Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రయస్త్రింశోధ్యాయః

సప్తర్షుల ఉపదేశము

ఋషయ ఊచుః |

జగత్పి తా శివః ప్రోక్తో జగన్మాతా శివా మతా | తస్మాద్దేయా త్వయా కన్యా శంకరాయ మహాత్మనే || 1

ఏవం కృత్వా హిమగిరే సార్థకం తే భ##వేజ్జనుః | జగద్గురో ర్గురుస్త్వం హి భవిష్యసి న సంశయః || 2

ఋషులిట్లు పలికిరి -

శివుడు జగములకు తండ్రి అనియు, శివాదేవి తల్లి అనియు పెద్దలు చెప్పెదరు. కావున నీవు కన్యను మహాత్ముడగు శంకరునకిమ్ము (1). ఓ హిమగిరీ! ఇట్లు చేసినచో నీ జన్మ సార్థకమగును. నీవు జగద్గురువునకు గురువు కాగలవు. సందేహము లేదు (2).

బ్రహ్మోవాచ |

ఏవం వచన మాకర్ణ్య సప్తర్షీణాం మునీశ్వర | ప్రణమ్య తాన్‌ కరౌ బద్ధ్వా గిరిరాజోబ్రవీదిదమ్‌ || 3

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! హిమవంతుడు సప్తర్షుల ఈ మాటలను విని వారికి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను (3).

హిమాలయ ఉవాచ|

సప్తర్షయో మహాభాగా భవద్భిర్యదుదీరితమ్‌ | తత్ప్రమాణీకృతం మే హి పురైవ గిరిశేచ్ఛయా || 4

ఇదానీ మేక ఆగత్య విప్రో వైష్ణవధర్మవాన్‌ | శివముద్దిశ్య సుప్రీత్యా విపరీతం వచోబ్రవీత్‌ || 5

తదారభ్య శివామాతా జ్ఞానభ్రష్టా బభూవ హ | సుతావివాహం రుద్రేణ యోగినా తేన నేచ్ఛతి || 6

హివమంతుడిట్లు పలికెను-

మహాత్ములారా! సప్తర్షులారా! శివుని ఆజ్ఞచే మీరు చెప్పిన మాట పూర్వమే నాచేత ప్రమాణముగా స్వీకరింపబడినది (4). ఇప్పుడే ఒక వైష్ణవధర్మానుయాయి అగు బ్రాహ్మణుడు వచ్చి శివుని ఉద్దేశించి విపరీతమగు మాటలను మహాప్రీతితో పలికినాడు (5). అప్పటి నుండియూ పార్వతి తల్లి జ్ఞానభ్రష్టురాలై యోగియగు రుద్రునితో పార్వతి యొక్క వివాహమునకు అంగీకరించుట లేదు (6).

కోపాగారమగాత్సా హి సుతప్తా మలినాంబరా | కృత్వా మహాహఠం విప్రా బోధ్యమానాపి నాబుధత్‌ || 7

అహం చ జ్ఞాన విభ్రష్టో జాతోహం సత్యమీర్యతే | దాతుం సుతాం మహేశాయ నేచ్ఛామి భిక్షు రూపిణ || 8

ఆమె మిక్కలి దుఃఖితురాలై మాసిన వస్త్రములను ధరించి కోపగృహములో ప్రవేశించినది. ఓ ఋషులారా! బోధించిననూ ఆమె తెలుసు కొనుట లేదు. ఆమె చాల మొండి పట్టుతో నున్నది (7). నేను కూడ జ్ఞానము కోల్పోతిని. నేను సత్యమునే పలుకుచున్నాను.

భిక్షరూపధారియగు మహేశ్వరునకు కుమార్తెను ఇచ్చుట నాకు ఇచ్చగించుట లేదు (8).

