Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రింశోధ్యాయః

పార్వతి గృహమునకు మరలి వచ్చుట

నారద ఉవాచ |

విధే తాత మహాభాగ ధన్యస్త్వం పరమార్థ దృక్‌ | అద్భతేయం కథాశ్రావి త్వదను గ్రహతో మయా || 1

గతే హరే స్వశైలేహి పార్వతీ సర్వమంగలా | కిం చకార గతా కుత్ర తన్మే వద మహామతే || 2

నారదిట్లు పలికెను -

ఓ విధీ! తండ్రీ! మహాత్మా! పరమసత్యమును దర్శించు నీవు ధన్యుడవు. నీ అనుగ్రహముచే నేనీ అద్భుతగాథను వింటిని (1). శివుడు తన పర్వతమునకు వెళ్లిన పిదప సర్వమంగళయగు పార్వతి ఏమి చేసెను? ఎచటకు వెళ్లెను? ఓ మహా బుద్ధీ! నాకు ఆ గాథను చెప్పుము (2).

బ్రహ్మోవాచ|

శృణు సుప్రీతితస్తాత యజ్ఞాతం తదనంతరమ్‌ | హరే గతే నిజస్థానే తద్వదామి శివం స్మరన్‌ || 3

పార్వత్యపి సఖీయుక్తా రూపం కృత్వా తు సార్థకమ్‌ | జగామ స్వపితుర్గేహం మహాదేవేతి వాదినీ || 4

పార్వత్యాగమనం శ్రుత్వా మేనా చ స హిమాచలః | దివ్యం యానం సమారుహ్య ప్రయ¸° హర్ష విహ్వలః || 5

పురోహితశ్చ పౌరాశ్చ సఖ్యశ్చైవాప్యనేకశః | సంబంధినస్త థాన్యే చ సర్వే తే చ సమాయయుః || 6

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! ప్రీతితో వినుము. నేను శివుని స్మరించి, శివుడు తన ధామమునకు వెళ్లిన తరువాత జరిగిన వృత్తాంతమును చెప్పెదను (3). తన రూపమును సార్థకము చేసుకున్న పార్వతి కూడా సఖురాండ్రతో గూడి మహాదేవనామమును జపిస్తూ తన తండ్రిగారి గృహమునకు వెళ్లెను (4). మేనా హిమవంతులు పార్వతి రాకును గురించి విని హర్షమును పట్టజాలక దివ్యమగు రథమును నధిష్టించి ఎదురేగిరి (5). పురోహితులు, పౌరులు, పెద్ద సంఖ్యలో సఖురాండ్రు, బంధువులు మరియు ఇతరులు అందరు విచ్చేసిరి (6).

భ్రాతరస్సకలా జగ్ముర్మైనాక ప్రముఖాస్తదా | జయశబ్దం ప్రబ్రువంతో మహాహర్ష సమన్వితా ః || 7

సంస్థాప్య మంగల ఘటం రాజవర్త్మని రాజితే | చందనాగరు కస్తూరీ ఫలశాఖా సమన్వితే || 8

సపురోధో బ్రహ్మణౖశ్చ మునిభి ర్బ్రహ్మ వాదిభిః | నారీభిర్నర్తకీభిశ్చ గజేంద్రాద్రి సుశోభితే || 9

పరితః పరితో రంభాస్తంభ బృంద సమన్వితే | పతి పుత్రవతీ యోషిత్సమూహైర్దీపహస్తకైః || 10

అపుడు మైనాకు మొదలగు సోదరులందరు మహానందముతో నిండిన వారై జయధ్వానమును చేస్తూ విచ్చేసిరి (7). ప్రకాశించే రాజ మార్గమునందు మంగళఘటమును స్థాపించిరి. రాజమార్గము చందనము, అగరు, కస్తూరి, ఫలములు మరియు శాఖలతో ప్రకాశించెను (8).పురోహితులగు బ్రాహ్మణులతో, బ్రహ్మవేత్తలగు ఋషులతో, నాట్యముచేయు స్త్రీలతో, మరియు పర్వతముల వంటి గొప్ప ఏనుగులతో రాజమార్గము శోభిల్లెను (9). రెండు వైపులా అరటి స్తంభములచే అలంకిరంపబడిన ఆ రాజమార్గములో భర్త, పిల్లలు గల ముత్తైదువలు దీపములను చేతబట్టి గుంపులుగా నిలబడిరి (10).

