Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏకాదశో%ధ్యాయః

బాణ ప్రలంబవధ

బ్రహ్మోవాచ |

ఏతస్మిన్నంతరే తత్ర క్రూంచనామాచలో మునే | ఆజగామ కుమారస్య శరణం బాణపీడితః || 1

పలాయమానో యో యుద్ధాదసోఢా తేజ ఐశ్వరమ్‌ | తుతోదాతీవ స క్రౌంచం కోట్యాయుతబలాన్వితః || 2

ప్రణిపత్య కుమారస్య స భక్త్యా చరణాంబుజమ్‌ | ప్రేమనిర్భరయా వాచా తుష్టావ గుహమాదరాత్‌ || 3

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఇంతలో అచటకు క్రౌంచుడను పర్వతుడు బాణాసురునిచే పీడింపబడిన వాడై వచ్చి కుమారుని శరణు జొచ్చెను (1). యుద్ధములో ఈశ్వరుని తేజోరూపమగు కుమారుని ధాటికి తాళ##లేక అతడు తన పదివేల సైన్యముతో గూడి పారిపోవుచూ క్రౌంచపర్వతమును ఆయుధము యొక్క అగ్రభాగముతో నుగ్గు నుగ్గు చేసెను (2). ఆ క్రౌంచుడు కుమారుని పాదపద్మములకు భక్తితో ప్రణమిల్లి ప్రేమతో నిండిన వాక్కులతో గుహుని సాదరముగా నిట్లు స్తుతించెను (3).

క్రౌంచ ఉవాచ |

కుమార స్కంద దేవేశ తారకాసురనాశక | పాహి మాం శరణాపన్నం బాణాసురనిపీడితమ్‌ || 4

సంగరాత్తే మహాసేన సముచ్ఛిన్నః పలాయితః | న్యపీడయచ్చమాగత్య హా నాథ కరుణాకర || 5

తత్పీడితస్తే శరణమాగతో%హం సుదుః ఖితః | పలాయమానో దేవేశ శరజన్మన్‌ దయాం కురు || 6

దైత్యం తం నాశయ విభో బాణాహ్వం మాం సుఖీకురు | దైత్యఘ్నస్త్వం విశేషేణ దేవావనకరస్స్వరాట్‌ || 7

క్రౌంచుడిట్లు పలికెను -

కుమారా! స్కందా! దేవదేవా! తారకాసురుని చంపినవాడా!బాణాసురునిచే పీడింపబడి శరణుపొందిన నన్ను రక్షించుము (4). గొప్ప సేన గల వాడా! నాథా! దయానిధీ! నీచే సంగరములో తన్నులు తిని పారిపోయిన బాణుడు నా వద్దకు వచ్చి నన్ను పీడించినాడు (5). ఓ దేవదేవా! రెల్లు గడ్డి యందు పుట్టిన వాడా! వానిచే పీడింపబడి మిక్కిలి దుఃఖితుడనైన నేను పారిపోయి నిన్ను శరణు జొచ్చితిని. దయను చూపుము (6). ఓ ప్రభూ! ఆ బాణాసురుని సంహరించి నాకు సుఖమును కలిగించుము. నీవు దైత్యులను సంహరించి దేవతలను రక్షించే విశిష్ట ప్రభుడవు (7).

బ్రహ్మోవాచ |

ఇతి క్రౌంచస్తుతస్స్కందః ప్రసన్నో భక్త పాలకః | గృహీత్వా శక్తిమతులాం స్వాం సస్మార శివం ధియా || 8

చిక్షేప తాం సముద్దిశ్య స బాణం శంకరాత్మజజః | మమాశబ్దో బభూవాథ జజ్వలుశ్చ దిశో నభః || 9

స బలం భస్మ సాత్కృత్వాసురం తం క్షణమాత్రతః | గుహోపకంఠం శక్తిస్సా జగామ పరమా మునే || 10

తతః కుమారః ప్రోవాచ క్రౌంచం గిరివరం ప్రభుః | నిర్భయస్స్వగృహం గచ్ఛ నష్టస్స సబలో%సురః|| 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్తులను పాలించే స్కందుడు, ఇట్లు క్రౌంచుడు స్తుతించగా ప్రసన్నుడై, సాటిలేని తన శక్తిని చేతబట్టి మనస్సులో శివుని స్మరించెను (8). శంకరుని పుత్రుడగు ఆ కుమారుడు దానిని బాణాసురునిపైకి ప్రయోగించెను. అపుడు పెద్దశబ్దమాయెను. దిక్కులు, ఆకాశము మంటలతో నిండెను (9). ఓ మునీ! ఆ గొప్ప శక్తి క్షణకాలములో బలవంతుడగు ఆ రాక్షసుని మరియు అతని సేనను భస్మము చేసి గుహుని వద్దకు తిరిగి వచ్చెను (10). అపుడు కుమార ప్రభుడు పర్వతశ్రేష్ఠుడగు క్రౌంచునితో, 'నిర్భయముగా నీ ఇంటికి వెళ్లుము. ఆ రాక్షసుడు సైన్యముతో సహా నశించినాడు' అని చెప్పెను (11).

