Sri Sivamahapuranamu-II    Chapters   

అథ షట్‌ చత్వారింశో%ధ్యాయః

అంధకుడు శివునితో యుద్ధమును చేయుట

సనత్కుమార ఉవాచ |

తస్యేంగితజ్ఞశ్చ స దైత్యరాజో గదాం గృహీత్వా త్వరితస్స సైన్యః |

కృత్వాథ సో%గ్రే గిలనామధేయం సుదారుణం దేవవరైరభేద్యమ్‌ || 1

గుహాముఖం ప్రాప్య మహేశ్వరస్య బిభేద శ##సై#్త్రరశని ప్రకాశైః |

అన్యే తతో వీరకమేవ శ##సై#్త్రరవాకిరన్‌ శైల సుతాం తథాన్యే || 2

ద్వారం హి కేచిద్రుచిరం బభంజుః పుష్పాణి పత్రాణి వినాశ##యేయుః |

ఫలాని మూలాని జలం చ హృద్యముద్యాన మార్గానపి ఖండమేయుః || 3

విలోడయేయుర్ముదితాశ్చ కేచిచ్ఛృంగాణి శైలస్య చ భానుమంతి |

తతో హరస్సంస్మృతవాన్‌ స్వసైన్యం సమాహ్వయన్‌ కుపితశ్శూలపాణిః || 4

భూతాని చాన్యాని సుదారుణాని దేవాన్‌ ససైన్యాన్‌ సహ విష్ణుముఖ్యాన్‌ |

ఆహూత మాత్రాను గణాస్ససైన్యా రథైర్గజైర్వాజి వృషైశ్చ గోభిః || 5

ఉష్ట్రైః ఖరైః పక్షివరైశ్చ సింహైస్తే సర్వదేవాస్సహ భూతసంఘైః |

వ్యాఘ్రైర్నృగైస్సూకరసారసైశ్చ సమీనమత్స్యై శ్శిశుమార ముఖ్యైః || 6

అన్యైశ్చ నానావిధ జీవ సంఘైర్విశీర్ణదంశా స్స్సుటీతై స్స్మశానైః |

భుజంగమైః ప్రేతశ##తైః పిశాచైర్దివ్యైర్విమానైః కమలాకరైశ్చ || 7

నదీనదైః పర్వతవాహనైశ్చ సమాగతాః ప్రాంజలయః ప్రణమ్య |

కపర్దినం తస్థురదీన సత్త్వాస్సేనాపతిం వీరకమేవ కృత్వా || 8

సనత్కుమారుడిట్లు పలికెను-

శివుని ఇంగితము నెరింగిన ఆ రాక్షసరాజు గదను చేతబట్టి సైన్యముతో గూడి వెంటనే బయలుదేరెను. దేవశ్రేష్ఠులచే కూడ జయింపశక్యము కానివాడు, మిక్కిలి భయంకరుడు అగు గిలుని ఆతడు సైన్యమునకు అగ్ర భాగములో నిలబెట్టెను (1). ఆతడు మహేశ్వరుని గుహయొక్క ద్వారము వద్దకు చేరి పిడుగు వంటి ప్రకాశముగల అస్త్రములతో దానిని పగులగొట్టెను. అపుడు కొందరు వీరకుని శస్త్రములతో ముంచెత్తగా, మరికొందరు పార్వతిపై దండెత్తిరి (2). కొందరు సుందరమగు ద్వారమును పగులగొట్టగా, మరికొందరు పుష్పములను, పత్రములను ధ్వంసము చేసిరి. కొందరు ఫలములను, మూలములను, సుందరమగు జలాశయమును, ఉద్యానములోని దారులను చెడగొట్టిరి (3). కొందరు ప్రకాశించే పర్వత శిఖరములను ఆనందముతో పెకలించుచుండిరి. అపుడు శివుడు కోపించి శూలమును చేతబట్టి తన సైన్యమును స్మరించి ఆహ్వానించెను (4). భయంకరాకారులగు భూతములు, విష్ణువు మొదలగు దేవతలు, వారి సైన్యములు, శివుని గణములు పిలువగానే విచ్చేసిరి. వారు రథములను, ఏనుగులను, గుర్రములను, ఎద్దులను, ఆవులను (5), ఒంటెలను, గాడిదలను, గొప్ప పక్షులను, సింహములను, పెద్ద పులులను, జింకలను, సూకరములను, సారస పక్షులను, చేపలను, మొసళ్లను (6), ఇతరములగు నానా విధ ప్రాణులను అధిష్ఠించి విచ్చేసిరి. సర్వదేవతలు భూతగణములతో గూడి వచ్చిరి. దోమలు చెల్లా చెదురుగా నుండెను. స్మశానములలో తిరుగాడు పాములు, వేలాది ప్రేతములు, పిశాచములు వచ్చినవి. దేవతలు దివ్య విమానములలో వచ్చిరి. సరస్సులు (7), నదీనదములు, పర్వతములు (అధిష్ఠాన దేవతలు) ఆయా వాహనములపై వచ్చి జటాజూటధారియగు శివునకు చేతులు జోడించి నమస్కరించి ఉత్సాహముతో నిండిన అంతఃకరణము గలవారై వీరకుని సేనాపతిగా చేసుకొని నిలబడిరి (8).

