Sri Sivamahapuranamu-II    Chapters   

అథ పంచత్రింశో%ధ్యాయః

శంఖచూడుని దూత శివునితో సంభాషించుట

సనత్కుమార ఉవాచ |

తత్ర స్థిత్వా దానవేంద్రో మహాంతం దానవేశ్వరమ్‌ | దూతం కృత్వా మహావిజ్ఞం ప్రేషయామాస శంకరమ్‌ || 1

స తత్ర గత్వా దూతశ్చ చంద్రభాలం దదర్శ హ | వటమూలే సమాసీనం సూర్యకోటి సమప్రభమ్‌ || 2

కృత్వా యోగాసనం దృష్ట్యా ముద్రాయుక్తం చ సస్మితమ్‌ | శుద్ధస్ఫటికసంకాశం జ్వలంతం బ్రహ్మతేజసా || 3

త్రిశూల పట్టిశధరం వ్యాఘ్ర చర్మాంబరావృతమ్‌ | భక్తమృత్యుహరం శాంతం గౌరీకాంతం త్రిలోచనమ్‌ || 4

తపసాం ఫలదాతారం కర్తారం సర్వ సంపదామ్‌ | ఆశుతోషం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకమ్‌ || 5

విశ్వనాథం విశ్వబీజం విశ్వరూపం చ విశ్వజమ్‌ | విశ్వంభరం విశ్వకరం విశ్వసంహారకారణమ్‌ || 6

కారణం కారణానాం చ నరకార్ణవతారణమ్‌ | జ్ఞానప్రదం జ్ఞానబీజం జ్ఞానానందం సనాతనమ్‌ || 7

అవరుహ్య రథాద్దూతస్తం దృష్ట్వా దానవేశ్వరః | శంకరం సకుమారం చ శిరసా ప్రణనామ సః || 8

వామతో భద్రకాలీం చ స్కందం తత్పురతస్థ్సితమ్‌ | లోకాశిషం దదౌ తసై#్మ కాలీ స్కందశ్చ శంకరః || 9

అథాసౌ శంకచూడస్య దూతః పరమశాస్త్రవిత్‌ | ఉవాచ శంకరం నత్వా కరౌ బద్ధ్వా శుభం వ చః || 10

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆ రాక్షసరాజు అక్కడ మకాము చేసి, మహాజ్ఞాని యగు ఒక గొప్ప దానవశ్రేష్ఠుని శివుని వద్దకు దూతగా పంపెను (1). ఆ దూత అచటకు వెళ్లి, ఫాలభాగమునందు చంద్రవంక గలవాడు, వట వృక్షమూలము నందు కూర్చున్నవాడు, కోటి సూర్యులతో సమానముగు కాంతి గలవాడు (2), యోగాసనమును వేసి కనులతో ముద్రను ప్రదర్శించువాడు, చిరునగవు మోమువాడు, స్వచ్ఛమగు స్ఫటికమును బోలియున్నవాడు, బ్రహ్మతేజస్సుతో వెలిగి పోవుచున్న వాడు (3), త్రిశూలమును పట్టిశమును పట్టుకున్న వాడు, వ్యాఘ్రచర్మమును వస్త్రముగా దాల్చినవాడు, భక్తుల మృత్యువును పోగోట్టువాడు, శాంతస్వరూపుడు, గౌరీప్రియుడు, ముక్కంటి (4), తపస్సుల ఫలములనిచ్చువాడు, సర్వసంపదలను కలిగించువాడు, శీఘ్రముగా సంతోషించువాడు, ప్రసన్నమగు మోముగలవాడు, భక్తులను అనుగ్రహించువాడు (5) , జగత్తునకు తండ్రి, జగత్తునకు కారణము, జగత్‌ స్వరూపములో నున్నవాడు, సర్వమునుండి పుట్టువాడు,సర్వమును పాలించువాడు, సర్వమునకు కర్త, జగత్తును ఉపసంహరించు వాడు (6), సర్వకారణ కారణుడు, పాపసముద్రమును దాటించువాడు, జ్ఞానమునిచ్చువాడు, జ్ఞానమునకు కారణుడు, జ్ఞాన-ఆనంద స్వరూపడు, అద్యంతములు లేనివాడు (7) అగు శంకరుడు కుమారస్వామితో కూడియుండగా చూచెను. దూతయగు ఆ దానవీరుడు రథమునుండి దిగి ఆయనకు శిరము వంచి ప్రణమిల్లెను (8). ఆయనకు ఎడమవైపున భద్రకాళి, ఎదుట కుమారస్వామి ఉండిరి. లోకమర్యాదనను సరించి కాళి, కుమారస్వామి, మరియు శంకరుడు ఆతనిని ఆశీర్వదించిరి (9). గొప్ప శాస్త్రవేత్తయగు, శంఖచూడుని దూత అపుడు చేతులు జోడించి శంకరునకు ప్రణమిల్లి ఈ శుభవచనములను పలికెను (10).