తచ్ఛ్రుత్వా స్వామివచనం ముదితో గిరిరాట్‌ తదా | స్తుత్వా గుహం తదారాతిం స్వధామ ప్రత్యపద్యత || 12

తతస్స్కందో మహేశస్య స్థాపితవాన్మునే | త్రీణి లింగాని తత్రైవ పాపఘ్నాని విధానతః || 13

ప్రతి జ్ఞేశ్వరనామాదౌ కపాలేశ్వరమాదరాత్‌ | కుమారేశ్వరమేవాథ సర్వసిద్ధిప్రదం త్రయమ్‌ || 14

పునస్సర్వేశ్వరస్తత్ర జయస్తంభసమీపతః | స్తంభేశ్వరాభిధం లింగం గుభస్థ్సా పితవాన్ముదా || 15

అపుడు ఆ పర్వతుడు కుమారస్వామి యొక్క ఆ వచనమును విని ఆనందించినవాడై షణ్ముఖుడగు గుహుని స్తుతించి తన లోకమును చేరుకొనెను (12). ఓ మహర్షీ! అపుడు స్కందుడు మహేశ్వరుని ఆనందము కొరకు అచటనే పాపములను హరించు మూడు లింగములను యథావిధిగా స్థాపించెను (13). ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర అను నామములు గల ఆ లింగములు మూడు భక్తులకు సర్వ సిద్ధుల నిచ్చును (14). సర్వేశ్వరుడగు గుహుడు మరల జయస్తంభమునకు సమీపములో స్తంభేశ్వరుడను పేరు గల లింగమును ఆనందముతో స్థాపించెను (15).

తతస్సర్వే సురాస్తత్ర విష్ణుప్రభృతయో ముదా | లింగం స్థాపితవంతస్తే దేవదేవస్య శూలినః || 16

సర్వేషాం శివలింగానాం మహిమాభూత్తదాద్భుతః | సర్వకామ ప్రదశ్చాపి ముక్తిదో భక్తి కారిణామ్‌ || 17

తతస్సర్వే సురా విష్ణు ప్రముఖాః ప్రీతమానసాః | ఐచ్ఛన్‌ గిరివరం గంతుం పురస్కృత్య గుహం ముదా || 18

తస్మిన్నవసరే శేషపుత్రః కుముదనామకః | ఆజగామ కుమారస్య శరణం దైత్యపీడితః || 19

అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు అచట దేవదేవుడు, శూలధారి యగు శివుని లింగమును ఆనందముతో స్థాపంచిరి (16). ఆ శివలింగములన్నింటికి అద్భుతమగు మహిమ కలిగెను. వాటిని అర్చించు భక్తులకు కోర్కెలన్నియు ఈడేరుటయే గాక, మోక్షము కూడ లభించును (17). అపుడు విష్ణువుమొదలగు దేవతలందరు ఆనందముతో నిండిన మనస్సులు గలవారై గుహుని ముందిడు కొని కైలాసమునకు ఆనందముతో వెళ్లుటకు సంకల్పించిరి (18). ఆ సమయములో శేషుని కుమారుడగు కుముదుడు రాక్షసులచే పీడింపబడినవాడై కుమారుని శరణు జొచ్చెను(19).

ప్రలంబాఖ్యో%సురో యో హి రణాదస్మాత్పలాయితః | స తత్రోపద్రవం చక్రే ప్రబలస్తారకానుగః || 20

సో%థశేషస్య తనయః కుముదో%హిపతేర్మహాన్‌ | కుమారశ్శరణం ప్రాప్తస్తుష్టావ గిరిజాత్మజమ్‌ || 21

తారకుని అనుచరుడు, మిక్కిలి బలశాలియగు ప్రలంబాసురుడు ఈ యుద్ధము నుండి పారిపోయి మరియొక చోట ఉపద్రవమును కలిగించెను (20). అపుడు సర్పాధిపతి యగు శేషుని తనయుడగు కుముదుడు పార్వతీ తనయుడగు కుమారుని శరణు జొచ్చి స్తుతించెను (21).

కుముద ఉవాచ |

దేవ దేవ మహాదేవవర తాత మహాప్రభో | పీడితో%హం ప్రలంబేన త్వాహం శరణమాగతః || 22

పాహి మాం శరణాపన్నం ప్రలంబాసురపీడితమ్‌| కుమార స్కంద దేవేశ తారకారే మహాప్రభో ||23

త్వం దీనబంధుః కరుణా సింధురానత వత్సలః| ఖల నిగ్రహకర్తా హి శరణ్యశ్చ సతాం గతిః||24

కుముదేన స్తుతశ్చేత్థం విజ్ఞప్తస్తద్వధాయ హి | స్వాం చ శక్తిం స జగ్రాహ స్మృత్వా శివపదాంబుజౌ ||25