విసర్జయామాస రణాయ దేవాన్‌ విశ్రాంత వాహానథ తత్పినాకీ |

యుద్ధే స్థిరం లబ్ధజయం ప్రధానం సంప్రేషితాస్తే తు మహేశ్వరేణ || 9

చక్రుర్యుగాంత ప్రతిమం చ యుద్ధం మర్యాదహీనం సగిలేన సర్వే |

దైత్యేంద్ర సైన్యేన సదైవ ఘోరం క్రోధాన్ని గీర్ణాస్త్రి దశాస్తు సంఖ్యే || 10

తస్మిన్‌ క్షణ యుధ్యమానాశ్చ సర్వే బ్రహ్మేంద్ర విష్ణ్వర్క శశాంక ముఖ్యాః |

ఆసన్నిగీర్ణా విఘసేన తేన సైన్యే నిగీర్ణే%స్తి తు వీరకో హి || 11

విహాయ సంగ్రామ శిరో గుహాం తాం ప్రవిశ్య శర్వం ప్రణిపత్య మూర్ధ్నా |

ప్రోవాచ దుఃఖాభిహతస్స్మరారిం సువీరకో వాగ్మివరో%థ వృత్తమ్‌ || 12

నిగీర్ణం తే సైన్యం విఘసదితిజేనాద్య భగవన్‌ నిగీర్ణో%సౌ విష్ణుస్త్రి భువన గురుర్దైత్యదలనః |

నిగీర్ణౌ చంద్రార్కౌ ద్రుహిణమఘవానౌ చ వరదౌ నిగీర్ణాస్తే సర్వే యమవరుణ వాతాశ్చ ధనదః || 13

స్థితో%స్మ్యేకః ప్రహ్వః కిమిహ కరణీయ భవతు మే | అజేయో దైత్యేంద్రః ప్రముదితమనా దైత్యసహితః || 14

అజేయత్వం ప్రాప్తః ప్రతిభయమనా మారుతగతిః స్వయం విష్ణుర్దేవః కనకకశిపుం కశ్యపసుతమ్‌ || 15

నఖైస్తీక్ణైర్భంక్త్వా తదపి భగవాన్‌ శిష్టవశగః ప్రవృత్త సై#్త్రలోక్యం విధమతు మలం వ్యాత్త వదనః || 16