బ్రహ్మోవాచ|

ఇత్యక్త్వా శైలరాజస్తు శివమాయా విమోహితః | తూష్ణీం బభూవ తత్రస్థో మునీనాం మధ్యతో మునే || 9

సర్వే సప్తర్షయస్తే హి శివషూయాం ప్రశస్య వై | ప్రేషయామాసురథ తాం మేనకాం ప్రత్యరుంధతీమ్‌ || 10

అథ పత్యుస్సమాదాయ నిదేశం జ్ఞానదా హి సా | జగామారుంధతీ తూర్ణం యత్ర మేనా చ పార్వతీ || 11

గత్వా దదర్శ మేనాం తాం శయనాం శోకమూర్ఛితామ్‌ | ఉవాచ మధురం సాధ్వీ సావధాన హితం వచః || 12

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శివమాయచే విమోహితుడైన పర్వతరాజు మునుల యెదుట నిలబడి ఇట్లు పలికి మిన్నకుండెను (9). ఆ ఏడ్గురు ఋషులు శివమాయను కొనియాడి, పిదప అరుంధతిని మేనక వద్దకు పంపిరి (10). జ్ఞానమును ఇచ్చే ఆ అరుంధతి భర్త ఆజ్ఞను గైకొని, వెంటనే పార్వతి మరియు మేన ఉన్నచోటకు వెళ్లెను (11). ఆమె అచటకు వెళ్లి శోకముచే పరాభూతయై పరుండియున్న మేనను చూచెను. అపుడా సాధ్వి మెల్లగా మధురము, హితమునగు వచనము నిట్లు పలికెను (12).

అరుంధత్యువాచ|

ఉత్తిష్ఠ మేనకే సాధ్వి త్వద్గృహే హమరుంధతీ | ఆగతా మునయాశ్చాపి సప్తాయాతాః కృపాలవః || 13

అరుంధతి ఇట్లు పలికెను-

ఓ మేనకా! సాధ్వీ! లెమ్ము. నేను అరుంధతిని. దయానిధులగు ఏడ్గురు ఋషులతో గూడి నేను మీఇంటికి వచ్చి యుంటిని (13).

బ్రహ్మోవాచ|

అరుంధతీ స్వరం శ్రుత్వా శీఘ్రముత్థాయ మేనకా | ఉవాచ శిరసా నత్వా తాం పద్మామివ తేజసా || 14

బ్రహ్మ ఇట్లు పలికెను-

అరుంధతి యొక్క కంఠస్వరమును విన్నంతనే మేనక వేగమే లేచి నిలబడి, లక్ష్మీదేవి వలె వెలుగొందుచున్న ఆమెకు శిరసానమస్కరించి ఇట్లు పలికెను (14).

మేనోవాచ|

అహోద్య కిమిదం పుణ్యమస్మాకం పుణ్య జన్మనామ్‌ | వధూర్జగద్విధేః పత్నీ వసిష్ఠ స్యాగతేహ వై || 15

కిమర్థ మాగతా దేవి తన్మే బ్రూహి విశేషతః | అహం దాసీ సమా తే హి ససుతా కరుణాం కురు || 16

మేన ఇట్లు పలికెను-

అహో! మేము ఎంత పుణ్యమో చేసుకొని జన్మించితిమి. అందువలననే జగ్తునకు విధివిధానమునందించిన వసిష్ఠుని ధర్మపత్ని ఇచటకు వచ్చినది (15). ఓ దేవీ! ఇచటకు మీరు వచ్చుటలో గల కారణమేమియో నాకు వివరముగా చెప్పుడు. నేను నీకు దాసివంటి దానను. నీకుమార్తె వంటి దానను. నాపై దయను చూపుము (16).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్తా మేనకాం సాధ్వీ బోధయిత్వా చ తాం బహు | తథాగతా చ సుప్రీత్యా సాస్తే యత్రర్షయోపితే || 17

అథ శైలేశ్వరం తే చ బోధయా మాసురాదరాత్‌ | స్మృత్వా శివపదద్వంద్వం సర్వే వాక్య విశారదాః || 18

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు పతివ్రతయగు అరుంధతిమేనయొక్క ఈ మాటలను విని, ఆమెకు పరిపరివిధముల బోధచేసి, మరల ఆ ఋషులు ఉన్నచోటికి ప్రీతితో తరలి వచ్చెను (17). మరియు మాటలాడుటలో సమర్థులగు ఆ ఋషులందరు శివుని పాద పద్మములను స్మరించి సాదరముగా పర్వతరాజునకు బోధించిరి (18).

