Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చతుఃపంచాశత్తమోధ్యాయః

పతివ్రతా ధర్మములు

బ్రహ్మోవాచ|

అథ సప్తర్షయస్తే చ ప్రోచుర్హిమగిరీశ్వరమ్‌ | కారయస్వాత్మజాదేవ్యా యాత్రామద్యోచితాం గిరే || 1

ఇతి శ్రుత్వా గిరీశోహి బుద్ధ్వా తద్విరహం పరమ్‌ | విషణ్ణోభూన్మహాప్రేవ్ణూ కియత్కాలం మునీశ్వర || 2

కియత్కాలేన సంప్రాప్య చేతనాం శైలరాట్‌ తతః | తథాస్త్వితి గిరాముక్త్వా మేనాం సందేశమబ్రవీత్‌ || 3

శైలసందేశమాకర్ణ్య హర్ష శోకవశా మునే | మేనా సంయాపయామాస కర్తుమాసీత్సముద్యతా || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు సప్తర్షులు హిమవంతునితో'ఓ పర్వతరాజా! నీ కుమార్తె యగు పార్వతీ దేవి యొక్క యాత్రకు ఈనాడు బాగున్నది గాన ఏర్పాట్లను చేయుము' అని చెప్పిరి (1). పర్వతరాజు ఈ మాటను విని కుమార్తె యొక్క విరహమును స్మరించి మహాప్రేమచే దుఃఖితుడాయెను. ఓ మహార్షీ! ఆతడు కొంతసేపు స్పృహను గోల్పోయెను (2). తరువాత ఆ పర్వతరాజు కొంతసేపటికి తెలివిని దెచ్చుకొని 'అటులనే' అని పలికి మేనా దేవికి సందేశమును పంపెను (3). ఓ మునీ! ఆనంద దుఃఖములతో ఒక్కసారి నిండిన మనస్సుగల మేన హిమవంతుని సందేశమును విని పార్వతిని సాగనంపుటకు సంసిద్ధురాలాయెను (4).

శ్రుతిస్వకులజాచారం చచార విధివన్మునే | ఉత్సవం వివిధం తత్ర సా మేనా క్షితభృత్ప్రియా || 5

గిరిజాం భూషయామాస నానారత్నాంశుకైర్వరైః | ద్వాదశాభరణౖశ్చైవ శృంగారైర్నృవసమ్మితైః || 6

మేనా మనోగం బుద్ధ్వా హి సాధ్వ్యేకా ద్విజకామినీ | గిరిజాం శిక్షయామాస పాతివ్రత్యవ్రతం పరమ్‌ || 7

ఓ మునీ! ఆమె వేదోక్త విధానమును, తమకులాచారమును యథావిధిగా పాటించెను. అపుడుచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను. హిమవత్పత్నియగు ఆ మేన (5) శ్రేష్ఠమగు పట్టు వస్త్రములతో, రాజుయొక్క హోదాకు తగిన పన్నెండు రకముల ఆభరణములతో పార్వతిని అలంకరించెను (6). పతివ్రతయగు ఒక బ్రాహ్మణపత్నిమేన యొక్క మనోగతము నెరింగి గొప్ప పాతివ్రత్య వ్రతమును గురించి పార్వతికి బోధించెను (7).

ద్విజపత్న్యువాచ|

గిరిజే శృణు సుప్రీత్యా మద్వచో ధర్మ వర్ధనమ్‌ | ఇహేముత్రా నందకరం శృణ్వతాం చ సుఖప్రదమ్‌ || 8

ధన్యా పతివ్రతా నారీ నాన్యా పూజ్యా విశేషతః | పావనీ సర్వలోకానాం సర్వపా పౌఘానాశినీ || 9

సేవతే యా పతిం ప్రేవ్ణూ పరమేశ్వరవచ్ఛి వే | ఇహ భుక్త్వాఖిలాన్‌ భోగాన్‌ అంతే పత్యా శివాం గతిమ్‌ || 10

పతివ్రతా చ సావిత్రీ లోపాముద్రా హ్యరుంధతీ | శాండిల్యా శతరూపానసూయా లక్ష్మీస్స్వధా సతీ || 11

బ్రాహ్మణస్త్రీ ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! ధర్మమును వృద్ధి పొందించునది, ఇహపరములయందు ఆనందమును కలిగించునది, సుఖకరమైనది అగు నా మాటను ప్రీతితో వినుము (8). పతివ్రతయగు స్త్రీ ధన్యురాలు. అట్టి స్త్రీని మాత్రమే ప్రత్యేకముగా పూజించవలెను. ఆమె సర్వలోకములను పవిత్రము చేయును. సర్వపాప పుంజములను నశింపజేయును (9). ఓ పార్వతీ! ఏ స్త్రీ భర్తను ప్రేమతో పరమేశ్వరుని వలె సేవించునో, ఆ స్త్రీ ఇహలోకములో భోగములనన్నిటినీ అనుభవించి, దేహమును వీడిన తరువాత శుభగతిని భర్తతో గూడి పొందును (10). సావిత్రి లోపాముద్ర, అరుంధతి, శాండిల్య, శతరూప, అనసూయ, లక్ష్మి స్వధా, సతీదేవి అనువారు గొప్ప పతివ్రతలు (11).