దేవతల వాహనములకు తగిన విశ్రాంతిని ఇచ్చిన పిదప పినాకధారి యగు మహేశ్వరుడు యుద్ధమునందు జయమును పొందవలెననే స్థిరమగు నిర్ణయము గలవాడై దేవతలను యుద్ధరంగమునకు పంపెను (9). ఆ దేవతలందరు గిలునితో గూడియున్న రాక్షస రాజుయొక్క సైన్యముతో ఊహకు అందనిది, ప్రళయకాలమును బోలినది అగు ఘోరయుద్ధమును నిరంతరముగా చేసిరి. కాని ఆ యుద్ధములో దేవతలు వారిచే కోపముతో మ్రింగి వేయబడిరి (10). ఆ సమయములో యుద్ధమును చేయుచున్న బ్రహ్మ-ఇంద్ర-విష్ణు-సూర్య-చంద్రాది-ప్రముఖలనందరినీ విఘసుడు మ్రింగివేసెను. ఇట్లు సైన్యము మ్రింగివేయబడగా వీరకుడు మిగిలియుండెను (11). వక్తలలో శ్రేష్ఠుడగు వీరకుడు అపుడు యుద్ధభూమిని విడిచి పెట్టి దుఃఖముచే పీడింపబడినవాడై ఆ గుహలో ప్రవేశించి కామ దహనుడగు శివునకు శిరస్సుతో ప్రణమల్లి జరిగిన వృత్తాంతము నిట్లు వివరించెను (12). హే భగవాన్‌! విఘసాసురుడు ఈనాడు నీ సైన్యమును,ముల్లోకములకు ప్రభువు మరియు రాక్షస సంహారకుడు అగు విష్ణువును,సూర్యచంద్రులను, వరముల నొసంగు ఇంద్ర బ్రహ్మలను,యమ వరుణ వాయు కుబేరులను, అందరినీ మ్రింగి వేసెను (13). నేను ఒక్కడినే వినయముతో నిలబడి యున్నాను. నాకు ఇపుడు కర్తవ్యమేమి? రాక్షస సైన్యముతో గూడి మహానందముతో నున్న ఆ రాక్షస చక్రవర్తిని జయించుట అసంభవము (14). జయింప శక్యము కాని స్థితిలో నున్నవాడు, భయంకరమగు మానసిక స్థితిని కలిగియున్నవాడు, వాయువుతో సమానమగు వేగము గలవాడు, ప్రకాశ స్వరూపుడు, సత్పురుషుల ఆధీనములో నుండువాడు అగు విష్ణుభగవానుడు స్వయముగా కశ్యప పుత్రుడగు హిరణ్యకశిపుని వాడి గోళ్లతో చీల్చి చంపి, ఆ పిదప నోటిని తెరచి ముల్లోకములను ఊదివేయుటకు సంసిద్ధుడాయెను (15).

వసిష్ఠాద్యైశ్శస్తో భువనపతిభిస్సప్త మునిభిస్తథా భూతే | భూయస్త్వమితి సుచిరం దైత్య సహితః || 16

తతస్తేనోక్తాస్తే ప్రణయవచనైరాత్మని హితైః కదాస్మాద్వై ఘోరాద్భవతి మమ మోక్షో మునివరాః |

యతః క్రుద్ధైరుక్తో విఘసహరణాద్యుద్ధ సమయే తతో ఘోరైర్బాణౖర్విదలిత ముఖే ముష్టిభిరలమ్‌ || 17

బదర్యాఖ్యారణ్య నను హరగృహే పుణ్యవసతౌ నిసంస్తభ్యాత్మానం విగతకలుషో యాస్యసి పరమ్‌ |

తతస్తేషాం వాక్యాత్ర్పతిదినమసౌ దైత్యగిలనః క్షుధార్త స్సంగ్రామాద్ర్భమతి పునరామోదముదితః || 18

తమస్వేదం ఘోరం జగదుదితయో స్సూర్యశశినోః యథా శుక్రస్తుభ్యం పరమరిపురత్యంత వికరః |

హతాన్‌ దేవైర్దైత్యాన్‌ పునరమృత విద్యాస్తుతి పదైః సువీర్యాన్‌ సంహృష్టాన్‌ వ్రణశత వియుక్తాన్‌ ప్రకురుతే || 19

వరం ప్రాణాస్త్యాజ్యాస్తవ మమ తు సంగ్రామసమయే | భవాన్‌ సాక్షీభూతః క్షణమపి వృతః కార్యకరణ || 20

ఇతీదం సత్పుత్ర్పాత్ర్పమథపతి రాకర్ణ్య కుపితః చిరం ధ్యాత్వా చక్రే త్రిభువనపతిః ప్రాగనుపమమ్‌ |

ప్రగాయత్సామాఖ్యం దినకర కరాకారవపుషా ప్రహాసాత్తన్నామ్నా తదను నిహితం తేన చ తమః || 21

ప్రకాశో%స్మింల్లోకే పునరపి మహాయుద్ధమకరోత్‌ రణ దైత్యైస్సార్ధం వికృతవదనైర్వీరకమునిః |

శిలాచూర్ణ భుక్త్వా ప్రవరమునినా యస్తు జనితః స కృత్వా సంగ్రామం పురమపి పురా యశ్చ జితవాన్‌ || 22

