Sri Sivamahapuranamu-II    Chapters   

అథ సప్త చత్వారింశో%ధ్యాయః

శివుని అంతఃపుర ప్రవేశము

బ్రహ్మోవాచ |

తతశ్శైలవరస్సో%పి ప్రీత్యా దుర్గోపవీతకమ్‌ | కారయామాస సోత్సాహం వేదమంత్రై శ్శివస్య చ || 1

అథ విష్ణ్వాదయో దేవా మునయస్సకుతూహలమ్‌ | హిమాచల ప్రార్థనయా వివేశాంతర్గృహం గిరేః || 2

శ్రుత్వాచారం భవాచారం విధాయ చ యథార్థతః | శివామలంకృతాం చ క్రుశ్శివదత్త విభూషణౖః || 3

ప్రథమం స్నాపయిత్వా తాం భూషయిత్వాథ సర్వశః | నీరాజితా సఖీభిశ్చ విప్రపత్నీభిరేవ చ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

పిమ్మట ఆ పర్వతరాజు ప్రీతితో ఉత్సాహముతో శివ పార్వతులకు వేదమంత్ర పూర్వకముగా ఉపవీతములను ధరింప జేసెను(1). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మునులు హిమవంతుని ప్రార్థనను మన్నించి కుతూహలముతో ఆయన అంతః పురమునందు ప్రవేశించిరి (2). వేదాచారమును, లోకాచారమును యథావిధిగా ఆచరించి, శివుడిచ్చిన అలంకారములతో పార్వతిని అలంకరింపజేసిరి(3). ఆమెను స్నానము చేయించి తరువాత దేహమును అంతటా అలంకరించి నీరాజనము నిచ్చిరి (4).

అహతాంబరయుగ్మేన శోభితా వరవర్ణినీ | విరరాజ మహాశైలదుహితా శంకర ప్రియా || 5

కంచుకీ పరమా దివ్యా నానారత్నాన్వితాద్భుతా | విధృతా చ తయా దేవ్యా విలసంత్యాధికం మునే || 6

సా బభార తథా హారం దివ్యరత్న సమన్వితమ్‌ | వలయాని మహార్హాణి శుద్ధచామీకరాణి చ || 7

స్థితా తత్రైవ సుభగా ధ్యాయంతీ మనసా శివమ్‌ | శుశుభే%తి మహాశైల కన్యకా త్రిజగత్ప్రసూః || 8

పర్వతాధీశుని కుమార్తె, శంకరుని ప్రియురాలు, బ్రహ్మచారిణి అగు పార్వతి విడదీయబడని జంట వస్త్రములను ధరించి ప్రకాశించెను (5).

ఓ మునీ! గొప్పగా ప్రకాశించే ఆ దేవి అనేక రత్నములను పొదుగుటచే అద్భుతముగా నున్న శ్రేష్ఠమైన దివ్యమగు రవికెను ధరించెను (6). మరియు ఆమె దివ్యమగు రత్నములతో చేయబడిన హారమును, మిక్కిలి విలువైన, శుద్ధమగు బంగారముతో చేయబడిన గాజులను ధరించెను (7). పర్వతాధీశుని కుమార్తె, ముల్లోకములకు తల్లి అగు ఆ సుందరి అచటనే నిలబడి మనస్సులో శివుని ధ్యానము చేయుచూ మిక్కిలి ప్రకాశించెను (8).

తదోత్సవో మహానాసీదుభయత్ర ముదావహః | దానం బభూవ వివిధం బ్రాహ్మణభ్యో వివర్జితమ్‌ || 9

అన్యేషాం ద్రవ్యదానం చ బభూవ వివిధం మహత్‌ | గీత వాద్య వినోదశ్చ తత్రోత్సవపురస్సరమ్‌ || 10

అథ విష్ణురహం ధాతా శక్రాద్యా అమరాస్తథా | మునయశ్చ మహాప్రీత్యా నిఖిలాస్సోత్సవా ముదా || 11