ద్విజ బృందైశ్చ సంయుక్తే కుర్వద్భిర్మంగల ధ్వనిమ్‌ | నానా ప్రకారావాద్యైశ్చ శంఖధ్వనిభిరన్వితే || 11

ఏతస్మిన్నంతరే దుర్గా జగామ స్వపురాంతికమ్‌ | విశంతీ నగరం దేవీ దదర్శ పితరౌ పునః || 12

సుప్రసన్నౌ ప్రధావంతౌ హర్షవిహ్వల మానసౌ | దృష్ట్వా కాలీ సుప్రహృష్టా స్వాలిభిః ప్రణనామ తౌ || 13

తౌ సంపూర్ణాశిషం దత్త్వా చక్రతుస్తౌ స్వపక్షసి | హే వత్సే త్వేవముచ్చార్య రుదంతౌ ప్రేమవిహ్వలౌ || 14

అచట బ్రాహ్మణ బృందములు మంగళ ధ్వనిని చేయుచుండిరి. శంఖము మొదలగు అనేక వాద్యములు మ్రోయింపబడుచుండెను (11). ఇంతలో దుర్గ తన నగరమునకు సమీపించెను. ఆమె నగరములో ప్రవేశిస్తూనే, ఆనందము పట్టజాలని తల్లిదండ్రులను చూచెను (12). మిక్కిలి ప్రసన్నులై వేగముగా వచ్చిన వారిని చూచి కాళి మిక్కిలి సంతసించి, తన సఖురాండ్రతో సహా వారికి నమస్కరించెను (13). వారు పూర్ణమగు ఆశ్వీరచనములను పలికి 'ఓ అమ్మాయీ!' అని అక్కున చేర్చుకుని ప్రేమను పట్టజాలక ఆనందబాష్పములను రాల్చిరి (14).

తతస్స్వకీయా అప్యస్యా అన్యా నార్యోపి సంముదా | భ్రాతృ స్త్రియోపి సుప్రీత్యా దృఢాలింగన మాదధుః || 15

సాధితం హి త్వయా సమ్యక్‌ సుకార్యం కుల తారణమ్‌ | త్వత్సదాచరణనాపి పావితాస్స్మాఖిలా వయమ్‌ || 16

ఇతి సర్వే సుప్రశంస్య ప్రణముస్తాం సుహర్షితాః | చందనైస్సు ప్రసూనైశ్చ నమానర్చు శ్శివాం ముదా || 17

తస్మిన్నవసరే దేవా విమానస్థా ముదాంబరే | పుష్పవృష్టిం శుభాం చక్రుర్నత్వా తాం తుష్టుపుస్సవై ః || 18

తరువాత ఆమెకు బంధువులగు ఇతరస్త్రీలు, సోదరుల భార్యలు గూడ మహానందముతో పరమప్రీతితో ఆమెను గట్టిగా కౌగిలించుకొనిరి (15). నీవు వంశమును తరింపజేయు పుణ్యకార్యమును చక్కగా సాధించితివి. నీ పవిత్రమగు ఆచరణచే మేమందరము కూడా పవిత్రులమైతిమి (16). ఇట్లు వారందరు మహాహర్షముతో ఆమెను బాగుగా కొనియాడి, సుగంధ ద్రవ్యములతో, మరియు మంచి పుష్పములతో ఆ శివాదేవిని ఉల్లాసముగా చక్కగా పూజించిరి (17). ఆ సమయములో ఆకసమునందు విమానములలో నున్న దేవతలు ఆనందముతో మంగళకరమగు పుష్పవృష్టిని గురిపించి ఆమెకు నమస్కరించి స్తోత్రములను చేసిరి (18). తదా తాం చ రథే స్థాప్య సర్వే శోభాన్వితే వరే | పురం ప్రవేశయామనుస్సర్వే విప్రాదయో ముదా || 19