ఆ పరిస్థితిలో భువనములకు ప్రభువులగు వసిష్ఠాది సప్తర్షులు ఆయనను 'నీవు మరల చిరకాలము రాక్షసులతో గూడి యుండుము' అని శపించిరి (16). అపుడా విష్ణువు తనకు హితకరములగు ప్రియవచనములతో వారిని ఇట్లు ప్రార్థించెను : ఓ మహర్షులారా! ఈ ఘోరశాపమునుండి నాకు విడుదల ఎపుడు లభించును? అపుడు వారు కోపముతో నిట్లనిరి : యుద్ధ సమయమునందు నీవు భయంకరములగు బాణమనులతో, మరియు ముష్టిఘాతములతో పీడను పొందెదవు. విఘసుడు నోరు తెరిచి నిన్ను మ్రింగివేయును (17). బదరికారణ్యములో పరమపవిత్ర నివాసమగు శివుని గృహములో జితేంద్రియుడవై పూర్ణమగు పాపవిముక్తిని పొందగలవు. తరువాత వారి శాప వచనము వలన ఆతడు ప్రతి దినము ఆకలిచే పీడింపబడినవాడై రాక్షసులను భక్షిస్తూ తిరుగాడెను. ఆతడా తీరున మరల ఆనందమును పొంద జొచ్చెను (18). సూర్య చంద్రులుదయించి ఈ ఘోరమగు చీకటి తొలగునట్లు చేయుము. నీకు పరబల శత్రువు, గొప్ప సమర్థుడు అగు శుక్రుడు దేవతలచే సంహరింపబడిన రాక్షసులను సంజీవినీ విద్యకు సంబంధించిన స్తోత్ర పాఠములతో పునరనుజ్జీవింప చేయుచున్నాడు. వారి గాయములన్నియూ నివారణ యగుచుండగా, గొప్ప శక్తిని పొంది పరమానందము ననుభవించుచున్నారు (19). నీవు ఈ యుద్ధమును చేయు సమయములో నాకు ప్రాణ త్యాగము శ్రేష్టము. సర్వమునకు నీవే సాక్షివి. ఈ కార్యమును నిర్వహించుటలో నీవు నాయకునిగా ఎన్నుకొనబడితివి (20). తన కుమారులలో శ్రేష్ఠుడగు వీరకుని ఈ ప్రసంగమును విని, ప్రమథగణాధ్యక్షుడు, ముల్లోకములకు ప్రభువు అగు శివుడు కోపించి చాలా సేపు ఆలోచించి, సామగానమును చేయుచూ ముందెన్నడూ ఎరుంగని సాటిలేని అద్భుతమును చేసెను. సూర్యుని వలె కిరణములను వెదజల్లె శరీరమును దాల్చి ఆయన బిగ్గరగా నవ్వెను. వెంటనే చీకటి అంతయూ తొలగిపోయెను (21). ఈ లోకమునందు ప్రకాశము నెలకొనెను. మహర్షియగు వీరకుడు వికృతముగు ముఖములు గలవ రాక్షసులతో మరల రణభూమిలో గొప్ప యుద్ధమును చేసెను. పూర్వము ఒక గొప్ప మహర్షి రాతి పొడిని భక్షించి ఆతనిని సృష్టించినాడు. పూర్వమాతడు యుద్ధమును చేసి (పురుని) శత్రువులు నగరమును జయించినాడు (22).

మహారుద్రస్సద్యస్స ఖలు దితిజేనాతి గిలితః తతశ్చాసౌ నందీ నిశితశరశూలాసి సహితః |

ప్రధానో యోధానాం మునివరశతానామపి మహాన్‌ నివాసో విద్యానాం శమదమ మహాధైర్యసహితః || 23

నిరీక్ష్యైవం పశ్చాద్వృషభవరమారుహ్య భగవాన్‌ కపర్దీ యుద్ధార్థీ విఘసదితిజం సమ్ముఖముఖః || 23

జపన్‌ దివ్యం మంత్రం నిగలన విధానోద్గిలనకం స్ధితస్సజ్జం కృత్వా ధనురశని కల్పానపి శరాన్‌ || 24

తతో నిష్ర్కాంతో %సౌ విఘస వదనాద్వీరకమునిః గృహీత్వా తత్సర్వం స్వబల మతులం విష్ణుసహితః |