ఋషయ ఊచుః |

శైలేంద్ర శ్రూయతాం వాక్యమస్మాకం శుభకారణమ్‌ | శివాయ పార్వతీం దేహి సంహర్తు శ్శ్వశురో భవ || 19

అయాచితారం సర్వేశం ప్రార్థయామాస యత్నతః| తారకస్య వినాశాయ బ్రహ్మా సంబంధ కర్మణి || 20

నోత్సుకో దారసంయోగే శంకరో యోగినాం వరః | విధేః ప్రార్థనయా దేవస్తవ కన్యాం గ్రహీష్యతి || 21

దుహితస్తే తపస్తప్తం ప్రతిజ్ఞానము చకార సః | హేతుద్వయేన యోగీంద్రో వివాహ చ కరిష్యతి || 22

ఋషులిట్లు పలికిరి-

ఓ పర్వతరాజా! శుభకరమగు మా మాటలను వినుము. పార్వతిని శివునకు ఇమ్ము. జగత్తును లయముచేయు రుద్రునకు మామవు కమ్ము (19). తారకుని వినాశము కొరకై బ్రహ్మగారు యాచించుట ఎరుంగని ఆ సర్వేశ్వరుని ఈ వివాహమును చేసుకొమ్మని కష్టపడి ఒప్పించెను (20). యోగివర్యుడగు శంకరునకు వివాహమునందభిరుచి లేదు. కాని ఆ దేవుడు బ్రహ్మగారి ప్రార్థనచే నీ కన్యను వివాహమాడగలడు (21). నీ కుమార్తె తపస్సును చేయగా ఆయన ఆమెకు మాటను ఇచ్చి యున్నాడు. ఈ రెండు కారణములచే యోగివర్యుడగు శివుడు వివాహమును చేసుకొనగలడు (22).

బ్రహ్మోవాచ|

ఋషీణాం వచనం శ్రుత్వా ప్రహస్య స హిమాలయః | ఉవాచ కించిద్భీతస్తు పరం వినయపూర్వకమ్‌ || 23

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఋషులు ఆ మాటను విని ఆ హిమవంతుడు నవ్వి కొద్దిగా భయపడినవాడై గొప్ప వినయమును చూపుచూ ఇట్లు పలికెను (23).

హిమాలయ ఉవాచ|

శివస్య రాజసామగ్రీం నహి పశ్యామి కాంచన | కంచిదాశ్రయమైశ్వర్యం కం వాస్వజన బాంధవమ్‌ || 24

నేచ్ఛామ్యతివినిర్లిప్తయోగినే స్వాం సుతామహమ్‌ |యూయం వేదవిధాతుశ్చ పుత్రా వదత నిశ్చితమ్‌ || 25

వరాయాననురూపాయ పితా కన్యాం దదాతి చేత్‌ | కామాన్మో హభయాల్లోభాత్స నష్టో నరకం వ్రజేత్‌ || 26

న హి దాస్యామ్యహం కన్యా మిచ్ఛ యా శూలపాణయే | యద్విధానం భ##వేద్యోగ్య మృషయసత్ద్విధీయతామ్‌ || 27

హిమవంతుడిట్లు పలికెను -

మహారాజునకు ఉండదగిన సామగ్రి ఏదియూ శివుని వద్ద గానరాదు. ఆయనకు ఒక ఆశ్రయముగాని, ఐశ్వర్యముగాని, తన వారుగాని, బంధువులు గాని ఉన్నట్లు కన్పట్టుట లేదు (24). మిక్కిలి నిర్లిప్తుడగు యోగికి నా కుమార్తెను ఇచ్చి వివాహము చేయుట నాకు ఇష్టమగుట లేదు. వేదములను ప్రవర్తిల్ల చేసిన బ్రహ్మ గారి పుత్రులగు మీరు మీ నిశ్చయమును చెప్పుడు (25). కామనలవలన గాని, మోహము వలన గాని, భయము వలనగాని, లోభము వలన గాని కుమార్తెను తగని వరునకు ఇచ్చిన తండ్రి నశించి నరకమును పొందును (26). నేను ఇష్టపడి శూలపాణియగు శివునకు కన్యను ఈయలేకున్నాను. ఓ ఋషులారా! ఈ విషయములో ఎట్లు యోగ్యముగ నుండునో మీరే నిర్ణయించుడు (27).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య వచస్తస్య హిమాగస్య మునీశ్వర | ప్రత్యువాచ వసిష్ఠం స్తం తేషాం వాక్యవిశారదః || 28

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! హిమవంతుని ఆ మాటను విని వారిలో వాక్య విశారదుడగు వసిష్ఠుడు ఈ విధముగా బదులిడెను (28).

