Sri Sivamahapuranamu-II    Chapters   

అథ పంచ పంచాశత్తమోధ్యాయః

శివ పార్వతుల కైలాసగమనము

బ్రహ్మోవాచ|

అథ సా బ్రాహ్మణీ దేవ్యై శిక్షయిత్వా వ్రతం చ తత్‌ | ప్రోవాచ మేనామామంత్య్ర యాత్రా మస్యాశ్చ కారయ || 1

తథాస్త్వితి చ సంప్రోచ్య ప్రేమవశ్యా బభూవ సా | ధృతిం ధృత్వా హూయ కాలీం విశ్లేష విరహాకులా || 2

అత్యుచ్చై రోదనం చక్రే సంశ్లిష్య చ పునఃపునః | పార్వత్యపి రురోదోచ్చై రుచ్చరంతీ కృపావచః || 3

శైలప్రియా శివా చాపి మూర్ఛా మాప శుచార్దితా | మూర్ఛాం ప్రాపుర్దేవపత్న్యః పార్వత్యా రోదనేన చ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ బ్రాహ్మణ స్త్రీ పార్వతీ దేవికి ఆ వ్రతమును నేర్పి మేనను పిలిచి 'ఈమెను యాత్రకు పంపుము' అని చెప్పెను (1). ఆమె అటులనే అని పలికి ప్రేమకు వశురాలై వియోగదుఃఖముచే పీడితురాలైననూ ధైర్యమును వహించి కాళిని పిలిచెను (2). ఆమె పార్వతిని పలుమార్లు కౌగిలించుకొని ఏడ్చెను. పార్వతి కూడ దయను కలిగించు మాటలను పలుకుతూ బిగ్గరగా ఏడ్చెను (3). హిమవంతుని పత్ని మరియు పార్వతి దుఃఖపీడితులై మూర్ఛను పొందిరి. పార్వతి ఏడ్చుటచే దేవపత్నులు కూడ మూర్ఛను పొందిరి (4).

సర్వాశ్చ రురుదుర్నార్యస్సర్వమాసీ దచేతనమ్‌ | స్వయం రురోద యోగీశో గచ్ఛన్‌ కోన్యః పరః ప్రభుః || 5

ఏతస్మిన్నంతరే శీఘ్రమాజగామ హిమాలయః | స సర్వతనయస్తత్ర సచివైశ్చ ద్విజైః పరైః || 6

స్వయం రురోద మోహేన వత్సాం కృత్వా స్వవక్షసి | క్వ యాసీత్యేవముచ్చార్య శూన్యం కృత్వా ముహుర్ముహుః || 7

తతః పురోహితో విపై#్రరధ్యాత్మ విద్యయా సుఖమ్‌ | సర్వాన్‌ ప్రబోధయామాస కృపయా జ్ఞాన వత్తరః || 8

స్త్రీలందరు ఏడ్చుచుండురి. సర్వము జడమాయెనా యున్నట్లుండెను. యోగీశ్వరుడగు శివుడే వెళ్ల బోవుచూ స్వయముగా రోదించెను. ఆ పరప్రభుడు ధుఃఖించగా, ఇతరుల మాట చెప్పునది ఏమి గలదు? (5) ఇంతలో అచటకు హిమవంతుడు కుమారులందరితో, మంత్రులతో మరియు మహాబ్రాహ్మములతో గూడి వెంటనే విచ్చేసెను(6). ఆయన కుమార్తెను గుండెలకు హత్తుకొని, 'నీవు సర్వమును శూన్యముగా చేసి ఎచటకు వెళ్లుచున్నావు?' అని పలికి అనేక పర్యాయములు స్వయముగా మోహముచే రోదించెను (7). అపుడు జ్ఞానిశ్రేష్ఠుడగు పురోహితుడు బ్రాహ్మణులతో గూడి సుఖకరముగా అధ్యాత్య విద్యను దయతో వారందరికి బోధించెను (8).