కుముదుడిట్లు పలికెను -

దేవదేవా! మహాదేవా! శ్రేష్ఠపురుషా! తండ్రీ! మహాప్రభూ! ప్రలంబునిచే హింసింపబడిన నేను నిన్ను శరణు జొచ్చితిని (22). ప్రలంబాసురునిచే పీడింపబడి నిన్ను శరణుజొచ్చిన నన్ను రక్షించుము. కుమారా! స్కందా! దేవ దేవా! తారకుని సంహరించిన మహాప్రభూ! (23) నీవు దీనులకు బంధువు. కరుణా సముద్రుడవు. ప్రణమిల్లిన వారియందు ప్రేమ గలవాడవు. దుష్టులను దండించువాడవు. శరణు పొంద దగినవాడవు. సత్పురుషులకు నీవే గతి (24). ఇట్లు కుముదుడు స్తుతించి ఆ రాక్షసిని వధించుమని విన్నవించగా, ఆయన శివుని పాదపద్మములను స్మరించి తన శక్తిని చేతిలోనికి తీసుకొనెను (25).

చిక్షేప తాం సముద్ధిశ్య ప్రలంబం గిరిజాసుతః | మహాశబ్దో బభూవాథ జజ్వలుశ్చ దిశో నభః || 26

తం సాయుతబలం శక్తిర్ద్రుతం కృత్వా చ భస్మసాత్‌ | గుహోపకంఠం సహసాజగామాక్లిష్ట కారిణీ || 27

తతః కుమారః ప్రోవాచ కుముదం నాగబాలకమ్‌ | నిర్భయస్స్వ గృహం గచ్ఛ నష్టస్స సబలో%సురః || 28

తచ్ఛ్రుత్వా గుహవాక్యం స కుముదో%హిపతేస్సుతః | స్తుత్వా కుమారం నత్వా చ పాతాలం ముదితో య¸° || 29

పార్వతీ తనయుడు దానిని ప్రలంబుని ఉద్ధేశించి విసిరెను. అపుడు పెద్ద శబ్దము పుట్టి దిక్కులు, ఆకాశము మండెను (26) ఎంతటి పనులనైననూ తేలికగా చేయు ఆ శక్తి ఆ రాక్షసుని, వాని పదివేల సైన్యమును శీఘ్రముగా భస్మము చేసి గుహుని సమీపమునకు వెంటనే వచ్చి చేరుకొనెను (27). అపుడు కుమారుడు సర్పబాలకుడగు కుముదునితో 'నీవు నిర్భయముగా నీ ఇంటికి వెళ్ళుము. ఆ రాక్షసుడు సైన్యముతో సహా మరణించినాడు' అని చెప్పెను (28). శేషుని కుమారుడు కుముదుడు ఆ స్కందుని మాటను విని కుమారస్వామికి నమస్కరించి స్తుతించి, ఆనందముతో పాతాళమునకు వెళ్లెను (29).

ఏవం కుమారవిజయం వర్ణితం తే మునీశ్వర | చరితం తారకవధం పరమాశ్చర్య కారకమ్‌ || 30

సర్వ పాపాహరం దివ్యం సర్వకామప్రదం నృణామ్‌ | ధన్యం యశస్య మాయుష్యం భక్తి ముక్తి ప్రదం సతామ్‌ || 31

యే కీర్తయంతి సుయశో%మిత భాగ్యయుతా నరాః | కుమారచరితం దివ్యం శివలోకం ప్రయాంతి తే || 32

శ్రోష్యంతి యే చ తత్కీర్తిం భక్త్యా శ్రధ్ధాన్వితా జనా ః | ముక్తిం ప్రాప్స్యంతి దివ్యా మిహ భుక్త్వా పరం సుఖమ్‌ || 33

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం కుమార ఖండే బాణ ప్రలంబవధో నామ ఏకాదశో%ధ్యాయః (11).

ఓ మహర్షీ! నీకీ తీరున కుమార విజయము, తారక వధ అనే మిక్కిలి ఆశ్చర్యమును గొల్పు వృత్తాంతమును వర్ణించితిని (30). ఇది పాపములనన్నిటినీ పోగొట్టి మానవులకు కొర్కెల నన్నిటినీ ఈడేర్చు దివ్యగాథ. పవిత్రము, కీర్తిని ఇచ్చునది, ఆయుర్ధాయమును కలిగించునది అగు ఈ గాథ సత్పురుషులకు భుక్తిని మరియు ముక్తిని ఇచ్చును (31). ఏ మానవులు దివ్యమగు ఈ కుమారస్వామి యొక్క కీర్తిని గానము చేయుదురో వారు అంతులేని భాగ్యముల ననుభవించి శివలోకమును పొందెదరు(32). ఏ జనులు ఆ దివ్య కీర్తిని శ్రధ్ధతో, భక్తితో వినెదరో, వారు ఇచట గొప్ప సుఖముల ననుభవించి మోక్షమును పొందగలరు(33).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో బాణ ప్రలంబవధ అనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

Sri Sivamahapuranamu-II    Chapters