వసిష్ఠ ఉవాచ|

శృణుశైలేశ మద్వాక్యం సర్వథా తే హితావహమ్‌ | ధర్మా విరుద్ధం సత్యం చ పరత్రేహ ముదావహమ్‌ ||29

వచనం త్రివిధం శైల లౌకికే వైదికేపి చ | సర్వం జానాతి శాస్త్రజ్ఞో నిర్మల జ్ఞానచక్షుషా || 30

అసత్యమహితం పశ్చాత్సాంప్రతం శ్రుతి సుందరమ్‌ | సుబుద్ధిర్వక్తి శత్రుర్హి హితం నైవ కదాచన || 31

ఆదావప్రీతి జనకం పరిణామే సుఖావహమ్‌ | దయాలు ర్ధర్మశీలో హి బోధయత్యేవ బాంధవః | 32

వసిష్ఠుడిట్లు పలికెను-

ఓ పర్వతరాజా! నీకు అన్ని విధములుగా హితమును కలిగించునది, ధర్మమునకు విరుద్ధము కానిది, సత్యము, ఇహపరములలో ఆనందమును కలిగించునది అగు నా మాటను వినుము (29). ఓ పర్వతరాజా! లోకమునందు, వేదమునందు గూడ వచనము మూడు విధములుగా నున్నది. శాస్త్రము నెరింగిన జ్ఞానులు శుద్ధమగు జ్ఞాననేత్రముచే ఈ సర్వమును ఎరుంగుదురు (30). అసత్యము వర్తమానములో వినుటకు మధురముగ నుండి భవిష్యత్తులో కష్టమును కలిగించును. శత్రువు బుద్ధి మంతుడైనచో హితమును ఎన్నడైననూ పలుకడు (31). దయాళువు, ధర్మ బుద్ధి గలవాడు అగు బాంధవుడు ఆదిలో క్లేశమును కలిగించునది, పరిణామములో సుఖమును కలిగించునది అగు మాటను పలుకును (32).

శ్రుతిమాత్రాత్సధాతుల్యం సర్వకాల సుఖావహమ్‌ | సత్యసారం హితకరం వచనం శ్రేష్ఠ మీప్సితమ్‌ || 33

ఏవం చ త్రివిధం శైల నీతి శాస్త్రోదితం వచః | కథ్యతాం త్రిషు మధ్యే కిం బ్రువే వాక్యం త్వదీప్సితమ్‌ || 34

బాహ్య సంపద్విహీనశ్చ శంకరస్త్రి దశేశ్వరః | తత్త్వ సముద్రేషు సన్నిమగ్నైకమానసః || 35

జ్ఞానా నందస్యేశ్వరస్య బాహ్య వస్తుషు కా స్పృహా | గృహీ దదాతి స్వసుతాం రాజ్య సంపత్తి శాలినే || 36

వినుటకు అమృతము వంటిది, సర్వకాలముల యందు సుఖమును కలిగించునది, సత్యము యొక్క సారముతో గూడినది, హితమును కలిగించునది అగు వచనము శ్రేష్ఠుమని పెద్దలు చెప్పెదరు (33). ఓ పర్వత రాజా! నీతి శాస్త్రము ఇట్టి మూడు రకముల వచనములను నిరూపించి యున్నది. వీటి మధ్యలో ఎట్టి వచనమును నేను చెప్పవలయునని నీవు కోరుచున్నావు? (34) దేవదేవుడు అగు శంకరుడు బాహ్యసంపదలు లేనివాడే అయినా, తత్త్వజ్ఞానమనే సముద్రము నందు ఆయన మనస్సు మునకలు వేయుచుండును (35). జ్ఞానఘనుడు, ఆనందఘనుడు అగు శివునకు బాహ్యవస్తువుల యందు కోరిక ఎట్లు ఉండును? గృహస్థుడు తన కుమార్తెను రాజ్యము, సంపదలు గలవానికి ఇచ్చును (36).

కన్యకాం దుఃఖినే దత్త్వా కన్యా ఘాతీ భ##వేత్పితా | కో వేద శంకరో దుఃఖీ కుబేరో యస్య కింకరః || 37

భ్రూభంగలీలయా సృష్టిం స్రష్టుం హర్తుం క్షమో హి సః | నిర్గుణః పరమాత్మా చ పరేశః ప్రకృతేః పరః || 38

యస్య చ త్రివిధా మూర్తిర్విధాతుస్సృష్టి కర్మణి | సృష్టి స్థిత్యం త జననీ బ్రహ్మ విష్ణు హరాభిధా || 39

