Sri Sivamahapuranamu-II    Chapters   

అథ అష్టా చత్వారింశ%ధ్యాయః

కన్యాదానము

బ్రహ్మోవాచ |

ఏతస్మినంతరే తత్ర గర్గాచార్య ప్రణోదితః | హిమవాన్మేనయా సార్ధం కన్యాం

దాతుం ప్రచక్రమే || 1

హైమం కలశమాదాయ మేనా చార్ధాంగమాశ్రితా | హిమాద్రేశ్చ మహాభాగా వస్త్రాభరణ భూషితా || 2

పాద్యాదిబిస్తతశ్శైలః ప్రహృష్టస్సపురోహితః| తం వరం వరయామాస వస్త్ర చందన భూషణౖః || 3

తతో హిమాద్రిణా ప్రోక్తా ద్విజాస్తిథ్యాది కీర్తనే | ప్రయోగో భన్యతాం తావదస్మిన్‌ సమయ ఆగతే || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఒతలో అచట గర్గాచార్యునిచే ప్రేరేపింపబడిన హిమవంతుడు మేనతో గూడి కన్యాదానమునకు ఉపక్రమించెను (1). పుణ్యాత్మురాలగు మేన నూతన వస్త్రములను ధరించి సొమ్ములను పెట్టుకొని బంగరు కలశమును చేతబట్టి హిమవంతుని ప్రక్కన కూర్చుండెను (2). అపుడు హిమవంతుడు పురోహితునితో గూడి పాద్యము, వస్త్రము, చందనము, అలంకారము మొదలగు వాటితో ఆ వరుని ఆనందముగా పూజించెను (3). అపుడు హిమవంతుడు బ్రాహ్ముణులను సముయము కాగానే తిధి మొదలగు వాటిని కీర్తించి వివాహ ప్రయోగమును పఠించుడని కోరెను (4).

తథేతి చోక్త్వా తే సర్వే కాలజ్ఞా ద్విజసత్తమాః | తిథ్యాది కీర్తనం చక్రుః ప్రీత్యా పరమ నిర్వృతాః || 5

తతో హిమాచలః ప్రీత్యా శంభునా ప్రేరితో హృదా | సూతీకృతః పరేశేన విహసన్‌ శంభు మబ్రవీత్‌ || 6

కాల జ్ఞాన పండితులగు ఆ బ్రాహ్మణోత్తములు అందరు 'అటులనే' అని పలికి పరమానందముతో తిధి మొదలగు వాటిని కీర్తించిరి (5). అపుడు హృదయము నందు శంభునిచే సానందముగా ప్రేరేపింపబడిన హిమవంతుడు అనేక లీలలనను ప్రకటించువాడు, పరమేశ్వరుడు అగు శంభునితో నవ్వుచూ ఇట్లు పలికెను (6).

స్వగోత్రం కథ్యతాం శంభో ప్రవరశ్చ కులం తథా | నామ వేదం తథా శాఖాం మా కార్షీ స్సమయాత్యమమ్‌ || 7

హే శంభో ! నీవు సమయము దాటి పోకుండా నీ గోత్రమును, ప్రవరను, కులమును, పేరును, వేదమును, వేదశాఖను చెప్పుము (7).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య హిమాద్రేశ్శంకరస్తదా | సుముఖో విముఖస్సద్యో%ప్యశోచ్యశ్శోచ్యతాం గతః || 8

ఏవం విధ స్సురవరైర్మునిభిస్తదానీం గంధర్వ యక్షగణసిద్ధ గణౖ స్తథైవ |

దృష్టో నిరుత్తరముఖో భగవాన్‌ మహేశః అకార్షీ స్సుహాస్యమథ తత్ర స నారద త్వమ్‌ || 9

వీణా మవాదయస్త్వం హి బ్రహ్మవిజ్ఞోథ నారద | శివేన ప్రేరితస్తత్ర మనసా శంభుమానసః || 10

బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవంతుని ఈ మాటను విని శంకరుడు ఆ క్షణములో సుముఖుడుగా నున్నవాడు విముఖుడాయెను. శోకింపదగనివాడు వెనువెంటనే శోచనీయమగు స్థితిని పొందెను (8). ఈ విధముగా దేవోత్తములు, మునులు, గందర్వులు, యక్షగణములు, సిద్దులు, శివగణములు చూచుచుండగా భగవాన్‌ మహేశ్వరుని నోటి వెంట సమాధానము రాలేదు. ఓ నారదా! అపుడు నీవు ఒక నవ్వదగిన పనిని అచట చేసి యుంటివి (9). ఓ నారదా! శంబుని మనస్సలో ధ్యానించే నీవు శివునిచే మనస్సలో ప్రేరితుడవై వీణను వాయించ మొదలిడితివి. నీవు బ్రహ్మవేత్తవు గదా! (10).