సంజ్ఞా చ సుమతిశ్శ్రద్ధా మేనా స్వాహా తథైవ చ | అన్యా బహ్వ్యోపి సాధ్వ్యో హి నోక్తా విస్తరజాద్భయాత్‌ || 12

పాతివ్రత్య వృషేణౖవ తా గతా స్సర్వపూజ్యతామ్‌ | బ్రహ్మ విష్ణు హరైశ్చాపి మాన్యా జాతా మునీశ్వరైః || 13

సేవ్యస్త్వయా పతిస్తస్మాత్‌ సర్వదా శంకరఃప్రభుః | దీనానుగ్రహకర్తా చ సర్వసేవ్యస్సతాం గతిః || 14

మహాన్‌ పతివ్రతాధర్మ శ్శ్రుతిస్మృతిషు నోదితః | యథైష వర్ణ్యతే శ్రేష్ఠో తథాన్యోస్తి నిశ్చితమ్‌ || 15

సంజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహా అను వారలే గాక ఇంకనూ ఎందరో సాధ్వీమణులు గలరు. వారి పేర్ల నన్నిటిని విస్తరభీతిచే చెప్పుట లేదు (12). పాతివ్రత్య ధర్మము చేతనే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, మునీశ్వరులకు మరియు సర్వులకు పూజింపదగిన వారు, సమ్మానింపదగిన వారు అయినారు (13). కావున నీవు సర్వకాలముల యందు నీభర్తయగు శంకర ప్రభుని సేవింపుము. ఆయన దీనులను గ్రహించువాడు, సర్వులచే సేవింపబడువాడు, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు (14). పతివ్రతా ధర్మము చాల గొప్పది యని శ్రుతిస్మృతులు చెప్పుచున్నవి. దీనితో సమానమగు శ్రేష్ఠత గల ధర్మము మరియొకటి లేదనుట నిశ్చతము (15).

భుంజ్యాద్భుక్తే ప్రియే పత్యౌ పాతి వ్రత్య పరాయణా | తిషేత్తస్మిన్‌ శివే నారీ సర్వథా సతి తిష్ఠతి || 16

స్వప్యాత్స్వపితి సా నిత్యం బుద్ధ్యేత్తు ప్రథమం సుధీః | సర్వథా తద్ధితం కుర్యా దకైతవగతిః ప్రియా || 17

అనంలకృత మాత్మానం దర్శయేన్న క్వచిచ్ఛివే | కార్యార్థం ప్రోషితే తస్మిన్‌ భ##వేన్మండనవర్జితా || 18

పత్యుర్నామ న గృహ్ణీయాత్కదాచన పతివ్రతా | ఆక్రుష్టాపి న చాక్రోశేత్‌ ప్రసీదేత్తాడితాపి చ || 19

ఆహూతా గృహ కార్యాణి త్యక్త్వా గచ్ఛే త్తదంతికమ్‌ | సత్వరం సాంజలిః ప్రీత్యా సుప్రణమ్య వదేదితి || 20

పాతివ్రత్య ధర్మమునందు నిష్ఠగల స్త్రీ భర్త భుజించిన తరువాత భుజించవలెను. ఓ పార్వతీ! భర్త నిలబడియున్న సమయమంతయూ పతివ్రత నిలబడియే ఉండవలెను (16). సద్బుద్ధి గల స్త్రీ భర్త నిద్రించిన తరువాత నిద్రించి, నిత్యము ఆతని కంటె ముందుగా నిద్ర లేవవలెను. ఆమె ప్రవర్తనలో కపటము లేనిదై సర్వవిధములుగా భర్తకు హితమును చేయుచూ ఆతనికి ప్రియురాలు కావలెను (17). ఓ పార్వతీ! భర్త యెదుట అలంకారము లేకుండగా కనబడరాదు. భర్త కార్యార్థియై పొరుగూరు వెళ్లినచో ఆమె అలంకారములను ఆ సమయములో ధరించరాదు (18). పతివ్రత ఏ సమయము నందైననూ భర్త పేరును ఉచ్చరించరాదు. భర్త తిట్టిననూ, కొట్టిననూ తిరిగి తిట్టకుండగా ప్రసన్నురాలై ఉండవలెను (19). భర్త పిలిచినచో ఆమె వెంటనే ఇంటి పనులను విడనాడి ప్రేమతో ఆతని వద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలుకవలెను (20).

