Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చతుస్త్రింశోధ్యాయః

శంఖచూడుని యుద్ధయాత్ర

వ్యాస ఉవాచ |

విధితాత మహాబుద్ధే మునే జీవ చిరం సమాః | కథితం సుమాహచ్చిత్రం చరితం చంద్రమౌలినః || 1

శివదూతే గతే తత్ర శంఖచూడశ్చ దానవః | కిం చకార ప్రతాపీ స తత్త్వం వర సువిస్తరమ్‌ || 2

వ్యాసుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మపుత్రా! నీవు మహాబుద్ధిశాలివి. ఓ మునీ ! చిరకాలము జీవించుము. చిత్రమైనది, చాల గొప్పదియగు చంద్రశేఖరుని చరితమును చెప్పితివి (1). శివుని దూత మరలి పోగానే ప్రతాపవంతుడగు శంఖచూడాసురుడు ఏమి చేసినాడు? నీవా గాథను విస్తారముగా చెప్పుము (2).

సనత్కుమార ఉవాచ |

అథ దూతే గతే తత్ర శంఖచూడః ప్రతాపవాన్‌ | ఉవాచ తులసీం వార్తాం గత్వాభ్యంతరమేవ తామ్‌ || 3

సనత్కుమారుడిట్లు పలికెను -

దూత నిర్గమించిన తరువాత ప్రతాపవంతుడగు శంఖచూడుడు సభనుండి అంతఃపురము లోపలికి వెళ్లి ఆ వార్తను తులసికి చెప్పెను (3).

శంఖచూడ ఉవాచ |

శంఖదూతముఖాద్దేవి యుద్ధాయాహం సముద్యతః | తేన గఛ్ఛామ్యహం యోద్ధుం శాసనం కురు మే ధ్రువమ్‌ || 4

ఇత్యేవముక్త్వా స జ్ఞానీ నానాబోధనతః ప్రియామ్‌ | క్రీడాం చకార హర్షేణ తమనాదృత్య శంకరమ్‌ || 5

తౌదంపతీ చిక్రీడాతే నిమగ్నౌ సుఖసాగరే | నానాకామకలాభిశ్చ నిశి చాటు శ##తైరపి || 6

బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ ప్రాతః కృత్యం విధాయ చ | నిత్యకార్యం చ కృత్వాదౌ దదౌ దానమనంతకమ్‌ || 7

పుత్రం కృత్వా చ రాజేంద్రం సర్వేషు దానవేషు చ | పుత్రే సమర్ప్య భార్యాం చ సరాజ్యం సర్వసంపదమ్‌ || 8

ప్రియామాశ్వాసయామాస స రాజా రుదతీం పునః | నిషేధతీం చ గమనం నానావార్తాం ప్రకథ్య చ || 9

నిజసేనాపతిం వీరం సమాహూయ సమాదృతః | ఆదిదేశ స సన్నద్ధస్సం గ్రామం కర్తు ముద్యతః || 10

శంకచూడుడిట్లు పలికెను -

ఓ దేవీ! శంభుని దూత పలికిన పలుకులు నన్ను యుద్ధమునకు ప్రేరపించినవి. కావున నేను యుద్ధము కొరకు వెళ్లుచున్నాను. నీవు నా ఆజ్ఞను నిశ్చయముగా పాలించుము (4). జ్ఞానియగు ఆ శంఖచూడుడు ప్రియురాలితో నిట్లు పలికి ఆ శంకరుని అనాదరము చేసి ఆమెకు ఆనందముతో అనేకవిషయములను బోధిస్తూ ఆమెతో గూడి క్రీడించెను (5). ఆ దంపతులు రాత్రియందు సుఖసముద్రములో తేలియాడుతూ అనేక నర్మోక్తులను పలుకుతూ ఆనందముగా గడిపిరి (6). ఆతడు బ్రాహ్మ ముహూర్తమునందు నిద్ర లేచి, కాలకృత్యములను దీర్చుకొని ప్రాతఃకాల కర్మలననుష్ఠించి ముందుగా అంతులేని దానములను చేసెను (7). ఆతడు తన పుత్రిని సర్వదానవులకు చక్రవర్తిని చేసి రాజ్యమును, సర్వసంపదలను మరియు భార్యను ఆతనికి అప్పజెప్పను (8). ఆ రాజు తన యాత్రను ప్రతిఘటిస్తూ ఏడ్చుచున్న ప్రియురాలికి మరల అనేక వచనములను బోధించి ఓదార్చెను (9). అపుడాతడతు వీరుడగు తన సేనాపతిని పిలిపించెను. సాదరముగా నిలబడిన సేనానాయకుని సైన్యసన్నాహమును చేయుమని ఆదేశించి తాను స్వయముగా సంగ్రామమునకు సన్నద్ధుడాయెను (10).