బ్రహ్మా చబ్రహ్మలోకస్థో విష్ణుః క్షీరోదవాసకృత్‌ | హరః కైలాసనిలయ స్సర్వాశ్శివ విభూతయః || 40

దుఃఖితునకు తన కుమార్తెను ఇచ్చిన తండ్రి ఆ కన్యను సంహరించినట్లే యగును. కాని శంకరుడు దుఃఖియని ఎవనికి తెలియును? ఆయనకు కుబేరుడు కింకరుడు (37). నిర్గుణుడు, పరమాత్మ, పరమేశ్వరుడు, ప్రకృతికి అతీతుడు అగు ఆయన కనుబొమల కదలికచే మాత్రమే సృష్టిస్థితిలయములను చేయ సమర్థుడు (38). సృష్ఠి కార్యమును నిర్వహించే శివుని మూడు రకముల మూర్తులు సృష్టి స్థితిలయములను చేయును. ఆ మూర్తులకు బ్రహ్మవిష్ణురుద్రులని పేరు (39). బ్రహ్మ లోకమునందుండే బ్రహ్మ, క్షీర సముద్రమునందుండే విష్ణువు, కైలాసమునందు నివసించే రుద్రుడు అను ముగ్గురు శివుని విభూతులు మాత్రమే (40).

ధత్తే చ త్రివిధా మూర్తీః ప్రకృతిశ్శివ సంభవా | అంశేన లీలయా సృష్టౌ కలయా బహుధా అపి || 41

ముఖోద్భవా స్వయం వాణీ వాగధిష్ఠాతృ దేవతా | వక్షస్‌స్థ లోద్భవా లక్ష్మీస్సర్వ సంపత్స్వ రూపిణీ || 42

శివా తేజస్సు దేవానా మావిర్భావం చకార సా | నిహత్య దానవాన్‌ సర్వాన్‌ దేవేభ్యశ్చ శ్రియం దదౌ || 43

ప్రాప కల్పాంతరే జన్మ జఠరే దక్షయోషితః | నామ్నా సతీ హరం ప్రాప దక్షస్త సై#్మ దదౌ చ తామ్‌ || 44

దేహం త త్యాజ యోగేన శ్రుత్వా సా భర్తృనిందనమ్‌ | సాద్య త్వత్తస్తు మేనాయాం జజ్ఞే జఠరతశ్శివా || 45

శివుని నుండి పుట్టిన ప్రకృతి కూడ అనేక రూపములుగా వ్యక్తమైననూ, సృష్టి కార్యమునందు తన లీలచే మూడు విధముల మూర్తులను తన అంశ##చే ధరించి యున్నది (41). ముఖము నుండి పుట్టినది, వాక్కునకు అధిష్ఠాన దేవత అయినది అగు సరస్వతి ఒకమూర్తి. వక్షస్‌స్థలము నుండి పుట్టినది, సర్వ సంపత్స్వరూపురాలు అగు లక్ష్మి రెండవది (42). మూడవది యగు ఉమ దేవతల తేజస్సు నుండి ఆవిర్భవించినది. ఆమె రాక్షసుల నందరినీ సంహరించి దేవతలకు సంపదలను ఒసంగినది (43). ఆమె మరియొక కల్పములో దక్షుని భార్య యొక్క గర్భము నుండి పుట్టి సతియను పేరును గాంచి శివుని వివాహమాడెను. దక్షుడు ఆమెను ఆయనకిచ్చి వివాహము చేసెను (44). ఆమె భర్తను నిందించుటను విని, యోగ మహిమచే దేహమును త్యజించెను. ఆమెయే నీ వలన మేనా గర్భము నందు జన్మించి పార్వతీ రూపములో నున్నది (45).

శివా శివస్య పత్నీయం శైల జన్మని జన్మని | కల్పే కల్పే బుద్ధిరూపా జ్ఞానినాం జననీ పురా || 46

జాయతే స్మ సదా సిద్ధా సిద్ధిదా సిద్ధి రూపిణీ | సత్యా అస్థి చితాభస్మ భక్త్యా ధత్తే హరస్స్వయమ్‌ || 47

అతస్త్వం స్వేచ్ఛయా కన్యాం దేహి భద్రాం హరాయ చ | అథవా సా స్వయం కాంతస్థానే యాస్యత్యదాస్యసి || 48

కృత్వా ప్రతిజ్ఞాం దేవేశో దృష్ట్వా క్లేశమసంఖ్యకమ్‌ | దుహితుస్తే తపస్థ్సాన మాజ గామ ద్విజాత్మక ః || 49