సుప్రణమ్య శివం భక్త్యా స్మృత్వా శివపదాంబుజమ్‌ | సంప్రాప్య హిమగిర్యాజ్ఞాం స్వం స్వం స్థానం సమాశ్రితః || 12

అపుడు రెండు వైపుల వారికి ఆనందమును కలిగించే మహోత్సవము ప్రవర్తిల్లెను. బ్రాహ్మణులకు విభిన్నదానము లీయబడెను (9). ఇతరులకు వివిధ వస్తువులు, మరియు అధికమగు ధనము ఈయబడెను. గీతములతో, వాద్యములతో మరియు వినోదములతో గూడిన ఉత్సవము ప్రవర్తిల్లెను (10). అపుడు విష్ణువు, బ్రహ్మనగు నేను, ఇంద్రాది దేవతలు, మునులు అందరు మహోత్సాహముతో, మహానందముతో (11), శివునకు భక్తి పూర్వకముగా ప్రణమిల్లి, శివుని పాదపద్మములను స్మరించి, హిమవంతుని ఆజ్ఞను పొంది తమ తమ నివాసములకు చేరు కొంటిమి (12).

ఏతస్మిన్నంతరే తత్ర జ్యోతి శ్యాస్త్ర విశారదః | హిమవంతం గిరీంద్రం తం గర్గో వాక్యమభాషత || 13

ఇంతలో జ్యోతిశ్శాస్త్ర పండితుడగు గర్గుడు పర్వతరాజగు హిమవంతుని వద్దకు వచ్చి ఇట్లనెను(13).

హిమాచల ధరాధీశ స్వామిన్‌ కాలీపతిం ప్రభో| పాణి గ్రహార్ధం శంభుం చానయ త్వం నిజమందిరమ్‌|| 14

ఓ పర్వత రాజా! హిమాలయా! స్వామీ! ప్రభూ! కాళీపతియగు శంభుని పాణి గ్రహణము కొరకు నీ మందిరమునకు దోడ్కొని రమ్ము(14).

బ్రహ్మోవాచ|

అథ తం సమయం జ్ఞాత్వా కన్యాదానోచితం గిరిః | నివేదితం చ గర్గేణ ముముదే%తీవ చేతసి|| 15

మహీధరాన్‌ ద్విజాంశ్చైవ పరానపి గిరిః| ప్రేషయామాస సుప్రీత్యా శివానయన కామ్యయా|| 16

తే పర్వతా ద్విజాశ్చైవ సర్వమంగల పాణయః| సంజగ్ము స్సోత్సవాః ప్రీత్యా యత్ర దేవో మహేశ్వరః|| 17

తదా వాదిత్ర ఘోషేణ బ్రహ్మఘోషేణ భూయసా| మహోత్సాహో%భవత్తత్ర గీత నృత్యా న్వతేన హి|| 18

బ్రహ్మ ఇట్లు పనికెను-

కన్యా దానమునకు సమయ మాసన్నమైనది గుర్తించి గర్గుడు నివేదించగా అపుడు హిమవంతుడు మనస్సులో చాల సంతసించెను (15). అపుడు ఆ హిమవంతుడు పర్వతులను, బ్రాహ్మణులను, మరియు ఇతరులను శివుని తీసుకొని వచ్చుట కొరకై ఆనందముతో పంపెను (16). ఆపర్వతులు మరియు బ్రాహ్మణులు మంగళ ద్రవ్యములన్నిటినీ చేతుల యందు పట్టుకొని ఉత్సాహముతో మహేశ్వరుడు నివసించిన స్ధానమునకు వెళ్లిరి(17). అపుడచట వాద్య ఘోష, విస్తారమగు వేదఘోష మరియు గీతములతో నృత్యములతో మహోత్సాహము వర్ధిల్లెను(18).