దూత ఉవాచ |

శంఖచూడస్య దూతో%హం త్వస్సకాశమిహాగతః | వర్తతే తే కిమిచ్ఛాద్య తత్త్వం బ్రూహి మహేశ్వర || 11

దూత ఇట్లు పలికెను -

ఓ మహేశ్వరా! నేను శంఖచూడుని దూతను. నీవద్దకు ఇచటకు వచ్చి యున్నాను.. ఇపుడు నీ కోరిక ఏమి? నాకు సత్యమును చెప్పుము (11).

సనత్కుమార ఉవాచ |

ఇతి శ్రుత్వా చ వచనం శంఖచూడస్య శంకరః | ప్రసన్నాత్మా మహాదేవో భగవాంస్తమువాచ హ || 12

సనత్కుమారుడిట్లు పలికెను -

మంగళకరుడు, ప్రసన్నమగు మనస్సు గలవాడు అగు మహాదేవుడు శంఖచూడుని ఆ సందేశమును వినెను. భగవానుడాతనితో నిట్లనెను (12).

మహాదేవ ఉవాచ |

శృణు దూత మహాప్రాజ్ఞ వచో మమ సుఖావహమ్‌ | కథనీయమిదం తసై#్మ నిర్వివాదం విచార్య చ || 13

విధాతా జగతాం బ్రహ్మా పితా ధర్మస్య ధర్మవిత్‌ | మరీచిస్తస్య పుత్రశ్చ కశ్యపస్తత్సుత స్స్మృతః || 14

దక్షః ప్రీత్యా దదౌ తసై#్మ నిజకన్యాస్త్రయోదశ | తాస్వేకా చ దనుస్సాధ్వీ తత్సౌభాగ్యవివర్ధినీ || 15

చత్వారస్తే దనోః పుత్రా దానవాస్తేజసోల్బణాః | తేష్వేకో విప్రచిత్తిస్తు మహాబలపరాక్రమః || 16

తత్పుత్రో ధార్మికో దంభో దానవేంద్రో మహామతిః | తస్య త్వం తనయశ్శ్రేష్ఠో ధర్మాత్మా దానవేశ్వరః || 17

పూరా త్వం పార్షదో గోపో గోపేష్వేవ చ ధార్మికః | అధునా రాధికాశాపాజ్ఞాతస్త్వం దానవేశ్వరః || 18

దానవీం యోని మాయాతస్తత్త్వతో నహి దానవః | నిజవృత్తం పురా జ్ఞాత్వా దేవవైరం త్యజాధునా || 19

ద్రోహం న కురు తైస్సార్ధం స్వపదం భుంక్ష్వ సాదరమ్‌ | నాధికం సవికారం చ కురు రాజ్యం విచార్య చ || 20

దేహి రాజ్యం చ దేవానాం మత్ప్రీతిం రక్ష దానవ | నిజరాజ్యే సుఖం తిష్ఠ తిష్ఠంతు స్వపదే సురాః || 20

అలం భూత విరోధేన దేవద్రోహేణ కిం పునః | కులీనా శ్శుద్ధకర్మాణస్సర్వే కశ్యప వంశజాః || 22

యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ | జ్ఞాతిద్రోహజ పాపస్య కలాం నార్హంతి షోడశీమ్‌ || 23

మహాదేవుడిట్లు పలికెను -

ఓ దూతా! నీవు గొప్ప బుద్ధిశాలివి. సుఖకరమగు నా మాటను వినుము. నీవు ఆలోచించి వివాదమును తొలగించే ఈ మాటలను వానికి చెప్పుము (13). ధర్ముని తండ్రి, ధర్మజ్ఞుడు అగు బ్రహ్మ జగత్తులను సృష్టించెను. ఆయన కుమారుడు మరీచి. ఆయన కొడుకు కశ్యపుడు (14). దక్షుడు ఆ కశ్యపునకు తన పదముగ్గురు కుమార్తెలనిచ్చి ప్రీతి పూర్వకముగా వివాహమును చేసెను. వారిలో దనువు ఒకతె. ఆమె పతివ్రత. ఆమె వలన కశ్యపుని సౌభాగ్యము వర్ధిల్లెను (15). దనువునకు తేజశ్శాలురు, వీరులు అగు నల్గురు పుత్రులు గలరు. వారికి దానవులని పేరు. వారిలో మహాబలపరాక్రమశాలియగు విప్రచిత్తి ఒకడు (16). దానవశ్రేష్ఠుడు, మహాప్రాజ్ఞుడు ధార్మికుడు అగు దంభుడు ఆయన కుమారుడు. శ్రేష్ఠుడవు, ధర్మాత్ముడవు, దానవాధీశ్వరుడువు అగు నీవు దంభుని పుత్రుడవు (17). పూర్వజన్మలో నీవు ధర్మాత్ముడు, గోపబాలకులలో ప్రముఖుడు అగు శ్రీ కృష్ణానుచరుడవు. రాధాదేవి యొక్క శాపముచే ఈ జన్మలో దానవచక్రకర్తివై జన్మించినవావు (18). నీవు దానవజన్మను పొందియున్ననూ, నీది దానవస్వభావము కాదు. నీవు నీ పూర్వజన్మ వృత్తాంతము నెరింగి ఇప్పుడు దేవతలతో నీకు గల వైరమును పరిత్యజింపుము (19). వారి యెడల ద్రోహము నాచరించకుము. నీ పదవిని ఆనందముగా అనుభవించుము. నీవు రాజ్యమును విస్తరింపజేయుటకు గతాని, లేక కల్లోలమును సృష్టించుటకు గాని యత్నించకుము. ఆలోచించుము (20). దేవతలకు వారి రాజ్యమును అప్పజెప్పుము. ఓ దానవా! నాకు నీయందు గల ప్రేమను నిలబెట్టు కొనుము. నీ రాజ్యములో నీవు సుఖముగా నుండుము. దేవతలు తమ స్థానములో ఉండెదరు గాక! (21) ప్రాణులతో విరోధమును చాలించుము. దేవద్రోహము వలన ప్రయోజనమేమి గలదు? కశ్యపుని వంశములో పుట్టిన వాందరు శుద్ధముగ కర్మలననుష్ఠించి కులమర్యాదను నిలబెట్టెదరు (22). బ్రహ్మ హత్య మొదలగు ఏ పాపము లైనను జ్ఞాతి ద్రోహము వలన కలిగే పాపములో పదునారవ వంతు అయిననూ కాజాలవు (23).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాది బహువార్తాం చ శ్రుతిస్మృతిపరాం శుభామ్‌ | ప్రోవాచ శంకరస్తసై#్మ బోధయన్‌ జ్ఞానముత్తమమ్‌ || 24

శిక్షితశ్శంఖచూడేన స దూతస్తర్క విత్తమః | ఉవాచ వచనం నమ్రో భవితవ్య విమోహితః || 25

సనత్కుమారుడిట్లు పలికెను -

ఈ తీరున శంకరుడు శ్రుతిస్మృతుల తాత్పర్యముతో కూడిన శుభకరమగు అనేక వచనమును పలికి ఆతనికి ఉత్తమమగు జ్ఞానమును బోధించెను (24). కాని ఆ దూత తర్కములో దిట్ట ; పైగా శంఖచూడుడు ఆతనికి తర్ఫీడునిచ్చి పంపెను. కావున ఆతడు విధిబలముచే మోహమును పొంది వినయముతో నిట్లు పలికెను (25).