అథ విప్రాః పురోధాశ్చ సఖ్యోన్యాశ్చస్త్రియశ్శివామ్‌ | గృహం ప్రవేశయామాసుర్బహు మానపురస్సరమ్‌ || 20

స్త్రియో నిర్మచ్చనం చక్రు ర్విప్రా యుయుజురాశిషః | హిమవాన్‌ మేనకా మాతా ముమోదాతి మునీశ్వర || 21

స్వాశ్రమం సఫలం మేనే కుపుత్రాత్‌ పుత్రికా వరా | హిమవాన్‌ నారదం త్వాం చ సంస్తువన్‌ సాధు సాధ్వితి || 22

అపుడు బ్రాహ్మణులు మొదలగువారందరు ఆనందముతో ఆమెను ప్రకాశించే గొప్ప రథములో కూర్చుండబెట్టి నగరములో ప్రవేశ##బెట్టిరి (19). అపుడు బ్రాహ్మణులు, పురోహితుడు, చెలికత్తెలు మరియు ఇతర స్త్రీలు పార్వతిని సన్మాన పూర్వకముగా ఇంటిలో ప్రవేశ##పెట్టిరి (20). స్త్రీలు ఆమెకు దిష్టి తీసిరి. బ్రాహ్మణులు ఆశీర్వచనములను పలికిరి. ఓ మహర్షీ! తల్లిదండ్రులగు మేనా హిమవంతులు మిక్కలి ఆనందించరి (21). తన గృహస్థాశ్రమము సఫలమైనదనియు, చెడు పుత్రునికంటె పుత్రికయే శ్రేష్ఠమనియు భావించిన హిమవంతుడు నిన్ను (నారదుని)'బాగు, బాగు' అని స్తుతించెను (22).

బ్రాహ్మణభ్యశ్చ బందిభ్యః పర్వతేంద్రో ధనం దదౌ| మంగలం పాఠయామాస స ద్విజేభ్యో మహోత్సవమ్‌ || 23

ఏవం స్వకన్యయా హృష్టౌపితరౌ భ్రాతరస్తథా | జామయశ్చ మహాప్రీత్యా సమూషుః ప్రాంగణ మునే || 24

తతస్స హిమవాన్‌ తాత సుప్రహృష్టః ప్రసన్నధీః | సమ్మాన్య సకలాన్‌ ప్రీత్యా స్నాతుం గంగాం జగామ హ || 25

ఏతస్మిన్నంతరే శంభుస్సలీలో భక్తవత్సలః | సునర్తకనటోభూత్వా మేనకా సన్నిధిం య¸° || 26

ఆ పర్వతరాజు బ్రాహ్మణులకు, వందిమాగధులకు ధనము నిచ్చెను. బ్రాహ్మణులచే మంగళ పాఠములను చదివించెను. గొప్ప ఉత్సవమును చేయించెను (23). ఓ మహర్షీ! ఈ తీరున తమ కుమార్తెచే సంతసించిన తల్లిదండ్రులు, సోదరులు మరియు వారి భార్యలు మహానందముతో వాకిట గూర్చిండిరి (24). ఓ కుమారా! తరువాత మిక్కిలి ఆనందించి, ప్రసన్నమగు మనస్సును కలిగియున్న ఆ హిమవంతుడు అందరిని ప్రీతి పూర్వకముగా ఆదరించి స్నానము చేయుటకు గంగానదికి వెళ్లెను (25). ఇంతలో భక్తవల్సలుడు, లీలలను చూపువాడు నగు శంభుడు నాట్యము చేసే నటుని రూపమును ధరించి మేనాదేవి వద్దకు వెళ్లెను (26).