తామశ్వాస్య వరం దత్త్వా జగామ నిజమందిరమ్‌ |తత్ప్రార్థనావశాచ్ఛంభుర్యయాచే త్వాం శివాం గిరే || 50

ఓ పర్వతరాజా ! ఈశివాదేవి జన్మజన్మల యందు, సర్వకాలములయందు శివుని అర్ధాంగి. ఈ తల్లి సర్వోత్కృష్టురాలు. జ్ఞానులయందు ఈమె బుద్ధి రూపమున నుండును (46). సదా సిద్ధిని ఇచ్చునది, సిద్ధి స్వరూపురాలు, స్వయంసిద్ధ అగు ఈ దేవి ఇచట జన్మించి యున్నది. శివుడు సతీదేవి యొక్క అస్థికలను, చితాభస్మను భక్తితో స్వయముగా ధరించును (47). కావున నీవు మంగళ స్వరూపురాలగు నీకన్యను సంతోషముతో శివునకు ఇమ్ము. లేనిచో నీవు ఈయనిచో, ఆమెయే తన భర్త ఉండు స్థానమునకు స్వయముగా వెళ్లగలదు (48).నీ కుమార్తె యొక్క తీవ్రమగు తపస్సులోని క్లేశములను చూచి, దేవతలకు ప్రతిజ్ఞనుచేసి, దేవదేవుడగు శివుడు బ్రాహ్మణ వేషములో నీకుమార్తె తపస్సు చేయు స్థలమునకు వచ్చినాడు (49). ఓ పర్వతరాజా ! ఆ శంభుడు ఆమెను ఓదార్చి, వరము నిచ్చి, తన నివాసమునకు వెళ్లి, ఆమె కోర్కె మేరకు నిన్ను పార్వతిని ఇమ్మని యాచించినాడు (50).

అంగీకృతం యువాభ్యాం తచ్ఛివ భక్తిరతాత్మనా | విపరీతమతిర్జాతా వద కస్మాద్గిరీశ్వర || 51

తద్గత్వ ప్రభుణా దేవైః ప్రార్థితేన త్వదంతికమ్‌ | ప్రస్థాపితా వయ శీఘ్రం హ్యృషయస్సాప్యరుంధతీ || 52

శిక్షయమో వయం త్వాం హి దత్త్వా రుద్రాయ పార్వతీమ్‌ | ఏవం కృతే మహానందో భవిష్యతి గిరే తవ || 53

శివాం శివాయశైలేంద్ర స్వేచ్ఛయా చేన్న దాస్యసి | భవితా తద్వివాహోత్ర భవిత్య బలేన హి || 54

శివభక్తి యందభిరుచితో గూడిన మనస్సుగల మీరిద్దరు అంగీకరించి యున్నారు. ఓ పర్వతరాజా! కాని మీకు ఇప్పుడు తద్విరుద్ధమగు మనస్సుకలుగుటకు కారణమేమి? చెప్పుము (51). అపుడు దేవతలు శివుని వద్దకు వెళ్లి ప్రార్థించగా, ఆయన సప్తర్షులగు మమ్ములను, అరుంధతిని వెనువెంటనే నీ వద్దకు పంపించినాడు (52). మేము నీకు ఉపదేశించుచున్నాము. నీవు రుద్రునకు పార్వతిని ఇమ్ము. ఓ శైలరాజా! అట్లు చేసినచో నీకు మహానందము కలుగ గలదు (53). పర్వతరాజా ! నీవు పార్వతిని ప్రీతి పూర్వకముగా శివునకు ఈయని పక్షములో, వారి వివాహము ఈ కాలములో విధిబలముచేతనే సంపన్నము కాగలదు (54).

వరం దదౌ శివాయై స తపంత్యై తాత శంకరః | న హీశ్వర ప్రతిజ్ఞాతం విపరీతాయ కల్పతే || 55

అహో ప్రతి జ్ఞా దుర్లంఘ్యా సాధూనామీశవర్తినామ్‌ | సర్వేషాం జగతాం మధ్యే కిమీశస్య పునర్గిరే || 56

ఏకో మహేంద్రశ్శైలానాం పక్షాంశ్చి చ్ఛేద లీలయా | పార్వతీ లీలయా మేరో శ్శృంగ భంగం చకార చ || 57