తదా నివారితో ధీమాన్‌ పర్వతేంద్రేణ వై హఠాత్‌ | విష్ణు న చ మయా దేవైర్మునిభిశ్చాఖిలై స్తథా || 11

న నివృత్తో%భవస్త్వం హి స యదా శంకరేచ్ఛయా | ఇతి ప్రోక్తో%ద్రిణా తర్హి వీణాం మా వాదయాధునా || 12

సునిషిద్ధో హఠాత్తేన దేవర్షే త్వం యదా బుధ | ప్రత్యవోచో గిరీశం తం సుసంస్మృత్య మహేశ్వరమ్‌ || 13

అపుడు హిమవంతుడు, విష్ణువు, నేను దేవతలు, మునులు అందరు బుద్ధిశాలివగు నిన్ను అపమని గట్టిగా వారించితిమి (11). కాని శంకరుని ఇచ్ఛచే నీవు ఆపలేదు. అపుడు హిమవంతుడు నీతో 'ఇపుడు వీణను వాయించకుము' అని చెప్పెను (12). ఓ దేవర్షీ ! విద్వాంసుడా! ఆయన నిన్ను హఠాత్తుగా వీణను ఆపుమని గట్టిగా చెప్పగనే, నీవు మహేశ్వరుని స్మరించు కొని ఆ పర్వతరాజునకు ఇట్లు సమాధానము నిచ్చితివి (13).

నారదా ఉవాచ |

త్వం హి మూఢత్వమాపన్నో న జానాసి చ కించన | వాచ్యే మహేశవిషయే%తీ వాసి త్వం బహిర్ముఖః || 14

త్వయా పృష్టో హరస్సాక్షాత్‌ స్వగోత్ర కథనంన ప్రతి | సమయే%స్మిన్‌ తదత్యంత ముపహాసకరం వచః || 15

అస్య గోత్రం కులం నామ నైవ జానంతి పర్వత | విష్ణు బ్రహ్మాదయో%పీహ పరేషాం కా కథా స్మృతా || 16

యసై#్యక దివసే శైల బ్రహ్మకోటిర్లయం గతా | స ఏవ శంకరస్తేద్య దృష్టః కాలీ తపోబలాత్‌ ||17

నారుదుడిట్లు పలికెను -

నీవు మూర్ఖుడవై నావు. నీకేమియూ తెలియదు. మహేశ్వరుని గురించి ప్రశ్నించుటచే నీవు పూర్తిగా బహిర్ముఖుడవై ఉన్నావని స్పష్టమైనది (14). నీవు ఈ సమయములో సాక్షాత్తు హరుని తన గోత్రమును చెప్పుమని ప్రశ్నించితివి. ఇది ఎంతయూ అపహాస్యకరమగు మాట యగును (15). ఓ పర్వతా ! ఈయన గోత్ర కుల నామములు విష్ణు బ్రహ్మాదులకైనను తెలియవు. ఇతరుల గురించి చెప్పున దేమున్నది? (16). ఓ పర్వతా ! ఎవని యొక్క ఒక్క దినములో కోటి బ్రహ్మలు లయమగుదురో ఆ శంకరుడీనాడు కాళి యొక్క తపోబలము వలన నీకు కనుబడినాడు (17).