కిమర్థం వ్యాహృతా నాథ స ప్రసాదో విధీయతామ్‌ | తదాదిష్టా చరేత్కర్మ సుప్రసన్నేన చేతసా || 21

చిరం తిష్ఠేన్న చద్వారే గచ్ఛేన్నైవ పరాలయే | ఆదాయ తత్త్వం యత్కించి త్కసై#్మ చిన్నార్పయేత్‌ క్వచిత్‌ || 22

పూజోపకరణం సర్వమనుక్తా సాధయే త్స్వయమ్‌ | ప్రతీక్షమాణావసరం యథాకాలో చితం హితమ్‌ || 23

న గచ్ఛేత్తీర్థయాత్రాం పై పత్యాజ్ఞాం వినా క్వచిత్‌ | దూరతో వర్జయేత్సా హి సమాజోత్సవదర్శనమ్‌ || 24

'నాథా! ఏల పిలిచితిరి? పని చెప్పి అను గ్రహించుడు' అని పలికి ఆయన ఆదేశించిన పనిని ప్రసన్నమగు మనస్సుతో చేయవలెను (21). ద్వారము వద్ద చిరకాలము నిలబడరాదు. ఇతరుల గృహమునకు పోరాదు. భర్త హృదయములోని భావము నెరింగి ప్రవర్తించవలెను. దేనిని పడితే దానిని ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఈయరాదు (22). పూజాసామగ్రిని భర్త చెప్పకుండగనే స్వయముగా సర్వమును సంపాదించవలెను. హితమును చేయు అవకాశము కొరకు ఎదురు చూస్తూ సందర్భమునకు తగినట్లుగా హితమును ఆచరించవలెను (23). భర్త అనుమతి లేనిదే తీర్థయాత్రకు ఎచ్చటికైననూ వెళ్లరాదు. పతివ్రత సమాజోత్సవములకు దూరముగా నుండవలెను (24)

తీర్థార్థినీ తు యా నారీ పతిపాదోదకం పిబేత్‌ | తస్మిన్‌ సర్వాణి తీర్థాని క్షేత్రాణి చ న సంశయః || 25

భుంజ్యాత్సా భర్తురుచ్ఛిష్టమిష్ట మన్నాదికం చ యత్‌ | మహాప్రసాద ఇత్యుక్త్వా పతిదత్తం పతివ్రతా || 26

అవిభజ్య న చాశ్నీయా ద్దేవపిత్రతిథిష్వపి | పరిచారకవర్గేషు గోషు భిక్షు కులేషు చ || 27

సంయతో పస్కరా దక్షా హృష్టా వ్యయపరాఙ్మఖీ | భ##వేత్సా సర్వదా దేవీ పతివ్రత పరాయణా || 28

తీర్థములను సేవించ గోరు స్త్రీభర్తపాదోదకము త్రాగవలెను. సర్వక్షేత్రములు, తీర్థములు దానియందే గలవనుటలో సందేహము లేదు (25). భర్త భుజించిన తరువాత మిగిలిన మృష్టాన్నమును, ఇతర భోజ్యములను భర్త ఇచ్చిన మహా ప్రసాదము అను భావనతో స్వీకరించి భుజించవలెను (26). పతివ్రత దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, పరిచారకులకు, గోవులకు మరియు భిక్షుకులకు, పెట్టకుండగా తాను తినరాదు (27). పతివ్రతా ధర్మమునందు నిష్ఠగల దేవి గృహవస్తవులను పొందికగా భద్రముగా నుంచుకొనవలెను. ఆమె సామర్థ్యముతో ఇంటిని పొదుపుగా నిర్వహించవలెను. ఆమె సర్వదా ఆనందముగా నుండి దుర్వ్యయమును విసర్జించవలెను (28).

కుర్యాత్పత్యనను జ్ఞాతా నోపవాసవ్రతాదికమ్‌ | అన్యథా తత్ఫలం నాస్తి పరత్ర నరకం వ్రజేత్‌ || 29

సుఖపూర్వం సుఖాసీనం రమమాణం యదృచ్ఛయా | ఆంతరేష్వపి కార్యేషు పతిం నోత్థాపయేత్‌ క్వచిత్‌ || 30

క్లీబం వా దురవస్థం వా వ్యాధితం వృద్ధమేవ చ | సుఖితం దుఃఖితం వాపి పతిమేకం న లంఘయేత్‌ || 31

స్త్రీ ధర్మిణీ త్రిరాత్రం చ స్వముఖం నైవ దర్శయేత్‌ | స్వవాక్యం శ్రావయేన్నాపి యావత్‌ స్నానాన్న శుధ్యతి || 32

