Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏకోనవింశో%ధ్యాయః

కామదహనము

నారద ఉవాచ|

బ్రహ్మన్‌ విధే మహాభాగ కిం జాతం తదనంతరమ్‌ | కథయ త్వం ప్రసాదేన తాం కథాం పాపనాశినీమ్‌ || 1

నారదుడిట్లు పలికెను-

ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! తరువాత ఏమైనది? నీవు అనుగ్రహించి పాపములను నశింపజేయు ఆ గాథను చెప్పుము (1).

బ్రహ్మోవాచ|

శ్రూయతాం సా కథా తాత యజ్జాతం తదనంతరమ్‌ | తవ స్నేహాత్ప్ర వక్ష్యామి శివలీలాం ముదావహామ్‌ || 2

ధైర్యస్య వ్యసనం దృష్ట్వా మహాయోగీ మహేశ్వరః | విచింతితం మనస్యేవం విస్మితో%తి తతః పరమ్‌ || 3

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ తరువాత జరిగిన గాథను వినుము. వత్సా! ఆనందమును గొల్పు శివలీలను నీయందలి ప్రేమచే చెప్పగలను (2). మహాయోగియగు మహేశ్వరుడు తాను ధైర్యమును గోల్పోవుటను గాంచి మిక్కిలి చకితుడై, తరువాత మనస్సులో ఇట్లు తలపోసెను (3).

కిము విఘ్నా స్సముత్పన్నాః కుర్వతస్తప ఉత్తమమ్‌ | కేన మే వికృతం చిత్తం కృతమత్ర కుకర్మిణా || 4

కువర్ణనం మయా ప్రీత్యా పరస్త్ర్యుపరి వై కృతమ్‌ | జాతో ధర్మవిరోధో%త్ర శ్రుతిసీమా విలంఘితా || 5

ఉత్తమమగు తపస్సును చేయుచున్న నాకు విఘ్నములు కలుగుటకు కారణమేమి? ఈ సమయములో నా మనస్సులో వికారమును కలిగించిన దుష్టుడెవరు? (4) నేను పరస్త్రీని ఉద్దేశించి చెడు వర్ణనను చేసితిని. ఇపుడు ధర్మమునకు విరుద్దముగా జరిగినది. వేదమర్యాద ఉల్లంఘింపబడినది (5).

బ్రహ్మో వాచ|

విచింత్యేత్థం మహాయోగీ పరమేశస్సతాం గతిః | దిశో విలోకయామాస పరితశ్శంకితస్తదా || 6

వామభాగే స్థితం కామం దదర్శా కృష్టబాణకమ్‌ | స్వశరం క్షేప్తుకామం హి గర్వితం మూఢ చేతసమ్‌ || 7

తం దృష్ట్వా తాదృశం కామం గిరీశస్య పరాత్మనః | సంజాతః క్రోధసంమర్దస్తత్‌క్షణాదపి నారద || 8

కామస్సిథతో%న్తరిక్షే స ధృత్వా తత్సశరం ధనుః | చిక్షేపాస్త్రం దుర్నివారమమోఘం శంకరే మునే || 9

బ్రహ్మ ఇట్లు పలికెను -

సత్పురుషులకు ఆశ్రయము, మహాయోగి అగు పరమేశ్వరుడు ఇట్లు తలపోసి, శంకను పొందినవాడై చుట్టూ దిక్కులనన్నింటినీ పరికించెను (6) . గర్విష్ఠి, మూర్ఖుడు, బాణమును ధనస్సునందు ఎక్కుపెట్టి ప్రయోగించుటకు సిద్దముగా నున్నవాడు అగు మన్మథుని ఆయన తన ఎడమవైపున ఉండగా గాంచెను (7). ఓ నారదా! పరమాత్ముడగు శివునకు ఆ స్థితిలో నున్న కాముని చూడగానే వెనువెంటనే తీవ్రమగు క్రోధము కలిగెను (8). ఓ మహర్షీ! బాణము ఎక్కుపెట్టియున్న ధనస్సును చేతబట్టి అన్తరిక్షమునందు నిలబడియున్న మన్మథుడు నివారింప శక్యము కానిది, వ్యర్థము కానిది అగు అస్త్రమును శంకరునిపై ప్రయోగించెను (9).