అరూపో%యం పరబ్రహ్మ నిర్గణః ప్రకృతేః పరః | నిరాకారో నిర్వికారో యమాధీశః పరాత్పరః || 18

అగోత్రకులనామా హి స్వతంత్రో భక్తవత్సలః | తదిచ్ఛయా హి సగుణస్సుతను ర్బహునామభృత్‌ || 19

సగోత్రీ గోత్రహీనశ్చ కులహీనః కులీనకః |పార్వతీతపసా సో%ద్య జామాతా తే న సంశయః || 20

లీలా విహారిణా తేన మోహితం చ చరాచరమ్‌ | నో జానాతి శివం కో%పి ప్రాజ్ఞో%పి గిరిసత్తమ || 21

ఈయన నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. ప్రకృతికి అతీతుడై ప్రకృతిని తన వశమునందుంచు కొనువాడు. వికారహీనుడగు శివుడు సర్వోత్కృష్టుడు (18). భక్తవత్సలుడు, స్వతంత్రుడునగు శివునకు కులగోత్రములు, నామములు లేవు. ఆయన తన ఇచ్ఛచే సగుణుడై దేహమును స్వీకరించి అనేక నామములను ధరించును (19). మంచి గోత్రము గలవాడు, కాని గోత్రము లేనివాడు, మంచి కులమునకు చెందినవాడు, కాని కులము లేనివాడు ఆగు శివుడు ఈనాడు పార్వతి యొక్క తపస్సుచే నీ అల్లుడైనాడు. సందేహము లేదు (20). లీలా విహారియగు శివునిచే స్థావర జంగమాత్మకమగు విశ్వమంతయూ మోహింపబడి యున్నది. ఓ పర్వత శ్రేష్ఠా! శివుని పండితులు కూడా ఎరుంగ జాలరు (21).

లింగాకృతేర్మహేశస్య కేన దృష్టం న మస్తకమ్‌ | విష్ణుర్గత్వా హి పాతాలం తదేనం నాప విస్మితః || 22

కిం బహుక్త్యా నగశ్రేష్ఠ శివమాయా దురత్యయా | తదధీనాస్త్రయో లోకా హరిబ్రహ్మాదయో%పి చ || 23

తస్మాత్త్వయా శివాతాత సువిచార్య ప్రయత్నతః | న కర్తవ్యో విమర్శో%త్ర త్వేవంవిదవరే మనాక్‌ || 24

మహేశ్వరుడు లింగాకారమును ధరించగా ఆయన అగ్రబాగము ఎవ్వరికీ కానరాలేదు. విష్ణువు పాతాళమునకు వెళ్లియూ ఆ లింగము యొక్క మూలమును గన జాలక చకితుడైనాడు (22). ఓ పర్వత రాజా! ఇన్ని మటలేల? శివమాయను దాట శక్యము కాదు. విష్ణు బ్రహ్మాదులతో సహా ముల్లోకములు శివమాయకు అధీనములై ఉన్నవి (23). కావున పార్వతీ జనకుడవగు నీవు జాగ్రత్తగా విచారించు కొనుము. ఇటు వంటి వరుని విషయములో అల్పమగు విర్శయైననూ ఈ సమయములో చేయదగదు (24).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా త్వం మునే జ్ఞానీ శివేచ్ఛా కార్యకారకః | ప్రత్యవోచః పునస్తం వై శైలేంద్రం హర్షయన్‌ గిరా || 25

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! జ్ఞాని, శివుని ఇచ్ఛననుసరించి పనులను చక్కబెట్టువాడు అగు నీవు ఇట్లు పలికి పర్వతరాజునకు నీ మాటలచే ఆనందమును కలిగిస్తూ మరల ఇట్లు పలికితివి (25).

నారద ఉవాచ |

శృణు తాత మహశైల శివా జనక మద్వచః | తచ్ర్ఛుత్వా తనయాం దేవీం దేహి త్వం శంకరాయ హి || 26

సగుణస్య మహేశస్య లీలయా రూపదారిణః | గోత్రం కులం విజానీహి నాదమేవ హి కేవలమ్‌ || 27

శివో నాదమయస్సత్యం నాదశ్శివమయస్తథా | ఉభయోరంతరం నాస్తి నదస్య చ శివస్య చ || 28

సృష్టౌ ప్రథమజ త్వాద్ధి లీలాసగుణ రూపిణః | శివాన్నాదస్య శైలేంద్ర సర్వోత్కృష్టస్తతత్స హి || 29