ననామ పార్వతీ భక్త్యా మాతరం పితరం గురుమ్‌ | మహా మాయా భవాచారా ద్రురోదోచ్చై ర్ముహుర్మహుః || 9

పార్వత్యా రోదనేనైవ రురుదుస్సర్వ యోషితః | నితరాం జననీ మేనా యామయో భ్రాతరస్తథా || 10

పునః పునశ్శివామాతా యామయోన్యాశ్చ యోషితః | భ్రాతరో జనకః ప్రేవ్ణూ రురుదుర్బద్ధసౌహృదాః || 11

తదా విప్రాస్సమాగత్య బోధయామాసురాదరాత్‌ | లగ్నం నివేదయామా సుర్యాత్రాయాస్సుఖదం పరమ్‌ || 12

మహామాయ యగు పార్వతి భక్తితో తల్లిని, తండ్రిని, గురువును నమస్కరించి లోకాచారముననుసరిస్తూ పరిపరి విధముల బిగ్గరగా రోదించెను (9). పార్వతి రోదించుట తోడనే స్త్రీలందరు రోదించ మొదలిడిరి. తల్లియగు మేన, చెల్లెళ్లు, సోదరులు మరియు తండ్రి ప్రేమచే రోదించరి (10). పార్వతి యందు దృఢమగు ప్రేమగల ఆమె తల్లి, అక్క చెల్లెళ్లు, ఇతరస్త్రీలు, సోదరులు, మరియు తండ్రి ప్రేమచే రోదించిరి (11). అపుడు బ్రాహ్మణులు వచ్చి ఆదరముతో నచ్చజెప్పి సుఖకరము, శ్రేష్ఠము అగు యాత్రాలగ్నము సమీపించినదని విన్నవించిరి (12).

తతో హిమాలయో మేనాం ధృత్వా ధైర్యం వివేకతః | శిబికామానయామాస శివారోహణ హేతవే || 13

శివామారోహయామాసుస్తత్ర విప్రాంగనాశ్చ తామ్‌ | ఆశిషం ప్రదదుస్సర్వాః పితా మాతా ద్విజాస్తథా || 14

మహారాజ్ఞ్యుప చారాంశ్చ దదౌ మేనా గిరిస్త థా | నానా ద్రవ్యసమూహం చ పరేషాం దుర్లభం శుభమ్‌ || 15

శివా నత్వా గురూన్‌ సర్వాన్‌ జనకం జననీం తథా | ద్విజాన్‌ పురోహితం యామీస్త్రీస్తథాన్యా య¸° మునే || 16

అపుడు వివేకి యగు హిమవంతుడు మేనకు ధైర్యమును చెప్పి పార్వతి అధిరోహించుటకై పల్లకిని రప్పించెను (13). అచట నున్న బ్రాహ్మణస్త్రీలు ఆ పార్వతిని పల్లకిలో కూర్చుండబెట్టిరి. అపుడు తల్లిదండ్రులు, సర్వస్త్రీలు, బ్రాహ్మణులు ఆశీర్వదించరి (14). మేనా హిమవంతులు మహారాణికి తగిన ఉపచారములను, ఇతరులకు దుర్లభమగు శుభకరమగు అనేక ద్రవ్యములను ఆమెకు ఇచ్చిరి (15). ఓ మునీ! పార్వతి గురువులను, తండ్రిని, తల్లిని, బ్రాహ్మణులను, పురోహితుని, అక్కచెల్లెళ్లను, ఇతరస్త్రీలను నమస్కరించి వెళ్లెను (16).

హిమచలోపి ససుతోగచ్ఛత్‌ స్నేహవశీ బుధః | ప్రాప్తస్తత్ర ప్రభుర్యత్ర సామరః ప్రీతిమావహన్‌ || 17

ప్రీత్యాభిరేభిరే సర్వే మహోత్సవపురస్సరమ్‌ | ప్రభుం ప్రణముస్తే భక్త్యా ప్రశంసంతోవిశన్‌ పురీమ్‌ || 18

జాతిస్మరాం స్మారయామి నిత్యం స్మరసి చేద్వద |లీలయా త్వాం చ దేవేశి సదా ప్రాణప్రియా మమ || 19

ఇత్యాకర్ణ్య మహేశస్య స్వనాథస్యాథ పార్వతీ | శంకరస్య ప్రియా నిత్యం సస్మితోవాచ సా సతీ || 20

వివేకి యగు హిమవంతుడు కూడా ప్రేమకు వశుడై కుమారులతో గూడి, శివుడు దేవతలతో బాటు ఉన్నచోటకు వచ్చి వారందరికీ ఆనందమును కలిగించెను (17). వారందరు మహోత్సాహముతో పరస్పరము కలుసుకొనిరి. అపుడు వారు భక్తితో శివునకు నమస్కరించి ఆయనను ప్రశంసిస్తూ, నగరమునకు తిరిగి వచ్చిరి (18). 'పూర్వ జన్మస్మృతి గల నీకు గుర్తు చేయుచున్నాను. నీవు నన్ను నిత్యము స్మరించి యున్న పక్షములో చెప్పుము. ఓదేవ దేవీ! నేను నిన్ను పొందుట ఒక లీల. నీవు నాకు సర్వదా ప్రాణ ప్రియురాలవు' (19). తన నాథుడగు మహేశ్వరుని ఈ మాటను విని, శంకరునకు నిత్యప్రియురాలగు పార్వతి (సతీదేవి) చిరునవ్వుతో నిట్లనెను (20).