బభూవామోఘమస్త్రం తు మోఘం తత్పరమాత్మని | సమశామ్యత్తతస్తస్మిన్‌ సంక్రుద్ధే పరమేశ్వరే || 10

మోఘీ భూతే శివే స్వే%స్త్రే భయామాపాశు మన్మథః | చకంపే చ పురస్సిథత్వా దృష్ట్వా మృత్యుంజయం ప్రభుమ్‌ || 11

సస్మార త్రిదశాన్‌ సర్వాన్‌ శక్రాదీన్‌ భయవిహ్వలః | స స్మరో మునిశార్దూల స్వప్రయాసే నిరర్థకే || 12

కామేన సుస్మృతా దేవాశ్శక్రాద్యాస్తే మునీశ్వర | ఆయయుస్సకలాస్తే హి శంభుం నత్వా చ తుష్టువుః | 13

అమోఘమగు ఆ అస్త్రము పరమాత్ముని యందు మొక్క వోయెను. గొప్ప కోపము గల పరమేశ్వరుని పొంది ఆ అస్త్రము శాంతించెను (10). తన అస్త్రము శివుని యందు వ్యర్థము కాగానే మన్మథుడు భయమును పొందెను. ఆతడు తన ఎదుట నున్న మృత్యుంజయుడగు శివ ప్రభుని గాంచి వణికిపోయెను (11). ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన ప్రయత్నము వ్యర్థము కాగానే భయభీతుడై ఇంద్రాది దేవతలనందరినీ స్మరించెను (12). ఓ మునిశ్రేష్ఠా! కామునిచే స్మరింపబడిన వారై ఇంద్రాది దేవతలందరు అచటకు విచ్చేసి శివునకు ప్రణమిల్లి స్తుతించిరి (13).

స్తుతిం కుర్వత్సు దేవేషు క్రుద్ధస్యాతి హరస్య హి| తృతీయాత్తస్య నేత్రాద్వై నిస్ససార తతో మహాన్‌ || 14

లలాట మధ్యగాత్తస్మాత్స వహ్నిర్ద్రుత సంభవః | జజ్వాలోర్ధ్వ శిఖోదప్తః ప్రలయాగ్ని సమప్రభః || 15

ఉత్పత్య గగనే తూర్ణం నిష్పత్య ధరణీతలే | భ్రామం భ్రామం స్వపరితః పపాత మేదినీం పరి || 16

భస్మసాత్కృతవాన్‌ సాథో మదనం తావదేవ హి | యావచ్చ మరుతాం వాచః క్షమ్యతాం క్షమ్యతామితి || 17

ఇంతలో దేవతలు స్తుతించుచుండగనే మిక్కిలి క్రుద్ధుడైన శివుని మూడవ కంటి నుండి అపుడు గొప్ప అగ్ని పుట్టెను (14). లలాటమధ్యమునందున్న కంటి నుండి క్షణములో పుట్టిన ఆ అగ్ని ఎత్తైన జ్వాలలతో ప్రళయకాలాగ్నితో సమానమైన తేజస్సు గలదై మండజొచ్చెను (15). మన్మథుడు వెంటనే అంతరిక్షములోనికి ఎగిరి నేలపై బడి క్రిందనే చుట్టూ దొర్లుచుండెను (16). ఓ మహర్షీ! క్షమించుడు, క్షమించుడు అనే దేవతల వచనములు వినబడునంతలో ఆ అగ్ని మన్మథుని బూడిదగా మార్చివేసెను (17).