భర్త అనుజ్ఞ లేనిచో ఉపవాసములు, వ్రతములు మొదలగు వాటిని చేయరాదు. అట్లు చేసినచో ఆ ఫలము లభించక పోవుటయే గాక, మరు జన్మలో నరకము లభించును (29). సుఖముగా భర్త కూర్చుని యుండగా, లేక స్వేచ్ఛచే క్రీడించుచుండగా ఆటంకమును కలిగించరాదు. భర్త నిద్రించుచున్న సమయములో ఆవశ్యకమగు కార్యము ఉన్ననూ నిద్ర లేపరాదు (30). భర్త అసమర్థుడైననూ, దురవస్థలో నున్ననూ, వ్యాధిగ్రస్తుడైననూ, వృద్ధుడే అయిననూ, సుఖము గలవాడైననూ, లేక దుఃఖియైననూ, పతివ్రత భర్తను ఉల్లంఘించరాదు (31). రజస్వలా సమయములో భర్తకు దూరముగా నుండవలెను. స్నానము అగువరకు కబుర్లాడరాదు (32).

సుస్నాతా భర్తృవదన మీక్షేతాన్యస్య న క్వచిత్‌ | అథవా మనసి ధ్యాత్వా పతిం భానుం విలోకయేత్‌ || 33

హరిద్రాకుంకుమం చైవ సిందూరం కజ్జలాదికమ్‌ | కూర్పాసకం చ తాంబూలం మాంగల్యాభరణాదికమ్‌ || 34

కేశసంస్కారకబరీ కరకర్ణాది భూషణమ్‌ | భర్తురాయుష్య మిచ్ఛంతీ దూరయేన్న పతివ్రతా || 35

న రజక్యా న బంధక్యా తథా శ్రమణయా న చ | న చ దుర్భగయా క్వాపి సఖిత్వం కారయేత్‌ క్వచిత్‌ || 36

స్నానము చేసిన తరువాత భర్త ముఖమునే చూడవలెను. ఇతరుల ముఖమును చూడరాదు. భర్త దగ్గర లేనిచో, భర్తను మనస్సులో ధ్యానించి సూర్యుని చూడవలెను (33). భర్త యొక్క ఆయుష్షును గోరు పతివ్రత పసుపును, కుంకుమను, సిందూరమును, కాటుకను, తాంబూలమును, మంగళసూత్రమును, ఆభరణములను, రవికెను, కేశసంస్కారమును, కేశాభరణములను, చేతులకు గాజులను, కర్ణాభరణములను, ఇటువంటి ఇతర ఆభరణములను విడనాడరాదు (34, 35). చాకలితో, కులటతో, సన్న్యాసినితో మరియు భాగ్యహీనురాలితో ఎన్నడునూ ఎక్కడనైననూ స్నేహము చేయరాదు (36).

పతివిద్వేషిణీం నారీం న సా సంభాషయేత్‌ క్వచిత్‌ | నైకాకినీ కవచిత్తష్ఠన్నగ్నా స్నాయాన్న చ క్వచిత్‌ || 37

నోలూఖలే న ముసలేన వర్ధన్యాం దృషద్యపి | న యంత్రకే దేహల్యాం సతీ చ ప్రవసేత్‌ క్వచిత్‌ || 38

వినా వ్యవాయసమయం ప్రాగల్భ్యం నాచరేత్‌ క్వచిత్‌ | యత్ర యత్ర రుచిర్భర్తుస్తత్ర ప్రేమవతీ భ##వేత్‌ || 39

హృష్టా హృష్టే విషణ్ణా స్యా ద్విషణ్ణాస్యే ప్రియే ప్రియా | పతివ్రతా భ##వేద్దేవీ సదా పతి హితైషిణీ || 40

భర్తను ద్వేషించు స్త్రీతో పతివ్రత ఎన్నడునూ సంభాషించరాదు. ఎక్కడైనననూ ఒంటరిగా నుండరాదు. నగ్నముగా ఎన్నడైననూ స్నానము చేయరాదు (37). పతివ్రత రోటిపైన, రోకలిపైన, చీపురు కట్టపైన,రాతిపైన, తిరగలిపైన, గడప పైన ఎన్నడునూ కూర్చుండరాదు (38). సంభోగసమయమునందు తక్క ఇతరత్రా ప్రగల్భముగ నుండరాదు. భర్తకు దేని యందు అభిరుచి గలదో, దానియందామె ప్రేమను కలిగి ఉండవలెను (39). భర్త ఆనందముగ నున్నచో, భార్య ఆనందించవలెను. ప్రియుడగు భర్త విషాదమును పొందినచో ప్రియురాలగు భార్య కూడ విషాదమును పొందవలెను. పతివ్రత సర్వకాలములయందు భర్త యొక్క హితమును గోరవలెను (40).

