Sri Sivamahapuranamu-II    Chapters   

అథ అష్ట త్రింశోధ్యాయః

వివాహ మండపము

బ్రహ్మోవాచ |

అథ శైలేశ్వరః ప్రీతో హిమవాన్ముని సత్తమ | స్వపురం రచయామాస విచిత్రం పరమోత్సవమ్‌ || 1

సిక్తమార్గం సంస్కృతం చ శోభితం పరమర్ధిభిః | ద్వారి ద్వారి చ రంభాది మంగల ద్రవ్య సంయుతమ్‌ || 2

ప్రాంగణం రచయామాస రంభాస్తం భ సమన్వితమ్‌ | పట్టసూత్రైస్సంనిబద్ధ రసాల పల్లవాన్వితమ్‌ || 3

మాలతీ మాల్య సంయుక్తం లసత్తోరణ సుప్రభమ్‌ | శోభితం మంగల ద్రవ్యైశ్చతుర్దిక్షు స్థితైశ్శుభైః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునిశ్రేష్ఠా! తరువాత పర్వతరాజగు హిమవంతుడు ఆనందముతో నగరమునంతనూ రంగు రంగుల శోభ కల్గునట్లు అలంకరింపజేసెను. అచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను (1). మార్గములను నీటితో కడిగి శుద్ధి చేసి విలువైన అలంకారములతో శోభిల్లునట్లు చేసిరి. ద్వారములన్నింటి యందు అరటిస్తంభములు మొదలగు మంగళ ద్రవ్యములు అలంకరింపబడెను (2). వాకిటియందు అరటిస్తంభములను పాతి పట్టు దారములతో మామిడి చిగురుల తోరణములు కట్టబడెను (3). సింహద్వారములు మల్లెల మాలలతో శోభిల్లెను. నాల్గుదిక్కుల యందు ఉంచబడిన మంగళ ద్రవ్యములతో ఆ నగరము విరాజిల్లెను (4).

తథైవ సర్వం పరయా ముదాన్వితః చక్రే గిరీంద్రస్స్వ సుతార్థమేవ |

గర్గం పురస్కృత్య మహాప్రభావం ప్రస్తావ యోగ్యం చ లసుమంగలం హి || 5

ఆహూయ విశ్వకర్మాణం కారయామాస సాదరమ్‌ | మండపం చ సువిస్తీర్ణం వేదికాది మనోహరమ్‌ || 6

అయుతేన సురర్షే తద్యోజనానాం చ విస్తృతమ్‌ | అనేక లక్షణోపేతం నానాశ్చర్య సమన్వితమ్‌ || 7

గొప్ప ఆనందముతోకూడిన పర్వతరాజు గర్గుని ముందిడు కొని తన కుమార్తె వివాహము కొరకై గొప్ప ప్రభావశాలి, వర్ణింపయోగ్యమైనది, మంగళకరమైనది అగు వ్యవస్థను సమగ్రముగా చేసెను (5). విశ్వకర్మను సాదరముగా పిలిపించి మిక్కిలి విస్తీర్ణము, అతిమనోహరము అగు వివాహమండపమును నిర్మింపజేసెను (6). ఓ దేవర్షీ! అనేక శుభలక్షణములతో గూడి మహాశ్చర్యమును కలిగించే ఆ మండపము పదివేల యోజనముల విస్తీర్ణమును కలిగియుండెను (7).

స్థావరం జంగమం సర్వం సదృశం తైర్మనోహరమ్‌ | సర్వతోద్భుత సర్వస్వం నానావస్తు చమత్కృతమ్‌ || 8

జంగమం విజితం తత్ర స్థావరేణ విశేషతః | జంగమేన చ తత్రాసీజ్జితం స్థావరమేవ హి || 9

పయసా చజితా తత్ర స్థల భూమిర్న చాన్యథా | జలం కిం హిస్థలం కిం హి నవిదుః కేపికోవిదాః || 10

క్వచిత్‌ సింహాః కృత్రిమాశ్చ క్వచిత్సారసపంక్తయః | క్వచిచ్ఛిఖండినస్తత్ర కృత్రిమాశ్చ మనోహరాః || 11

ఆ నగరములోని చరాచర ప్రాణులన్నియూ సమానమగు సౌందర్యముతో మనస్సును హరించు చుండెను. సర్వత్రా అద్భుతములతో నిండియున్న ఆ నగరము అనేక చమత్కారకములగు వస్తువులతో నలరారెను (8)? అచట స్థావరములు జంగమములను సౌందర్యములో జయించినవా? లేక జంగములే స్థావరములను జయించినవా? చెప్పవలను పడదు (9). ఆ మండపమునందు జలము స్థలమును జయించినది. కుశలురగు వ్యక్తులైననూ జలస్థల భేదమును నిర్ణయించలేక పోయిరి (10). కొన్నిచోట్ల కృత్రిమ సింహములు, మరికొన్ని చోట్ల కృత్రిమ జల పక్షుల వరుసలు, ఇంకొన్ని చోట్ల కృత్రిమములగు నెమళ్లు అలంకరిపంబడి మనోహరముగా నుండెను (11).