సముద్గీర్ణాస్సర్వే కమలజ బలారీందుదినపాః ప్రహృష్టం తత్సైన్యం పునరపి మహాయుద్ధమకరోత్‌ || 25

జితే తస్మిన్‌ శుక్రస్తదను దితిజాన్‌ యుద్ధ విహతాన్‌ యదా విద్యావీర్యాత్పునరపి స జీవాన్‌ ప్రకురుతే |

తదా బద్ధ్వా నీతః పశురివ గణౖర్భూతపతయే నిగీర్ణస్తేనాసౌ త్రిపురరిపుణా దానవగురుః || 26

వినష్టే శక్రుఖ్యే సురరిపు నివాసస్తదఖిలో జితో ధ్వస్తో భగ్నో భృశమపి సురైశ్చాపి దలితమ్‌ |

ప్రభూతై ర్భూతౌఘైర్దితిజ కుణపగ్రాస రసికైః సరుండై ర్నృత్యద్భి ర్నిశితశర శక్త్యద్ధృతకరైః || 27

ప్రమత్తైర్వేతాలైస్సు దృఢకరతుండైరపి ఖగః వృకైర్నానాభేదైశ్శవకుణప పూర్ణాస్య కబలైః ||

వికీర్ణే సంగ్రామే కనక కశిపోర్వంశజనకః చిరం యుద్ధం కృత్వా హరిహర మహేంద్రైశ్చ విజితః || 28

ప్రవిష్టే పాతాలే గిరి జలధిరంధ్రాణ్యపి తథా తతసై#్సన్యే క్షీణ దితిజ వృషభశ్చాంధక వరః ||

ప్రకోపే దేవానాం కదనదవరో విశ్వదలనః గదాఘాతైర్ఘోరై ర్విదలితమదశ్చాపి హరిణా || 29

తరువాత వాడి బాణములను శూలమును కత్తిని ధరించి యున్నవాడు, యోధులలో ప్రముఖుడు, మహర్షులందరిలో గొప్పవాడు, విద్యలకు నిలయము, బాహ్య-అంతరింద్రియ నిగ్రహము ధైర్యము గలవాడు అగు నందిని ఆ రాక్షసుడు మ్రింగివేసెను. ఆ మహారుద్రుడు వెంటనే (23). ఆ దృశ్యమును గాంచెను. జటా జూటధారియగు ఆ భగవానుడు అపుడు వృషభమునధిష్ఠించి యుద్ధమును చేయగోరి విఘసాసురుని సముఖమునకు వెళ్లెను. మ్రింగిన వస్తువులను గ్రక్కునట్లు చేయు దివ్యమంత్రమును జపిస్తూ ఆయన ధనస్సును, పిడుగల వంటి బాణములను సిద్ధము చేసుకొని నిలబడెను (24). అపుడు విఘసుని నోటినుండి వీరకమహర్షి సాటిలేని తన సర్వసైన్యమును తీసుకొని విష్ణువుతో గూడి బయటకు వచ్చెను. బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మరియు అందరు బయట పడిరి. అపుడా సైన్యము మహానందముతో మరల గొప్ప యుద్ధమును చేయ మొదలిడెను (25). ఈ విధముగా విఘసుడు జయింపబడెను. ఇంతలో శుక్రుడు యుద్ధములో మరణించిన రాక్షసులను విద్యాప్రభావముచే మరల బ్రతికించుచుండగా, గణములు ఆతనిని పశువును వలె బంధించి భూతపతియగు శివుని ముందు నిలబెట్టిరి. త్రిపురాసుర సంహారకుడగు ఆ శివుడు రాక్షస గురువగు ఆ శుక్రుని మ్రింగివేసెను (26). శుక్రుడు అదృశ్యము కాగానే, రాక్షసులందరు జయింపబడిరి. దేవతలు వారి నివాసములను పూర్తిగా ధ్వంసము చేసి, సర్వమును నాశనము చేసిరి. భూత గణములు పెద్ద సంఖ్యలో రాక్షసులు శవములను, తలలు లేని మొండెములను, శక్తులను చేతులలో ఎత్తి పట్టుకొని నాట్యమును చేయుచుండెను (27). మదించియున్న పక్షులు, అనేక జాతుల తోడేళ్లు శవముల నుండి పీకిన మంసపుముద్దలతో నిండిన నోళ్లు గలవై యుద్ధరంగమును చెల్లాచెదరు చేయుచుండెను. హిరణ్యకశిపుని వంశ పురుషుడగు రాక్షసుడు శివునితో విష్ణువుతో మరియు మహేంద్రునితో చిరకాలము యుద్ధమును చేసి పరాజయమును పొందెను (28). రాక్షసశ్రేష్ఠడగు అంధకుని సైన్యము క్షీణించెను. వారందరు పాతాలములో, కొండగుహలలో, సముద్రపు లోతులలో ప్రవేశించిరి. తీవ్రమగు కోపముతో ఆతడు దేవతలతో యుద్ధమును చేసి వారికి పీడను కలిగించుటయే గాక బ్రహ్మాండమును పగులగొట్టగల సమర్థుడు. కాని విష్ణువుయొక్క భయంకరముగు గదాఘాతములచే ఆతని గర్వము అణిగెను (29).