ఏకరూపా భ##వేత్పుణ్యా సంపత్సు చ విపత్సు చ | వికృతిం స్వాత్మనః క్వాపి న కుర్యాద్ధైర్యధారిణీ || 41

సర్పిర్లవణతైలాదిక్షయేపి చ పతివ్రతా | పతిం నాస్తీతి న బ్రూయా దాయాసేషు న యోజయేత్‌ || 42

విధేర్విష్ణోర్హరాద్వాపి పతిరేకోధికో మతః | పతివ్రతాయా దేవేశి స్వపతిశ్శివ ఏవచ | 43

వ్రతోపవాసనియమం పతిముల్లంఘ్య యా చరేత్‌ | ఆయుష్యం హరతే భర్తు ర్మృతా నిరయ మృచ్ఛతి || 44

భార్య సంపద కల్గినపుడు, ఆపద వచ్చినప్పుడు కూడ ఏకరూపముగ పుణ్య భావమును కలిగి యుండవలెను. ఆమె ధైర్యమును కలిగియుండి తనలో ఎట్టి వికారమునకైననూ తావీయరాదు (41). పోపు సామగ్రి, ఉప్పు, నూనె మొదలగునవి లేక పోయిననూ, పతివ్రత భర్తతో 'లేదు' అని చెప్పరాదు. భర్తకు ఆయాసమును కలిగించరాదు (42). భర్త విష్ణువు కంటె, బ్రహ్మకంటె, శివుని కంటె గొప్పవాడని పెద్దలు చెప్పెదరు. ఓ దేవదేవీ! పతివ్రతకు తన భర్త శివుడే యగును (43). భర్తను కాదని వ్రతములను, ఉపవాసములను, నియమములను అనుష్టించు స్త్రీ భర్త ఆయుష్షును క్షయము చేయుటయే గాక, మరణించిన పిదప నరకమును పొందును (44).

ఉక్తా ప్రత్యుత్తరం దద్యాద్యా నారీ క్రోధతత్పరా | సరమా జాయతే గ్రామే శృగాలీ నిర్జనే వనే || 45

ఉచ్చాసనం న సేవేత న వ్రజేద్దుష్ట సన్నధౌ| న చ కాతర వాక్యాని వదేన్నారీ పతిం క్వచిత్‌|| 46

అవవాదం చ న బ్రూయాత్కలహం దూరతస్త్సజేత్‌|గురూణాం సన్నిధౌ క్వాపి ర్బ్రూయాన్న వై హసేత్‌ || 47

బాహ్యాదాయాంత మాలోక్య త్వరితాన్న జలాశ##నైః | తాంబూలైర్వసనై శ్చాపి పాద సంవాహనాదిభిః || 48

తథైవ చాటు వచనై స్స్వేదసన్నోదనైఃపరైః | యా ప్రియం ప్రీణయేత్‌ ప్రీతా త్రిలోకీ ప్రీణితా తయా || 49

భర్త చెప్పిన మాటకు కోపముతో మండి పడుతూ బదులిడే స్త్రీ గ్రామములో కుక్కయైగాని, నిర్జనారణ్యములో నక్కయైగాని జన్మించును (45). పతివ్రత ఎత్తైన ఆసనముపై కూర్చుండరాదు. దుష్టుల సన్నిధికి పోరాదు. భర్తతో ఎక్కడనైననూ పిరికి దనమును, భయమును కలిగించు మాటలను చెప్పరాదు (46). కొండెములను చెప్పరాదు.కలహములకు దూరముగా నుండవలెను. పెద్దల సన్నధిలో బిగ్గరగా మాటలాడరాదు, నవ్వరాదు(47). బయట నుండి వచ్చిన భర్తను గాంచి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములనిచ్చి, భోజనము పెట్టి, తాంబూలమునిచ్చి పాదములను నొక్కి సేవించవలెను (48). మరియు ప్రేమతో నిండిన మాటలను చెప్పి శ్రమను తొలగింపజేసి ప్రీతిని కలిగించు స్త్రీ ముల్లోకములను సంతోష పెట్టిన పుణ్యమును పొందును (49).

మితం దదాతి జనకో మితం భ్రాతా మితం సుతః | అమితస్య హి దాతారం భర్తారం పూజయేత్సదా || 50

భర్తా దేవో గురుర్భర్తా ధర్మ తీర్థవ్రతాని చ | తస్మాత్సర్వం పరిత్యజ్య పతిమేకం సమర్చయేత్‌ || 51

యా భర్తారం పరిత్యజ్య రహశ్చరతి దుర్మతిః | ఉలూకీ జాయతే క్రూరా వృక్షకోటరశాయినీ || 52

తాడితా తాడితుం చేచ్ఛేత్సా వ్యాఘ్రీ వృషదంశికా | కటాక్షయతి యాన్‌ యం వై కేకరాక్షీ తు సా భ##వేత్‌ || 53