పార్వత్యువాచ |

సర్వం స్మరామి ప్రాణశ మౌనీ భూతో భ##వేతి చ | ప్రస్తావోచితమద్యాశు కార్యం కురు నమోస్తుతే || 21

పార్వతి ఇట్లు పలికెను -

ఓ ప్రాణనాథా ! సర్వము నాకు గుర్తున్నది. ఇప్పుడు మీరు మౌనముగా నుండి ఇప్పటి సందర్భమునకు ఉచితమగు కార్యమును వెంటనే చేయుడు. మీకు నమస్కారమగు గాక! (21).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య ప్రియావాక్యం సుధాధారాశతో పమమ్‌ | ముముదేతీవ విశ్వేశో లౌకికాచారతత్పరః || 22

శివస్సంభృతసంభారో నానావస్తు మనోహరమ్‌ | భోజ యామాస దేవాంశ్చ నారాయణ పురోగమాన్‌ || 23

తథాన్యాన్నిఖిలాన్‌ ప్రీత్యా స్వవివాహ సమాగతాన్‌ | భోజ యామాస సురమన్నం బహు విధం ప్రభుః || 24

తతో భక్త్యా చ తే దేవా నానారత్న విభూషితాః | సస్త్రీకాస్సగణాస్సర్వే ప్రణముశ్చంద్ర శేఖరమ్‌ || 25

బ్రహ్మ ఇట్లు పలికెను-

అమృతధారలతో సమమగు ప్రియురాలి ఈ మాటను విని లోకాచారమునందు నిష్ఠగల విశ్వేశ్వరుడు మిక్కిలి సంతసించెను (22). శివుడు సామగ్రిని కూడగట్టి అనేక పదార్థములతో గూడిన మనోహరమగు భోజనము నారాయణుడు మొదలగు దేవతలకు ఏర్పాటు చేసెను (23). మరియు ఆ ప్రభుడు తన వివాహమునకు వచ్చిన వారందరికి రుచ్యమగు బహువిధముల అన్నమును ప్రీతితో భుజింపజేసెను (24). అనేక రత్నాభరణములతో ప్రకాశించు ఆ దేవతలు అందరు భుజించి భార్యలతో గణములతో కలిసి చంద్రశేఖరుని ప్రణమిల్లిరి (25).

సంస్తుత్య వాగ్భిరిష్టాభిః పరిక్రమ్య ముదాన్వితాః | ప్రశంసంతో వివాహం చ స్వధామాని యయుస్తతః || 26

నారాయణం మునే మాం చ ప్రణనామ శివస్స్వయమ్‌ | లౌకికాచారమాశ్రిత్య యథా విష్ణుశ్చ కశ్యపమ్‌ || 27

మయాశ్లిష్యా శిషం దత్త్వా శివస్య పునరగ్రతః | మత్వావైతం పరం బ్రహ్మ చక్రే చ స్తు తిరుత్తమా || 28

తమామంత్య్ర మయా విష్ణు స్సాంజలిశ్శివయోర్ముదా | ప్రశంసన్‌ తద్వివాహం చ జగామ స్వాలయం పరమ్‌ || 29

తరువాత దేవతలు ఇష్టములగు వాక్కులతో చక్కగా స్తుతించి ఆనందముతో ప్రదక్షిణము చేసి వివాహమును కొనియాడుతూ తమ ధామములకు వెళ్లిరి (26). ఓ మునీ! శివుడు లోకాచారముననుసరించి, విష్ణువు కశ్యపుని వలె, నారాయణుని నన్ను స్వయముగా ప్రణమిల్లెను (27). నేను శివుని కౌగిలించుకొని, ఆశీర్వదించి, మరల ఆయన పరబ్రహ్మయని గుర్తించి యెదుట ఉత్తమ మగు స్తోత్రమును చేసితిని (28). విష్ణువు నాతో కలసి శివుని అనుమతిని పొంది పార్వతీ పరమేశ్వరుల వివాహమును ప్రీతితో కొనియాడుతూ తన పరమధామమునకు వెళ్లెను (29).