శృంగం వామే కరే ధృత్వా దక్షిణ డమరుం తథా | పృష్ఠే రక్తవాసా నృత్యగాన విశారదః || 27

తతస్సునట రూపోసౌ మేనకాయాం గణ ముదా | చక్రే సునృత్యం వివిధం గానం చాతిమనోహరమ్‌ || 28

శృంగం చ డమరుం తత్ర వాదయామాస సుధ్వనిమ్‌ | మహతీం వివిధాం తత్ర స చకార మనోహరమ్‌ || 29

తాం ద్రుష్టుం నాగరాస్సర్వే పురుషాశ్చ స్త్రియస్తథా | ఆ జగ్ముస్సహసా తత్ర బాలా వృద్ధా అపి ధ్రువమ్‌ || 30

నృత్యగాన పండితుడగు శివుడు ఎర్రని వస్త్రమును ధరించి ఎడమచేతియందు కొమ్ము బూరాను, కుడిచేతియందు డమరుకను, భుజముపై మచ్చల దుప్పటిని ధరించి యుండెను (27). అపుడా మహానటుని రూపములో నున్న శివుడు మేనక మరియు ఇతర స్త్రీల యెదుట ప్రాంగణములో చక్కని నాట్యమును చేసి, అతిమనోహరముగా అనేకములగు పాటలను పాడును (28). మరియు ఆయన అచట చక్కని ధ్వని గల కొమ్ముబూరాను, డమరును మ్రెగించి వివిధములైన మనోహర మహానాట్యములను చేసెను (29). ఆనాట్యమును చూచుటకై నగర జనులు అందరు, అనగా పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరు, వెంటనే అచటకు విచ్చేసిరి (30).

శ్రుత్వా సుగీతం తద్దృష్ట్వా సునృత్యం చ మనోహరమ్‌ | సహసా ముముహుస్సర్వే మేనాపి చ తదా మునే || 31

ముర్ఛాం సంప్రాప్య సా దుర్గా సుదృష్ట్వా హృది శంకరమ్‌ | త్రిశూలాదిక చిహ్నాని బిభ్రతం చాతి సుందరమ్‌ || 32

విభూతి భూషితం రమ్య మస్థి మాలా సమన్వితమ్‌ | త్రిలో చనోజ్జ్వల ద్వక్త్రం నాగయజ్ఞోపవీతకమ్‌ || 33

వరం వృణ్విత్యక్తవంతం గౌరవర్ణం మహేవ్వరమ్‌ | దీన బంధుం దయాసింధుం సర్వథా సుమనోహరమ్‌ || 34

హృదయస్థం హరం దృష్ట్వేదృశం సా ప్రణనామ తమ్‌ | వరం వవ్రే మానసం హి పతిర్మే త్వం భ##వేతి చ || 35

ఓ మహర్షీ! ఆ చక్కని గీతమును, మనోహరమగు నృత్యమును చూచి మేనతో సహాఅందరు మోహమును పొందిరి (31). ఆ దుర్గకూడ మూర్ఛిల్లి హృదయమునందు శంకరుని చూచెను. త్రిశూలము మొదలగు చిహ్నములను ధరించియున్నవాడు. మిక్కలి సుందరాకారుడు (32). భస్మచే అలంకరింపబడినవాడు, సుందరమగు ఎముకల మాలను ధరించినవాడు, మూడు కన్నులతో గొప్పగా ప్రకాశించు చున్న ముఖము గలవాడు, సర్పములే యజ్ఞోపవీతముగా గలవాడు (33), వరమును కోరుకొనుము అని పలికిన వాడు, పచ్చని రంగు గలవాడు, మహేశ్వరుడు, దీనులకు బంధువు, దయాసముద్రుడు, అన్ని విధములుగా మిక్కలి మనోహరమైనవాడు (34), హృదయము నందున్నవాడు అగు హరుని చూచి ఆమె ఆతనికి నమస్కరించెను. మరియు ఆమె తన మనస్సులో 'నీవు నాకు భర్తవు కమ్ము' అని వరమును గోరెను (35).