తండ్రిగాని, సోదరుడు గాని, కుమారుడుగాని, స్త్రీకి పరిమితముగనే ఇచ్చును. కాని సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీసదా పూజించవలెను (50). దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నియూ భర్తయే. కావున అన్నిటినీ విడిచి ఒక్క భర్తను మాత్రము సేవించవలెను (51). భర్తను విడిచి రహస్యముగా తిరుగాడు దుష్టస్త్రీ చెట్టు తొర్రలో నివసించే క్రూరమగు గుడ్లగూబయై పుట్టును (52). భర్తను కొట్టబోవు స్త్రీపెద్దపులి, లేక పిల్లియై పుట్టును. ఇతర పురుషులను ఓర చూపుతో చూచే స్త్రీ మెల్లకన్ను గలది యగును (53).

యా భర్తారం పరిత్యజ్య మిష్టమశ్నాతి కేవలమ్‌ | గ్రామే వా సూకరీ భూయా ద్వల్గుర్వాపి స్వవిడ్‌భుజా || 54

యా తుకృత్య ప్రియం బ్రూయాన్మూకా సా జాయతే ఖలు | యా సపత్నీం సదేర్ష్యేత దుర్భగా సా పునఃపునః || 55

దృష్టిం విలుప్య భర్తుర్యా కంచిదన్యం సమీక్షతే | కాణా చ విముఖీ చాపి కురూపాపి చ జాయతే || 56

జీవహీనో యథా దేహః క్షణాదాశు చితాం వ్రజేత్‌ | భర్తృహీనా తథా యోషిత్సుస్నాతాప్యశుచిస్సదా || 57

సా ధన్యా జననీ లోకే స ధన్యో జనకః పితా | ధన్యస్స చ పతిర్యస్య గృహే దేవీ పతివ్రతా || 58

ఏ స్త్రీ భర్తను విడిచి పెట్టి తాను ఒక్కతెయే మృష్టాన్నమును భుజించునో ఆమె గ్రామసూకరమైగాని, మేకయై గాని పుట్టును (54). ఏ స్త్రీ భర్తను నిరాకరించి మాటలాడునో ఆమె మూగియై జన్మించును. ఎల్లవేళలా సవతితో కొట్లాడు స్త్రీ భాగ్యహీనురాలిగా అనేక జన్మలను పొందును (55). భర్తను చూచుట మాని ఇతర పురుషుని చూచు స్త్రీకురూపి, గ్రుడ్డి, వికృతమగు ముఖము గలది అయి పుట్టును (56). ప్రాణము లేని దేహము అశుచి గనుక మానవులు దానిని వెంటనే తగులబెట్టెదరు. అదే తీరున భర్తను విడిచిన స్త్రీ చక్కగా స్నానము చేసినా అశుచియే యగును (57). ఏ గృహములో పతివ్రతా దేవి ఉండునో, ఆమె తల్లిదండ్రులు ధన్యులు. ఆమె భర్త ధన్యుడు (58).

పితృవంశ్యా మాతృవంశ్యాః పతివంశ్యాస్త్రయస్త్రయః | పతివ్రతాయాః పుణ్యన స్వర్గే సౌఖ్యాని భుంజతే || 59

శీలభంగేన దుర్వృత్తాః పాతయంతి కులత్రయమ్‌ | పితుర్మాతుస్తథా పత్యు రిహాముత్రాపి దుఃఖితాం || 60

పతివ్రతాయాశ్చరణో యత్ర యత్ర స్పృశేద్భువమ్‌ | తత్ర తత్ర భ##వేత్సా హి పాపహంత్రీ సుపావనీ || 61

విభుః పతివ్రతా స్పర్శం కురుతే భానుమానపి | సోమో గంధవహశ్చాపి స్వపావిత్య్రాయ నాన్యథా || 62

పతివ్రత యొక్క తండ్రి వంశములోని ముగ్గురు, తల్లివంశములోని వారు ముగ్గురు, భర్త వంశములోని వారు ముగ్గురు ఆమె పుణ్యముచే స్వర్గములో సౌఖ్యముల ననుభవించెదరు (59). శీలమును విడి చెడు దారులలో తిరిగే స్త్రీల యొక్క పితృమాతృభర్తృ వంశములవారు పతితులగుదురు. అట్టి స్త్రీలు ఇహపరలోకములలో దుఃఖమును పొందెదు (60). పతివ్రత యొక్క పాదము ఏయే స్థానములలో భూమిని స్పృశించునో, ఆయా స్థానములు పాపములు తొలగిపావనమగును (61). సూర్య భగవానుడు, చంద్రుడు, వాయువు కూడ తమ పవిత్రత కొరకు పతివ్రతను స్పశించెదరనుటలో సందేహము లేదు (62).