క్వచిత్‌ ప్రియః కృత్రిమాశ్చ నృత్యంతః పురుషైస్సహ | మోహయంత్యో జనాన్‌ సర్వాన్‌ పశ్యంతః కృత్రిమాస్తథా || 2

తథా తేనైవ విధినా ద్వారపాలా మనోహరాః | హసై#్తర్ధనూంషి చోద్ధృత్య స్థావరా జంగమోపమాః || 13

ద్వారి స్థితా మహాలక్ష్మీః కృత్రిమా రచితాద్భుతా| సర్వలక్షణ సంయుక్తా గతా సాక్షాత్ప యోర్ణవాత్‌ || 14

గజాశ్చాలంకృతా హ్యాసన్‌ కృత్రిమా అకృతోపమాః | తథాశ్వాః సాదిభిశ్చైవ గజాశ్చ గజసాదిభిః || 15

కొన్నిచోట్ల కృత్రిమ స్త్రీలు కృత్రిమ పురుషులతో కలిసి నృత్యము చేయుచుండగా ఎందరో కృత్రిమ ప్రేక్షకులు పరవశులై తిలకించుచుండిరి (12).మరియు సుందరాకారులగు ద్వారపాలకులు చేతులతో ధనస్సులను ఎక్కుపెట్టి యుండిరి. అవి బొమ్మలే యైననూ ప్రాణము గలవి యన్నట్లుండెను (13). అద్భుతమగు మహాలక్ష్మీ విగ్రహము ద్వారమునందు నిర్మింపబడెను. సర్వలక్షణములతో విలసిల్లు ఆ విగ్రహము క్షీరసముద్రము నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవియా అన్నట్లుండెను (14). అలంకరింపబడిన కృత్రిమ గజములు యధార్థమగు ఏనుగులను పోలియుండెను. గుర్రములు రౌతులతో, గజములు మావటీండ్రతో కూడి యుండెను (15).

రథా రథిభిరాకృష్టా మహాశ్చర్య సమన్వితాః | వాహనాని తథాన్యాని పత్తయః కృత్రిమాస్తథా || 16

ఏవం విమోహనార్థం తు కృతం వై విశ్వకర్మణా | దేవానాం చ మునీనాం చ తేన ప్రీతాత్మనా మునే || 17

మహాద్వారి స్థితో నందీ కృత్రిమశ్చ కృతో మునే | శుద్ధస్ఫటిక సంకాశో యథా నందీ తథైవ సః || 18

తస్యోపరి మహాదివ్యం పుష్పకం రత్నభూషితమ్‌ | రాజితం పల్లవై శ్శుభ్రై శ్చామరైశ్చ సుశోభితమ్‌ || 19

కృత్రిమమగు రథములను కృత్రిమసారథులు తోలుచుండిరి. ఇతర వాహనములు కూడ అటులనే అమర్చబడినవి. మరియు కృత్రిమమగు సైనిక దళములు కూడ ఉండెను. ఈ దృశ్యములన్నియూ మహాశ్చర్యమును కలిగించుచుండెను (16). ఓ మునీ! దేవతలను, మునులను మోహింపజేయుటకై విశ్వకర్మ ఉత్సాహముతో ఇట్టి దృశ్యములను నిర్మించెను (17). ఓ మహర్షీ! మహాద్వారమునందు ఒక కృత్రిమ నంది నిలబడియుండెను. స్వచ్ఛమగు స్ఫటికము వలె వెలుగొందు ఆ బొమ్మ యథార్థమగు నందివలెనే యుండెను (18). ఆ ద్వారమునకు పైన రత్నములతో, స్వచ్ఛమగు చిగుళ్లతో, మరియు పుష్పములతో అలంకరింపబడిన గొప్ప దివ్యమైన రత్నములతో ప్రకాశించే కృత్రిమ పుష్పక విమానము దేవతలతో గూడి మిక్కిలి శోభిల్లెను (19).