శివోపి స్వగిరౌ తస్థౌ పార్వత్యా విహరన్ముదా | సర్వే గణాస్సుఖం ప్రాపురతీవ స్వభజన్‌ శివౌ || 30

ఇత్యేతత్కథితస్తాత శివోద్వాహస్సుమంగలః | శోకఘ్నో హర్హజనక ఆయుష్యో ధన వర్ధనః || 31

య ఇమం శృణుయాన్నిత్యం శుచిస్తద్గతమానసః | శ్రావయే ద్వాథ నియమాత్‌ శివలోకమవాప్నుయాత్‌ || 32

ఇద మాఖ్యాన మాఖ్యాతమద్భుతం మంగలాయనమ్‌ | సర్వవిఘ్న ప్రశమనం సర్వవ్యాధివినాశనమ్‌ || 33

శివుడు కూడ పార్వతితో ఆనందముగా విహరిస్తూ కైలాస పర్వతమునందుండెను. గణములందరు సుఖమును పొంది పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించిరి (30). కుమారా! నీకు ఇంతవరకు పరమమంగలము, శోకమును నశింపజేయునది, ఆనందమును కలిగించునది, ఆయుర్దాయము నిచ్చునది, ధనమును వర్ధిల్ల జేయునది అగు పార్వతీకల్యాణమును చెప్పి యుంటిని (31). ఎవడైతే దీనిని నిత్యము శుచియై దాని యందు మనస్సును లగ్నము చేసి వినునో, లేక నియమముతో వినిపించునో వాడు శివలోకమును పొందును (32). అద్భుతము, మంగళములకు నిలయము, విఘ్నముల నన్నిటినీ పోగొట్టునది, వ్యాధులనన్నిటినీ నశింపజేయునది అగు ఈ వృత్తాంతమును చెప్పితిని (33).

యశస్యం స్వర్గ్య మాయుష్యం పుత్ర పౌత్రకరం పరమ్‌ | సర్వకామ ప్రదం చేహ భుక్తిదం సదా || 34

అపమృత్యుప్రశమనం మహాశాంతి కరం శుభమ్‌ | సర్వదుస్స్వప్న శమనం బుద్ధి ప్రజ్ఞాది సాధనమ్‌ || 35

శివోత్సవేషు సర్వేషు పఠితవ్యం ప్రయత్నతః | శుభేప్సుభిర్జనైః ప్రీత్యా శవ సంతోషకారణమ్‌ || 36

కీర్తిని కలిగించునది,స్వర్గము నిచ్చునది, ఆయుర్దాయము నిచ్చునది, పుత్ర పౌత్రులనిచ్చునది, గొప్పది, ఇహలోకములో సర్వకామనల నీడేర్చునది, భక్తిని ఇచ్చునది, నిత్యముక్తిని ఇచ్చునది (34), అపమృత్యువును తొలగించునది, గొప్ప శాంతిని కలిగించునది, శుభకరమైనది, దుష్ట స్వప్నములనన్నిటినీ శమింపజేయునది, బుద్ధిని ప్రజ్ఞను ఇచ్చునది (35), శివునకు సంతోషమును కలిగించునది అగు ఈ వృత్తాంతమును శుభమును గోరు జనులు శివోత్సవములన్నిటి యందు శ్రద్ధతో ప్రీతితో పఠించవలెను (36).

పఠేత్ప్రతిష్ఠాకాలే తు దేవాదీనాం విశేషతః | శివస్య సర్వ కార్యస్య ప్రారంభే చ సుప్రీతితః || 37

శృణుయాద్వా శుచిర్భూత్వా చరితం శివయోశ్శివమ్‌ | సిధ్యంతి సర్వకార్యాణి సత్యం సత్యం న సంశయః || 38

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే శివకైలాస గమనవర్ణనం నామ పంచపంచాశత్తమోధ్యాయః (55).

దేవాదులను, శివుని ప్రతిష్ఠించు సమయములో మరియు సర్వకార్యములనారంభించు సమయములో దీనిని ప్రత్యేకించి మిక్కలి ప్రీతితో పఠించవలెను (37). లేదా, శుచియై పార్వతీ పరమేశ్వరుల ఈ మంగళ చరితమును వినవలెను. అట్లు చేసినచో సర్వకార్యములు సిద్ధించును. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (38).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీ ఖండలో శివుడుకైలాసమునకు వెళ్లుట అనే ఏబది అయిదవ అధ్యాయము ముగిసినది (55).

పార్వతీ ఖండ సమాప్తమైనది.

శ్రీకృష్ణార్పణమస్తు.

Sri Sivamahapuranamu-II    Chapters