న వై యస్సం గ్రామం త్యజతి వరలబ్దః కిల యతః తదా తాడై ర్ఘోరైస్త్రి దశపతినా పీడితతమః |

తతశ్శస్త్రాస్త్రౌఘైస్తరు గిరి జలైశ్చాశు విబుధాన్‌ జిగాయోచ్చైర్గర్జన్‌ ప్రమథపతి మాహూయ శనకైః || 30

స్థితో యుద్ధం కుర్వన్‌ రణపతితశ##సై#్త్రర్బహువిధైః పరిక్షీణౖస్సర్వైస్తదను గిరిజా రుద్రమతుదత్‌ |

తథా వృక్షైస్సర్పై రశనినివహైశ్శస్త్ర పటలైః విరూపైర్మాయాభిః కపటరచనాశంబరశ##తైః || 31

విజేతుం శైలేశం కుహకమపరం తత్ర కృతవాన్‌ మహాసత్త్వో వీరస్త్రిపురరిపుతుల్యశ్చ మతిమాన్‌ |

న వధ్యో దేవానాం వరశత మనోన్మాదవివశః ప్రభూతైశ్శస్త్రాసై#్త్రస్సపది దితిజో జర్జరతనుః || 32

తదీయాద్విష్యందాత్‌ క్షితితలగతైరంధక గణౖః అతివ్యాప్తం ఘోరం వికృతవదనం స్వాత్మసదృశమ్‌ |

దధత్కల్పాంతాగ్నిప్రతిమవపుషా భూతపతినా త్రిశూలేనోద్భిన్నస్త్రిపురరిపుణా దారుణతరమ్‌ || 33

యదా సైన్యత్సైనం పశుపతిహతాదన్యదభవత్‌ వ్రణోత్థైరత్యుష్ణైః పిశితనిసృతైర్బిందు భిరలమ్‌ |

తదా విష్ణుర్యోగాత్ర్పమథపతి మాహూయ మతిమాన్‌ చకారోగ్రం రూపం వికృతవదనం సై#్త్రణమజితమ్‌ || 34

కరాలం సంశుష్కం బహుభుజలతాక్రాంతకుపితో వినిష్క్రాంతః కర్ణాద్గణశిరసి వంభోశ్చ భగవాన్‌ || 35

రణస్థా సా దేవీ చరణయుగలాలంకృతమహీ స్తుతా దేవైస్సర్వైస్మదను భగవాన్‌ ప్రేరితమతిః |

క్షధార్తా తత్సైన్యం దితిజనిసృతం తచ్చ రుధిరం పపౌ సాత్యుష్ణం తద్రణశిరసి సృక్కర్దమమలమ్‌ || 36