శ్రుత్వా వాదిత్ర నిర్ఘోషం సర్వే శంకర సేవకాః| ఉత్థితాసై#్త్వకపద్యేన సదేవర్షి గణా ముదా|| 19

పరస్పరం సమూచుస్తే హర్ష నిర్భరమానసాః| అత్రాగచ్ఛంతి గిరయశ్శివానయనకామ్యయా|| 20

పాణిగ్రహణకాలో హినూనం సద్యస్సమాగతః| మహద్భాగ్యం హి సర్వేషాం సంప్రాప్త మిహ మన్మహే|| 21

ధన్యా వయం విశేషేణ వివాహం శివాయోర్ధ్రువమ్‌| ద్రక్ష్యామః పరమ ప్రీత్యా జగతాం మంగలాలయమ్‌|| 22

వాద్యముల శబ్దమును విని శంకరుని గణములు,దేవతలు ,ఋషులు అందరు ఒక్కసారిగా ఆనందముతో లేచి నిలబడిరి (19). ఆనందముతో నిండిన మనస్సు గల వారందరు వారిలో వారు ఇట్లు మాటలాడు కొనిరి. శివుని దోడ్కొని వెళ్లుటకై ఇచటకు పర్వతులు వచ్చు చున్నారు (20). పాణి గ్రహణ ముహూర్తము చాల తొందరగా ఆసన్నమైనది. మనందరికి మహాభాగ్యము సంపన్న మైనదని భావించుచున్నాము(21).మనము చాల ధన్యులము. సందేహము లేదు. ఏలయన,లోకములకు మంగళములను కలిగించే పార్వతీ పరమేశ్వరుల వివాహమును పరమానందముతో చూడబోయెదము(22).

బ్రహ్మోవాచ|

ఏవం యావదభూత్తేషాం సంవాదస్తత్ర చాదరాత్‌| తావత్సర్వే సమాయాతాః పర్వతేంద్రస్య మంత్రిణః|| 23

తే గత్వా ప్రార్ధయాం చక్రుశ్వివం విష్ణ్వా దికానపి| కన్యాదానోచితః కోలో వర్తతే గమ్యతామితి|| 24

తే తచ్ఛ్రుత్వా సురాస్సర్వే మునే విష్ణ్వా దయో%ఖిలాః| ముముదుశ్చేతసాతీవ జయేత్యూచుర్గిరిం ద్రుతమ్‌|| 25

శివో%పి ముముదే%తీవ కాలీప్రాపణలాలసః| గుప్తం చకార తచ్చిహ్నం మనస్యేవాద్భుతాకృతిః|| 26

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు వారచట సాదరముగా మాటలాడు చుండగనే, ఇంతలో పర్వతరాజు యొక్క మంత్రులు అందరు విచ్చేసిరి(23). వారు శివుని వద్దకు,విష్ణువు మొదలగు వారి వద్దకు వెళ్లి కన్యాదాన సమయము సమీపించు చన్నది గాన, బయలు దేరుడు అని ప్రార్ధించిరి(24). ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ మాటను విని మనస్సులో చాల సంతసించి వెంటనే హిమవంతుని ఉద్దేశించి జయాధ్వానమును చేసిరి (25). కాళిని పొందవలెననే ఉత్కంఠ గల శివుడు కూడ మిక్కిలి సంతసించెను. కాని ఆ చిహ్నములను మనస్సులందు రహస్యముగ నుంచి గంభీరాకారడై యుండెను(26).

అథ స్నానం కృతం తేన మంగల ద్రవ్యసంయుతమ్‌| శూలినా సుప్రసన్నేన లోకాను గ్రహకారిణా|| 27

స్నాతస్సువాససా యుక్త స్సర్వైసై#్తః పరివారితః| ఆరోపితో వృషస్కంధే లోకపాలైస్సు సేవితః|| 28

పురస్కృత్య ప్రభుం సర్వే జగ్ముర్హిమగిరేర్గృహమ్‌| వాద్యాని వాదయంతశ్చ కృతవంతః కుతూహలమ్‌|| 29

హిమాగప్రేషితా విప్రాస్తథా తే పర్వతోత్తమాః| శంభోరగ్రచరా హ్యసన్‌ కుతూహల సమన్వితాః|| 30