అతో హి వాదితా వీణా ప్రేరితేన మయాద్య వై | సర్వేశ్వరేణ మనసా శంకరేణ హిమాలయ || 30

నారదుడిట్లు పలికెను -

వత్సా! మహాపర్వతరాజా! పార్వతీ జనకా! నా మటను వినుము. విని నీ కుమార్తె యగు పార్వతీ దేవిని నీవు శంకరునకిమ్ము (26). సుగుణుడు, లీలా రూపధారి అగు హహేశ్వరుని కులగోత్రములు కేవలము నాదము మాత్రమేనని యెరుంగుము (27). శివుడు నాదస్వరూపుడు. నాదము శివ స్వరూపము. ఇది సత్యము. నాద శివులకు ఇద్దరికీ భేదము లేదు. (28). ఓ పర్వతరాజా! లీలచే సగుణ రూపమును స్వీకరించిన శివుని నుండి మున్ముందుగా నాదము సృష్టింపబడుటచే, అది సృష్టిలో సర్వశ్రేష్ఠమై యున్నది

(29). అందువలననే, నేనీనాడు మనస్సులో సర్వేశ్వరుడగు శివునచే ప్రేరితుడనై వీణను వాయించితిని. ఓ హిమాలయా! తెలుసు కొనుము (30).

బ్రహ్మో వాచ |

ఏతచ్ర్ఛుత్వా తవ మునే వచస్తత్తు గిరీశ్వరః | హిమాద్రి స్తోషమాపన్నో గత విస్మయ మానసః || 31

అథ విష్ణుప్రభృతయ స్సురాశ్చ మునయస్తథా | సాదు సాధ్వితి తే సర్వే ప్రోచుర్విగత విస్మయాః || 32

మహేశ్వరస్య గాంబీర్యం జ్ఞాత్వా సర్వే విచక్షణాః | సవిస్మయా మహామోదాన్వితాః ప్రోచుః పరస్పరమ్‌ || 33

యస్వాజ్ఞయా జగదిదం చ విశాలమేవ జాతం పరాత్పరతరో నిజబో ధరూపః|

శర్వస్స్వతంత్ర గతి కృత్పర బావగమ్యః సో%సౌ త్రిలోకపతిరద్య చ నస్సు దృష్టః || 34

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! నీ యొక్క ఈ మాటనున వినిన పిమ్మట పర్వతరాజగు హిమవంతుడు గర్వమును వీడి మనస్సులో ఆనందమును పొందెను (31). అపుడు విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు తొలగిన గర్వము గలవారై 'బాగు బాగు' అని పలికిరి (32). పండితులగు వారందరు మహేశ్వరుని మహిమను ఎరింగి ఆశ్చర్మయమును, మహానందమును పొంది, వారిలో వారు ఒట్లు అను కొనిరి (33). ఎవని ఆజ్ఞచే ఈ విశాలమగు జగత్తు పుట్టినదో అట్టి శర్వుడు సర్వమునకు అతీతుడు, ఆత్మ జ్ఞానరూపుడు. మోక్షమునిచ్చువాడు ఆయనయే. ముల్లోకములకు పతియగు ఆయన బ్రహ్మ జ్ఞానముచే మాత్రమే పొందబడును. ఈనాడు ఆయనను మనము చూడగల్గితిమి (34).

అథ తే పర్వత శ్రేష్టా మేర్వాద్యా జాతసంభ్రమాః | ఊచుస్తే చైకపద్యేన హిమవంతం నగేశ్వరమ్‌ || 35

అపుడు మేరువు మొదలగు ఆ పర్వత శ్రేష్ఠులు ఆశ్చర్యపడిన వారై ఏకకంఠముతో పర్వతరాజగు హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికిరి (35).

పర్వతా ఊచుః |

కన్యాదానే స్థీ యతాం చాద్య శైల నాథోక్త్యా కిం కార్యనాశస్తవైవ |

సత్యం బ్రూమో నాత్ర కార్యో విమర్శః తస్మాత్కన్యా దీయతామీశ్వరాయ || 36

పర్వతము లిట్లు పలికినవి -

ఓ పర్వత రాజా! నీ విపుడు కన్యాదాన కార్యము నందు నిమగ్నుడవు కమ్ము. ఉత్తి మాటలతో నీ కార్యము చెడగలదు. కాన ఈ మాటలేల? మేము సత్యమును పలుకుచున్నాము. ఈ విషయములో విమర్శను కట్టి పెట్టుము. కన్యను ఈశ్వరునకు ఇమ్ము (36).