వరం దత్త్వా శివం చాథ తాదృశం ప్రీతితో హృదా| అంతర్ధాయ పుసస్తత్ర సుననర్త స భిక్షుకః || 36

తతో మేనా సురత్నాని స్వర్ణపాత్ర స్థితాని చ | తసై#్మ దాతుం య¸° ప్రీత్యా తద్భూతి ప్రీతిమానసః ||37

తాని నస్వీచకారాసౌ భిక్షాం యాచే శివాం చతామ్‌ | పునస్సు నృత్యం గానం చ కౌతుకాత్కర్తు ముద్యతః || 38

మేనా తద్వచనం శ్రుత్వా చుకోపాతి సువిస్మితా | భిక్షుకం భర్త్స యామాస బహిష్కర్తుమియేష సా || 39

శివుడు ఆమెకు హృదయములో దర్శనమిచ్చి ప్రీతితో మంగళకరమగు అట్టి వరమొసంగి అంతర్ధానమై మరల అచట భిక్షుకుడై నాట్యమును చేసెను (36). అపుడు మేన బంగరు పాత్రలో మంచి రత్నములను పోసి ఆతనికి ఇచ్చుటకై తీసుకొని వెళ్లెను (37).ఆ సంపదకు సంతసించిన మనస్సుగల శివుడు ఆ రత్నములను నిరాకరించి పార్వతిని భిక్షగా నిమ్మని గోరెను. మరియు, ఆయన మరల పాటలు పాడుతూ ఉత్సాహముతో నటనము చేయ మొదలిడెను (38). ఆ మాటను వినిన మేన మిక్కలి ఆశ్చర్యమును, కోపమును పొంది ఆ భిక్షుకుని నిందించెను. ఆమె ఆతనిని బయటకు నెట్టింపగోరెను (39).

ఏతస్మిన్నంతరే తత్ర గంగాతో గిరిరాయ¸° | దదర్శ పురతో భిక్షుం ప్రాంగణస్థం నరాకృతిమ్‌ ||40

శ్రుత్వా మేనాముఖాద్వృత్తం తత్సర్వం సుచుకోప సః | ఆజ్ఞాం చకారాను చరాన్‌ బహిష్కర్తుం చ తం నటమ్‌ ||41

మహాగ్నిమివ దుస్స్పర్శం ప్రజ్వలంతం సుతేజసమ్‌ | న శశాక బహిష్కర్తుం కోపి తం మునిసత్తమ || 42

తతస్స భిక్షుకస్తాత నానాలీలా విశారదః | దర్శయామాసశైలాయ స్వప్రభావమనంతకమ్‌ || 43

ఇంతలో గంగానది నుండి హిమవంతుడచటకు వచ్చెను. ఆయనకు నరరూపములో నున్న ఆది భిక్షువు వాకిట గానవచ్చెను (40). మేనాదేవి చెప్పగా జరిగిన వృత్తాంతమునంతనూ విని ఆయన చాలా కోపించి ఆనటుని బయటకు గెంటుడని సేవకులనాజ్ఞాపించెను (41). ఓ మునిశ్రేష్ఠా! గొప్ప అగ్నివలె స్పృశింప శక్యముగాని విధముగా మహాతేజస్సుతో ప్రజ్వరిల్లుచున్న ఆ శివుని బయటకు నెట్టు సామర్థ్యము ఎవ్వరికీ లేకపోయెను (42). ఓ కుమారా! అనేక లీలా పండితుడగు ఆ భిక్షుకుడు అపుడు తన అనంత మహిమను హిమవంతునకు చూపించెను (43)

శైలో దదర్శ తం తత్ర విష్ణురూపధరం ద్రుతమ్‌ | కిరీటినం కుండలినం పీతవస్త్రం చతుర్భుజమ్‌ || 44

యద్యత్పుష్పాదికం దత్తం పూజాకాలే గదా భృతే | గాత్రే శిరసి తత్సర్వం భిక్షుకస్య దదర్శ హ || 45

తతో దదర్శ జగతాం స్రష్టారం స చతుర్ముఖమ్‌ | రక్తవర్ణం పఠంతం చ శ్రుతి సూక్తం గిరీశ్వరః || 46

తతస్సూర్య స్వరూపం చ గజచ్చక్షు స్స్వరూపకమ్‌ | దదర్శ గిరిరాజస్స క్షణం కౌతుక కారిణమ్‌ || 47