దూత ఉవాచ |

త్వయా యత్కథితం దేవ నాన్యథా తత్తథా వచః | తథ్యం కించిద్యథార్థం చ శ్రూయతాం మే నివేదనమ్‌ || 26

జ్ఞాతిద్రోహే మహత్పాపం త్వయోక్త మధునా చ యత్‌ | తత్కిమీశాసురాణాం చ న సురాణాం వద ప్రభో || 27

సర్వేషామితి చేత్తద్వై తదా వచ్చి విచార్య చ | నిరన్ణయం బ్రూహి తత్రాద్య కురు సందేహభంజనమ్‌ || 28

మభుకైటభయోర్దైత్యవరయోః ప్రలయార్ణవే | శిరశ్ఛేదం చకారాసౌ కస్మాచ్చక్రీ మహేశ్వర || 29

త్రిపురైస్సహ సంయుద్ధం భస్మత్వకరణం కుతః | భవాన్‌ చకార గిరిశ సురపక్షీతి విశ్రుతమ్‌ || 30

గృహీత్వా తస్య సర్వస్వం కుతః ప్రస్థాపితో బలిః | సుతలాది సముద్ధర్తుం తద్ద్వారే చ గదాధరః || 31

సభ్రాతృకో హిరణ్యాక్షః కథం దేవైశ్చ హింసితః | శుంభాదయోసురాశ్చైవ కథం దేవైర్నిపాతితాః || 32

దూత ఇట్లు పలికును -

ఓ దేవా! నీవు చెప్పిన వచనములన్నియూ సత్యమే. మరియొకటి గాదు. ఆయిననూ నేను కూడ కొన్ని యథార్థ విషయములను విన్నవించెదను. వినుడు (26). ఓ ప్రభూ! జ్ఞాతులకు ద్రోహము చేయుట మహాపాపమని నీవీనాడు చెప్పిన మాట రాక్షసులకు మాత్రమే ఏల వర్తించుచున్నది? ఓ ఈశా! అది దేవతలకు అన్వయించదా యేమి? చెప్పుడు (27). అందరికీ వర్తించుననే పక్షములో, నేను ఆలోచించి కొన్ని విషయములను చెప్పెదను. వాటిపై మీ నిర్ణయమును ప్రకటించి నా సందేహమును తొలగించుడు (28). ఓ మహేశ్వరా1 ప్రళయసముద్రములో రాక్షసులలో శ్రేష్ఠులగు మధుకైటభుల తలలను చక్రధారి యగు విష్ణువు నరుకుటకు కారణమేమి? (29) నీవు త్రుపురాసులతో యుద్ధమును చేసి వారి నగరములను భస్మము చేయుటకు కారణమేమి? ఓ కైలాసగిరీశా! నీవు దేవపక్షపాతివని ప్రసిద్ధిని గాంచినావు (30). బలిచక్రవర్తియొక్క సర్వస్వమును ఊడలాగుకొని, ఆతనిని పాతాళమునకు సాగనంపుటకు కారణమేమి? గదాధరుడగు విష్ణువు ద్వారపాలకుడై ఆతనిని ఉద్ధరించినాడు 931). దేవతలు హిరణ్యాక్షుని, ఆతని సోదరుని హింసించుటకు కారణమేమి? దేవతలు శుంభాది రాక్షసులను సంహరించుటకు కారణమేమి? (32)

పురా సముద్రమథనే పీయూషం భక్షితం సురైః | క్లేశభాజో వయం తత్ర తే సర్వే ఫలభోగినః || 33

క్రీడా భాండమిదం విశ్వం కాలస్య పరమాత్మన ః | స దదాతి యదా యసై#్మ తసై#్యశ్వర్యం భ##వేత్తదా || 34