బ్రహ్మోవాచ |

తచ్ర్ఛుత్వా వచనం తేషాం సుహృదాం స హిమాలయః | స్వకన్యా దానమకరోచ్ఛి వాయ విధినోదితః || 37

ఇమాం కన్యాం తుభ్య మహాం దదామి పరమేశ్వర | భార్యార్థే పరిగృహ్ణీష్వ ప్రసీద సకలేశ్వర || 38

తసై#్మ రుద్రాయ మహతే మంత్రేణానేన దత్తవాన్‌ | హిమాచలో నిజాం కాన్యాం పార్వతీం త్రిజగత్ర్పూసూమ్‌ || 39

ఇత్థం శివాకరం శైలశ్శివహస్తే నిధాయ చ | ముమోదాతీవ మనసి తీర్ణ కామమహార్ణవః || 40

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మిత్రుల వచనములను విని హిమవంతుడు బ్రహ్మగారి పర్యవేక్షణలో తన కుమార్తెను శివునకు ఇచ్చెను (37). ఓ పరమేశ్వరా! ఈ కన్యను నేను నీ కొరకు ఇచ్చు చున్నాను. ఓ సర్వేశ్వరా! నీవు ప్రసన్ననుడవై ఈమెను భార్యగా స్వీకరించుము (38). హిమవంతడు ఈ మంత్రమును చెప్పి మహాత్ముడగు రుద్రునకు ముల్లోకములకు తల్లి, తనకు కుమార్తె యగు పార్వతిని ఇచ్చెను (39). ఈ తీరున హిమవంతుడు పార్వతి చేతిని శివుని చేతిలో ఉంచి మనస్సులో చాల ఆనందించెను. ఆయన కామనలనే మహాసముద్రమును దాటి వేసెను (40).

వేదమంత్రేణ గిరిశో గిరిజా కర పంకజమ్‌ | జగ్రాహ స్వకరేణాశు ప్రస్నః పరమేశ్వరః|| 41

క్షితిం సంస్పృశ్య కామస్య కో%దాదితి మనుం మునే | పపాఠ శంకరః ప్రీత్యా దర్శయన్‌ లౌకికీం గతిమ్‌ || 42

మహోత్సవో మహానానసీత్సర్వత్ర ప్రముదావహః | బభూవ జయసంరావో దివి భూమ్యంతరిక్షకే || 43

సాధుశబ్దం నమశ్శబ్దం చక్రు స్సర్వేతి హర్షితాః | గంధర్వా స్సుజగుః ప్రీత్యా ననృతు శ్చా ప్సరోగణాః || 44

పరమేశ్వరుడగు కైలాసపతి ప్రసన్నుడై వెంటనే వేదమంత్రమును పఠించి, పార్వతియొక్క పద్మము వంటి చేతిని తనచేతితో పట్టకొనెను (41). ఓ మునీ! శంకరుడు లోకాచారమును ప్రదర్శించువాడై భూమిని స్పృశించి కామస్య కో%దాత్‌ ఇత్యాది మంత్రమును శ్రద్ధగా పఠించెను (42). అంతటా మహానందమునిచ్చే మహోత్సవము ఆరంభమయ్యెను. భూమి యందు, అంతరిక్షము నందు, స్వర్గమునందు జయధ్వానములు బయలు దేరెను (43). అందరు ఆనందముతో 'బాగు, నమస్కారము' అనుచుండిరి. గంధర్వులు ఆనందముతో పాడగా అప్సరసలు నాట్యమాడిరి (44).

హిమాచలస్య పౌరా హి ముముదుశ్చాతి చేతసి | మంగలం మహదాసీద్వై మహోత్సవపుర స్సరమ్‌ || 45

అహం విష్ణుశ్చ శక్రశ్చ నిర్జరా మునయో%ఖిలాః | హర్షితా హ్యబవంశ్చాతి ప్రపుల్ల వదనాంబుజాః || 46

అథ శైలవరస్సో%దాత్‌ సుప్రసన్నోన హిమాచలః | శివాయ కన్యాదానస్య సాంగతాం సుయథోచితామ్‌ || 47

తతో బంధు జనాస్తస్య శివాం సంపూజ్య భక్తితః | దదుశ్శివాయ సద్ద్రువ్యం నానావిధి విధానతః || 48