హతే తస్మిన్‌ స్మరే వీరే దేవా దుఃఖముపాగతాః | రురుదుర్విహ్వలాశ్చాతి క్రోశంతః కిమభూదితి || 18

శ్వేతాంగా వికృతాత్మా చ గిరిరాజసుతా తదా | జగామ మందిరం స్వం చ సమాదాయ సఖీజనమ్‌ || 19

క్షణ మాత్రం రతిస్తత్ర విజంజ్ఞా సాభవత్తదా | భర్తు ర్మృత్యుజ దుఃఖేన పతితా సా మృతా ఇవ || 20

వీరుడగు ఆ మన్మథుడు మరణించగా దుఃఖితులైన దేవతలు 'అయ్యో! ఏమైనది?' అని ఆక్రోశించువారై ఏడ్వ జొచ్చిరి (18). అపుడు పార్వతీ దేవి యొక్క శరీరము వివర్ణమాయెను. ఆమె మనస్సు వికారమును పొందెను. అపుడామె తన సఖురాండ్రను వెంటబెట్టుకొని తన ప్రాసాదమునకు వెళ్లిపోయెను (19). అపుడచట రతీదేవి భర్త మరణించుటవలన కలిగిన దుఃఖముచే వెనువెంటనే మరణించిన దానివలె నేలపై స్పృహతప్పి పడిపోయెను (20).

జాతాయాం చైవ సంజ్ఞాయాం రతిరత్యంతవిహ్వలా | విలలాప తదా తత్రోచ్చరంతీ వివిధం వచః || 21

తెలివి రాగానే రతి మిక్కిలి దుఃఖితురాలై అనేక వచనములను బిగ్గరగా పలుకుచూ విలపించెను (21).

రతిరువాచ|

కిం కరోమి క్వ గచ్ఛామి కిం కృతం దైవతైరిహ| మత్స్వామినం సమాహూయ నాశయామాసురుద్ధతమ్‌ || 22

హా హా నాథ స్మర స్వామిన్‌ ప్రాణ ప్రియ సుఖప్రద | ఇదం తు కిమభూదత్ర హా హా ప్రియ ప్రియేతి చ || 23

రతి ఇట్లు పలికెను-

నేనేమి చేయుదును? ఎక్కడకు పోదును? ఈ దేవతలీనాడు ఎట్టి పనిని చేసిరి? నా భర్తను బలాత్కారముగా తీసుకువచ్చి నాశము జేసిరి (22). హా! హా! నాథా! మన్మథా! స్వామీ! నీవు నాకు ప్రాణప్రియుడవు. సుఖమునిచ్చిన వాడవు. ఇచట ఏమైనది? అయ్యో! అయ్యో! ప్రియా! ప్రియా! అని ఆమె రోదించెను (23).

బ్రహ్మోవాచ|

ఇత్థం విలపతీ సా తు వదంతీ బహుధా వచః | హస్తౌ పాదౌ తదాస్ఫాల్య కేశానత్రోటయత్తదా || 24

తద్విలాపం తదా శ్రుత్వా తత్ర సర్వే వనే చరాః | అభవన్‌ దుఃఖితాస్సర్వే స్థావరా అపి నారద|| 25

ఏతస్మిన్నంతరే తత్ర దేవాశ్శక్రాదయో%ఖిలాః | రతి మూచుస్సమాశ్వాస్య సంస్మరంతో మహేశ్వరమ్‌ || 26

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె ఇట్లు విలపించుచున్నదై అనేక వచనములను పలుకజొచ్చెను. మరియ అపుడామె చేతులను, కాళ్లను కొట్టుకొనుచూ జుట్టును పీకుకొనెను (24). అపుడచటి వనచరులందరు ఆమె రోదనమును విని దుఃఖితులైరి. ఓ నారదా! వృక్షములు, వనములోని మృగములు కూడ దుఃఖించినవి (25). ఇంతలో ఇంద్రుడు మొదలగు దేవతలందరు అచటకు వచ్చి మహేశ్వరుని స్మరించుచున్నవారై రతీదేవిని ఓదార్చుచూ ఇట్లు పలికిరి (26).