వామ పార్శ్వే గజౌ ద్వౌ చ శుద్ధ కాశ్మీర సన్నిభౌ | చతుర్దంతౌ షష్టివర్షౌ భేదమానౌ మహాప్రభౌ || 20

త థైవార్కనిభౌ తేన కృతౌ చాశ్వౌ మహాప్రభౌ | చామరాలంకృతౌ దివ్యౌ దివ్యాలంకరా భూషితౌ || 21

దంశితా వరరత్నాఢ్యా లోకపాలాస్తథైవ చ | సర్వే దేవా యథార్థం వై కృతా వై విశ్వకర్మణా || 22

తథా హి ఋషయ స్సర్వే భృగ్వాద్యాశ్చ తపోధనాః | అన్యే హ్యుపసురాస్తద్వత్సిద్ధా శ్చాన్యేపి వై కృతాః || 23

ఎడమవైపు శుద్ధ కాషాయ వర్ణము గల రెండు ఏనుగులు నిర్మింపబడెను. నాల్గు దంతములతో గొప్పగా ప్రకాశించు ఆ ఏనుగులు అరువది సంవత్సరములు వయసు గలవా యున్నట్లు భాసించెను. అవి పరస్పరము స్పృశించుచున్నట్లు భాసించెను (20). మరియు విశ్వకర్మ సూర్యునివలె ప్రకాశించు రెండు గుర్రములను నిర్మించెను. చామరములచే, మరియు దివ్యాభరణములచే అలంకరింపబడిన ఆ దివ్యాశ్వములు గొప్పగా ప్రకాశించెను (21). విశ్వకర్మ కవచములతో, శ్రేష్ఠ రత్నములతో ఒప్పారు లోకపాలురను, దేవతలనందరినీ వాస్తవమేనా యున్నట్లు నిర్మించెను (22). మరియు భృగువు మొదలగు తపోనిష్ఠులగు ఋషులందరినీ, ఇతరులగు ఉపదేవతలను, సిద్ధులను బొమ్మలరూపములో ప్రదర్శించెను (23).

విష్ణుశ్చ పార్ష దైస్సర్వైర్గరుడాఖ్యై స్సమన్వితః | కృత్రిమో

నిర్మితస్తద్వత్పరమాశ్చర్యరూపవాన్‌ || 24

తథైవాహం సుతైర్వే దైస్సిద్ధైశ్చ పరివారితః | కృత్రిమో నిర్మితస్తద్వ త్పఠన్‌ సూక్తాని నారద || 25

ఐరావత గజారూఢ శ్శక్ర స్స్వదల సంయుతః | కృత్రిమో నిర్మితస్త ద్వత్పరి పూర్ణేందు సన్నిభః || 26

కిం బహూక్తేన దేవర్షే సర్వోవై విశ్వకర్మణా | హిమాగప్రేరితేనాశు క్లుప్త స్సురసమాజకః || 27

గరుడులను పేరుగల గణములందరితో గూడియున్న కృత్రిమ విష్ణువు నిర్మింపబడి యుండెను. ఆ బొమ్మ మహాశ్చర్యమును కలిగించెను (24). అదే విధముగా వేదములచే, ప్రజాపతులచే, మరియు సిద్ధులచే చుట్టువారబడి సూక్తములను పఠించుచున్న నాయొక్క కృత్రిమ శిల్పము కూడా అచట నిర్మింపబడి యుండెను. ఓ నారదా! అదేవిధముగా, ఐరావత గజమునధిష్ఠించి పూర్ణచంద్రుని బోలియున్న కృత్రిమ ఇంద్రుడు తన సైన్యముతో గూడి యున్నట్లు నిర్మింపబడెను. (25) ఓ దేవర్షీ! ఇన్ని మాటలేల? హిమవంతునిచే ప్రేరితుడైన విశ్వకర్మ దేవ సమాజమునంతనూ అచట అనతికాలములో నిర్మించెను (27).

ఏవం భూతః కృతస్తేన మండపో దివ్యరూపవాన్‌ | అనేకాశ్చర్య సంభూతో మహాన్‌ దేవవిమోహనః || 28

అథాజ్ఞప్తో గిరీశేన విశ్వకర్మా మహామతిః | నివాసార్థం సురాదీనాం తత్తల్లోకాన్‌ హి యత్నతః || 29

తత్రైవ చ మహామంచా సుప్రభాః పరమాద్భుతాః | రచితాస్సుఖదా దివ్యాస్తేషాం వై విశ్వకర్మణా || 30

తథాపి సత్యలోకం వై విరేచే క్షణతోద్భుతమ్‌ | దీప్త్యా పరమయా యుక్తం నివాసార్థం స్వయం భువః || 31

దివ్యమగు రూపము గలది, అనేకములగు అచ్చెరువులతో గూడియున్నది, చాల పెద్దది, దేవతలను కూడ మోహింప జేయునది అగు ఇట్టి మండపమును విశ్వకర్మ నిర్మించెను (28). తరువాత హిమవంతుని ఆజ్ఞచే మహాబుద్ధిశాలియగు విశ్వకర్మ, దేవతలు మొదలగు వారి నివాసము కొరకై ప్రయత్నపూర్వకముగా ఆయా లోకములను నిర్మించెను (29). ఆ మండపము వద్ద గొప్పగా వెలుగొందే, పరమాద్భుతములైన సుఖకరములైన, దివ్యములగు పెద్ద ఆసనములను వారికొరకు విశ్వకర్మ నిర్మించెను (30). మరియు నాతడు అద్భుతము, గొప్ప ప్రకాశముతో కూడినది అగు కృత్రిమ సత్యలోకమును స్వయంభువునగు నా నివాసము కొరకు క్షణములో నిర్మించెను (31).