అద్య సేనాపతే వీరా స్సర్వే సమరశాలినః | సన్నద్ధాఖిల కర్మాణో నిర్గచ్ఛంతు రణాయ చ || 11

దైత్యాశ్చ దానవాశ్శూరా షడశీతిరుదాయుధాః | కంకానాం బలినాం శీఘ్రం సేనా నిర్యాంతు నిర్భయాః || 12

పంచాశదసురాణాం హి నిర్గచ్ఛంతు కులాని వై | కోటివీర్యాణి యుద్ధార్థం శంభునా దేవపక్షిణా || 13

సన్నద్ధాని చ ధౌమ్రాణాం కులాని చ శతం ద్రుతమ్‌ | నిర్గచ్ఛంతు రణార్థం హి శంభునా మమ శాసనాత్‌ ||14

కాలకేయాశ్చ మౌర్యాశ్చ దౌర్హృదాః కాలకాస్తథా | సజ్జా నిర్యాంతు యుద్దాయ రుద్రేణ మమ శాసనాత్‌ || 15

ఓ సేనాపతీ! ఈనాడు యుద్ధనిపుణులగు వీరులందరు యుద్దమునకు కావలసిన ఏర్పట్లనన్నిటినీ సంసిద్ధము చేసుకొని బయలుదేరెదరుగాక! (11)దైత్యుల యొక్క, శూరలగు దానవులయొక్క, మరియు బలవంతులగు కంకులయొక్క ఎనభై ఆరుపటాలములు సైన్యము ఆయుధములను సిద్ధముచేసుకొని నిర్భయముగా వెంటనే బయలుదేరవలెను (12). కోటి సైన్యముతో సమమగు పరాక్రమముగల అసురుల సేనలు ఏబది గలవు. దేవపక్షపాతియగు శంభునితో యుద్దము కొరకై ఆ సేనలు బయలుదేరును గాక! (13) ధౌమ్రుల వంద సేనలు నా ఆజ్ఞచే సన్నద్ధులై శంభునితో యుద్దము కొరకు వెంటనే బయలుదేరవలెను (14). కాలకేయులు, మౌర్యులు, మరియు కాలకులు నా ఆజ్ఞచే సన్నద్ధులై రుద్రునితో యుద్ధము కొరకు బయలుదేరెదరు గాక! (15)

సనత్కుమార ఉవాచ |

ఇత్యుజ్ఞప్యాసురపతిర్దానవేంద్రో మహాబలః | నిర్జగామ మహాసైన్యస్సహసై#్రర్బహుభిర్వృతః || 16

తస్య సేనాపతిశ్చైవ యుద్ధశాస్త్ర విశారదః | మహాదథో మహావీరో రథినాం ప్రవరో రణ || 17

త్రిలక్షాక్షౌహిణీయుక్తో మాంగల్యం చ చకార హ | బహిర్బభూవ శిబిరాద్రణ వీరభయంకరః || 18

రత్నేంద్రం సారనిర్మాణం విమానమభిరుహ్య సః | గురువర్గం పురస్కృత్య రణార్థం ప్రయ¸° కిల || 19

పుష్పభద్రానతీ తీరే యత్రాక్షయవటశ్శుభః | సిద్దావ్రమే చ సిద్ధానాం సిద్ధిక్షేత్రం సు సిద్ధిదమ్‌ || 20