దేవా ఊచుః |

కించిద్భస్మ గృహీత్వా తు రక్ష యత్నాద్భయం త్యజ | జీవయిష్యతి స స్వామీ లప్స్యసే త్వం పునః ప్రియమ్‌|| 27

సుఖదాతా న కో%ప్యస్తి దుఃఖదాతా న కశ్చన | సర్వో%పి స్వకృతం భుంక్తే దేవాన్‌ శోచసి వై వృథా|| 28

దేవలిట్లు పలికిరి-

కొద్దిగా భస్మను తీసుకొని శ్రద్ధగా చేయుము. భయమును వీడుము. ఆ మన్మథుని శివుడు బ్రతికించగలడు. నీకు మరల ప్రియుడు దక్కగలడు (27). సుఖమును గాని దుఃఖమును గాని జీవునకు ఇతరులెవ్వరూ ఈయరు. సర్వప్రాణులు తమ కర్మఫలములను అనుభవించెదరు. నీవు వ్యర్థముగా దేవతలను నిందించుచున్నావు(28).

బ్రహ్మో వాచ|

ఇత్యాశ్వాస్య రతిం దేవాస్సర్వే శివముపాగతాః| సుప్రసాద్య శివం భక్త్యా వచనం చేదమబ్రువన్‌|| 29

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతలందరు రతిని ఈ విధముగా ఓదార్చి శివుని వద్దకు వెళ్లిరి. శివుని మిక్కిలి భక్తితో ప్రసన్నునిగా జేసి ఈ మాటలను పలికిరి (29).

దేవా ఊచుః |

భగవన్‌ శ్రూయతామేతద్వచనం నశ్శుభం ప్రభో| కృపాం కృత్వా మహేశాన శరణాగతవత్సల|| 30

సువిచారయ సుప్రీత్యా కృతి కామస్య శంకర| కామేనైతత్కృతం యత్ర న స్వార్థం తన్మహేశ్వర || 31

దుష్టేన పీడితైర్దేవై స్తారకేణా%ఖిలైర్విభో | కర్మ తత్కారితం నాధ నాన్యథా విద్ధి శంకర|| 32

రతిరేకాకినీ దేవ విలాపం దుఃఖితా సతీ| కరోతి గరిశ త్వం చ తామాశ్వాసయ సర్వదా || 33

దేవతలిట్లు పలికిరి-

హే భగవాన్‌! ప్రభో! మహేశ్వరా! నీవు శరణు జొచ్చిన వారిపై ప్రేమ గలవాడవు. దయతో మా ఈ శుభవచనమును వినుము. (30) హే శంకరా! మన్మథుడు చేసిన ఈ పనిని నీవు ప్రీతితో చక్కగా విచారించుము. మహేశ్వరా! కాముడు ఈ పనిని చేయుటలో ఆతని స్వార్థచింతన లేదు (31). హే విభో! నాథా! దుష్టుడగు తారకునిచే పీడింపబడిన దేవతలందరు కలసి ఈ వనిని ఆతని చేత చేయించినారు. ఓ శంకరా! నీవు మరియొక విధముగా తలంపవద్దు (32). హే దేవా! దుఃఖితురాలైన రతీదేవి ఏకాకినియై విలపించుచున్నది. హే కైలాసాధిపతీ! నీవు కూడ ఆమెను ఓదార్చుము (33).

సంహారం తర్తుకామో%సి క్రోధేనానేన శంకర | దైవతైస్సహ సర్వేషాం హతవాంస్తం యది స్మరమ్‌ || 34

దుఃఖం తస్యా రతేర్దృష్ట్వా నష్టప్రాయాశ్చ దేవతాః | తస్మాత్త్వయా చ కర్తవ్యం రత్యా శోకాపనోదనమ్‌ || 35

హే శంకరా! నీవు ఈ క్రోధముతో సర్వమును సంహరింప బూనుకొంటివి. నీవు ఆ మన్మథుని సంహరించినచో, దేవతలతో సహా అందరినీ సంహరించినట్లే యగును (34). ఆ రతీదేవి యొక్క దుఃఖమును చూచి దేవతలు తామే నశించినట్లు భావించుచున్నారు. కావున నీవు కూడ రతీదేవి యొక్క శోకమును తొలగించవలసియున్నది (35).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య వచస్తేషాం ప్రసన్నో భగవాన్‌ శివః | దేవానాం సకలానాం చ వచనం చేద మబ్రవీత్‌ || 36

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలందరి యొక్క ఈ మాటలను విని ప్రసన్నుడై భగవాన్‌ శివుడిట్లు పలికెను (36).