అపుడు శూలధారి, లోకానుగ్రహమును చేయువాడు, మిక్కిలి ప్రసన్నుడు అగు మంగళ ద్రవ్యములతో స్నానమును చేసెను (27). స్నానము చేసి చక్కని వస్త్రమును ధరించిను శివుని వారందరు చుట్టుముట్టిరి. లోకపాలకులు ఆయనను చక్కగా సేవిస్తూ వృషభముపై నెక్కించిరి(28). వారందరు వాద్యములను మ్రోగించుచూ, పండుగను చేసుకొనుచూ ఆ ప్రభుని ముందిడుకొని హిమవంతుని గృహమునకు వెళ్లిరి(29). హిమవంతునిచే పంప బడిన బ్రాహ్ణణులు మరియు శ్రేష్ఠులగు పర్వతులు కుతూహలముతో కూడిన వారై శంభుని యెదుట నడిచిరి(30).

బభౌ ఛత్రేణ మహతా ధ్రియమాణో హి మూర్ధని| చామరైర్వీజ్య మానో%సౌ సవితనో మహేశ్వరః|| 31

అహం విష్ణుస్తథా చేంద్రో లోకపాలాస్తథైవ చ| అగ్రగా స్స్మాతి శో భంతే శ్రియా పరమయా శ్రితాః|| 32

తతశ్శంఖాశ్చ భేర్యశ్చ పటహానకగోముఖాః | పునః పునరవాద్యంత వాదిత్రాణి మహోత్సవే||33

తథైవ గాయకాస్సర్వే జగ్ముః పరమమంగలమ్‌| నర్తక్యో ననృతుస్సర్వా నానాతాల సమన్వితాః|| 34

శివుని శిరస్సుపై పెద్ద ఛత్రము ఏర్పాటు చేయబడెను. చామరములు వీచబడెను. వితానము ( వస్త్రముతో చేసిన పందిరి) క్రింద మహేశ్వరుడు శోభిల్లెను(31). నేను, విష్ణువు, ఇంద్రుడు, లోకపాలకులు ముందు నడిచితిమి. మేము కూడ గొప్ప శోభతో ప్రకాశించితిమి (32). తరువాత శంఖములు, భేరీలు, పటహములు, ఆనకములు, గోముఖములు ఆ మహోత్సవములో అనేక పర్యాయములు మ్రోగించబడినవి (33). మరియు గాయకులందరు పరమ మంగళకరమగు పాటలను పాడిరి. నాట్యకత్తెలందరు అనేక తాళములతో గూడి నాట్యమును చేసిరి (34).

ఏబిస్సమేతో జగదేక బంధుః య¸° తదూనీం పరమేవర్చసా|

సుసేవ్యమానస్స కలై స్సురేశ్వరైః వికీర్యమాణః కుసుమైశ్చ హర్షితైః|| 35

సంపూజితస్తదా శంభుః ప్రవిష్టో యజ్ఞమండపమ్‌| సంస్తూయమానో బహ్వీభి స్త్సు తిభిః పరమేశ్వర|| 36

వృషాదుత్తారయామాసుర్మహేశం పర్వతోత్తమాః| నిన్యుర్గహాతరం ప్రీత్యా మహోత్సవపురస్సరమ్‌|| 37

హిమాలయో%పి సంప్రాప్తం సదేవగణమీశ్వరమ్‌| ప్రణమ్య విధి వద్భక్త్యా నీరాజనమధాకరత్‌|| 38

జగదేక బంధువగు శివుడు వీరతో గూడి అప్పుడు పరమేశ్వరతేజస్సుతో ముందుకు సాగెను. లోకపాలకులందరు ఆయనను సేవిస్తూ ఆనందముతో పుష్పములను చల్లు చుండిరి (35). ఈ విదముగా పూజింపబడిన శంభు పరమేశ్వరుడు అనేక స్తుతులచే కొనియాడబడుచున్న వాడై యజ్ఞ మండపములోనికి ప్రవేశించెను (36). పర్వతశ్రేష్ఠులు మహోత్సవపురస్సరముగా మహేశ్వరుని వృషభము నుండి దింపి ప్రీతితో గృహము లోపలికి దోడ్కొని వెళ్లిరి(37). హిమవంతుడు కూడ దేవతలతో గణములతో కూడి విచ్చేసిన ఈశ్వరునకు భక్తితో ప్రణమిల్లి యథావిధిగా నీరాజనమొసంగెను (38).