కపిలస్య తతస్థ్సానం పుణ్యక్షేత్రే చ భారతే | పశ్చిమోదధిపూర్వే చ మలయస్య హి పశ్చిమే || 21

శ్రీశైలోత్తరభాగే చ గంధమాదన దక్షిణ | పంచయోజన విస్తీర్ణం దైర్ఘ్యే శతగుణస్తథా || 22

సనత్కుమారుడిట్లు పలికెను -

అసురులకు, దానవులకు ప్రభువు, మహాబలశాలియగు శంఖచూడుడు ఇట్లు ఆజ్ఞాపించి వేలాది పటాలముల మహాసైన్యముతో చుట్టు వారబడిన వాడై బయలు దేరెను (16). ఆతని సేనాపతి యుద్ధకళలో నిపుణుడు, మహాదథి, మహావీరుడు, యుద్ధములో రథికులలో శ్రేష్ఠుడు (17). మూడు లక్షల అక్షౌహిణీల సేనతో గూడియున్న ఆ సేనాపతి మంగళకరమగు పూజాదులను చేసి శిబిరము బయటకు వచ్చెను. యుద్ధములో శత్రు వీరులకాతడు భయమును గొల్పు చుండెను (18).ఆతడు శ్రేష్ఠమగు రత్నములతో అద్భుతముగా నిర్మింపబడిన విమానము నధిష్ఠించి, పెద్దలందరికీ నమస్కరించిన తరువాత, యుద్ధము కొరకు బయలుదేరెను (19). పుష్పభద్రానదీ తీరమునందు శుభకరమగు అక్షయ వటవృక్షము గలదు. సిద్ధులకు తపస్సిద్ధినొసంగి సిద్ధిక్షేత్రమని పేరు పొందిన సిద్ధాశ్రామమచటనే గలదు (20). పుణ్యభూమి యగు భారతదేశములో కపిలుని స్థానమదియే. అది పశ్చిమసముద్రము నకు తూర్పునందు, మలయపర్వతమునకు పశ్చిమమునందు (21), శ్రీశైలమునకు ఉత్తరమునందు, గంధమాదన పర్వతమునకు దక్షిణమునందు గలదు. అది అయిదు యోజనములు వెడల్పు, అంతకు వందరెట్లు పొడవు కలిగి యుండెను (22).

శుద్ధస్ఫటిక సంకాశా భారతే చ సుపుణ్యదా | పుష్పభద్రా నదీ రమ్యా జలపూర్ణా సరస్వతీ || 23

లవణోదధిప్రియా భార్యా శశ్వత్సౌభాగ్యసంయుతా | సరస్వతీ సంశ్రితా చ నిర్గతా సా హిమాలయాత్‌ || 24

గోమంతం వామతః కృత్వా ప్రవిష్టా పశ్చిమోదధౌ | తత్ర గత్వా శంకచూడశ్శివసేనాం దదర్శ హ || 25

ఇతి శ్రీశివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే శంఖచూడ యాత్రా వర్ఱనం నామ చతుస్త్రింశో%ధ్యాయః (34).

శుద్ధమగు స్ఫటికము వలె తెల్లనైన జలములతో నిండియున్నది, భారతదేశములోని పుణ్యనదులలో గొప్పది, సుందరమైనది, సరస్వతి యను పేరు గలది,సముద్రునకు ప్రియురాలైన పత్నియైనది, భక్తులకీయదగిన సర్వసౌభాగ్యములు గలది, సరస్వతీనది ని ఆశ్రయించి ఉన్నది, హిమాలయమునుండి పుట్టినది, గోమంతము (గోవా)నకు ఎడమగా ప్రవహించి పశ్చిమసముద్రములో ప్రవేశించునది అగు పుష్పభద్రానది వద్దకు వెళ్లి, శంఖచూడుడు అచట శివుని సేనను గాంచెను (23, 24, 25).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడయాత్రా వర్ణనమనే ముప్పది నాలుగవ అధ్యాయము ముగిసినది (34).

Sri Sivamahapuranamu-II    Chapters