ఆపః పతివ్రతాస్పర్శ మభిలషంతి సర్వదా | అద్య జాడ్య వినాశో నో జాతాస్త్వద్యాన్యపావనాః || 63

భార్యా మూలం గృహస్థస్య భార్యా మూలం సుఖస్య చ | భార్యా ధర్మ ఫలావాపై#్య భార్యా సంతాన వృద్ధయే || 64

గృహే గృహే న కిం నార్యో రూపలావణ్య గర్వితాః | పరం విశ్వేశ భ##క్త్యైవ లభ్యతే స్త్రీ పతివ్రతా || 65

పరలోకస్త్వయం లోకో జీయతే భార్యయా ద్వయమ్‌ | దేవపిత్రతిథీజ్యాది నాభార్యః కర్మ చార్హతి || 66

జలములు సర్వదా పతివ్రతల స్పర్శను గోరును. అట్టి స్పర్శను పొంది 'ఈనాడు మన జడత్వము తొలగి ఇతరులను పవిత్రులను చేయు సామర్థ్యము లభించినది' అని జలములు భావించును (63). గృహస్థ ధర్మమునకు, గృహస్థుని సుఖమునకు, ధర్మము యొక్క ఫలమును పొందుటకు, సంతానాభివృద్ధికి భార్యయే మూలమై యున్నది (64). రూప లావణ్యములచే గర్వించిన స్త్రీలు అన్ని గృహములలో లేరా? కాని విశ్వేశ్వరుని యందలి భక్తిచే మాత్రమే పతివ్రతయగు స్త్రీలభించును (65). మానవుడు భార్యా సహాయముతో ఇహపరలోకములను రెండింటినీ జయించును. భార్య లేనివాడు దేవయజ్ఞ పితృయజ్ఞ అతిథియజ్ఞాది కర్మలకు అర్హుడు కాడు (66).

గృహస్థ స్స హి విజ్ఞేయో యస్య గేహే పతివ్రతా | గ్రస్యతేన్యా ప్రతిదినం రాక్షస్యా జరయా యథా || 67

యథా గంగావగాహేన శరీరం పావనం భ##వేత్‌ | తథా పతివ్రతాం దృష్ట్వా సకలం పావనం

భ వేత్‌ || 68

న గంగాయా తయా భేదో యా నారీ పతిదేవతా | ఉమాశివసమౌ సాక్షా త్తస్మాత్తౌ పూజయేద్బుధః || 69

తారః పతిశ్శ్రుతిర్నారీ క్షమా సా స స్వయం తపః | ఫలం పతిస్సత్క్రియా సా ధన్యౌ తౌ దంపతీ శివే || 70

ఎవని గృహములో పతివ్రత ఉండునో వాడే గృహస్థుడని తెలియవలెను. పతివ్రత కాని స్త్రీ పురుషుని రాక్షసి వలె, వార్ధక్యమువలె ప్రతిదినము భక్షించివేయును (67).గంగాస్నానముచే శరీరము పవిత్రమగును. అటులనే పతివ్రతను చూచినంత మాత్రాన సర్వము పవిత్రమగును (68). పతివ్రతయగు స్త్రీకి గంగకు తేడా లేదు. పతివ్రత, ఆమె సాక్షాత్తుగా ఉమాశివులతో సమమైనవారు గనుక, విద్వాంసుడు వారిని పూజించవలెను (69). భర్త ఓంకారము, భార్య వేదము. భర్త తపస్సు, భార్య క్షమ. భార్య పుణ్యకర్మ, భర్త తత్కర్మఫలము. ఓ పార్వతీ! అట్టి దంపతులు ధన్యులు (70).

ఏవం పతివ్రతా ధర్మో వర్ణితస్తే గిరీంద్రజే | తద్భేదాన్‌ శృణు సుప్రీత్యా సావధానతయాద్యమే || 71

చతుర్విధాస్తాః కథితా నార్యో దేవి పతివ్రతాః | ఉత్తమాదివిభేదేన స్మరతాం పాపహారికాః ||72

ఉత్తమా మధ్యమా చైవ నికృష్టాతిని కృష్టికా | బ్రువే తాసాం లక్షణాని సావధానతయా శృణు || 73

స్వప్నేపి యన్మనో నిత్యం స్వపతిం పశ్యతి ధ్రువమ్‌ | నాన్యం పరపతిం భ##ద్రే ఉత్తమా సా ప్రకీర్తి తా || 74

ఓ పార్వతీ! నీకీ విధముగా పతివ్రతా ధర్మమును వర్ణించితిని. ఇపుడు నేను పతివ్రతలలోని భేదములను వర్ణించెదను. ప్రీతితో సావధానముగా వినుము (71). ఓ దేవీ! స్మరించి నంతనే పాపములను పోగొట్టే పతివ్రతలు ఉత్తమ మొదలగు భేదముచే నాల్గు తెరంగుల నున్నారని పెద్దలు చెప్పెదరు (72). ఉత్తమ, మధ్యమ, నికృష్ట, అతని కృష్ట అను నాల్గు విధముల పతివ్రతల లక్షణములను చెప్పెదను. సావధానముగా వినుము (73). ఓ మంగళ స్వరూపరాలా! ఏ స్త్రీ యొక్క మనస్సు నిత్యము స్వప్నములోనైనూ తన భర్తనే నిశ్చితముగా చూచునో, పరపురుషుని చూడదో, ఆమె ఉత్తమ అని చెప్ప బడినది (74).