సర్వాన్‌ సురాన్‌ మునీనన్యాన్‌ ప్రణమ్య సమహోత్సవః| సమ్మాన మకరత్తేషాం ప్రశంసన్‌ స్వవిధిం ముదా|| 39

సో%గస్సాచ్యుత మీశానం సుపాద్యార్ఘ్య పురస్సరమ్‌| సదేవముఖ్యవర్గం చ నినాయ స్వాలయాంతరమ్‌|| 40

ప్రాంగణ స్థాపయామాస రత్నసింబహసమనేఘ తాన్‌| సర్వాన్‌ విష్ణుం చ మామీశం విశిష్టాంశ్చ విశేషతః|| 41

సఖీభిర్మేనాయ ప్రీత్యా బ్రాహ్మణస్త్రీభిరేవ చ | అన్యాభిశ్చ పురంధ్రీభిశ్చక్రే నిరాజనం ముదా|| 42

హిమవంతుడు తన భాగ్యమును కొనియాడుచూ దేవతలను, మునులను, ఇతరులను అందరినీ నమస్కరించి మహోత్సాహముతో సన్మానించెను (39). ఆ హిమవంతుడు అచ్యుతునితో, ముఖ్యులగు దేవతలతో గూడి యున్న ఈశ్వరునికి అర్ఘ్యపాద్యములనిచ్చి తన గృహము లోపలికి తీసుకొని వెళ్లెను (40). నన్ను, విష్ణువును, ఈశ్వరుని ఇతర పెద్దలను వాకిటి యందు రత్న సింహాసనములపై ప్రత్యేకముగా కూర్చుండబెట్టెను(41). చెలికత్తెలు, మేన, మరియు బ్రాహ్మణ స్త్రీలు, ఇతర ముత్తయిదవలు ఆనందముతో నీరాజనమిచ్చిరి (42).

పురోధసా కృత్యవిదా శంకరాయ మహాత్మనే| మధు పర్కాదికం యద్యత్‌ కృత్యం తత్తత్‌ కృతం ముదా|| 43

మయా స నోదితస్తత్ర పురోధాః కృతవాంస్తదా| సుమంగలం చ యత్కర్మ ప్రస్తావసదృశం మునే|| 44

%

అంతర్వేద్యాం మహాప్రీత్యా సంప్రవిశ్య హిమాద్రిణా | యత్ర పార్వతీ కన్యా సర్వాభరణభూషితా || 45

వేదికోపరి తన్వంగీ సంస్థితా సువిరాజితా | తత్ర నీతో మహాదేవో విష్ణునా మయా సహ || 46

వివాహ ప్రక్రియ నెరింగిన పురోహితుడు మహాత్ముడగు శంకరునకు మధుపర్కము మొదలగు వాటినిచ్చి చేయదగిన కర్మలనన్నిటినీ ఆనందముతో చేయించెను (43). ఓ మునీ! నాచే ప్రేరితుడైన ఆ పురోహితుడు అపుడు వివాహ ప్రస్తావమునకు అనురూపమగు మంగళకార్యముల నన్నిటినీ చేసెను (44). అపుడు శివుడు హిమవంతునితో బాటు వేదిపైన ప్రవేశించెను. అప్పటికి సర్వాలంకార శోభితయగు పార్వతీకన్య అచట ఉండెను (45). ఆ సుందరి వేదికపై నున్నదై మిక్కిలి ప్రకాశించెను. మహాదేవుని, విష్ణువును, నన్ను అచటకు దోడ్కొని వెళ్ళిరి (46).