హిమావంతుని రాజ్యములోని పౌరులు మనస్సులో చాల ఆనందించిరి. గొప్ప మంగళ శబ్దములతో కూడిన మహోత్సవము ప్రవర్తిల్లెను (45). నేను, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మునులు, అందరు వికసించిన ముఖ పద్మములు గలవారై మిక్కిలి ఆనందించితిమి (46). అపుడు ఆ పర్వతరాజగు హిమవంతడు మిక్కిలి ప్రసన్నుడై శివునకు కన్యాదానాంగముగా యథోచితమగు పురస్కారమునిచ్చెను (47). అపుడా హిమవంతుని బంధువులు పార్వతిని భక్తితో పూజించి విధి విధానముగా అనేక మంచి ద్రవ్యములను శివునకిచ్చిరి (48).

హిమాలయస్తుష్టమనాః పార్వతీ శివ ప్రీతయే | నానావిధాని ద్రవ్యాణి దదౌ తత్ర మునీశ్వర || 49

కౌతుకాని దదౌ తసై#్మ రత్నాని వివిదాని చ | చారురత్న వికారాణి పాత్రాణి వివిధాని చ || 50

గవాం లక్షం హయానాం చ సజ్జితానాం శతం తథా | దాసీనామనురక్తానం లక్షం సద్ద్రవ్య భూషితమ్‌ || 51

నాగానాం శతలక్షం హి రథానాం చ తథా మునే | సువర్ణ జటితానాం చ రత్నసార వినిర్మితమ్‌ || 52

ఓ మహర్షీ ! అపుడు సంతసించిన మనస్సు గల హిమవంతుడు శివ పార్వతుల ఆనందము కొరకు బహు విధములు ద్రవ్యముల నొసంగెను (49). ఆయనకు వివిధ రత్నములను, రత్నములతో చేసిన సుందరమగు ఆభరణములను, వివిధ పాత్రలను, రక్షాబంధములను ఇచ్చెను (50). లక్ష గోవులు, సవారీకి సజ్జితము చేయబడిన వంద గుర్రములు, చక్కని ఆభరణములతో అలంకరింపబడి అనురాగము కలిగిన లక్ష దాసీలు (51). కోటి ఏనుగులు, కోటి బంగరు రథములు ఈయబడెను. ఓ మునీ! ఆ రథములలో శ్రేష్ఠరత్నములు పొదుగబడెను (52).

ఇత్థం హిమాలయో దత్త్వా స్వసుతాం గిరిజాం శివామ్‌ | వివాయ పరమేశాయ విధినా%%పకృతార్థతామ్‌ |7 53

అథ శైలవరో మాధ్యందినోక్త స్తోత్రతో ముదా | తుష్టావ పరమేశానం సద్గిరా సుకృతాంజలిః || 54

తతో వేదవిదా తేనాజ్ఞప్తా ముని గణాస్తదా | శిరో%భిషేకం చక్రుస్తే శివాయాః పరమోత్సవాః || 55

దేవాభిధానముచ్చార్య పర్యక్షణవిధిం వ్యధుః | మహోత్సవస్తదా చాసీన్మహానందకరో మునే || 56

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వీతిఖండే కన్యాదాన వర్ణనం నామ అష్టాచత్వారింశో%ధ్యాయః (48)

ఈ విధముగా హిమవంతడు తన కుమార్తె యగు పార్వతిని పరమేశ్వరుడగు శివునకు యథావిధిగా ఇచ్చి కృతార్థుడాయెను (53). అపుడు ఆ పర్వతరాజు చేతులు జోడించి శుక్లయజుర్వేద మాధ్యం దిన శాఖ యందలి స్తోత్రమును చక్కని స్వరముతో పఠించి ఆనందముతో పరమేశ్వరుని స్తుతింతచెను (54). తరువాత వేదవేత్త యగు ఆ హిమవంతునిచే అజ్ఞాపించబడిన మహర్షులు అపుడు పరమోత్సాహముతో పార్వతిని శిరస్సుపై అభిషేకించిరి (55). ఓ మునీ! వారు అపుడు శివుని నామమును ఉచ్చరించి యధావిధిగా ప్రోక్షణమును చేసిరి. అచట మహానందమును కలిగించు మహోత్సవము ప్రవర్తిల్లెను (56).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో కన్యాదాన వర్ణనము అనే నలుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (48).

Sri Sivamahapuranamu-II    Chapters