ఆతడు వరములను పొందినవాడగుటచే యుద్దమును విడిచి పోలేదు. అపుడు ఇంద్రుడాతని దేహమునకు భయంకరమగు ఆఘాతములతో పీడను కలిగించెను. అపుడాతడు శస్త్రాస్త్ర పరంపరలతో, చెట్లతో, పర్వతములతో మరియు జలములతో వెంటనే దేవతలను జయించి, బిగ్గరగా గర్జిస్తూ ప్రమథగణాధిపతియగు శివుని అహ్వానించెను (30). యుద్ధరంగములో పడియున్న అనేక విధముల శస్త్రములతో ఆతడు యుద్ధమును నిలబడి చేయుచున్నవాడై గిరిజాపతియగు రుద్రుని చీకాకుపరిచెను. ఇంతలో ఆ శస్త్రములు క్షయమును చెందగా, అపుడాతడు వృక్షములను, సర్పములను, పిడుగుల సమూహములను,శస్త్ర పరంపరలను ప్రయోగించి యుద్దమును చేసెను. మరియు ఆతడు వివిధరకములు మాయలను, కపటరచనలను, పలువిధములు శంబదవిద్యలను ప్రయోగించెను (31). గొప్ప బలశాలి, వీరుడు, శివునితో సమమైన వాడు, బుద్ధిశాలి, దేవతలచే వధ్యుడు కానివాడు, వరములనుపొంది గర్వముతో మదించి యున్నవాడు అగు ఆ రాక్షసుడు లెక్కలేనన్ని శస్త్రాస్త్రములచే శిథిలమైన దేహముగలవాడై వెంటనే ఆ యుద్ధరంగములో కైలాసపతియగు శివుని జయించుటకై మరియొక కుట్రను పన్నెను (32). ఆతని దేహమునుండి స్రవించిన రక్తము నేలపై బడి ఆతనిని పోలియున్నవారు, వికృతమగు ముఖము గలవారు, భయంకరాకారులు అగు అనేక అంధకులు పుట్టిరి. వారిచే యుద్ధము నిండి యుండెను. ప్రళయకాలాగ్నిని బోలిన దేహము గలవాడు, భూతములకు ప్రభువు, త్రిపురారియుగు శివుడు త్రిశూలముతో మరింత దారుణముగా ఆతనిని పొడిచెను (33). పశుపతియగు శివుడు ఆ అంధకసైన్యమును సంహరించెను. కాని వారి దేహములకు కలిగిన గాయములనుండి కారిన వేడి రక్తబిందువులనుండి మరియొక సైన్యము ఉదయించెను. అపుడు విష్ణువు ప్రమథగణాధిపతియగు శివునితో సంప్రదించి తన బుద్ధిశక్తిని ఉపయోగించి యోగప్రభావముచే భయంకరమైనది, వికృతమగు ముఖముగలది, జయింప శక్యము గానిది అగు స్త్రీ రూపమును దాల్చెను (34). ఆ రూపము వికటముగను, మిక్కిలి శుష్ఖించినదిగను ఉండెను. లతలవంటి అనేక భుజములు గల ఆ రూపమునందు క్రోధము కానవచ్చెను. శంభుని చెవినుండి విష్ణుభగవానుడు ఈ రూపములో బయల్వెడలి గణముల ముందు నిలబడెను (35). ఆ దేవి యుద్దరంగప్రదేశమునంతనూ తన రెండు పాదములతో ఆక్రమించి యుండెను. ఆమె పాదములు భూమికి అలంకారమాయెను. దేవతలందరు ఆమెను స్తుతించు చుండగా శివభగవానుడు ఆమెకు ఉత్సాహమును కలిగించెను. ఆమె ఆకలిచే పీడింపబడినదై యుధ్దరంగములో ముందు ఉన్నదై రాక్షససైన్యమును సంహరించి వారి శరీరములనుండి స్రవించిన వేడి రక్తమును త్రాగెను. రాక్షసులు దేహమాంసముచే ఆ ప్రదేశమంతయు బురదగా మారెను (36).

తతస్త్వేకో దైత్యస్తదపి యుయుధే శుష్కరుధిరః తలాఘాతైర్ఘోరైరశని సదృశైర్జాను చరణౖః |

నఖైర్వజ్రాకారైర్ముఖభుజ శిరోభిశ్చ గిరిశం స్మరన్‌ క్షాత్రం ధర్మం స్వకుల విహితం శాశ్వతమజమ్‌ || 37

రణ శాంతః పవ్చాత్ర్పమథపతినా భిన్నహృదయః త్రిశూలేన ప్రోతో నభసి విధృతస్థ్సాణు సదృశః |

అధః కాయశ్శుష్కస్తపనకిరణౖర్జీర్ణ తనుమాన్‌ జలాసారైర్మేఘైః పవనసహితైః క్లేదితవపుః || 38