శివ ఉవాచ|

దేవాశ్చ ఋషయస్సర్వే మద్వచస్శృణుతాదరాత్‌| మత్కోపేన చ యజ్ఞాతం తత్తథా నాన్యతా భ##వేత్‌ || 37

అనంగస్తావ దేవ స్యాత్కామో రతిపతిః ప్రభుః | యావచ్చావతరేత్కృష్ణో ధరణ్యాం రుక్మిణీ పతిః || 38

ద్వారకాయాం యదా స్థిత్వా పుత్రానుత్పాదయిష్యతి | తదా కృష్ణస్తు రుక్మిణ్యాం కామముత్పాదయిష్యతి|| 39

ప్రద్యుమ్న నామ తసై#్యవ భవిష్యతి న సంశయః| జాత మాత్రం తు తం పుత్రం సంబరస్సంహరిష్యతి|| 40

శివుడిట్లు పలికెను-

దేవతలారా! ఋషులారా! మీరందరు నామాటను శ్రద్ధగా వినుడు. నా క్రోధముచే ఏది జరిగినదో అది అటులనే జరుగవలసి యున్నది. మరియొక విధానము లేదు (37). భూమి యందు కృష్ణుడు అవతరించి రుక్మిణిని చెట్టపట్టునంతవరకు రతీదేవి భర్తయగు కామ ప్రభుడు దేహము లేనివాడై ఉండుగాక! (38) కృష్ణుడు ద్వారకయందు నివసించి రుక్మిణి యందు సంతానమును పొందగలడు. వారిలో మన్మథుడు కూడ ఒకడై జన్మించగలడు (39). వానికి ప్రద్యుమ్నుడను పేరు ఉండును. దీనిలో సందేహము లేదు. ఆ బాలుడు పుట్టగానే శంబరుడు వానని అపహరించగలడు (40).

హృత్వా ప్రాస్య సముద్రం తం శంబరో దానవోత్తమః | మృతం జ్ఞాత్వా వృథా మూఢో నగరం స్వం గమిష్యతి|| 41

తావచ్చ నగరం తస్య రతే స్థేయం యథా సుఖమ్‌ | తత్రైవ స్వపతేః ప్రాప్తిః ప్రద్యుమస్య భవిష్యతి|| 42

తత్ర కామో మిలిత్వా తం హత్వా శంబరమాహవే| భవిష్యతి సుఖీ దేవాః ప్రద్యుమ్నాఖ్యస్స్వకామినీమ్‌ || 43

తదీయం చైవ యద్ద్రవ్యం నీత్వా స నగరం పునః | గమిష్యతి తయా సార్థం దేవాస్సత్యం వచో మమ|| 44

మూర్ఖుడగు శంబరాసురుడు ఆ బాలుని అపహరించి సముద్రములో పారవేసి మరణించినాడని భ్రమించి తన నగరమునకు వెళ్లగలడు (41). ఓ రతీ! నీవు అంతవరకు ఆ నగరమునందు సుఖముగా నుండుము. నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీకు అచటనే లభించగలడు (42). అచట కాముడు యుద్ధములో శంబరుని వధించగలడు. ప్రద్యుమ్నుడను పేరుతో ప్రసిద్ధి గాంచిన వాడై ఆతడు తన ప్రియురాలిని కలిసి సుఖించగలడు. ఓ దేవతలారా! (43). ఆతడు శంబరుని ధనమునంతనూ తీసుకొని రతీదేవి తోడు రాగా తన నగరమునకు వెళ్లగలడు. దేవతలారా! నా మాట సత్యము (44).