అపుడచట హిమవంతునకు వెనువెంటనే కిరీటమును, కుండలములను, పచ్చని వస్త్రమును ధరించియున్న నాల్గు భుజములు గల విష్ణురూపము దర్శనమిచ్చెను (44). పూజాసమయములో గదాధారియగు విష్ణువునకు ఏయే పుష్పాదులు సమర్పించడినవో, అవి అన్నియూ ఆ భిక్షుకుని శరీరమునందు, శిరస్సునందు గానవచ్చెను (45). తరువాత నాల్గు ముఖములు గలవాడు, ఎర్రని వర్ణముగలవాడు, వేద సూక్తములను పఠించుచున్నవాడు అగు సృష్టికర్తను ఆ హిమవంతుడు గాంచెను (46). తరువాత ఆ పర్వత రాజు జగత్తులకు చూపును అనుగ్రహించు సూర్య భగవానుని క్షణకాలము గాంచి విస్మయమును పొందెను (47).

తతో దదర్శ తం తాత రుద్రరూపం మహాద్భుతమ్‌ | పార్వతీ సహితం రమ్యం విహసంతం సుతేజసమ్‌ || 48

తతస్తేజ స్స్వరూపం చ నిరాకారం నిరంజనమ్‌ | నిరుపాధిం నిరీహం చ మహాద్భుత మరూపకమ్‌ || 49

ఏవం బహూని రూపాణి తస్య తత్ర దదర్శ సః | సువిస్మితో బభూవాశు పరమానంద సంయుతః || 50

అథసౌ భిక్షువర్యో హి తస్మాత్త స్యాశ్చ సూతికృత్‌ | భిక్షాం యయాచే దుర్గాం తాం నాన్యజ్జగ్రాహ కించన || 51

ఓ కుమారా! అపుడు ఆ పర్వతుడు మహాద్భుతము, పార్వతీ సహితము, రమ్యము, నవ్వుచున్నమోము గలది, గొప్పతేజస్సు గలది యగు రుద్ర రూపమును గాంచెను (48). ఆ తరువాతతేజోరూపము, నిరాకారము, నిరంజనము, ఉపాధిలేనిది, సంకల్పములు లేనిది, మహాద్భుతము అగు నిర్గుణ స్వరూపమును గాంచెను (49). ఈ తీరున ఆ హిమవంతుడు భిక్షుకుని యందు అనేక రూపములను గాంచి మిక్కిలి ఆశ్చర్యమును, పరమానందమును పొందెను (50). అపుడు జగత్కారణుగగు ఆ ఆది భిక్షువు ఆతని నుండి గుర్గను భిక్షగా నిమ్మని గోరెను. మరియొక భిక్షను ఆయన స్వీకరించలేదు (51).

న స్వీచకార శైలేంద్రో మోహిత శ్శివమాయయా | భిక్షుః కించిన్న జగ్రాహ తత్రై వాంతర్ధధే తతః || 52

తదా బభూవ సుజ్ఞానం మేనాశైలేశ యోరితి | ఆవాం శివో వంచయిత్వా స్వస్థానం గతవాన్‌ ప్రభుః || 53

తయోర్విచింత్య తత్రైవం శివే భక్తిరభూత్పురా | మహామోక్షకరీ దివ్యా సర్వానంద ప్రదాయినీ || 54

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీఖండే పార్వతీ ప్రత్యాగమన మహోత్సవ వర్ణనం నామ త్రింశోధ్యాయః (30).

శివమాయచే మోహితుడైన పర్వతరాజు అంగీకరించలేదు. ఆ భిక్షువు ఇతరమును స్వీకరించకుండగనే అచ్చటనే అంతర్ధానమయ్యెను (52). అపుడు 'మనలను శివప్రభుడు మోసగించి తన స్థానమునకు వెళ్లినాడు' అను జ్ఞానము మేనా హిమవంతులకు కలిగెను (53). ఇట్లు ఆలోచించిన వారిద్దరికి మహామోక్షమును కలిగించునది, దివ్యమైనది, సర్వానందముల నిచ్చునది అగు శివభక్తి ఉదయించెను (54).

శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహితయందు పార్వతి మరలి వచ్చుట అను వృత్తాంతమును వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసెను (30).

Sri Sivamahapuranamu-II    Chapters