లగ్నం నిరీక్షమాణాస్తే వాచస్పతి పురోగమాః | కన్యాదానో చితం తత్ర బభూవుః పరమోత్సవాః || 47

తత్రో పవిష్టో గర్గశ్చ యత్రాస్తి ఘటికాలయమ్‌ | యా వచ్ఛేషా ఘటీ తావత్‌ కృతం ప్రణవ భాషణమ్‌ || 48

పుణ్యాహం ప్రవదన్‌ గర్గ స్సమాధ్రే%ంజలిం ముదా | పార్వత్యక్షత పూర్ణం చ వవృషే చ శివో పరి || 49

తయా సంపూజితో రుద్రో దధ్యక్షతకుశాంబుభిః | పరమోదారయా తత్ర పార్వత్యా రుచిరాస్యయా || 50

బృహస్పతి మొదలగు వారు పరమానందముతో ఆచట కన్యాదాన లగ్నమును నిరీక్షించు చుండిరి (47). గర్గుడు గడియారము ఉన్నచోట కూర్చుండి లగ్నము వరకు గల మధ్య కాలములో ఓంకారమునుచ్చరించెను (48). గర్గుడు పుణ్యాహమం త్రములను పఠిస్తూ పార్వతి యొక్క దోసిలి యందు అక్షతలను నింపెను. ఆమె ఆనందముతో వాటిని శివుని శిరస్సుపై పోసెను. (49). గొప్ప ఉదారురాలు, సుందరమగు ముఖము గలది యగు పార్వతి పెరుగు, అక్షతలు, దర్భలు మరియు జలములతో రుద్రుని పూజించెను (50).

విలోకయంతీ తం శంభుం యస్యార్థే పరమం తపః | కృతం పురా మహాప్రీత్యా విరరాజ శివాతి సా || 51

మయా మునే తదోక్తస్తు గర్గాది ముని భిశ్చ సః | సమానర్చ శివాం శంభు ర్లౌకికాచార సంరతః || 52

ఏవం పరస్పరం తౌ వై పార్వతీ పరమేశ్వ రౌ | అర్చయంతౌ తదానీం చ శుశుభాతే జగన్మ¸° || 53

ఎవని కొరకై పరమ తపస్సును పూర్వము చేసినదో, అట్టి శంభుని మహానందముతో చూస్తూ ఆ పార్వతి మిక్కిలి ప్రకాశించెను (51). ఓ మునీ! నేను, గర్గాది మునులు చెప్పగా ఆ శంభుడు లోకాచారము నందు శ్రద్ధ గలవాడై పార్వతిని పూజించెను (52). ఈ విధముగా జగద్రూపులగు పార్వతీ పరమేశ్వరులు అపుడు పరస్పరము పూజించుకొని ప్రకాశించిరి (53).

త్రైలోక్యలక్ష్మ్యా సంవీతౌ నిరీక్షింతౌ పరస్పరమ్‌ | తదా నీరాజితౌ లక్ష్మ్వా దిభి స్త్స్రీ భిర్విశేనషతః || 54

తథా పరా వై ద్విజ యోషితశ్చ నీరాజయామాసురుథో పురస్త్రియః |

శివాం చ శంభుం చవిలోకయంత్యః అవాపుర్ముదం తాస్సకలా మహోత్సవమ్‌ || 55

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే శివ హిమగిరి గృహాభ్యంతర గమనోత్సవ వర్ణనం నామ సప్తచత్వారింశో%ధ్యాయః (47).

ముల్లోకముల శోభను కలిగి ఒకరినొకరు చూచుకొనుచున్న వారిద్దరికి లక్ష్మి మొదలగు స్త్రీలు ప్రత్యేకముగా నీరాజనము నిచ్చిరి (54). మరియు బ్రాహ్మణ స్త్రీలు పార్వతీ పరమేశ్వరులకు తరువాత నీరాజనము నిచ్చిరి. వారిద్దరినీ చూస్తూ వారందరు మహానందమును, ఉత్సాహమును పొందిరి (55).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివుడు హిమవంతుని అంతః పురములో ప్రవేశించుట అను నలుబది ఏడవ అధ్యాయము ముగిసినది (47).

Sri Sivamahapuranamu-II    Chapters