తథైవ విష్ణోస్త్వపరం వైకుంఠాఖ్యం మహోజ్వలమ్‌ | విరేచే క్షణతో దివ్యం నానాశ్చర్య సమన్వితమ్‌ || 32

అమరేశ గృహం దివ్యం తథైవాద్భుతముత్తమమ్‌ | విరేచే విశ్వకర్మా సౌ సర్వైశ్వర్య సమన్వితమ్‌ || 33

గృహాణి లోకపాలానాం విరేచే సుందరాణిచ |తద్వత్స ప్రీతితో దివ్యా న్యద్భుతాని మహాంతి చ || 34

అన్యేషా మమరాణాం చ సర్వేషాం క్రమశస్తథా | సదనాని విచిత్రాణి రచితాని చ తేన వై || 35

అదే విధముగా విష్ణువుకొరకై మహాప్రకాశము గలది, దివ్యమైనది, అనేకములగు ఆశ్చర్యములతో గూడినది అగు అపర వైకుంఠము నాతడు క్షణములో నిర్మించెను (32). మరియు ఆ విశ్వకర్మ అద్భుతము, ఉత్తమము, దివ్యము, సర్వసంపదలతో విలసిల్లునది అగు గృహమును ఇంద్రుని కొరకు నిర్మించెను (33). అదే విధముగా ఆతడు లోకపాలుర కొరకు సుందరమైనవి, దివ్యమైనవి, అద్భుతమైనవి, పెద్దవి అగు గృహములను సంతోషముతో నిర్మించెను (34). అతడు ఇతర దేవతలందరికీ కూడా విచిత్రములగు గృహములను వరుసగా నిర్మించెను (35).

విశ్వకర్మా మహాబుద్ధిః ప్రాప్త శంభు మహావరః | విరేచే క్షణతస్సర్వం శివతుష్ట్యర్థమేవ చ || 36

తథైవ చిత్రం పరమం మహోజ్జ్వలం మహాప్రభం దేవవరైస్సుపూజితమ్‌ |

గిరీశ చిహ్నం శివలోక సంస్థితం సుశోభితం శంభు గృహం చకార || 37

ఏవం భూతా కృతా తేన రచనా విశ్వకర్మణా | విచిత్రా శివతుష్ట్యర్థం పరాశ్చర్యా మహోజ్జ్వలా || 38

శివుని నుండి గొప్ప వరములను పొందినవాడు, మహాబుద్ధిశాలి అగు విశ్వకర్మ శివునకు పూర్తిగా సంతోషమును కలిగించుట కొరకై క్షణములో గృహమును నిర్మించెను (36). చిత్రమైనది, గొప్పగా ప్రకాశించునది, దేవతలచే పూజింపబడునది, శివుని చిహ్నములు గలది, శివలోక హర్మ్యమును పోలియున్నది, మిక్కిలి సుందరమైనది అగు గృహమును ఆతడు శివుని కొరకు నిర్మించెను (37). ఈ విధముగా విశ్వకర్మ శివుని ప్రీతికొరకై విచిత్రము, అత్యాశ్చర్యకరము, గొప్ప ప్రకాశము గలది అగు రచనను ప్రదర్శించెను (38).

ఏవం కృత్వాఖిలం చేదం వ్యవహారం చ లౌకికమ్‌ | పర్యైక్షిష్ట ముదా శంభ్వాగమనం స హిమాచలః || 39

ఇతి ప్రోక్త మశేషేణ వృత్తాంతం ప్రముదావహమ్‌ | హిమాలయస్య దేవర్షే కిం భూయశ్శ్రోతుమిచ్ఛసి || 40

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్రసంహితాయాం పార్వతీ ఖండే మండపాది రచనా వర్ణనం నామ అష్టత్రింశోధ్యాయః (38).

ఈ విధమగు లౌకిక వ్యవహారమునంతనూ పూర్తి చేసుకొని, ఆ హిమవంతుడు ఆనందముతో శంభుని రాకను నిరీక్షించుచుండెను (39). ఓ దేవర్షీ! ఈ తీరున నీకు హిమవంతుని ఆనందదాయకమగు చరిత్రనంతనూ చెప్పియుంటిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (46)

శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహిత యందలి పార్వతీఖండములో ముప్పది ఎనిమిదవ అద్యాయము వివాహమండప వర్ణనమను పేరు గలది ముగిసినది (38).

Sri Sivamahapuranamu-II    Chapters