు చేసిన దేవతలకు కూడ దర్శనము నీయని నీవు స్వయముగా ఇచటకు వచ్చితివి (34). నా కంటె గొప్ప పుణ్యాత్ముడు మరియొకడు ఉండబోడు. ఏలయన, నీవు నాశిఖరముపై తపస్సు కొరకు విచ్చేసితివి (35). ఓ పరమేశ్వరా! నీవు గణములతో కూడి ఇచటకు వచ్చి నన్ను అనుగ్రహించుటచే, నేను దేవేంద్రుని కంటె అధికుడనైతినని భావించుచున్నాను (36).

నిర్విఘ్నం కురు దేవేశ స్వతంత్రః పరమం తపః | కరిష్యే%హం తథా సేవాం దాసో%హం తే సదా ప్రభో || 37

ఓ దేవదేవా! నీవు స్వతంత్రుడవు. ఇచట నిర్విఘ్నముగా గొప్ప తపస్సును చేసుకొనుము. అట్టి సేవను నేను నీకు చేయగలను. హే ప్రభో! నేను నీకు సర్వదా దాసుడను (37).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా గిరిరాజో%సౌ స్వం వేశ్మ ద్రుతమాగతః | వృత్తాంతం తం సమాచ ఖ్యౌప్రియాయై చ సమాదరాత్‌ || 38

నీయమానాన్‌ పరీవారాన్‌ స్వగణానపి నారద | సమాహూయాఖిలాన్‌ శైలపతిః ప్రోవాచ తత్త్వతః || 39

బ్రహ్మ ఇట్లు పలికెను-

పర్వత రాజు ఇట్లు పలికి వెంటనే తన గృహమునకు వచ్చి ఆ వృత్తాంతమును తన ప్రియురాలికి మిక్కిలి ఆదరముతో వివరించి చెప్పెను (38). ఓ నారదా! ఆ పర్వత రాజు తనతో వచ్చిన సేవకులను, ఇతర గణములను అందరినీ పిలిచి వారితో నిశ్చయముగా నిట్లు చెప్పెను (39).

హిమాలయ ఉవాచ|

అద్య ప్రభృతి నో యాతు కో%పి గంగావతారణమ్‌ | మచ్ఛాసనేన మత్ప్రస్థం సత్యమేతద్బ్రవీమ్యహమ్‌ || 40

గమిష్యతి జనః కశ్చిత్తత్ర చేత్తం మహాఖలమ్‌ | దండయిష్యే విశేషేణ సత్యమేతన్మయోదితమ్‌ || 41

ఇతి తాన్‌ స నియమ్యాశు స్వగణాన్నిఖిలాన్మునే | సుయత్నం కృతవాన్‌ శైలస్తం శృణు త్వం వదామి తే || 42

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం పార్వతీ ఖండే శివశైల సమాగమ వర్ణనం నామైకాదశో%ధ్యాయః (11).

హిమవంతుడిట్లు పలికెను-

ఈనాటినుండి ఏవ్వరైననూ నా శాసనముచే ఈ గంగావతరణమనే నా శిఖరమునకు వచ్చుట నిషేధింపబడినది. నేను సత్యమును పలుకుచున్నాను (40). అచటకు ఎవరైననూ వెళ్లినచో, అట్టి పరమదుర్మార్గుని తీవ్రముగా దండించగలను. నేను సత్యమును పలుకుచున్నాను (41). ఓ మహర్షీ ! ఆ పర్వతరాజు ఈ తీరున తన గణములన్నింటినీ శాసించి, శివుని ఏకాంతమునకు మంచి ఏర్పాటును చేసెను. ఆ వివరములను చెప్పెదను. నీవు వినుము (42).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి పార్వతీ ఖండలో శివశైలసమాగమ వర్ణనమనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

Sri Sivamahapuranamu-II    Chapters