దేవదానవయోర్వైరం శశ్వన్నైమిత్తికం సదా | పరాజయో జయస్తేషాం కాలాధీనః క్రమేణ చ |7 35

తవానయోర్విరోధే చ గమనం నిష్ఫలం భ##వేత్‌ | సమసంబంధినాం తద్వై రోచతే నేశ్వరస్య తే || 36

సురాసురాణాం సర్వేషామీశ్వరస్య మహాత్మనః | ఇయం తే రహితా లజ్జా స్పర్ధాస్మాభిస్సహాధునా || 37

యతో%ధికా చైవ కీర్తిర్హానిశ్చైవ పరాజయే | తవైతద్విపరీతం చ మనసా సంవిచార్యతామ్‌ || 38

పూర్వము సముద్రమును మథించినప్పుడు దేవతలు అమృతమున భక్షించిరి. అపుడు మేము ఇడుముల పాలైతిమి. వారందరు ఫలమును అనుభవించిరి (33). ఈ జగత్తు కాలరూపుడగు పరమాత్మకు ఆటవస్తువు. ఆయన ఎప్పుడు ఎవ్వనికి ఐశ్వర్యమునిచ్చునో, అప్పుడు వాడు దానిని భోగించును (34). దేవదానవుల మధ్య శాశ్వతమగు వైరము గలదు. సర్వదా దానికి నిమిత్తము కూడ గలదు. వారికి జయపరాజయములు క్రమముగా కాలమునకు అధీనమై లభించు చుండును 935). వారి ఈ విరోధములో నీవు తలదూర్చుట వ్యర్థము అగును. ఇరుపక్షముల వారికి నీతో సమసంబంధము గలదు. కావున ఈశ్వరుడవగు నీవు ఒక పక్షమున చేరుట సొగసుగా లేదు (36). దేవదానవులకు అందరికీ ప్రభుడవు, మహాత్ముడవు అగు నీవు ఈ నాడు ఈ విధముగా మాతో కయ్యమునకు దిగుట సిగ్గుచేటు (37). నీవు జయించినచో నీ కీర్తి లేశ##మైననూ ఇనుమడించదు. కాని నీవు ఓడినచో కీర్తికి హాని కలుగును. ఈ వైపరీత్యమును నీవు మనస్సులో చక్కగా విచారించదగును (38).

సనత్కుమార ఉవాచ |

ఇత్యేతద్వచనం శ్రుత్వా సంప్రహస్య త్రిలోచనః | యథోచితం చ మధురమువాచ దానవేశ్వరమ్‌ || 39

సనత్కుమారుడిట్లు పలికెను -

ఈ మాటలను విని ముక్కంటి బిగ్గరగా నవ్వి దానవచక్రకర్తియగు శంఖచూడుని ఉద్దేశించి యథోచితము, మధురము అగు వచనమును పలెకెను (39).

మహేశ ఉవాచ|

వయం భక్తపరాధీనా న స్వతంత్రాః కదాపి హి | తదిచ్ఛయా తత్కర్మాణో న కస్యాపి చ పక్షిణః || 40

పురా విధిప్రార్థనయా యుద్ధమదౌ హరేరపి | మధుకైటభయోర్దైత్య వరయోః ప్రలయార్ణవే || 41

దేవప్రార్థనయా తేన హిరణ్యకశిపోః పురా | ప్రహ్రాదార్థం వధో%కారి భక్తానాం హితకారిణా || 42

త్రిపురైస్సహ సంయుద్ధం భస్మత్వకరణం తతః | దేవప్రార్థనయా%కారి మయాపి చ పురా శ్రుతమ్‌ || 43

సర్వేశ్వర్యాస్సర్వమాతుర్దేవ ప్రార్థనయా పురా | ఆసీచ్ఛుంభాదిభిర్యుద్ధం వధస్తేషాం తయా కృతః || 44

అద్యాపి త్రిదశాస్సర్వే బ్రహ్మాణం శరణం యయుః | స సదేవో హరిర్మాం చ దేవశ్శరణమాగతః || 45