యా పితృభ్రాతృసుతవత్‌ పరం పశ్యతి సద్ధియా | మధ్యమా సాహి కథితా శైలజే వై పతివ్రతా || 75

బుద్ధ్వా స్వధర్మం మనసా వ్యభిచారం కరోతిన | నికృష్టా కథితా సాహి సుచరిత్రా చ పార్వతి || 76

పత్యుఃకులస్య చ భయాద్వ్యభిచారం కరోతిన | పతివ్రతాధమా సాహి కథితా పూర్వసూరిభిః || 77

చతుర్విధా అపి శివే పాపహంత్య్రః పతివ్రతాః |పావనాస్సర్వలోకానామిహాముత్రాపి హర్షితాః || 78

ఓ పార్వతీ! ఏ స్త్రీ పరపురుషుని సద్బుద్ధితో తండ్రిని వలెగాని, సోదరుని వలెగాని, కుమారుని వలె గాని దర్శించునో, ఆమె మధ్యమ పతివ్రత అనబడును (75). ఓ పార్వతీ! స్వధర్మమును ఎరింగి మనస్సు చేననైననూ వ్యభిచరించని సుశీలయగు స్త్రీ నికృష్టపతివ్రత యనబడును (76). భర్త ఇంటిలో వారికి భయపడి వ్యభిచరించని స్త్రీ అధమ పతివ్రత యగునని ప్రాచీన విద్వాంసులు చెప్పెదరు (77). ఓ పార్వతీ ! ఈ నాల్గు విధముల పతివ్రతలు కూడా పాపములను పోగొట్టి, మానవులందరినీ పవిత్రులను చేసి ఇహపర సుఖముల నొసంగెదరు (78).

పాతివ్రత్య ప్రభావేణాత్రిస్త్రియా త్రిసురార్థనాత్‌ | జీవితో విప్ర ఏకో హి మృతో వారాహ శాపతః || 79

ఏవం జ్ఞాత్వా శివే నిత్యం కర్తవ్యం పతిసేవనమ్‌ | త్వయా శైలాత్మజే ప్రీత్యా సర్వకామ ప్రదం సదా || 80

జగదంబా మహేశీ త్వం శివస్సాక్షాత్పతిస్తవ | తవ స్మరణతో నార్యో భవంతి హి పతివ్రతాః || 81

త్వదగ్రే కథనేనానేన కిం దేవి ప్రయోజనమ్‌ | తథాపి తేద్య జగదాచారతశ్శివే || 82

అత్రి భార్యయగు అనసూయ పాతివ్రత్య ప్రభావముచే త్రిమూర్తుల నర్థించి వారాహ శాపముచే మరణించిన బ్రాహ్మణుని ఒకనిని జీవింప చేసినది (79). ఓ పార్వతీ! నీవీ

సత్యము నెరింగి సర్వదా సర్వకామనల నీడేర్చు పతి సేవను ప్రీతితో ప్రతిదినము చేయవలెను (80). నీవు జగన్మాతవగు మహేశ్వరివి. నీ భర్త సాక్షాత్తుగా ఆ శివుడే. నిన్ను స్మరించు స్త్రీలు పతివ్రతలగుదురు (81). ఓ శివాదేవీ! ఈ ధర్మములను నీకు చెప్పబని యేమున్నది? అయిననూ, ఈనాడు లోకాచారముననుసరించి నీకు చెప్పి యుంటిని (82).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా విరరామసౌ ద్విజస్త్రీ సుప్రణమ్య తామ్‌ | శివా ముదమతిప్రాప పార్వతీ శంకరప్రియా || 83

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే పతివ్రతా ధర్మ వర్ణనం నామ చతుః పంచాశత్తమోధ్యాయః (54).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణస్త్రీ ఆమెతో ఇట్లు పలికి విరమించెను. శంకరునకు ప్రియురాలు, పర్వతునకు కుమార్తె యగు శివాదేవి ఆమెకు ప్రణమిల్లి మహానందమును పొందెను (83).

శ్రీ శివ మహాపురాణములో పతివ్రతా ధర్మవర్ణనమనే ఏబది నాల్గవ అధ్యాయము ముగిసినది (54).

Sri Sivamahapuranamu-II    Chapters