విశీర్ణస్తిగ్మాంశోస్తుహినశకలాకార శకలః తథాభూతః ప్రాణాంస్తదపి న జహౌ దైత్యవృషభః |

తదా తుష్టశ్శంభుః పరమకరుణా వారిధిరసౌ దదౌ తసై#్మ ప్రీత్యా గణపతిపదం తేన వినుతః || 39

తతో యుద్ధస్యాంతే భువనపతయస్సార్థ రమణౖః స్తవైర్నానాభేదైః ప్రమథపతిమభ్యర్చ్య విధివత్‌ |

హరిబ్రహ్మాద్యాస్తే పరమనుతిభిస్తుష్టువురలం నతస్కంధాః ప్రీతా జయజయ గిరం ప్రోచ్య సుఖితాః || 40

హరసై#్తసై#్తస్సార్ధం గిరివరగుహాయాం ప్రముదితో విసృజ్యైకానంశాన్‌ వివిధబలినా పూజ్యసునగాన్‌ |

చకారజ్ఞాం క్రీడాం గిరివరసుతాం ప్రాప్య ముదితాం తథా పుత్రం ఘోరాద్విఘసవదనాన్ముక్త మనఘమ్‌ || 41

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రుసంహితాయాం యుద్ధఖండే అంధకయుద్ధవర్ణనం నామ షట్‌ చత్వారింశో%ధ్యాయః (46).

అంధకాసురుడు ఒక్కడు మాత్రమే మిగిలియుండెను. ఆతని రక్తమంతయూ స్రవించి దేహముఎండిపోయెను. అయిననూ ఆతడు స్వకులమునకు విహితమైనది, శాశ్వతము, పుట్టుక లేనిదియగు క్షత్రియధర్మమును స్మరించి, భయంకరములు పిడుగు పాటువంటివి అగు దెబ్బలను అరచేతులలో పాదములతో మరియు మోకాళ్లతో కొడుతూ, వజ్రము వలె వాడియైన గోళ్లను ముఖమును భుజమును శిరస్సును ఆయుధముగా చేసుకొని శివునితో పోరాడెను (37). తరువాత ప్రమథపతియగు శివుడు త్రిశూలముతో ఆతనిని గుండెలలో పొడిచి పైకి ఎత్తి ఆకాశములో నిలబెట్టగా, ఆతడు శాంతించి కదలిక లేక యుండెను. ఆతని శరీరము యొక్క క్రింది భాగము సూర్యకిరణములచే ఎండిపోయెను. శిథిలమైన ఆతని శరీరమును వాయుసంహితములగు మేఘములు జలమును వర్షించి తడిపినవి (38). పూర్తిగా శిథిలమైన ఆతని దేహము సూర్యకిరణములు పడి మంచుతునకల వలె ప్రకాశించుచుండెను. అయిననూ ఆ రాక్షసవీరుడు ప్రాణములను విడువలేదు. అపుడు పరమదయాసముద్రుడగు ఆ శంభుడు అపుడాతనిచే స్తుతించబడినవాడై ప్రేమతో ఆతనికి గణాధ్యక్షపదవి నొసంగెను (39). అపుడు యుద్ధము ముగిసెను. విష్ణువు, బ్రహ్మ మొదలగు ఆ లోకపాలురు ప్రమథపతియగు శివునకు సాష్టాంగప్రణామముల నాచరించి గంభీరమగు అర్ధము గలవి, సుందరమైనవి, శ్రేష్ఠమైనవి అగు వివిధ స్తోత్రములను యథావిధిగా పఠించి ఆయనను తృప్తి కలుగునంత వరకు స్తుతించి జయజయధ్వానములను చేసి సుఖమును పొందిరి (40). శివుడు వారందరితో గూడి ఆ సుందరమగు పర్వతగుహలో మహానందముతో నుండెను. ఆయన తన అంశములగు వారిందరినీ పంపించివేసి, పూజింపదగిన పర్వతశ్రేష్ఠులకు ఉపహారములను సమర్పించెను. అపుడాయన ఆనందముతో నిండియున్న పార్వతితో గూడి భయంకరమగు విఘసాసురుని నోటినుండి ప్రాణములతో బయట పడిన పాపరహితుడగు పుత్రుని పొంది ఆనందముతో విహరించెను. (41).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందలి యుద్ధ ఖండలో అంధక యుద్ధవర్ణనమనే నలుబది యారవ అధ్యాయము ముగిసినది (46).

Sri Sivamahapuranamu-II    Chapters