బ్రహ్మో వాచ |

ఇతి శ్రుత్వా వచశ్శంభోర్దేవా ఊచుః ప్రణమ్య తమ్‌ | కించిదుచ్ఛ్వసితాశ్చిత్తే కరౌ బద్ధ్వా నతాంగకాః || 45

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని ఈ మాటలను విని దేవతలు మససులో కొంత ఓదార్పును పొందిన వారై శివునకు చేతులు జోడించి శిరసులను వంచి నమస్కరించిన వారై ఇట్లు పలికిరి (45).

దేవా ఊచుః |

దేవ దేవ మహాదేవ కరుణా సాగర ప్రభో! శీఘ్రం జీవయ కామం త్వం రక్ష ప్రాణాన్‌ రతేర్హర|| 46

దేవతలిట్లు పలికిరి-

ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! ప్రభూ! హరా! నీవు మన్ముథుని శీఘ్రముగా జీవింపజేసి రతీదేవి యొక్క ప్రాణములను కాపాడుము (46).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్యామరవచః ప్రసన్నః పరమేశ్వరః | పునర్బభాషే కరుణా సాగరస్సకలేశ్వరః || 47

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతల ఈ మాటలను విని ప్రసన్నుడైనట్టియు, కరుణాసముద్రుడు, సర్వేశ్వరుడునగు పరమేశ్వరుడు మరల ఇట్లు పలికెను (47).

శివ ఉవాచ|

హే దేవా స్సుప్రసన్నో%స్మి జీవయిష్యామి చాంతరే| కామస్స మద్గణో భూత్వా విహారిష్యతి నిత్యశః || 48

నాఖ్యేయమిదయమాఖ్యానం కస్యచిత్సురతస్సురాః | గచ్ఛత స్వస్థలం దుఃఖం నాశయిష్యామి సర్వతః || 49

శివుడిట్లు పలికెను-

ఓ దేవతలారా! మిక్కిలి ప్రసన్నుడనైతిని. కాముని ఈ లోపులోననే జీవింపజేసెదను. కాముడు నా గణమై నిత్యము విహరించగలడు (48). ఓ దేవతలారా! ఈ వృత్తాంతమునెవ్వరికీ చెప్పకుడు. మీ స్థలములకు వెళ్లుడు. దుఃఖములనన్నిటినీ నశింపజేసెదను (49).

బ్రహ్మో వాచ|

ఇత్యుక్త్వాంతర్దధే రుద్రో దేవానాం స్తువతాం తదా | సర్వే దేవాస్సుప్రసన్నా బభూవుర్గతివిస్మయాః|| 50

తతస్తాం చ సమాశ్వాస్య రుద్రస్య వచనే స్థితాః | ఉక్త్వా వచస్తదీయం చ స్వం స్వం దామ యయుర్మునే || 51

కామపత్నీ సమాదిష్టం నగరం సా గతా తదా | ప్రతీక్షమాణా తం కాలం రుద్రాదిష్టం మునీశ్వర|| 52

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే కామనాశవర్ణనం నామ ఏకోనవింశో%ధ్యాయః(19).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికి అపుడు రుద్రుడు దేవతలు స్తుతించుచుండగా అంతర్థానమయ్యెను. దేవతలందరు మిక్కిలి ప్రసన్నులైరి. కాలగతికి చకితులైరి (50). ఓ మహర్షీ! అపుడు వారు ఆమెను ఓదార్చి రుద్రుని వచనమును స్వీకరించి తమలో తాము రుద్రుని మాటలను చెప్పుకొనుచూ తమ తమ ధామములకు వెళ్లిరి (51). ఓ మహర్షీ! కాముని భార్య యగు రతి రుద్రుడు ఆదేశించిన నగరమునకు వెళ్లి అచట రుద్రుడు ఆదేశించిన కాలము కొరకు ఎదురు చూచుచుండెను (52).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో కామనాశవర్ణనమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది(19).

Sri Sivamahapuranamu-II    Chapters