ఏకార్థే నహి శైలేశ నాశ్యాస్సర్వా హి సంపదః | ఏకం త్యజేత్కులస్యార్థే శ్రుతిరేషా సనాతనీ || 58

వత్సా! శంకరుడు శివాదేవికి తపస్సు చేయుచుండగా వరమునిచ్చెను. ఈశ్వరుని ప్రతిజ్ఞ వమ్ముకాదు గదా! (55) ఈశ్వరభక్తులగు సాధువుల ప్రతిజ్ఞయై ననూ ముల్లోకములలో ఉల్లంఘింప శక్యము కానిదిగా నున్నది. ఓ పర్వతరాజా! ఈశ్వరుని ప్రతిజ్ఞ గురించి చెప్పునదేమున్నది? (56) ఇంద్రడొక్కడే అవలీలగా పర్వతముల రెక్కలను నరికెను. పార్వతి కూడ అవలీలగా మేరవునకు శృంగభంగము చేసెను (57). ఓ పర్వతరాజా! ఒక్క వ్యక్తి కొరకై సంపదల నన్నిటినీ నాశనము చేయరాదు. కులము కొరకై ఒక వ్యక్తిని విడువవలెనని సనాతనమగు వేదము చెప్పు చున్నది (58).

దత్త్వా విప్రాయ స్వసుతా మనరణ్యో నృపేశ్వరః | బ్రాహ్మణాద్భయమాపన్నో రరక్ష నిజసంపదమ్‌ || 59

తమాశు బోధయామాసుర్నీతి శాస్త్రవిదో జనాః | బ్రహ్మ శాపాద్విభీతాశ్చ గురవో జ్ఞాతి సత్తమాః || 60

శైలరాజ త్వమప్యేవం సుతాం దత్త్వా శివాయ చ | రక్ష సర్వాన్‌ బంధు వర్గాన్‌ వంశం కురు సురానపి || 61

అనరణ్య మహారాజు బ్రాహ్మణుని వలన సంప్రాప్తమైన భయము గలవాడై తన కుమార్తెను ఆ బ్రాహ్మణునకు ఇచ్చి తన సంపదను రక్షించుకొనెను (59). నీతి శాస్త్రజ్ఞులగు జనులు, గురువులు, శ్రేష్టులగు జ్ఞాతులు బ్రాహ్మణుని శాపము వలన మిక్కిలి భయపడినవారై ఆ రాజునకు బోధించిరి (60). ఓ శైలరాజా! ఇదే విధముగా నీవు కూడా నీ కుమార్తెను శివునకు ఇచ్చి బంధువులనందరినీ రక్షించుకొనుము. మరియు దేవతలను వశము చేసుకొనుము (61).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య వసిష్ఠస్య వచనం స ప్రహస్య చ |పప్రచ్ఛ నృపవార్తాం చ హృదయేన విదూయతా || 62

బ్రహ్మ ఇట్లు పలికెను -

వసిష్ఠుని ఈ మాటను విని ఆయన నవ్వి దుఃఖముతో నిండిన హృదయముతో అనరణ్యుని వృత్తాంతమును గూర్చి ప్రశ్నించెను (62).

హిమాలయ ఉవాచ|

కస్య వంశోధ్బవో బ్రహ్మన్ననరణ్యో నృపశ్చ సః | సుతాం దత్త్వా స చకథం రరక్షాఖిల సంపదః || 63

హిమవంతుడిట్లు పలికెను-

హే బ్రహ్మన్‌ ! ఆ అనరణ్య మహారాజు జన్మించిన వంశ##మేది? ఆయన కుమార్తెను ఇచ్చి సంపదలనన్నిటినీ రక్షించుకున్న తీరు ఎట్టిది? (63)

బ్రహ్మోవాచ|

ఇతి శ్రుత్వా వసిష్ఠస్తు శైలవాక్యం ప్రసన్నధీః | ప్రోవాచ గిరయే తసై#్మ నృపవార్తాం సుఖావహామ్‌ || 64

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే గిరి సాంత్వనం నామ త్రయస్త్రింశోధ్యాయః (33).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ప్రసన్నమగు మనస్సు గల వసిష్ఠుడు పర్వతుని ఆ మాటను విని సుఖదాయకము అగు అనరణ్య చరితమును ఆ పర్వతరాజేనకు చెప్పెను (64).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో హిమవంతునకు సప్తర్షుల ఉపదేశమును వర్ణించే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).

Sri Sivamahapuranamu-II    Chapters