హరిబ్రహ్మాదికానాం చ ప్రార్థనా వశతో%ప్యహమ్‌ | సురాణా మీశ్వరో దూత యుద్ధార్థమగమం ఖలు || 46

మహేశ్వరుడిట్లు పలికెను -

మేము భక్తులకు వశవర్తులమై ఉండెదము. మేము ఎన్నటికీ స్వతంత్రులము కాము. భక్తుల కోర్కెచే వారి కార్యములను చేయువారమే గాని, ఏ ఇక్కరి పక్షమునైనూ స్వీకరించువారము గాము (40). పూర్వము ప్రళయసముద్రములో విష్ణువు బ్రహ్మ యొక్క ప్రార్థన నాలకించి దైత్యవీరులగు మధుకైటభులతో సృష్ట్యాదియందు యుద్ధమును చేసెను (41). పూర్వము భక్తులకు హితమును చేయు విష్ణువు దేవతల ప్రార్థనను మన్నించి ప్రహ్లాదుని కొరకై హిరణ్యకశపుని సంహరించెను (42). పూర్వము నేను కూడా దేవతల ప్రార్థనను మన్నించి త్రిపురులతో గొప్ప యుద్ధమును చేసి వారి పురములను భస్మమొనర్చిన వృత్తాంతము లోక విదితమే (43). సర్వేశ్వరి, సర్వజగన్మాత యగు దుర్గ పూర్వము దేవతలు ప్రార్థించుటచే శుంభాదులతో జరిగిన యుద్ధములో వారిని సంహరించెను (44). ఈనాడు కూడా దేవతలందరు బ్రహ్మను శరణు జొచ్చిరి. ఆ బ్రహ్మ, మరియు విష్ణువు దేవతలతో గూడి నన్ను శరణు పొందిరి(45). ఓ దూతా! బ్రహ్మ, విష్ణువు

మొదలగు వారి ప్రార్థనను మన్నించి నేను సర్వేశ్వరుడనే అయిననూ ఈ దేవతల యుద్ధముకొరకు వచ్చియుంటిని (46).

పార్షదప్రవరస్త్వం హి కృష్ణస్య చ మహాత్మనః | యే యే హతాశ్చ దైతేయా న హి కే%పి త్వయా సమాః | | 47

కా లజ్జా మహతీ రాజన్‌ మమ యుద్ధే త్వయా సహ | దేవకార్యార్థమీశో%హం వినయేన చ ప్రేషితః || 48

గచ్ఛ త్వం శంఖ చూడే వై కతనీయం చ మే వచః | స చ యుక్తం కరోత్వత్ర సురకార్యం కరోమ్యహమ్‌ || 49

ఇత్యుక్త్వా శంకరస్తత్ర విరరామ మహేశ్వరః | ఉత్తస్థౌ శంఖచూడస్య దూతో%గచ్ఛత్తదంతికమ్‌ || || 50

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్దఖండే శివ దూత సంవాదో నామ పంచత్రింశో%ధ్యాయః (35).

మహాత్ముడగు శ్రీ కృష్ణునకు నీవు అనుంగు సహచరుడవు. ఇంతకు ముందు సంహరింపబడిన రాక్షసు లెవ్వరూ నీతో సమానమైన వారు కారు (47). ఓ రాజ! నాకు నీతో యుద్ధమును చేయుటలో అధికమగు సిగ్గుఏమి గలదు? ఈశ్వరుడనగు నన్ను దేవతలు వినయముతో ప్రార్థించుగా, దేవకార్యము కొరకు వచ్చియుంటివి (48). నీవు వెళ్లి నా ఈ మాటలను శంఖచూడునకు చెప్పుము. ఆతడు తనకు యెగ్యముగు రీతిలో చేయుగాక! నేను దేవకార్యమును చేసెదను (49). మహేశ్వరుడగు శంకరుడిట్లు పలికి విరమించెను. అపుడు శంఖచూడుని దూత లేచి ఆతని వద్దకు వెళ్లెను (50).

శ్రీశివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శివదూత సంవాదమనే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).

Sri Sivamahapuranamu-II    Chapters